top of page
Original_edited.jpg

ప్రేమ తీరాలు - పార్ట్ 7

Updated: Sep 30

#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries

ree

Prema Theeralu - Part 7 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 25/09/2025

ప్రేమ తీరాలు - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు. పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది. లలిత గర్భవతి అవుతుంది. పండంటి బాబుకు జన్మనిస్తుంది. కరుణాకర్ రాధను వివాహం చేసుకుంటాడు. వివాహం తరువాత కరుణాకర్, చెల్లెలు లలితల మధ్య దూరం పెరుగుతుంది. ఫణికి అనారోగ్యంగా ఉండటంతో హాస్పిటల్ కు తీసుకొని వెళ్తుంది లలిత. ఫణికి బ్రెయిన్ ట్యూమర్ ఉందనీ ఆపరేషన్ కు ఇరవై లక్షల దాకా అవుతుందనీ చెబుతారు డాక్టర్లు. సహాయం కోసం అన్న కరుణాకర్ దగ్గరకు వెళ్లిన లలితను వదిన రాధ అవమానిస్తుంది. 


ఇక ప్రేమ తీరాలు పార్ట్ 7 చదవండి. 


ఐసీయులో ఉన్న భర్తను చూసింది. కళ్ళుమూసుకుని ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. బయట జరిగే వాటితో నాకేమాత్రం సంబంధలేదన్నట్టుగా. 


‘అవును ఫణి.. నీకేం.. నువ్వు హాయిగా ఉన్నావు. నిన్ను బ్రతికించుకోవడం కోసం నేను ఎంత బాధపడుతున్నానో నీకు అర్ధంకాదు. మనం పెద్దగా ఉన్నవాళ్ళం కాదు. డబ్బులు కుప్పలు కుప్పలు రావడానికి.


నీకు వచ్చిందేమో పెద్ద జబ్బు. ఎలా ఈ గండం నుండి బయటపడతామో నాకు తోచడంలేదు ఫణి..’ 


మనసులో వేదనపడుతూ డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. 


“రామ్మా లలిత.. ఇప్పుడు మీ వారు మా ట్రీట్ మెంట్ కు బాగా సహకరిస్తున్నారు, రెండురోజుల్లో డిశ్చార్జి చేద్దామనుకుంటున్నాము. మేము రాసిన మందులు వాడండి. ఇంతకు ఆపరేషన్ గురించి ఏమనుకున్నావు.. డబ్బులు సమకూరాయా, మళ్ళీ అతనికి ఇబ్బంది రాక ముందే సర్జరీ చేసుకోవడం మంచిది. తొందరగా నిర్ణయం చేసుకుని అతన్ని తీసుకరండి, ” చెప్పాడు డాక్టర్. 


“థాంక్యూ డాక్టర్. చాలా మంచివార్త చెప్పారు. నేను డబ్బులకోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను. కానీ అనుకున్నంత తొందరగా దొరకవు కదా డాక్టర్, మా బాధలు ఎదుటి వాడికి ఎలా తెలుస్తుంది చెప్పండి. మాకు కొంచెం సమయమిచ్చారు కాబట్టి నేను గట్టి ప్రయత్నం చేసి తొందరలోనే ఆయనను ఆపరేషన్ కు సిద్ధం చేస్తాను.

వస్తాను డాక్టర్” 


డాక్టర్ చెప్పిన మాటలు మనసుకు కొంత తృప్తి నివ్వడంతో ఇంటికి వెళ్ళింది లలిత. 


“అమ్మ వచ్చింది.. అమ్మా.. నాన్నకు ఎలా ఉందమ్మా.. ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు,” తల్లిని చూడగానే గబుక్కున వచ్చి తల్లిని పట్టుకుని అడిగాడు కపర్ధి. 


“బాబు .. రెండురోజుల్లో మీ నాన్న వస్తున్నారు బాబు, ఇదిగో ఇప్పుడే డాక్టర్ తో మాట్లాడి వస్తున్నాను. సరేనా. రా మనింటికి వెళదాము. పిన్ని.. ఆయనను రెండురోజుల్లో డిశ్చార్జి చేస్తున్నారట. ఇప్పుడు బాగానే ఉన్నారని చెప్పారు. కాకపోతే మళ్ళి ఇలాంటి ఇబ్బంది రాకముందే ఆపరేషన్ చేయించుకోవడం చాలా మంచిదని చెప్పారు. నేను డబ్బులు సమకూర్చుకోవడమే ఆలస్యం అన్నాడు డాక్టర్. వస్తాను పిన్ని, ” బాబును తీసుకుని బయలదేరుతుంటే. 


“లలిత.. ఆగమ్మా. ఎక్కడికి వెళుతున్నావు.. పొద్దుటనగా వెళ్ళావు. ఏం తిన్నావో ఏంటో తెలియదు, నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రా. వేడి వేడిగా చపాతీలు చేసాను. తిని అప్పుడు వెళుదువుగాని పదమ్మా, ” కన్నతల్లిగా పిలుస్తూ అంది సావిత్రమ్మ. 


“అలాగే పిన్ని .. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, నిజానికి పొద్దుటినుండి మంచినీళ్లు కూడా తాగలేదు పిన్ని. మిమ్మల్ని అడగడానికి మొహమాటమేసి అడగలేకపోయాను.” అంటూ కాళ్ళు కడుక్కుని వచ్చి తింటూ చెప్పింది. 


“ఏంటమ్మా నువ్వు.. నాదగ్గర మొహమాటమెందుకు.. నేను నీ తల్లి లాంటిదానివన్నావు. అది చాలదా నాకు. కూతురు బాధను పంచుకునే తల్లినమ్మా. నీకు ఏది కావాలన్నా

నా దగ్గర సంకోచం లేకుండా ఉండు. సరే ఇంతకు.. మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళావు కదా. ఏమన్నాడు.. డబ్బులు సహాయం చేస్తానన్నాడా చెప్పమ్మా, ” అడిగింది సావిత్రమ్మ. 


“వద్దులే పిన్ని .. ఏ రక్తసంబంధం లేని నువ్వు నాకోసం ఇంత తాపత్రయపడుతున్నావు. స్వంత తోబుట్టువయి ఉండి ఆదుకోలేని స్థితిలో ఉన్నాడు పిన్ని. అన్నయ్యకు గుండెలు

పగిలిపోతున్నా ఏమి చెయ్యలేడు. ఎందుకంటే తను నాకోసం వస్తే నేను తన ముఖం ఈ జన్మలో చూడనని చెప్పి వచ్చాను పిన్ని, ” కరుణాకర్ వాళ్ళింట్లో జరిగింది చెప్పింది. 


“అయ్యో లలిత.. తప్పు చేసావేమో. ముందు ఫణికి ఆపరేషన్ ముఖ్యం కదా, తరువాత మీ వదిన గురించి ఆలోచించాల్సింది. ఇప్పుడెవరు వస్తారమ్మా నీకు తోడు, ఇలా బెదిరించే వాళ్ళు ఏం చెయ్యలేరు. ఏదో సామెత చెప్పినట్టు ‘మొరిగే కుక్క కరవదు కరిచే కుక్క మొరగదని’ ఇలాంటి వాటికి భయపడకూడదు. ఏం చేస్తుంది మహా అయితే.. అలిగి తల్లి దగ్గరకు పోతుంది. కొన్నాళ్ళు మీ అన్న పట్టుదలగా ఉంటే తనే తిరిగి వస్తుంది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మీ అన్నయ్యకు ఫోన్ చేసి రమ్మని చెప్పు, ” అంది. 


“లేదు పిన్ని .. నా వలన మా అన్నయ్య వదిన విడిపోవడం ఇష్టంలేదు, నా భర్తను ఎలాగైనా నేను కాపాడుకోగలను. మా ఊర్లో పొలం ఉంది. అది అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఈయన ఇంటికి వస్తున్నారు కదా! ఊరికి వెళ్ళి ఆ ప్రయత్నం చేసుకుని వస్తాము. ఈలోపల మా అన్నయ్యతో గొడవపడి వదిన వెళ్ళిపోతే జీవితాంతం ఒంటరి జీవితం గడపాలి. ఒకసారి వెళ్ళిపోయాక మళ్ళి కలవడం అనేది జరగదు. ఏ తోడులేకుండా అన్నయ్యను చూడలేను పిన్ని. అందుకే అలా చెప్పాను, ” అంది. 


“పోనిలే లలిత.. నువ్వన్నట్టుగా మీ వారు ఇంటికి వస్తున్నారు సంతోషం. తొందరగా మీ ఊరికెళ్ళి ఆ పొలం పని చూసుకుని రండి. కావాలంటే నా మనవడిని నా దగ్గర వదిలేసి వెళ్ళండి. నేను చూసుకుంటాను, ” నవ్వుతూ అంది. 


“అయ్యో ఎంతమాట పిన్ని.. నీ మనవడిని నీ దగ్గరనే ఉంచి వెళతాను. సరే వెళ్ళివస్తాను. రారా బాబు, ” నవ్వుతూ పిలిచింది కొడుకును. ఆ రాత్రి ప్రశాంతంగా నిదురబోయింది లలిత ఇంటికి రాబోయే తన భర్త గురించి ఆలోచిస్తూ. 

***


“ఏమండి, మెల్లిగా నడవండి. ఇలా.. ఆ.. ఆ.. నా భుజం పట్టుకోండి, ” హాస్పిటల్ నుండి భర్తను డిశ్చార్జి చేయించుకుని ఇంటికి వచ్చింది. చాలా నీరసంగా ఉన్నాడు ఫణి. మెత్తగా అన్నం చారు కలిపి తినిపించింది. అన్నం తిన్న తరువాత కొంచెం తేలికగా ఉన్నట్టు అనిపించాడు ఫణి. టయానికి మందులు పళ్ళరసాలు ఇస్తూ చిన్నపిల్లాడిని చూసినట్టు చూసుకోసాగింది. ఫణి బాబును దగ్గరకు తీసుకుని కంట తడి పెట్టుకున్నాడు. 


“లలిత .. నిజంగా నేను ఇంటికి తిరిగి వస్తా అనుకోలేదు. చాలా భయం వేసింది, ” లలిత చేతిని చేతిలోకి తీసుకుని అన్నాడు. 


“మీరే కాదు, నేను చాలా భయపడిపోయాను. మీ గురించి డాక్టర్ చెప్పగానే నా పై ప్రాణాలు పైనే పోయాయనిపించింది. ఏ దేవుడి దయ వల్లనో మీకు ఏం కాలేదు. మనం తొందరలోనే ఆపరేషన్ చేయించుకుందాము. మీకేం కాదు. మన బాబు అదృష్టవంతుడు,” అంది అతని చేతిని ప్రేమగా నోటి దగ్గర ఉంచుకుని. 


“లలిత.. ఆ ఫోన్ ఇటివ్వు. మా మేనేజర్ కిరణ్ కు ఫోన్ చేస్తాను. కొన్నాళ్ళు సెలవులు కావాలని చెబుతాను. అతను చాలా మంచివాడు. డబ్బు సహాయం కూడా చేస్తాడు. నా ఆపరేషన్ గురించి చెబుతాను, ” 


“ఇదిగోండి .. అప్పుగా అడగండి. మెల్లిగా తీర్చుకుందాము. లేదంటే మీకిచ్చే జీతంలో పట్టుకున్నా సరేనని చెప్పండి. కాదు కూడదంటే మన పొలం అమ్మగానే ఇస్తామని చెప్పండి. ఏమండి.. మీకు ఓపిక ఉంటే ఒకసారి ఊరికి వెళ్ళి వద్దాము. అత్తయ్య మామయ్య పోయినప్పటినుండి ఒక్కసారి కూడా వెళ్ళి మన ఇల్లు పొలం చూసుకోనేలేదు. 


మామయ్య ఎంతగానో భయపడ్డారు ఉన్న పొలం వాళ్ళు ఆక్రమిస్తారేమోనని. ఇప్పుడేం చేసారో తెలియదు. మనకు అవసరం కాబట్టి వెళ్ళి ప్రయత్నం చేస్తే తప్పులేదు కదా.


 పైగా మన ఆస్తి మనకు పనికొచ్చిందంటే పైనున్న మామయ్య ఆత్మ తృప్తిపడుతుంది, ” గుర్తుచేసింది. 


“నువ్వు చెప్పింది నిజమే లలిత.. మా పెదనాన్న వాళ్ళు ఏం చేసారో ఏంటో, నేను చాలా తప్పు చేసాను. మధ్యలో వెళ్ళి ఆ పొలం ఇల్లు నా పేరు మీద చేయించుకుంటే అయిపోయేది. ఇప్పటికైనా నష్టమేమిలేదులే. మీ అన్నయ్యను తోడు తీసుకుని వెళదాము, ” అన్నాడు. కరుణాకర్ విషయం రాగానే గమ్మున ఉండిపోయింది లలిత. భర్తకు చెప్పి మనసు పెట్టకూడదనుకుంది. 


“హలో సర్. నేను ఫణిని మాట్లాడుతున్నాను. నాకు కొన్ని రోజులు సెలవులు కావాలి. నేను సర్జరీ చేయించుకోవాలి, ” 


“హలో ఫణి.. ఇప్పుడెలా ఉన్నావు ? నాకు తెలిసింది నువ్వు హాస్పిటల్ ఉన్నావని. ఆదివారం రోజు నిన్ను చూడడానికి వద్దామనుకున్నాను. ఎప్పుడు సర్జరీ చేస్తున్నారు, ” అడిగాడు మేనేజర్ కిరణ్. 


“నేను డిశ్చార్జీ అయి ఇంటికి వచ్చాను. మీరు ఇబ్బందిపడి రాకండి. నేనిప్పుడుబాగానే ఉన్నాను. అది.. అది.. నాకు మీరు కొంచెం సహాయం చెయ్యాలి. సర్జరీ చెయ్యాలంటే ఇరవై లక్షలు అడుగుతున్నారు. అంత డబ్బు ఉన్న పళంగా కావాలంటే కష్టంగా ఉంది. అందుకని మంచి మనసుతో మీరు సహాయం చేస్తే మీ ఋణం ఉంచుకోను. నాజీతంలో పట్టుకున్నా సరే లేదంటే మా పొలం అమ్మి మీకు అప్పు తీర్చేస్తాను. మీరు కాదనరనే నమ్మకంతో అడుగుతున్నాను సర్, ” అడిగాడు ఫణి. 


“బలేవాడివి ఫణి .. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోకపోతే ఎందుకు చెప్పు నా సంపాదన, 

అందులో మన ఆఫీసులో పని చేస్తున్నవాడివి నీకు మొహమాటమేంటి, నేను రేపు మీ ఇంటికి వస్తాను. వచ్చాక అన్ని మాట్లాడుకుందాము సరేనా, ” నవ్వుతూ అన్నాడు కిరణ్. 


“చూసావా.. ఎంత మంచివాడు కిరణ్.. స్వంత కంపెనీ. కోట్లకు పడగలెత్తినవాడు, ఒక్కడే కొడుకు వాళ్ళమ్మా నాన్నలకు. అయినా ఇంత గర్వంలేదు మనిషికి. మా కంపెనీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇలాగే సహాయం చేస్తాడు, రేపు మనింటికి వస్తున్నాడట. 

అతనికి నువ్వు చేసే బొబ్బట్లంటే చాలా ఇష్టం. అని చేసి రడీగా పెడతావా లలిత, ” భార్యవైపు తదేకంగా చూస్తూ అడిగాడు. 


“ఏంటండి అలా చూస్తున్నారు.. మీరు చెప్పాక చెయ్యనేంటి.. అలాగే చేస్తాను. ఆ డబ్బులు రాగానే డాక్టర్ తో మాట్లాడుదామండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆపరేషన్ చేయించుకుందాము, ” 


తండ్రి గుండెలమీద తలపెట్టుకుని పడుకున్న కొడుకును ఎత్తుకుని పక్కకు పడుకోబెడుతూ అంది. 


“నువ్వు చాలా చిక్కిపోయినట్టు కనిపిస్తుంటే అలాగే చూస్తున్నాను. ఈవారం రోజులు చాలా హైరానా పడినట్టున్నావు కదూ.. నీ ముఖం చూడు ఎంతలా పీక్కుపోయిందో, ” 


“మరి హైరానా కాక ఏముంటుందండి. ఏనాడు ఒక జ్వరం మాత్ర కూడా వేసుకోని మీకు ఇలా కావడంతో ఎంతగా భయపడి పోయాననుకున్నారు.. పాపం పక్కింటి పిన్ని

సహాయం లేకపోతే నా పరిస్థితి ఎలాగుండేదో, ఏ జన్మ బంధమో మనతో తనకు. కడుపున పుట్టిన పిల్లలు పట్టించుకోకపోయినా ఒంటరిగా ఉంటుంది మనకోసమేనేమో”

అంది భర్తకు మందులు వేస్తూ. 

***


“హలో ఫణి .. ఎలా ఉన్నావు.. ఏంటి ఇంత సడెన్ గా ఇలా అయిపోయింది, ” ఫణి పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటూ అడిగాడు కిరణ్. 


“హలో సార్ కూర్చొండి, ” అంటూ “లలిత.. మా సార్ వచ్చాడు మంచి కాఫీ తీసుకురా, ” లోపల ఉన్న లలితకు పురమాయించాడు. 


“ఫణి .. ఇది ఆఫీసుకాదు కదా. నువ్వు నన్ను సార్ అని పిలవకు. చక్కగా కిరణ్ అను చాలు. నాకు అలా అంటుంటే ఏవో కొమ్ములు నెత్తిన పెట్టుకున్నట్టుంటుంది, ” గొల్లున నవ్వుతూ చెప్పాడు. 


“కానీ మీరు మా బాస్ .. అలా పిలవక పేరు పెట్టి పిలిస్తే పొరబాటున ఆఫీసులో కూడా అలా పిలిచాననుకోండి.. మీకు ఎంత చిన్నతనం చెప్పండి. మీరు చెప్పడం వరకు సరే కానీ మా పద్ధతిలో మేముండాలి కదా సార్, ” అన్నాడు తను కూడా కిరణ్ నవ్వుతో శృతి కలుపుతూ. 


“అదిగో మళ్ళి అదే పిలుపు. పర్వాలేదు ఫణి.. నువ్వేం బాధపడకు. నువ్వెలా పిలిచినా పలుకుతాను, ” అంటూ లలిత తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ లలితను తెరపార చూసాడు. 


“నమస్కారం సార్ బాగున్నారా, ” అడిగింది. 


తలపట్టుకుని. “ ఏంటమ్మా నువ్వు కూడా సార్ అని పిలవడం.. చక్కగా పేరు పెట్టి పిలవచ్చు కదా, ” అన్నాడు లలితతో. మౌనంగా ఉండిపోయింది లలిత. 


“ఆ ఇప్పుడు చెప్పు.. నీ ఆపరేషన్ కు ఎంత డబ్బు కావాలి.. నువ్వు హాస్పిటల్‌లో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు,” కాఫీ తాగుతూ అడిగాడు ఒకవైపు లలితను చూస్తూ. 


లలితకు అక్కడ కూర్చోవడం ఇబ్బందిగా అనిపించినా తప్పదన్నట్టు కూర్చుంది. అవసరం తమది. కిరణ్ ఎప్పుడు చూసిన తనను తినేట్టు చూస్తాడు. ఏమిటో ఆ మనిషి..

అనుకుని అందుకే మౌనంగా ఉంటుంది. 


“మన చేతిలో డబ్బుండాలిగానీ ఈపాటికి సర్జరీ చేసి ఇంటికి పంపించేవారు, నేను సడెన్ గా హాస్పిటల్ వెళ్ళడం లలితకు ఏం చెయ్యాలో డబ్బు ఎక్కడినుండి తేవాలో తెలియక చాలా కంగారుపడిపోయింది, ”


“అదేంటి లలిత .. నేనున్నానుగా నాకు ఒక్క ఫోన్ చేస్తే క్షణంలో డబ్బులు కట్టేవాడిని, నన్నెందుకు అడగలేదు.. ఇంకా నయం నీ అదృష్టం బాగుంది. ఫణికేం జరగలేదు. ఇలాంటప్పుడు మొహమాటాలు ఉండకూడదు లలిత, ” ఫణి చెబుతున్న మాటలకు మధ్యలోనే అందుకుని లలితతో అన్నాడు కిరణ్. 


“నాకు ఆ టయంలో ఏం చెయ్యాలన్నది తోచలేదు, ” క్లుప్తంగా అన్నది. 

 

“నాకు ఇప్పుడు కాస్త బాగుంది. మళ్ళి ఇబ్బందిగా అనిపించినప్పుడు రమ్మన్నాడట డాక్టర్. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా మిమ్మల్ని డబ్బులు అడిగిపెడుతున్నాను. ఒకేసారి అంత డబ్బు ఇవ్వాలన్నా మీకు కష్టంగా ఉంటుంది. మీకు వీలున్నప్పుడల్లా హాస్పిటల్ లో కడితే నేను సర్జరీ చేయించుకుంటాను, ” చెప్పాడు. 


“అదేం కాదండి. ఎంత తొందరగా ఆపరేషన్ చేయించుకుంటే మనకే మంచిదని చెప్పాడు డాక్టర్. అందుకని మీరు ఆ డబ్బులు ఏర్పాటు చేస్తే.. ” చెప్పడం ఆపి భర్తవైపు చూసింది. 


“లలిత.. నువ్వు అలా అంటే ఒకేసారి అంత డబ్బు కష్టం కదా, ” 


“అరే బాబు నువ్వాగు .. మనకు డబ్బు ముఖ్యమా నీ ప్రాణం ముఖ్యమా చెప్పు? డబ్బుల గురించి నువ్వెందు కాలోచిస్తున్నావు, ఈ విషయం నేను లలిత మాట్లాడుకుంటాము. నువ్వు కేవలం వింటుండాలి. తెలిసిందా.. నేను నీ బాస్ ని, ” వేలు చూపెడుతూ అన్నాడు నవ్వుతూ. 


“సరే మీ ఇష్టం సర్, కానీ మీరు ఇచ్చే డబ్బులు తిరిగి నేను ఎప్పుడివ్వాలో నాకు చెప్పండి, ” అన్నాడు. 


“ఏం ఇవ్వకపోతే నేను మీ ఇంటిమీదకు దాడికి వస్తానని భయమా, లేకపోతే కంపెనీ నుండి నిన్ను తీసివేస్తానని అనుకుంటున్నావా, చూడు ఫణి.. నాకు తోబుట్టువులెవరు

లేరు. నేను లలితకు తొబుట్టువనుకో. అప్పుడు మన మధ్య అప్పులు గోలలు ఉండవు. ముందు నీ సర్జరీ అయ్యాక మిగతావి మాట్లాడుకుందాము, ” లలితను క్రీగంట చూస్తూ అన్నాడు కిరణ్. 


“లలిత .. బొబ్బట్లు తీసుకురా తింటూ మాట్లడుకుందాము, ” లలితకు చెప్పాడు. 


అమ్మయ్యా.. ఆయనముందు నుండి ఎప్పుడు లేచి వెళదామని ఎదురు చూస్తున్న లలితకు ఫణి చెప్పగానే టక్కున లేచి వెళ్ళింది. మనసు మంచిదే కావచ్చు గాని ఆ చూపులేంటో.. మనిషి ఎదురుగా కూర్చోవాలంటేనే చిరాకుగా ఉంది.. అనుకుంటూ హాట్ బాక్సులో పెట్టిన వేడి వేడి

బొబ్బట్లు ఇద్దరికి ప్లేట్లలో పెట్టి తెచ్చింది. 


కమ్మటి నెయ్యితో చేసిన బొబ్బట్లు చూడాగానే. 


“వావ్ చాలా బాగున్నాయి. ఆహా.. ఇంత కమ్మటి బొబ్బట్లు తిని ఎన్నాళ్ళయిందో, లలిత.. మీచేతితో చేసిన బొబ్బట్లు అమృతం అమృతంలా ఉన్నాయి, ” తింటూ మెచ్చుకున్నాడు. 


లలితవైపు చూసి ఫణి నవ్వాడు. లలిత మొహమాటంగా నవ్వింది. 


=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 

ree



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page