top of page

అమ్మ మనసులో ఏముంది ???



'Amma Manasulo Emundi' - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 18/01/2021

'అమ్మ మనసులో ఏముంది ???' తెలుగు కథ

రచన: మల్లవరపు సీతారాం కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతాలక్ష్మి





వంటింట్లో అమ్మకు కూరలు తరిగిస్తున్న శ్రావణి ఫోన్ మ్రోగడంతో హాల్ లోకి వచ్చింది.

అమెరికా నుంచి కృష్ణన్నయ్య.

"చెప్పు అన్నయ్యా! ' అంది శ్రావణి.


"అమ్మ ప్రక్కనే ఉందా?" చిన్నగా అడిగాడు కృష్ణ.


"వంటిట్లో ఉందిలే,చెప్పు."


"అమ్మ మా దగ్గర నెల రోజులు ఉంది కదా! అన్ని రోజులూ ఆనందంగా గడిపిన అమ్మ ,చివర్లో రెండు మూడు రోజులు ఏదోలా ఉంది. ఏది అడిగినా ముభావంగా ఉంది. మావల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందేమోనని మాకు చాలా బాధగా ఉంది. అమ్మ నీకేమైనా చెప్పిందా?"


"లేదు అన్నయ్యా !అయినా అమ్మ సంగతి తెలిసిందే కదా. తనకెంత ఇబ్బంది కలిగినా నోరు తెరిచి ఒక్క మాటైనా అనదు."


"అదే సమస్య. మీ వల్ల 'ఫలానా ఇబ్బంది కలిగింద'ని ఒక్క మాట చెబితే సరి చేసుకునే వాళ్ళం.

అప్పటికీ తనకేమైనా అసౌకర్యం ఎదురైందా అని అమ్మను రెండుమూడుసార్లు అడిగాను. తానేమి ఇబ్బంది పడలేదనీ, చాలా హాయిగా ఉన్నాననీ చెప్పింది అమ్మ.


మాతో పాటు సినిమాలకు ,షాపింగుకు వచ్చింది. మాతో సరదాగా గడిపింది. అలాంటిది ఉన్నట్లుండి ముభావంగా మారిపోయింది.


మీ వదిన తనవల్లే ఏదో పొరపాటు జరిగి ఉంటుందని దృఢ నిశ్చయానికి వచ్చింది.

ఆమె తిరిగి వెళ్ళినప్పటినుంచి తను సరిగ్గా భోజనం చెయ్యడం లేదు.

ఎంత సేపటికీ, 'నావల్ల అత్తయ్య ఏమైనా ఇబ్బంది పడిందేమో' అని బాధపడుతోంది.


నువ్వు అమ్మను కాస్త కదిలించి ఇక్కడి విషయాలు అడుగు. నాకు తెలిసి ఒకరి గురించి మరొకరి దగ్గర అమ్మ తప్పులు చెప్పదు. అయినా ఒక ప్రయత్నం చేసి, నాకు తిరిగి ఫోన్ చెయ్యి "చెప్పాడు కృష్ణ.


"అలాగే అన్నయ్యా !" అని చెప్పి ఫోన్ పెట్టేసి, వంటిట్లోకి వెళ్ళింది శ్రావణి.


"కృష్ణన్నయ్య ఫోన్ చేశాడమ్మా! నువ్వెలా ఉన్నావో కనుక్కుందామని ఫోన్ చేశాడట. నువ్వు రోజూ గుర్తుకు వస్తున్నావట. వదిన కూడా నీ గురించి రోజూ అడుగుతోందట " తల్లి మహాలక్ష్మితో అంది శ్రావణి.


కోడలి ప్రస్తావన రావడంతో తల్లి ముఖంలో స్వల్పంగా మార్పు రావడం గమనించింది కానీ ఆ మార్పుకు అర్థం ఏమిటనేది శ్రావణి ఊహకు అందడం లేదు.


"తొందరగా వంట కానిద్దాం. నాన్నగారు డిశ్చార్జ్ అయ్యేది ఈ రోజే కదా. వెళ్లి తీసుకువద్దాం" అంది మహాలక్ష్మి .


"అలాగే అమ్మా ! నువ్వు వెళ్లి రెడీ అవ్వు. వంట నేను పూర్తి చేస్తాలే " అంది శ్రావణి.


"ఆలా కాదులే శ్రావణీ! నువ్వు వెళ్లు. నేను చూసుకుంటానులే." స్టవ్ మీద బాణలి పెడుతూ అంది మహాలక్ష్మి.


