మూడు ముళ్ళు గుచ్చుకోవు
- Surekha Puli
- 6 days ago
- 7 min read
#SurekhaPuli, #సురేఖపులి, #MuduMulluGuchhukovu, #మూడుముళ్ళుగుచ్చుకోవు, #కొసమెరుపు, #TeluguHeartTouchingStories

Mudu Mullu Guchhukovu - New Telugu Story Written By Surekha Puli
Published In manatelugukathalu.com On 27/09/2025
మూడు ముళ్ళు గుచ్చుకోవు - తెలుగు కథ
రచన: సురేఖ పులి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పుష్ప, సంజీవన్ ప్రేమికులు.
‘సంజూ’ ప్రేమగా పిలిచింది పుష్ప, జవాబు ఇవ్వక తదేకంగా తన ప్రేయసిని చూస్తున్నాడు. మళ్లీ పిలిచింది..
“నువ్విచ్చిన గులాబీ జడలో పెట్టుకుంటుంటే ముల్లు గుచ్చుకుంది” చిన్న గాయమైన కుడి బొటనవేలు చూపించింది.
కొంటెగా నవ్వాడు, “నేను చేసిన గాయం నీకు ‘ఓకే’ అని సైగ చేసినట్టు ఉంది. ”
చిరు అలకతో, “అవునా, నేను నీకు ముల్లు గుచ్చి చూపిస్తా.. అప్పుడు చూద్దామా!?” పువ్వు కొమ్మకు ఉన్న ముల్లు పెరికి అతని అరచేతిలో బలంగా గుచ్చింది.
“నువ్వు గుచ్చింది ముల్లు కాదు, నువ్వు నా లోపల పెంచిన పుష్పం! నీకు అది ముల్లై కనిపించినా, మన ప్రేమకు మూడుముళ్ల బంధం వేయమని నన్ను పురిగొల్పుతుంది. ”
“సంజూ, నిజానికి నీ చెంత ఉంటే ఏ ముల్లు హాని చేయదు. కానీ నీ మౌనం మాత్రం నా గుండె లోపల నిశ్శబ్దంగా గుచ్చి నొప్పి పుట్టిస్తుంది. ”
“లేదు, నిన్ను బాధ పెట్టే ఉద్దేశం లేదు. నన్ను నమ్మి, నా కోసం ఇంత తెగింపుగా వచ్చిన నీకు.. , సంతోషం-సుఖం ఇవ్వాలని అనుకుంటాను, అంతే.. ధైర్యంగా అందరి ముందు నీ మెడలో మూడు ముళ్లు వేసి, నిన్ను నా దాన్ని చేసుకుంటాను. నన్ను నమ్ము!”
“నీ మీద ఆ సద్భావన ఉన్నందుకే నేను అందరిని కాదని నీ కోసం వచ్చాను. ఇక పెళ్లి అంటావా!?.. నా మనసు నీకు ఇచ్చినప్పుడే.. ఇలా మొదట నీ చేతిని పట్టుకున్నప్పుడు, మొదటి ముడి; నీ బాధను పంచుకున్నప్పుడు రెండవ ముడి; మౌనంగా పరస్పరం మన గుండెల సవ్వడి వినిపించుకున్న మధుర క్షణం, ముచ్చటైన మూడో ముడి!.. అదే మనిద్దరం కరిగి పోయి అమృత బంధమైంది”
అతను ఆమెను తన కౌగిట్లో బందీ చేశాడు.
“ప్రతి ముడి మన ప్రేమలో దూరాన్ని కరిగించే దారులవుతాయి. ”
“అవును సంజూ, ప్రేమ ముళ్ళతో నిండిన పూదోట వంటిది. నొప్పి ఉంటుందేమో, కానీ అందం, ఆకర్షణ, సువాసన కూడా ఉంటాయి. ”
“ఇది మనిద్దరికి ఒకరిపైన ఒకరికి ఉన్న విశ్వాసం, మన చుట్టూ ప్రపంచానికి మన ప్రేమ బంధం మూడుముళ్ల అనుబంధం అని రుజువు చూపిద్దాం. ”
***
అది ఒక పాత ఇల్లు. గోడపై వేలాడుతున్న గడియారం కడపటి నిమిషం మోగినప్పటి నుంచి, అది కాలాన్ని చూపడం మానేసి మౌనంగా ఉంది. గడియారం మూడు ముళ్ళు ముందుకు జరగక నిలిచి ఉన్నాయి.
