top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

నాకేమవుతోంది…? ఎపిసోడ్ 13


'Nakemavuthondi Episode-13' New Telugu Web Series




జరిగిన కథ…

కొత్తగా పెళ్ళైన ప్రియ అనే యువతిని ఆమె భర్త నిద్ర లేపి, ఆమె- తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు.

అతన్నే అనుమానిస్తుంది ప్రియ.

అతని వల్ల తనకు హాని కలగవచ్చునని తండ్రికి మెయిల్ పెడుతుంది.


కూతురి కోసం హైదరాబాద్ బయలుదేరుతుంది ప్రియా తల్లి ప్రమీల.

ప్రియా స్నేహితురాలు.. డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక ఫోన్ చేసి, హన్సిక అనే మరో ఫ్రెండ్ మూడు రోజులనుండి కనపడ్డం లేదని చెబుతుంది.

ప్రియ కూడా కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదని చెబుతాడు ప్రభాకర రావు.


స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్.

హన్సికని తను హత్య చేసినట్లు ప్రియ తనతో చెప్పిందని అంటాడు తరుణ్.

పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్.


తరుణ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.

సస్పెండయిన ఎస్సై రంగనాథాన్ని, రిసార్ట్ మేనేజర్ సందీప్ ని విడుదల చేయమంటాడు ఎసిపి ప్రతాప్.స్టేషన్ దాటి బయటకు వెళ్ళగానే వాళ్ళను ఎవరో కిడ్నాప్ చేస్తారు.

తమను కిడ్నాప్ చేసింది మఫ్టీలో ఉన్న పోలీసులేనని అనుమానిస్తారు రంగనాథం, సందీప్ లు.


స్టేషన్ లో ప్రియా తల్లి ప్రమీల గతంలో జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటుంది.

గతంలో ప్రియా ఒకసారి వైజాగ్ లోని తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తుంది.

అక్కడ రాత్రిపూట ఎవరో తనమీద అత్యాచార ప్రయత్నం చేసినట్లు, అందువల్ల తాను అక్కడినుండి బయటకు వెళ్లిపోయినట్లు చెబుతుంది.


తన గదిలోకి వచ్చిన వ్యక్తి అతని పేరు నీలకంఠం అని చెబుతాడు.

సిసి కెమెరా ఫుటేజ్ లో ప్రియ గదిలోకి ఎవ్వరూ వెళ్లలేదని, ఆమె గాలితో మాట్లాడుతూ బయటకు వెళ్లిందని తెలుస్తుంది.

మరణించిన తన స్నేహితురాలు భార్గవిని చూడటానికి తల్లిదండ్రులతో హైదరాబాద్ వెడుతుంది ప్రియ.

అక్కడ భార్గవి మేనమామ పేరు నీలకంఠం అని తెలిసి ఆశ్చర్య పోతారు ప్రియా పేరెంట్స్.


తన మేనమామ తనమీద హత్యా ప్రయత్నం చేసినట్లు తనకు అనిపించడం భార్గవి విషయంలో నిజం అయివుండొచ్చని ప్రియకు అనిపిస్తుంది.

ప్రియా తండ్రి ప్రభాకర రావు చొరవతో పోలీసులు నీలకంఠం ఇంట్లో సోదా చేసి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుంటారు.

ప్రియను ఆమె తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తారు.


ఇక నాకేమవుతోంది.. ధారావాహిక పదమూడవ భాగం చదవండి.


ప్రవల్లిక, ప్రమీలతో మాట్లాడుతూ "ప్రియా కి ఏమీ జరగనందుకు సంతోషంగా ఉంది. మీరు చెప్పిన సంఘటనలకు, ప్రియా కనపడకుండా పోవడానికి ఏదో సంబంధం ఉన్నట్లు నాకనిపిస్తోంది. మీరు చెప్పడం పూర్తి చేయండి" అంది.


తిరిగి చెప్పడం ప్రారంభించింది ప్రమీల.

"ఆ డాక్టర్ ఆ రోజంతా ప్రియా కు వివిధ రకాల పరీక్షలు చేశాడు. ఎన్నో ప్రశ్నలు వేసి ప్రియా చెప్పిన సమాధానాలను నోట్ చేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం ప్రియాను కాసేపు బయట కూర్చోమని చెప్పి మాతో మాట్లాడాడు. ఆయన ఉద్దేశం ప్రకారం జరిగిన సంఘటన కేవలం యాదృచ్ఛికం. భార్గవి మరణానికి దారి తీసిన పరిస్థితులు తనకు ఒకరోజు ముందే ఏర్పడడం అనుకోకుండా ఏర్పడ్డ సామీప్యత మాత్రమే. అంతేగాని జరగబోయే సంఘటన ప్రియాకు ముందుగా తెలిసిందని అనుకోవడానికి ఏ ఆధారము లేదు.


ఇక లేని వ్యక్తిని ఊహించుకొని ప్రియా భయపడడం, ఇంటి నుండి పారిపోవడం ఖచ్చితంగా మానసిక లోపమే. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదని మీరు చెప్పారు కాబట్టి ఇది ప్రారంభ దశ అనుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేని టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తాను. రోజుకొక మాత్ర చొప్పున ఒక సంవత్సరం పాటు వాడమని మీ అమ్మాయికి చెప్పండి. అమ్మాయి హాస్టల్ లో ఉంటుంది కదా.. ఎవరైనా మాత్రలు వేసుకోవడం చూస్తారేమోనని భయంతో వాడడం మానవద్దని చెప్పండి. అంతగా ఎవరికైనా చెప్పాల్సివస్తే బలానికి వాడే విటమిన్ టాబ్లెట్ అని చెప్పమనండి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే వెంటనే నా దగ్గరకు తీసుకొని రండి" అని చెప్పాడు ఆయన.


డాక్టర్ దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాము. మా బావగారు ప్రియను తమ ఇంట్లోనే ఉంచుకుంటామని చెప్పారు. కానీ ప్రియ హాస్టల్ కి వెళ్తానని చెప్పింది. రెండు రోజులు అక్కడే ఉండి ప్రియను హాస్టల్లో దించి వచ్చాము. అప్పుడప్పుడు తన పెదనాన్న ఇంటికి వచ్చి వెళుతూ ఉండమని చెప్పాము.


అలాగే అప్పుడప్పుడు మా బావ గారి ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేది ప్రియ. డాక్టర్ ఇచ్చిన మాత్రలను తూచా తప్పకుండా వాడుతోంది. మరొక్క ఆరు నెలలు గడిచాక మరొక సంఘటన జరిగింది. అది అంత తీవ్రమైనది కాదు. దాని గురించి మా వారు వివరంగా చెప్తారు" అంది ప్రమీల.


ప్రభాకర్ రావు గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించాడు.

"మా వదినకు నీరసంగా ఉండడంతో అన్నయ్య ఆమెను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాడు. డాక్టర్లు ఆమెకు కొన్ని విటమిన్ టాబ్లెట్లు ప్రిస్క్రైబ్ చేశారు. అయితే ఆమె వాటిని రెగ్యులర్ గా వేసుకోక పోవడంతో అన్నయ్య ప్రతిరోజు ఆమెకు ఆ టాబ్లెట్స్ తీసి ఇచ్చి, మంచినీళ్లు ఇచ్చి, దగ్గరుండి మింగించేవాడు. ప్రియ, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు ఈ దృశ్యం చూసింది.


ఒకరోజు మా వదినను పక్కకు పిలిచి ఆ మాత్రలు స్లో పాయిజన్ లాగా పని చేస్తాయని, అవి వాడితే కొద్ది రోజులకు ప్రాణం పోతుందని చెప్పిందట. నీకెలా తెలుసని అడిగితే ఆ మాత్రల పేర్లు ఇంటర్నెట్లో చెక్ చేశానని, అలాంటి టాబ్లెట్లు ఎక్కడా లేవని చెప్పింది. మా వదిన అన్నయ్యతో ప్రియా చెప్పిన విషయం మాట్లాడింది.


అన్నయ్య ప్రియాని పిలిచి, అవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విటమిన్ టాబ్లెట్లేనని చెప్పాడు. ప్రియా ఆ పేర్లను ఇంటర్నెట్లో తనిఖీ చేసింది. అవి విటమిన్ టాబ్లెట్లేనని తెలియడంతో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.


మరుసటి రోజు మళ్లీ మా వదినను పిలిచి, 'నాకు అనుమానం రావడంతో పెదనాన్న ఆ మాత్రలను తీసివేసి ఒరిజినల్ టాబ్లెట్లు పెట్టాడ'ని చెప్పింది. మా వదిన తిరిగి ప్రియా చెప్పిన మాటలను మా అన్నయ్యకు తెలియజేసింది. అన్నయ్య నాకు కాల్ చేసి విషయం చెప్పాడు. ఈసారి నేను ఒక్కడినే హైదరాబాద్ వెళ్లి ప్రియను తిరిగి ఆ డాక్టర్ శ్రీనివాస్ దగ్గరికి తీసుకొని వెళ్ళాను.


ఆయన మళ్లీ పరీక్షలు చేసి ‘నేను ఇచ్చిన మాత్రలు సంవత్సరం పాటు వాడితే గాని ఫలితం తెలియదు. ఇప్పుడు 6 నెలలే అయింది కదా.. మరో ఆరు నెలలు వాడండి. అంతవరకు ఇలాంటి చిన్న చిన్న భ్రమలు కలుగుతూ ఉంటాయి. వాటి గురించి ఆందోళన పడకండి. అయితే ఇలాంటి భ్రమలు కలిగిన ప్రతిసారి కచ్చితంగా నా దగ్గరకు తీసుకొని రండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు’ అని చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్.


హాస్పిటల్ నుంచి వచ్చేసినా, నా మనసులో ప్రియా చెప్పిన మాటల మీదే ఆలోచనలు తిరుగుతున్నాయి. ప్రియా తో తన స్నేహితురాళ్ళలో ఎవరి మదర్ అయినా ప్రతిరోజు తన భర్త ఇచ్చే మాత్రలు మింగుతున్నారేమో కనుక్కోమన్నాను. కానీ అలా అడగడం బాగుండదని చెప్పింది ప్రియ. అనవసరంగా వాళ్లలో లేనిపోని అనుమానాలు రేకెత్తించినట్లు అవుతుందని చెప్పింది. నాకు కూడా అది సబబేనని అనిపించింది. అయినా తన స్నేహితురాళ్ళు ఎవరైనా తమ తల్లి చనిపోయిందని చెబితే ఆ విషయం నాతో చెప్పమన్నాను.


మరో నెల రోజులు గడిచాక మా అన్నయ్య ఫోన్ చేసి పక్క అపార్ట్మెంట్ లో ఒక యువతి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ లో చేరినట్లు చెప్పాడు. ఆమె వయస్సు 30 లోపే ఉంటుందట. ఆ విషయం నాకు అంతగా ఆసక్తిని కలిగించలేదు కానీ ప్రియాకు ఆమెతో పరిచయం ఉందని, ఆమె ప్రియను ఒకసారి కలవాలని అంటోందని అన్నయ్య చెప్పడంతో ఆశ్చర్యపోయాను.


ప్రియా ప్రతి ఆదివారం అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేది. అప్పుడు ఆమె కూడా అక్కడికి వచ్చేదట.


'ఆరు నెలల నుండి తనకు ఆరోగ్యం బాగుండటం లేదని, ప్రియా చూపించకుంటున్న హాస్పిటల్ లోనే తను కూడా చూపించుకుంటున్నానని చెప్పేదట. ప్రస్తుతం తను ఆ హాస్పిటల్ లోనే అడ్మిట్ అయిందట' అని చెప్పాడు మా అన్నయ్య."

చెబుతూ ఉన్న ప్రభాకరరావు మాటలకు అడ్డువచ్చింది ప్రవల్లిక.


"అదేమిటి? ప్రియాను చూపించేది సైకియాట్రిస్ట్ కి కదా! మరి ఆవిడ అక్కడెందుకు చూపించు కుంటోంది?" అని అడిగింది.


ప్రభాకర్ రావు మాట్లాడుతూ "ప్రియాను చూసే డాక్టర్ ది సొంత ప్రాక్టీస్ కాదమ్మా.. ఆయన ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పని చేస్తున్నాడు. మా అన్నయ్య చెప్పిన యువతి అక్కడ మరో డాక్టర్ కి చూపించుకుంటోంది" అన్నాడు.


"ఆ హాస్పిటల్ పేరేమిటి?" అంతవరకు మౌనంగా వింటూ ఉన్న ఎసిపి ప్రతాప్ అడిగాడు.


"కేకేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్" చెప్పాడు ప్రభాకర్ రావు.


"మై గాడ్!" అన్నాడు ప్రతాప్. "ఆ హాస్పిటల్ మాజీ మినిస్టర్ కనకారావుది. మనం వెళ్లి వచ్చిన రిసార్ట్ కి వెళ్లే దారిలోనే ఉంది ఆ హాస్పిటల్" చెప్పాడు అతను.


ఏదో లింక్ దొరుకుతున్నట్లు అనిపించింది ప్రతాప్, మురళి, ప్రవల్లికలకు.


"సస్పెండ్ అయిన ఎస్ఐ రంగనాథం, రిసార్ట్ మేనేజర్ సందీప్ కూడా కనకారావు పేరును వాడుకోవాలని చూశారు" అన్నాడు సిఐ మురళి.


"అయితే ఆ రోజు రాత్రి బాగా డిస్టర్బ్ అయి ఉన్న ప్రియ ఆ హాస్పిటల్ కి వెళ్లి ఉండవచ్చు. వాళ్లు ఎందుకోసమో ప్రియాను హాస్పిటల్ నుండి తిరిగి పంపలేదు. ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నారా.. అదే నిజమైతే ప్రియా పేరెంట్స్ కి ఇన్ ఫార్మ్ చెయ్యాలి కదా" అంది ప్రవల్లిక.


“రైడ్ చేసి వెతికే లోపల ప్రియను వేరే చోటికి తరలించవచ్చు.. లేదా ఆమెకు ఏదైనా హాని చేయవచ్చు. కాబట్టి ముందు ప్రియా అక్కడ ఉన్నట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి" అన్నాడు ఏసిపి ప్రతాప్.


"నిజమే అంకుల్! ఆ పని నేను, ఉదయ్ కలిసి చేయగలమని అనుకుంటున్నాను" అంది ప్రవల్లిక.


"తప్పకుండా ప్రవల్లికా! మీ నాన్నగారు డిటెక్టివ్ పురంధర్ గారు బెంగళూర్ నుండి రావడానికి ఇంకా రెండుమూడు రోజులు పడుతుందట. ఈలోగా నువ్వే మాకు హెల్ప్ చెయ్యాలి" అన్నాడు ప్రతాప్.


తరువాత అయన ప్రియా తండ్రి ప్రభాకర రావు వైపు తిరిగి, "తర్వాత ఏం జరిగిందో చెప్పండి." అన్నాడు.


మళ్లీ చెప్పడం ప్రారంభించాడు ప్రభాకర్ రావు.


"మా అన్నయ్య చెప్పిన దాని ప్రకారం ఆ యువతి ప్రతిరోజు తన భర్త ఇచ్చిన మాత్రలు మింగుతుందట. అవి వాడితే నీరసం తగ్గుతుందని ఆయన చెబుతున్నాడట. కానీ రోజురోజుకీ తన ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమె అప్పుడప్పుడు మా వదినతో, ప్రియాతో చెప్పేదట.


ఒకవేళ గతంలో ప్రియ చెప్పినట్లు ఆమె భర్త ఆమెకు స్లో పాయిజనింగ్ చేస్తున్నాడా..అని అనుమానం వచ్చింది. ఒకవేళ అది నిజమైతే ఆమె ప్రాణాలు కాపాడవచ్చునని అనిపించింది. ప్రియతో కలిసి మళ్ళీ ఆ హాస్పిటల్ కి వెళ్లాను.


డాక్టర్ శ్రీనివాస్ ఆ యువతి పేరు, ఆమె కన్సల్ట్ చేసే డాక్టర్ పేరు ప్రియను అడిగి తెలుసుకున్నాడు. ఆ డాక్టర్ కి కాల్ చేసి మమ్మల్ని కాసేపు బయట వెయిట్ చేయమన్నాడు. తరువాత లోపలికి పిలిచి ఆమెకు రక్తహీనత వల్లే అలా నీరసం కలుగుతోందని చెప్పాడు. ప్రియకి ఇస్తున్న టాబ్లెట్ డోసేజ్ పెంచాడు. మరో ఆరు నెలలు ఆపకుండా వాడమన్నాడు.


ఆ తరువాత కొద్ది రోజులకు ఆ యువతి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు మా అన్నయ్య చెప్పాడు. మరి కొద్ది రోజులకు వాళ్లు ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వేరే చోటికి వెళ్లిపోయారట" చెప్పడం ముగించాడు ప్రభాకర్ రావు.


ఉదయ్ కి కాల్ చేయడం కోసం బయటకు వెళ్ళింది ప్రవల్లిక.

***


అక్కడ గోడౌన్ లో స్పృహ తప్పి పడి ఉన్న రంగనాథాన్ని సమీపించాడు మాస్క్ వేసుకొని ఉన్న యువకుడు. వాటర్ బాటిల్ లోని నీళ్లను చేతిలోకి తీసుకొని రంగనాథం ముఖం మీద జల్లాడు. నీరసంగా కళ్ళు తెరిచాడు రంగనాథం. ఎదురుగా మాస్క్ లో ఉన్న యువకుడిని,అతని వెనక ఉన్న అనుచరులను చూశాడు. తన నోటికి వేసి ఉన్న ప్లాస్టర్ తీయమన్నట్లు తలను ఊపాడు రంగనాథం. ఆ యువకుడు ప్లాస్టర్ను తీసి రంగనాథం నోట్లో కుక్కిన గుడ్డను బయటకు లాగాడు.


ఆ యువకుడితో "మీరు పోలీస్ వాళ్లేనని నాకు తెలుసు. మీరు అడిగినవన్నీ చెబుతాను. ముందు నా కట్లు విప్పండి. నాకు తినడానికి తాగడానికి ఏదైనా ఇవ్వండి" అంటూ దీనంగా అడిగాడు రంగనాథం.


ఆ యువకుడు తన ముఖానికి ఉన్న మాస్క్ ని తొలగించాడు. రంగనాథం వైపు చూసి నవ్వుతూ "మాకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం సందీప్ చెప్పేసాడు. ఇక నీతో మాకు అవసరం లేదు. నిన్ను చంపేస్తున్నాము. నీ శవాన్ని మాయం చేసే బాధ్యత సందీప్ తీసుకుంటాడు. హన్సిక శవాన్ని తగలబెట్టినట్లే నీ శవాన్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. నువ్వు ఏమైపోయావో ఎవరికీ అంతు పట్టదు" అని చెప్పి, తన అనుచరులతో "ఇతని పని పూర్తి చేయండి" అన్నాడు.


వాళ్లు తనని సమీపిస్తుండడంతో రంగనాథం గడగడ వణికి పోయాడు. తన ఎదురుగా ఉన్న యువకుడితో "సందీప్ కి పూర్తి విషయాలు తెలియవు. ప్రియ ఎక్కడ ఉందో నాకు తెలుసు. దయచేసి నన్ను ప్రాణాలతో వదిలిపెట్టండి. మీకు అన్ని విషయాలు చెబుతాను" అన్నాడు.


"అతని మీదకు వెళ్ళబోతున్న తన అనుచరులను ఆగమనట్లు సైగ చేశాడు ఆ యువకుడు.

"ఇతనికి కాస్త మంచినీళ్లు ఇచ్చి, తర్వాత టీ ఇవ్వండి" అని చెప్పాడు.


రంగనాథం అతని వంక చూస్తూ "మీరు ఉదయ్ గారు కదూ.. మిమ్మల్ని పొద్దున స్టేషన్లో చూశాను. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా తెలుసు. అప్పట్లో డ్రగ్స్ ముఠాను పట్టించినందుకు మీ గురించి పేపర్లలో వచ్చింది" అన్నాడు.


"అవును. బయటకు వెళ్లాక మీ కనకారావుతో చెప్పి నన్ను ఏదో చేయాలని అనుకుంటున్నావు కదూ.. మినిస్టర్ గా ఉన్న కనకారావు మనీ లాండరింగ్ స్కాం లో ఇరుక్కుని మాజీ మినిస్టర్ అయ్యాడు. సిబిఐ విచారణ పూర్తి కావస్తోంది. కొద్ది రోజుల్లో అతను జైలుకు వెళ్లడం ఖాయం. కాబట్టి అతన్ని కాపాడే ఉద్దేశం వదిలిపెట్టి నిజాలు చెబితే నువ్వు ప్రాణాలతో ఉంటావు. నేనింకా డ్యూటీలో జాయిన్ కాలేదు కాబట్టి చట్ట ప్రకారమే పోవాలనే నిబంధన నాకు లేదు" అన్నాడు ఉదయ్.


"అర్థమయింది. మీ దగ్గర ఏదీ దాచి పెట్టను. నాకు తెలిసిన ప్రతి విషయం మీకు చెబుతాను" అన్నాడు రంగనాథం.


అతని చేతి కట్లు విప్పమన్నాడు ఉదయ్.

అతను టీ తాగేవరకు ఆగి, తరువాత ఒక కుర్చీని లాక్కుని అతని ఎదురుగా కూర్చున్నాడు.

================================================

ఇంకా ఉంది...

================================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).




69 views1 comment

1 Comment


Acharyulu NCHB •22 minutes ago

Interesting. Variety గా ఉఃది.

Like
bottom of page