ఓ ఆశా కడలి
- Malla Karunya Kumar
- Sep 26
- 8 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #OAsaKadali, #ఓఆశాకడలి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

O Asa Kadali - New Telugu Story Written By - Malla Karunya Kumar
Published In manatelugukathalu.com On 26/09/2025
ఓ ఆశా కడలి - తెలుగు కథ
రచన: మళ్ళ కారుణ్య కుమార్
"పేర్లు ఒకటైనా, నీది ఏ చింతా లేని జీవితం, నాది సవాళ్లు తో కూడుకున్న జీవితం. ఏ బాధా లేకుండా ఉత్సాహంతో నింగిని అందుకోవాలని చూస్తున్నావా!. నీ ఉల్లాసం నాకు అసూయ కలిగిస్తుంది. ఓ కడలి!" నాలో రెట్టించిన ఉత్సాహానికి స్వరం అందిస్తూ గట్టిగా అరిచాను.
ఏదో తెలియని ఉల్లాసం కలుగుతుంది. ఎదురుగా సముద్రం ఒడ్డున, ఇసుక గూడులు కడుతూ, కేరింతలు కొడుతున్న చిన్నారులను చూసి నాలో బాల్యపు జ్ఞాపకాలు కూడగట్టుకోడానికి సిద్దమయ్యాను. సరిగ్గా అదే సమయానికి వాళ్ల కేరింతలకు, నా బాల్యపు జ్ఞాపకాలకు విరామ చిహ్నం పెడుతూ, ఓ తుంటరి అల వచ్చి ఆ ఇసుక గూడుల్ని కూల్చేసింది. వాళ్లలో ఆనందాన్ని ఆవిరి చేస్తూ, నాలో దుఃఖాన్ని మళ్ళీ రగుల్చుతూ.
"కడలి!, ఈ అంతు లేని తీరం లా, మన ప్రేమ కూడా శాశ్వతంగా వుండాలంటే మనం ఒక పని చేయాల్సి వుంది. "
ఆశతో కూడిన ఆశ్చర్యంతో అతని వైపు చూసాను.
"మన పెళ్ళి ఓ మధుర జ్ఞాపకం కావాలి. అండమాన్, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్, డయ్యూ ఏ తీరంలో మనం పెళ్లి చేసుకుందాం చెప్పు?. ఈ రోజుల్లో ఇదో ట్రెండ్ కదా!, సముద్ర తీరంలో వివాహం చేసుకోవడం త్రిల్లింగ్ గా వుంటుంది కదా!. "
అతని మాటలు నాలో ఊహలకు రెక్కలు తొడిగాయి.
అతనితో జీవితం ఎంతో బాగుటుందని. అతను ఏ కష్టం రాకుండా నన్ను చూసుకుంటాడన్న నమ్మకం నాకు కలిగింది. ఇవన్నీ నా మనసులో ఊహించు కొని సంతోషించే లోపే, నాలో చెలరేగిన ఓ కల్లోల ప్రశ్న, అచ్చం సంద్రం ను అతలాకుతలం చేసిన తుఫానులా, నాలో గందర గోళం సృష్టించింది.
తడబడుతున్న మాటలతో, "ఆకాశ్!, నీతో ఒక మాట చెప్పాలి. మా కుటుంబం గురించి, ఆర్థిక స్థితి గురించి నీకు తెలుసు కదా.. " నా మాట పూర్తి కాకుండానే,
"చూడు కడలి! అవన్నీ ఇప్పుడు ఎందుకు?. ఈ తీరంలో, ఆ అలల ఘోష లో మనం ప్రేమను పంచుకుందాం. ఎలాగూ నీ చదువు అయిపోతుంది కదా. పెళ్ళైన తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ ఉందాం. అక్కడే సెటిల్ అవుదాం. " తన నిర్ణయం చెప్పాడు.
మౌనం వహించాను. ఎందుకో మనుసు మనసులో కలవడం లేదు. ఏమి చేస్తున్నానో తెలియడం లేదు. కొంత సమయం ఆకాశ్ తో మాట్లాడిన తర్వాత ఇంటి ముఖం పట్టాను.
ఆలోచనలు కుదురుగా వుండనీయడం లేదు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాను.
"ఏమ్మా కడలి!" అన్న పిలుపుతో తలపుల నుండి బయట పడుతూ, వెనక్కి తిరిగి చూసాను.
