top of page

నాకేమవుతోంది…? ఎపిసోడ్ 17


'Nakemavuthondi Episode-17' New Telugu Web Series

Written By Mallavarapu Seetharam Kumar

'నాకేమవుతోంది…?' తెలుగు ధారావాహిక ఎపిసోడ్ 17

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ…


కొత్తగా పెళ్ళైన ప్రియ అనే యువతిని ఆమె భర్త తరుణ్ నిద్ర లేపి, ఆమె తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు. అతన్నే అనుమానిస్తుంది ప్రియ. అతని వల్ల తనకు హాని కలగవచ్చునని తండ్రికి మెయిల్ పెడుతుంది.

స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్.

హన్సికని తను హత్య చేసినట్లు ప్రియ తనతో చెప్పిందని అంటాడు తరుణ్.

పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్. కానీ తరువాత రంగనాథాన్ని, రిసార్ట్ మేనేజర్ సందీప్ ని విడుదల చేయమంటాడు. స్టేషన్ దాటి బయటకు వెళ్ళగానే వాళ్ళను ఎవరో కిడ్నాప్ చేస్తారు.


స్టేషన్ లో ప్రియా తల్లి ప్రమీల గతంలో జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటుంది.


గతంలో ప్రియా ఒకసారి వైజాగ్ లోని తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తుంది.

అక్కడ రాత్రిపూట ఎవరో తనమీద అత్యాచార ప్రయత్నం చేసినట్లు, అందువల్ల తాను అక్కడినుండి బయటకు వెళ్లిపోయినట్లు చెబుతుంది. తన గదిలోకి వచ్చిన వ్యక్తి అతని పేరు నీలకంఠం అని చెబుతాడు.


సిసి కెమెరా ఫుటేజ్ లో ప్రియ గదిలోకి ఎవ్వరూ వెళ్లలేదని తెలుస్తుంది. మరణించిన తన స్నేహితురాలు భార్గవిని చూడటానికి తల్లిదండ్రులతో హైదరాబాద్ వెడుతుంది ప్రియ. అక్కడ భార్గవి మేనమామ పేరు నీలకంఠం అని తెలిసి ఆశ్చర్య పోతారు ప్రియా పేరెంట్స్.


తన మేనమామ తనమీద హత్యా ప్రయత్నం చేసినట్లు తనకు అనిపించడం భార్గవి విషయంలో నిజం అయివుండొచ్చని ప్రియకు అనిపిస్తుంది. ప్రియా తండ్రి ప్రభాకర రావు చొరవతో పోలీసులు నీలకంఠం ఇంట్లో సోదా చేసి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుంటారు.


ప్రియను ఆమె తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తారు.

మేనమామ ఇంట్లో ప్రియకు కలిగిన అనుభవాలు, భార్గవి మేనమామ ఇంట్లో మరణించడం కేవలం యాదృచ్ఛికం అంటాడు సైకియాట్రిస్ట్ శ్రీనివాస్.


ప్రియకు మానసిక లోపం వల్లే జరగనివి జరిగినట్లు ఉహించుకొంటోందని చెబుతాడు.

ఒక సంవత్సరం పాటు ప్రియను మందులు వాడమంటాడు.


తనను బంధించిన ఉదయ్ కి అన్ని వివరాలు చెబుతానంటాడు రంగనాథం.

కనకారావు పిఎ ఫోన్ చేసి సందీప్ కి సహకరించమని చెప్పినట్లు అంగీకరిస్తాడు.


స్పృహలోకి వచ్చిన ప్రియా తను డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుంటుంది.

తాను హాస్పిటల్ కి చేరుకునేవరకు జరిగిన విషయాలు డాక్టర్ శ్రీనివాస్ కి వివరిస్తుంది.

ప్రియా జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలకు, మాజీ మినిష్టర్ కనకరావుకు ఉన్న సంబంధం గురించి చెబుతాడు డాక్టర్ శ్రీనివాస్.

కనకారావు పిఎ డాక్టర్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి మరుసటి రోజు ప్రియను కనకారావు గెస్ట్ హవుస్ కి తీసుకొని రమ్మంటాడు. అక్కడ ఢిల్లీనుండి వచ్చిన సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్ ఆమెను పరీక్షిస్తారని చెబుతాడు.

తన స్నేహితురాలు ప్రవల్లిక సహాయం తీసుకుంటానని చెబుతుంది ప్రియా.

ఇక నాకేమవుతోంది.. ధారావాహిక ఎపిసోడ్ 17 భాగం చదవండి.


"అలాగే ప్రియా..

నేను వెంటనే బయలుదేరుతాను.

ఎసిపి ప్రతాప్ గారి అన్న కొడుకు ఉదయ్, తరుణ్ కి స్నేహితుడు. నాకు కూడా బాగా తెలుసు. డాక్టర్ శ్రీనివాస్ గారికి అభ్యంతరం లేకుంటే అతన్ని కూడా తీసుకొని వస్తాను. ఒకసారి వారిని కనుక్కో" అంది ప్రవల్లిక.

ప్రియ, శ్రీనివాస్ తో విషయం చెప్పింది. అయన సరేనన్నాక ప్రవల్లికకు కాల్ చేసి ఉదయ్ ని తీసుకొని రమ్మంది.


మరో అరగంటకు ఉదయ్, ప్రవల్లికలు డాక్టర్ శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. వాళ్ళను సాదరంగా ఆహ్వానించారు శ్రీనివాస్ దంపతులు.


"తెలీదు తెలీదంటూనే చాలా వివరాలు చెప్పారట సస్పెండైన ఎస్సై రంగనాథం, రిసార్ట్ మేనేజర్ సందీప్ లు. హన్సిక హత్య గురించి చాలా వివరాలు తెలిసాయి. అవన్నీ ఉదయ్ మీకు చెబుతాడు" అంది ప్రవల్లిక.


ఉదయ్, శ్రీనివాస్ వంక సందేహంగా చూడటంతో "మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు. డాక్టర్ దంపతులిద్దరూ మన శ్రేయోభిలాషులే. అన్నట్లు తరుణ్ మిమ్మల్ని కలిశాడటగా..మీరు సపోర్ట్ గా ఉండక పోతే తరుణ్ చాలా ఇబ్బంది పడేవాడు" అంది ప్రియా.


"తరుణ్ ని అతని స్నేహితుడి గదిలో కలిసినప్పుడే నాకు అతను నిర్దోషనిపించింది. కానీ రిసార్ట్ మేనేజర్ సందీప్ ఆ శవం మీదేనని, మిమ్మల్ని తరుణ్ హత్య చేసి, శవాన్ని మాయం చేయమని తన సహాయం కోరాడని స్టేషన్ లో ఇంటరాగేషన్ లో చెప్పాడు.


అయితే ప్రవల్లిక మాత్రం నా అంచనా తప్పు కాదని, తరుణ్ నిర్దోషి అని వాదించింది. లేకుంటే తరుణ్ ని ఇంటరాగేట్ చేసి ఉండే వాళ్ళు." చెప్పాడు ఉదయ్.


"రంగనాథం, సందీప్ లు బయట పెట్టిన విషయాలు వీళ్లకు చెప్పండి" అంది ప్రవల్లిక.


ప్రియ వంక చూస్తూ చెప్పడం ప్రారంభించాడు ఉదయ్.

"చూడండి ప్రియ గారూ! మీ జీవితంలో గతంలో జరిగిన సంఘటనలను గురించి మీ తల్లిదండ్రులు స్టేషన్లో చెప్పారు. ఆ విషయాలు ప్రవల్లిక నాకు తెలియజేసింది. గతంలో జరిగిన సంఘటనలలో కనకారావు ప్రమేయం ఉన్నట్లే హన్సిక హత్య విషయంలో కూడా అతని ప్రమేయం ఉంది.


హన్సిక భర్త పేరు శ్రీ రాజ్. అతని తండ్రి దామోదర్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. కనకారావు కు మంచి స్నేహితుడు కూడా. హన్సిక తన భర్తను వదిలి ఇండియాకు వచ్చేసింది. అంతే కాకుండా అతని ఆస్తిలో సగభాగం కావాలని కేసు పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. హన్సిక అడ్డు తొలగించుకుంటే ఆస్తిలో భాగం ఇవ్వాల్సిన అవసరం ఉండదని దామోదర్ భావించాడు. అంతేకాకుండా తన కొడుకు శ్రీ రాజ్ కి మరొక కోటీశ్వరుడి కూతురి సంబంధం చేసుకోవచ్చని ఆశించాడు. తనకు సహాయం చేయమని కనకారావును అభ్యర్థించాడు. కనకారావు, ఇండియాకు వచ్చిన హన్సిక ఎక్కడెక్కడ తిరుగుతుందో ఆరా తీశాడు. తను మీ ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉన్నట్లు తెలుసుకున్నాడు.


మీ దగ్గర నుండి వెళ్ళాక హన్సిక రోషన్ అనే మీ క్లాస్మేట్ తో కొద్ది రోజులు కలిసి తిరిగినట్లు తెలుసుకున్నాడు. హన్సిక హత్యకు సహకరిస్తే భారీ మొత్తం ఇస్తానని రోషన్ కి ఎర చూపాడు కనకారావు. తను హత్య చేయలేనని, కావాలంటే మీరు చెప్పిన చోటికి హన్సికను తీసుకొని వస్తానని రోషన్ చెప్పాడు.


హన్సికను తను స్వయంగా కలిసి కేసు పెట్టవద్దని చెబుతానని కనకారావును కోరాడు ఆమె భర్త శ్రీ రాజ్. తన మాట హన్సిక వినకపోతే అప్పుడు ఆమెను హత్య చేయవచ్చునని చెప్పాడు. కానీ హత్య జరిగే సమయానికి శ్రీరాజ్ ఇండియాకు వచ్చి ఉండడం మంచిది కాదని కనకారావు సూచించాడు. ఖచ్చితంగా అనుమానం అతని మీదకే వెళుతుందని చెప్పాడు. కానీ శ్రీ రాజ్ ఒకసారి హన్సిక ను కలవాలని పట్టు పట్టాడు.


యూఎస్ నుంచి దొంగ పాస్పోర్ట్, వీసాలతో రావడం కష్టమని, వేరే ఏర్పాటు చేశాడు కనకారావు. ఆ ప్లాన్ ప్రకారం శ్రీ రాజ్ యూఎస్ నుంచి బంగ్లాదేశ్ కు వెళ్తాడు. అక్కడి నుంచి వేరే పేరుతో పాస్పోర్ట్ , వీసాలు ఏర్పాటు చేస్తాడు కనకారావు. ఇక్కడ పని పూర్తయ్యాక అదే పేరుతో తిరిగి బంగ్లాదేశ్ వెళ్తాడు. అక్కడి నుంచి తన పేరుతో తిరిగి యుఎస్ చేరుకుంటాడు. కనకారావు చెప్పిన ప్లాన్ కి అంగీకరించాడు శ్రీ రాజ్. ఇండియాకు చేరుకున్నాడు.


రోషన్, డైవోర్స్ విషయంలో తనకు హెల్ప్ చేస్తానని హన్సికకు చెప్పాడు. ఆమెను ఒప్పించి రిసార్ట్ కు తీసుకొని వెళ్ళాడు. అక్కడ రిసార్ట్ మేనేజర్ సందీప్ సలహాతో వరుణ్ రియా అనే పేర్లతో కాటేజ్ తీసుకున్నాడు.


సందీప్ తమ రిసార్ట్ నంబర్ నుండి తరుణ్ కి ఒక కూపన్ కోడ్ పంపించాడు. ఆ కోడ్ వాడితే రిసార్ట్ బిల్లు లో 50 శాతం రాయితీ ఉంటుంది. అంతేకాకుండా రెస్టారెంట్లో కాంప్లిమెంటరీ ఫుడ్ ఉంటుంది. ఆరోజు ప్రియ బాగా డిస్టర్బ్ అయిన సందర్భంలో ఈ మెసేజ్ రావడంతో తరుణ్ కి ఆ రిసార్ట్ కి వెళ్లాలనే ఆలోచన వచ్చింది. ప్రియను ఒప్పించి అక్కడికి తీసుకొని వెళ్ళాడు. తన రిజిస్టర్ లో వీళ్లకు బదులుగా వేరే పేర్లు రాసి ఉంచాడు సందీప్.

ఆరోజు రెస్టారెంట్లో రోషన్, హన్సికలు కలిసి ఉండగా అక్కడికి వచ్చాడు శ్రీ రాజ్. అతన్ని ఆ సమయంలో అక్కడ చూసి హన్సిక ఆశ్చర్యపోయింది. శ్రీ రాజ్ ఆమెను కలిసి జరిగింది మరిచిపోయి కలిసి ఉందామని చెప్పాడు. తనకు ఇష్టం లేదని చెప్పింది హన్సిక.


విడాకులు తీసుకోవడానికి తనకు అభ్యంతరం లేదని, కానీ తనకున్న 100 కోట్ల ఆస్తిలో భాగం అడిగితే మాత్రం ఊరుకోనని హెచ్చరించాడు శ్రీ రాజ్. లెక్క చేయలేదు హన్సిక. చేతనైంది చేసుకోమని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. రోషన్ తో కలిసి తన కాటేజ్ కి వెళ్ళి పోయింది. వెళ్లేటప్పుడు తరుణ్, ప్రియా లు రిసార్ట్ లోకి ఎంటర్ కావడం గమనించింది. కానీ పక్కన రోషన్ ఉండడంతో వాళ్లను చూడనట్లుగా ముఖం తిప్పుకొని వెళ్లిపోయింది.


కాటేజ్ లోకి వెళ్లిన హన్సిక తాము ఇక్కడ ఉన్నట్లు శ్రీ రాజ్ కి ఎలా తెలిసిందని రోషన్ ని ప్రశ్నించింది. తనకేమీ తెలియదని చెప్పాడు రోషన్. ఆరోజు అర్ధరాత్రి సమయంలో హన్సిక నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకొని, శ్రీ రాజ్ కి మెసేజ్ పెట్టాడు రోషన్. మరికొద్ది సేపట్లోనే శ్రీ రాజ్ ఆ కాటేజ్ లోకి ఎంటర్ అయ్యాడు. నిద్రపోతున్న హన్సిక ముఖంపై దిండు పెట్టి బలంగా అదిమాడు. ఊపిరి ఆడని పరిస్థితిలో హన్సిక తన కాళ్లు మడిచి అతని పొట్టలో బలంగా కొట్టింది. ఆ దెబ్బకు శ్రీరాజ్ వెనక్కి జరగడంతో పైకి లేచింది హన్సిక.


ఆవేశంలో ఉన్న శ్రీరాజ్ హన్సిక జుట్టు పట్టుకొని ఆమె తలను గోడకేసి కొట్టాడు. తలకు బలంగా దెబ్బ తగలడంతో క్షణాల్లో మరణించింది హన్సిక. ఆమెకు ఊపిరాడకుండా చేసి ఆ తర్వాత ఉరివేసి ఆత్మహత్యగా చిత్రించాలన్నది వాళ్ల పథకం. కానీ ఇలా గోడకేసి కొట్టి చంపడంతో ఏం చేయాలో శ్రీ రాజ్ కి అర్థం కాలేదు.


వెంటనే కనకారావు మనుషులకు కాల్ చేశాడు. వాళ్లు సందీప్ తో మాట్లాడతామని, అతను వచ్చి సహాయం చేస్తాడని చెప్పారు. వాళ్ళు చెప్పినట్లుగానే మరికొద్ది సేపటికి సందీప్ తన మనుషులతో ఆ కాటేజ్ కి వచ్చాడు. శవాన్ని అక్కడి నుంచి బయటికి తరలించాడు. ఆ సమయంలో డోర్ మీద రక్తం అంటింది. గదిని తన మనిషితో శుభ్రంగా కడిగించాడు సందీప్.


ప్రియా కదలికలపై నిఘా ఉంచమని సందీప్ తో ముందే చెప్పి ఉంచాడు కనకారావు పిఏ. సందీప్ హత్య జరిగిన గదిని శుభ్రపరుస్తున్న సమయంలో ప్రియ వచ్చి తలుపు తట్టింది. ఆమెను కసురుకొని తలుపు వేసుకున్నాడు సందీప్ అనుచరుడు. తరువాత తరుణ్ తన కాటేజ్ నుండి బయటకు వచ్చిన సమయంలో సందీప్ ప్రియను కలిసి అక్కడినుండి వెళ్లిపొమ్మని, డాక్టర్ శ్రీనివాస్ ని కలవమని చెప్పాడు.


ఆమె, హన్సిక ను ఒళ్ళు తెలియని స్థితిలో హత్య చేసిందని చెప్పాడు. ఆ క్షణంలో ఆ మాటలు నమ్మింది ప్రియా. దాంతో ప్రియా తనకోసం ఏర్పాటుచేసిన వాహనంలో డాక్టర్ శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళిపోయింది.


సందీప్ తన అనుచరులతో హన్సిక శవాన్ని దహనం చేస్తున్న సమయంలో తరుణ్ అక్కడికి వెళ్ళాడు. ఆ సమయంలో అతడు హన్సిక ను ప్రియా హత్య చేసిందనే భ్రమలో ఉన్నాడు. సందీప్, ఎంతో ఉదారంగా తరుణ్ ని అక్కడి నుండి వెళ్లిపొమ్మని, శవం విషయం తను చూసుకుంటానని చెప్పాడు. కానీ పోలీస్ ఇంటరాగేషన్లో చనిపోయింది ప్రియా అని, తరుణ్ ఆమెని హత్య చేసి పారిపోయాడని చెప్పాడు.


చనిపోయింది ప్రియా అని పోలీసులు నమ్మితే డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేవరకు ఆమె కోసం గాలించరని వారి ఉద్దేశం. ఆ సమయంలో హాస్పిటల్ లో ప్రియ మీద పరిశోధన చేయాలని వారి పథకం. ఒకవేళ ప్రియాకు ఏదైనా అతింద్రీయ శక్తి ఉంటే ఆ శక్తిని తమకు ఉపయోగపడేలా ఆమెను వాడుకోవాలని కనకారావు ప్లాన్. తమకు ఏమీ తెలియదని చెబుతూ వచ్చిన రంగనాథం సందీప్ సరిగ్గా ఇంటరాగేట్ చేయడంతో ఈ విషయాలన్నీ బయట పెట్టారు" చెప్పడం ముగించాడు ఉదయ్.


'మీరు చెప్పిన విషయాలను బట్టి ఈ హత్యలో కనకారావు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. " అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.


మర్నాడు ఏం చేయాలో వాళ్ళందరూ కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. డాక్టర్ శ్రీనివాస్ కనకారావు పీఏ కి ఫోన్ చేసి గెస్ట్ హౌస్ దగ్గర ఎక్కువ మంది ఉంటే ప్రియా అప్సెట్ అవుతుందని, ఆమె మాటిమాటికి స్పృహ తప్పుతోందని చెప్పాడు. కనకారావు పిఏ మాట్లాడుతూ గెస్ట్ హౌస్ దగ్గర హిప్నాటిస్ట్, సైకియాట్రిస్ట్, వాళ్ల అసిస్టెంట్లు ఇద్దరు తప్ప ఇంకెవరు ఉండరని చెప్పాడు.


రేపు నేను ప్రియాను తీసుకొని ఆ గెస్ట్ హౌస్ కు వెళ్తాను. నాతోపాటు నా శ్రీమతిని కూడా తీసుకొని వెళ్తాను. ఉదయ్ ప్రవల్లికలను కూడా తీసుకొని వెళ్లి, వాళ్లను నా అసిస్టెంట్లుగా పరిచయం చేస్తాను. ఒకవేళ వారు అంగీకరించకపోతే ఉదయ్, ప్రవల్లికలు ఇద్దరూ బయటకు వెళ్లిపోయి, ఆ చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ల సహాయం అవసరమైతే నేను వాళ్లకు మిస్డ్ కాల్ ఇస్తాను" అన్నాడు శ్రీనివాస్.


ప్రవల్లిక, ప్రియ తో మాట్లాడుతూ "నాకు తెలిసి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లు ఇద్దరూ హుందాగానే వ్యవహరిస్తారని భావిస్తున్నాను. ఇక హిప్నాటిజం గురించి.. నీ సహకారం లేకుండా నిన్ను ఎవరూ హిప్నాటిజం చేయలేరు. హిప్నాటిజానికి లోను కావాలా వద్దా అన్నది నువ్వే నిర్ణయించుకోవాలి" అంది.


ప్రియ మాట్లాడుతూ "నాకేమవుతుందో తెలుసుకోవాలని ఉంది. నాలో ఉన్నది దుష్ట శక్తా లేక అతీంద్రియ శక్తా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి హిప్నాటిజానికి సహకరిస్తాను" అని చెప్పింది.


"ప్రియా! నీ ఆలోచన కరెక్టేనమ్మా.. ఒకవేళ దుష్టశక్తి.. ఐ మీన్ అతని వల్ల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఆత్మ లాంటిది నిన్ను ఆవహించి ఉంటే అప్పుడు కనకారావు నీకు హాని చేయాలని చూస్తాడు. హిప్నాటిజంలో అలాంటిదేమైనా బయటకు వస్తే నిన్ను అక్కడి నుంచి తప్పించడానికి ఉదయ్ ప్రవల్లికల సహాయం తీసుకుందాం' అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.


ఉదయ్ మాట్లాడుతూ "కొంతమంది పోలీసులను మఫ్టీలో ఆ చుట్టుపక్కల ఉండేలా ఏర్పాటు చేస్తాను. నాకు తెలిసి వారి అవసరం రాదని అనుకుంటున్నాను" అన్నాడు.

ఉదయ్ కి, ప్రవల్లికకి కృతజ్ఞతలు చెప్పింది ప్రియ.



"రేపు ఉదయం 10 గంటలకల్లా గెస్ట్ హౌస్ కి రమ్మని చెప్పారు కాబట్టి మీరిద్దరూ ఈ రాత్రికి మా ఇంట్లోనే పడుకోండి. అందరం కలిసి ఉదయం బయలుదేరుదాం" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్, ఉదయ్, ప్రవల్లికల వంక చూస్తూ.


"లేదండీ! డాడీ ఇందాకే ఊరి నుండి వచ్చినట్లు కాల్ చేశారు. ఆయన్ని కలవాలి" చెప్పింది ప్రవల్లిక.


"అలా అయితే రేపు 9:00 కల్లా ఇక్కడికి వచ్చేయండి. మీ బ్రేక్ ఫాస్ట్ ఇక్కడే. తర్వాత అందరం కలిసి ఆ గెస్ట్ హౌస్ కి వెళదాము" చెప్పింది డాక్టర్ శ్రీదేవి.


అలాగే నన్నట్లు తల ఊపారు ఉదయ్ ప్రవల్లికలు.

***

ప్రవల్లికను ఆమె ఇంటివద్ద డ్రాప్ చేసాడు ఉదయ్.

"కాఫీ తీసుకుని వెళ్ళండి" అంది ప్రవల్లిక.


"మరోసారి.." అంటూ బయలుదేరబోయాడు ఉదయ్.

ఇంట్లోంచి బయటకు వచ్చిన ప్రవల్లిక తల్లి శారద, ఉదయ్ తో "ప్రవల్లిక వాళ్ళ డాడీ మీతో మాట్లాడాలంటున్నారు. లోపలి రా బాబూ.." అంది ఉదయ్ తో.


కారు దిగి వారివెంట నడిచాడు ఉదయ్.

===============================================

ఇంకా ఉంది...

===============================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



43 views0 comments
bottom of page