top of page
Original_edited.jpg

ఇదేనా మొదటి (ప్రేమ)లేఖ..

  • Writer: Parnandi Gopala Krishna
    Parnandi Gopala Krishna
  • Sep 25
  • 5 min read

#PGopalakrishna, #Pగోపాలకృష్ణ, #IdeNaModatiPremalekha, #ఇదేనామొదటిప్రేమలేఖ, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

ree

Ide Na Modati Premalekha - New Telugu Story Written By P. Gopalakrishna

Published In manatelugukathalu.com On 25/09/2025

ఇదేనా మొదటి ప్రేమలేఖ.. - తెలుగు కథ

రచన: P. గోపాలకృష్ణ  

కథా పఠనం: A. సురేఖ

డియర్ అంబూ, 

నువ్వు ఎలా ఉన్నావు. నేను మాత్రం బాగోలేను. కారణం నీకు తెలుసుగా. ఎంతో ఇష్టపడి నిన్ను పెళ్ళిచేసుకుని, పెళ్ళైన వెంటనే సెలవు రద్దు చేసుకుని డ్యూటి కి రమ్మని ఆర్డర్ వేసినందుకు ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ ఆఫీసు కి చేరిన నాకు, తీరిగ్గా చెవిలో బడ్ పెట్టుకుని తిప్పుకుంటూ అరమోడ్పు కళ్ళతో, టైపిస్ట్ కుమారితో తన ఛాంబర్ లో సరసాలాడుతున్న మా మేనేజర్ పీనుగ కనబడ్డాడు. 


అటువంటి కుంకాక్షి ని పిచ్చి పిచ్చిగా, పచ్చిగా తిట్టాలని ఉంది. కానీ ఆదేదీ జరిగేది కాదు. వాడి వైపు చూడాలంటేనే ఆఫీసు లో ప్రతి ఒక్కరూ గజగజ వణికిపోతున్నారు. 


కొందరికైతే చలి జ్వరం వచ్చేస్తోందిట. నేను ఆఫీసు లోకి అడుగుపెట్టిన వెంటనే మేనేజర్ అక్కుపక్షి ఇలాంటివాడు అంటూ మా సహచర ఉద్యోగులు వివరంగా వర్ణించి మరీ చెప్పారు. ఆవలిస్తే పేగులు మాత్రమే కాదు, ఆ పేగుల్లో ఏముందో కూడా కళ్ళు మూసుకొని చెప్పేస్తాడుట. అలాంటి వాడి ముందు మన కుప్పిగంతులు దేనికి పనికోస్తాయి చెప్పు. 


నిన్న గాక మొన్న ఉద్యోగంలోకి వచ్చిన నేనెంత. వాడి పవర్ ముందు చిన్న చీమ లాంటివాడిని, బలహీనుణ్ని. అసలు పెళ్ళే ఒద్దుఅంటూ, మూడున్నర పదుల వయసు దాటిపోతున్న నాకు ఇంక సంబంధాలు కూడా దొరకవు అని ఫిక్స్ అయిపోయి, హాయిగా బతికేస్తూ ఉంటే, మా పంకజం అక్క మీ సంబంధం తెచ్చిందిట. పెళ్లి వద్దులే అనుకున్నాక పెళ్ళి, పెళ్ళి అంటూ నా బుర్ర తినేసి, నిన్నిచ్చి పెళ్ళి చేసి, చిద్విలాసంగా నవ్వుకుంటున్నారు అందరూ. 


నువ్వేమో మీ ఊళ్లోనే అందమైన అమ్మాయిలందరిలోకి అందమైన అమ్మాయివి. కొంచెం బొద్దుగా, భారీగా ఉంటావని తప్ప, నీలో ఏం లోపం ఉందని చెప్పు. అక్క చెప్పిన సంబంధం కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్ళినా నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేయవచ్చనుకుని అత్యాశ తో ఏరికోరి చేసుకున్న భార్యవి. ఊళ్ళో అబ్బాయిలంతా వంతులవారీగా మీ ఇంటిముందు లైన్ కట్టి నిలబడితే మీ నాన్న నలుగురు పేట రౌడీ లని పెట్టి వాళ్ళని ఎలా కొట్టించేవాడూ వివరంగా చెప్తూ ఉంటే నోరు తెరుచుకుని ఉండిపోయాను ఒకరోజు. 