"మీ నాన్న అక్కడ ఆ మర్రి చెట్టు దగ్గర తాగేసి పడిపోయి వున్నాడు. " దూరం నుండి కేకవేస్తూ, సమాచారం ఇచ్చి వెళ్ళిపోయాడు రామం బాబాయి.
ఈ మాట నాకు కొత్తేమీ కాదు. రెండు రోజులకు ఒకసారి ఎవరో ఒకరు చెప్తుంటారు. విని, విని.. కోపం, అసహనం పెరిగిపోయాయి. ఎందుకు ఈ బాధ్యత లేని మనిషి మాకు దాపురించాడు. ఇతని కారణంగా నాకు అమ్మకు కష్టమే తప్పించి, హాయి లేదు. విసుక్కుంటూ మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నాను.
నిద్ర మత్తులో వున్నాడు. క్షణక్షణం మమ్మల్ని వేధిస్తూ, ఎంత హాయిగా పడున్నాడో! తిట్టుకుంటూ, తప్పదని, అతన్ని ఇంటికి తీసుకు వెళ్ళడానికి సిద్ధం అయ్యాను.
నా స్పర్శ తగిలి, "అమ్మా కడలి వచ్చావా! నా బంగారం. " మత్తులో అంటున్నాడు నాన్న. 'నిజంగా నేనంటే ఇంత ప్రేమ వుంటే ఈ తాగుడు ఎందుకు?' నాలో అనుకుంటూ నాన్నను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను.
నా అవస్థ చూసి అటువైపు నుండి వెళ్తున్న సురేషన్న సహాయం చేయడానికి వచ్చాడు.
"ఉండు తల్లి, ఇంత పెద్ద మనిషిని నువ్వు ఎలా మోయగలవు?. నేను సహాయం చేస్తాను. " అంటూ భుజం కాస్తూ, నాతో పాటు నాన్నను పట్టుకొని ఇంటి వైపుకు నడిచాడు.
కొంత సమయానికి ఇంటికి చేరుకున్నాం.
నాన్న ను అరుగుమీద దింపి వెళ్ళిపోయాడు సురేషన్న.
అప్పటి వరకు ఎదురుచూస్తూ కూర్చున్న అమ్మ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న ను పట్టుకొని ఇంటిలోపలికి తీసుకు వెళ్ళడానికి సహాయం చేసింది.
ఇద్దరం కలిసి అతన్ని లోపలికి తీసుకు వెళ్లి పడుకోబెట్టాం. రోజూ వుండే తంతే. అమ్మ ప్రవర్తన కూడా నాకు విసుగు తెప్పిస్తుంది. 'దేవుడా ఎందుకు నన్ను ఈ ఇంటిలో పుట్టించావు. ' రోజూ అడిగే ప్రశ్నే అడిగి సమాధానం ఇవ్వని ఆ దేవుడ్ని తిట్టుకున్నాను.
'ఈరోజు ఎలాగైనా ఆకాశ్ ప్రస్తావన తీసుకు వచ్చి, అమ్మకు నా ప్రేమ విషయం చెప్పాలి. ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా నేను మాత్రం ఆకాశ్ ను పెళ్ళిచేసుకుంటానని' దృఢ నిశ్చయం తో అమ్మ దగ్గరకు చేరుకున్నాను.
తనలోనే తాను కుమిలిపోతూ వుంది. రోజూ ఆమెను ఇలా చూసి నా గుండె తరుక్కు పోతుంది. "ఎందుకమ్మా! ఇలా బాధ పడటం?. నాన్న ను వదిలేయవచ్చు కదా. రోజూ నాన్న చేత దెబ్బలు కాయడం. ఇలా తాగి వచ్చిన మనిషికి సపర్యలు చేయడం. ఈ నరకం ఎందుకు?. " రోజూ వేసే ప్రశ్నే మళ్ళీ వేసాను.
పేలవమైన చూపు నా వైపు చూస్తూ, మౌనంగా మళ్ళీ ఆలోచనల్లో పడింది.
విసుగు వచ్చి, కోపం కట్టలుతెంచుకు వచ్చింది. నా ఆవేశాన్ని అదుపు చూసుకుంటూ,
"నీతో ఓ మాట చెప్పాలి?. " అని కాస్త గట్టిగా అన్నాను.
ఏమిటన్నట్టుగా నా వైపు చూసింది.
