top of page

నాకేమవుతోంది…? ఎపిసోడ్ 9


'Nakemavuthondi Episode-9' New Telugu Web Series





జరిగిన కథ...

ప్రియ అనే యువతికి తరుణ్ తో కొత్తగా పెళ్లయింది.

కొత్తకాపురం పెట్టి నెలే అయింది.

ఒక రోజు రాత్రి నిద్రలో ఉన్న ప్రియను లేపిన ఆమె భర్త, ఆమె- తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు.


అతన్ని అనుమానిస్తుంది ప్రియ.

అతని వల్ల తనకు హాని కలగవచ్చునని తండ్రికి మెయిల్ పెడుతుంది.

తాను తొందరపడి ఆ మెయిల్ పంపినట్లు, తను భర్తతో కలిసి రిసార్ట్ కి వెళ్తున్నట్లు కూతురి దగ్గర్నుండి మరో మెయిల్ వస్తుందతనికి.


ఎస్సై రంగనాథం, రిసార్ట్ సమీపంలో పడిఉన్న శవాన్ని పరిశీలించడానికి వెళ్తాడు.

కూతురు ఫోన్ తియ్యక పోవడం గురించి ఆందోళన పడుతుంది ప్రియా తల్లి ప్రమీల.

కూతురి కోసం హైదరాబాద్ బయలుదేరుతుంది.


దార్లో డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక ఫోన్ చేసి ప్రియ ఫోన్ నంబర్ గనుక మారిఉంటే తనకు ఇవ్వమని ప్రమీలను అడుగుతుంది.

హన్సిక మూడు రోజులనుండి కనపడ్డం లేదని ప్రవల్లిక చెప్పడంతో ప్రమీలతో పాటు ప్రభాకర రావు లో కూడా ఆందోళన మొదలవుతుంది.

ప్రియ కూడా కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదని చెబుతాడు ప్రభాకర రావు.


స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్.


హన్సికని తను హత్య చేసినట్లు ప్రియ తనతో చెప్పిందని అంటాడు తరుణ్.

రిసార్ట్ దగ్గరకు వెళ్లిన ఉదయ్ - సీఐ మురళి, డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక లను కలుస్తాడు.


పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్.


రిసార్ట్ మేనేజర్ సందీప్ ని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు.


రెస్టారెంట్ లో ఉన్న రిసెప్షనిస్ట్, తరుణ్ ఇద్దరు అమ్మాయిలతో - ఒకరి తరువాత ఒకరితో రెస్టారెంట్ కి వచ్చినట్లు చెబుతాడు.


వాళ్లిద్దరూ ప్రియ, హన్సికలని ఫోటోలు చూసి గుర్తు పడతాడు.

తరుణ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.

రిసార్ట్ మేనేజర్ సందీప్ ప్రియను తరుణ్ హత్య చేసినట్లు, అతను డబ్బు ఆశ చూపడంతో తామే శవాన్ని కాల్చి, రిసార్ట్ బయట పడవేసినట్లు సిఐ మురళి తో చెబుతాడు.


ఇక నాకేమవుతోంది.. ధారావాహిక తొమ్మిదవ భాగం చదవండి.



తరుణ్ కి స్పృహ తప్పడంతో జీప్ ను రోడ్డు పక్కగా ఆపమంటాడు ఏసిపి ప్రతాప్. ఉదయ్, జీప్ లో ఉన్న వాటర్ బాటిల్ లోని నీళ్లు తరుణ్ ముఖం మీదికి చిలకరిస్తాడు. కొద్దిసేపటికి తరుణ్ కాస్త కదులుతాడు. ఉదయ్ అతని భుజాలు పట్టుకొని కుదపడంతో అతను కళ్ళు తెరుస్తాడు.


"తరుణ్! ఆందోళన పడకు. ధైర్యంగా ఉండు" అన్నాడు ఉదయ్.


"నామీద ఏదో కుట్ర జరుగుతోంది. చనిపోయింది ప్రియా కాదు. నేను కచ్చితంగా చెప్పగలను. కానీ ప్రియను నేను హత్య చేసినట్లు, శవాన్ని మాయం చేయడానికి సందీప్ సహాయం తీసుకున్నట్లు అతను ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్.. నన్ను నమ్మండి" అభ్యర్థనగా అన్నాడు తరుణ్.


