కష్టం తెచ్చిన ఆనందం
- Srinivasarao Jeedigunta

- 2 hours ago
- 6 min read
#KashtamThechhinaAnandam, #కష్టంతెచ్చినఆనందం, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Kashtam Thechhina Anandam - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 13/12/2025
కష్టం తెచ్చిన ఆనందం - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
“ఏ ఆటో.. మారుతినగర్ వస్తావా” అన్నాడు సుకుమార్,
విజయవాడ బస్టాండ్ లో దిగి.
“మూడు వందలు అవుతుంది” అన్నాడు వీళ్ళ వంక చూడకుండానే.
“అదే బాబూ.. వంద రూపాయలు లోపు అవుతుంది అని మా వాళ్ళు చెప్పారు. నువ్వు సరిగ్గా చెప్పు” అంది సీతమ్మ, సుకుమార్ భార్య.
“మా బాధ వాళ్ళకి ఏమి తెలుసమ్మా? ఈ చలిలో రాత్రి 12 గంటలకు వచ్చి యిక్కడ వున్నాను. ఒక్క బేరం లేదు, ఒకడు అడ్రస్ అడిగేవాడు, ఒకరు యిది బస్టాండే కదా అని అడిగేవాడు. యిప్పుడే మీ బేరం. చూడండి.. చిరిగిన దుప్పటి, దానిలోపల మాసిపోయిన చొక్కా.. యిదీ మా బ్రతుకు” అన్నాడు మేము వేసుకున్న స్వెట్టర్స్ వంక చూస్తో.
“బాబూ. నీ బాధలు తీర్చడం మావల్ల అవుతుందా.. ఏదో చూసి తీసుకో” అన్నాడు ఆటోలో కూర్చుంటూ.
“అందుకే చెప్పాను పిల్లలు వచ్చినప్పుడు అడిగి అవేవో క్యాబ్స్ ఉంటాయిట.. బుక్ చెయ్యడం నేర్చుకోమని. వింటేనా మీరు” అంటూ ఆటో ఎక్కింది సీతమ్మ గారు. నోరుమూసుకుని కూర్చో అన్నట్టుగా నోటిమీద వేలు వేసుకుని హెచ్చరించాడు సుకుమార్.
సుకుమార్ వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఈ విజయవాడ లో వుండే వారుట. అప్పుడు ఆయన చుట్టం మురళి అని ఉండేవారు. వీళ్లిద్దరూ కాలేజీ వరకు కలిసి చదువుకుని ఉద్యోగం కోసం నాన్నగారు హైదరాబాద్ వచ్చేసారుట.
ఆ మధ్య కరోనా కాలంలో సుకుమార్ నాన్నగారు హాస్పిటల్ లో ఉంటే చూడటానికి మురళి గారు భయం లేకుండా హైదరాబాద్ వచ్చి నాన్నగారిని చూసి వెళ్లారు. అప్పుడు నాన్నగారు సుకుమార్ తో చెప్పిన చివరి మాట ‘మురళి అంకుల్ చాలా మంచివాడు, వాళ్ళతో స్నేహం పెంచుకో’ అని.
ఆ తరువాత విషాదం. ఏడాది తరువాత మురళి అంకుల్ ఫోన్ చేసి వాళ్ల మనవరాలు పెళ్ళి అని, తప్పకుండా రమ్మని చెప్పటతో ఈ విజయవాడ ప్రయాణం.
మొత్తానికి అడ్రస్ వెతుక్కుని మురళి అంకుల్ ఇంటికి చేరుకున్నారు. ఆటో అతనికి భార్య చూడకుండా యింకో వందరూపాయలు ఎక్కువ యిచ్చి “స్వెట్టర్ కొనుక్కోవాలి తెలిసిందా” అన్నాడు సుకుమార్.
“ఎవ్వరూ లేచినట్టు లేరు. పెళ్లి ఇల్లు ఇదేనా, అడ్రస్ సరిగ్గా చూసారా.. ఏమిటో విచిత్రం మీ నాన్నగారి స్నేహితుడి మనవరాలు పెళ్ళికి మనం రావడం, చెప్పిన మాట వింటే నా సంసారం యిలా ఎందుకు ఉంటుంది” అంటూ సణుగుతో వున్న భార్య సీతమ్మ వంక కోపంగా చూసి లోపలికి నడిచాడు సుకుమార్.
బయట అలికిడి విని తలుపు తీసుకుని వచ్చిన మురళి వీళ్ళని చూసి “క్షమించండి. మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఎవ్వరు కావాలి” అన్నాడు.
