రక్షణ వల
- Palla Venkata Ramarao

- Oct 1
- 6 min read
#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #RakshanaVala, #రక్షణవల, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Rakshana Vala - New Telugu Story Written By - Palla Venkata Ramarao
Published In manatelugukathalu.com On 01/10/2025
రక్షణ వల - తెలుగు కథ
రచన: పల్లా వెంకట రామారావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆరోజు సారథి సినిమా స్టూడియో చాలా సందడిగా ఉంది. హాస్య మరియు క్యారెక్టర్ నటుడు దినకర్ తన కొడుకు జయంత్ ని హీరోగా లాంచ్ చేయబోతున్నాడు. తాను హీరో కావాలనుకుని పరిశ్రమలోకి అడుగుపెట్టాడు కానీ తన కల నెరవేరలేదు. క్యారెక్టర్ నటుడుగానే కొనసాగాల్సి వచ్చింది. తాను నెరవేర్చుకోలేని కలని కొడుకు ద్వారా తీర్చుకోవాలి అనుకున్నాడు. అందుకే పాతిక సంవత్సరాల నుంచి పరిశ్రమ ద్వారా తన సంపాదించిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి సొంత సినిమాని తీస్తున్నాడు.
బడా హీరోల వారసులైతే నిర్మాతలంతా ఎగబడిపోతూ, నష్టం వచ్చినా సరే మేము తీస్తామంటే, మేము తీస్తామంటూ తమ సినిమా ద్వారానే లాంచ్ చేస్తారు. కానీ ఎంత టాలెంట్ ఉన్నా మిగతా వారికి అవకాశం ఇవ్వడానికి మాత్రం మొగ్గు చూపరు. అఫ్ కోర్స్ అది బహిరంగ రహస్యమే.
సినిమా ఓపెనింగ్ కి తనకు పరిశ్రమలో తెలిసిన వాళ్లందర్నీ ఆహ్వానించాడు దినకర్. ఆ విధంగానైనా తన సినిమాకి పబ్లిసిటీ వస్తుందని అతని ఆశ. దినకర్ ఆహ్వానించిన వారిలో అతని స్నేహితుడు విజయ్ బాబు కూడా ఉన్నాడు. విజయ్ బాబు, దినకర్ దాదాపు ఒకే సమయంలో పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అయితే దినకర్ నటన వైపు వెళ్ళిపోగా, విజయ్ బాబు టెక్నీషియన్ గా స్థిరపడ్డాడు.
అక్కడ జరుగుతున్న హంగామా అంతా చూసిన విజయ్ దినకర్ తో అన్నాడు. "ఏంటి బాగానే ఖర్చు పెడుతున్నట్లున్నావ్ "
"నీకు తెలుసు కదా! నేను హీరో కావాలనేది నా డ్రీమ్. కానీ కుదరలేదు. నా కొడుకుని అయినా అలా చూడాలనుకుంటున్నాను. ఆ కల నెరవేర్చుకోవడానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు" కాస్తంత ఉద్వేగంగా అన్నాడు దినకర్.
"ఖర్చు పెట్టాల్సిందే కాదనటం లేదు. కానీ కాస్త బ్యాలెన్స్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఉన్నదంతా ఖర్చు చేస్తున్నట్లున్నావ్. పర్వాలేదా" అన్నాడు విజయ్.
"నా సొంత ఇల్లు తప్ప లిక్విడ్ గా ఉన్నదంతా పెడుతున్నాను. దాదాపు 8 కోట్లు అవ్వొచ్చు" అన్నాడు దినకర్.
"మరి దానికి తగ్గ బిజినెస్ అవుతుందా?" అడిగాడు విజయ్.
"అదంతా ఏం ఆలోచించలేదు. దేవుడి పైన భారం వేశాను. మా వాడి టాలెంట్ పైన నాకు నమ్మకం ఉంది.” ధైర్యంగా చెప్పాడు దినకర్.
ఆ మాత్రం ధైర్యం చేయకపోతే సినిమాని మొదలు పెట్టడం చాలా కష్టం.