ప్రవల్లిక మాట్లాడుతూ "భయపడకండి మిస్టర్ తరుణ్! రిసార్ట్ మేనేజర్ చెప్పినంత మాత్రాన చనిపోయింది ప్రియా అనే నిర్ధారణకు పోలీసులు రారు. డీఎన్ఏ పరీక్షలో నిజం బయటకు వస్తుంది" అని చెప్పింది.


ఉదయ్ మాట్లాడుతూ "డీఎన్ఏ పరీక్షలు జరుపుతారని తెలిసినా ఆ శవం ప్రియాదేనని రిసార్ట్ మేనేజర్ సందీప్ ఎందుకు చెబుతున్నట్లు? నా ఉద్దేశంలో అతను ఈ హత్యను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. డీఎన్ఏ ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. ఈ లోపల మనం ప్రియా కోసం గాలించ కూడదనేదే అతని ఉద్దేశం. ఈ మధ్య కాలంలో ఏం జరగబోతోంది? ప్రియా కు హాని చేయాలనుకుంటే అంత సమయం అవసరం లేదు. ఆమె ద్వారా ఏదైనా పని చేయించాలనుకుంటున్నారా.. లేదా ఆమెను ఎందుకైనా ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారా? అసలు ఆమె ఎక్కడ ఉందో.. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది" అన్నాడు.


ఏసిపి ప్రతాప్ తరుణ్ తో మాట్లాడుతూ "చూడండి మిస్టర్ తరుణ్! మీ ఆవేదన మాకు అర్థమయింది. చనిపోయింది ప్రియా అనే అభిప్రాయానికి వచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేవరకు మేము నిర్లక్ష్యంగా ఉంటామని మీరు భావిస్తున్నారు. ఈ లోపల ప్రియా కు ఏదైనా అపకారం జరుగుతుందేమోనని భయపడుతున్నారు. కానీ మీకు పోలీసు దర్యాప్తు గురించి అవగాహన లేదు. కేవలం ఒకరు చెప్పేది విని ఒక అభిప్రాయానికి రాము. ఏ కేసునైనా అన్ని విధాలుగా పరిశీలిస్తాము. కేసు దర్యాప్తు చేస్తున్న మన సీఐ మురళి మంచి సమర్థుడు. ఇక ఉదయ్, ప్రవల్లికలు ఈ పరిశోధనలో తమ వంతు సహకారం అందిస్తున్నారు. డిటెక్టివ్ పురంధర్ గారు రేపు బెంగళూరు నుండి తిరిగి వస్తున్నారు. రేపటినించి మనకు అయన సహకారం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అనవసరంగా ఆందోళన పడవద్దు. మీరు కోలుకున్నట్లు చెబితే మనం స్టేషన్ కు వెళదాం. లేదా మీకు అవసరమైతే మిమ్మల్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాం" అన్నాడు.


"నాకేం పరవాలేదు సార్. మనం స్టేషన్కు వెళ్దాం అన్నాడు తరుణ్.


"మరొక్కసారి ఆలోచించుకో మిస్టర్ తరుణ్! స్టేషన్లో మీ అత్తగారు ఉన్నారు. మిమ్మల్ని చూడగానే ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పలేము. మీరు తిరిగి డిస్టర్బ్ అవుతారేమోనని అనుమానంగా ఉంది" చెప్పాడు ప్రతాప్.


"పరవాలేదు సార్! ఆవేశంలో ఆమె నాపైన చెయ్యి చేసుకోవచ్చు. దుర్భాషలాడవచ్చు.. పెళ్ళై మూడు నెలలే అయినా నాకు ప్రియా అంటే చెప్పలేనంత అభిమానం. అలాంటప్పుడు పాతికేళ్లు పెంచిన తల్లికి కోపం ఉండడంలో ఆశ్చర్యం లేదు" అని చెప్పాడు తరుణ్.


ప్రతాప్ ఆదేశాలతో డ్రైవర్ జీప్ ను తిరిగి స్టార్ట్ చేశాడు.

మరో పావు గంటలో వారు స్టేషన్ కు చేరుకున్నారు. సీఐ మురళి, ప్రతాప్ గారికి సెల్యూట్ చేశాడు. తర్వాత ఉదయ్ ప్రవల్లికలను విష్ చేశాడు. ప్రియా తల్లి ప్రమీల అక్కడే ఉన్న విజిటర్స్ బెంచిపైన కూర్చొని ఉంది. వీళ్లను చూడగానే ముందుగా ఆమె ప్రవల్లిక దగ్గరకు వెళ్లి గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది.