“అదేమిటి అంకుల్! నేను మీ స్నేహితుడు రామచంద్ర గారి అబ్బాయిని. సుకుమార్ ని. హైదరాబాద్ నుంచి వస్తున్నాము, మీ మనవరాలు పెళ్లి అని పిలిచారు కదా” అన్నాడు.
“ఓరిని నువ్వా, మీ నాన్నగారు పోయిన హడావుడిలో నిన్ను ఎక్కువగా గమనించలేదు. అందుకే గుర్తుకు రాలేదు. ఏమి అనుకోకు. లోపలికి రండి” అని, “ఒసేవ్. హైదరాబాద్ నుంచి నా స్నేహితుడి కుటుంబం వచ్చింది. లేచి రా” అని భార్యని పిలిచిన మురళి, సుకుమార్ కి ఒక గది చూపించి “అందులో మీ సామాను పెట్టుకుని విశ్రాంతి తీసుకోండి, యింకో గంటలో తెల్లారిపోతుంది” అన్నాడు.
లేచి ఫ్రెష్ అప్ అయిన సుకుమార్ కాఫీ తాగుతో “మురళి అంకుల్.. రేపు పెళ్లి అన్నారు. యింతవరకు ఇంటికి తోరణం కట్టలేదు, ఎక్కడా పెళ్లి ఇల్లు లాగా లేదు. ఏదైనా ప్రాబ్లెమ్ వుందా” అని ఆడిగాడు.
“ఏం చెప్పమంటావు సుకుమార్, మా అబ్బాయి, కూతురు పెళ్లికోసం మర్నాడు చిట్ కంపెనీ లో చిట్ వేసాడు. వచ్చిన డబ్బుని వాళ్ళదగ్గరే డిపాజిట్ చేసాడు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని. అలా ఆ కంపెనీ యిరవై లక్షలు వరకు యివ్వాలి. పెళ్ళికి ముహూర్తం పెట్టుకోగానే చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళకి తనకి డబ్బులు అవసరం వెంటనే యివ్వమని ఆడిగాడు.
వాళ్ళు యిచ్చిన చెక్కులు తిరిగివచ్చాయి. క్రిందటి వారం ఆ కంపెనీ మూసివేసి యజమాని పారిపోయాడు. దానితో మా అబ్బాయి మాకు మొహం చూపించలేక యిల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఎక్కడ వున్నాడో తెలియదు.
మగపెళ్లి వాళ్లకు ఏదో వంక చెప్పి వచ్చేవారం కి పెళ్లి వాయిదా వేసి చుట్టాలకి అందరికి తెలియచేసాను. నీకు చెప్పడం మర్చిపోయాను. వున్న యిల్లు అమ్ముదాం అనుకుంటే మన అవసరం. సొమ్ము చేసుకోవడానికి సగానికి సగం రేట్ కి అడుగుతున్నారు” అన్నాడు.
“ఎక్కువ వడ్డీ ఆశ చూపించి కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు డబ్బులు పోగేసుకుని పారిపోతున్నారు. మనం ఏదో అవసరానికి డబ్బులు దాచుకుంటే చివరికి మోసం తో అన్యాయం అవుతున్నాము. మీ సమస్యకి పరిష్కారం స్థిరంగా అలోచించి నిర్ణయం తీసుకోండి” అన్నాడు సుకుమార్.
“అంతకంటే చేసేది ఏముంది బాబు, పులి మీద పుట్రలా మా అబ్బాయి ఎక్కడకి వెళ్ళాడో తెలియడం లేదు, వాడు వస్తే పెళ్ళి విషయం దేముడికి వదిలేసి నా చివరి రోజులు ప్రశాంతంగా గడపవచ్చు, మీ నాన్న ఉంటే ఏదో ఒక సలహా యిచ్చి నన్ను కాపాడే వాడు” అన్నాడు.
“ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి చిట్ ఫండ్ వాళ్ళమీద. అలాగే మీ అబ్బాయి కనిపించడంలేదు అని” అన్నాడు సుకుమార్.
“ఆ విషయం మగపెళ్లి వాళ్ళకి తెలిస్తే సంబంధం వెనక్కి పోతుంది కదా అని భయపడ్తున్నాను, యింకో రెండు రోజులు ఆగి అదే పని చెయ్యాలి” అన్నాడు మురళి.
సుకుమార్ దంపతులు హైదరాబాద్ చేరుకున్నారు. జరిగింది సుకుమార్ తన కొడుకుకి చెప్పాడు.
“అయ్యో! పెళ్ళి ఆగిపోయింది అన్నమాట. ఆ చిట్ ఫండ్ కంపెనీ వాడే మురళి గారిని దాచేసి ఉంటాడు, పోలీస్ కంప్లైంట్ యిస్తే అన్నీ బయటకు వస్తాయి” అన్నాడు సుకుమార్ తనయుడు సంతోష్.