తల్లి ఓపికకి ఆశ్చర్యపోయింది శ్రావణి.

*** *** ***

అమెరికాలో వున్న కృష్ణన్నయ్య , వదిన లలిత చాలా రోజులనుంచి అందరినీ అక్కడికి రమ్మని బలవంతం చేస్తున్నారు.


ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్య అన్నయ్య అక్కడ కొత్తగా ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంటి తాలూకు గృహ ప్రవేశం ఉండటంతో ఈ సారి తప్పకుండా రావాలి అని చెప్పాడు. టికెట్లు కూడా బుక్ చేశాడు. మరో వారం రోజుల్లో ప్రయాణం అనగా, తనకు తమ కాలేజీలో జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్ తాలూకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఇక్కడే హైదరాబాద్ లోనే పోస్టింగ్ వచ్చింది. అందరూ చాలా సంతోషించారు. తన టికెట్ క్యాన్సిల్ చేయమనీ, అమ్మానాన్నలు వస్తారనీ, కృష్ణన్నయ్య తో చెప్పింది తను. కానీ నాన్న నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. తను కూడా నిలిచిపోతానని, అమ్మను మాత్రం పంపిస్తానని చెప్పాడు. అందరి బలవంతం మీద అమ్మ ఒక్కతే అమెరికా వెళ్ళింది. గృహప్రవేశం తాలూకు పనుల్లో కోడలితో పోటీపడి పని చేసింది.


కొత్త ఇంటిలో సామాన్లు సర్దడం, అత్తా కోడళ్లిద్దరూ కలిసి ఒక రోజులోనే పూర్తి చేశారు. ఇక అన్నా వదినలు అమ్మను అమెరికాలో చాలా చోట్లకు తీసుకొని వెళ్ళారు. అమ్మ కూడా చాలా చలాకీగా ఉండేదని, కృష్ణన్నయ్య ఫోన్ చేసినప్పుడు చెప్పేవాడు. ఇక అమ్మ ఫోన్ చేస్తే, మాట్లాడినంతసేపూ కోడలి గురించిన పొగడ్తలే. 'తన కోడలు ఉద్యోగం చేస్తూ కూడా, ఇంటిని చక్కగా సర్ది ఉంచుతుందనీ, తనను ఏ పనీ చెయ్యనివ్వడం లేద'నీ చెప్పేది. అలాంటిది అమ్మ హఠాత్తుగా డల్ అయిందని అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. ఎంత తరచి అడిగినా కారణం చెప్పలేదట. అమ్మది అలిగే స్వభావం కాదు. అనవసరంగా కోపం తెచ్చుకోదు. అవతలి మనిషి తొందరపడి ఒక మాట అన్నా ఆవేశ పడదు. మనసులో కూడా ఎవరి మీదా ద్వేషం ఉండదు. అలాంటిది ఆమెను ఏ విషయం బాధించిందో, ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు.


ఇంతలో ఒక రోజు నాన్న స్కూటీలో ఇంటికి వస్తుండగా, కింద పడి చిన్న గాయం అయింది. తనే(శ్రావణి ) హాస్పిటల్ లో చేర్పించింది. చిన్నపాటి ఫ్రాక్చర్ అయిందనీ, ఓ పది రోజులు హాస్పిటల్ లోనే ఉండాలనీ డాక్టర్లు చెప్పారు. విషయం అన్నయ్య ద్వారా తెలుసుకున్న అమ్మ, వెంటనే ఇండియాకు బయలుదేరుతానని చెప్పింది. ఎలాగూ పై నెలలో తాము ఇండియా వస్తున్నామనీ, తమతో పాటు రావచ్చనీ, నాన్నకు తగిలింది పెద్ద గాయమేమీ కాదనీ, నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు కృష్ణన్నయ్య. కానీ అమ్మ ఎంత మాత్రం ఒప్పుకోక పోవడంతో అమ్మను ఫ్లైట్ ఎక్కించారు అన్నా వదినలు. అమ్మను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టు కి వెళ్ళింది తను. 'పెద్ద ప్రయాణం చేసి వచ్చావు కదా, ఈ రోజుకి ఇంట్లో విశ్రాంతి తీసుకో అమ్మా. రేపు ఉదయాన్నే హాస్పిటల్ కి వద్దువు గానీ. ఎప్పటిలాగే ఈరోజు కి నేనే హాస్పిటల్లో నాన్నకి తోడుగా ఉంటాను' అంది తను.


"నేను లేనప్పుడు అవస్థ పడ్డావు. ఇక నేను చూసుకుంటాను లే. ఇంట్లో పడుకున్నా నిద్ర పట్టదు నాకు". అంది అమ్మ. రాత్రంతా హాస్పిటల్లో ఉన్న అమ్మ, ఉదయాన్నే నాన్నను కాసేపు చెయ్యి పట్టుకొని నడిపించడం, టిఫిన్ తినిపించడం లాంటి పనులు చేసి ఇంటికి వచ్చేది. ఇక ఇక్కడికి వచ్చాక, వంట పని పూర్తి చేసి, నాన్నకు క్యారియర్ తీసుకొని బయలుదేరుతుంది. ఈ రోజే నాన్నను డిశ్చార్జి చేస్తారు. కాబట్టి క్యారియర్ అవసరం లేదు. ఇంటికి తీసుకుని వచ్చి, ఇక్కడే అన్నం తినిపించవచ్చు".

*** *** ***

ఆలోచిస్తూనే రెడీ అయింది శ్రావణి. తర్వాత మహాలక్ష్మి కూడా తొందరగా తయారయింది. ఇద్దరూ కలిసి హాస్పిటల్ కు వెళ్లారు. హాస్పిటల్ బిల్లు కట్టి, ప్రసాద్ ను ఇంటికి తీసుకొని వచ్చారు. కొద్దిరోజుల్లోనే ప్రసాద్ కు గాయం మానింది. మామూలుగా తిరగ్గలుగుతున్నాడు. ఒక రోజు నాన్న నిద్రపోతున్న సమయం చూసి, నెమ్మదిగా అమ్మను కదిపింది శ్రావణి.


"అమ్మా! ఒక విషయం అడుగుతాను. మనసులో ఏదీ దాచుకోకుండా నాకు జవాబు చెప్పాలి".


"అలాగేలే చెప్పు" అంది మహాలక్ష్మి.


"అలాగే అంటే కాదు. నిజం చెబుతానని నాకు మాట ఇవ్వు".


"ఎప్పుడూ లేనిది ఏమిటే ఇది!" ఆశ్చర్యపోయింది మహాలక్ష్మి.


"ప్లీజ్ అమ్మా! నాకు ప్రామిస్ చెయ్యి".


"అలాగేనన్నానుగా. అంతా నిజమే చెబుతాను. అబద్ధం చెప్పను. సరేనా?" నవ్వుతూ అంది మహాలక్ష్మి.


"అమ్మా! కృష్ణన్నయ్య దగ్గర దాదాపు నెల రోజులు ఉన్నావు కదా! అక్కడ ఏదో విషయంలో నువ్వు బాధ పడ్డావు. తమ వల్ల ఏదో పొరపాటు జరిగి ఉంటుందని కృష్ణన్నయ్య, లలిత వదిన చాలా బాధపడుతున్నారు. వదిన అయితే ప్రతి రోజూ ఇదే విషయం గుర్తుకు తెచ్చుకొని బాధపడుతోంది. అక్కడ ఏం జరిగిందో నువ్వు చెబితే కానీ తెలీదు కదా! అందుకని నువ్వు మనసు విప్పి మాట్లాడు" తల్లిని బ్రతిమాలింది శ్రావణి.


"పెద్ద విషయమేమీ కాదు. అయినా ఇప్పుడు మామూలు గానే ఉన్నాను కదా! ఇక ఆ విషయాన్ని వదిలెయ్యి. ఒట్టేసి చెబుతున్నాను. కృష్ణ వల్ల కానీ, కోడలు వల్ల కానీ ఏ చిన్న ఇబ్బందీ కలుగలేదు. ముఖ్యంగా కోడలు లలిత అయితే, వాళ్ళ అమ్మ గారి కంటే ఎక్కువగా నా గురించి ఆలోచించేది" చెప్పింది మహాలక్ష్మి.


"నేను చెప్పేదీ అదే అమ్మా. ఆ చిన్న సమస్య ఏమిటో నువ్వు చెప్పకపోవడం వల్ల అటు అన్నయ్య, ఇటు వదిన ఇద్దరూ ప్రతి రోజూ చాలా బాధ పడుతున్నారు.

దానికంటే నాకు ఫలానా అసౌకర్యం కలిగిందని వాళ్లకు చెబితే మరో సారి ఆలా జరక్కుండా సరి చేసుకుంటారు.ఇలా మౌనంగా వుంటే వాళ్ళు రోజూ బాధపడాలి".


