నవదుర్గ రూపాల ఆంతర్యం
- Rayala Sreeramachandrakumar
- Sep 26
- 6 min read
#RCKumar #శ్రీరామచంద్రకుమార్, #నవదుర్గరూపాలఆంతర్యం, #TeluguDevotionalArticle
దేవీశరన్నవరాత్రుల్లో నవదుర్గ రూపాల ఆంతర్యం
Navadurgala Rupala Antharyam - New Telugu Article Written By R C Kumar
Published In manatelugukathalu.com On 26/09/2025
నవదుర్గ రూపాల ఆంతర్యం - తెలుగు వ్యాసం
రచన: ఆర్ సి కుమార్
దేవి అంటే దీవించి చైతన్యాన్ని కలగజేసే దేవత. దైవం నుంచి వచ్చిందే దేవి అనే పదం. శరదృతువులో వచ్చే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అంటారు. ఇక పగలు కూడా పూజలు చేస్తాం కదా! తొమ్మిది రోజులు అనకుండా తొమ్మిది రాత్రులు అనే మాట ఎందుకు వచ్చిందంటే రాత్రి చీకటి, అజ్ఞానానికి చిహ్నం. మనలో ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపి చైతన్యాన్ని నింపగల శక్తి దుర్గామాతకు ఉంది కాబట్టి ప్రతీకాత్మకంగా నవరాత్రుల పేరుతో పండుగ జరుపుకుంటున్నాం.
ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క పేరుతో, వివిధ రంగుల్లో వస్త్రాలు, పుష్పాలు సమర్పించి అమ్మవారిని కొలుచుకునే ఆచారం అనాదిగా కొనసాగుతోంది. పేర్లు, అలంకరణలు ఏవైనా అన్నీ దుర్గామాత రూపాలే. లోకంలో ఏది కదలాలన్నా శక్తి కావాలి. శక్తి స్వరూపిణి అయిన అమ్మ వారి ద్వారానే అది కలుగుతుంది. అంతర్గత చైతన్యమే శక్తి, అందరికీ ఆ శక్తిని ప్రసాదించే దుర్గామాత తొమ్మిది స్వరూపాల గురించి తెలుసుకుందాం.
తొమ్మిది రోజుల్లో తొమ్మిది శక్తులతో తొమ్మిది రూపాలు :
------------------------------------------------------------------------------
మొదటి రోజు దర్శనమిచ్చే బాలా త్రిపుర సుందరి, శైలజ, శైలపుత్రి రూపాలు భక్తులలో ఆత్మవిశ్వాసం, ప్రేమ నింపుతూ సానుకూల శక్తిని కలిగిస్తాయి. బాలత్వం స్వచ్ఛమైనది కల్మషం లేనిది, త్రిపురాలు అనే మూడు లోకాలకు సుందరి అంటే చైతన్యాన్ని ఇచ్చే దేవి కాబట్టి బాలా త్రిపుర సుందరి గాను, శైలపుత్రి లేక శైలజ అంటే హిమాలయ పర్వతాల స్వరూపమైన హిమవంతరాజు కుమార్తె పార్వతి దేవిగా గుర్తించాలి. చల్లని పర్వతాల కుమార్తె అయిన ఆ తల్లి మనల్ని చల్లగా చూడమని శైలపుత్రిని ప్రార్ధించాలి. సతీ దేవి యొక్క పునర్జన్మగా పార్వతి దేవిని భావిస్తారు. ఆమె కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో తామర పువ్వు ధరించి ఉంటుంది. అమ్మవారికి నైవేద్యంగా మొదటి రోజు క్షీరాన్నం సమర్పిస్తారు. ఈ రోజు కుమారి పూజ అని కూడా చేస్తారు.
రెండవ రోజు బ్రహ్మచారిణిగా, గాయత్రి దేవిగా పూజలు అందుకుంటుంది. ఉత్తర భారతంలో ఆమెను సన్యాసినిగా భావించి పూజిస్తారు. బ్రహ్మచారిణి మాత తపస్విని రూపంలో ఉంటుంది. గాయత్రీ దేవిని వేదమాతగా భావించి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు. ఈ రూపం శాంతి, సంయమనానికి చిహ్నం. కుడి చేతిలో రుద్రాక్షలతో చేసిన జపమాల, ఎడమ చేతిలో కమండలాన్ని పట్టుకున్న స్త్రీ దేవతగా కనబడుతుంది. గాయత్రీ దేవి వేద స్వరూపిణిగా, వేదమాతగా రక్షణ కల్పించే దేవి. గాయత్రీ దేవి అలంకారంలో అమ్మ వారిని పూజిస్తే చతుర్వేద పారాయణ ఫలితం కలుగుతుంది. ఆరోజు గాయత్రీ కవచం చదవడం అత్యంత ఫలవంతం.
