top of page

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 6

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #దయ్యం@తొమ్మిదోమైలు, #Dayyam@thommidoMailu, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguGhostStory

ree

Dayyam@thommido Mailu - Part 6 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 30/09/2025

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 6 - తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భార్యను చెన్నై లో హాస్పిటల్ లో చూపించి తిరిగి వస్తూ ఉంటాడు రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం. దారిలో తొమ్మిదో మైలు దగ్గర దయ్యం కనపడిందని డ్రైవర్ రాజు టాక్సీ ఆపుతాడు. ఆ విషయం పోలీస్ స్టేషన్ లో చెప్పమని కొడుకు గోపీనాథ్ ను పంపుతాడు స్వామినాథం. తొమ్మిదో మైలు దగ్గరకు స్వామినాథం తో కలిసి బయలుదేరుతాడు ఎస్సై మోహన్. పాడుబడ్డ గుడి దగ్గర గాయపడ్డ సాధువుకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. 


అదే సమయంలో మరొక చోట ఒక అజ్ఞాత వ్యక్తి 'దయ్యం@తొమ్మిదోమైలు' అనే ఫైల్ లో జరగబోయే భాగం చూస్తూ ఉంటాడు. తిరిగి వచ్చేటప్పుడు చింత చెట్టు కొమ్మ విరిగి పడటంతో జీప్ ఆగుతుంది. 


ఆరు నెలల క్రితం కొందరు బి టెక్ స్టూడెంట్స్ తొమ్మిదో మైలు దగ్గర్లో ఉన్న శివయ్య జలపాతం టూర్ ప్లాన్ చేస్తారు. 

ఇక దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 6 చదవండి. 


"బయటి వాళ్లకు జోక్ గానే ఉంటుంది. కానీ మా నాన్న ఆ దయ్యం కారణంగా చనిపోయారు. " అంది రితిక. ఆ మాటలంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 


"ఐ యామ్ సారీ రితికా. ' అంటూ అప్రయత్నంగా ఓదార్పుగా ఆమె భుజంపై చెయ్యి వేశాడు గౌతమ్. వెంటనే తియ్యబోతున్న అతని చేతిని తన చేత్తో అదిమి ఉంచింది రితిక. 


"పరవాలేదు గౌతమ్. అన్నట్లు నీకు దయ్యాలంటే భయం ఉందా?" అడిగింది రితిక. 


"అస్సలు లేదు. నేను దయ్యాలను నమ్మను. పాత రోజుల్లో చీకట్లో నడిచి వెళ్ళేవాళ్ళకు భయం వల్ల ఏవో వింత ఆకారాలు కనిపించేవి. వాళ్ళు గతంలో విన్న కథలు గుర్తుకు తెచ్చుకుని హడలిపోయేవారు. " చెప్పాడు గౌతమ్. 

 

"సరిగ్గా నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను. మా నాన్న మరణం పైన కూడా నాకు సందేహాలు ఉన్నాయి. కానీ భయంతో గుండె ఆగి చనిపోయారని కేసు క్లోజ్ చేసేసారు. అప్పట్లో నాకు పదేళ్లు. మా అన్నయ్య మురళికి పన్నెండేళ్ళు. అప్పుడే మా అన్నయ్య పోలీసులతో గొడవ పడ్డాడు. కేసును సరిగ్గా విచారించ లేదని గట్టిగా అరిచాడు. పోలీసులు అన్నయ్యను కొట్టబోతే వూరి పెద్దలు విడిపించారు. " చెప్పింది రితిక. 


"మీ అన్నయ్య కూడా అప్పుడు చిన్నవాడే కదా. అందుచేత ఆవేశపడి ఉంటాడు. " అన్నాడు గౌతమ్. 


"కానీ అన్నయ్యలో ఇప్పటికీ ఆ ఆవేశం ఉంది"


"ఎందుకని?" ప్రశ్నించాడు గౌతమ్. 


""మా నాన్న ఆ రోజుల్లోనే దయ్యాలను నమ్మేవాడు కాదు. ఆ దారిలో ఒంటరిగా వెళ్ళడానికి భయపడే వాళ్లకు తోడుగా వెళ్ళేవాడు. నాన్న దాదాపు ప్రతిరోజూ అర్థరాత్రి సమయంలో మా వూరు వేటపాలెం నుండి తొమ్మిదో మైలు దాకా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి వచ్చేవాడు. 


'నిజంగా దయ్యం వుంటే నేను క్షేమంగా తిరిగి రాగలిగే వాడినా?' అని వూరి వాళ్ళను ప్రశ్నించేవాడు. నాన్న మాటలు ఊరివాళ్లలో ధైర్యం నింపాయి. దయ్యం భయంతో భూములు అమ్ముకొని ఊరు వదిలి వెళ్లాలనుకునే వాళ్ళు నాన్న ధైర్యం చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. " చెప్పింది రితిక. 


"మీ నాన్నగారి మరణం ఎలా జరిగింది?" అడిగాడు గౌతమ్. 


"అది తెలుసుకోవాలంటే నీకు దానికి తగ్గ ధైర్యం ఉండాలి. " అంది రితిక. 


చటుక్కున రితికను దగ్గరకు లాక్కుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్. "ఇప్పుడు చెప్పు. నాకు ధైర్యం లేదంటావా?" అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. 


"మనం టూర్ వెళ్తున్నాము కదా. రిటర్న్ లో నిన్ను ఆ తొమ్మిదో మైల్ దగ్గర దించేస్తాము. రాత్రంతా ధైర్యంగా అక్కడ ఉండగలిగితే నువ్వు ధైర్యవంతుడివని ఒప్పుకుంటాను" అంది రితిక తన బుగ్గను తడుముకుంటూ. 


"మరి అప్పుడు నేను ప్రపోస్ చేస్తే ఒప్పుకుంటావా?" అడిగాడు కొంటెగా. 


"నో "


"మరి???"


"నేనే నీకు ప్రపోజ్ చేస్తాను" చెప్పింది రితిక ముఖాన్ని చేతుల్లో దాచుకుంటూ. 

***

ప్రస్తుతం.. 


తాను జీప్ నుండి దిగుతూ, తనతో వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్స్ ను కూడా దిగమన్నాడు ఎస్సై మోహన్. 

వాళ్లతో పాటు మిగతావాళ్ళు కూడా దిగారు. 


మురళి మాట్లాడుతూ, " బయటి ఊరి వాళ్ళు.. మీరే ధైర్యంగా వుంటే స్థానికులం.. మేము మాత్రం లోపల ఎలా కూర్చోగలం" అన్నాడు. 


"మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత. పోలీసులం ముందు వెళతాం. మీరంతా వెనగ్గా రండి" అంటూ ఆ తెల్లటి ఆకారం వైపు ధైర్యంగా వెళ్ళాడు మోహన్. 


పొలాల్లోనుంచి రోడ్ వైపు రాబోతున్న ఆ ఆకారం అక్కడే ఆగింది. పొలం గట్లమీద వేగంగా నడుస్తూ ముందుగా ఆ ఆకారాన్ని చేరుకున్నాడు మోహన్. ఆ ఆకారం గాలిని బలంగా లోపలికి పీల్చుకుని, మోహన్ ముఖం వైపు బలంగా ఊపింది. 


అంతే.. 

ఆ ఆకారం నోట్లోనుండి బయటకు వచ్చిన అగ్ని కీలలు మోహన్ ముఖాన్ని తాకాయి. 


అప్రయత్నంగా వెనక్కి జరిగాడు మోహన్. అయితే అనుకోకుండా పొలం గట్టు మీదనుండి పట్టు తప్పి తడిసి ఉన్న మట్టిలో పడిపోయాడు. ఆ ఆకారం వికృతంగా నవ్వుతూ మోహన్ గుండెల మీద బలంగా తన్నింది. ఈ లోగా అందరూ అక్కడికి చేరుకోవడంతో ఆ ఆకారం పరుగెత్తి దూరంగా వెళ్ళిపోయింది. 

***

జీప్ పోలీస్ స్టేషన్ చేరుకుంది. అప్పటికే టీవీ రిపోర్టర్లు, పత్రికా విలేఖరులు స్టేషన్ ముందు వెయిట్ చేస్తున్నారు. మోహన్ స్టేషన్ లోకి వెళ్లి కూర్చోగానే అతన్ని చుట్టు ముట్టారు అందరూ. 


స్వామినాథం తన మేనల్లుడు రఘుతో కలిసి మోహన్ కు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. 


మైక్ ను ముందుకు జరిపి, "మోహన్ గారూ! మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఎస్సైగా రావడం తమ అదృష్టమని ప్రజలంతా అనుకుంటున్నారు. ప్రలోభాలకు వత్తిడులకు లొంగకుండా డ్యూటీ చేస్తున్నారు మీరు. ఈ దయ్యం కేసును కూడా మీరు సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాము. పది పన్నెండేళ్లకు ముందు తొమ్మిదో మైలు దగ్గర దయ్యం తిరుగులాడిన విషయం స్థానికులకు ఇంకా జ్ఞాపకమే. అప్పట్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు కానీ దయ్యం విషయం తేలలేదు. ఇప్పుడు మీలాంటి సమర్థులు ఎస్సైగా ఉన్నారు కాబట్టి ఈ దయ్యం సంగతి తేలుతుందని ఆశిస్తున్నాము. అసలు ఇప్పటివరకు జరిగిన విషయాలు చెప్పండి" అన్నాడు రిపోర్టర్ రఘు. 


విషయం చెప్పడం ప్రారంభించాడు మోహన్. 


"రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథంగారు చెన్నై నుంచి భార్యతో కలిసి టాక్సీలో వస్తున్నారు. ఆ టాక్సీ డ్రైవర్ రాజు స్థానికుడు. తొమ్మిదోమైలు దగ్గర రోడ్ మీద దయ్యం కనిపించిందని రాజు టాక్సీ ఆపాడు. సమయానికి తొమ్మిదో మైల్ దగ్గర బస్సు ఆగడంతో స్వామినాథంగారు భార్యతో కలిసి అందులో వచ్చేసారు. 


తరువాత కార్ స్టార్ట్ కాక పోవడంతో రాజు ఆ రాత్రి తొమ్మిదోమైలు దగ్గర ఉన్న వేటపాలెంలో తెలిసిన వారింట్లో ఉన్నాడు. 


తాను చూసింది దయ్యం లాంటి ఆకారమని రాజు చెప్పడంతో నేను స్వామినాథం గారిని తీసుకొని ఆ స్పాట్ కు వెళ్ళాను. మరిన్ని వివరాల కోసం వేటపాలెం గ్రామం వెళ్ళాలనుకున్నాము. వాగు దాటిన తరువాత భారీ వర్షం పడటంతో ఒక పాత గుడి దగ్గర తలదాచుకున్నాము. అయితే కండ్రిగ గ్రామం వెళ్లి తిరిగి వస్తున్న చామంతమ్మ. ఆమె కొడుకు మురళిలకు వాగు దగ్గర మేము అపి ఉంచిన జీప్ లో దయ్యం కూర్చుని ఉన్నట్లు కనిపించింది. తల్లిని వాగు దాటించిన మురళి, దయ్యం విషయం తేల్చుకోవాలని తిరిగి అవతలి వైపుకు వెళ్ళాడు. 


ఆ విషయం తెలుసుకున్న మేమందరం అక్కడికి వెళ్ళాం. జీప్ లో ఉన్న దయ్యంలాంటి ఆకారాన్ని నెట్టేసి, స్టీరింగ్ తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నట్లు మురళి చెప్పాడు. అందరం జీపులో బయలుదేరాము. చింత చెట్టు పక్కన పొలాల్లో తెల్లటి ఆకారం కనపడటంతో అందరం అక్కడికి వెళ్ళాము. ఆ ఆకారం నోట్లోనుంచి మంటలు వచ్చి నా ముఖాన్ని తాకాయి. పట్టుతప్పి పొలాల్లో పడిపోయాను. ఆ ఆకారం నా గుండెలమీద కాలు పెట్టి తొక్కింది" 


చెప్పి, ముఖానికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు మోహన్. 


కొంత సేపు అంతటా నిశ్శబ్దం.. 


"మీలో సీనియర్ జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారా?" ప్రశ్నించాడు స్వామినాథం. 


ఇద్దరు జర్నలిస్టులు చేతులెత్తారు. 


"గతంలో తొమ్మిదో మైలు దగ్గర దయ్యాలు తిరుగాడిన విషయం మీకు తెలుసు కదా!" అడిగాడు. 


ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ "అవును. నాకు ఇప్పటికీ ఆ వార్తలు గుర్తు ఉన్నాయి. వేటపాలెం గ్రామం సగానికి పైగా ఖాళీ అయింది. రైతులు భూములు అమ్మాలని ప్రయత్నించారు కానీ స్థానికులెవరూ అక్కడ భూములు కొనడానికి సాహసించలేదు. అప్పటి ఒక రాజకీయ నాయకుడి చొరవతో తమిళనాడు నుండి కొందరు వచ్చి ఆ భూములు కొనుగోలు చేశారు. " చెప్పాడు. 


మురళి కల్పించుకుంటూ "అప్పుడు పోలీసులు సరిగ్గా విచారించి వుంటే మా వూరి వాళ్ళు భూములు అమ్ముకోవాల్సిన అవసరం ఉండేది కాదు" అన్నాడు కాస్త ఆవేశంగా. అంతలోనే తమాయించుకుని, "కానీ ఇప్పుడు ఎస్సై మోహన్ గారు చాలా చురుగ్గా విచారణ చేపట్టారు. కాబట్టి ఈసారి ఆ దయ్యం సంగతి తొందర్లోనే తేలిపోతుంది" అన్నాడు. 


స్వామినాథం మాట్లాడుతూ “ఆ దయ్యం ఎస్సై గారిని గాయపరిచింది. నిజానికి అయన నేరుగా ఆసుపత్రికి వెళ్ళాలి. కానీ విలేఖరులు ఎదురు చూస్తున్నారని తెలిసి నేరుగా స్టేషన్ కు వచ్చారు. ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే రేపు కలవండి" అన్నాడు. 


విలేఖరులందరూ వెళ్ళడానికి పైకి లేచారు. 


"చివరిగా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి మోహన్ గారూ! ఇప్పటి వరకు జరిగిన విషయాలను బట్టి దయ్యాలు ఉండే అవకాశం ఉందంటారా?" అని ఒక విలేఖరి అడిగాడు. 


"వ్యక్తిగతంగా నేను దయ్యాలను నమ్మను. కానీ జరిగిన విషయాలు కొట్టి పడేయాల్సినవి కావు. లోతుగా విచారణ జరపాలి. పదేళ్లకు ముందు కేసు తాలూకు ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని చెప్పి పైకి లేచాడు మోహన్. 



ఒక కానిస్టేబుల్ ను పిలిచి వేటపాలెం గ్రామస్థులకు స్టేషన్ ఎదురుగా ఉన్న లాడ్జిలో రూమ్స్ ఏర్పాటు చెయ్యమని, డబ్బులు తాను పే చేస్తానని చెప్పి, హాస్పిటల్ కు బయలు దేరాడు. 


లోకల్ టీవీ ఛానళ్లలో దయ్యానికి సంబందించిన వార్త మరో గంటకే ప్రసారమైంది. 

మరుసటి రోజు అన్ని ప్రముఖ టీవీ ఛానళ్ల వాళ్ళు వచ్చేసారు. మోహన్, స్వామినాథం, మురళి లను ఇంటర్వ్యూ చేశారు. మరో రోజు గడిచేసరికి రాష్ట్రమంతటా ఈ విషయం చర్చకు వచ్చింది. 


హేతువాద సంఘం తరఫున ఇద్దరు వ్యక్తులు వచ్చి, తాము తొమ్మిదో మైలు దగ్గర ఒక రాత్రి గడుపుతామని, దయ్యాలపైన ఉన్న భయాలు, మూఢ నమ్మకాలూ పోగొడతామని చెప్పారు. 

***

ఆరు నెలల క్రితం.. 

గౌతమ్, రితికాలతో పాటు మరో పదిమంది శివయ్య జలపాతం దగ్గరకు వెళ్లారు. అక్కడ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. రిటన్ లో తొమ్మిదో మైలు దగ్గరకు వారి వాహనం రాగానే ఆపమంది రితిక. అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలు. 

"గౌతమ్! ప్లీజ్ గెట్ డౌన్" అంది. 


కొంతసేపు అర్థం కాలేదు గౌతమ్ కు. తరువాత అర్థమై, "ఓకే గైస్. నాకు ఇక్కడ ఒక పని ఉంది. చూసుకుని రేపు డైరెక్ట్ గా కాలేజీకి వచ్చి మిమ్మల్ని కలుస్తాను" అంటూ కిందకు దిగాడు. 

టెంపో ముందుకు కదిలింది. 


ఒకసారి చుట్టూ పరిశీలించాడు గౌతమ్. 


అక్కడ ఒక పాడుబడ్డ టీ కొట్టు ఉంది. అందులో ఒక బల్ల వేసి ఉంది. రోడ్ కు కాస్త అటువైపుగా ఒక పెద్ద చింత చెట్టు ఉంది. పక్కన ఉన్న పొలాల్లో ఒక షెడ్ ఉంది. దాని ముంది ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండటంతో ఆ షెడ్ ఉన్నట్లు తెలుస్తోంది. 

ree

కాస్త ఆలోచించాడు గౌతమ్. ఈ టీ కొట్టు దగ్గర వుంటే రోడ్ లో వెళ్లే వాళ్లకు తాను కనపడతాడు. దయ్యం మాట అటుంచితే ఎవరైనా దొంగలు అటాక్ చెయ్యవచ్చు. అదే పొలాల్లో ఉన్న ఆ షెడ్ దగ్గరకు వెళితే తాను ఎవరికీ కనపడడు. కానీ అక్కడికి వెళ్లాలంటే ముందు ఆ చింత చెట్టును సమీపించాలి. చింత చెట్టు దయ్యాల స్థావరమని విన్నట్లు గుర్తు. కానీ దయ్యాలుండేది మర్రి చెట్టు దగ్గర కదా.. ఆలోచిస్తూనే చింత చెట్టును సమీపించాడు గౌతమ్. 


చెట్టు వెనుకనుంచి ఒక తెల్లటి ఆకారం ముందుకు వచ్చింది. 


గుండె ఝల్లుమంది గౌతమ్ కు. 


=========================================================

ఇంకా ఉంది

దయ్యం@తొమ్మిదోమైలు - పార్ట్ 7 త్వరలో

=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 







bottom of page