top of page

మనసంతా నువ్వే 1


'Manasantha Nuvve 1' New Telugu Web Series

Written By Lakshmi Sarma Thrigulla

'కలసి ఉంటే కలదు సుఖము' తెలుగు పెద్ద కథ

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

మనసంతా నువ్వే పెద్ద కథ 1/3

“సీతా … ఎక్కడున్నావే, స్కూల్ టైయమయితుంది తొందరగా రావే” అంటూ కేకవేసింది సీత తల్లి కామాక్షి.


“అత్తా … సీత పెరటిలో నందినితో ఆడుకుంటుంది, వస్తుందిలే అత్తా నేనువెళ్ళి పిలుచుకొని వస్తాను,” చెబుతూనే పరుగెత్తాడు రఘు.


“ఏమిటో ఈ పిల్ల ఒక్కమాట వినిపించుకోదు, తండ్రి గారాబం ఎక్కువ అందుకే నా మాటవినదు, అన్ని తండ్రితోనే చేయించుకుంటుంది, రేపు పెద్దవుతుంటే తెలుస్తుంది నా అవసరం ఏంటో, పాపం తల్లిలేని పిల్లాడు రఘు ఎలా చెబితే అలా వింటాడు, వాణ్ణిచూస్తేనే ఈసడించుకుంటుంది సీత, ఈ పిల్లకు ఎలా చెప్పాలో నాకర్ధం కావడంలేదు,” అని తన మనసులో తానే గొణుక్కుంటుంది కామాక్షి.


“ఏయ్ నల్లోడా నన్ను వదులు నువ్వు నన్ను ముట్టుకోవద్దు,” అంటూ ఏడుస్తూ రఘు చేతిని విడిపించుకోవాలని చూస్తుంది సీత.


“చూడత్తా… ఎన్నిసార్లు రమ్మని పిలిచినా రానుపో అంటూ వెక్కిరిస్తుంది, అందుకే చెయ్యిపట్టి తీసుకొస్తున్నాను,” చెప్పాడు సీతమీద సంజాయిషీ ఇస్తూ.


రఘు చెయ్యిపట్టుకున్నాడని చెయ్యినంతా సబ్బుపెట్టి రుద్దుకుంటుంది సీతా. అంటే నేను నల్లగా ఉన్నానని నా నలుపు తనకంటుతుందని అనుకుంటుందేమో అది చూసి రఘు మనసు కలతచెందింది.


పన్నెండు సంవత్సరాలు వయసుకే ఇది ఇలా ఉంది అంటే రేపురేపు రఘు ఉనికినే సహించుకోదేమో. చూడడానికి నలుపైనా పిల్లవాడు మంచివాడు. ఎలా చెబితే అలా వినేరకం. ఒక్కతే కూతురు కదా బయటకు పంపడమెందుకని రఘును అల్లుడిగా చేసుకోవాలనుకున్నాము. వాడు ముట్టుకున్నందుకే సబ్బుతో చెయ్యిరుద్దిపెడుతుంది ఇంకా వాడినేం భరిస్తూంది. ఆలోచిస్తూ కంచం ముందు కూర్చున్న రఘుకు అన్నం పెట్టడం మరిచిపోయింది.


“అత్తా… అన్నంపెట్టు తొందరగా వెళ్ళాలి,”


“అయ్యో నా మతిమండా, ఏదో ఆలోచిస్తూ మరిచేపోయాను అదెక్కడా,” అంటూ అటుఇటు చూసింది.


కిసుక్కున నవ్వాడు రఘు.” అయ్యో అత్తా…. సీత స్కూల్ కు వెళ్ళిపోయింది గదా! మామ సీతకు అన్నంకలిపి తినిపించి తీసుకునిపోయాడత్తా,” అన్నం తింటూ చెప్పాడు.


“ఏమండి … మీరు సీతను మరీ గారాబం చేసి చెడగొడుతున్నారు, ఈ రోజు ఏం చేసిందో తెలుసా? ఉదయం జరిగిన సంగతి చెబుతూ, “చూడండి మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న సామెత ఊరికే రాలేదండి, నా మాటెలాగు వినదు మీ గారాబం చూసుకుని కనీసం మీరైనా చెప్పండి దానికి, ఇదిలాగే ఆ అబ్బాయిని మాటకు మొదలు నల్లోడా అనడం మానేయ్యమని చెప్పండి, రఘు మాత్రం ఎన్ని రోజులు భరిస్తాడు చెప్పండి, ఎప్పుడో చెప్పాపెట్టకుండానే ఇంట్లోనుండి వెళ్ళిపోతాడు,” అంది బాధపడుతూ.


“ఏమిటి కాముడు నువ్వు మరీ చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నావు, అదీ వాడు చిన్నపిల్లలు ఏదో అనుకుంటారు వెంటనే కలిసిపోతారు, మన పెద్దవాళ్ళము పిల్లల విషయాలు పట్టించుకోకూడదు, నువ్వు అనవసరంగా మనసు పాడుచేసుకోకు,” భార్యను మందలించాడు ప్రకాశం.


“అంతేలెండి, “పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగున్నట్లు” మీకు మీ కూతురు ఏం చేసినా మురిపెంగానే ఉంటుంది, లేకలేక పుట్టినకూతురాయే ఈగవాలనివ్వరు,” అంది మూతితిప్పుతూ.


“భలేదానివి కాముడు నువ్వు… అది నా ఒక్కడికే కూతురు నీకు కాదన్నట్టు చెబుతున్నావు, నువ్వు మాత్రం తక్కువ గారాబం చేస్తావా ఏంటి ? ఏదో రఘును అలా అంటుందని గానీ, లేకపోతే పల్లెత్తు

మాట అననిస్తావా నాకు తెలియనట్టు చెబుతున్నావు, సరే నీ మాటలెందుకు కాదనాలే ఇప్పుడు పిలిచి చెబుతాలే సీతకు,” అంటూ “ అమ్మా సీతా… ఏం చేస్తున్నావు తల్లి ఒకసారి ఇలా వస్తావు,”

మురిపెంగా పిలిచాడు. బయట స్నేహితులతో తొక్కుడుబిళ్ళ ఆడుతున్న సీతను.


“ఏంటి నాన్నా పిలిచారు? అంటూ వచ్చింది వయ్యారంగా. చూడడానికి చక్కటి రూపం నడకలో హంస వయ్యారం ఒలకబోస్తున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడే ఇంతందంగా ఉంది రేపు పెద్దయ్యాక ఎంతబాగా అవుతుందో? ఎంతమంది కళ్ళుపడతాయో అంటూంటారు చూసిన వాళ్ళందరు. కామాక్షికి బిడ్డను స్కూల్ కు పంపాలన్నా భయమే. ఏ మాయలపకీరు వచ్చి బిడ్డను ఎగరేసుకు పోతాడేమోనని. సీత స్కూల్ నుండి ఇంటికి వచ్చేవరకు భయపడుతూనే ఉంటుంది. అందుకే రఘును వేరే స్కూల్ కు పంపుతానంటే కూడా వద్దని. సీతకు తోడుగా ఉంటాడని ఇదే స్కూల్ లో వేయించింది.


“ఇంకా ఆటయిపోలేదా తల్లి. … స్కూల్ హోమ్ వర్క్ చేసుకోవాలి కదా! బావచూడు చక్కగా బుద్ధిమంతుడిలాగా చకచకా రాసుకుంటున్నాడు, నువ్వుకూడా కూర్చొని రాసుకోతల్లి ఏదైనా రాకపోతే బావ చెబుతాడు,” పిలవగానే వచ్చిన సీతను మురిపెంగా చూస్తూ చెప్పాడు ప్రకాశం.


మూతిసున్నాలా చుట్టి. “నాకెవ్వరు చెప్పక్కరలేదు నాన్న, నేను చక్కగా రాసుకోగలను నాకన్నివచ్చు,” అంటూ రఘువైపు చూస్తూ వెక్కిరించింది.


“చూడమ్మా సీతా … నా బంగారుతల్లివి కదా! బావను అలా వెక్కిరిస్తారా తప్పు కదా! సారి చెప్పు బావకు ఇంకెప్పుడు బావతో గొడవపడకు సరేనా,” అన్నాడు బుజ్జగిస్తూ.


“నేను చెప్పను,”అంది పెంకితనంగా.


“తప్పమ్మా అలా అనకూడదు, వాడికి నువ్వంటే పంచప్రాణాలు నువ్వేదడిగితే అది వెంటనే చెస్తాడు తెలుసా? నిన్ను కంటికిరెప్పలా చూసుకుంటాడు,” అంటుంటే గొంతుజీరపోయింది ప్రకాశంకు. తోడబుట్టిన చెల్లెలు గుర్తుకు వచ్చింది. ఆమెనే ఉంటే రఘు తల్లిలేని పిల్లవాడుగా ఉండేవాడా అనుకుంటూ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అదిచూసి కొంచెం కలవరపడింది సీత. నాన్నకు కోపం వచ్చిందేమోనని అనుకుంది మనసులో.


“సరే నాన్న బావకు సారి చెబుతాను,” అంటూ రఘు దగ్గరకు వచ్చి. ” నేను సారి చెప్పను పో, నాన్నకు ఏం చెప్పావు నామీద, ఉండు నీ సంగతి చెబుతా,” అంటూ నవ్వుతూ తండ్రివైపు చూస్తూ. “సారి చెప్పాను నాన్న … ఇంక నేను వెళ్ళి ఆడుకుంటాను,” అని తుర్రుమని పారిపోయింది. ఇప్పుడేమంటావు అన్నట్టుగా చూసాడు భార్యవైపు. ఆమె చిరునవ్వు నవ్వుతూ రఘు దగ్గరకు వెళ్ళిపోయింది. ఇదేమి పట్టనట్టు తన పని తాను చేసుకోసాడు రఘు. తలమీద చెయ్యివేసి నిమురుతూ.


“రఘూ … సీతమీద కోపంపోయిందా? ఇంకెప్పుడు అది నిన్నేమనదు, ఒకవేళ ఎప్పుడన్నా అది

నిన్నేమన్నా వెంటనే మామయ్యతో చెప్పు సరేనా,”అంది ఆప్యాయంగా.


“సరే అత్తా,” అన్నాడు. 'అయ్యో అత్తా సీతను మీరు మార్చలేరు. దానికి అందగత్తెనన్న పొగరుంది

మీరనుకున్నట్టు అది నాకు సారి చెప్పలేదు. పోనీలే అత్తా నువ్వన్న నన్ను ప్రేమగా చూసుకుంటున్నావు. అదిచాలు' అనుకున్నాడు మనసులో.


అదయ్యాక వారంరోజులవరకు రఘు, సీత ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. కానీ సీతకు మాత్రం రఝుమీద పట్టలేనంత కోపంగా ఉంది. నన్ను ఏనాడు ఒక్కమాట అనని నాన్నతో నామీద చాడీలు చెప్పి నన్ను తిట్టించాడు. ఎలాగైనా రఘును అందరిముందు ఎగతాళి చేయ్యాలి అని మంకుపట్టుతో ఉంది సీత.


“ఏయ్ పిల్లలు … మీరందరూ ఇప్పుడు మీరు చేసిన హోంవర్క్ బుక్కులు టేబుల్ మీద పెట్టండి,”

అంది టీచర్.


‘‘అలాగే టీచర్,” అన్నారు పిల్లలందరూ. ఈ లోపు లంచ్ బెల్ అవడంతో పిల్లలందరు బుక్కుల్ని టేబుల్ మీద పెట్టేసి తినడానికి వెళ్లారు. ఇదే మంచి అదనుగా చూసింది సీత. టీచర్ అందరిముందు రఘును తిట్టేలా చెయ్యాలి అనుకుంది. రఘు రాసిన హోంవర్క్ బుక్కులో రాసిన పేపర్లు చింపివేసి పెన్నుతో పిచ్చి పిచ్చి గీతలు రాసిపెట్టింది. టీచర్ వచ్చి అందరి బుక్కులు చూసింది. చివరకు రఘు బుక్కు తీసి చూసింది కోపంతో రఘును పిలిచింది. భయపడుతూ లేచినిలబడ్డాడు రఘు.


“ఇదేంటి పిచ్చి గీతలు రాసి తీసుకవచ్చావు తెలివిలేదా? స్కూల్ కు రావాలని ఉందా లేదా,” కోపంగా అడిగింది టీచర్.


“టీచర్ నేను అన్ని రాసాను,” అన్నాడు నసుగుతూ.


“ఏయ్ నల్లోడా అబద్ధాలు చెప్పకు,” గట్టిగా అంది సీత నవ్వుతూ. తోటిపిల్లలందరు నవ్వారు సీతమాటలకు.


“అంటే నేనే అబద్ధాలు చెపుతున్నానంటున్నావా?,” చూడు అంటూ బుక్కు విసిరికొట్టింది. బుక్కు తీసుకుని చూసాడు. ఆశ్చర్యంతో నోటమాటరాలేదు సీతవైపు చూసాడు. చూసావా నిన్నెలా దెబ్బదీసానో అన్నట్టుగా చూసింది సీత. రఘుకు కళ్ళవెంబడి జలజలా కన్నీళ్లు రాలాయి దీనంగా చూసాడు టీచరువైపు.


“ అదికాదు టీచర్ నేను మొత్తం హోమ్ వర్క్ చేసాను, ఎవరో కావాలని నా పేపర్లు చింపివేసారు,”

అన్నాడు సీతవైపు చూస్తూ.


“అబ్బా ఎన్ని నీతులు చెబుతున్నావురా, నీ రూపమే నలుపనుకుంటే నీ గుణంకూడ నలుపేనన్నమాట, అయినా నీ బుక్కు ఎవరికి కావాలి, రాయడం చేతకాక ఇన్ని మాటలు చెబుతున్నావు ఏది చెయ్యిపట్టు,” అంటూ బెత్తంతోటి పటాపట నాలుగుదెబ్బలు వేసింది. అప్పుడుగానీ చల్లారలేదు కోపం ఆమెకు. సీత పకపకానవ్వింది


అందరిముందు చిన్నతనం అయినందుకు మనసంతా బాధగా అయిపోయింది.ఇంకా అదిసరిపోలేదని స్కూల్ అయిపోయాక సీతతో పాటు తోటిపిల్లలందరు కలిసి. రఘును చూస్తూ “నల్లోడా నల్లోడా” అంటూ పాట పాడుతూ వెక్కిరిస్తూ వెళ్ళిపోయారు.


రఘుకు దుఃఖం ఆగడంలేదు ఏటైనా వెళ్ళిపోవాలని ఉంది. ముఖ్యంగా సీతకు దూరంగా సీతమీద

ఎంత ప్రేమపెట్టుకున్నాను. నాకు తగినశాస్తి కావలసిందే అందుకే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అంతేకాదు వెళ్ళేముందు సీత నన్ను మరిచిపోని గుణపాఠం చెయ్యాలి అనుకున్నాడు. ఆ బాధతోనే ఇంటికి వచ్చాడుగానీ, ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకోసాగాడు. రఘు మౌనంచూసి తనమీద నాన్నకు చెబుతాడేమోనని భయపడింది సీత.


“ఏమిట్రా రఘు … ఇంటికి వచ్చినప్పటినుండి చూస్తున్నాను, తినడానికి రావడంలేదు ఏమి మాట్లాడకుండా అలా గదిలోనే కూర్చున్నావు, ఏమైందిరా టీచరు ఏమైనా కోపంచేసిందా,”స్కూల్ నుండి వస్తూనే అత్తా ఆకలి అనుకుంటూ వచ్చే రఘు ఎంతసేపటికి రాకపోయేసరికి పడుకున్నదల్లా లేచి వచ్చి అడిగింది. సీతకు ఇంటికిరాగానే పళ్ళుంటే చాలు అవే తింటుంది.


“నాకలిగా లేదత్తా… రాత్రికి తింటాను చాలా రాసుకొనేది ఉంది,” తలవంచుకునే సమాధానం చెప్పాడు.

అమ్మకు ఏం చెబుతాడోనని చాటుగా వచ్చి విన్నది సీత.


ఇక ఆ రోజునుండి సీతను తప్పించుకుని తిరగసాగాడు రఘు. ఇంట్లోవాళ్ళకు అనుమానం రాకుండా ఎప్పుడు ఏదో ఒకపని కలిపించుకుని అత్తకు సహాయం చేస్తూ. సీత తనను మరిచిపోకుండా ఏం చెయ్యాలి అని ఆలోచించసాడు. సీతకైతే రఘు ఉనికే పట్టనట్టు రఘువైపు కన్నెత్తి కూడా చూసేదికాదు. అలా ఇద్దరు ఏడవతరగతి పాసయ్యారు. సీత ఎంత అసహ్యించుకున్నా రఘుకు సీతమీద పంచప్రాణాలు. చాటుగా సీతను చూస్తూ మురిసిపోయేవాడు.


ఒకరోజు ప్రకాశం వాళ్ళ స్నేహితుడికి యాక్సిడెంట్ అయిందంటే, కామాక్షి ప్రకాశం ఇద్దరు వెళ్ళారు.

రఘును సీతను ఇంట్లోనే ఉండమన్నారు తొందరగా వస్తామంటూ, సీత ఒంటరిగా దొరికినందుకు

ఏదైనా మాట్లాడాలని ఉంది రఘుకు. ఇదేం పట్టనట్టు తనపాటికి తను టీవి చూస్తూ వేరుశనక్కాయలు

తింటుంది సీత. చాలా సేపు చూసాడు రఘు తనకు కూడా ఇస్తుందేమోనని. ఇంట్లో ఇంకో మనిషి ఉన్నాడన్న ఆలోచనకూడా లేదు సీతకు.


“సీతా… నాకు ఇవ్వవా వేరుశనక్కాయలు,” అడిగాడు ఎంతో ప్రేమగా.


“నేనెందుకివ్వాలి తెచ్చుకోపో లోపలనుండి,” కసురుకుంది.


“అదికాదు సీతా… ఇద్దరం కలిసి తిందాము అన్ని ఉన్నాయి కదా! మాట్లాడుకుంటూ తిందాము,”

అన్నాడు.


“ఛీ… ఛీ… నీతోనా మాట్లాడుకుంటూ తినాలా,ఎప్పుడన్నా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా?

అయినా నీతోటి నాకు మాటలేంటి నువ్వెవరు నేనెవరూ,” వెటకారంగా అంది.


మనసు చివుక్కుమంది రఘుకు. ఎక్కడలేని ఆవేశం వచ్చింది. గబగబా దేవుడి గదిలోకి వెళ్ళి

అటూ ఇటూ చూసాడు ఏమి కనిపించలేదు. దేవుడివైపు చూసాడు అమ్మవారి మెడలో తాళిబొట్టు కనిపించింది. అంతే ఇంకేమి ఆలోచించకుండా రెండుచేతులు జోడించి దండంపెట్టి. అమ్మవారి మెడలో మంగళసూత్రం తీసుకవచ్చి, గబుక్కున సీతమెడలో వేసి నుదుట కుంకుమ అద్దాడు. అనుకోని ఈ సంఘటనకు బిత్తరపోయి చూస్తూ నిలుచుంది సీత. చేతులతో మంగళసూత్రం పట్టుకుని బోరుమని ఏడుస్తూ, కోపంతో తిడుతూ మెడలోని తాళిబొట్టును తీసివెయ్యబోయింది.


“ఆగు సీతా… అది తీసివెయ్యకు అమ్మవారి మెడలోనుండి తెచ్చాను, నువ్వు అవునన్నా కాదన్నా నీకు నాకు పెళ్ళి అయిపోయినట్టే, జీవితంలో పెళ్ళి ఒకసారే జరుగుతుంది ఇంకనువ్వేమి చెయ్యలేవు,” అంటూ సీత దగ్గరకు రాబోయాడు.


“నోర్ముయ్ ఒక్కమాట మాట్లాడవంటే చంపేస్తాను నిన్ను, అమ్మా నాన్న రాని నీ సంగతి చెబుతా, నిన్ను పోలీసులకు పట్టించకపోతే నాపేరు సీతనే కాదు, నేను చావనన్నా చస్తాగానీ నీలాంటి కురూపిని మాత్రం చేసుకోను,” అంటూ పిచ్చిదానిలా అరుస్తూ తాళి తియ్యబోయింది. ఇంతలోనే కామాక్షి , ప్రకాశం వచ్చారు చటుక్కున లోపలకు దాచుకుంది. రఘు తాళికట్టాడుగానీ కాళ్ళుచేతులు వణకసాగాయి. మామకు తెలిసిందంటే నన్ను నిజంగానే ఇంట్లోనుండి వెళ్ళగొట్టడమో, లేక పోలీసులకు అప్పచెప్పడమో చేస్తాడు. అంతకంటే ముందే నేనే ఇంట్లోనుండి వెళ్ళిపోవడం ఉత్తమం అనుకుని. పెరటిగుండా బయటకు పరుగెత్తాడు ఎటువెళ్ళాలో తెలియక తికమకపడుతూ ఆగకుండా వెళ్ళిపోయాడు.


“సీతా… ఏమిటే నీ కళ్ళు అలా ఉన్నాయి ఏడిచావా? బావా నువ్వు పోట్లాడుకున్నారా ఏంటి,

రఘు ఎక్కడున్నాడు ఒక్కదానివే ఉన్నావా?” కూతురు కళ్ళు ఎర్రగా ఉండడంతో అడిగింది కామాక్షి.

ఏమి సమాధానం చెప్పలేదు సీత.


“ఏమిటే ఏమైంది మాట్లాడవు అలా బెల్లం కొట్టిన రాయివలే నిలుచున్నావు,” అంది సీతను దగ్గరకు తీసుకుంటూ. తల్లిని గట్టిగా అలుముకుని బోరుమంది సీత.


“సీతా … సీతా … అయ్యో నా బంగారు తల్లి ఏమైందే,” బుజ్జగిస్తూ అడిగింది. లోపలదాచుకున్న

తాళిబొట్టు చూపిస్తూ.


“ఇది … ఇది నామెడలో కట్టాడు బావ, ఇంక నేను జన్మలో మరెవరిని పెళ్ళిచేసుకోవద్దట, తననే నా భర్త అంటూ ఏవేవో కోతలు కోసాడమ్మా, అమ్మా … ఇది తీసివెయ్యకూడదా? నాకిది వద్దు,” అంటూ

తల్లి గుండెలో తలదాచుకుంది.


“అయ్యయ్యో ఎంతపని జరిగిందే తల్లి, వాడేడి ముందు వాణి పని చెబుతా, మళ్ళీ నువ్వే వాణ్ణి రెచ్చగొట్టావేమో లేకపోతే వాడు ఇలాంటి పని చేసేవాడు కాదు, సరే జరిగింది మంచికో చెడుకో జరిగింది గానీ, ఈ విషయం ఎవ్వరికి చెప్పకు ముఖ్యంగా మీ నాన్నకు, కోపంతో వాణ్ణి చంపినా చంపుతాడు,” అంది.


“అమ్మా చంపనివాణ్ణి……నేను ఇప్పుడే నాన్నకు చెప్పి ఇది తీసి వాడి ముఖానా కొడతాను,” అంటూ వెళ్ళబోయింది సీత.


“సీతా … ఆగు… నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నువ్వింకా చిన్నపిల్లవు, ఆడదానికి పెళ్ళంటూ జరిగితే ఒక్కసారే జరుగుతుంది, అది దేవుడి నిర్ణయం దాన్ని ఎవరు మార్చలేరు, పైగా నీ మెడలో ఉన్నది మాములు తాళిబొట్టుకాదు ఆ ఆది దంపతులైనా అమ్మవారిది అది తియ్యకూడదు, మీ నాన్నకు నేనేదో సర్దిచెబుతాను నువ్వు మాత్రం ఈ విషయం ఎవరికి తెలియనివ్వకు,” అంది సీత గడ్డంపట్టుకుని బ్రతిమాలుతూ.

===========================================================

ఇంకా ఉంది...

===========================================================

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.




145 views0 comments
bottom of page