ప్రవల్లిక ఆమె భుజం తట్టి "ఊరుకోండి ఆంటీ! ప్రియాకు ఏమీ కాలేదు. ఆమె ఎక్కడ ఉందో తొందర్లోనే కనుక్కుంటాం. తరుణ్ కూడా బాగా డిప్రెస్ అయి ఉన్నాడు. మీరు తొందరపడి అతన్ని ఏమీ అనకండి" అని చిన్నగా చెప్పింది.


తరుణ్ ప్రస్తావన రాగానే ప్రమీల అతని వంక చూసింది. ఆమె రియాక్షన్ భరించడానికి సిద్ధంగా ఉన్న తరుణ్ ఆమె వంక దీనంగా చూశాడు.


ప్రమీల తరుణ్ దగ్గరకు వెళ్లి అతని భుజం తట్టి, "భయపడకు తరుణ్! ప్రియకు ఏమీ జరిగి ఉండదు. మీ మామయ్య గారు ఇప్పుడే కాల్ చేశారు. నిన్ను ధైర్యంగా ఉండమన్నారు. ఆయన కూడా కాసేపట్లో ఇక్కడికి వస్తారు" అంటూ అతన్ని ఓదార్చింది.

కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తరుణ్ కి. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయి పేరెంట్స్ అదుపు తప్పి ప్రవర్తిస్తారు. అల్లుడి మీద చేయి చేసుకుంటారు. కానీ ఈవిడ తననేమీ అనలేదు సరి కదా తనకే ధైర్యం చెబుతోంది.. అతడు మౌనంగా ఆమెకు నమస్కరించాడు.


ఏసిపి ప్రతాప్ కూర్చున్నాక మురళి ఆయన పక్కనే నిలబడి "స్టేషన్ కి రాగానే ఆ రిసార్ట్ మేనేజర్ సందీప్ ని విచారించడం ప్రారంభించాము.నిజం చెప్పకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని చెప్పాము. అతను భయపడ్డాడో లేక భయం నటించాడో తెలియదు గానీ నా కాళ్ళ మీద పడి నిజం చెబుతానని, తనను టార్చర్ పెట్టవద్దని అభ్యర్థించాడు. అతను చెప్పిన దాని ప్రకారం ఆరోజు రాత్రి ఆఫీస్ రూమ్ లో పడుకొని ఉన్న సందీప్ ను తరుణ్ నిద్ర లేపాడట. ఆవేశంలో భార్య పైన చెయ్యి చేసుకున్నానని, ఆమె తల గోడకు కొట్టుకొని చనిపోయిందని చెప్పాడట. కేస్ కాకుండా తనను తప్పిస్తే 50 లక్షలు ఇస్తానని సందీప్ కు ఆశ పెట్టాడట. డబ్బుకు ఆశపడి అతను అందుకు అంగీకరించి శవాన్ని కాల్చి బయట పడేయించాడట. ఇదే విషయాన్ని స్టేట్మెంట్ రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పాడు" అని చెప్పాడు..


ప్రతాప్ మాట్లాడుతూ "ఇప్పుడు స్టేట్మెంట్ రాసి ఇచ్చినా తరువాత కోర్టుకు వెళ్ళినప్పుడు పోలీసుల బలవంతం మీద రాశానని చెబుతాడు. ఈ సందీప్ ఇలాంటి విషయాల్లో ఆరితేరిన వాడిలాగా ఉన్నాడు. నేను అతన్ని స్వయంగా విచారిస్తాను" అన్నాడు.


ఇంతలో సీఐ మురళి ఫోన్ మోగింది. లిఫ్ట్ చేయవద్దన్నట్లుగా సైగ చేశాడు ప్రతాప్.


"వీళ్లను వదిలిపెట్టమని కొంతమంది రాజకీయ నాయకులు ఫోన్ చేయవచ్చు. అలాగే ఎస్సై రంగనాథం కోసం మన డిపార్ట్మెంట్ వారే కొందరు కాల్ చేయవచ్చు. వీళ్లను వెంటనే వదిలి పెట్టేయడం మంచిది. అలాగే వాళ్లు వెళ్లాల్సిన చోటికి వెహికల్స్ కూడా ఆరెంజ్ చేయండి. ఇట్ ఈజ్ మై ఆర్డర్. అర్థమైంది కదా.." మురళి వంక సూటిగా చూస్తూ అన్నాడు ఎసిపి ప్రతాప్.


మురళి ఉదయ్ వంక తిరిగి, "మీ బాబాయి గారి ఆర్డర్స్ విన్నారు కదా! ఎస్సై రంగనాధాన్ని, రిసార్ట్ మేనేజర్ సందీప్ ను పంపించడానికి వెహికల్ ఏర్పాటు చేయండి. వెహికల్ దొరకడం ఆలస్యమైతే మీ కారులో అయినా వాళ్ళని చేర్చాల్సిన చోటికి చేర్చండి. ఇక మీరు బయటకు వెళ్లి ఆ ప్రయత్నంలో ఉండండి" అని చెప్పాడు.


ఉదయ్ ప్రవల్లికలకు విషయం అర్థమైంది. ఇద్దరూ మౌనంగా స్టేషన్ నుండి బయటకు నడిచారు.


ప్రతాప్ తరుణ్ తో మాట్లాడుతూ "మీరు మాత్రం కొంతసేపు ఇక్కడే ఉండండి. మరి కాసేపట్లో మీ మామగారు కూడా ఇక్కడికి వస్తారు" అని చెప్పాడు. సరేనన్నట్లు తల ఊపాడు తరుణ్.


తరువాత మురళి లాకప్ గది తలుపులు తెరిచాడు. సస్పెండ్ అయిన ఎస్సై రంగనాథం, రిసార్ట్ మేనేజర్ సందీప్ లను బయటకు పిలుచుకొని వచ్చాడు. వాళ్లను ఏసిపి గారి ముందు నిలబెట్టాడు.


రంగనాథం ఏసిపి గారికి సెల్యూట్ చేసి "ఈ మురళి నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నాడు. నా సస్పెన్షన్ ఆర్డర్ వెంటనే క్యాన్సిల్ చేయండి. లేకుంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు" అన్నాడు.


ప్రతాప్ అతనితో మాట్లాడుతూ "ఆవేశపడకండి రంగనాథం గారూ! కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి మీ సస్పెన్షన్ తీసివేస్తాను. ముందు మీరు, సందీప్ గారు ఇళ్లకు వెళ్లి రిలాక్స్ కండి. బయట మీకోసం కారు ఏర్పాటు చేశాము. మీరు వెళ్లి కారులో కూర్చోండి. మీ సెల్ ఫోన్లు మా కానిస్టేబుల్స్ తెచ్చి ఇస్తారు. మిగిలిన రిసార్ట్ సిబ్బందిని మాత్రం పోలీస్ జీప్ లో రిసార్ట్ దగ్గర దింపుతాము" అని చెప్పాడు.


"మా పవర్ ఏమిటో తెలిసింది కదా! మరొకసారి ఇలాంటి పొరపాట్లు చేస్తే మేము ఊరుకోము" అన్నాడు రంగనాథం.


"దయచేసి ఏదీ మనసులో పెట్టుకోకండి" అంటూ సీఐ మురళి వాళ్ళను ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వకుండా స్టేషన్ బయటకు తీసుకొని వెళ్ళాడు.


"మీరు కార్లు కూర్చోండి. ఇప్పుడే మీ సెల్ ఫోన్లు తీసుకుని వస్తాను" అంటూ స్టేషన్ లోకి వచ్చాడు మురళి.


కార్లు ఎక్కకుండా తమ సెల్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు వాళ్లు. ఇంతలో కార్ డోర్లు తెరుచుకొని నలుగురు వ్యక్తులు వాళ్లను కారులోకి బలవంతంగా నెట్టివేశారు. మరుక్షణం ఆ కారు బయలుదేరి వేగంగా వెళ్ళిపోయింది. స్టేషన్ లోకి వచ్చిన మురళి వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకొని తిరిగి బయటకు వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు.


ఇంతలో అతని సెల్ మోగింది. లిఫ్ట్ చేసాడు.మురళి.


"నమస్కారం సిఐ గారూ.. నేను మాజీ మినిస్టర్ కనకారావు గారి పీఏను. మా వాళ్లు ఇద్దరిని అనవసరంగా మీ స్టేషన్ కు తీసుకొని వచ్చారట. వెంటనే వాళ్లను వదిలేయమని మా అయ్యగారు చెప్పమన్నారు. 10 నిమిషాల కిందటే మీకు ఫోన్ చేశాను. మీరు తీయలేదు. ఫోన్ మా అయ్యగారికి ఇవ్వమంటారా?" అన్నాడు అతను.


మురళి మాట్లాడుతూ "అవసరం లేదు సర్, ఇప్పుడే మీ వాళ్లను విడుదల చేసాము. ఆ హడావిడిలో ఉండి మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాళ్ళు , వాళ్ల సెల్ ఫోన్లు కూడా తీసుకోకుండా హడావిడిగా వెళ్లిపోయారు. వాళ్ళను వదిలేసిన విషయం మీ అయ్య గారితో చెప్పండి" అని చెప్పి కాల్ కట్ చేశాడు మురళి.


తరువాత అతను స్టేషన్లోకి వచ్చి "నేను సెల్ ఫోన్లు ఇచ్చే లోపల వాళ్ళు ఏదో కార్లో వెళ్లిపోయారు.

ఏమిటో అంత తొందర.." అని ఎసిపి గారితో చెప్పాడు.


ప్రతాప్ మురళి వంక తిరిగి "చెప్పినట్లు చేశారు. అందుకే మీరంటే నాకు అభిమానం. వీళ్ళిద్దరి ఫోన్లు జాగ్రత్తగా మీ వద్దే ఉంచుకోండి. లేకపోతే ఆకతాయి తనంతో ఎవరైనా వీళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ వెతుకుతారు. అర్థమైంది కదా" అన్నాడు.


"అర్థమైంది సార్!" నవ్వుతూ చెప్పి ఆ రెండు సెల్ ఫోన్లు తన జేబులో వేసుకున్నాడు మురళి.

మరి కొంతసేపటికి ప్రవల్లిక స్టేషన్లోకి వచ్చింది.


ప్రమీల ఆమె వంక తిరిగి "ఎక్కడికి వెళ్లి వస్తున్నావు?" అని అడిగింది.

"నేను ఉదయ్ అలా బయటకు టీ తాగడానికి వెళ్ళాము. ఉదయ్ ఎవరినో ఇంటిదగ్గర డ్రాప్ చేసి వస్తానని వెళ్ళాడు" అని చెప్పింది.


"ప్రవల్లికా.. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి" ప్రవల్లికతో అంది ప్రమీల.


"ఏం చేయమంటారు?" అన్నట్లు ప్రతాప్ గారి వంక చూసింది ప్రవల్లిక.


"చూడండి ప్రమీల గారూ! ఈ కేసుకు ఉపయోగపడే విషయం ఏదైనా ఉంటే అది మా ముందరే మాట్లాడండి. అందువల్ల మీకు లాభమే కానీ ఏ విధమైన నష్టమూ ఉండదు. వివరాలు తెలిసే కొద్దీ విచారణ సులభతరం అవుతుంది. మీరు చెప్పిన విషయం వలన మాకు ఏదైనా క్లూ దొరకవచ్చు" అన్నాడు ప్రతాప్.


మీ ముందు చెప్పడానికి నాకు ఏ విధమైన అభ్యంతరము లేదు సార్. ఇందాకే మా వారు కాల్ చేశారు. ప్రియా కు సంబంధించిన ఒక విషయాన్ని మీకు చెప్పమన్నారు. మీతో ఎలా చెప్పాలో తెలియక ముందుగా ప్రవల్లికతో చెబుదాం అనుకున్నాను. నిజానికి ఈ విషయం జరిగి నాలుగేళ్లవుతోంది.. ఈ విషయం మా వారైతే మీకు చక్కగా వివరించి చెప్పగలరు. కానీ ఆయన నాకు కాల్ చేసి వీలైనంత తొందరగా ఈ విషయాన్ని మీకు చెప్పమన్నారు. అందువల్ల ఈ కేసులో ఉపయోగం ఉండవచ్చన్నారు. ఆయన రావడానికి మరో మూడు గంటలు పడుతుంది. కాబట్టి నేనే నాకు తెలిసినంతవరకు ఈ విషయం గురించి చెబుతాను" అంది ప్రమీల.

అందరూ ఆమె చెప్పబోయేది వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

===============================================

ఇంకా ఉంది...

===============================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).





65 views0 comments

Comments


bottom of page