top of page

నాకేమవుతోంది…? ఎపిసోడ్ 2


'Nakemavuthondi Episode-2' New Telugu Web


Series Written By Mallavarapu Seetharam Kumar

మల్లవరపు సీతారాం కుమార్ రచించిన ధారావాహిక 'నాకేమవుతోంది' రెండవ భాగం


మీకు చదివి వినిపిస్తున్నది కే. లక్ష్మి శైలజ.
గత ఎపిసోడ్ లో…


ప్రియ అనే యువతి కొత్త కాపురంలో తన అనుభవాలను ఇలా వివరిస్తోంది.


‘నా భర్త పేరు తరుణ్.

మా పెళ్ళై మూడునెలలు.

కొత్తకాపురం పెట్టి నెలే అయింది.

మంచి నిద్రలో ఉన్న నన్ను నా భర్త లేపుతాడు.

నా తలగడతో నాకు నేనే ఊపిరాడకుండా చేసుకోవడానికి ప్రయత్నించానని చెబుతాడు.

అతన్ని అనుమానించలేను. అలాగని పూర్తిగా నమ్మలేను’


ఇదీ ఆమె మానసిక పరిస్థితి.

తరువాత ఏం జరిగిందోనాకేమవుతోంది…? ధారావాహిక రెండవ భాగంలో చదవండి.


లెటర్ కోసం వెతుకుతూ అతని కంట పడ్డాను. ఒకవేళ అతనిలో ఏదైనా చెడు ఉద్దేశం ఉంటే తను దొరికి పోయానని భావిస్తాడు కాబట్టి ఇప్పుడతని నిజ స్వరూపం బయట పడుతుంది. భయం భయం గానే అతని కళ్ళ లోకి చూసాను.


"చెప్పవేం ప్రియా.. ఆ లెటర్ కోసమే వెతుకుతున్నావు కదూ!" నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు తరుణ్.

"అవును తరుణ్! నాకు ఏదైనా జరిగితే నీ మీద ఎవరికీ అనుమానం రాకూడదనే నా అంతట నేనే ఆ లెటర్ రాశాను. కానీ నువ్వు ఆవేశంతో దాన్ని నలిపి పారేశావు. ఆ లెటర్ ని తిరిగి డ్రాలో ఉంచుదామని వెతుకుతున్నాను" చెప్పాను నేను.


'ఫరవాలేదు.. ఇంతటి టెన్షన్ లో కూడా సమయస్ఫూర్తితో సమాధానం ఇవ్వగలిగాను' అనుకున్నాను.


చిన్నగా నవ్వాడు తరుణ్. "నేను కూడా అందుకే ఆ లెటర్ భద్ర పరిచాను. నువ్వు చెప్పినట్లు నీకు అనుకోని ఆపద కలిగితే అందరూ నన్ను అనుమానిస్తారు. తరువాత నేను ఆత్మహత్య చేసుకున్నా- ‘దొరికి పోయాననే అవమాన భారంతో చనిపోయాడు’ అంటారు. అందుకే నువ్వు రాసిన లెటర్ తో నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని, ఆ తర్వాత మరణించి నిన్ను చేరుకుంటాను” తన కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా చెప్పాడు తరుణ్.


నా మనసు ద్రవించింది. 'నా ముఖాన్ని దిండుతో అదుముకుంది నేనే. ఆ ఉత్తరం రాసింది కూడా నేనే. మరి తరుణ్ ని అనుమానించడానికి కారణం ఏముంది?' అనుకొని అతన్ని దగ్గరకు లాక్కొని కౌగలించుకున్నాను.


"సారీ తరుణ్! నీకు లేనిపోని టెన్షన్ పెట్టాను" అన్నాను.


అతను నా వీపు నిమురుతూ "ఇట్స్ ఓకే ప్రియా.. ప్లీజ్ కూల్ డౌన్" అన్నాడు.