పెళ్లి చూపులు అయిన మరుక్షణం నుండి అనుక్షణం నిన్నెంత తీవ్రంగా ప్రేమించానో నీకు తెలియనిది కాదు. చదువుకున్న రోజుల్లో పిచ్చి వేషాలు వేసే స్నేహితులందర్నీ చూసి, నేను వాళ్ళ లాగా ఉండాలని అనుకున్నప్పుడు ముందు డిగ్రీ పూర్తవ్వలి అని అమ్మా నాన్నా హుకుం జారీ చేసిన రోజు, అసలు ఈ చదువులు కనిపెట్టిన వాణ్ణి, తలకిందులుగా వేలాడదీసి, భూమండలం అంతా తిప్పినా తప్పుకాదనిపించింది. 


పెళ్లి చూపులయ్యాకా, నీ వెంట పడుతూ, ఉద్యోగానికి డుమ్మా కొట్టి మీ ఇంటి చుట్టూ తిరిగితే, ఆ విషయం ఇంట్లో తెలిస్తే మా అమ్మా నాన్న దగ్గర బావుండదని ఎలాగో నా ఫీలింగ్స్ నాలోనే చంపేసుకుని, బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ గడిపేశాను. 


నిన్ను చూసిన మొదటి చూపులోనే నీ ప్రేమలో పడిపోయాను, నా ఉద్యోగం మీ ఇంట్లో నీతో పాటు అందరికీ నచ్చిందని, నేను కూడా మీకు నచ్చానని తెలిసిన రోజు, ఎంత సంతోష పడిపోయానో. మా పంకజం అక్క మీ సంబంధం తెచ్చిన రోజు నాకు పెద్ద పండగలాగే అనిపించిందనుకో, నేను విమానం అక్కరలేకుండానే ఆకాశం లోకి ఎగిరి ప్రపంచమంతా చుట్టి వచ్చేసినంత ఆనంద పడిపోయి నిన్ను తల్చుకుంటూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపేశానో. పెళ్లయ్యాక, మనకి అరడజను మందికి తక్కువ కాకుండా పిల్లలు పుట్టాలని, అలా అనుకున్నవన్నీ జరిగితే, మీ నాన్నని, మా నాన్నని ప్రతి ఏడాది తిరుపతి పంపించి, గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను. 


మొన్నామధ్య నిన్ను చూద్దామని వచ్చానా, అదేదో మూఢం వచ్చింది ఇప్పుడు మొహం కూడా చూడకూడదు అంటూ ఇంట్లో బోలెడు ఆంక్షలు పెట్టారు. అక్కడికి దొంగతనంగా మీ పెరట్లోకి వచ్చి, మీ తమ్ముడు, .. అదే మీ పిన్ని కొడుకు ఆ పారపళ్ళబాచి గాడికి పదిరూపాయలిచ్చి నిన్ను పిలుచుకుని రమ్మంటే ఆ వెధవ నానా యాగీ చేశాడు. ముఖ్యంగా మీ నాయనమ్మ దగ్గరకి వెళ్ళి పారపళ్లు వేసుకొని మరీ “బావ అక్కని పెరట్లోకి రమ్మని చెప్పమన్నాడు. అక్క ఎక్కడుంది”? అని అడిగాడు. 


దాంతో మీ వాళ్ళ ముందు తలకొట్టేసినంతపనైంది. వాడి మొహం చూసినప్పుడే ఏదో ఒక ఉపద్రవం సృష్టిస్తాడని అనిపించింది. వాడేమో చిన్నపాటి సునామీ సృష్టించి, మీ నాన్న అమ్మ నన్ను పట్టుకునేలా చేశాడు. నువ్వేమో ఇంట్లోపల ఎక్కడో మహారాణీలాగా కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నావు. “పోనీలే పెళ్లైపోయింది కదా, వాళ్ళ మధ్యలో మనం ఎందుకు అడ్డంగా ఉండడం, రామా, కృష్ణా అనుకుంటూ ఏ తీర్థయాత్రలకో పోదామనే ఆలోచనలు మీ అమ్మానాన్నలకి గానీ, మీ బామ్మకి కానీ లేనట్లున్నాయి. ఈ వయసులో వాళ్ళకి ఇంట్లో పనులేమున్నాయని?”


అక్కడికీ ఎలాగో నువ్వు నన్ను కరుణించి, గుడికి వస్తే, మొదటిసారి కదా ఇద్దరం ఏకాంతం లో కలుసుకోవడం, ఆత్రంగా నీమీద చెయ్యెసిన పాపానికి గుడిలో పంతులు పేరయ్య శాస్త్రి గారు గుడిలో ఇలాంటి తుంటరి చేష్టలేంటి అంటూ ముక్క చీవాట్లు పెట్టి, పూజ చేసి, కొబ్బరిచిప్ప చేతికిచ్చారు. నువ్వేమో సిగ్గుపడి ఇంటికి పారిపోయావు. కనీసం ఇంటికి కూడా పిలవలేదు. ఖర్మరా బాబూ అనుకుంటూ చేత్తో నుదిటిమీద కొట్టుకోబోయి, ఆ చిప్పతో నుదురు పగిలిపోయేలా కొట్టేసుకున్నానా, నుదిటిమీద బూరెలా ఉబ్బిపోయి కమిలిపోయిందే. 


ఇంటికెళ్తే అమ్మ మందురాస్తూ ఒక్కటే నవ్వు. నాకు పరువు పోయిందనుకో. నాన్న పదేపదే అడుగుతున్నారు ఏమైందని. ఏం చెప్పాలో అర్థం కాలేదు. “వీధిలో కుక్క తరుముతూ ఉంటే పరిగెడుతూ రాయి తన్నుకొని పడిపోతే నుదుటికి రాయి తగిలి బొప్పి కట్టింది” అంటూ అమ్మ కట్టుకథ అల్లి మరీ చెప్పింది. అదే ఇప్పుడు ఊరంతా ప్రచారమైందే. వీధిలోకి వెళ్తే మా పక్కింట్లో ఉన్న కుమారి అదోలా చూసి, ఫక్కున మొహమ్మీదే నవ్వింది. కుమారి నీకు తెలుసు కదా! సన్నగా నల్లగా బక్కగా ఉండి పారపళ్ళతో చూడగానే భయపడేలా ఉంటుంది కదా ఆ అమ్మాయ్ అన్నమాట. 


తనకి నేనంటే పిచ్చి ప్రేమ. కానీ మా జాతకాలు కలవలేదని పెద్దలు చెప్పినప్పుడు నేను పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తే, నాకు పిచ్చి పట్టిందని మా వాళ్ళంతా తేల్చేసి, భూతవైద్యుణ్ణి పిలిచి పూజలు చేయించారు. అసలు విషయం ఏంటంటే, నాకు తనంటే అసలు ఇష్టమే లేదు. అందుకే జాతకాలు చూసిన సుబ్బారావు పంతులుగారు, జాతకాలు అద్భుతంగా కలిసాయని నన్ను పిలిచి చెప్పినప్పుడు, జాతకాలు కుదరలేదని చెప్పమని ఆయన్ని లంచంతో కొట్టి కుమారి సంబంధం కాన్సెల్ చేయించుకున్నాను. 


కుదరక కుదరక నీతో పెళ్లి కుదిరాక తీరిగ్గా వాళ్ళమ్మాయిని చేసుకోమని కుమారి వాళ్ళమ్మా నాన్నా మా ఇంటికి వచ్చిన రోజు నాకు చాలా కోపం వచ్చింది. నేను ఇన్ని సాహసాలు నీకోసమే కదా చేసింది. మరి నువ్వేమో నాకోసం ఏంచేసావు చెప్పు. ఇప్పుడేమో మళ్ళీ ఆషాఢమాసం అంటూ నిన్ను కాపురానికి రానివ్వకుండా విలన్ల లాగా అందరూ అడ్డుపడుతున్నారు. 


“అంబూ డార్లింగ్, నీకు ముందే చెప్పాను కదా, నాకు వండుకోడం చేతకాదని”. మొన్నటిదాకా హోటల్ లో తిని నాలుక రుచులని మరిచిపోయింది. ఆ వెంకటరావు మెస్ లో భోజనం చేసి, ఏ పదార్ధం రుచి ఎలా ఉంటుందో అసలు కూరకి పచ్చడికీ తేడా ఏంటో, సాంబారు కి పులుసుకి తేడా ఎలా ఉంటుందో కూడా మరిచిపోయి చాలా కాలం అయ్యింది. 


హాయిగా ఇంటికొచ్చి పెళ్లికోసం ఉన్న కొన్ని రోజుల్లో అమ్మా, బామ్మా వండిన వంటలు తిన్నాకా హమ్మయ్య అనుకున్నా. సెలవు లో ఉన్న ఆ పదిరోజులు చక్కగా నవకాయ పిండి వంటలతో వండి పెడుతూ ఉంటే, పది కిలోల బరువు కూడా పెరిగాను. ఇప్పుడేమో పెళ్ళయ్యి మూడు నెలలు అయినప్పటికీ కనీసం నీ మొహం చూడకుండా చేసేశారు అందరూ కలిసి. 


నీకు వంట బాగా నేర్పించారని మీ అమ్మ చెప్పినప్పుడు అప్పటికప్పుడు ఎగిరి గంతేసి, నిన్ను ముద్దుల్లో ముంచెత్తి, ఇంటికి తెచ్చుకొని, చక్కగా వంటలు చేయించుకుని తిందామని అనుకున్నానా ! అసలు నా ఆశలు నెరవేరుతాయో లేదో కూడా తెలీకుండా పోయింది. ఇప్పుడు మూడు నెలలవరకూ ముహూర్తాలు లేవుట. నిన్ను కాపురానికి పంపించే ఉద్దేశం కూడా ఇంకా లేదని మీ అమ్మ చెప్తూ ఉంటే, ఒళ్ళుమండిపోతోంది. 


అంబూ, ఇంక నేను ఎక్కువకాలం బ్రహ్మచర్యం గడపలేను. నువ్వే ఎలాగో ఒకలాగా మీ అమ్మా నాన్నలకి చెప్పి, ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టు. ఒక్కణ్ణే ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా పెళ్లయ్యాక చెయ్యి కాల్చుకుంటూ ఆఫీసు కి వెళ్ళి ఆ మేనేజర్ కుంకాక్షిని చూస్తూ భయపడుతూ పనిచేయడం ఎంత నరకమో ఆలోచించు. 


మనిద్దరిని కలిపిన మా పంకజం అక్కని కూడా అడిగాను, ఎలాగైనా నిన్ను కాపురానికి పంపేలా చేయమని, తనకి కమిషన్ తో కొడితే పనవుతుందని అనుకున్నానా, కమిషన్ కొట్టేసి, సారీ రా తమ్ముడు అనేసింది. ఇంక దైవ ప్రయత్నం లాభం లేదు. మానవ ప్రయత్నం, అదీ మన ప్రయత్నమే మిగిలింది. 


నువ్వు ఒకపని చెయ్యి. ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది నేను వూరెళుతున్నాను అని చెప్పి వైజాగ్ వచ్చేయ్. అక్కడే మనం హాయిగా శోభనం చేసేసుకుందాం. ఈ లెటర్ చదివేశాక చింపి పారేయడం మరిచిపోకు. చిన్న చిన్న ముక్కలుగా చింపేయ్. వీలైతే కాల్చి పారేయ్, లేకపోతే.. అదే.. ఆ పారపళ్ళ బాచీగాడు ఆ ముక్కలు అన్నీ అతికించి మరీ ఊరందరికీ వినిపించేలా, ఏ మైకు లోనో ఈ ఉత్తరం చదివి వినిపిస్తాడు. 


ఏంటో ఈ మధ్య నేను భయపడే లిస్ట్ లో బల్లులు, బొద్దింకలు, పాములు లాంటి వాటి పక్కన బాచీ గాడికి కూడా చోటు ఇవ్వాలనిపిస్తోంది. 


నోట్ : డియర్ అంబూ, ఎక్కడా నా ప్రస్తావన తీసుకురాకుండా నువ్వు ఏదో ఒకటి చెప్పి, రేపు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి ఇంట్లో బయల్దేరు. నీకోసం వైజాగ్ కాంప్లెక్స్ లో ఎదురుచూస్తూ ఉంటాను.


ఇట్లు.. నీ గణపతి. 


***

P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ P. గోపాలకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కి text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/gopalakrishna 

యూట్యూబ్ ప్లే లిస్ట్ లింక్:

నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న ఆరవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page