మూడవ రోజు ప్రాణకోటికి ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి రూపంలో, ఆత్మవిశ్వాసాన్ని ప్రేరణను కలిగించే చంద్రఘంట రూపంలో భక్తులు పూజంచి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు. "అన్నం" అంటే ఆహారం, "పూర్ణ" అంటే నిండుగా "ఈశ్వరి" అంటే తల్లి కాబట్టి అన్నపూర్ణేశ్వరి అనే పేరుతో సమస్త లోకాలకు అన్నం పెట్టే తల్లిగా భావిస్తారు. అందుకే ఎవరైతే అన్నదానం చేశారో వారిని అన్నపూర్ణలా కడుపునిండా అన్నం పెట్టావు అని పొగుడుతారు. ఈమె కీర్తనలో "భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ" అనే పంక్తి చాలా ప్రసిద్ధి చెందింది. ప్రజలకు ఆహార భిక్ష పెట్టే దయామయిగా చేసే స్తోత్రం అది. కొన్ని ప్రాంతాలలో చంద్రఘంటా దేవిగా కూడా మూడవ రోజు పూజిస్తారు. ఆ దేవి శిరస్సున అర్ధచంద్రుడు ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. ధైర్యానికి, తేజస్సుకూ ప్రతీకగా భావించే ఈ దేవత, తన తేజస్సుతో భక్తుల పాపాలు, భయాలు, రోగాలను దూరం చేస్తుందని నమ్మకం. రాక్షసులతో యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఆమెను రణచండి అని కూడా పిలుస్తారు.
నాల్గవ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, కూష్మాండ దేవిగా పూజలు అందుకుంటారు. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ రూపంలో అమ్మవారిని కొలుచుకుంటే పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి. శాంతి, స్థిరత్వానికి చిహ్నంగా మనల్ని ఆధ్యాత్మికత వైపు ఆకర్షించే రూపం అది. కూరగాయలు, పప్పు, బియ్యం, ఇతర పదార్థాలతో చేసిన కదంబం ప్రసాదంగా నివేదిస్తారు. కూష్మాండంలో ఉష్మ అంటే శక్తి మరియు అండం అంటే విశ్వ గోళం. కూష్మాండ మాత విశ్వాన్ని సృష్టించి శక్తిని నింపిన అమ్మవారుగా పరిగణిస్తారు. సంస్కృతంలో కూష్మాండం అంటే గుమ్మడికాయ అని కూడా అర్థం. నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆశ్వీయుజ శుద్ధ చవితి నాడు కూష్మాండ దానం చేసి, కూష్మాండ దీపాన్ని వెలిగించడం ద్వారా సంపద, శ్రేయస్సు మరియు ఆనందం లభిస్తాయని భక్తుల విశ్వాసం.
ఐదవ రోజు స్కందమాతగా, చండీ దేవిగా, సరస్వతి దేవిగానూ అమ్మవారి ఎర్రని పూలతో పూజిస్తారు. చింతపండు పులిహోర, రవ్వ కేసరి వంటి నైవేద్యాలను ఆరోజున సమర్పిస్తారు. ఆమె ఒక చేతిలో కమలాన్ని, మరో చేతిలో కమల కలశాన్ని, ఇంకో చేతిలో ఘంటను పట్టుకుని ఉంటుంది. మరో చేయి అభయముద్రలో ఉంటుంది. తన ఒడిలో స్కందుడు (కుమారస్వామి) కూర్చుని ఉంటాడు. ఆమెను పూజించడం వల్ల భక్తులకు సంతానం, సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. అమ్మవారు శ్రీ చండీ దేవిగా, కొన్ని ప్రాంతాల్లో సరస్వతి దేవిగా కూడా దర్శనమిస్తారు. లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీ దేవీ అవతారం. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు కూడా ఇదే. సరస్వతి దేవి బ్రహ్మ చైతన్య స్వరూపిణి. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయి.
ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మి మరియు కాత్యాయనిగా ఆధ్యాత్మిక తేజస్సుతో దర్శనమిచ్చే దేవిని మందార పూలతో పూజిస్తారు. కాత్యాయని మాత భక్తి, దైవ ప్రేమకు చిహ్నం. ఆమెను యోధురాలైన దుర్గాదేవిగా కూడా చిత్రీకరిస్తారు. దుర్గాదేవి యొక్క ఇతర రెండు ఉగ్ర రూపాలు భద్రకాళి మరియు చండిక. దుర్గాదేవి యొక్క ఈ రూపాన్ని అష్టభుజి అని కూడా పిలుస్తారు. ఈదేవిని విశ్వ సృష్టికి కారణమైన ఆదిపరాశక్తిగా కొలుస్తారు. ఆమె తన వాహనంగా సింహాన్ని ఎక్కి మహిషాసురుణ్ని సంహరించిన యోధురాలిగా ఆరాధింపబడుతారు. ఆ తల్లి అనుగ్రహంతో వివాహ సంబంధిత సమస్యల నుండి విముక్తి లభిస్తుందని, శత్రువులపై విజయం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా కూడా దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని లేక పూర్ణం బూరెలని సమర్పిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో ఆటంకాలను తొలగించి భక్తులకు మోక్షం ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ రోజు ఓం.. శ్రీ మహాలక్ష్మీ దేవియే నమ: అని మంత్రం చదివినా అమ్మవారు అనుగ్రహాన్ని పొందవచ్చు. అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకంతో పూజించే భక్తులు విశేష ఫలితాలని పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఏడవ రోజు కొన్ని ప్రాంతాలలో సరస్వతీ మాతగా, మరికొన్ని ప్రాంతాలలో కాళరాత్రి రూపంలో పూజించుకోవడం ఆనవాయితి. తాజాదనం, నూతనత్వానికి చిహ్నంగా భక్తులను ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడిపించే రూపాలు అవి. కాళీమాత భయాలను నాశనం చేస్తుంది. దుర్గాదేవి యొక్క అత్యంత భయానక రూపాలలో ఇది ఒకటి. ఆమెను చీకటి మరియు అజ్ఞానాన్ని నాశనం చేసే కాళికా దేవిగా కూడా పిలుస్తారు. ఆమె శరీరం నల్లని ఛాయతో, విరబోసుకున్న జుట్టుతో, నాలుగు చేతులతో కనిపిస్తుంది. ఈమె భయంకర రూపంలో ఉన్నప్పటికీ, భక్తులకు శుభ ఫలితాలనిస్తుంది, అందుకని ఆమెను 'శుభంకరి' అని కూడా అంటారు. చెడును సంహరించి శుభాలు కలిగిస్తుంది. ఇక సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు. నైవేద్యంగా దథ్ధోజనం నివేదిస్తారు.
దుర్గాష్టమి పర్వదినమైన ఎనిమిదవ రోజున దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గా దేవిగా మరియు మహాగౌరి రూపంలో పూజలు అందుకుంటారు అమ్మవారు. శుభ్రత, శాంతి, పవిత్రతకు మహా గౌరి మాత అధిష్టాన దేవత. పరమశివుని భర్తగా పొందడానికి తపస్సు చేసినపుడు నల్లబడిన ఆమె శరీరాన్ని గంగాజలంతో కడిగితే గౌరవర్ణం పొందడంతో మహాగౌరిగా పేరు వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం, ఆమె మహాశక్తి స్వరూపం. ఈ విశ్వాన్ని సృష్టించిన అత్యున్నత దేవత. దుర్గామాత యొక్క రూపం నాలుగు చేతుల దేవతగా చిత్రీకరించబడింది. ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో డమరుకాన్ని కలిగి ఉంటుంది. మిగిలిన రెండు చేతులు ఆశీర్వదించడానికి మరియు భయాలను తొలగించడానికి రూపొందించబడ్డాయి. వీటిని వరద మరియు అభయ ముద్రలు అంటారు. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.
మహర్నవమి పర్వదినమైన తొమ్మిదవ రోజు సిద్ధిధాత్రి మాత మరియు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని దర్శించుకోవచ్చు. సిద్ధి' అంటే అతీంద్రియ శక్తి అని, 'ధాత్రి' అంటే ప్రసాదించేది అని అర్థం. సిద్ధిధాత్రి మాత తత్త్వశాస్త్రాన్ని, మోక్షాన్ని అందించి సిద్ధత్వాన్ని కలుగజేస్తుంది. కమలంపై కూర్చుని, తన నాలుగు చేతుల్లో శంఖ, చక్ర, గధ, కమలం ధరించిన స్త్రీ దేవతగా చిత్రీకరించబడింది. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు నేతి పొంగలి నివేదిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారమైన రాజరాజేశ్వరీదేవి అందరికీ ఆరాధ్య దేవత. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహించే ఈ తల్లిని మహాత్రిపుర సుందరిగా, అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. యోగమూర్తిగా చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమే అధిష్టాన దేవత. ఆ రోజున లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేసుకుంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఈ రూపంలో పూజించే అమ్మవారికి లడ్డూలు, చింతపండు పులిహోర, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు.