ఇంతలో హఠాత్తుగా అతని మొబైల్ కి వచ్చిన మెసేజ్ తాలూకు నోటిఫికేషన్ గుర్తుకు వచ్చింది.


'ప్లాన్ సక్సెస్ అయిందా' అని ఉంది అందులో. అప్రయత్నంగా అతని వీపును చుట్టిన నా చేతులు విడి పడ్డాయి. వెంటనే తేరుకొని మరింత గట్టిగా అతన్ని హత్తుకున్నాను.


నేను ఇందాకటి టెన్షన్ తోనే అలా చేసినట్లు అనుకున్నాడతను.


"నువ్వు ఇంకా టెన్షన్ పడుతున్నట్లు ఉన్నావు. పడుకో.. పొద్దున లేచేటప్పటికి అంతా సర్దుకుంటుంది" అంటూ నన్ను పడుకో పెట్టబోయాడు.


విడిపించుకొని "లేదు తరుణ్! నాకు ఇక ఇప్పట్లో నిద్ర రాదు. హాల్లో కూర్చొని కాస్సేపు టివి చూసుకుంటూ ఆఫీస్ వర్క్ చేసుకుంటా" అన్నాను, అతను ఏమంటాడో అనుకుంటూ.


“నీ గురించి నాకెప్పుడో తెలిసిపోయింది. అది ఈరోజు రుజువయ్యింది" అన్నాడు తరుణ్ హఠాత్తుగా.


ఉలిక్కి పడ్డాను.

ఏం తెలిసింది..? తెలియడానికి నా దగ్గర రహస్యాలేం ఉన్నాయి? అతని మాటల్లో అర్థమేమిటి? నన్ను అనుమానిస్తున్నాడా?


గొంతు పెగుల్చుకొని, "స్కూల్ డేస్ నుండి ఇప్పటివరకు ఎవరెవరు నా వెంట పడ్డారో..పెళ్ళికి ముందే నీకు చెప్పాను. కొత్తగా నా గురించి తెలిసేదేముంది? రుజువయ్యేదేముంది?" అన్నాను.


"నేను చెబుతున్నదేమిటి..నువ్వు ఆలోచిస్తున్నదేమిటి? నువ్వు వర్కహాలిక్ వని నాకు ముందే తెలుసు. ఈ టైం లో ఆఫీస్ వర్క్ చేస్తాననడంతో అది రుజువయ్యిందన్నాను" అన్నాడు తరుణ్.


నా ఆలోచనలకు సిగ్గుపడ్డాను. అనవసరంగా అతన్ని అనుమానిస్తున్నాను అనిపిస్తోంది.


"అది కాదు తరుణ్! అర్జెంట్ గా పంపాల్సిన మెయిల్స్ ఉన్నాయి. ఇందాక హెడేక్ గా ఉండటంతో తొందరగా పడుకొని ఉదయాన కాస్త ముందుగా లేచి పూర్తి చేద్దామనుకున్నాను. ఇప్పుడు బాగా లేటయ్యింది. ఇక ఉదయాన్నే లేవడం కష్టం. అందుకే ఇప్పుడే పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. " అన్నాను సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లు.


"నిజమే! ఉదయాన్నే లేవడం డౌటే.." అన్నాడు తరుణ్.


అతని మాటల్లో ఏదైనా అంతరార్థం ఉందా..లేక నావి అనవసరపు భయాలా..ఆలోచిస్తూ ఉండగానే బెడ్ సైడ్ టేబుల్ మీద ఉన్న నా లాప్టాప్ అందించాడు.


"నువ్వుకూడా హాల్లోకి రా. నాకు కంపెనీ ఇచ్చినట్లు ఉంటుంది" అన్నాను అతనితో.