"అయితే దినకర్ అనుకున్న విధంగా కాకుండా వారికి పబ్లిసిటీ మరోలా వచ్చింది. సాధారణంగా డిజిటల్ మీడియాలో ట్రోలర్స్ ఎవరిని ట్రోల్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. వారికి ఏదో ఒక స్టఫ్ కావాలంతే. పెద్దపెద్ద హీరోలని, వారి కొడుకుల్ని కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు.
అలా దినకర్ కొడుకు వారికి దొరికాడు. జయంత్ పెద్దగా చేసింది ఏమీ లేకపోయినా ట్రోలర్స్ రకరకాలుగా అతని ట్రోల్ చేసి పడేశారు. దాంతో పెద్ద హీరోలకు కూడా రాని పబ్లిసిటీ అతనికి వచ్చేసింది. దినకర్ కి ఒకవైపు టెన్షన్ అనిపించినా మరొకవైపు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందిలే అదైనా ఉపయోగపడుతుంది అనుకున్నాడు.
కానీ రాను రాను అది తీవ్రమవడంతో కంగారుపడ్డాడు దినకర్. నష్ట నివారణ కోసం ప్రెస్ మీట్ పెట్టి ట్రోలర్స్ ని నయానా భయానా దారికి తెచ్చుకోవాలని అనుకున్నాడు. కానీ అతడు ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు అతన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. దాంతో ఆ ట్రోలింగ్ వ్యవహారాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా సినిమా మీదే దృష్టి కేంద్రీకరించాడు.
సినిమా నిర్మాణం అనేది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. ముందు నుంచీ స్పష్టమైన ప్రణాళిక ఉంటే వ్యవహారం సజావుగా సాగుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా నిర్మాతకు నరకం కనబడుతుంది. దినకర్ నటుడు కావడం వల్ల ఇంతకాలం కేవలం నటన పైనే తన దృష్టిని నిలిపేవాడు. మిగతా విషయాల పైన అంతగా దృష్టి పెట్టేవాడు కాదు.
దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మనం ఏదైతే పనిచేస్తున్నామో ఆ పనికి పూర్తి న్యాయం చేయాలన్నది ఒక పాయింట్ అయితే, మనది కానీ రంగంలో వేలు పెట్టి అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదు అన్న పాయింట్ మరొకటి. కానీ ఇప్పుడు అదే అవసరమైంది. అందువల్ల తాను ముందు నుంచీ సినిమా నిర్మాణం గురించి తెలుసుకున్నది కొంత, ఇప్పుడు తన అవసరం మేరకు సేకరించిన సమాచారం కొంత కలిపి ముందుకు వెళ్తున్నాడు దినకర్.
సినిమా రంగంలో పనిచేసే వ్యక్తులు రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. అవకాశం లేనప్పుడు ఒక్క అవకాశం ఇవ్వమంటూ వెంటపడతారు. సరే కదా అని అవకాశం ఇస్తే తమంతటి వారు లేరు అంటూ విర్రవీగుతారు. ఇంకా దారుణం ఏంటంటే అవకాశం ఇచ్చిన వాడికే వెన్నుపోటు పొడుస్తారు.
సెట్లో "మీ అంతటివారు లేరు సార్" అంటూ పొగుడుతారు. షూటింగ్ స్పాట్ దాటగానే "అబ్బే! అక్కడ ఏం లేదు డొల్ల" అంటూ ఎగతాళి మాటలు మాట్లాడతారు. దినకర్ నిర్మించే సినిమా నిర్మాణంలో కూడా అలాంటి వారు ఉన్నారు. వారు షూటింగ్లో వీడియోలు తీసి బయటికి లీక్ చేయడం వల్ల కూడా కొన్ని ట్రోల్స్ జరిగాయి.
ఇక కథ విషయానికి వస్తే అందరిలాగే దినకర్ కూడా ఫార్ములానే నమ్ముకున్నాడు. గతంలో వచ్చిన సినిమాలను చూసి కొత్త హీరోని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి? ఏ మసాలాలు వేస్తే సినిమా హిట్ అవుతుంది? అని ఆలోచించుకుని ఆ మూస ధోరణిలోనే వెళ్లిపోయాడు. దానికి తగినట్లే అలాంటి డైరెక్టర్నే ఎంచుకున్నాడు.
రోగి కోరింది, వైద్యుడు చెప్పింది ఒకటే అన్నట్లు దినకర్ మూడ్ ను చూసి డైరెక్టర్ కూడా మూసధోరణిలోనే వెళ్ళిపోయాడు. దాంతో ఐదు పాటలు, ఆరు ఫైట్లు అన్నట్లు సాగిపోయింది సినిమా. ఇక సినిమా కథానాయకుడైన జయంత్ పరిస్థితి మరోలా ఉంది. అతనికి నటనలో శిక్షణ ఇప్పించినా అంత ఈజీగా నటించలేకపోయాడు. అతని నుంచి నటన రాబట్టడానికి దర్శకునికి తల ప్రాణం తోకకు వచ్చింది. దానివల్ల నిర్మాణం నత్తకు నడకను నేర్పుతూ సుదీర్ఘంగా సాగింది.
వర్కింగ్ డేస్ ఎక్కువ అయ్యే కొద్ది బడ్జెట్ మీటరు పెరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఏదో విధంగా సినిమాని కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేశాడు దినకర్.
సినిమా నిర్మాణం ఒక ఎత్తైతే అది పూర్తయ్యాక దాన్ని బిజినెస్ చేసుకోవడం మరొక ఎత్తు. ఎక్కువ శాతం సినిమాలు నష్టాల పాలు కావడానికి పునాది ఇక్కడే పడుతుంది. దినకర్ తనకు తెలిసిన, తెలియని డిస్ట్రిబ్యూటర్లను, బయ్యర్లను అందరినీ ఆహ్వానించాడు. వారికి మందులు, విందులు, వినోదాలు ఏర్పాటు చేసి ప్రీమియర్ షో ప్రదర్శించాడు.
సినిమాని వీక్షించిన బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు మనసులోనే హాహాకారాలు చేసి, పారిపోయిన వాళ్లు పారిపోయారు. జారుకున్న వాళ్ళు జారుకున్నారు.
ఇక లాభం లేదు అనుకుని తానే సొంతంగా సినిమాని రిలీజ్ చేయాలనుకున్నాడు దినకర్. దానివల్ల బడ్జెట్ మరింత పెరిగింది.
ఇంతా చేసి ఏం లాభం లేకపోయింది. మొదటి రోజే ఫలితమేంటో తెలిసిపోయింది. థియేటర్లో ముప్పై నుంచి నలభై మంది కంటే మించి జనాలు కనిపించలేదు. అన్ని థియేటర్లూ తిరిగి హంగామా చేద్దామని ప్రయత్నించినా స్పందన అంతంత మాత్రమే ఉంది. ఇకనుంచి ఒక్క రూపాయి ఖర్చు చేసినా అది తిరిగి రాదు అని నిర్ణయించుకుని అన్నీ మానేసి ఇంట్లో కూర్చున్నాడు దినకర్. ఎవరికి ముఖం చూపించలేక కొద్దిరోజుల పాటు అలాగే ఉండిపోయాడు.
ఒకరోజు సాయంత్రం కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి తలుపు తీశాడు దినకర్. ఎదురుగా విజయ్ బాబు. కాసేపు కుశల ప్రశ్నలు వేసుకుని అవీ ఇవీ మాట్లాడుకున్నారు. తన సినిమా ఫ్లాప్ కావడం, అందులో నష్టాలు రావడం గురించి చెబుతూ తనకు నష్టాలు వచ్చినా బాధ లేదనీ, కొడుకుని హీరోగా లాంచ్ చేసినందుకు ఆనందంగా ఉందన్నాడు. కాకపోతే బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల అందిన చోటల్లా అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అప్పులు కట్టాలంటే ఉన్న ఇంటిని అమ్ముకోవడం లేదా తాకట్టు పెట్టడం చేయాలి. అలా తన ఉనికికే ప్రమాదం ఏర్పడింది అంటూ వాపోయాడు దినకర్.
అంతా విన్న తర్వాత "కాసేపు ఎటైనా బయటికి వెళ్దాం పద" అన్నాడు విజయ్ బాబు.
"అబ్బే నాకు ఇంట్రెస్ట్ లేదు" అంటూ అడ్డంగా తలూపాడు దినకర్.
"నువ్వు ఇలాగే ఉంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు. వెళ్దాం రా" అంటూ బలవంతంగా అతని లేవదీసి కారెక్కించాడు విజయ్ బాబు.
పది నిమిషాల తర్వాత కారు ఒక ప్రదేశంలో ఆగింది. కిందికి దిగి చుట్టూ చూసి "ఏంటి సర్కస్ కు తీసుకొచ్చావా!" ఆశ్చర్యంగా అన్నాడు దినకర్
"పద కాస్త రిలాక్స్ గా ఉంటుంది" అంటూ లోనికి తీసుకుపోయాడు విజయ్.
సర్కస్ మొదలయింది. కళాకారులు జిమ్నాస్టిక్స్ ప్రదర్శిస్తున్నారు. వారు చేసే విన్యాసాలను ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూస్తున్నాడు దినకర్. భూమికి చాలా ఎత్తులో తాళ్లు, వాటికి కట్టిన కర్రల సాయంతో ఎగురుతూ, దూకుతూ లాఘవంగా మరొకవైపున ఉన్న తాళ్లను, కర్రలను అందిపుచ్చుకుంటూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు సర్కస్ కళాకారులు.
ఇంతలో ఒక కళాకారుడు విన్యాసం చేస్తూ పట్టుదప్పి కింద పడిపోయాడు. చూస్తున్న ప్రేక్షకులతోపాటు దినకర్ కు గుండె దడదడలాడింది. కొందరు ఉద్వేగం ఆపుకోలేక గట్టిగా అరిచారు. అయితే ఆ కళాకారుడికి ఏమీ కాలేదు. ఎందుకంటే కింద రక్షణగా ఒక వల ఉంది. ఆ వలలో పడిన అతడు అంతే వేగంగా పైకి లేచి మళ్లీ తన పని మొదలుపెట్టాడు. దినకర్ కు మనసు తేలిక అయ్యింది.
సర్కస్ పూర్తయ్యాక బయటకు వస్తూ "అతని కింద పడిపోయినప్పుడు నాకు చాలా టెన్షన్ అనిపించింది. అయితే కింద వల ఉండడం వల్ల అతనికేం కాలేదు" నవ్వుతూ అన్నాడు దినకర్.
"నువ్వు కూడా అలా చేసి ఉంటే బాగుండేది కదా" అన్నాడు విజయ్.
"నేనా! నేను అలా చేయడమేంటి? నేనేమైనా సర్కస్ ఆడుతున్నానా?" అర్థం కాక అడిగాడు దినకర్.
"జీవితంలో మనం చేసే కొన్ని పనులు, తీసుకునే రిస్కులు సర్కస్ లాంటివే. కాదంటావా?" అడిగాడు విజయ్.
ఆ మాటలు విన్న దినకర్ ఆలోచనలో పడ్డాడు.
"ఏదైనా పెద్ద రిస్క్ చేసే ముందు అందులో ఫెయిల్ అయినా సర్వైవ్ కావడానికి మనం కూడా ఒక రక్షణ ఇచ్చే వలని ఏర్పాటు చేసుకోవాలి. అవునా?" అన్నాడు విజయ్.
"నిజమేరా! నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించలేదు. ఎంతసేపూ సినిమా హిట్ అవుతుందని ఆలోచించేనే కానీ తేడా వస్తే పరిస్థితి ఏంటని ఆలోచించలేదు. ఒకవేళ ఫెయిల్ అయినా నా సాధారణ జీవితానికి ఇబ్బంది లేకుండా ఒక ఏర్పాటు చేసుకుని ఉంటే బాగుండేది" సాలోచనగా అన్నాడు దినకర్.
***************
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.




Comments