“అబ్బాయి, నువ్వు పనిచేసేది పోలీస్ డిపార్ట్మెంట్ లోనే కదా. నువ్వు ఏమైనా మీ పై ఆఫీసర్స్ కి చెప్పి మురళి అంకుల్ కి సహాయం చేస్తావా” అన్నాడు.
“అసలు వాళ్ళు కంప్లైంట్ చెయ్యకుండా మనం ఎలా కలుగజేసుకుంటాం నాన్నా” అన్నాడు సంతోష్.
“అబ్బాయి, మీ తాతయ్య చనిపోయే ముందు నాకు చెప్పాడు.. మురళి అంకుల్, తాతయ్య యిద్దరు ప్రాణస్నేహితులు అని, తన తరువాత కూడా ఆ కుటుంబం తో నేను కూడా కలిసి స్నేహంగా ఉండాలి అని చెప్పాడు. అందుకే మనమే ఏదో ఒక రకంగా సహాయం చెయ్యాలి” అన్నాడు సుకుమార్.
“ఒకసారి మళ్ళీ అడిగి చూడండి మురళి అంకుల్ ని పోలీస్ కంప్లైంట్ గురించి. అప్పుడు ఆలోచన చేద్దాం” అని ఆఫీసుకి వెళ్ళిపోయాడు సంతోష్.
రెండు రోజుల తరువాత మురళి గారికి ఫోన్ చేసి “ఏమైంది” అని ఆడిగాడు.
“అబ్బాయి రాలేదు. బహుశా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఏదైనా చేసారేమో అని అనుమానం, ఈ లోపు మగపెళ్లి వాళ్ళు పెళ్లి కాన్సల్ చేసుకున్నారు. అందుకే పోలీస్ కంప్లైంట్ యిద్దామని అనుకుంటున్నాను. నువ్వు శ్రమ అనుకోకుండా విజయవాడ వస్తే నాకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది” అన్నాడు.
“నాకు కూడా ఈ మధ్య షుగర్ ఎక్కువ అవ్వడంతో ప్రయాణం చెయ్యడానికి భయపడుతున్నాను, మా అబ్బాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో వున్నాడు, వాడిని పంపుతాను. వాడు మీకు సహాయం చేసి వెనక్కి వస్తాడు” అని చెప్పి, కొడుకుని ఒప్పించి విజయవాడ పంపించాడు.
తండ్రి చెప్పిన అడ్రస్ ప్రకారం సాయంత్రం ఆరుగంటలకల్లా మురళి గారి ఇంటికి చేరుకున్నాడు హోటల్ లో సామాను పడేసి.
మురళి గారి మనవరాలు అనుకుంటా కుందనపు బొమ్మలా వుంది. సంతోష్ ని చూసి “తాతయ్య చెప్పారు మీరు వస్తే కూర్చోపెట్టమని. తాతగారు పూజలో వున్నారు” అంటూ లోపలికి వెళ్లి తల్లిని పంపించింది కాఫీ గ్లాస్ తో.
“హోటల్ లో ఉండటం ఏమిటి సంతోష్. మీ తాతయ్య ఎలాగో నేను అలాగే. పదా హోటల్ ఖాళీ చేసి మా ఇంటికి వద్దువుగాని, యిక్కడ నువ్వు మొహమాటం పడక్కరలేదు” అన్నాడు మురళి.
“ఈ రోజు కి ఎలాగో హోటల్ గది తీసుకున్నాను, రేపు ఖాళీ చేస్తాను” అన్నాడు సంతోష్.
“అయితే భోజనం చేసి మాట్లాడుకుందాం” అని చెప్పాడు.
మురళీగారి మనవరాలు పేరు వాసవి ట, అటూ ఇటూ తిరుగుతూ సంతోష్ మాట్లాడే మాటలు వింటోంది అని గ్రహించాడు.
హైదరాబాద్ నుంచే విజయవాడ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ వారికి విషయం చెప్పడం తో రాత్రికి రాత్రి చిట్ ఫండ్ కంపెనీ యజమాని యింటిమీద దాడి చేసి మురళి గారి కొడుకుని విడిపించి చిట్ ఫండ్ కంపెనీ మీద కేసు బుక్ చేసినట్టు సంతోష్ కి ఫోన్ చేసి చెప్పారు.
సంతోష్ ఆ విషయం మురళి గారికి చెప్పి, “మనం యిప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, మీ అబ్బాయిని పరీక్ష చేసి రిపోర్ట్ యిస్తారు. అప్పుడు మీ ఇంటికి మీ అబ్బాయి వస్తారు. నేను కంప్లైంట్ రాసి తీసుకుని వచ్చాను” అన్నాడు.
