top of page

నాకేమవుతోంది…? ఎపిసోడ్ 4


'Nakemavuthondi Episode-4' New Telugu Web Series




‘నాకేమవుతోంది…?’ ’ ధారావాహిక నాలుగవ భాగం

గత ఎపిసోడ్ లో...

తనకు ప్రమాదం ఉన్నట్లు తండ్రికి మెయిల్ చేస్తుంది ప్రియ అనే యువతి. భర్త ప్రవర్తనలో తేడా ఉన్నట్లు ఆ మెయిల్ లో చెబుతుంది.

కానీ ఆమె తండ్రి ఆ మెయిల్ చూడడు.

తరువాత తాను తొందరపడి ఆ మెయిల్ పంపినట్లు, తను భర్తతో కలిసి రిసార్ట్ కి వెళ్తున్నట్లు మరో మెయిల్ పంపుతుంది.

కూతురు ఆ మెయిల్ లో చెప్పినట్లు మొదటి మెయిల్ డిలేట్ చేస్తాడతను.

ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక నాలుగవ భాగం చదవండి…


"మంచి పని చేశారు. ఇప్పుడే ఎస్సై గారికి చెబుతాను" అంటూ అతని నంబర్ నోట్ చేసుకొని ఎస్సైకి కాల్ చేశాడా కానిస్టేబుల్.


విషయం విన్న ఎస్సై రంగనాథం, "వాళ్ళ రిసార్ట్ లోనే హత్యో ఆత్మహత్యో జరిగి ఉంటుంది. కేసుల గొడవ తప్పించు కోవడానికి శవాన్ని బయట పడేసి ఉంటారు. నేను వెంటనే స్టేషన్ కి వస్తాను. డ్రైవర్ ని రెడీగా ఉండమను. ఫోటోగ్రాఫర్ కి కూడా ఇన్ఫార్మ్ చెయ్యి" అన్నాడు.


"అలాగే సార్" అంటూ ఫోన్ పెట్టేసాడు ఆ కానిస్టేబుల్.

మరో పావు గంటలో తన బైక్ లో స్టేషన్ కి చేరుకున్నాడు ఎస్సై రంగనాథం.

అప్పటికే అక్కడ డ్రైవర్ జీప్ తో సిద్ధంగా ఉన్నాడు.

ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా రెడీగా ఉన్నారు.

రంగనాథం ఎక్కగానే జీప్ కదిలింది.


ఆ వీధి చివర రెడీగా ఉన్న క్లూస్ టీం ఫోటోగ్రాఫర్ ని ఎక్కించుకున్నాడు.

"టీం లో మిగతా వాళ్ళు డైరెక్ట్ గా స్పాట్ కి వస్తామన్నారు" చెప్పాడా ఫోటోగ్రాఫర్.

"తెలుసు. ఎస్ పీ గారితో, ఏసీపీ గారితో మాట్లాడాను" చెప్పాడు రంగనాథం.


స్పాట్ కి చేరడానికి అరగంట పట్టింది.

రిసార్ట్ వాళ్ళు పెట్టిన మనుషులు జనాలని కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళ వల్ల సాధ్యం కావడం లేదు.


పోలీస్ జీప్ ని చూడగానే జనాలు కాస్త దూరంగా జరిగారు.

రంగనాథం సైగ చేయగానే కానిస్టేబుల్స్ జీప్ దిగి, అక్కడ ఉన్నవారికి వెళ్లిపొమ్మని కేకలు పెట్టారు. దాంతో ఆ ప్రదేశం దాదాపు ఖాళీ అయింది.


అక్కడే వున్న రిసార్ట్ మేనేజర్ సందీప్, జీప్ దిగిన ఎస్సైని చూసి దగ్గరికి వచ్చి విష్ చేసాడు.


"మా రిసార్ట్ కి పాలు పోసే అతను శవాన్ని ముందుగా చూసి మాకు చెప్పాడు సర్.. ఈ ప్లేస్ మా కాంపౌండ్ వాల్ కి దూరంగా వున్నా, బాధ్యత తీసుకోని మీకు ఫోన్ చేసాను సర్" అన్నాడతను రంగనాథం వెనకే నడుస్తూ.


"నిజం చెప్పు. మీ రిసార్ట్ లో మర్డర్ జరిగితే శవాన్ని ఇక్కడ పారేశారు కదూ" నవ్వుతూ అన్నట్లే తన అనుమానాన్ని బయట పెట్టాడు ఎస్సై రంగనాథం.


"అయ్యో..ఎంతమాట అనేసారు... అలాంటిదేమైనా వుంటే ముందుగా మీకు కబురు చేస్తాను కదా" అన్నాడు సందీప్.

చిన్నగా నవ్వుకున్నాడు రంగనాథం.


గతంలో ఒక కేసు విషయంలో తన సహాయంతో బయటపడి, భారీగానే ముట్టజెప్పాడు సందీప్.

అయినా తన మొహంలో గాంభీర్యాన్ని తెచ్చి పెట్టుకొని, "ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నాక మీ రిసార్ట్ రికార్డులు, సిసి కెమెరా రికార్డింగులు స్వాధీనం చేసుకొమ్మని మా ఏ సి పి గారు చెప్పారు. ఏవైనా చిన్న కేసులయితే సహాయం చెయ్యగలను కానీ మర్డర్ కేసులో నేను చేసే సహాయం ఏమీ ఉండదు. ఏదైనా వుంటే ఇప్పుడే చెప్పేయ్" అన్నాడు రంగనాథం.


"మా రిసార్ట్ లో అలాంటిదేమీ జరగలేదు. అన్ని రికార్డులు తనిఖీ చేసుకోండి" అన్నాడు సందీప్.


మాట్లాడుతూనే శవం దగ్గరకు చేరుకున్నారు వాళ్ళు.

శవం గుర్తు పట్టలేనంతగా కాలిపోయి వుంది.

ఆ శవం పురుషుడిదా లేక స్త్రీదా అని కూడా గుర్తు పట్టలేనట్లుగా ఉంది.


ఫోటోగ్రాఫర్ దూరంనుండే శవాన్ని వివిధ భంగిమల్లో ఫోటోలు తీసాడు.

ఇంతలో క్లూస్ టీం మిగతా సభ్యులు కూడా వచ్చారు.

ఆ చుట్టుపక్కల ప్రతి అణువు ఆధారాల కోసం గాలిస్తున్నారు.

రంగనాథం తనకున్న అనుభవాన్ని బట్టి ఆ శవం అక్కడ కాల్చబడలేదని గ్రహించాడు.


క్లూస్ టీం సభ్యులు కూడా అదేమాట చెప్పారు.

ఎక్కడో చంపి, కాల్చి శవాన్ని ఇక్కడ పడేసారు.

ఎక్కడా శవాన్ని ఈడ్చుకొచ్చిన ఆనవాళ్లు కూడా లేవు.

అంటే ఏదో వెహికల్ లో శవాన్ని తీసుకొని వచ్చి, రోడ్ పక్కన పొదల్లోకి విసిరేశారు.


ఇది కనీసం ఇద్దరు ముగ్గురైనా కలిసి చేసి ఉండాలి.

రంగనాథం అనుమానం రిసార్ట్ వాళ్ల పైకే వెళుతోంది.


రిసార్ట్ లో ఏదైనా హత్య జరిగి, నేరస్థులను కాపాడ్డానికి వాళ్ళు శవాన్ని కాల్చి ఇక్కడ పడేసి ఉండవచ్చు.


'రిసార్ట్ వాళ్లకు సహాయం చెయ్యాలని ప్రయత్నిస్తే తనకు కూడా సమస్యలు రావచ్చు. కాబట్టి తను ఈ కేస్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండాలి' అని మనసులో అనుకున్నాడు.


క్లూస్ టీం వాళ్ళు అక్కడ ఆణువణువూ గాలించారు.