"బావుందే ! లేని ఇబ్బందిని ఊహించి చెప్పమంటావేంటి ?" అంది గానీ మనసులో ఏం చెప్పాలా అని ఆలోచిస్తోంది మహాలక్ష్మి.


అది గమనించిన శ్రావణి "అమ్మా!నీ మనసే కాదు. ముఖం కూడా అబద్దాన్ని దాచలేదు. ప్లీజ్...నా కోసం చెప్పవూ..." తల్లి ముఖానికి తన వైపుకు తిప్పుకుంటూ అడిగింది శ్రావణి.


"సరే అయితే. తీరా చెప్పాక,ఇది కాదు, అసలు నిజం చెప్పు అంటూ లాయర్ లాగా వాదించొద్దు." అంది మహాలక్ష్మి నవ్వుతూ.


"మా మంచి అమ్మవు కదూ.మనసు మారేలోగా చెప్పేయ్ " అంది శ్రావణి.


మీ అన్నయ్య వాళ్ళింట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫామిలీ ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళింటికి వచ్చారు.

వాళ్ళు అమెరికాలో ఉన్న ఒక గుడికి వెళ్లారట. అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసుకొని వచ్చారు. అన్నయ్య,వదిన తీసుకున్నారు.నాకు చెయ్యి ఖాళీ లేకపోవడంతో అక్కడ ఉంచమ్మా, మళ్ళీ తీసుకుంటాను అని చెప్పాను. తరువాత ఆ విషయమే మరిచి పోయాను. చాలా రోజులకు ఆ విషయం గుర్తుకొచ్చింది. దేవుడిచ్చిన ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానే అనే బాధే నేను ముభావంగా ఉండడానికి అసలు కారణం. ఇది నేను ఒట్టేసి చెబుతున్నాను. ఇక ఈ విషయం ఇంతటితో వదిలెయ్యి " అంటూ గదిలోకి వెళ్ళిపోయింది మహాలక్ష్మి.


మంచంమీద పడుకుని ఆలోచనలలోకి వెళ్ళింది.


అమెరికాలో అబ్బాయిలాగే కోడలు కూడా ఉద్యోగం చేస్తోంది. అలాగని ఇంటి పనిలో నిర్లక్ష్యం చెయ్యదు. ఇల్లు శుభ్రంగా ఉంచడంతో పాటు కృష్ణకు కావలసినవన్నీ సమకూరుస్తుంది. తాను అక్కడకు వెళ్ళాక కూడా రిలాక్స్ అవుదామనుకోలేదు. ఎంత పని ఉన్నాకృష్ణ విషయంలో తన శ్రద్ధ తగ్గలేదు. ఆ రోజు కృష్ణాష్టమి. ఉదయాన్నే స్నానం ముగించింది తను.


"లలితా! నువ్వు కూడా త్వరగా స్నానం ముగించు. ముగ్గు పిండితో కృషుడి పాదాలు వేద్దాం" అంది కోడలితో.


క్షణం కూడా ఆలోచించలేదు లలిత."లేదత్తయ్యా! ఈయన ఇంకా లేవలేదు. లేచాక ఆయనకు నేనే తలస్నానం చేయించాలి. లేదంటే ఒప్పుకోరు. అందుకే ఇవాళ నా స్నానం కాస్త ఆలస్యం అవుతుంది. మీరు కాస్సేపు రెస్ట్ తీసుకోండి. నేను రెడీ అయ్యాక చెబుతాను " అంది.


"ఆ కృషుడి కంటే ముందు నీ కృషుడి విషయం గమనిస్తానంటావు . అంతేనా?" నవ్వుతూ అంది తను.


సిగ్గుపడుతూ కృష్ణను లేపడానికి వెళ్ళింది లలిత.

కోడలు చెప్పినట్లే కాసేపు విశ్రాంతి తీసుకుందామని గదిలోకి వెళ్ళింది తను. కొడుకు విషయంలో లలిత చూపిసున్నశ్రద్ధ చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది తనకు. అదే సమయంలో తను భర్తతో ఆలా ఉండలేకపోయానేమో అనే ఆలోచన కూడా వచ్చింది.


తన చిన్నప్పుడు అమ్మ నాన్న పక్క పక్కన కూర్చున్నా బామ్మ కళ్ళల్లో నిప్పులు పోసుకొనేది.

'పట్టపగలే ఏమిటా ఇకఇకలు' అని ఈసడించుకునేది.


'మా కాలంలో ఇంతలా బరితెగించలేదమ్మా!' అని నోరు నొక్కుకునేది.


ఆ ప్రభావం తనమీద ఉందేమో..పెళ్లయి అత్తవారింటికి వచ్చాక భర్త పక్కన కూర్చోవడానికే మొహమాట పడేది. నిజానికి తన అత్తామామలు దేవతలు. అయినా ఎందుకో వారి ముందు భర్తతో చనువుగా ఉండడం తనకు నచ్చేది కాదు.


ఒక రోజు అయన సరదాగా 'ఈ రోజు నేను స్నానం చేసేటప్పుడు కాస్త వీపు రుద్దవోయ్' అన్నందుకు తను ఎంత కోప్పడిందనీ..ఆ రోజు రాత్రి గదిలోకి వెళ్ళాక ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. అత్తమామలు కైవల్యం పొందేవరకు వారి మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేది. ఇక పిల్లలు పుట్టుకొచ్చాక తన ధ్యాసంతా వాళ్ళ మీదే. పిల్లలు చూస్తున్నారు ..పిల్లలు వింటున్నారు.. లాంటి మాటలు రోజులో ఎన్నిసార్లు వాడేదో తను.


కోడలు కొడుకు పైన చూపించే ప్రేమను చూస్తుంటే తను భర్తను నిర్లక్ష్యం చేశానేమో అనే బాధ ఎక్కువయింది. అందుకే తను ముభావంగా ఉంది. ఈ విషయాన్నీ బయటకు ఎలా చెప్పడం? చెబితే తను వాళ్ళ అన్యోన్యతను చూసి అసూయపడ్డానని అనుకుంటారేమో. కానీ అది వాస్తవం కాదు. నిజానికి కోడలిలా భర్త మీద నా అభిమానాన్ని బయటకు వ్యక్తపరచలేక పోయానే అనే బాధే నాలో పెరిగింది. ఎప్పుడెప్పుడు ఇండియా తిరిగి వద్దామా ... ఆయనను చూద్దామా అనిపించేది. ఇక ఆయనకు ఆక్సిడెంట్ అయిందని తెలిసాక తన మనసు నిలవలేదు. ఇవన్నీ బయటకు చెప్పలేనివి. అందుకే ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసానని అబద్ధం చెప్పింది. నిజానికి ఆ అబద్ధం లో ఒక నిజం ఉంది. అది తనకు మాత్రమే తెలుసు.

*** *** ***

అమ్మ లోపలికి వెళ్ళగానే అన్నయ్యకు ఫోన్ చేసింది శ్రావణి.

"చెప్పు శ్రావణీ. అమ్మ మౌన వ్రతం వీడిందా?' ఆతృతగా అడిగాడు కృష్ణ.


"లేదు. కానీ ఏదో ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశాననీ, అదే తన బాధకు కారణమనీ ఒట్టేసి మరీ చెబుతోంది."


"ఆశ్చర్యంగా ఉందే. అమ్మ సాధారణంగా ఒట్లు వెయ్యదు. మరి ఒట్టేసి చెప్పిందంటే అది నిజమే అయి ఉండాలి. ఇదిగో.. మీ వదిన మాట్లాడుతుందట" అంటూ ఫోన్ లలితకు ఇచ్చాడు.


"ఏమన్నావు శ్రావణీ.. ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని చెప్పిందా?"


"అవును వదినా.."


"నాకు చూచాయిగా విషయం అర్ధం అవుతోంది" అంటూ శ్రావణితో ఏదో చెప్పింది లలిత.


"నిజమే వదినా. నాకూ అదే అనిపిస్తోంది" అంది శ్రావణీ.

*** *** ***

అనుకున్న ప్రకారమే ఇండియా వచ్చారు కృష్ణ,లలితలు. అమ్మకు,శ్రావణికి తాము తెచ్చిన గిఫ్టులు చూపించారు. ఇంకా ఏదో చూపిస్తారని ఎదురు చూసింది మహాలక్ష్మి. కానీ ఎంతకీ మరేమి చూపించక పోవడంతో ఆమె మొహంలో రంగులు మారాయి.


అది గమనించిన కృష్ణ "అమ్మా! నా దగ్గర కూడా మొహమాటం ఎందుకు ? మీ నాన్నకు తెచ్చిన గిఫ్ట్ ఏదిరా అని అడగొచ్చు కదా ." అంటూ తండ్రికి తను తెచ్చిన ఖరీదైన సూట్ ,సెల్ ఫోన్ అందించాడు.


' మీ అమ్మ సంగతి తెలిసిందే కదా . ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ బయట పడదు " అన్నాడు ప్రసాద్.


మరుసటి రోజు ఉదయాన్నే స్నానానికి వెళ్ళబోతున్న అత్తగారిని ఆపింది లలిత.

"అత్తయ్యా ! ఈ రోజు స్పెషల్ ఏమిటి ?" అని ప్రశ్నించింది.


"ఈ రోజు మీ మామయ్యగారి పుట్టిన రోజు. గుడికి వెళ్లి అయన పేరిట అర్చన చేయిస్తాను. ఆయనకు ఇష్టమైన వంటలు చేస్తాను. ఇంకా..." చెప్పుకు పోతున్న మహాలక్ష్మిని ఆపింది లలిత.


"అవన్నీ తరువాత. ముందు మావయ్యకు తలస్నానం చేయించండి.' అంది.


'ఛీ...పాడు...' అంటూ సిగ్గుపడింది మహాలక్ష్మి.


"నాన్న పుట్టిన రోజు కదమ్మా...ఈ ఒక్క రోజే ప్లీజ్" ప్రాధేయ పడ్డారు కృష్ణ, శ్రావణి.


"అలాగైతే రోజూ పుట్టిన రోజు చేసుకుంటానురోయ్ " అన్నాడు ప్రసాద్.


"పిల్లల ముందు ఏమిటండీ.. మరీను" అంటూ సిగ్గుపడింది మహాలక్ష్మి.


అంతలో ఏదో అనుమానం వచ్చి కోడలు వంక చూసి "ఇదంతా కావాలనే చేస్తున్నారు కదూ ! ' అంది.


"అత్తయ్యా! మామయ్యగారితో ఫోన్ లో మాట్లాడేటప్పుడు 'ప్రసాదం' అని సంబోధించడం ఒకటి రెండు సార్లు గమనించాను. శ్రావణి కూడా అది నిజమేనంది. ఇక మీరు ఒట్టేసి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని చెప్పడంతో మాకు మీ మనసులో ఉన్నది అర్ధం అయింది. వాస్తవానికి మీరు ప్రేమ స్వరూపులు. మామగారి మీద మీకు కొండంత ప్రేమ ఉంది. కానీ మీరు ఆ ప్రేమను బయటకు చెప్పలేదు. మామయ్య అర్ధం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే అపార్ధాలు కలిగేవి " అంది లలిత.


"నిజమే. అర్ధం చేసుకునే భర్త , నా మొహంలో భావాలను చదవగలిగే కొడుకు, నా గుణాలను పుణికి పుచ్చుకున్న కూతురు, భర్త మనసునే కాదు, అత్తగారి మనసులోకి కూడా దూరగలిగే కోడలు దొరకడం నిజంగా నా పూర్వ జన్మ సుకృతం" అంది మహాలక్ష్మి ఆర్ద్రత నిండిన కళ్ళతో.


"ఇంతకీ అమ్మ మనసులో ఏముందంటావు? " కృష్ణను అడిగాడు ప్రసాద్.


"ఏముంటుందీ..పిల్లలంటే అభిమానం, కోడలంటే ఆప్యాయత, భర్త మీద చెప్పలేనంత ప్రేమ " అన్నాడు కృష్ణ.

*** శుభం***


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.

 (అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



2,670 views4 comments

4 Yorum


కధ బావుంది.

ఒకప్పుడు అలా ప్రేమలు మనసులో దాగి వుండేవి, అందుకే సంసార సాంగత్యం చివరి వరకు కొనసాగేది. ఇప్పుడు అన్నిటికీ తొందర.. 'అయిందనిపించుకోవాలి' - అన్ని 'మొక్కుబడి' కోసం చేస్తున్న పనులు, అందుకే సామరస్యం కరువైంది.

Beğen

vsgoparaju
01 Ağu 2023

కుటుంబ అనుబంధాలను కొత్త, పాత తరాల మధ్య ఆప్యాయతలను ప్రేమను వ్యక్తపరిచే ధోరణులను అందుకు కారణమైన వ్యక్తిగత అనుభవాలను చాలా చక్కగా వ్యక్తీకరించారు కధలో! మొత్తానికి ఒక ప్రేమాభినివేశాలతో నిండిన బొమ్మరిల్లు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన రచయితకు ధన్యవాదాలు!

Beğen

Super katha👌

Beğen

Katha chala bagundi 😊😊

Beğen
bottom of page