ఎందుకో ధైర్యం చాలడం లేదు. కాస్త ధైర్యం కూడగట్టుకోని, "నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నీకు తెలిసే వుంటుంది కదా వీరేశం గారు. వాళ్ల అబ్బాయి పేరు ఆకాశ్. " నేను చెప్పదలచుకున్నది వేగంగా పూర్తి చేశాను.
ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి నా దగ్గరకు వచ్చింది. నా కళ్ళలోకి నేరుగా చూస్తూ, "అప్పుడే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చావా?. " అని అడిగింది.
చెమర్చిన ఆమె కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేక,
"అతను తప్పించి నాకు అంత మంచి వ్యక్తి దొరకడమ్మ. నన్ను బాగా చూసుకుంటాడు. నిన్ను నాన్న వేధించి నట్టుగా నన్ను వేధించడు. నాకు ఏ బాధ ఉండదు." ముఖం పక్కకు తిప్పుకుంటూ చెప్పాను.
"నీ డిగ్రీ ఈ సంవత్సరం పూర్తి అవుతుంది కదా, అన్నీ పాస్ అయ్యావా?" అసలు విషయం పక్కన పెడుతూ అడిగింది అమ్మ.
ఆ ప్రశ్నకు ఉలిక్కి పడుతూ. "నాలుగు సబ్జెక్ట్స్ వున్నాయమ్మ" సమాధానం ఇచ్చాను.
"చదువు విషయం పక్కన పెట్టి, పెళ్లి విషయాలు పట్టించుకుంటున్నావు. పోనీ డిగ్రీ తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే పరిస్థితి ఏమిటని ఆలోచించావా?. " అమ్మ స్వరంలో కోపం స్థాయి స్పష్టంగా తెలుస్తుంది.
ఆ ప్రశ్నకు ఉలిక్కి పడ్డాను. సమాధానం లేక ముఖం వేలాడేస్తూ మౌనం దాల్చాను.
"చూడు తల్లి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిన తర్వాతే నీ పెళ్లి. మరో ఆలోచన ఇప్పుడు చేయకు. ప్రస్తుతానికి మీ నాన్న టైలర్ షాప్ వుంది కదా దాన్ని నడిపించు. నేను నీకు తోడుగా వుంటాను. " తన కళ్ళు ఒత్తుకుంటూ చెప్పింది.
ఎన్నో సార్లు నాతో షాప్ నడపమని చెప్పేది. ఇష్టం లేదని చెప్పేదాన్ని. మళ్ళీ ఇప్పుడు కూడా ఆ ప్రస్తావనే తీసుకు వచ్చే సరికి నాలో ఆవేశం తీవ్రరూపం దాల్చింది, "నువ్వు ఎలాగూ నాకు మంచి సంబంధం తీసుకురాలేవు. ఆకాశ్ మన స్థాయి చూడకుండా నన్ను ఇష్టపడి, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఒప్పుకోవడానికి నీకేంటి బాధ. " కఠినంగా మాట్లాడాను.
బొమ్మలా చూస్తూ ఉండిపోయింది. ఎన్నడూ లేని విధంగా నేను శ్రుతి మించి మాట్లాడటం తో,
"ఈ తాగుబోతు తండ్రితో, ఆయన ఎన్ని చేసినా దైవంగా చూసే నీ వెర్రి తనంతో నేను వేగలేక చస్తున్నాను. ఇక నేను ఈ బాధలు భరించలేను. నువ్వు ఒప్పుకోక పోతే చెప్పు.. నేనే.."
నా మాట పూర్తి కాక ముందే నా చెంప చెళ్లమనిపించింది.
బుగ్గన చేయిపెట్టుకుంటూ మౌనంగా నిలబడ్డాను.
"వెళ్తవా, ఎక్కడకి వెళ్తావు?. వెళ్లి నువ్వు సుఖంగా జీవిస్తానని అనుకుంటున్నావా?. ఏంటి నీ తండ్రి వ్యసనంకు బానిసై ఇలా అయిపోతే అతన్ని చులకనగా చూస్తావా?. ఆయన్ని దారిలోకి తేవాలన్న నా ప్రయత్నం నీకు వెర్రితనంగా కనిపిస్తుందా?. తల్లితండ్రులకు మాత్రమే పిల్లల పట్ల బాధ్యత వుండటం కాదు. పిల్లలకు కూడా తల్లి తండ్రుల పట్ల బాధ్యత వుండాలి.