"రావాలనే ఉందికానీ నాకెందుకో ఒకటే మత్తుగా ఉంది. నేను పడుకోవాలి. నువ్వు వెళ్ళు. నువ్వు ఇంకా ఇందాకటి షాక్ లో వుంటే మాత్రం చెప్పు. నీ పని అయ్యేవరకు హాల్లోనే ఉంటాను" అన్నాడతను.


'అతను రాకుంటేనే నేను అనుకున్న పని చేయగలుగుతాను' అని మనసులో అనుకొని, "అలాగే తరుణ్.. రెస్ట్ తీసుకో. నేను ఓ అరగంటలో వచ్చేస్తాను" అంటూ లాప్టాప్ తో బయటికి నడిచాను.


నేను బయటకు వెళ్ళగానే తలుపు మూసుకున్నాడు తరుణ్.

హాల్ లోకి వెళ్లి సోఫా ముందున్న టీపాయ్ పైన ల్యాప్టాప్ ఉంచాను. ఫ్రిజ్ లోంచి ఒక వాటర్ బాటిల్ తీసుకొని సోఫాలో కూర్చున్నాను. రిమోట్ తో టీవీ ఆన్ చేసి ‘ఓ టి టి’ లో మొదట కనిపించిన మూవీని ప్లే చేశాను. ఏదో ఇంగ్లీష్ మూవీ అది..


ఇక నేను అనుకున్న పని ప్రారంభించాలని లాప్టాప్ ఓపెన్ చేశాను. ఛార్జింగ్ బొత్తిగా లేనట్టుగా చూపిస్తోంది. అప్పుడు గుర్తొచ్చింది.. లాప్టాప్ చార్జర్ బెడ్ రూమ్ లోనే ఉండి పోయినట్లు. ఇక తప్పదని పైకిలేచి బెడ్ రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ హ్యాండిల్ తిప్పాను.


డోర్ తెరుచుకోలేదు. లోపల గడియ వేసినట్లు ఉంది.


ఏమిటిది.. తరుణ్ కి డోర్ లాక్ చెయ్యాల్సిన అవసరం ఏముంది?


నాలో తిరిగి టెన్షన్ మొదలైంది. తరుణ్ మంచం దిగినట్లు శబ్దం అయింది. అలాగే చప్పుడు కాకుండా గడియ తీసిన శబ్దం.. అతను తిరిగి వెనక్కి వెళ్లిన విషయం కూడా నాకు అర్థం అవుతోంది.


" ప్రియా! ఏమిటి బయటే ఆగిపోయావ్? లోపలికి రా" అన్నాడు తరుణ్.


తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాను.


చార్జర్ తీసుకుంటూ "డోర్ లాక్ చేసుకున్నావెందుకు?" అని అడిగాను.


"ఏమిటి ప్రియా! నేనెందుకు డోర్ లాక్ చేసుకుంటాను? నువ్వు హ్యాండిల్ సరిగ్గా తిప్పి ఉండవు. నువ్వు వెళ్ళినప్పట్నుంచి నేను బెడ్ మీదే ఉన్నాను" అన్నాడతను.


ఎంత అబద్ధం!

తను తీసినప్పుడు డోర్ తెరుచుకోలేదు. తరువాత తనకు అతని అడుగుల చప్పుడు వినిపించింది. ఇప్పుడు డోర్ తెరుచుకుంది. దీన్నిబట్టి అతను ఖచ్చితంగా డోర్ వేసుకున్నాడు. ఎందుకోసం డోర్ వేసుకున్నాడు? ఆ విషయం తన దగ్గర ఎందుకు దాచాడు? ఎవరికైనా కాల్ చేసి ఉంటాడా..


అతని ఫోన్ మంచం మీద కాస్త దూరంగా పడి ఉండటం గమనించాను. నేను బయటకు వెళ్ళగానే అతను గడియ పెట్టుకొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. నేను డోర్ నెట్టగానే చేతిలో ఉన్న ఫోన్ బెడ్ మీద పడేసి, నెమ్మదిగా వచ్చి డోర్ తెరిచి తిరిగి వెనక్కి వెళ్ళాడు. నాకు తెలియకుండా ఏదో గూడుపుఠాణీ జరుగుతోందని అర్థమవుతోంది.


‘వెంటనే హాల్ లోకి వెళ్లి నేను అనుకున్న పని పూర్తి చేయాలి’ అని నిశ్చయించుకొని బయటకు నడుస్తూ ఉన్నాను.


"ఆగు ప్రియా! ఒక్క మాట" అన్నాడు తరుణ్.

ఏమిటన్నట్టు అతని వైపు చూశాను.

"పోయిన వారం మీ ఫ్రెండ్ హన్సిక మన ఇంటికి వచ్చింది కదా.. అప్పుడు మాటల మధ్యలో ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నావా అని అడిగింది. ఫ్యూచర్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నానని అప్పుడు తనకు చెప్పాను. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యిందా అంటూ ఇందాక మెసేజ్ చేసింది" అని చెప్పాడు తరుణ్.


నాకు విషయం అర్థమైంది. ఇందాక నేను తన ఫోన్ వంక చూడడం అతడు గమనించాడు. అందుకని ఆ మెసేజ్ కి అర్థాన్ని కల్పించి వివరిస్తున్నాడు.


"ఆ నోటిఫికేషన్ నేను చూశాను తరుణ్. కానీ నేను నిన్ను నమ్ముతున్నాను. అందుకే దాని గురించి ఏమీ అడగలేదు" చెప్పాను నేను.


"భార్యాభర్తల మధ్య కావలసింది ఆ నమ్మకమే ప్రియా! నేను కూడా అంతే.. రెండు వారాలకు ముందు మీ ఫ్రెండ్ రోషన్ మన ఇంటికి వచ్చాడు కదా! అతడు నీ గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నించినా నేను ఆసక్తి చూపలేదు" అన్నాడు తరుణ్.


"ఓకే తరుణ్! ఓ అరగంటలో వచ్చేస్తాను" అంటూ హాల్ లోకి నడిచాను. సోఫా లో కూర్చొని టీవీలో వస్తున్న మూవీ వంక చూశాను.ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి, సోఫా లో కూర్చుని ఉన్న హీరోయిన్ ని వెనకనుండి వచ్చి కత్తితో మెడమీద పొడుస్తాడు.


ఆ సీన్ చూడగానే ఉలిక్కిపడ్డాను.


సోఫా వెనుక ఎవరైనా ఉన్నారేమో అని లేచి చూశాను.

హమ్మయ్య! ఎవరూ లేరు.


సోఫాలో కాస్త పక్కకు తిరిగి, బెడ్ రూమ్ డోర్ తెరిస్తే నాకు కనిపించేలా కూర్చున్నాను. ల్యాప్టాప్ను ఛార్జింగ్ లో పెట్టి మూవీని కాస్త రివైండ్ చేసి పెట్టాను. హీరోయిన్ ఒక గది తలుపు తడుతుంది. లోపలినుండి ఒక వ్యక్తి వస్తున్నట్లు అడుగుల శబ్దం వినపడుతుంది. మూవీ ని పాజ్ చేశాను.


ఇందాక నేను బెడ్ రూమ్ డోర్ నెట్టినప్పుడు సరిగ్గా ఈ సీన్ వచ్చి ఉంటుంది. మూవీలోని అడుగుల శబ్దాన్ని విని, నేను తరుణ్ డోర్ దగ్గరకు వచ్చినట్లుగా భావించి ఉంటాను.. టెన్షన్లో హ్యాండిల్ ని పూర్తిగా తిప్పి ఉండను..


ఇలా అతని వైపు మంచిగా ఆలోచిస్తున్న నాకు హఠాత్తుగా అతను హన్సిక మెసేజ్ చేసినట్లు చెప్పడం గుర్తుకు వచ్చింది.. నిజానికి నేను ఆ మెసేజ్ తాలూకు నోటిఫికేషన్ మాత్రమే చూసాను.. అదీ ఓ క్షణమే. ఆ మెసేజ్ హన్సిక పంపినట్లు నాకు తెలియదు.


కానీ నేను చూసి ఉంటాను అనే ఉద్దేశంతో తరుణ్ ఆ విషయాన్ని బయట పెట్టాడు. పోయిన వారం హన్సిక మా ఇంటికి వచ్చి రెండు రోజులు గడిపింది. అప్పుడు జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకోగానే మరింత టెన్షన్ కలిగింది నాకు.

హన్సిక బిటెక్ లో నా ఫ్రెండ్.


చదువు పూర్తి కాగానే ఒక ఎన్నారైని పెళ్లి చేసుకొని యూఎస్ వెళ్ళిపోయింది.

భర్తతో పాటు అత్తమామలు తనను టార్చర్ పెట్టేవాళ్ళని తనకి ఫోన్ చేసి చెప్పేది.

చివరికి అతన్ని వదిలేసి ఇండియా వచ్చేసింది.


రిలీఫ్ కోసం ఫ్రెండ్స్ అందరి దగ్గరా ఒకటి రెండు రోజులు గడుపుతానని చెప్పింది.

పోయిన వారం నా దగ్గరకు కూడా వచ్చింది.

"తరుణ్ లాంటి హ్యాండ్సమ్ కుర్రాణ్ణి చేసుకున్నావ్! యు ఆర్ సో లక్కీ" అంటూ నన్ను అతని ఎదురుగా అభినందించేది.

అది అతన్ని పొగిడినట్లుగానే నాకు అనిపించేది.


'నీ స్నేహితురాలిని డిప్రెషన్ లో నుండి బయటకు తీసుకుని వద్దా'మంటూ రిసార్టులకు, మూవీలకు ప్లాన్ చేసేవాడు.


ముగ్గురం బయటకు వెళ్ళినప్పుడు మాతో హన్సిక వస్తోందా లేక వాళ్ళిద్దరితో నేను వెడుతున్నానా అనే సందేహం కలిగేది.


ఇద్దరూ అంతగా కనెక్ట్ అయినట్లు నాకు అనిపించేది.

ఆలోచనలు కట్టిపెట్టి అనుకున్న పని కానిచ్చేయాలనుకుని లాప్టాప్ ఓపెన్ చేశాను.


మా నాన్నకు మెయిల్ టైపు చెయ్యడం ప్రారంభించాను.


‘నాన్నగారికి,

ఇది షెడ్యూల్ చెయ్యబడ్డ మెయిల్.రేపు సాయంత్రం మీకు చేరేలా సెట్ చేసాను.


నేను క్షేమంగా ఉంటే మరో రోజుకు రీషెడ్యూల్ చేస్తాను. ఏ రోజైనా మీకు ఈ మెయిల్ చేరితే నాకు ఏదో హాని కలిగినట్లు అర్థం...

టైపు చెయ్యడం ఆపాను.


తెలుగు టైపింగ్ సాఫ్ట్వేర్ తో టైపు చేస్తున్నాను.


తరువాత అసలు విషయాన్ని ఎలా మొదలు పెట్టాలా అని కాసేపు ఆలోచించాను.

మైండ్ బ్లాంక్ గా ఉంది.

పాజ్ చేసిన మూవీని ప్లే చేసాను.


హీరోయిన్ ని ముసుగు వ్యక్తి కత్తితో వెంటాడుతున్నాడు.

ఆమె భయంతో పరుగులు పెడుతోంది.


ఉత్కంఠతో మూవీ చూస్తున్న నేను బెడ్ రూమ్ తలుపు తెరుచుకొని తరుణ్ బయటకు వచ్చిన విషయం గమనించలేదు.


ఇంకా ఉంది...


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).82 views0 comments

Comments


bottom of page