కూష్మాండ దీపారాధన ప్రభావం
-----------------------------------------------
నవరాత్రుల్లో నాలుగవ రోజున చేసే కూష్మాండ దీపారాధన వల్ల దృష్టి దోషం, నరఘోష, శని దోషం, ఆర్థిక సమస్యలను పోగొట్టుకోవచ్చు. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, పిల్లలు మాట వినకపోవడం, సంతానం కలగక పోవడం, సంతానం వృద్ధిలోకి రాకపోవడం వంటి క్లిష్టమైన సమస్యలు ఉన్న వారు కాల భైరవ తత్వం ప్రకారం ఈ కూష్మాండ దీపారాధనతో పరిహారాన్ని చేసుకోవచ్చు. దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు. కావలసిందల్లా కేవలం భక్తి, శ్రద్ధ మాత్రమే! కూష్మాండ దీపం కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే ! ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకుని దాన్ని అడ్డంగా కోసి గింజలు, గుజ్జు తీసి లోపల ఏమి లేకుండా డొల్లగా చేసి పెట్టుకోవాలి. తరువాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండు వేసి దీపం వెలిగించి మూడుసార్లు కూష్మాండ మంత్రాన్ని జపించాలి.
|| ఓం ఐం హ్రీం క్లీం కూష్మాండాయై జగత్ ప్రసూత్యే నమః ||
ఓ కూష్మాండా దేవీ, నా చుట్టూ నేను చూసే ప్రతిదానిపై, ప్రతి ఒక్కరిపై ప్రేమను పంచే విధంగా నన్ను ఆశీర్వదించండి. ఈ శబ్దాల ద్వారా, నేను మీ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను.
దీపారాధన, కూష్మాండ మంత్ర పఠనం పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాల భైరవ అష్టకం చదవాలి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అనే ఐదు రకాల పూజా ద్రవ్యాలతో చేసే పూజని పంచోపచార పూజ అంటారు. కూష్మాండ దీపారాధన నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆశ్వీయుజ శుద్ధ చవితి నాడే కాకుండా మిగతా రోజుల్లో చేసుకోవచ్చా అంటే బహుళ అష్టమి రోజున కానీ, అమావాస్య రోజున కానీ సంకల్పం చెప్పుకొని చేసుకోవచ్చు. ఆదాయవృద్ధిని కోరుకునే వ్యాపారస్తులు, కార్పొరేట్లు అష్టమి రోజు చెయ్యాలి. పలుకుబడి, పరపతి, జనాకర్షణ కోరుకునే రాజకీయ నాయకులు కీర్తికాంక్ష కలవారు అమావాస్య రోజు చెయ్యాలి. ప్రసాదంగా ఎండు ఖర్జూరం సమర్పిస్తే మంచిది. ఏ దైవం అన్నది ప్రసక్తి కాదు దీపారాధనే దైవంగా భావించి పూజించాలి. కూష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు.
ఈ రూపాలే కాకుండా అమ్మవారు కాశీ విశాలాక్షిగా, కంచి కామాక్షిగా, మధుర మీనాక్షిగా, వైవిధ్యభరితమైన గ్రామ దేవతలుగా వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడిపిస్తుంది. "ఏకో దేవః" ఉన్నది ఒకే దైవికతత్వం. ఆదిపరాశక్తి అయిన ఆ దేవి జగన్మాతగా అనేక రూపాలలో భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉంటుంది. దేవీ నవరాత్రులలో మహిషాసుర మర్ధినిగా దర్శనమిచ్చే అమ్మవారిని "మహాశక్తయే విద్మహే శక్తిరూపేణ ధీమహి తన్నో శక్తిః ప్రచోదయాత్" అనే శ్లోకాన్ని చెప్పుకొని మహా శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లి మనందరిని ముందుకు నడిపించాలని కోరుకుంటూ పండుగ సంబరాలను ముగించుకుంటారు భక్తకోటి.
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త
Comments