ఇంతవరకు వచ్చాక నేను ఊరుకోవడం సమంజసం కాదు. మీ నాన్న గురించి నీకు తెలియాలి. నాలో నన్ను దహిస్తున్న నా గతం, నా గురించి నీకు తెలియాలి. " అంటూ నా చేయి పట్టుకొని లాగి మంచం మీద కూర్చో పెట్టింది.
ధారాపాతంగా వస్తున్న తన కన్నీళ్లను చీర కొంగులో దాచుకుంటూ, "నేను నీలా ఉన్నత చదువులు చదువుకోవడానికి వెళ్లిన దాన్నే!. ప్రేమ ప్రేమ అంటూ గుడ్డిగా నమ్మి ఒకతని చేతుల్లో మోసపోయిన అభాగ్యురాలిని. అప్పటి వరకు నన్ను యువరాణి లా చూసిన నాన్న, అమ్మ, అన్నయ్య. నన్ను ఒక అంటరాని దానిలా చూశారు. ప్రేమ పేరుతో మోసపోయానన్న జాలి కూడా ఎవరికి కలుగలేదు. ఆ క్షణం ఎవరూ పట్టించుకోక పోవడం తో ఎందుకు ఈ బ్రతుకు అనిపించింది. " చెప్తూ ఒక్కసారిగా కుప్పకూలింది అమ్మ.
కంగారు పడి, వేగంగా లేచి అమ్మను లేవదీసే ప్రయత్నం చేశాను. నన్ను నెడుతూ ఆమె పైకి లేచింది.
"అప్పటి నుండి ఇప్పటి వరకు నా బాధ నన్ను వెంటాడుతుంది. అప్పటికే ఊర్లో నా ప్రేమ విషయం అందరికీ తెలిసి పోవడం తో వచ్చిన సంబంధాలు కూడా రావడం మానేశాయి. అప్పుడే మా నాన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. అతని స్నేహితుడు కొడుకు రామచంద్ర కు ఇచ్చి నా పెళ్లి చేయాలనుకున్నారు.
ఈ విషయమే తన స్నేహితుడు కి, అతని కొడుక్కి చెప్పి వాళ్ళను ఒప్పించారు. వివాహం కూడా ముగిసింది. కానీ తర్వాత ఒక విషయం తెలిసి చాలా బాధ వేసింది. మా నాన్న తన స్నేహితుడు అప్పు మాఫీ చేసి నన్ను కోడలిగా పంపించారన్న మాట తెలిసి నా గుండెలు పగిలిపోయాయి.
తర్వాత రామచంద్ర, అదే మీ నాన్న, వాళ్ల నాన్న మీద కోపం పెరిగింది. డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడన్న అసహ్యం కలిగేది. కానీ తర్వాత అతని ప్రవర్తన, నా పట్ల అతను చూపిన గౌరవం. నా అభిప్రాయం తప్పని రుజువు చేస్తూ నన్ను అతనికి దగ్గర చేసింది.
ఆర్థిక పరిస్థితులు కారణంగా ఇంటర్ తో చదువు ఆపేసినా, నేర్చుకున్న కుట్టుపని తో జీవితాన్ని నెట్టుకు వచ్చారు. నాకు ఏ లోటూ లేకుండా చూసుకునే వాళ్ళు. తర్వాత నా కుటుంబం నన్ను పూర్తిగా దూరం పెట్టింది. నాకు పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ ఈ ఇల్లె అయ్యింది. " చెప్తూ ఒక్కసారిగా అమ్మ మౌనం వహించింది.
నా మనస్సు పాత జ్ఞాపకాలు ప్రోగు చేయడానికి సిద్ధమైంది. నాన్న చిన్నప్పుడు నా కోసం ఏదైనా చేసేవాడు. ఎన్నో కొనిచ్చేవాడు. అతని దృష్టిలో నేనో దేవతను. ఎప్పుడూ నా మీద ఎంతో ప్రేమ ఒలక బోసే వాడు. షాప్ దగ్గరకు వెళితే నన్ను పక్కన కూర్చో పెట్టుకొని, ఏవేవో విషయాలు చెప్తూ, కుట్టు మిషన్ గురించి కూడా చెప్పే వారు. తెలియకుండానే నా కనులు కన్నీటి వర్షాన్ని కురిపిస్తున్నాయి అవన్నీ గుర్తుకు వచ్చి.
