'Nakemavuthondi Episode-8' New Telugu Web Series
Written By Mallavarapu Seetharam Kumar
రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో...
రిసార్ట్ దగ్గరకు వెళ్లిన ఉదయ్ - సీఐ మురళి, డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక లను కలుస్తాడు.
పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్.
రిసార్ట్ మేనేజర్ సందీప్ ని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు.
రెస్టారెంట్ లో ఉన్న రిసెప్షనిస్ట్, తరుణ్ ఇద్దరు అమ్మాయిలతో - ఒకరి తరువాత ఒకరితో రెస్టారెంట్ కి వచ్చినట్లు చెబుతాడు.
వాళ్లిద్దరూ ప్రియ, హన్సికలని ఫోటోలు చూసి గుర్తు పడతాడు.
ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక ఎనిమిదవ భాగం చదవండి…
"నన్ను వదిలి పెట్టండి.. నిజం చెప్పినందుకు అరెస్ట్ చేస్తారా.." అంటూ గొడవకు దిగాడు రెస్టారెంట్ రిసెప్షనిస్ట్. కానీ పోలీసులు అతనికి సమాధానం చెప్పకుండా జీప్ లో ఎక్కించుకొని స్టేషన్ కి తీసుకొని వెళ్ళారు. మరికొద్ది సేపటికి ఎసిపి ప్రతాప్ ఆ రిసార్ట్ దగ్గరకు వచ్చాడు. రిసార్ట్ లో ఉన్న వాళ్ళందరినీ ఒకచోట సమావేశపరిచాడు. తరుణ్, ప్రియ, హన్సికల ఫోటోలను వాళ్లకు చూపించి ఎవరైనా గుర్తుపడతారేమో అడిగాడు.
తరుణ్, ప్రియా లను ఒక కాటేజ్ లోకి వెళుతూ ఉండగా చూసినట్లు కొందరు చెప్పారు. అలాగే వాళ్ళిద్దరూ రెస్టారెంట్ కు వచ్చినట్లు కూడా ఒకరిద్దరు చెప్పారు.. తరుణ్ ప్రియాలు ఉన్నారని చెబుతున్న కాటేజ్ లోకి ప్రతాప్ తో పాటు వెళ్లారు ఉదయ్, ప్రవల్లిక. ఆ గదిలో ఏ విధమైన వస్తువులు లేవు. ఆ చుట్టుపక్కల ఉన్న కాటేజీలు తనిఖీ చేశారు. ఖాళీగా ఉన్న ఒక కాటేజీలో నేల మీద ఏవో రక్తపు మరకలు చెరిపివేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ రూమ్ లో ఉన్న వేలిముద్రలను పోలీసులు సేకరించారు. తర్వాత ఎసిపి ప్రతాప్, స్టేషన్లో ఉన్న సిఐ మురళికి కాల్ చేశాడు.
"ఇక్కడ ఒక గదిలో రక్తపు మరకలు ఉన్నాయి. కాబట్టి హత్య రిసార్ట్ లోనే జరిగినట్లు అనిపిస్తోంది. రిసార్ట్ మేనేజర్ ను సరైన పద్ధతిలో విచారించండి. ఇక్కడి దర్యాప్తు పూర్తి చేసుకొని నేను మరో గంటలో స్టేషన్కు వస్తాను. ఈ లోగా అతని చేత నిజం కక్కించండి. అదుపులోకి తీసుకున్న రిసార్ట్ వాచ్మెన్ ని, ఇతర రిసార్ట్ సిబ్బందిని విడివిడిగా విచారిస్తే ఎవరో ఒకరు నిజం బయటపెడతారు" అని ఆదేశించాడు ప్రతాప్.
మరో అరగంట సేపు రిసార్ట్లో ఉన్న వాళ్ళందరి వివరాలు సేకరించారు. ఇంతలో తరుణ్ కి కాపలాగా ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రతాప్ కు కాల్ చేశాడు.
"సార్! పావుగంట క్రితం బురఖా వేసుకున్న ఒక యువతి తరుణ్ ఉన్న గదిలోకి వెళ్ళింది. ఓ పావుగంట తర్వాత బయటకు వచ్చింది. ఆమెను ఆపుదామనుకునే లోపలే ఎవరో బైక్ లో ఎక్కించుకొని వెళ్లారు" అని చెప్పాడు అతను.
"ఆ బురఖాలో బయటకు వెళ్ళింది తరుణ్ అయి ఉంటాడు. వెంటనే ఆ బైక్ ని ఫాలో చేయండి. అలాగే ఆ రూమ్ లో ఎవరున్నా వెంటనే అదుపులోకి తీసుకోండి" చెప్పాడు ప్రతాప్.
తర్వాత ఉదయ్ వంక తిరిగి "ఆ తరుణ్ పారిపోయినట్లు ఉన్నాడు" అని చెప్పాడు.
ఏం చెప్పాలో తోచలేదు ఉదయ్ కి. కేవలం తన మాట మీద నమ్మకంతో తరుణ్ ని అరెస్టు చేయలేదు. ఇప్పుడు అతను తప్పించుకున్నాడు..
ఉదయ్ వెంటనే ప్రతాప్ వంక తిరిగి "సారీ బాబాయ్! నా అంచనా తప్పయినట్లు ఉంది" అన్నాడు.
ప్రతాప్ ఓదార్పుగా ఉదయ్ భుజం తట్టి, “మరీ ఖంగారు పడకు. బైక్ లో వెళ్లిన అతన్ని మనవాళ్లు ఖచ్చితంగా పట్టుకుంటారు. వీధికి రెండు వైపులా మనవాళ్లు మఫ్టీలో కార్లలో వెయిట్ చేస్తూ ఉన్నారు. అతను ఎక్కువ దూరం తప్పించుకోలేడు" అన్నాడు.
"అంకుల్! గతంలో డ్రగ్స్ మాఫియా కేసులో ఉదయ్ ప్రతిభ చూశాం కదా.. అతను మనుషుల్ని సరిగ్గా అంచనా వేయగలడు. కాబట్టి తరుణ్ నేరం చేసి ఉండడు" అంది ప్రవల్లిక.
"ఇక్కడ విషయం అతను నేరం చేశాడా లేదా అన్నది కాదు. పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకోవడం అతని మీద అనుమానాన్ని పెంచుతుంది. అంత మూర్ఖంగా అతను తప్పించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేశాడో అర్థం కావడం లేదు" అన్నాడు ప్రతాప్.
తరుణ్ ఉన్న గదిలోకి వెళ్లిన కానిస్టేబుల్ ప్రతాప్ కి కాల్ చేశాడు. "సార్! మనం పొరబడ్డాం. ఆ తరుణ్ అనే అతను గదిలోనే ఉన్నాడు. అర్జెంట్ గా ఉదయ్ గారితో మాట్లాడాలంటున్నాడు" అన్నాడు అతను.
ఊపిరి వచ్చినట్లయింది ఉదయ్ కి.
ప్రతాప్ వెంటనే మొబైల్ ని ఉదయ్ కి అందించాడు. ఉదయ్, స్పీకర్ ఆన్ చేసి "చెప్పు తరుణ్.. ఇప్పుడు నీ గదికి ఎవరు వచ్చారు?' అని అడిగాడు.
"ఒక యువకుడు బురఖా వేసుకొని వచ్చి నన్ను పారిపొమ్మని, లేకుంటే ప్రాణాపాయం ఉంటుందని చెప్పాడు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. అడిగినా చెప్పలేదు. 'నీ శ్రేయోభిలాషిని' అని మాత్రమే చెప్పాడు. కానీ నేను తప్పించుకోవడానికి అంగీకరించక పోవడంతో అతను వెళ్ళిపోయాడు. నేను నిన్ను వెంటనే కలవాలి. నీకు చెప్పాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి" అన్నాడు తరుణ్.
"ఒక్క నిమిషం ఆగు తరుణ్.." అని 'ఏం చేద్దాం' అన్నట్లు ప్రతాప్ వంక చూశాడు ఉదయ్.
ప్రతాప్ ఫోన్ అందుకొని "చూడండి మిస్టర్ తరుణ్! మీరు అలా ఒంటరిగా ఉండడం కంటే మాతో ఉండడం ఎంతో మంచిది. మీరు తప్పు చేయకపోతే పోలీసులకు ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మా వాళ్లకు కాల్ చేసి చెబుతాను. మీరు వాళ్లతో ఇక్కడికి వచ్చేయండి. మీ మిత్రుడు ఉదయ్ ఐపీఎస్ కి సెలెక్ట్ అయి డ్యూటీలో జాయిన్ కాబోతున్నాడు. మీ విషయంలో అతనికి ఏ విధమైన రిస్క్ ఉండకుండా చూడవలసిన బాధ్యత మీదే" అని చెప్పాడు.
"అలాగే సార్! నేను మీ వాళ్ళతో అక్కడికి వస్తాను. నా రిక్వెస్ట్ ఒక్కటే.. మీకు దొరికిన మృతదేహం ప్రియాది అని, నేను హంతకుడినని మీ పోలీసులు ముందుగానే ఒక నిర్ణయానికి వస్తే ఈ కేసు ముందుకు సాగదు. అందుకే నేను పోలీసులకు లొంగిపోలేదు. కానీ నా మిత్రుడు ఉదయ్ ని రిస్క్ లో పెట్టడం ఇష్టం లేదు. అందుకే నేను మీ దగ్గరకు వస్తున్నాను. నాకు తెలిసిన విషయాలన్నీ పూర్తిగా మీకు చెబుతాను" అన్నాడు తరుణ్.
ఎసిపి ప్రతాప్, తరుణ్ ఉంటున్న వీధి చివర ఉన్న పోలీసు వాహనంలో ఉండే వారికి కాల్ చేశాడు. తరుణ్ ని తీసుకొని రిసార్ట్ దగ్గరకు వెంటనే రమ్మని వాళ్లకు చెప్పాడు. మరో అరగంటకు వాళ్లు తరుణ్ ని తీసుకొని వచ్చారు.
రిసార్ట్ ఆఫీస్ రూమ్ లో ఉన్న ఎసిపి ప్రతాప్, తరుణ్ ని తన ఎదురుగా కూర్చోమన్నాడు. ఉదయ్, ప్రవల్లికలను మాత్రం అక్కడ ఉండమని, మిగతా వారందరినీ బయటకు పంపి వేశాడు. తరువాత తరుణ్ తో మాట్లాడమన్నట్లుగా ఉదయ్ కి సైగ చేశాడు. ప్రవల్లిక తన మొబైల్ లోని వాయిస్ రికార్డర్ ని ఆన్ చేయడం గమనించాడు ఉదయ్.
అతను తన సీట్ లో నుంచి లేచి తరుణ్ పక్కన కూర్చొని, అతని భుజం మీద చేయి వేశాడు. తరుణ్ ఉద్వేగం ఆపుకోలేక ఉదయ్ ని గట్టిగా కౌగిలించుకొని బిగ్గరగా ఏడ్చేశాడు. ఉదయ్ అతని వీపు నిమురుతూ కాసేపు ఓదార్చాడు. ఓ అయిదు నిమిషాలకు తరుణ్ తేరుకొని జరిగిన సంఘటనలు చెప్పడం ప్రారంభించాడు.