ఆ మూడు ముళ్ళు అతనికి ఒక భావన. ఒక గుర్తు. ఒక బాధ. గడియారం గుండె లోపల దాచుకున్న మౌన సవ్వడి. అది కాలాన్ని చూపే యంత్రం కాదు, కాలాన్ని తట్టుకునే జీవితం కూడా!
ఆ గడియారం పుష్ప, సంజీవన్ తీపి గుర్తు! గుళ్లో దండలు మార్చుకున్న శుభ సమయాన ఇద్దరూ కలిసి కొనుక్కున్న అపురూపమైన కాలజ్ఞాని! ఇద్దరినీ క్రమశిక్షణతో నడిపిన మార్గదర్శి!
బాబు పుట్టాలని పుష్ప! పాప కావాలని సంజీవన్ ఎదుగుతున్న పొట్ట చూసుకొని వాదులాడుకునే వారు. అవి ఎంతటి మహత్తరమైన రోజులు!!
దగ్గరలోని చిన్న రిపేర్ షాప్ మెకానిక్ను అడిగాడు, పార్ట్శ్ దొరకడం కష్టం; గడియారం పార్ట్శ్ అన్నీ పుష్ప లాక్కెళ్ళింది, అందుకే దొరకవు అని ఖచ్చితంగా అనేశాడు, నీరసంగా నవ్వుకున్నాడు. సంజీవన్ రోజూ గడియారాన్ని చూస్తూ, ‘ఇది నడవదు, కానీ నా గుండె మాత్రం దాని చప్పుడు వింటుంది’ అనుకున్నాడు.
***
పరిమళ.. స్వయాన పుష్ప చెల్లెలు, సంజీవన్ను కలిసింది. మంత్రి గారి విజిటింగ్ కార్డ్ ఇచ్చి, “బావ, సార్ ఇంట్లో పెరుగుతున్న సమర్థన్.. నీ కొడుకు.. క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు నేను మంత్రి గారి పి. ఎ, ఎక్కడో చెత్తకుప్పకు అంకితం కావద్దని నేనే కాపాడాలి అనే సదుద్దేశంతో ఈ పని చేశాను. ఇది నీకు దుశ్చర్య అనిపిస్తుందేమో! నన్ను క్షమించు.. ” కాళ్ళు పట్టుకుంది. సంజీవన్ దూరం జరిగాడు.
మళ్లీ అంది, “నీ ఉత్తరాలు.. అక్క చదివే కంటే ముందే చెత్తబుట్ట చేరేవి. ”
“పరిమళా, ఎందుకు అంత కక్ష?” దీనంగా అడిగాడు.
“అక్కకు నువ్వు సరిపడవు అని ఇంట్లో మేము నిశ్చయించుకున్నాం. ఎంత చెప్పినా అక్క వినలేదు. ఎల్లప్పుడూ నీ తలపులే, చివరికి మా అందరిని కాదని నీతో వెళ్ళిపోతున్నాను అని ఒక కాగితం ముక్క మిగిల్చింది. మా తలవంపులు గురించి ఆలోచించలేదు. ”
“మీ అక్క.. మీ ఇంటి ఆడపడుచు! నా పుష్ప, నా జీవితాన్ని వికసించి గుభాళించిన నా అర్ధాంగి శారీరకంగా లేదు. ఇప్పుడు మీరు తల ఎత్తి బతుకుతున్నారా?” కాగిపోతున్న రక్తం వేడిని ప్రసరించాడు.
“కోప్పడకు బావ.. ”
“నీ అక్క నాకు భార్యగా సరిపోదు అనుకున్న ఓ మంత్రి గారి సేవకురాలా!.. నన్ను ‘బావ’ అనే అర్హత లేదు. నాకో పేరుంది. ”
“సారీ, నీకు తెలుసనుకుంటాను.. నా వారినందరినీ క్రిందటి తుఫానులో కోల్పోయాను. నాకు తగిన శాస్తి జరిగింది. కానీ ఎప్పటికైనా నీ కొడుకును నీ వద్దకు చేర్చే బాధ్యత నాది. ”
“సినిమా డైలాగులు వద్దు, అసలేం జరిగింది. ప్లీజ్.. నాకు నిజం తెలియాలి. ”
“ఒక రోజు అక్క నన్ను రహస్యంగా కలిసి తాను తల్లి కాబోతున్న విషయం సంతోషం, నువ్వు ‘మారిషస్’ వెళుతున్నందుకు బాధ అని చెప్పింది. నేను మనసులో దాచుకోలేక ఇంట్లో చెప్పాను. ”
***
సంజీవన్ చేసే మర్చంట్ నేవీ ఉద్యోగరీత్యా ‘మారిషస్’ వెళ్ళాడు. పుష్ప తల్లిదండ్రులు, పెద్దమ్మ, పెదనాన్న, మేనత్త, మేనమామలకు పుష్ప ఒంటరి అని తెలిసింది. మాయ మాటలతో నమ్మించి ఇంటికి తెచ్చి కాన్పు తర్వాత పుట్టిన పసికందును పిల్లలు లేక మానసిక హింస అనుభవిస్తున్న పేరు ప్రఖ్యాతుల ఉన్న మంత్రిగారి భార్యకు రహస్యంగా దానం చేసి, బాబు చనిపోయాడని అబద్దం చెప్పారు.
ఫలితంగా, త్యాగ బుద్ది ప్రదర్శించిన పరిమళ ఉదార స్వభావానికి పర్యవసానంగా వాళ్ళ ఇంట్లో ముఖ్యమైన పదవి ఇచ్చి సత్కరించారు.
పుష్ప, సంజీవన్ పెళ్లి సాక్ష్యాలు ఏమీ లేనందుకు పెద్దలు వేరే పెళ్లి తలపెట్టారు. పెళ్లి సంబంధాలు వరుస కట్టాయి. పుష్ప అంగీకారంతో పని లేదు; భరించలేక మెడకు ముడి బిగించుకుని జీవితాన్ని చాలించింది.
***
మంత్రి గారి విజిటింగ్ కార్డ్ జతగా పరిమళ తన విజిటింగ్ కార్డ్ కూడా పిన్ చేసి గడియారం చిన్న తలుపు వెనుక పెట్టి తన దోషికి విముక్తి దొరికిందనుకుంది.
***
ఆమె చివరి మాట ‘నన్ను మరచిపోకు’.. గడియారం లోని ఒక ముల్లుగా మారింది. గడియారం లోపల దాచుకున్న మరో చిన్న ముల్లు తన కొడుకు. ఇక మిగిలిన ఆ మూడో ముల్లు తాను. రెండు ముళ్ళు నడవక పోతే మూడో ముల్లుకు కదలిక లేదు! గడియారం ఆగిపోయింది.
ఆ మూడు ముళ్ళు అతని జ్ఞాపకాలను గుచ్చదు, కానీ వదలదు కూడా. మంత్రి గారి వారసుడిగా కన్న కొడుకు చలామణి అవుతున్నాడు. అతనికి కనీసం ఒక్క సారి కూడా కళ్లారా చూసే యోగ్యత లేదు.
***
దేశ నిరుద్యోగ సమస్య కొంత తీర్చాలని ప్రభుత్వం విదేశీ వ్యాపారస్తుల పెట్టుబడులతో పాతబడి, శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు తగిన ధర కట్టి వివిధ వయస్కుల జన గణాంకాల జాబితా తయారు చేసింది. ఎక్కువగా ప్రవాస భారతీయులు ఉన్నారు. మరి కొంత మంది వృద్ధ స్త్రీ, పురుషులు.
కలెక్టర్ పదవి చేపట్టిన మాజీ మంత్రి గారి కొడుకు గౌరవనీయులు సమర్ధన్ గారు స్వయంగా కాలనీ వాసులను నచ్చచెప్పే ప్రయత్నంలో ప్రయాణిస్తున్నారు.
“సార్, స్పెషల్లీ.. సీనియర్ సిటిజన్స్ తో చాలా ప్రాబ్లం! ముందు వాళ్ల గ్రూపుని విడదీస్తే మన పని సులభం!”
“ఓకే, నాకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి” సహచరులు ఇచ్చారు.
“నేను ఒక్కొక్క ఇంటికి వెళ్లి ఆరా తీసి, వాళ్ళ స్టేటస్ చూసి నచ్చ చెప్పి ఒక స్కెచ్ ఇస్తాను. వి షల్ ప్రొసీడ్ అకాడింగ్లీ.. ” ఆజ్ఞాపించారు.
“ఈ ప్లాన్ స్మూత్ అయితే.. , కాదు అవుతుంది! గట్టి నిర్ణయం తీసుకున్న మన ప్రణాళిక సక్సెస్.. ” సహచరులు జబ్బలు చరుచుకున్నారు.
***
తెరిచి ఉన్న తలుపు పక్కగా కాలింగ్ బెల్ కోసం చూశాడు. కనబడ లేదు, టక్-టక్ చేతి మెటికలతో తలుపు తట్టాడు “నమస్తే సార్, మేము లోపలికి రావచ్చా?” అనుమతి అడగడం వరకు పరిమితి;
యజమాని అనుమతి రాక ముందే ఇంట్లోకి అడుగు పెట్టారు. సంజీవన్ న్యూస్ పేపర్ మడిచి లేచి నిలబడి “రండి.. కూర్చోండి” అక్కడున్న నాలుగు ప్లాస్టిక్ కుర్చీల వైపు చూపించాడు.
సమర్ధన్ గారు కూర్చుని చుట్టూ చూశారు. చాలా కాలంగా పేయింట్ లేని గోడపైన పాత గడియారాన్ని గమనించాడు. దాని ముళ్ళు స్తంభించాయి. టిక్-టాక్ లేదు.
“సర్, నేను.. ”
“తెలుసు, మీరు వచ్చిన పని కూడా తెలుసు.. ”
నవ్వుతూ అన్నాడు.
“గ్రేట్ సర్! గడప దాటితే చాలు మా వివరాలు సోషల్ మీడియాలో చెల్లాచెదురు. ”
“ఐకాన్.. అంటే మాటలా!?”
“లెట్ మీ బి బ్రీఫ్, ఇక్కడ.. హౌసింగ్ కాలనీ సిస్టమాటిక్ లేదు. వంకర-టింకర గల్లీలు, మెయిన్ రోడ్డు వద్ద కారు నిలిపి కాలి బాట మీ ఇల్లు చేరాలి. ప్రభుత్వం తరపున మీ ఇంటికి ఖరీదు కట్టి ఇస్తారు. అలా వద్దు అంటే ఇల్లు కట్టిస్తాం. అఫ్కోర్స్ పక్కా కాలిక్యులేషన్ ఉంటుంది, ఢోకా లేదు. మీ సమ్మతి కావాలి. ”
“దీని వలన మీ లాభం?”
“ఇది ప్రభుత్వం పని. ప్రజలకు లాభం. ”
“మీ ఆర్కిటిక్ ప్లాన్ ప్రకారం మా స్థలంలోనే సిస్టమాటిక్ హౌసింగ్ కాలనీ కట్టి మాకే ఇవ్వక, ఎక్కడో.. సిటీ ఔటర్ రేంజ్ ఏరియాలో ఇల్లు కట్టి ఇవ్వడం ఎంతవరకు సబబు? నా వంటి సీనియర్ సిటిజన్ నిత్యవసరాలకు ఇబ్బంది చెందడం జెన్యూన్ అనుకుంటున్నారా!?”
కలెక్టర్ ఇబ్బందిగా అన్నారు “సర్, మీరు పెద్దలు, అనుభవజ్ఞులు! యాక్టువల్లి.. ఇక్కడ విదేశీ పెట్టుబడులు సహకారంతో ఐటీ సంస్థలు నిర్మించి.. ”
“ఔటర్ సిటీ.. మాకు ఇళ్లు నిర్మించే స్థలంలో మీరు ఐటీ సంస్థ నిర్మాణం చేయలేరా? మమ్మల్ని కెలకడం ఎందుకు?”
“ఇక్కడ ఎక్కువగా ప్రవాస భారతీయులు ఉన్నారు. ఇక్కడి నిర్మాణం అంటే మనకు రిసోర్సెస్ అధికం! మీ నుంచి దాచేది లేదు.. ఇది నాకు ఇచ్చిన టాస్క్! మీ లాంటి వారు సహకరిస్తే.. ”
“కాఫీ.. , టీ.. తాగుతారా?” మాట మళ్లించాడు. వద్దన్నా వినకుండా ఫ్లాస్క్ లోని టీ కప్పులో పోసి ఇచ్చాడు. నచ్చక పోయిన తాగడం మొదలు పెట్టి చుట్టూ చూశాడు.
“సర్, ఈ యాంటిక్ క్లాక్ బదులు, ఇప్పుడు వస్తున్న డిజిటల్ స్మార్ట్ వాచ్ వాడండి. అమెజాన్ వాళ్ళు ఒక్క రోజులో డెలివరీ చేస్తారు. ”
"డిజిటల్ వాచ్‌లో ముల్లు ఉండదు. నాకు ముళ్ళు ఉన్న గడియారం ఇష్టం. "
"ఈ గడియారం ఆగిపోయింది. అందుకు మార్చండి”
బలవంతంగా రెండు సిప్పులు టీ తాగి పక్కన పెట్టేశాడు.
“కానీ, నా జ్ఞాపకాలు మాత్రం ఇంకా నడుస్తున్నాయి. అదే నా కుటుంబం!"
“ఒకసారి మీ పరిష్కారం లేని కుటుంబాన్ని చూడొచ్చా?” అనుమతి ఇవ్వకముందే గడియారం వైపు నడిచాడు.
సమర్ధన్ గడియారం పైన కనబడుతున్న దుమ్ము తుడిచాడు.
‘అది దుమ్ము కాదు పేరుకు పోయిన నా దుఃఖం’ అనుకున్నాడు సంజీవన్.
“సర్, మీరు కొత్త గడియారం కొనకండి.. నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. ”
"గిఫ్ట్ ఎందుకు? నేను కొనుక్కోలేనా?”
“సారీ సర్, అలా అని కాదు. నేటి యుగంలో మానవుడు మారుతున్న సాంకేతిక విజ్ఞానాన్ని అలవాటు చేసుకోవాలి. ”
“కొత్త గడియారం కాలాన్ని చూపిస్తుంది. ఈ గడియారం జ్ఞాపకాలు దాచుకున్న నా నిధి!" భావోద్వేగంతో కన్నీరు కళ్ళు మసకబడ్డాయి.
సమర్ధన్ గడియారం చిన్న తలుపు తెరిచాడు, రెండు విజిటింగ్ కార్డ్స్ తీసుకుని చదివాడు. నాన్నగారి పాత విజిటింగ్ కార్డ్, రెండోది అడ్మిన్ మామ్ కార్డ్. ఇక్కడేందుకున్నాయి? సంజీవన్ చూడకుండా జేబులో పెట్టుకున్నాడు.
“సర్, బాగా ఆలోచించుకోండి, రేపు మళ్ళీ కలుస్తాను”
“మారుతున్న సాంకేతిక విజ్ఞానాన్ని అలవాటు చేసుకోవాలి అన్నావు కదా.. ఇప్పుడు ప్రసిద్ధి చెందుతున్న AI వలన దీని ముళ్ళు తేజోవంతం కావాలి. అవుతుందా? సంప్రదాయం మరియు సాంకేతిక కలయికతో గడియారం మెమరీ తిరిగి వస్తుందా?”