హాస్పిటల్ కి వెళ్లి అన్ని ఫార్మాలిటీస్ అయిన తరువాత పోలీస్ ఆఫీసర్ కి కంప్లైంట్ యిచ్చి మురళి గారి అబ్బాయితో ఇంటికి చేరుకున్నారు.
“అంకుల్! రేపు సాయంత్రం నేను బయలుదేరి హైదరాబాద్ వెళ్తాను. పోలీస్ వాళ్ళు కాని మిమ్మల్ని పిలిస్తే భయపడకుండా వెళ్ళండి. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చెయ్యండి” అన్నాడు.
“అప్పుడేనా.. యింకో రెండు రోజులు వుండి కేసు విషయం ఒక దారికి వచ్చిన తరువాత వెళ్తే మంచిది ఏమో తాతయ్య” అంది వాసవి..
మురళి ఒకసారి మనవరాలు వంక చూసి నవ్వి, “నువ్వు చెప్పింది నిజమే. అయితే అతనికి ఆఫీస్ వుంది కదమ్మా, అయినా ఇహ మన ఊరు వస్తో వుంటాడులే” అన్నాడు.
ఆరోజు సాయంత్రం వెళ్దాం అనుకున్న సంతోష్ యింకో రోజు వుండి “ఇహ మీరు పర్మిషన్ యిస్తే వెళ్తాను” అన్నాడు వాసవి తో.
“వెళ్లి రండి” అంది వాసవి.
“మురళి అంకుల్.. మీరందరూ జనవరి లో రండి. ఎగ్జిబిషన్ వుంటుంది, చూడచ్చు” అన్నాడు సంతోష్ .
***
“కృతజ్ఞతలు సుకుమార్! మీ సంతోష్ చాలా సహాయం చేసాడు. త్వరలోనే చిట్ ఫండ్ డబ్బులు కూడా తిరిగి వస్తాయి అన్నారు. అది సరే, మీ నాన్న వుండి వుంటే మా స్నేహం బంధుత్వంగా మారేది. యిప్పుడు నువ్వు ఒప్పుకుంటే ఒకసారి మా మనవరాలిని చూసి, నచ్చితే మీ అబ్బాయి కి చేసుకో. మా వాసవికి మీ సంతోష్ నచ్చాడు. మీ వాడి వాలకం చూస్తే అతనికి కూడా నచ్చినట్టే వుంది. పెద్దవాళ్ళం మనం ముందుకు అడుగువేస్తే అంతా శుభం జరుగుతుంది” అన్నాడు మురళి.
“మురళి గారు, మా అబ్బాయికి క్రిందటి ఏడాది పెళ్ళి చేద్దాం అనుకుంటే యిప్పుడే వద్దు అన్నాడు, నిజంగా మీ మనవరాలు నచ్చితే అంతకంటే కావాల్సింది ఏముంది. ఒకసారి అడిగి చూస్తాను, ఆతరువాత ముందుకా వెనక్కా అనేది ఆలోచిద్దాం” అన్నాడు సుకుమార్.
మురళి గారు కుటుంబ సమేతంగా హైదరాబాద్ వచ్చి హోటల్ లో వుండి, వాసవి కి పెళ్ళి చూపులు అరేంజ్ చేసారు.
సుకుమార్, సుకుమార్ భార్య బయలుదేరుతో “నువ్వు చూసావుగా, ముగ్గురు వెళ్లడం ఎందుకు” అన్నాడు కొడుకు సంతోష్ తో.
“చాలా రోజులు అయ్యింది కదా నాన్న, అయినా నేను మళ్ళీ చూస్తే ఏమవుతుంది? నేను డైరెక్టుగా ఆఫీస్ నుంచి వస్తాలే” అన్నాడు.
సెకండ్ ఏసీ లో కూర్చుని, “ఏ టైములో అన్నావో కాని హైదరాబాద్ విజయవాడ తిరుగుడు ఎక్కువైంది” అన్నాడు భార్య వాసవితో సంతోష్.
“ఒక కష్టం వెనుక ఒక శుభం లేకపోతే సుఖం వస్తోనే ఉంటుంది. మన డబ్బులు మీద ఎక్కువగా ఇంటరెస్ట్ యిస్తాను అన్నవాడిని నమ్మి మోసపోకుండా బ్యాంకులో పెట్టుకుని టెన్షన్ లేకుండా ఉండటం అన్ని విధాలుగా మంచిది. తెల్లారి లేస్తే పేపర్ నిండా మోసాలు గురించే.
తస్మాత్ జాగ్రత్త.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments