మాతృదేవోభవ పితృదేవోభవ
- Srinivasarao Jeedigunta
- 2 days ago
- 7 min read
#MathrudevobhavaPithrudevobhava, #మాతృదేవోభవపితృదేవోభవ, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Mathrudevobhava Pithrudevobhava - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 30/09/2025
మాతృదేవోభవ పితృదేవోభవ - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“శ్యామలా, కుక్క అరుస్తోంది చూడు.. ఎవరైనా వచ్చారేమో” అన్నాడు మంచం మీద పడుకుని పేపర్ చదువుకుంటున్న శ్రీకాంత్.
“మీరు ఆలా పాల సముద్రం మీద పడుకున్న విష్ణుమూర్తిలా పడుకోబోతే లేచి వెళ్లి చూడచ్చు కదా, ఈ మధ్య బాగా బద్ధకం ఎక్కువ అయ్యింది మీకు” అని విసుకుంటో తన మంచం మీద నుంచి లేచి వీధి తలుపు తీసింది.
గేట్ దగ్గర ఒక పెద్దాయన నుంచుని కుక్కని చూసి లోపలికి రావడానికి భయపడుతున్నాడు.
“ఎవ్వరు కావాలండి” అంది కుక్కని గట్టిగా పట్టుకుని.
ఈలోపున శ్రీకాంత్ బయటకు వచ్చి “రండి లోపలికి” అన్నాడు.
భయం భయంగా లోపలికి వచ్చి నుంచున్నాడు. యింత ముసలాయనకి నాతో పని ఏమిటి అనుకుంటూ “కూర్చోండి పరవాలేదు, మంచినీళ్లు తెస్తాను” అని ఫ్రీజ్ తలుపు తీసి చల్లటి నీళ్ల సీసా తీసుకుని వచ్చి ఆయన చేతికి గ్లాస్ అందించాడు శ్రీకాంత్.
“ఎవ్వరు?” అంటూ ప్రశ్నార్థకంగా చూసింది భర్త వంక శ్యామల.
“మిమ్మల్ని నేను గుర్తు పట్టలేదు” అన్నాడు శ్రీకాంత్ ఆ పెద్దాయన తో.
“నేను కూడా మిమ్మల్ని కలవడం యిదే మొదటిసారి. నా పేరు సుబ్రహ్మణ్యం. ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేసి రిటైర్ అయ్యాను” అంటూ సంచిలోనుంచి కొన్ని పేపర్స్ తీసి చూపించి “బతుకుతెరువు కోసం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కి ఏజెంట్ గా వున్నాను. కొన్ని స్థలాలు అమ్మకానికి వున్నాయి. మీకు ఇంట్రెస్ట్ వుంటే చూడండి” అన్నాడు.
అప్పటివరకు అతను అంటే వున్న గౌరవం పోయింది శ్రీకాంత్ కి.“చూడండి.. మాకు సెలవు దొరికేది ఒక్క ఆదివారం. యిలా మీలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యడం ఏమిటండి.. మీరు గేట్ బయట నుంచి ఈ విషయం అడగవచ్చు కదా” అన్నాడు చిరాకుగా.
ఆ పెద్దాయన “క్షమించండి, ఎలా అడగాలో కూడా తెలియదు నాకు” అంటూ పేపర్స్ సంచిలో పెట్టుకుని బయటకు నడిచాడు.
“ఏమిటో పాపం ఈ వయసులో ఈ పెద్దాయన కి శ్రమ. ఆదుకునేందుకు పిల్లలు లేరేమో, ఆలా అని మనం యిప్పుడు అక్కరలేని స్థలం కొనటం ఎందుకు” అంది శ్యామల.
యింతలో పక్క యింటి నుంచి అరుపులు వినిపించడం తో బయటకు వచ్చాడు శ్రీకాంత్.
పక్కింటి కార్తీక్ చౌదరి ఆ ముసలాయన మీద అరుస్తున్నాడు “బుద్ధి లేకుండా గేట్ తెరుచుకొని మరి వచ్చేస్తున్నావు, నిన్ను నమ్మి ఆస్తులు ఎవ్వరైనా కొంటారా, వాచ్మాన్ కి బుద్ది లేదు నీలాంటి వాళ్ళని లోపలికి రానివ్వడానికి, గేట్ సరిగ్గా వేసి బయటకు పో” అని ఆవేశం తో అరుస్తున్నాడు.
“అలాగే సార్, వెళ్లిపోతున్నాను” అంటూ తలవంచుకుని బయటకు వస్తున్న సుబ్రహ్మణ్యం మాస్టరు గారిని “ఒక్కసారి యిలా లోపలికి వస్తారా” అని పిలిచాడు శ్రీకాంత్.
“పర్వాలేదు బాబు వెళ్తాను, ఈ ఉద్యోగం నేను చెయ్యలేను అని అర్ధం అయ్యింది” అంటున్న పెద్దాయన తో “ఒక్కసారి యిలా రండి” అని మళ్ళీ అడిగాడు శ్రీకాంత్.
పక్కింటి అతని మాటలకు అవమానభారంతో మొహం చిన్నబుచ్చుకుని లోపలికి వచ్చి నిలబడే ఓపిక లేక కుర్చీలో కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం అనే ఆ పెద్దాయన.
“శ్యామలా, మాకు కొద్దిగా కాఫీ యిస్తావా” అని భార్యకి చెప్పి, “సుబ్రహ్మణ్యం గారు.. నేను మీ దగ్గర స్థలం కొనగలనో లేదో చెప్పలేను కాని పక్కింటి వాళ్ళు మాట్లాడిన మాటలు నాకు చాలా బాధాకరం అనిపించింది.
మీరు ఏమి అనుకోకపోతే మీకు చేతికి అందివచ్చిన కొడుకులు లేరా, మీరు ఈ వృద్దప్యం లో యిలా మాటలు పడాలిసిన అవసరం ఏముంది” అన్నాడు శ్రీకాంత్.
సుబ్రహ్మణ్యం గారు గట్టిగా నిట్టూర్చి, “చెయ్యి దాటిపోయిన కొడుకులు ఇద్దరు వున్నారు. నాకు వచ్చే జీతం తో నేను నా భార్య కూడా పండగకి కూడా బట్టలు కొనుక్కోకుండా ప్రతి పైసా మిగిల్చి పిల్లలు చదువుకి ఖర్చు పెట్టాను. వాళ్ళకి నాన్న ఏమి యిబ్బంది పడుతున్నాడో అనేది తెలియకుండా పెంచాను.
అదృష్టం కొద్ది ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సంపాదించుకున్నారు. నేను వాళ్ళని టీచర్ ట్రైనింగ్ కోర్సులో చేరిపించి నాలా టీచర్లు గా చేద్దాము అనుకున్నాను.
కాని తోటి స్నేహితులు ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్స్ కి వెళ్ళటం చూసి నా ఇద్దరు కొడుకులు కూడా ఇంజనీరింగ్ చదువుతాము అని పట్టుబట్టి ఎంసెట్ లో ర్యాంక్ తెచ్చుకున్నారు. సమస్య అప్పుడు మొదలైంది, ఇద్దరు పిల్లలని ఇంజనీరింగ్ చదివించడం మాటలు కాదు, డబ్బు తో పని అని.
పిల్లలు, నా భార్య నన్ను బలవంతం చేసి మా నాన్నగారి తరువాత వచ్చిన చిన్న పెంకుటిల్లు ని తాకట్టు పెట్టి పిల్లలని చదివించడం, తరువాత వాళ్ళు ఉద్యోగం చేసి అప్పులు తీర్చి మా పోషణ చూసుకునే విధంగా నిర్ణయం చేసారు.
అతి కష్టం మీద తెలిసిన వాళ్ళ దగ్గర యిల్లు కుదువపెట్టి పిల్లలని కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీ లో చదివించాను.
ప్రతీ నెల వడ్డీకి సగం జీతం అయిపోయేది. మిగిలిన జీతం తో గుంభనంగా నేను నా భార్య బ్రతుకుతో పిల్లలు చదువు పూర్తి అవ్వటానికి ఏడాది ముందుగా రిటైర్ అయిపోయాను.
యిల్లు గడవటానికే వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో వడ్డీ కూడా కట్టలేక పిల్లలకి ఉద్యోగం రాగానే మొత్తం అప్పు తీర్చివేస్తాను అని ఒప్పించుకున్నాను.
చదువులు పూర్తి కాగానే పిల్లలిద్దరూ అమెరికాలో ఉద్యోగం అంటూ వెళ్లిపోయారు. ఆ తరువాత ఒక ఆరు నెలలో వాళ్ళు యింటి మీద అప్పు తీర్చివేసి, తరువాత నుంచి మా సంగతి మర్చిపోయారు.
తరువాత తెలిసింది వాళ్ళు అక్కడి దేశం అమ్మాయిలని పెళ్లిచేసుకున్నారు అని. మళ్ళీ యిల్లు తాకట్టు పెట్టి కొంత డబ్బులు తో సంసారం లాగుతున్నాము. ఒకరోజు నా భార్య పిల్లలకి ఫోన్ చేసి తల్లిదండ్రులకి తెలియకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా మేము ఎలా బతుకుతున్నాం అనేది కూడా పట్టించుకోవడం లేదు. మీకోసం మీ నాన్నగారు పడ్డ కష్టం వల్లే మీరు ఈనాడు సుఖాలు అనుభవిస్తున్నారు అనేది కూడా గుర్తుకు రాలేదా, ప్రతి నెలా మా ఖర్చులకి మీ అన్నదమ్ములిద్దరు కొంత డబ్బు పంపించండి అని అడిగింది” అని చెప్పటం ఆగాడు సుబ్రహ్మణ్యం గారు.
“పంపిస్తాము అన్నారా” అని అడిగాడు శ్రీకాంత్.
“మా అబ్బాయి తన తల్లిని ఒక ప్రశ్న అడిగాడు, పిల్లలని పెంచి చదివించేది ప్రేమతోనా లేకపోతే వాళ్లకు యిప్పుడు ఖర్చు పెడితే రేపు వాళ్ళు సంపాదించి తల్లిదండ్రుల కి డబ్బులు పంపుతారు అనుకుని పెంచుతారా? నాన్న టీచర్ కాబట్టి నాన్నని అడిగి చెప్పు” అన్నాడుట.
“నేను వాళ్ళకి చదువు నేర్పించాను కానీ మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని నేర్పాలి అని తెలియలేదు, వాళ్ళు అడిగిన ప్రశ్నకు నా దగ్గర జవాబు లేక యిలా నేను యింటింటికి తిరుగుతున్నాను, నా భార్య అప్పడాలు తయారుచేసి షాపులు చుట్టూ తిరుగుతోంది. అయినా ఏదో నాలుగు మెతుకులకి లోటు లేదు.
నీకు నా కథ అంతా వినిపించడానికి కారణం మీరు జాగ్రత్తగా వుంటారని” అన్నాడు.
“యిప్పుడు మీ పిల్లలు మీద ప్రేమ వుందా యింకా లేకపోతే వాళ్ళకి బుద్ది చెప్పాలని వుందా” అని ఆడిగాడు శ్రీకాంత్.
“టీచర్ గా బుద్ది చెప్పాలని, తండ్రిగా పోనిలే అని వుంది” అన్నాడు సుబ్రహ్మణ్యం గారు.
“చూడండి సుబ్రహ్మణ్యం గారు, ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు, చాలా మంది తల్లి దండ్రుల సమస్య. ఎక్కడో కొంతమంది పిల్లలు శ్రీరాముడిలా వుంటారు. మీరు నలుగురికి విద్య బోధించిన వారు, ఈ సమస్య కి మీరే జవాబు చూపించగలరు. రకరకాల మనస్తత్వం వున్న ఈ లోకంలో సరస్వతి దేవి ఇంటియింటికి వెళ్ళి మాటలు పడటం బాగుండలేదు. మీ ఇంటికి మా మనిషి వచ్చి మిమ్మల్ని మా ఆఫీసుకి తీసుకుని వస్తాడు. మీరు వచ్చే అప్పుడు మీ ఆధార్, మీ పిల్లల ఆధార్, పాసుపోర్టు కాపీ మొదలగునవి తీసుకుని రండి” అన్నాడు శ్రీకాంత్.
“అవి అన్నీ ఎందుకు సార్, మనం చేసే పనివల్ల నా కొడుకుల ఉద్యోగాలకి ప్రమాదం వుండదు కదా” అన్నాడు సుబ్రహ్మణ్యం గారు.
“అటువంటిది ఏమి వుండదు, వాళ్ళకి బాధ్యత తెలియచేయటం కోసమే” అన్నాడు శ్రీకాంత్.
క్యాబ్ మాట్లాడి సుబ్రహ్మణ్యం గారి అడ్రస్ లో దింపమని డ్రైవరుకి డబ్బులు యిచ్చి పంపించాడు.
మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు సుబ్రహ్మణ్యం గారిని తీసుకుని వెళ్ళడానికి గవర్నమెంట్ కారులో వచ్చిన డ్రైవర్ ని చూసి కారులో కూర్చొని “మీ సార్ ఆఫీస్ పేరేమిటి” అని అడిగాడు.
“మిమ్మల్ని ఆఫీసుకి తీసుకొని రమ్మన్నారు” అన్నాడు డ్రైవర్.
కారు జిల్లా కోర్ట్ ముందు ఆగింది. సుబ్రహ్మణ్యం గారిని కారు దింపి “సార్ దగ్గరికి వెళ్దాం రండి” అని సుబ్రహ్మణ్యం గారి చెయ్యి పట్టుకొని మెల్లగా నడిపించుకుంటో ఒక గది దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ అటెండర్ కి చెప్పాడు “సార్ ని మన సార్ దగ్గరికి తీసుకుని వెళ్లు” అని.
గోడమీద శ్రీకాంత్, జిల్లా మేజిస్ట్రేట్ అని చదివిన సుబ్రహ్మణ్యం గారికి కంగారు ఎక్కువ అయ్యింది. తను తొందరపడి కొడుకులకి అపకారం చెయ్యడం లేదుకదా అని.
లోపలికి వస్తున్న సుబ్రహ్మణ్యం గారిని చూస్తో శ్రీకాంత్ “నమస్కారం మాస్టర్ గారు. యిలా కూర్చోండి. ఈయన పెద్ద అడ్వకేట్, మీ విషయం అంతా ఆయనకు చెప్పాను. మీరు తెచ్చిన పేపర్స్ ఆయనకు యిచ్చి మీ కేసుని ఆయనకు అప్పగించండి. భయపడకండి. మీలాంటి వృద్ధ తల్లిదండ్రులని పట్టించుకోని పిల్లలకు కళ్ళు తెరిపించడం కోసమే ఈ ప్రయత్నం” అన్నాడు శ్రీకాంత్.
అడ్వకేట్ గారు అడిగిన పేపర్స్ మీద సంతకాలు పెట్టి,, “బాబూ, పిల్లలు మమ్మల్ని చూడకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి తల్లిదండ్రులు గా అపకారం చెయ్యాలి అని కోరుకోలేము. అంతా మీ చేతిలో వుంది” అని చెప్పి శ్రీకాంత్ దగ్గర వీడ్కోలు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు సుబ్రహ్మణ్యం గారు.
జిల్లా కోర్టు నుంచి విదేశాలలో ఎన్ ఆర్ ఐ లు గా వున్న సుబ్రహ్మణ్యం గారి పిల్లలకు, ఇండియన్ ఎంబసీ కి నోటీసులు వెళ్లాయి. విదేశీ శాఖ కూడా తల్లిదండ్రుల ని పట్టించుకోకుండా విదేశాలలో వున్న పిల్లలు విషయంలో కఠినమైన చట్టాలు ఉండటం తో వెంటనే సుబ్రహ్మణ్యం కొడుకులిద్దరిని కోర్ట్ కి హాజరు కావలిని ఒత్తిడి పెట్టారు.
తండ్రి తీసుకున్న చర్యకి కంగారు పడి ఇండియా బయలుదేరారు.
తెల్లవారుజామున హైదరాబాద్ చేరి అక్కడ నుంచి క్యాబ్ లో తమ ఊరు చేరుకున్నారు సుబ్రహ్మణ్యం గారి పిల్లలిద్దరు.
“అమ్మా” అంటూ లోపలికి వచ్చిన కొడుకులని చూసి సంతోషంగా దగ్గరికి తీసుకుంది సుబ్రహ్మణ్యం గారి భార్య.