"ఉదయ్! నీకు ఇదివరకే కొన్ని విషయాలు చెప్పాను. ప్రియ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఆమెను రిసార్ట్ కి తీసుకొని వెళ్ళాను. ఆ రిసార్ట్ కి నేను అంతకుముందే హన్సిక ను తీసుకొని వచ్చినట్లు, మేమిద్దరం కలిసి తనకేదో హాని చెయ్యబోతున్నట్లు ప్రియా ఊహించుకుంది. నాతో గొడవ పడింది. రిసార్ట్ లో తనకు హన్సిక కనిపించినట్లు చెప్పింది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో నాకు మెలకువ వచ్చి చూస్తే ప్రియా గదిలో లేదు. తనకోసం చుట్టుపక్కల వెతికి వచ్చేసరికి గదిలో కూర్చుని ఉంది. ఆమె ముఖంలో ఆందోళన కనిపిస్తోంది. తన చేతికి రక్తపు మరకలు అంటి ఉండడం గమనించాను. ఏమైందని అడిగితే హన్సిక తనను కాపాడమని పిలిచిందని చెప్పింది..తను హన్సిక కోసం వెళ్లానని, ఆమె పక్క కాటేజ్ లోకి వెళ్లడం చూశానని, అక్కడికి వెళితే ఆమె కనిపించలేదని చెప్పింది.
తను చెప్పిన కాటేజ్ లోకి వెళ్లి చూశాను. అక్కడ ఎవరూ లేరు. ఒక గదిలో రక్తపు మరకలు తుడిచి వేసిన ఆనవాళ్లు కనపడ్డాయి. ఏం జరిగిందో నా ఊహకు కూడా ఏమాత్రం అందలేదు. కానీ నాకు తెలిసినంతవరకు ఒక మనిషిని హత్య చేసేంత క్రూరత్వం ప్రియా లో లేదు. ప్రియాను అనునయించి నెమ్మదిగా నిజం తెలుసుకోవాలి అని తిరిగి నేను ఉన్న కాటేజ్ లోకి వెళ్లాను. అక్కడ ప్రియా లేదు. తనే హన్సిక ను చంపినట్లు ఒక స్లిప్ రాసిపెట్టి వెళ్ళింది. 'ఆ కాటేజ్ లో మరెవరిదైనా శవం చూసి ప్రియ తానే ఆ హత్య చేసినట్లు ఊహించుకొని ఉంటుంది. ఆ గదిలో ప్రియా వేలిముద్రలు పడి ఉంటాయి. తను అనవసరంగా చిక్కుల్లో పడుతుంది' అని ఆలోచించాను. ప్రియ ఆ గదిలోకి వెళ్ళింది కాబట్టి ఆమె అడుగుల గుర్తులు, వేలిముద్రలు అక్కడ ఉంటాయని ఊహించాను. వాటిని తుడిచి వేయడానికి వాచ్మెన్ సహాయం తీసుకోవాలనుకున్నాను.
వాచ్మెన్ కోసం వెతికాను. అతను ఆ చుట్టుపక్కల కనపడలేదు. ఈ రిసార్ట్ చాలా పెద్దది. కాటేజెస్ కి కాస్త దూరంగా చెట్ల మధ్యలో ఎవరో చలిమంట వేసుకొని ఉన్నట్లు కనిపించింది. వాచ్మెన్ అక్కడ ఉంటాడని ఆ ప్రదేశానికి వెళ్లాను. కాస్త దగ్గరకు వెళ్ళగానే అది చలిమంట కాదని, ఏదో శవాన్ని పెట్రోలు పోసి తగలబెడుతున్నారని గ్రహించాను. అక్కడ వాచ్మెన్ తో పాటు రిసార్ట్ మేనేజర్ సందీప్, మరో ఇద్దరూ వ్యక్తులు ఉన్నారు. నా అలికిడిని గమనించిన వాళ్లు నా దగ్గరకు వచ్చారు. సందీప్ నాతో మాట్లాడుతూ రిసార్ట్ లో ఒక హత్య జరిగిందని, పోలీస్ కేస్ అయితే తమ రిసార్ట్ కి చెడ్డపేరు వస్తుందని చెప్పాడు. శవాన్ని కాల్చి దూరంగా పడేయబోతున్నట్లు చెప్పాడు. విషయం బయటికి వస్తే ఆ నేరం నామీద మోపుతానని కూడా హెచ్చరించాడు.
ప్రియా కనపడడం లేదన్న విషయాన్ని వాళ్లకు చెప్పాను. శవాన్ని చూసిన భయంతో ఆమె పారిపోయి ఉంటుందని, కుదుట పడ్డాక ఫోన్ చేస్తుందని చెప్పారు వాళ్లు. వాళ్లు చెప్పిన దానికి తల ఊపి, ఆ రిసార్ట్ నుంచి బయటపడి నా స్నేహితుడి గదికి వెళ్లాను. అక్కడి నుంచి నీకు కాల్ చేశాను" అని చెప్పాడు తరుణ్.
ఏం మాట్లాడాలో ఎవరికి అర్థం కాలేదు. తను హత్య చేసి ఉండకపోతే ప్రియా అక్కడి నుండి ఎందుకు వెళ్ళిపోయింది..? ఒకవేళ తనే హత్య చేశానని పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో వెళ్లిపోయిందా.. వెళితే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది?
"తరుణ్..నువ్వు ఉన్న గదిలోకి వచ్చిన ముసుగు వ్యక్తి ఎవరు?" హఠాత్తుగా తరుణ్ ని ప్రశ్నించాడు ఉదయ్.
"అతను ఎవరో నాకు కూడా తెలియదు. పోలీసులకు దొరికితే ప్రమాదమని, పారిపొమ్మని నాకు సలహా ఇచ్చాడు. నేను అందుకు అంగీకరించలేదు. దాంతో అతను వెళ్ళిపోయాడు" అని చెప్పాడు తరుణ్.
"కేసు రాను రాను జటిలమవుతున్నట్లు అనిపిస్తోంది" అన్నాడు ఏసిపి ప్రతాప్
ఇంతలో స్టేషన్ నుంచి సిఐ మురళి ఏసీబీ గారికి కాల్ చేశాడు.
"ఇప్పుడే ప్రియా మదర్ స్టేషన్ కి వచ్చారు. హన్సిక పేరెంట్స్ కూడా స్టేషన్ కి వచ్చారు. పిల్లల గురించి వాళ్లు చాలా టెన్షన్ పడుతున్నారు" అని చెప్పాడు.
"ముందు వాళ్ల డిఎన్ఏలు సేకరించి డెడ్ బాడీ డిఎన్ఏ తో పోల్చి చూడమని చూడమను. వాళ్లను స్టేషన్లోనే కూర్చోబెట్టు. కాసేపట్లో మేము అక్కడికి వస్తాం" అన్నాడు ప్రతాప్.
తరువాత అతను తరుణ్ వంక తిరిగి "ప్రియా వాళ్ళ మదర్ స్టేషన్ కు వచ్చి ఉన్నారట. నువ్వు మాతో పాటు వస్తే ఆమె ఆవేశంలో నిన్ను ఏమైనా అనవచ్చు. నిన్ను వేరే స్టేషన్ కి పంపమంటే పంపుతాను" అన్నాడు.
తరుణ్ మాట్లాడుతూ "కూతురు కనపడని బాధలో ఆమె ఆవేశప పడడంలో తప్పులేదు. నేను భరిస్తాను. నన్ను మీతోనే తీసుకొని వెళ్ళండి" అన్నాడు.
అందరూ స్టేషన్ కి బయలుదేరారు. వాళ్ళు సగం దారిలో ఉండగానే సిఐ మురళి తిరిగి ఏసిపి ప్రతాప్ కి కాల్ చేశాడు.
"సార్! రిసార్ట్ మేనేజర్ సందీప్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రియాను తరుణ్ హత్య చేశాడట. ఆ శవాన్ని మాయం చేయమని తమకు డబ్బులు ఇచ్చాడట. అందుకోసం ఆ శవాన్ని కాల్చి బయటపడేసినట్లు చెప్పాడు" అని చెప్పాడు అతను.
జీప్ లో ఉన్న తరుణ్ కి ఆ మాటలు వినపడ్డాయి. అతనికి స్పృహ తప్పింది.
===============================================
ఇంకా ఉంది...
===============================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments