top of page

మనసంతా నువ్వే 2


'Manasantha Nuvve 2' New Telugu Web Series

Written By Lakshmi Sarma Thrigulla

'మనసంతా నువ్వే 2' తెలుగు పెద్ద కథ

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఇక మనసంతా నువ్వే పెద్ద కథ 2/3 చదవండి

“ఛీ... అంటే ఆ నల్లటివాడే నా మొగుడు అంటావు, నేను చచ్చినా వాడిని చేసుకోను. మీరు బలవంతంగా నన్ను ఒప్పించారంటే, మీకెవ్వరికి కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోతాను, ” అంది బెదిరిస్తూ.


“అయ్యో అవేం మాటలే తల్లి, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాము నిన్ను, ఆ అపశకునం మాటలెందుకు మాట్లాడుతున్నావు, పైన తథాస్తూ దేవతలుంటారట. ఇంకెప్పుడు అలా అనకు. నీ బాగోగులు మాకు తెలుసు కదా! మీ నాన్న నేను అన్నీ చూసుకుంటాము. నువ్వు ఆ విషయం వదిలేసి ముందు చదువు మీద ధ్యాసపెట్టు ” అంది సీతను దగ్గరకు తీసుకుంటూ.


రఘు చేసిన పనికి రఘును మందలించాలని ఇల్లంతా వెదికింది. రఘు కనిపించలేదు. సాయంకాలమైనా రఘు ఇంటికి రాలేదు. ఏమైనా అంటారనే భయంతో ఎవరైనా స్నేహితుడి ఇంటిలో దాక్కున్నాడేమో, ఎక్కడికి పోతాడు వాడే వస్తాడు.. ఈ విషయం ఈయనకు తెలిసిందంటే చంపేస్తాడు వాణ్ణీ. ఇప్పుడే ఏమి చెప్పను.. అనుకుని రఘు గురించి అడిగినా కావాలనే అబద్ధం చెప్పింది, స్నేహితుడింటికి వెళ్లాడని.రఘు ఇంట్లోనుండి వెళ్ళిపోయి పరుగుపెడుతూనే ఉన్నాడు. ఉన్న ఊరు దాటాడు. తనకోసం ఎవరైనా వస్తున్నారేమోనని వెనక్కి కూడా చూడకుండా పరుగెడుతున్నాడు. ఎదురుగా వస్తున్న లారిని ఆపి అందులో ఎక్కేసాడు.


“ఏంది పిల్లగా ఇంట్లో చెప్పకుండా వస్తున్నావా? ఎక్కడనన్నా దొంగతనం చేసావా భయపడుతున్నావు? పోలీసులు తరుముతున్నారా, ” అడిగాడు లారీ డ్రైవరు.


“కాదుకాదు.. దొంగతనం చెయ్యలేదు, మా మామ నన్ను కొడతాడని ఇంట్లోనుండి తప్పించుకుని వస్తున్నాను, ” అంటూ జరిగిందంతా చెప్పాడు.


“అయ్యో బిడ్డా.. ఎంతపని జరిగింది, పోనిలే నువ్వు నాతోనే ఉందువుగానీ.. నాకు పిల్లలులేరు. నీకు పిడికెడంతా కూడు పెట్టుడు నాకేం బరువుకాదు బిడ్డా, ” అన్నాడు ఆప్యాయంగా రఘు భుజంమీద చెయ్యివేస్తూ. ఆ ఆప్యాయతకు రఘు కళ్ళు చెమరించాయి. బికారిలాగా అయిపోతుంది అనుకున్న తన బ్రతుకుకు తోడు దొరికినందుకు సంతోషంతో దేవుడికి దండం పెట్టుకున్నాడు మనసులోనే.


ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదు సీతకు. ఎందుకంటే తన స్నేహితులతో ఎప్పుడు చెప్పేది. నాకు అందమైన రాకుమారుడిలాంటి భర్తవస్తాడని ఎప్పుడు చెప్పేది.


“వాళ్ళుకూడా అవునే సీతా.. నీ అంత అందగత్తెకు ఖచ్చితంగా రాకుమారుడే వస్తాడనే వాళ్ళు, ”కానీ! ఒక్క రాణి మాత్రం ఎప్పుడు నన్ను ఏడిపించేది.