తల్లిని కౌగిలించుకున్న పిల్లలకు తల్లీ వేసుకున్న జాకెట్ వెనుక భాగం చిరిగి ఉండటం గమనించి “అయ్యో, అమ్మకి సరైన బట్టలు కూడా లేవా” అన్పించగానే అమెరికాలో తమ భార్యలు అనుభవిస్తున్న సుఖాలు గుర్తుకు తెచ్చుకుని మనసు వికలం అయ్యి “అమ్మా ఎలా వున్నావు” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
“నాకేమి నాయన.. బాగానే వున్నాను. మీరేమిటిరా యిలా చిక్కిపోయారు” అంది పిల్లల బుగ్గలు నిమురుతూ.
“నాన్న ఏరి అమ్మా” అన్నాడు పెద్దకొడుకు.
“స్నానం చేసి ఆలా గుడివైపుకి వెళ్లారు, వచ్చేస్తారు. కూర్చోండి, నేను కాఫీ కలిపి తెస్తాను” అంది.
కుర్చీలో కూర్చొని ‘ఛీ.. తల్లిదండ్రుల కోసం ఏమి తీసుకుని రాకుండా ఎలా వచ్చామురా, అమ్మ దగ్గర కనిపించిన ఆప్యాయత అమెరికాలో మనకి ఎందుకు కనిపించడం లేదు’ అనుకున్నారు సుబ్రహ్మణ్యం గారి పిల్లలిద్దరు.
యింతలో ఒక కుర్రాడు చేతిలో పదిరూపాయల నోట్ తో వచ్చి “ఒక పది రూపాయల అప్పడాలు యిస్తారా” అంటూ వచ్చాడు.
ఆ మాట విని పరుగున వచ్చిన సుబ్రహ్మణ్యం గారి భార్య “తరువాత రా బాబు” అంటూ ఆ కుర్రాడిని పంపించి వేసింది.
“అంటే అమ్మ అప్పడాలు చేసి అమ్ముతోంది అన్నమాట” అన్నాడు తమ్ముడు అన్నగారితో.
“మనం విదేశీ అమ్మాయిలని వివాహం చేసుకున్నాము కాబట్టి ఇహ తల్లిదండ్రులు మనల్ని ఇంటికి రానివ్వరు అనుకుని అమెరికా మోజులో పడి అమ్మా నాన్నలని పట్టించుకోలేదు. యిక్కడకి వచ్చే అప్పుడు కూడా మంచి అడ్వకేట్ ని పెట్టి మన కేసు వాదించుకోవాలి అనుకున్నామే కాని ప్రపంచంలో చెడ్డ పిల్లలు ఉండటానికి అవకాశం వుంది గాని చెడ్డ తల్లిదండ్రులు వుండరు అని గ్రహించలేకపోయాము” అన్నాడు అన్నగారు.
“చేసిన తప్పు మనం సరిదిద్దుకోవాలి. విషయం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులోనే మనం ఒప్పుకుని యిహ అమ్మానాన్నలని కాపాడుకుందాం. నాన్నగారితో మాట్లాడి ప్లిడర్ గారిని కలుద్దాం” అని నిర్ణయం తీసుకున్నారు తల్లి యిచ్చిన వేడి కాఫీ తాగుతో.
గుడి నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యం గారు హాల్ లో కాఫీ తాగుతో వున్న కొడుకులని చూసి “మీరెప్పుడు వచ్చారురా, కోడళ్ళని తీసుకుని రాలేదా” అన్నాడు చిన్న కొడుకు తల నిమురుతూ.
“నాన్నా, మమ్మల్ని క్షమించండి. మా స్వంత నిర్ణయం తో అమెరికా అమ్మాయిలని వివాహం చేసుకోవడం మీకు నచ్చదు అని మీతో తగాదా పడటం కంటే దూరంగా ఉండటం మేలు అని అనుకున్నాము. కోర్టు నోటీసులు చూసి కోపం తో ఇక్కడికి వచ్చాము. మమ్మల్ని చూసి అమ్మ కళ్ళలో కనిపించిన ఆనందం పెళ్ళి అయిన తరువాత యింతవరకు మాకు కనిపించలేదు. మా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. నిత్యం ఏసీలో వుండే అమెరికాలోని కనిపించని ఆప్యాయత అమ్మ మమ్మల్ని దగ్గరికి తీసుకున్నప్పుడు మేము పోగుట్టుకున్నది తెలిసింది. మేము చేసిన పనికి మీకు కోపంగా లేదా నాన్నా” అన్నాడు చిన్నకొడుకు.
“ఏదైనా నిర్ణయం తీసుకునే అప్పుడే ఆ నిర్ణయం మీ తల్లిదండ్రుల పరువు, గౌరవం గురించి ఒక్క క్షణం అలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకున్నతరువాత తల్లిదండ్రుల అనుభవించడమే తప్పా పిల్లలని శపించలేరు కదా. అయితే యిప్పుడు నోటీసు చూసి భయపడి వచ్చారా” అని అడిగాడు సుబ్రహ్మణ్యం గారు.
“రావడం అందుకే కాని హైదరాబాద్ లో దిగిన నుంచి మన ఊరు వచ్చేవరకు పిల్లలని స్కూలుకి తీసుకుని తండ్రులని, పిల్లాడిని భుజాన వేసుకుని జోకొడుతున్న తల్లుల ని చూసిన తరువాత మాకు అర్ధం అయ్యింది మేము ఏమి పోగుట్టుకున్నామో, మమ్మల్ని క్షమించండి నాన్న” అన్నాడు పెద్ద కొడుకు.
“చూడు పెద్దాడా. మొక్కని ప్రేమగా పెంచుతాము, ఆ మొక్క కాయలు కాసినప్పుడు తనని పెంచిన వాడిని నువ్వు కాయలు కోసుకోవద్దు అంటే ఎలా, పిల్లలు రేపు వృద్ధాప్యం లో ఆదుకుంటారు అని తల్లిదండ్రులు ఆశపడటం వ్యాపారం కాదు నాయనా, అది పిల్లల బాధ్యత. యిప్పుడు మాకు మీరు రేపు మీకు మీ పిల్లలు, యిలా తరతరాలగా వస్తోంది. ఇప్పటికైనా తల్లిదండ్రుల ప్రేమ గుర్తించారు, రేపు జడ్జి గారి దగ్గరికి తీసుకుని వెళ్తాను” అన్నాడు సుబ్రహ్మణ్యం గారు కొడుకులతో.
కోర్ట్ మొదలవడానికి ముందే కొడుకులని తీసుకుని జడ్జి శ్రీకాంత్ ని కలిసాడు సుబ్రహ్మణ్యం. కొడుకులలో వచ్చిన మార్పు గురించి చెప్పి కేసు వాపస్ తీసుకుంటాను అని కోరాడు.
పిల్లలు కూడా జడ్జి గారికి హామీ యిచ్చారు తమ తల్లిదండ్రుల ని జాగ్రత్తగా చూసుకుంటామని.
“చూడండి మాస్టరుగారు.. మీ పిల్లలలో మార్పు వచ్చింది బాగానే వుంది. ఆ మార్పు తల్లిదండ్రుల ని చూడగానే ప్రేమతో వచ్చిన మార్పు అయితే రేపు మీ పిల్లలు అమెరికా వెళ్ళగానే అక్కడ వాళ్ళ భార్యలని చూడగానే మళ్ళీ మారిపోవచ్చు.
అందుకే రేపు కోర్ట్ లో ఈ కేసు మీద నా జడ్జిమెంట్ యిస్తాను. మీ పిల్లలు మిమ్మల్ని శాశ్వతంగా అమెరికా తీసుకుని వెళ్ళలేరు. అలాగే వాళ్ళు ఇండియా రాలేరు. కాబట్టి ప్రతి నెల మీ ఇద్దరు కొడుకులు మీకు చెరో యాభై వేలు పంపించే విధంగా అదే విధంగా తల్లిదండ్రులని వదిలి విదేశాలకు వెళ్లి పిల్లల పాస్పోర్ట్ లో తప్పనిసరిగా ఒక కండిషన్ పెట్టాలని గవర్నమెంట్ అఫ్ ఇండియా కి సూచనలు చెయ్యాలి అని హై కోర్టు వారిని కోరుతాను” అన్నాడు శ్రీకాంత్.
“మీరు చెప్పింది నిజమే సార్. మాకు శిక్ష వేస్తే మా భార్యలు కూడా భయపడి డబ్బులు పంపడానికి అడ్డం రారు. లేదంటే మమ్మల్ని విశ్వామిత్రుడి తప్పసు భగ్నం చేసిన మేనక లా మాకు అడ్డం పడవచ్చు” అన్నారు సుబ్రహ్మణ్యం గారి పిల్లలు.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