“సర్, AI నిపుణులను కనుక్కుంటాను. నేను చెప్పిన పాయింట్ మర్చిపోకండి” హడావిడిగా వెళ్లిపోయాడు.
***
సమర్ధన్ అడ్మిన్ మేడం పరిమళ గారిని కలిశాడు. గతం కళ్ళ ముందు తిరిగింది. ప్రస్తుత కర్తవ్యం ఏమిటి? స్వంత తండ్రి ఎదుర్కొనే జ్ఞాపకాల అవగాహన లేదు.
కన్న తండ్రి, పెంచిన తల్లిదండ్రులు.. ఇద్దరికీ న్యాయం చేయాలి.
సమర్థన్ క్లాస్ మేట్ సుప్రీత్, పంజాబీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆర్నెల్లు అయ్యింది. ఇంట్లో అత్తాకోడళ్ల నస భరించే బదులు వేరే కాపురం పెడదాం అనుకున్నాడు. పెంచిన ప్రేమ పంచిన వారు ఎక్కువ వాదన లేకుండా ఒప్పుకున్నారు. కానీ కాల ముద్ర వేసుకున్న కన్న తండ్రి ఒప్పుకోలేదు.
“మీ జ్ఞాపకాల గడియారం ముళ్ళు 360 డిగ్రీలు తిరిగే పూచీ నాది. తీసుకెళ్లనా? రిపైర్ చేయించి తెస్తాను. ”
“తిరిగి తెస్తావని నమ్మకం ఏంటి?” - సంజీవన్. అందరిపైన నమ్మకం పోయింది.
“ఈ గడియారం మూడు ముళ్లతో మాత్రమే తిరుగదు, మనల్ని కలిపి కొత్త జీవితాన్ని ఇచ్చిన ప్రాణదాత. ఇది మీకు పవిత్రం. నాకు పరమ పవిత్రం! మనిద్దరి హార్ట్ బీట్!! నన్ను నమ్మండి. "
***
“మ్యూజియం ఆంటిక్ పీస్ మీ వద్ద ఎలా ఉంది సార్?” అడిగిన ధర ఇచ్చేందుకు సుముఖత చూపించారు సాంకేతిక నిపుణులు. రిపేర్ అయ్యింది.
“ప్రాబ్లం ఏంటి?”
“ఏమీ లేదు సార్, దుమ్ము పట్టుకుంది. ”
సమర్థన్ గడియారాన్ని గౌరవప్రదంగా గోడపై నిలబెట్టాడు. ఇన్నాళ్ళూ పూడుకున్న నిశ్శబ్దాన్ని పరిహాసం చేస్తూ మూడు ముళ్ళు తిరుగుతున్నాయి.
“సమా, నువ్వు నా గుండెలో గుచ్చుకున్న ముల్లు తీసిన వాడివి” ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు.
"నాన్న, ఈ ముళ్లు గుచ్చక.. మన బంధాన్ని పరీక్షించింది. ఇప్పుడు నా నొప్పి చెప్పనా?"
"నొప్పి ప్రేమలో భాగం. తప్పకుండా నువ్వు చెప్పాలి" కొడుకు అరచేతులను స్పర్శిస్తూ అన్నాడు.
సమర్థన్ తన ప్రేమ వివాహం వివరించి భార్యతో విడిగా కాపురం ఉండాలని, ఇరువురి మధ్య ఉన్న దూరాన్ని కరిగించే దారిలో తండ్రి తోడు కావాలన్నాడు.
పుష్ప జ్ఞాపకానికి మరో రూపమైన కొడుకు కోరిక అంగీకరించాడు.
*****
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు :సురేఖ ఇంటి పేరు: పులి
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.
ప్రస్తుత నివాసం బెంగళూరు విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.
Surekha Puli
@surekhap4148
•3 hours ago
ధన్యవాదాలు 🙏🫶
@divikg5573
•2 hours ago
Good story 👌👏