"నా వాళ్ళను మీ నాన్న ప్రేమ మరిపించింది. ఏ పాపిష్టి గ్రహాలు కన్నెర్ర చేశాయో తెలియదు!. కానీ, ఒక్కసారిగా నా బ్రతుకు తల క్రిందులవ్వడం ప్రారంభమయ్యింది. మీ నాన్న చెడు సావాసాలు చేయడం మొదలు పెట్టాడు. తాగుడు కు అలవాటు పడ్డారు. ఇంటిలో వున్న సొమ్ము పట్టుకు పోయేవాడు. ఒకసారి అడ్డుపడ్డాను. నన్ను తోసుకుంటూ తీసుకు పోయాడు.
అలా రోజులు గడిచాయి. మీ నాన్న పరిస్థితి రానురాను దిగజారింది. కుట్టు పని కూడా మానేశాడు. ఇంటి పరిస్థితి అతనికి పట్టేది కాదు. ఏదైనా పని చేయక పోతే ఇల్లు గడవదని, నేను ఒక బట్టల దుకాణంలో పనికి చేరాను. అక్కడ యజమాని నన్ను చెల్లి అంటూ ఆప్యాయంగా చూసే వాడు. అతని మంచి తనం కారణంగా అతని తో మాట్లాడే దాన్ని. అలా రోజులు గడుస్తున్నాయి.
ఒక రోజు యజమాని ఇంటికి వచ్చాడు. ఆప్యాయంగా అతన్ని ఇంటిలోపలికి ఆహ్వానించాను. కానీ అతని ప్రవర్తన వేరేగా వున్నాయి. ఆ సమయంలో అతని నిజ స్వరూపం బయట పడింది. అతను కామం తో.. " ఒక్కసారిగా అమ్మ ఏడ్చేసింది.
గుండె పట్టేసినట్టు అయ్యింది. మెదడు మొద్దుబారినట్టు అయ్యింది. రెండు క్షణాల తర్వాత ఉలిక్కి పడి ఈ లోకంలోకి వచ్చాను. అమ్మను ఓదార్చడానికి సిద్ధం అయ్యాను.
వెక్కి వెక్కి ఏడుస్తూ, "వాడు నన్ను పాడు చేయాలని చూసాడు. సమయానికి నేను తెలివిగా ఆలోచించి వాడి నుండి తప్పించుకున్నాను. కానీ.. " ఆమె కన్నీళ్లు ఏరులై పొంగుతున్నాయి. మాటలు వణుకుతున్నాయి.
నన్ను పట్టుకొని ఏడుస్తూ వుండి పోయింది. మళ్ళీ తన కళ్ళు తుడుచుకుంటూ, "వాడి భారి నుండి తప్పించుకొని ఇంటి బయటకు చేరుకునే సమయానికి మీ నాన్న అక్కడ వున్నారు. అది కూడా తాగిన మత్తులో. వాడు అప్పుడే బయటకు వచ్చి పరుగు తీశాడు. ఆ సమయం నా జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. మీ నాన్న అనుమానానికి ఊతం దొరికింది. కోపంతో నన్ను కొట్టాడు. నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు. " ఈసారి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది.
అమ్మ ఎంత నరకం అనుభవిస్తుందన్నది ఆ సమయం తెలిసింది. నా ప్రమేయం లేకుండా కళ్ళంతా నీటి తో నిండి పోయాయి. వాటిని తుడుచుకుంటూ, "అమ్మా! ఊరుకో.. ఊరుకో.. " ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను.
బాధాతప్తమైన గొంతు తో, "తల్లి! మీ నాన్న కు నిజం తెలియాలని. నా మనసులో అతను తప్పించి వేరే వాళ్లకు చోటు లేదని చెప్పాలని. ఎప్పటికైనా అతను మారుతాడని. నేను మార్చుకోగలనని ఆశ తో జీవిస్తున్నాను. అలాంటి మంచి వ్యక్తి అలా అయిపోతే వదిలిపెట్టి స్వార్ధంగా నా జీవితం నేను ఎలా చూసుకోగలను. "
ఆమె మాటలు లాగి పెట్టి కొట్టినట్టుగా అనిపించాయి.
నేను ఎన్ని సార్లు నాన్న ను వదిలేయమని అమ్మకు సలహా ఇచ్చానో గుర్తుకు వచ్చి నా మీద నాకే జుగుప్స కలిగింది.
