ప్రేమ తీరాలు - పార్ట్ 2
- Lakshmi Sarma B

- Aug 30
- 7 min read
Updated: Sep 4
#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries

Prema Theeralu - Part 2 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 30/08/2025
ప్రేమ తీరాలు - పార్ట్ 2 - తెలుగు ధారావాహిక
రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు. ఆ విషయం తలిదండ్రులకు చెబుతాడు.
ఇక ప్రేమ తీరాలు పార్ట్ 2 చదవండి.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫణి చెప్పగానే కొంచెం వెనకాముందు ఆడారు. ‘మా అన్నయ్యకు సరితను చేసుకుంటామని మాటిచ్చామే. వాళ్ళు ఎంత బాధపడతారో’నని అనుకున్నారు. కానీ కొడుకుకు ఇష్టంలేని పెళ్ళి చేసి వాళ్ళ జీవితం సవ్యంగాలేకపోతే చూడలేము గనుక ఫణికి నచ్చిన అమ్మాయితో పెళ్ళి జరిపిస్తే ఉన్న ఒక్క కొడుకు సంతోషంగా ఉంటాడని ఒప్పుకున్నారు. లలితను చూసాక ‘ఫణికి తగిన భార్య. కుందనాల బొమ్మలా ఉంది’ అనుకున్నారు. అనుకున్నట్టుగానే లలితాఫణిల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిపోయింది.
“లలితా. ఏంటిది నా కాళ్ళకు దండంపెడుతున్నావేంటి? ఇవన్నీ ఒకప్పటి పద్ధతులు. ఇది మన మొదటిరాత్రి. మనిద్దరం ఒకరికొకరం మనసు విప్పి మాట్లాడుకోవాలి, మనిద్దరి మధ్య ఏ గాలి కూడా దూరనంతగా కలిసిపోవాలి. లే లలిత, ” అంటూ లలితను లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు.
“ఏమండీ. గడ్డిపువ్వులాంటి నన్ను మీ మంచి మనసులో స్థానం ఇచ్చారు. పుట్టినప్పటినుండి కష్టాలే తప్పా మా జీవితంలో మాధుర్యాలను చవి చూడలేదు. నాకోసం నన్ను సంతోషపెట్టడానికి అన్నయ్య ఎంతో కష్టపడేవాడు కానీ చిన్న వయసు.. శక్తికి మించి పని చెయ్యలేడు. ఎంత సంపాదించినా మాకు పూట గడవడమే కష్టమయ్యేది.
ఒళ్ళు దాచుకోవడానికి ఎంత కష్టపడేదాన్నో.. చిరిగిన బట్టలు కుట్టుకుని అన్నయ్యకు కనిపించకుండా వేసుకునేదాన్ని. అలాంటి నాకు ఈ దేవాలయంలో చోటు దొరికిందంటే నేనెంత అదృష్టవంతురాలను.. అందుకే ఈ దేవుడికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను, ” అతనిని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోతూ చెప్పింది.
“లలితా.. నువ్వు కాదు నేను అదృష్టవంతుడినే. ఎందుకో తెలుసా ? అద్భుత సౌందర్యరాశి, అపురూపమైన వజ్రం నాకు దొరికింది. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి లలిత. ఎట్టి పరిస్థితుల్లో నన్ను విడిచి వెళ్ళనని మాటవ్వు, కష్టాలు సుఖాలు మనిషికి ఎల్లవేళలా వెన్నంటే ఉంటాయి. వాటిని తట్టుకుని సంసార రథాన్ని ఈదడమే దాంపత్య బంధం, నీవు నాకోసం నేను నీకోసం పుట్టాము. జీవితాంతం ఇలాగే కలిసుందాము, ” ఆమెను కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ముద్దులతో ఊపిరాడకుండా చేస్తున్నాడు ఫణి.
“ఏమండి .. నేను మిమ్మల్ని విడిచి పెట్టడమంటే నా ఊపిరి పోయిన తరువాతనే, ఈ జన్మలోనే కాదు జన్మ జన్మకు మీ దానిగా పుట్టాలనే ఆ దేవుడిని కోరుకుంటాను, ” అంటూ అతని చేతులను కళ్ళకద్దుకుంది.
“లలిత ఏడుస్తున్నావా, ”
“ఊ ఊహు.. “ వెక్కి వెక్కి ఏడ్చింది.
“లలిత.. ఇలా చూడు. ఇన్నాళ్ళు ఏం కష్టాలుపడినావో నాకు తెలియదు, ఇక నుండి నీ కంటినుండి ఒక్క కన్నీటి చుక్క రావడానికి వీలులేదు, ” ఆమెను దగ్గరకు తీసుకుని కళ్ళు తుడిచాడు.
“ ఏమండి.. మీరు ఎప్పుడు నా మీద ఇలాంటి ప్రేమనే చూపిస్తారా, ఎవరేమైనా మన మధ్య లేనిపోనివి చెప్పినా మీరు నమ్మరు కదా, మీకు నా మీద నమ్మకం పోయినరోజు నేను జీవచ్చావానినే. మీకు ఏ అనుమానం వచ్చినా నా చెంప పగులగొట్టి నన్ను నిలదీయండి. కానీ నన్ను మాత్రం మీ నుండి విడదీయకండి. నాకు ఈ ఒక్క వరం ఇవ్వండి చాలు, ” అతని జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ అనురాగంతో అడిగింది.
“లలిత.. నువ్వు నాప్రాణం. నిన్ను నేను తప్పు పడతానని ఎలా అనుకున్నావు..
ఎవరో కాదు, ఆ దేవుడే వచ్చి నిన్ను నా నుండి దూరంచేస్తానన్నా అతనితో పోట్లాడుతాను కానీ నిన్ను మాత్రం వదులుకోను. సరేనా, ” నవ్వుతూ అడిగాడు.
కళ్ళతోనే నవ్వుతూ అతనివైపు చూసింది. తృప్తిగా ఆమెను గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు.
***
లలిత అత్తింట్లో అడుగుపెట్టిన వేళావిశేషం బాగుంది ఫణికి. మంచి వుద్యోగం వచ్చింది. కొత్తకాపురం, చూడముచ్చటైన జంట.. అందరి కళ్ళు వీళ్ళమీదే. లలితకు ఫణితోటిదే లోకం. తన ప్రేమనంతా ఫణి కోసమే అన్నట్టుగా ఉండేది లలిత. ఒక్క క్షణం కూడా భర్త ఎడబాటు సహించేది కాదు. కానీ తప్పదు. అతను ఆఫీసుకు వెళ్ళి వచ్చేవరకు చంద్రుని కోసం చకోరిలా ఎదురుచూస్తూంది.
అక్కడ ఫణి పరిస్థితి అంతే. ఆఫీసుకు వెళతాడే కానీ మనసంతా లలితచుట్టూనే తిరుగుతుంది. ఎప్పుడెప్పుడు తన ముందు వాలిపోతానా అని ఎదురు చూస్తూంటాడు. లలితంటే పంచప్రాణాలు ఫణికి.
కరుణాకర్ కు దగ్గరలోనే ఇల్లు తీసుకున్నారు. చెల్లిని చూడకుండా
ఉండలేడు. అలాగని ఒకే ఇంట్లో కలిసిసుందామంటే ఒప్పుకోలేదు కరుణాకర్. “కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో మూడో వ్యక్తి ఉండకూడదమ్మా” అంటాడు కరుణాకర్. రోజు ఏదో ఒక సమయంలో వచ్చి చెల్లిని బావను చూసి భోజనం చేసుకుని వెళతాడు. ఇప్పుడతని మనసు ప్రపంచాన్ని జయించినంత గొప్పగా ఉంది తన ముద్దుల చెల్లిని చూస్తుంటే.
“లలిత .. త్వరగా తయారవు. మనం ఊరెళుతున్నాము” బయటనుండి వస్తూనే పిలిచాడు ఫణి.
“అబ్బబ్బా ఏంటండి అంత హడావుడి. ఇంట్లోకి వచ్చేవరకు కూడా ఆగలేరా, చుట్టుపక్కల వాళ్ళందరికి వినిపించేలా ఏంటండి ఆ పరుగులు, ” నవ్వుతూ గదమాయించింది.
“నేనాగాలేను లలిత.. మనం ఊటి వెళుతున్నాము. త్వరగా బట్టలు సర్దు. భోజనం బయటే చేద్దాము పద పద, ” తొందరచేసాడు.
“లేడికి లేచిందే పరుగన్నట్టు ఇంత సడెన్ గా ఈ ప్రయాణమేంటి ?, ” ఆశ్చర్యపోతూ అడిగింది.
“అడిగావు.. అనుకున్నాను నీకు ఏమి గుర్తుండదని. ఈరోజు తేది ఎంతా, ”
“మార్చి పదహారు. అయితే ఏంటి, ” అంటూ నాలిక కరుచుకుంది. రాబోయే రెండు రోజుల్లో తమ మొదటిపెళ్ళి రోజు గుర్తుకువచ్చి.
“అది.. ఇప్పటికి గుర్తుకు వచ్చిందన్నమాట, ” కితకితలు పెడుతూ లలితను ఎత్తుకుని గిరగిరా తిప్పాడు.
“వద్దు బాబు కళ్ళు తిరుగుతున్నాయి, వదలండి. తప్పయింది మరిచిపోయాను,” కిలకిలానవ్వుతూ అంది.
“లలిత.. కళ్ళు మూసుకో. నీకొకటి ఇస్తాను, ”
“ఏమిటి.. ఊటి టికెట్లు ఇస్తారా, ” కళ్ళు సగం మూస్తూ చూస్తూంటే.
“అదిగో దొంగ.. చూస్తున్నావు. కళ్ళు గట్టిగా మూసుకుంటేనే నేనిచ్చేది, ”
“సరే త్వరగా ఇవ్వండి. మళ్ళి బట్టలు సర్ధలేదని తొందరచేస్తారు, ” ఈసారి గట్టిగా మూసుకుంది.
పెళ్ళిరోజు కోసమని లలితకు డైమండ్ నెక్లెస్ తెచ్చాడు. అది ఆమె మెడకు పెడుతూ,
“అలాగే పద మన బెడ్ రూంలోకి. కళ్ళు తెరవద్దు, ” అలాగే పట్టుకుని నడిపించుకుంటూ వెళ్లాడు.
“ఏయ్ ఈ సమయంలో బెడ్ రూంలోకి ఎందుకు.. నాకు తెలుసు మీ నాటకాలు, ” తప్పించుకోవాలని చూసింది. అతని ఉడుముపట్టు ముందు ఆమె బలం సరిపోలేదు.
“ఇప్పుడు కళ్ళు తెరువు లలిత, ” అద్దం ముందు నిలుచోపెట్టి అన్నాడు.
తన మెడలో ధగధగామెరిసిపోతున్నా డైమండ్ నెక్లెసు చూసుకుని ఆనందంతో అమాంతంగా ఫణిని గట్టిగా కౌగిలించుకుంది. “ ఏమండి.. నాకోసం ఇంత ఖరీదైనది తెచ్చారా? ఎందుకండి నామీద ఇంత ప్రేమ, ” తమకంలో మాటలురాక ఆగిపోయింది.
“ఏం.. నీకోసం కాకా వేరే వాళ్ళకు ఇవ్వమంటావా ఏంటి, అవును. నాకొక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండేది. ఇది తీసుకపోయి ఆమెకిచ్చేవాణ్ణి, నన్ను ఎంత సంతోషపెట్టేదో. ఏం చేద్దాం.. దేనికైనా పెట్టిపుట్టాలంటారు. ప్చ్, ” లలిత వైపు క్రీగంట చూస్తూ అన్నాడు.
“ఏంటీ.. నేనుండగానే మీకు గర్ల్ ఫ్రెండ్ కావాలా ? అంటే మీకప్పుడే నా మీద మోజు తీరిపోయిందన్నమాట, మీ మనసులో అలాంటి ఆలోచన ఉందంటే నన్ను ఎప్పుడో వదిలేస్తారన్నమాట, అయ్యో దేవుడా నేనేం చేతును.. నాకిలాంటి అవస్థ వచ్చిందే, ” రెండుచేతులలో ముఖం దాచుకుని భోరున ఏడుపు లంకించుకుంది.
“ఏయ్ ఏయ్ లలిత .. నేను ఏదో ఊరికే నిన్ను ఆటపట్టించడానికి అంటే నువ్వు నిజంగానే అనుకున్నావా? ఛీ ఛీ నేనెంత మూర్ఖుడిని. నిన్ను అనవసరంగా ఏడిపించాను, లలిత.. ఏది ఇలా చూడు. నా బంగారం కదూ, ” బుజ్జగిస్తూ రెండుచేతులను ఆమె ముఖం మీద నుండి తీసాడు. పక్కున నవ్వి అతని బుగ్గ మీద కిసుక్కున కొరికింది.
“అమ్మ దొంగా.. ఇదంతా నటనా .. అమ్మో! నేనింకా నువ్వు నిజంగానే ఏడుస్తున్నావని గాభరా పడ్డాను. ఉండు నీ పని చెబుతా, ” అంటుండగానే అక్కడనుండి తుర్రుమని పారిపోయింది లలిత. ఆమె వెనకాలే పరుగు తీసాడు ఫణి.
“బాబు.. నీకు దండం పెడతాను. నన్ను వదిలేయి, బట్టలు సర్దుతాను, ” రెండుచేతులు జోడించి అడిగింది అతని పట్టు విడిపించుకుంటూ.
“అదేం కుదరదు. నీకు నేను విధించే శిక్షేంటో తెలుసా?, ”
ఏంటన్నట్టు భయంగా చూసింది భర్తవైపు.
“అలా భర్తంటే భయముండాలి తెలిసిందా, నువ్వు నన్ను భయపెట్టావు కాబట్టి ఇప్పుడు నేనడిగింది నువ్వివ్వాల్సిందే. తరువాతనే మన ప్రయాణం.
పద, ” అమాంతంగా ఆమెను ఎత్తుకుని పడకగదిలోకి తీసుకవెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు.
“ఏమండి ఇప్పుడు వద్దండి..”
ఆమెను మాట్లాడనివ్వకుండా తన పెదవులతో ఆమె పెదవులను మూసి ఆనందడోలికలో మునిగిపోయారు.
******* ******** ******** *******
“ఫణి ..మొదటిసారి మా చెల్లిని అంతదూరం పంపిస్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరండి.వెళ్ళగానే ఫోన్ చెయ్యండి, లలిత.. మీ ఆయన మీద ప్రేమతో ఈ అన్నయ్యను మరిచిపోకేం. నిన్ను చూడకుండా అన్ని రోజులు ఎలా ఉండగలనమ్మా, ” చెల్లెలు చేతిలో పదివేల రూపాయలు పెడుతూ కళ్ళుతుడుచుకున్నాడు కరుణాకర్.
“అన్నయ్యా. ఏమిటిది చిన్న పిల్లవాడిలా బాధపడుతున్నావు, అన్నయ్యా. వారంరోజులే కదా మేము వెళ్లేది. రోజు ఫోన్ చేస్తాను సరేనా, ” అన్న కళ్ళు తుడుస్తూ అంది లలిత.
“నేనందుకే అన్నాను నువ్వు కూడా రా బావా అని అంటే ‘పానకంలో పుడకలా నేనెందుక’న్నావు, ఇప్పుడేమో ఇలా బాధపడుతున్నావు. పోని లలిత.. మీ అన్నయ్య బాధపడుతున్నాడు. మనం వెళ్ళడం మానేద్దామా, ” బావమరిది బాధను చూడలేక అడిగాడు ఫణి.
“ఛ ఛ ప్రయాణం మానేయ్యడమేంటి. ఏదో ఊరికే అలా అన్నాను, మీరు త్వరగా బయలుదేరండి. లలిత.. సూట్ కేసు ఇలా పట్రామ్మా, మా చెల్లిని పెళ్ళి చేసుకోగానే నా వరుస మార్చావు ఫణి. ఎంతైనా మనం ముందు స్నేహితులమే,” నవ్వుతూ చెల్లెలికి చెప్పాడు.
“అంతే కదా కరుణా.. మా ఆవిడకు అన్నయ్యవి అంటే నాకు బావవే కదా, స్నేహానికి స్నేహమే బంధుత్వానికి బంధుత్వమే, ” అన్నాడు ఫణి కూడా నవ్వుతూ.
***
“ఏమండి.. ఎంత బాగుంది కదా ఊటి. అసలు ఈ జన్మలో ఇలాంటివి చూసే అదృష్టం వస్తుందనుకోలేదు. ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకున్నాను కనుకనే ఇంత మంచి భర్త లభించాడు. ఇదంతా తలుచుకుంటుంటే ఒక్కోసారి నిజమేనా అనిపిస్తుంది, ” అతని గుండెలమీద వాలిపోతూ అంది.
“ =మళ్ళీ మొదలుపెట్టావు పాప పుణ్యాలు .. లలిత.. నీకోటి చెప్పనా, పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయిస్తారట తెలుసా? ఇది నువ్వు నేను కోరుకున్నదే కాదు. మనకు రాసిపెట్టింది జరిగింది అంతే. ఇక మనం చెయ్యవలసింది “మూడు పువ్వులు ఆరుకాయలు” అన్నట్టుగా చక్కగా కాపురం చేసుకోవడమే, ” మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గట్టిగా కౌగిలిలో బంధించాడు.
“లలిత .. మన మొదటి పెళ్ళిరోజు బహుమతిగా నాకేం ఇస్తున్నావో తెలుసా, ఇక్కడున్న వారం రోజులు నేనేం చేసినా నువ్వు కాదన కూడదు. అదే నువ్వు నాకిచ్చే పెద్ద బహుమతి, బుద్దిమంతురాలిలా నేను ఎలా చెబితే అలా నడుచుకోవాలి. ఈ చల్లగాలి, చక్కటి ప్రకృతి మనకు మరిచిపోలేని మధురస్మృతి కావాలి, ” అంటూ చక్కిలిగింతలు పెడుతూ గిరగిరా తిప్పాడు లలితను.
“అబ్బా వదలండి, కళ్ళు తిరుగుతున్నాయి. మీకు నేనిచ్చే బహుమతి నాదగ్గరనే ఉంది. ముందు మీరు నన్ను వదలండి, ” నవ్వుతూ అడిగింది.
టక్కున లలితను తిప్పడం ఆపి ఆమె వైపు చూసాడు.
“ఏమిటి.. నువ్వు నాకోసం బహుమతి తెచ్చావా. ఏది.. చూపవేం మరి, ” ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు.
“ఇలా మీ చేతినివ్వండి ఇక్కడ ఉంది మీకు కావలసిన బహుమతి, మీరు త్వరలో నాన్న, నేను అమ్మను కాబోతున్నాము, ” సిగ్గుపడుతూ ఫణి చేతులను తన పొట్టమీద ఆనించుకుంది.
“ లలితా.. నువ్వు నువ్వు చెప్పేది నిజమా! ఇంతమంచి బహుమతి దగ్గర పెట్టుకుని నాకు చెప్పలేదు.. ” అపురూపంగా లలిత వైపు చూస్తూ ఆమె పొట్టమీద తమకంగా ముద్దులతో ముంచెత్తాడు.
“ఏమండి.. నాకు మొన్ననే తెలిసింది. చెబుదామనుకున్నాను కానీ మీరు ఊటి ప్రయాణం అని తొందరచేసారు. మీరు నాకు మన పెళ్ళిరోజుకు కానుక డైమండ్ నెక్సెస్ తెచ్చారు. ఆ సంతోషాన్ని నేను అనుభవించాలి. మీకు నేనివ్వగలిగిన బహుమతి ఏముంటుంది.. మీరే నాకొక అపూర్వమైన పెన్నిధి. మన పెళ్ళిరోజు ఈ విషయం చెప్పి మిమ్మల్ని సంతోషపెట్టాలని ముందు చెప్పలేదు. మీకు పాప కావాలా బాబు కావాలా చెప్పండి, ” అతని హృదయం మీద తలపెట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.
“నిజంగా నేనెవరిని అడిగితే వాళ్ళనిస్తావా లలిత, “
“ఊ .. చెప్పండి ఎవరు కావాలి, ”
“నాకైతే నీలాంటి కలవకళ్ళు కొసదేరిన ముక్కు ఎర్రగాపండిన నీ పెదవులలాంటి పెదవులు చంద్రబింబంలా నీ మోముతో ఉన్న అమ్మాయి, అలాగే ఆ అమ్మాయికి తగ్గట్టుగా ఉండేలా ఒక బాబు చాలు, నువ్విద్దరిని ఒకేసారి ఇచ్చావంటే మనకు ఓ పనైపోతుంది. నువ్వు ప్రతిసారి కష్టపడవలసిన పని లేదు ఏమంటావు, ” కవ్విస్తూ అడిగాడు.
“అబ్బ ఆశ .. ఇంకా నయం నలుగురిని కావాలని అడుగలేదు, “మోసేవాడికి తెలుసు కావడి భారం” మీకేం మీరు చేసేది చేసి హాయిగా ఉంటారు, తొమ్మిది నెలలు మోసి ప్రసవ వేదన మాములుగా ఉంటుందనుకున్నారా. అమ్మో.. ఆడదానికి పునర్జన్మ అంటారు తెలుసా? నావల్ల కాదు బాబు. మనకు ఒక్కరే చాలు. అది కూడా మీలాంటి అందమైన మంచి మనుసున్న బాబు కావాలి నాకు, ” బుంగమూతి పెడుతూ అంది.
ఆ రోజంతా ఒకరితో ఒకరు కబుర్లు చెబుతూ గదిలోనుండి బయటకు కూడా రాకుండా గడిపారు.
******* ******** ******** ********
“ఏయ్ లలిత బాగున్నావా ? ఏమిటి ఇక్కడున్నావు.. మీ ఆయనా అతను? పెళ్ళిచేసుకున్నావా, అసలు గుర్తే పట్టలేదు నిన్ను. చాలా రోజులైంది చూసి. మీ అన్నయ్య బాగున్నాడా? అందగాణ్ణే పట్టాడు మీ అన్నయ్య, ” కన్నుగీటుతూ లలితను ఫణిని చూస్తూ అడిగాడు జగన్. ఊటి చూడడమంతయ్యాక షాపింగ్ చేస్తున్న సమయంలో కలిసాడు.
“జగన్ ను చూడగానే కొంచెం కలవరపడింది లలిత. “నువ్వేంటి ఇక్కడున్నావు
మీ వాళ్ళతో వచ్చావా,” తడబడుతూ అడిగింది.
“బాగుంది. నేనింకా పెళ్ళే చేసుకోలేదు. నాకు నచ్చినమ్మాయి నన్ను చేసుకోలేదు. ఏం చేస్తాం. తను పరాయిదైపోయింది, ” అంటూ “హాయ్. నాపేరు జగన్. నేను మీ ఆవిడ ఒకప్పుడు ఒకే ఊరి వాళ్ళం, ” చెప్పాడు నవ్వుతూ.
“హాయ్. నా పేరు ఫణి.. నేను లలిత పెళ్ళిచేసుకుని సంవత్సరమైంది. మొదటి పెళ్ళి రోజు ఊటికి వచ్చాము. రేపు తిరుగు ప్రయాణం, ” చేతిలో చెయ్యివేస్తూ చెప్పాడు ఫణి.
“ఏమండి వెళ్దామా, ” చెవి దగ్గర గుసగుసగా అడిగింది.
“ఓకే బ్రదర్ వెళ్ళొస్తాము, ” చెప్పి బయలుదేరారు. వెనకకు వెనకకు చూస్తూ నడుస్తూంది లలిత. ఫణికి ఏం అర్ధం కాలేదు అతన్ని చూస్తే ఎందుకు తడబడుతుందోనని.
=================================================================================
ఇంకా వుంది..
=================================================================================
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.




@swapnaj8931
•51 minutes ago
Super ga undi attayya twist ela untundo mari
@indirasrikakulam5810
• 2 days ago
చాలా బాగుంది రచయిత్రి గారు కుటుంబ విలువలు ప్రేమలు చక్కగా రాశారు ముందు ఏం జరుగుతుందో అని చాలా ఉత్కంఠ గా ఉంది రచనా శైలి లో నూతనంగా ఒక తనదైన ప్రత్యేకత చూపించారు 2 భాగాలు మనసుకు హత్తుకునేలా రాసారు. 3వ భాగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రేమ ఏ తీరం చేరుతుందో అని ఎదురు చూస్తూ ఉంటాము.