top of page

ప్రేమ తీరాలు - పార్ట్ 1

#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries

ree

కొత్త ధారావాహిక ప్రారంభం

Prema Theeralu - Part 1 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 25/08/2025

ప్రేమ తీరాలు - పార్ట్ 1 - తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

“ఏమేవ్, ఎవరొచ్చారో చూడు! ఎంతసేపు వంటింటిలో ఆ పొయ్యితో కుస్తిపడటమేనా? ఇవతల ఎవరోచ్చారో చూసేది ఏమైనా ఉందా?” అంటూ గట్టిగా కేక వేసాడు రాజశేఖరం.


“ఆ ఎవరొస్తారు? వస్తే గిస్తే పాలేరు రంగన్న లేదా షావుకారు సుబ్బి శెట్టే!” అంది అంతకన్నా గట్టిగా అలివేలు.


“ఒసేవ్, నీకు వయసు పెరిగింది గాని బుద్ధి పెరగలేదే! ఒకసారి ఇవతలకు తగలడు తెలుస్తుంది నీకే ఎవరొచ్చారో,” అన్నాడు భార్యను విసిక్కుంటూ.


“ఆహా, నాకు మీ వేషాలు తెలియదేంటి! ఇప్పటికి మూడుసార్లు తాగారు టీ. ఇలా ఎవరినో పిలిచి మాటిమాటికి టీ ఇవ్వమంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది. మీకింకా ఈ రోజు టీ ఇచ్చేది లేదు ఏమనుకుంటున్నారో! అయినా మీరు పూజతో పాటుగా సంధ్యావందనం దేవుడి గదిలోనే చేసుకోవచ్చు కదా! అలా వీధికి ఎదురుగా కూర్చొని వచ్చిపోయే వాళ్లను పిలిచే బదులు,” అంటూ చేస్తున్న పనిని ఆపి విసవిసా బయటకు రాబోయింది అలివేలు.


“పోనిలే బావా… నేనే లోపలికి వెళతాను. నేనేం కొత్తవాడినా? చెల్లాయి ఏం పని మీదుందో ఏమో,” అంటూ కాళ్లు కడుగుకుని లోపలకు వచ్చాడు గోపాలం.


వస్తూనే, “చెల్లాయి, ఏం చేస్తున్నావమ్మా?” అంటూ వంటింటి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి అలివేలు కూడా సరిగ్గా అప్పుడే బయటకు రాబోతుంది.


“ఓరేయ్ అన్నయ్యా! నువ్వట్రా వచ్చింది?” ఆశ్చర్యపోతూ అడిగింది.


“అవును చెల్లె. ఇందాకటి నుండి నిన్ను బావగారు పిలుస్తున్నారు కదా! నేను వచ్చానని, నువ్వు పనిలో వున్నావేమోనని నేనే లోపలకు వచ్చాను,” అంటూ లోపలకు వచ్చి పీట వేసుకుని కూర్చున్నాడు గోపాలం.


“ఉండన్నయ్యా, ఎప్పుడనగా బయలుదేరావో ఏమో! చిక్కని టీ పెట్టిస్తా, తాగుతూ కబుర్లు చెబుదువుగాని,” అంది అలివేలు ఆనందంతో.


“అవునవును, నేను టీ అడిగితే ఎందుకు అంటూ కసురుకుంటావు. అదే మీ అన్నయ్య వచ్చిందే తడవు—చిక్కని టీ తాగు అంటున్నావు! చూశావా బామ్మర్ది, మీ చెల్లెలు బుద్ధులు,” నిష్టూరం ఆడుతూ తనొక పీట వేసుకుని కూర్చున్నాడు రాజశేఖరం.


“అబ్బో! మీకసలు ఏం చేసినా, మా పుట్టింటి వాళ్లను చూడగానే నన్ను దెప్పిపొడవడానికి తయారవుతారు,” అంటూ మూతి తిప్పుతూ చెరోక గ్లాసులో టీ ఇచ్చింది, తను పక్కనే కూర్చుంటూ.


“అన్నయ్యా! ఇప్పుడు చెప్పు… ఏంటి ఇంత హాడావుడిగా వచ్చావు? ఏదైనా పని మీద వచ్చావా? వదినా, నా కోడలు, అందరూ బాగున్నారా?” అడిగింది అలివేలు.


“నాకు తెలుసులేవోయ్, మీ అన్నయ్య ఎందుకు వచ్చాడో? వూరక రారు మాహాత్ములు అన్నట్టు, ఏదో గట్టి పని మీదే వచ్చుంటాడు. అంతేనా బామ్మర్ది?” నవ్వుతూ అడిగాడు రాజశేఖరం గోపాలాన్ని.


“అవును బావా, గట్టి పనిమీదే వచ్చాను. మీకు తెలియనిదేముంది! ఫణికి, సరితకు పెళ్లి చేసేస్తే మనకు ఒక బాధ్యత తీరుతుంది కదా! పెళ్లీడుకు వచ్చిన పిల్లను ఎన్నాళ్లు గుండెలమీద పెట్టుకుంటాము? అందరూ అడుగుతున్నారు—‘ఇంకా ఎప్పుడు పెళ్లి చేస్తావు?’ అని. వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో తోచడం లేదు. అందుకే ఇలా వచ్చాను,” నసుగుతూ అన్నాడు గోపాలం.


“అదేంటన్నయ్యా! సరిత పుట్టినప్పుడే నా కోడలు అనుకున్నాం కదా! వాడి చదువయ్యేదాకా అని ఆగాము,” అంది అలివేలు.


“అంతేకదయ్యా! ఈ సంవత్సరంతో మనవాడి చదువు అయిపోతుంది. ఈ ఎండాకాలంలో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం. ఏమేవ్, ఏమంటావు?” అడిగాడు భార్యను.


“నేనేమంటాను? నా కోడలిని నా ఇంటికి తెచ్చుకుంటానంటాను!” అంది గలగలా నవ్వుతూ.


“ఏమో చెల్లె, అది పుట్టినప్పటినుండి నీ కోడలే అని అనుకున్నాము. అది కూడా బావ మీదనే పంచప్రాణాలు పెట్టుకుంది. పట్నంలో చదువులు చదువుతున్నాడు ఫణి. అక్కడ ఎవరైనా అమ్మాయి ఎర్రగా, బుర్రగా కనిపిస్తే సరితను ఎక్కడ వద్దంటాడోనని మీ వదినకు భయంగా ఉంది. ఎందుకైనా మంచిదని కచ్చితంగా అడిగి రమ్మని నన్ను పంపిందమ్మా మీ వదినా,” చెప్పాడు గోపాలం.


“నువ్వలాంటి భయాలు పెట్టకోమాక! వాడెవరనుకున్నావు? ఈ రాజశేఖరం కొడుకయ్యా! వాడు నేను గీచిన గీటు దాటడు, తెలుసా?” అంటూ మీసాలు లేకున్నా మీసం మెలేసాడు రాజశేఖరం.


ముసిముసిగా నవ్వుకుంది అలివేలు రాజశేఖరాన్ని చూసి.

“ఏమిటీ అలా నీలోనువ్వే నవ్వుకుంటున్నావు? ఇక్కడేమైనా కోతులు ఆడుతున్నాయా?” కొంచెం హాస్యంగా అడిగాడు రాజశేఖరం.


“మరి లేకపోతే? మీసాలే లేవు. ఉన్నట్టుగా మీరు దువ్వుతుంటే నవ్వుకున్నాను,” అంది.


“సరే మరి, మీరు ఇంత నమ్మకంగా చెబుతున్నారుగా! కాబట్టి పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకుంటాను,” అంటూ సంతోషంతో బావ చేతులు పట్టుకుని చెప్పాడు గోపాలం.


***

“ఏమండి, కాస్త కాఫీ పొడి ఇస్తారా?” అంటూ తలుపు కొట్టి మరీ అడిగాడు ఫణి.


“ఎవరు?” అంటూ తలుపు తెరిచి చూసి సిగ్గుపడుతూ, “లోపలికి రండి… అన్నయ్య లేరు,” అంది పక్కకు జరుగుతూ.


“పర్వాలేదు. నేనిప్పుడు మీ అన్నయ్య కోసం రాలేదు… మీ కోసం,” అంటూండగానే చివ్వున తలెత్తి ఫణి వైపు చూసింది లలిత.


“అది కాదు… కాఫీ పొడి కావాలని వచ్చాను,” అన్నాడు తడబడుతూ.


కిసుక్కున నవ్వింది, జలజలా ముత్యాలు రాలినట్టు.


“అరెరె! జారిపోతున్నాయే… ఎలా పట్టకోను!” అంటూ రెండుచేతులతో దోసిలి జాపాడు ఫణి.


“ఏంటి? పట్టుకుంటానంటున్నారు?” ఆశ్చర్యపోతూ అడిగింది లలిత.


“అవేనండి ముత్యాలు! మీరు నవ్వారు కదా! ముత్యాలు రాలిపడ్డాయేమో… ఏరుకుందామంటే జారిపోతున్నాయి,” అన్నాడు నవ్వుతూ.


“అబ్బో, ఏమో అనుకున్నాను. గడుసువారే వుండండి… కాఫీ పెట్టుకొస్తాను. త్రాగి వెళుదురుగాని,” అంటూ లోపలకు వెళ్ళబోయింది లలిత.


“అబ్బే వద్దండి, మీకెందుకు శ్రమ! కాఫీ పొడి ఇస్తే వెళ్ళిపోతాను,” అన్నాడు మొహమాటంగా.


“నాకేం శ్రమండి! మీరు మొహమాటపడుతున్నట్టున్నారు. సరే, కానివ్వండి… కాఫీ పొడి తెస్తాను,” అంది. కాఫీ ఇస్తే తాగుదామని వున్నా పైకి అలా అంటున్నాడని అర్థమైంది. అందుకే కావాలని అలా అంది.


“సరే, మీ ఇష్టమండి. మీరు కాఫీ ఇస్తానని అంటూంటే నేను తాగకుండా వెళితే ఏం బాగుంటుంది చెప్పండి,” అంటూ అక్కడే వున్న సోఫాలో కూర్చున్నాడు.


ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చింది లలిత.


“ఏమండి, మీరు ఏమనుకోనంటే ఒక విషయం అడగాలి. చెబుతారా?” అడిగాడు ఫణి.


“అడగండి,” అంది కొంచెం ఇబ్బందిపడుతూ. ఏమడుగుతాడోనని అనుకుంది మనసులో.


“మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? అహా, వూరికే అడుగుతున్నాను,” అన్నాడు తడబడుతూ.


పకపక నవ్వింది లలిత. తెల్లటి పలువరస తళుక్కున మెరిసాయి. బుగ్గన సొట్టలపడి మరింత అందాన్నిస్తుంది ఆమె మోము. చూడచక్కటి రూపం—ఒక్కసారి చూసామంటే మరిచిపోలేము. చక్కటి వంపుసొంపులు తీర్చిదిద్దినట్టనిపిస్తుంది. ఆమె నవ్వుతుంటే అలానే మైమరచిపోయి చూస్తున్నాడు ఫణి.


“ఏమండోయ్! ఏమైంది మీకు? అలా వుండిపోయారు,” అంది గట్టిగా.


“అబ్బే, ఏం లేదు,” తడబడుతూ, “అయినా ఏం అందమండి! ఎంత చూసినా తనివితీరదు. మీకేమండి, మీరు హాయిగా వుంటారు. మా బాధలు ఎవరికి తెలుసు,” బాధపడుతూ చెప్పాడు.


లలిత చెంపలు సిగ్గుతో ఎరుపెక్కాయి. ఏం మాట్లాడాలో అర్థం కాక తలదించుకుంది, సిగ్గుల మొగ్గయై.


“లలితా… ఇంకా ఎంతకాలం ఈ దాగుడుమూతలు? మీ అన్నయ్యతో నేను చెప్పనా? ఇక నా వల్ల కాదు. నిన్ను చూడకుండా నేనుండలేను. నువ్వు డాబాపైకి వచ్చి సన్నజాజులు తెంపుతుంటే, జాజులన్నీ ఆర్తిగా అడుగుతున్నాయి—ఇంకా ఎంతకాలం ఇలా వుంటావు? మా వాసనలు నీకు మత్తెక్కించడం లేదా? అని. నా వైపు దీనంగా చూస్తుంటే… ఏం చెప్పను నా బాధ!” అంటూ వాపోయాడు ఫణి.


“అవునా? మరి నాతో అలా చెప్పాయి ఆ జాజులన్నీ—‘నీ పెళ్లికి ఏమిటి తొందర? నీ అన్నయ్య పెళ్లి అయ్యాక నువ్వు చేసుకో’ అని,” అంది చేతిలో కాఫీ పొడి పెడుతూ.


ఇల్లగలావిడ రావడంతో మెల్లగా అక్కడనుండి జారుకున్నాడు ఫణి. తనలో తానే నవ్వుకుంది లలిత.


ఫణిని చదువుకోసం పట్నం పంపించారు అలివేలు–రాజశేఖరంలు. బుద్ధిగా చదువుకొని వచ్చి సరితను పెళ్లి చేసుకోవాలని చెప్పారు. బుద్ధమంతుడిలాగా తలవూపి వచ్చాడు. ఇక్కడకు వచ్చాక తన స్నేహితుడైన కరుణాకర్ చెల్లెలు లలితను చూసినప్పటినుండి ఆమెను ఇష్టపడసాగాడు. ఆ అమ్మాయి కూడా ఫణి అంటే ఇష్టమున్నట్టుగా, ఫణి వైపు చూస్తూ వుండేది.


కరుణాకర్–లలిత అన్నాచెల్లెలు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ ఇంట్లో పెరిగారు. వాళ్ళ పరిస్థతి మామూలే కావడం వల్ల, ఏదో చిన్న జాబు వెతుక్కుంటూ తను చదువుకుంటూ చెల్లెలిని పదవ తరగతి వరకు చదివించాడు. సుగుణాలారాశి తన చెల్లెలు చక్కటి వరుడిని చూసి పెళ్లి చెయ్యాలని అనుకున్నాడు కరుణాకర్. లలితకేమో అన్నయ్యను ఒంటరివాడిని చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలనే ఇష్టం లేదు. అందుకే ఎప్పుడూ “ముందు నువ్వు చేసుకో” అని అంటుంది.


ఫణికేమో, తన చదువు అయిపోతుంది, ఇంటికి వెళితే ఆ పల్లెటూరి అమ్మాయిని (సరితను) కట్టబెడతారనే బెంగ ఎక్కువైంది. ఇంటినుంచి ఉత్తరం వచ్చినప్పటినుండి మనసు మనసులో లేదు. ఒకటికి పది సార్లు చదివాడు ఆ ఉత్తరాన్ని.


“ఓరేయ్ బుద్దాయ్! నీ చదువు అయిపోతూనే వచ్చేయాలి. ఎందుకంటే మేము ఇక్కడ ముహూర్తాలు పెట్టుకున్నాము. నీకు నీ మామయ్య కూతురు సరితతో పెళ్లి చెయ్యాలనుకున్నాము. కాబట్టి నువ్వు పెట్టేబేడా సర్దుకుని వచ్చేయ్. అర్థమైంది కదా! ఇట్లు—నీ నాన్న రాజశేఖరం.”


“అమ్మో! మా నాన్న పట్టినపట్టు విడవడు. ఈ గండం నుండి ఎలా బయటపడాలా?” అని ఆలోచిస్తున్నాడు ఫణి. లలితను చూస్తే—‘వాళ్ళ అన్నయ్య పెళ్లి అయ్యాక’ అంటుంది… మా నాన్న చూస్తే—‘ఇప్పుడే నీ పెళ్లి’ అంటున్నాడు. ఏమి అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు ఫణి.


“అన్నయ్యా, ఉదయం ఫణి వచ్చి వెళ్ళాడు,” చెప్పింది లలిత కరుణాకర్‌తో.


“అదేమిటి? నేను వుండనని తెలుసుకదా! ఎందుకోసం వచ్చాడు? నాతో ఏదైనా పని ఉందన్నాడా?” అడిగాడు లలితను.


“ఏమి లేదన్నయ్యా… కాఫీ పొడి కావాలని వచ్చాడు. ఎలాగూ వచ్చాడు కదా, కాఫీ తాగి వెళ్ళమన్నాను,” అంది.


“లలితా, ఫణి చాలా మంచివాడమ్మా. అందగాడు, మంచి చదువు, ఉన్నంతలో మనకంటే గొప్పవాళ్లని చెప్పొచ్చు. పైగా ఒక్కడే కొడుకు. మంచిగుణం కలవాడు. ఫణి గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా?” అడిగాడు కరుణాకర్.


“అన్నయ్యా, నాకంటే నీకే ఎక్కువ తెలుసు అతని గురించి. ఎందుకోసం అడుగుతున్నావు?” అంది లలిత. తన మనసులో ఉన్న మాటను పైకి చెప్పలేక, అన్నయ్య నోటినుండే వినాలని అనుకుంది.


“అదేనమ్మా, నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపితే నాకు తృప్తిగా వుంటుంది కదా! మంచి సంబంధం దొరకి, అబ్బాయి మంచివాడైతే అంతకన్నా నాకు కావలసింది ఏముంది? చిన్నప్పటి నుండి అమ్మ లాలనకు నోచుకోలేదు, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియని నిర్భాగ్యులమమ్మా మనం. కనీసం నీకు అత్తవారింట్లోనైనా ఆ ప్రేమ దొరుకుతుందేమోనని ఆశపడుతున్నాను,” అంటూ లలితను దగ్గరకు తీసుకున్నాడు.


“అన్నయ్యా, నాకు ఊహ తెలిసినప్పటినుండి అమ్మ ప్రేమ, నాన్న ఆప్యాయత అన్నీ నీ నుండి పొందాను. నేను చాలా అదృష్టవంతురాలిని అన్నయ్య. ఏ చెల్లెలికి ఇంత మంచి అన్నయ్య దొరకడేమో,” అంది కళ్ల నీళ్లు పెట్టుకుంటూ.


“ఛఛ, ఏడుస్తున్నావా లలితా? అందుకే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునే వాడి కోసం వెదుకుతున్నాను. ఎందుకో ఫణిని చూస్తుంటే నీకు తగిన వాడనిపిస్తుంది. నిన్ను చక్కగా చూసుకోగలడని నా మనసు పదే పదే చెబుతుంది. మరి నువ్వేమంటావు? నీకే ఇష్టమైతేనే… బలవంతం ఏమీలేదు లలితా,” అన్నాడు కరుణాకర్, చెల్లెలి తలనిమురుతూ.


“పో అన్నయ్యా…” అంటూ సిగ్గుతో రెండుచేతుల్లో ముఖం దాచుకుంది లలిత.


“అయితే ఫణి అంటే నీకు ఇష్టమేనన్నమాట అమ్మదొంగా! ఇన్నిరోజులు మీరిద్దరూ కలిసి దాగుడుమూతలు ఆడుతున్నారన్నమాట. పోనిలేమ్మా, ఇప్పటికైనా నీ మనసులో మాట బయటపెట్టావు. నాకు చాలా ఆనందంగా ఉంది,” అంటూ ఆప్యాయంగా చెల్లెలి నుదుటన ముద్దుపెట్టుకున్నాడు.


“అన్నయ్యా, అంతగా ఆశపడకూడదేమో మనం… ఎందుకంటే ఫణి వాళ్ళ అమ్మానాన్నలు మన సంబంధం ఒప్పుకోవాలి కదా! వాళ్ళేమో డబ్బున్న వాళ్ళంటున్నారు. మనం చూస్తే నయాపైసకు నోచుకోనివాళ్ళం. పైగా పెద్ద దిక్కులేని వాళ్ళం. నన్ను వాళ్లు ఒప్పుకుంటారంటావా?” బేలగా అడిగింది లలిత. మనసులో మాత్రం ఆరాటంగా ఉంది—ఫణిలాంటి భర్త తనకు దొరుకుతాడో లేదోనని.


“ఏం ఎందుకు చేసుకోరు? నీకేం తక్కువయిందని? కుందనాల బొమ్మను ఎవరు చూస్తూ చూస్తూ వదులుకుంటారు? చూడమ్మా, మనం ఏమీలేని వాళ్లమే కావచ్చు, కానీ నిన్ను వట్టిచేతులతో పంపడమేనా! ఈ అన్నయ్య అప్పు చేసినా నీ పెళ్లి ఘనంగా చేస్తాను. వాళ్ళడిగినంత కట్నం ఇవ్వకపోయినా, నాకు చేతనైనంతా కట్నమిచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను,” చెప్పాడు సంతోషంగా.


“అన్నయ్యా… నా కోసం నువ్వెవరి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలొద్దు. నా అదృష్టం బాగుంటే వాళ్ళు ఒప్పుకుంటారు, అంతేకానీ నువ్వు నాకోసం నిన్ను తక్కువ చేసుకుంటే నేనొప్పుకోను. నాకు ఈ సంబంధం కాకపోతే, మనకు తగ్గట్టుగా వేరేదీ చూసుకుందాం—‘గంతకు తగ్గ బొంతలాగా’,” అంది.


“ఏదో వూరికే అన్నానులేమ్మా. నేను ఫణితో మాట్లాడి వాళ్ళ అమ్మానాన్నలను కలుస్తాను. తొందరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం,” అంటూ హుషారుగా భోజనం ముగించాడు.

లలితకు ఆనందంతో ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ఫణితో తనకు జరగబోయే పెళ్లి గురించి ఆలోచనలతో గడిపేసింది.


=================================================================================

                                                       ఇంకా వుంది..


      ప్రేమతీరాలు - పార్ట్ 2 త్వరలో

=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 

ree



2 Comments



@metramsharma6299

• 37 minutes ago

కథ బాగుంది కథనం చదవడం కూడా బాగుంది రెండో భాగం కోసం ఎదురుచూపు

Like

@gadepallisaisudha4525

•1 hour ago

Nice story❤

Like
bottom of page