"కడలి! ఇప్పుడైనా నీకు తెలిసింది నా గురించి, మీ నాన్న గురించి. నువ్వు బాగా వుండాలనే నా కోరిక తల్లి. కానీ ఏమి చేస్తాను నా పరిస్థితి ఇది. కానీ నాకు, మీ నాన్నకు నువ్వంటే చాలా ప్రేమ. కడలి! నాకు ఒక సహాయం చేస్తావా?. ఎప్పటి నుండో నిన్ను అడగాలనుకుంటున్నాను. "
"ఏమిటో చెప్పమ్మా?. " ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అడిగాను.
"మీ నాన్న ను మళ్ళీ నువ్వు మామూలు మనిషిని చేయాలి. ఈ జన్మకు నాకు అది చాలు. "
"ఇన్నాళ్లూ నువ్వు పడుతున్న ఈ నరకం నాకు తెలిసి కూడా నీ గురించి ఆలోచించలేదు. ఈ చితి మంటల సహగమనం నుండి నీకు విముక్తి కల్పిస్తాను అమ్మ. " నాకు తెలియకుండానే నాలో ఉన్న ప్రేగు బంధం మాటిచ్చింది.
సంతోషిస్తూ, "వుండు తల్లి మీ నాన్నకు భోజనం పెడతాను. " అని అక్కడ నుండి వెళ్ళిపోయింది అమ్మ. బాధ్యత మరువని భార్యగా.
నిజం తెలుసుకోకుండా నేను ఇన్నాళ్ళూ ఆడిన మాటలు, నాకు గుర్తుకు వచ్చి నా మీద నాకే అసహ్యం పెరిగింది.
బయటకు వచ్చి కూర్చొన్నాను. ఆకాశంలో చంద్రుడు వెన్నల వెదజల్లుతూ కనిపించాడు.
"నాన్న ను ఎలాగైనా మార్చాలి. ముందు అమ్మకు ఆసరాగా నిలబడాలి. అంటే నాకు ఉపాధి కావాలి. నేను కూడా కుట్టు మిషన్ నేర్చుకున్నాను కదా. పైగా ఫ్యాషన్ డిజైన్ చేయాలని కలలు కనేదాన్ని. ఇప్పుడు ఆ కలలు నిజం చేసుకోవాలి. కష్టమైన మళ్ళీ నాన్న షాప్ నడిపించి, దాన్ని అభివృద్ధిలోకి తీసుకు రావాలి. "
అప్పుడే బాధ్యతలు గురించి ఆలోచించేస్తున్నాను. నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. ఈ మార్పు ఇంత త్వరగా నాలో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ఇప్పుడు నేను మారక పోతే ఈ జన్మ దండగని అనిపిస్తుంది.
"మరి ప్రేమ?. " లోలోపల అంతరంగం ప్రశ్నలు కురిపిస్తుంది.
"మరి అమ్మకు ఇచ్చిన మాటో?. " బాధ్యత నా గమ్యం గురించి గుర్తుచేస్తుంది.
స్పష్టమైన ఆలోచనతో ముందు నా కుటుంబం బాగుపడిన తర్వాత, నా ప్రేమ గురించి ఆలోచిస్తాను. ఆకాశ్ అడిగితే అదే చెప్తాను ఒక దృఢ నిశ్చయానికి వచ్చాను.
ఆకాశ్ వదిలి వెళ్ళిపోతే? మళ్ళీ కల్లోల ప్రశ్న చెల రేగింది.
ఏముంది ఆకాశం మంచి కోరుకునే కడలి లా, ఆకాశం తో కలవని కడలి లా, మంచి స్నేహంగా ఉండి పోవడమే. నా అంతరంగం లో చెలరేగిన కల్లోలంను అణచివేస్తూ నా మనసు ప్రశాంతంగా సమాధానం ఇస్తుంది.
మరి మూత బడిన ఆ షాప్ ను నడపగలవా? నాలో సందిగ్ధత నన్ను ఆపేందుకు ప్రయత్నిస్తుంది.
అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి, "అతను మారుతాడన్న ఆశ తో జీవిస్తున్నాను. " ఘంటా పదంగా నా మదిలో మారుమ్రోగుతున్నాయి.
'అవును అమ్మ లానే నేను కూడా చేయగలనన్న ఆశతో ఈ పని ప్రారంభిస్తాను. ' దృఢ సంకల్పం తో అక్కడ నుండి లేచాను.
***సమాప్తం****
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.
Comments