“నీకు మీ బావనే సరిజోడి, ” అని.


“ఏంకాదు .. నేను ఆ నల్లోడిని అస్సలు చేసుకోను, కావాలంటే నువ్వే చేసుకో ఆ నల్లోడిని, ” అంటూ గొడవేసుకునేది. అలాంటిది ఇప్పుడు మా అమ్మ ఆ తాళిబొట్టు తీయ్యద్దొ మంచిదికాదు అంటుంది అంటే, ఖచ్చితంగా నాకు అతనితోనే పెళ్ళి జరిపిస్తారన్నమాట. అమ్మో నా వల్లకాదు. నేను ఒప్పుకోను. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఇంట్లోనుండి వెళ్ళిపోయి వీళ్ళను భయపెట్టిస్తాను. నాకు వేరే పెళ్ళి చేస్తానంటేనే ఇంటికి వస్తాను అన్నాననకో. తప్పకుండా ఒప్పుకుంటారు. ఖచ్చితంగా అలానే చేస్తాను.. అనుకుని తృప్తిగా కళ్ళుమూసుకుని పడుకుంది. ఉదయం లేస్తూనే చకచకా తయారయి స్కూల్ కు వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోయింది అనుమానం రాకుండా. సాయంకాలం ఐదవుతున్నా సీత ఇంటికి రాకపోవడంతో కంగారు పడసాగింది కామాక్షి.


“ఏమండి .. మన సీత ఇంతసేపైనా స్కూల్ నుండిరాలేదు, ఒకసారి స్కూల్ వరకు వెళ్ళి చూడండి, అక్కడే వుందేమో.. లేకపోతే ఎవరైనా స్నేహితుల ఇంటికి వెళ్ళిందేమో కనుక్కోండి, ” భయపడుతూ చెప్పింది కామాక్షి, అప్పుడే ఆఫీసునుండి ఇంటికి వచ్చిన భర్తతో.


“అదేమిటి.. ఇంతసేపయినా రాకపోవడమేంటి? నువ్వేం చేస్తున్నావు.. అలా వెళ్ళి చూడాలి కదా!

ఇవాళ రేపు రోజులు మంచిగాలేవు, ” అంటూ భార్యను విసుక్కుంటూ చెప్పులు వేసుకుని పరుగు పరుగున వెళ్లాడు. కామాక్షి మనసు ఏదో కీడు శంకిస్తుంది. నిన్న జరిగిన దానికి కావాలనే ఇంటికి రాకుండా ఉండిపోయిందా? లేక స్నేహితురాలింటికి వెళ్ళిందా ? భర్తతో విషయం చెప్పాలా వద్దా? నిన్ననగా వెళ్ళిన రఘు కనిపించడంలేదు, ఈ రోజు సీతకనిపించడంలేదు. ఒకవేళ రఘు సీతను ఎక్కడికైనా ఎత్తుకుని పోయాడా? ఛ..ఛ.. వాడికంత ధైర్యంలేదు. మరీ ఎక్కడున్నారు వీళ్ళద్దరూ.. మనసు పరిపరివిధాల ఆలోచించసాగింది కామాక్షికి. కాళ్ళీడ్చుకుంటూ వచ్చిన భర్తను చూసి,


“ఏమండి .. సీత కనిపించలేదా? ఒక్కరే వచ్చారు, ఏమైందండి, ” ఆదుర్దాగా అడిగింది.


“కాముడు .. మన సీత ఉదయం కూడా స్కూల్ కి రాలేదట, ఊరంతా గాలించినా దొరకలేదు.

దాని స్నేహితులందరిని అడిగాను. ఎవ్వరు మాకు తెలియదని చెప్పారు, రఘు ఎక్కడా.. వాడుకూడా స్కూల్ కి రాలేదట. వాడికేమైంది? కాముడు.. వాణ్ణి పిలువు. వాడికేమైనా తెలుసేమో అడుగుదాం, ” అడిగాడు ప్రకాశం.


గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు గతుక్కుమంది కామాక్షి. ఇప్పుడెలా.. జరిగినది చెప్పాలి, తప్పదు. లేకపోతే వీళ్ళిద్దరు ఏమైపోయారో ఎలా తెలుస్తుంది.. భయపడుతూ నిన్న రఘుకు సీతకు జరిగిన విషయం మొత్తం చెప్పింది. కోపంతో కామాక్షి చెంప పగులగొట్టాడు ప్రకాశం.


“నువ్వు కన్నతల్లివా పాషాణనివా? కన్నకూతురికి వాడెవడో అలా చేస్తే నాలుగు తన్నాల్సింది పోయి వాణ్ణి వెనకోసుకొస్తావా? నాకెందుకు చెప్పలేదు ఈ విషయం.. ఇప్పుడు వాడే మన సీతను ఎక్కడికో తీసుకుని పోయింటాడు. ఉండు.. ఇప్పుడే వెళ్ళి ఫోలీసు కంప్లయింట్ ఇచ్చి వస్తాను, ” అంటూ కోపంతో వెళ్ళాడు. భయంతో నోటమాటరాక చూస్తుండి పోయింది కామాక్షి.


సీత ఇంట్లో నుండి వెళ్ళి ఊరవతల పాత దేవాలయంలో దాక్కుంది. తను కనిపించక పోయేసరికి తనను వెతుకుతూ ఇక్కడకు వస్తారని ఎదురుచూస్తుంది. మధ్యాహ్నం అవుతుంది. కడుపులో ఆకలి భరించుకోలేకపోతుంది. ఇంటికి వెళ్ళి పోదామనిపిస్తుంది కానీ! నా మాట వినాలంటే ఇలా చేస్తేనే నా మాట వింటారు. ఒక్క రోజుకు ఎలాగోలా భరించుకుంటాను. ఇక్కడ భయంగా ఉంది. అమ్మానాన్నా తొందరగా వేస్తే బాగుండు.. అనుకుంటూ అక్కడేవున్న అరుగుమీద కూర్చుంది.


ఎంతసేపటినుండో సీతను గమనిస్తున్న వీరయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ఈ పిల్లను చూస్తే పసందుగా ఉంది. పట్నం తీసుకపోయి జయమ్మకు అమ్మేసానంటే చాలా డబ్బులు వస్తాయి. చాలా రోజులైంది ఇంతమంచి పిల్ల దొరక్క. జయమ్మ చూసిందంటే ఎంత సంతోషపడుతుందో, అనుకుంటూ సీతకు వెనుకగా వచ్చి చటుక్కున తన దగ్గరవున్న మత్తుమందుతో నోరుమూసాడు. తను వచ్చిన కారులో పడుకోబెట్టి చుట్టు చూసాడు.. తనను ఎవరైనా చూస్తున్నారా అని. ఎవ్వరు లేకపోవడంతో కొండనెక్కినంత సంతోషంగా బయలుదేరాడు.


పోలీసు కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఊరంతా తిరిగాడు. ఎక్కడా సీతజాడ కనిపించలేదు. ఊసురోమంటూ ఇంటికితిరిగివచ్చాడు. కామాక్షి గుండెలవిసేలా ఏడుస్తుంది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఓదార్చసాగారు. ప్రకాశానికైతే మతిస్థిమితం తప్పినవాడిలా వెర్రిచూపులు చూస్తూ కూర్చున్నాడు. రోజులు గడుస్తున్నాయన్నమాటే కానీ! సీత జాడను పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు.


“అక్కా బంగారు పిచ్చుకను పట్టుకొచ్చాను చూడు, ” అంటూ చేతులు కట్టేసి నోటికి బట్టకట్టిన సీతను జయమ్మ ముందట నిలుచోపెట్టాడు. గింజుకుంటుంది సీత.. తనెక్కడుందో అర్ధంకావడంలేదు.


“బలే పిల్లను పట్టుకొచ్చినవు. గొప్పింటి బిడ్డలాగుంది ఎక్కడ దొరికిందేంటి, ఏంది ఈ మధ్యకాలంలో ఒక్క పిల్లను కూడా పట్టుకరాలేదు. ? ఏమయిపోయావు.. ఏంటి సంగతి వీరయ్యా, ” కిళ్ళీ నములుతూ సీతను ఎగాదిగా చూస్తూ అడిగింది.


“ఏం చెయ్యమంటావక్కా.. ఈ మద్దెకాలంలో పోలీసులు బెడద ఎక్కువయింది, వాళ్ళకు దొరకకుండా పట్టుకురావాల్నాయే, పట్నంలో పిల్లలకు కొదవలేదు కానీ ! ఇదిగో ఈ పోలీసోల్లతోటే మింగుడు పడుతలేదక్క, గట్ల ఊర్ల యెంబటి తిరిగితుంటే ఈ గుంట చేతికి చిక్కింది, ఇదిగో జయంమక్కా.. ఈ సారి నాకు పైసలు కొంచెం ఎక్కవియ్యి, ఎందుకంటే మంచి గుంటను తీసుకొచ్చిన.. నీకు శాన పైసలొస్తయ్, ” చెప్పాడు నీళ్ళు నములుతూ.


“వీరయ్యా.. నీకు గొంతు బాగానే లేస్తుంది కదా! సరేసరే ఎప్పుడు ఇచ్చిన దానికంటే రెండువందలు ఎక్కువే ఇస్తాలే," తన నడుముకున్న సంచిలోనుండి పన్నెండువందల రూపాయలు ఇచ్చింది. సంతోషంగా తీసుకుని వెళ్ళిపోయాడు వీరయ్య. సీతకు కొంచెం అర్ధం అవసాగింది. అంటే నన్ను ఇక్కడ అమ్మేసాడన్నమాట. ఆ విషయం తలచుకోగానే బోరుమని దుఃఖం పొంగుకొచ్చింది.


“ఏయ్ పిల్లా ఏ ఊరు మనది, ” అడుగుతూ దగ్గరకు వచ్చి చేతులకున్న కట్లువిప్పి నోటికున్న బట్టను వీడదీసింది.


“అమ్మా ..” అంటూ జయమ్మను కౌగిలించుకుంది. అయోమయంగా చూస్తూ సీతను గట్టిగా పట్టుకుంది జయమ్మ. అమ్మా అనే పిలుపుకు నోచుకోని జయమ్మకు, సీత అలా పిలిచేసరికి ఒళ్ళంతా పులకించిపోయింది. ఆర్తిగా గుండెలకదుముకుంది ఏన్నో జన్మల బంధంలా అనిపించసాగింది. ఏడుస్తున్న సీతను ఓదారుస్తూ.

“చూడు తల్లి .. నీకేం భయంలేదు నువ్వు నా కన్న బిడ్డలాంటిదానివి, నిన్ను ఎవ్వరు ఏమి అనరుగానీ ఏడవకు తల్లి," అంది సీత కళ్ళు తుడుస్తూ.


వెక్కి వెక్కి ఏడుస్తున్నదల్లా ఏడవడం ఆపి. “నన్ను మా అమ్మానాన్నల దగ్గరకు పంపిస్తావా?" అడిగింది అమాయకంగా.

“ఇక్కడకు రావడమేగానీ బయటకు పోయేది ఉండదు. నువ్వు నన్ను అమ్మా అని పిలిచావు కాబట్టి .. నిన్ను నా బిడ్డగా చూసుకుంటాను. కాదుకూడదు అని నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసావో, నిన్ను పిట్టను కాల్చినట్టు కాల్చి చంపుతారు నా మనుషులు. నీకేలోటు రాకుండా చూసుకుంటాను. అర్ధమైంది కదా, ” అంది కళ్ళు పెద్దగా చేస్తూ. బెదిరిపోయింది సీత. అలాగే అన్నట్టు తలవూపింది.


తన దగ్గరున్న అందరిని పిలిచి సీతను పరిచయం చేసింది. “ చూడండి.. ఈ అమ్మాయిని నేను నా కూతురుగా పెంచుకుందామనుకున్నాను. తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవ్వరు తన జోలికి రాకుండా చూసుకునే బాధ్యత మీది. రేపు రేపు నాకు వారసురాలు కావాలి కదా! అందుకే బాగా ఆలోచించాను. ఆ చూడమ్మా.. నీ పేరు నువ్వు మరిచిపో.. నేను కొత్తపేరు పెడుతున్నాను, ఈ రోజునుండి తనను అందరు ఊర్వశి అని పిలవాలి. చూడు ఊర్వశి.. వీళ్ళందరితోటి నువ్వు మంచిగా మసలుకోవాలి, ఇదిగో ఈమే పంకజం, తను నాగవల్లి, పార్వతి, రజిని, ” అందరిని పేరుపేరునా పరిచయం చేస్తూ “నీకేది అవసరమైనా వీళ్ళను అడుగు అర్ధమైందా, ” అంది. బిక్కుబిక్కుమంటూ వాళ్ళవైపు చూసింది. వాళ్ళను చూస్తుంటే ఒళ్ళు జలదరించినట్టయింది సీతకు.


కాలచక్రం రివ్వున తిరిపోతుంది. సీతకోసం అహర్నిశలు ఎదిరిచూసి చూసి తలలు పండుతున్నాయి కామాక్షి ప్రకాశంలకు. సీత జాడ తెలియక, ఉన్న ఊర్లో ఉండలేక, ఉన్న ఇల్లు అమ్మేసి ఎక్కడో పల్లెటూరికి పోయి బ్రతకసాగారు. మధ్యలో ఎప్పుడన్న ఒకసారి వచ్చి వెళుతుంటాడు ప్రకాశం. కూతురు ఎప్పుడన్న వస్తుందేమో అన్న ఆశతో.


దిక్కుమొక్కులేని జీవితం గడపాలేమో అనుకున్న రఘు జీవితం పూలబాటలా సాగిపోయింది. లారీ డ్రైవర్ తీసుకుపోయి కన్నకొడుకులా పెంచుకొని మంచి చదువు చెప్పించాడు. ఐఏఏస్ అయ్యాడు. రఘుకు సీత గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు పులకరించిపోయేది. ఎప్పటికైనా సీతే తన భార్య అనుకుని మురిసిపోయేవాడు.


ఇప్పుడెలా ఉన్నారో ఒకసారి వెళ్ళి చూసిరావాలి. ఇప్పుడు నాకు మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మామ కూడా నన్ను ఏమి అనడు అనుకుని బయలుదేరాడు. దారిలో సీతకోసం పచ్చిటి పట్టుచీర, చెవులకు బంగారు దుద్దులు తీసుకున్నాడు. మనసు ఆనందంతో పరుగులుపెడుతుంటే పరవశించిపోయాడు.


సీతకోసం, ఎంత ఉత్సాహంతో వెళ్లాడో అంతకంటే గుండెలు పిండేసే బాధతో వెనుతిరిగాడు, అక్కడి వాళ్ళు చెప్పిన నిజం విని. ఎంత అభాండం వేసారు తన మీద.. సీతను నేను ఎత్తుకపోవడమేంటి? అసలు సీత ఏమైంది.. నా మీద కోపంతో ఆత్మహత్య చేసుకోలేదు కదా! సీత అంతపిరికిది కాదు. చాలా మొండిఘటం. అలాంటి పిచ్చిపనులు చెయ్యదు. అయితే సీత ఏమైనట్టు? సీతను ఎవరైన ఎత్తుకొని వెళ్ళిపోయారా? ఇన్నేళ్ళనుండి సీత ఎక్కడుంది.. ఎన్ని కష్టాలుపడుతుందో ఏమో.. సీతను తీసుకవెళ్ళిన వాళ్ళు ఏ వేశ్య కొంపలకో అమ్మేసుంటారు.

అలా అనుకునేసరికి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. మనసంతా కకావికలం అయింది. అలా జరగడానికి వీలులేదు, సీత ఎక్కడున్నా వెతికి వెతికి తీసుకొస్తాను. నా మీద పడిన నిందను తొలగించుకుంటాను. పవిత్రమైన మంగళసూత్రం తన మెడలో ఉంది. తను ఎక్కడున్నా పవిత్రంగానే ఉంటుంది. తను ఎలాగున్నా నాకు పవిత్రురాలే. ఈ రోజునుండే మొదలుపెడతాను. తను ఎక్కడున్నా తీసుకవస్తాను.


“అమ్మా .. ఊర్వశి .. ఈ రోజునుండి నీకు ఈ ఇంటిబాధ్యతలు అప్పచెప్పుతున్నాను, నేను పెద్దదాన్నీ అయ్యాను. నువ్వే చూసుకోవాలి ఇదంతా, ” చెప్పింది జయమ్మ ఊర్వశి (సీత)తో

“అమ్మో నేనా .. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు, ఇంకా ఎవరికైనా అప్పచెప్పు నీ దగ్గర చాలా మందే ఉంటారు కదా! నేను నా చదువు నేను చదువుకుంటాను, ” చెప్పింది సీత.


“అదికాదు తల్లీ.. ఇంత ఆస్తికి నువ్వే వారసురాలివి, నా తరువాత నువ్వే ఈ వ్యాపారం చెయ్యాలి, నువ్వు చక్కటి పిల్లవాడిని చూసి పెళ్ళిచేసుకుని పిల్లపాపలతో హాయిగా ఉండాలి. నేను చనిపోయేంతవరకు నువ్వు నన్ను చూసుకుంటే అంతే చాలు. నా బ్రతుకెలాగు పాడైపోయింది. ఏ తల్లి కన్నబిడ్డవో నాకు దొరికావు. నిన్ను చూడగానే నాలో మమకారం పొంగిపోయి నిన్ను నా కన్నబిడ్డలా ఇన్నాళ్ళు చూసుకున్నాను. నువ్వు గడపదాటితే నా కెక్కడ దూరం అవుతావని ఇంట్లోనే అన్ని వసతులు కలిపించాను. చదువు, సంగీతం, డాన్సు, చెప్పించాను. నీకు కాలక్షేపం కోసం పెద్ద టీవి తెప్పించాను. ఇవన్ని ఎవరికోసం చేసాననుకున్నావు..


నీ కోసం.. నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోవద్దని నాతోనే ఉండాలని చేసాను. నన్ను ఆ రోజు అమ్మా అని పిలచావు. అదే పిలుపును వింటూ నా చివరి జీవితం నీ చేతుల్లో పోవాలని ఉంది. నా కోరిక తీరుస్తావు కదూ, ” అడిగింది జయమ్మ. ఈ మధ్య ఆమెకు కాన్సర్ వ్యాధి సోకింది. ఎక్కువ రోజులు బ్రతకదని చెప్పారు డాక్టర్లు. అందుకే ఆమెకు భయంపట్టుకుంది చనిపోతానని.


సీతకు ఆమెను చూస్తుంటే జాలిగా అనిపించింది. తను తల్లితండ్రులకు దూరమైనప్పటినుండి జయమ్మ కంటికిరెప్పలా కాపాడింది. అదే వేరొకరిచేతిలో పడి ఉంటే నా జీవితం కుక్కలుచింపిన విస్తరయ్యేది.


చక్కగా అమ్మానాన్నలతో గడపాల్సిన నన్ను రఘు వలన దూరమయ్యాను. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే రఘును అనరాని మాటలని చాలా బాధపెట్టాను. పాపం ఎవరూలేని రఘు ఎన్ని కష్టాలుపడుతున్నాడో,


నాకు అమ్మానాన్నలు. దూరమయ్యారు అన్న బాధతప్పితే నన్ను అపురూపంగా చూసుకుంది ఈమే. ఒక విధంగా నేను అదృష్టవంతురాలననే అనుకోవాలి. నేను కోరుకొనేది ఒక్కటే, ఎప్పటికైనా మా అమ్మానాన్నలను కలుసుకోవాలి, అలాగే రఘును కలిస్తే నన్ను క్షమించమని వేడుకోవాలి ఈ రెండే నాకున్న కోరికలు.. ఆలోచనల్లో ఉండగానే జయమ్మ మెలికలు తిరుగుతూ గట్టిగా మూలిగింది.


“అయ్యో అమ్మా .. ఏమైంది డాక్టర్ ను పిలవనా, పోని మనమే హాస్పిటల్ కు వెళదాము పద, ” అంటూ ఆమెను లేపడానికి ప్రయత్నం చేసింది.


“ఉహు .. లేవలేను నన్ను వదిలేయ్యి నేనింకా ఎంతోసేపు బ్రతకను, ఇదిగో ఆ బీరువా తాళాలు తీసుకరా.. నీకు నీకు మీ వాళ్ళ అడ్రసు చెబుతాను, ” అంది శరీరం వణుకుతుండగా.


“అదికాదమ్మ.. ముందు మనం హాస్పిటల్ కు పోదాంపదా, అవన్నీ తరువాత మాట్లాడుకుందాము, ” అంటూ ఫోన్ చెయ్యబోయింది.


“వద్దమ్మా .. నువ్వు ఫోన్ చేసి డాక్టర్ వచ్చేలోపల నా ప్రాణాలు హరీ అంటాయి, ముందు నీకు చెప్పవలసినవి నాలుగు మాటలు చెప్పని, ముందు నువ్వెళ్ళి బీరువాలోనుండి బ్యాగు తీసుకురా” అంది ఆయాసపడుతూ. సరేనంటూ వెళ్ళి తీసుకవచ్చింది.


“ఇలా నా దగ్గరగా వచ్చి కూర్చో తల్లి, ఆ ఆ బ్యాగులో ఉన్న కాగితాలు తీసి నాకివ్వు, ” అంది.

అన్ని కాగితాల కట్టలు తీసి జయమ్మ చేతిలో పెట్టింది సీత.


“నువ్వు నన్ను అసహ్యించుకోవద్దు, ఎందుకంటే నీ తల్లితండ్రుల గురించి తెలిసికూడా నీకు చెప్పలేదని నా మీద కోపం వస్తుందేమో, నీకు తెలిస్తే నన్ను విడిచి వెళ్ళిపోతావని నీకు చెప్పలేదు. ఏనాటికైనా చెప్పవలసి వస్తే అప్పుడు చూద్దాంలే అని జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇదిగో మీ అమ్మానాన్న ఉంటున్న ఊరు. నేను పోయిన తరువాత నువ్వు మీ అమ్మానాన్నలను తీసుకవస్తావని, వాళ్ళు నీకు తోడుగా ఉంటారని చెపుతున్నాను. అంతేకాదు .. ఇదిగో.. నేను సాధించిన ఆస్తులన్నీ నీ పేరుమీద చేసాను. బీరువాలో ఉన్న నగలన్నీ నీకే సొంతం. నువ్వు కళకళలాడుతూ ఉంటే చూడాలనుకున్నాను కానీ! ఆ దేవుడు నాకు ఇంతవరకే ఆయుష్షు ఇచ్చాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నా కూతురుగా పుట్టాలని కోరుకుంటున్నాను.


నేను సంపాదించినదంతా పాపిస్టి సొమ్ము.. కాదనను. కానీ! నేను మోసగించబడ్డాను. దానికి ప్రతీకారంగా అడ్డదారిలో వెళ్ళాను. నువ్వు నా దగ్గరకు రాకపొయుంటే కనుక నా జీవితంలాగే అయిపోయేది నీ జీవితం. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నా.. కోరి..క, ” అంటూనే ఊర్వశి ( సీత) చేతిలోనే తన చెయ్యి జారిపోయింది. జయమ్మ ప్రాణం అనంతంలో కలిసిపోయింది. ఏం చెయ్యాలో తోచక చూస్తుండిపోయింది సీత.


సరిగ్గా అదే సమయంలో పోలిస్ రైడింగ్ జరిగింది జయమ్మ ఇంటిమీద. రఘు సీతకోసం అన్వేషణ మొదలుపెట్టి ఎక్కడెక్కడ వేశ్యా గృహాలు ఉన్నాయో తెలుసుకుని వాటిమీద రైడింగ్ చెయ్యడం. సీత దొరుకుతుందేమోనని వెతకడం రోజులతరబడి జరుగుతునే ఉంది. మారుమూలలో ఉన్న జయమ్మ ఇల్లు కనుక్కోవడం చాలా కష్టం. ఇంతవరకు ఎవరు గుర్తుపట్టడం జరుగలేదు. రఘుకు ఎలా తెలిసిందో కానీ! ఒక్కసారిగా పోలీసు బలగంతో వచ్చాడు. జయమ్మ శవం దగ్గర దిక్కుతోచని దానిలా ఆలోచిస్తూ కూర్చుంది సీత.

===========================================================

ఇంకా ఉంది...

===========================================================

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

56 views1 comment

1 Comment


sunanda vurimalla • 4 hours ago

బాగుంది మేడం

Like
bottom of page