వేలి ముద్రలు, అడుగుల ముద్రలు, సమీపంలో కాల్చి పడేసిన సిగిరెట్ పీకలు లాంటి వాటి కోసం వెదికారు.



టేప్ తో శవం రోడ్ నుంచి, సమీపంలో వున్న చెట్టునుంచి ఎంత దూరం వుందో కొలిచారు.

శవానికి కాస్త దూరంగా పడిఉన్న చెప్పులను తీసుకొని భద్ర పరిచారు.

చుట్టుపక్కల ఎక్కడైనా సగం కాలిన దుస్తుల ముక్కలేమైనా ఉన్నాయేమోనని చూసారు.

నేలపైన కాలిన కట్టెలు కానీ, ఆకులు కానీ లేకపోవడంతో శవం అక్కడ కాల్చబడలేదని నిర్ధారణకు వచ్చారు.

తరువాత ఫోటోగ్రాఫర్ శవాన్ని దగ్గర్నుంచి మరికొన్ని ఫోటోలు తీసాడు. శవాన్ని ఒక వస్త్రంలో చుట్టి పోస్టుమార్టం కోసం తరలించారు.


తాము సేకరించిన వివరాలతో క్లూస్ టీం వాళ్ళు వెళ్లిపోయారు.

తరువాత రంగనాథం, ఏ సి పి ప్రతాప్ కి కాల్ చేసాడు.

"నువ్వు వెంటనే ఆ రిసార్ట్ రికార్డులు సేకరించు. సిసి కెమెరా ఫుటేజ్ కూడా తీసుకో.

రిసార్ట్ లోకి గత నాలుగైదు రోజులుగా ఎవరెవరు వచ్చారో, ఎవరు ఖాళీ చేసారో వివరాలు తీసుకో. తమ స్టాఫ్ కోసం ఏవైనా కంపెనీలు రిసార్ట్ లో కాటేజ్ లు బుక్ చేసి వుంటే వాళ్లలో ఎవరైనా మిస్ అయ్యారేమో కనుక్కో" చెప్పాడు ప్రతాప్.


"అలాగే సార్" అన్నాడు రంగనాథం.


"మరో విషయం మిస్టర్ రంగనాథం..

మన సిఐని లీవ్ క్యాన్సిల్ చేసుకొని రమ్మన్నాను.

రేపే జాయిన్ అవుతాడట.

అతను వచ్చేలోగా రికార్డ్ లు మార్చడం లాంటి పనులు చెయ్యవద్దు.

ఇలా చెప్పడానికి కారణం వుంది.

ఆ రిసార్ట్ లో గతంలో ఇద్దరు వ్యక్తులు బీర్ బాటిళ్లతో కొట్టుకున్న కేసులో నువ్వు డబ్బులు తీసుకొని రాజీ కుదిర్చినట్లు నీమీద అనుమానాలున్నాయి. అప్పట్లో నేనే ఉండి ఉంటే నీ మీద యాక్షన్ తీసుకునేవాడిని. పాత స్నేహంతో ఏవైనా పొరపాట్లు చేస్తావేమోనని ముందుగా హెచ్చరిస్తున్నాను. జాగ్రత్తగా వుండు.." కఠినంగా చెప్పాడు ఏ సి పి ప్రతాప్.


సరేనన్నట్లు తల వూపి ఫోన్ కట్ చేసాడు రంగనాథం.

తరువాత తను తల ఊపిన విషయం ఏ సి పి కి ఫోన్ లో కనపడదని గ్రహించి నాలుక్కరుచుకున్నాడు.


తరువాత రిసార్ట్ మేనేజర్ సందీప్ వైపు తిరిగి, "పద.. మీ రిసార్ట్ లోకి వెడదాం" అని అతన్ని జీప్ లో ఎక్కించుకొని రిసార్ట్ లోకి వెళ్ళాడు.


ఆఫీస్ రూమ్ దగ్గర జీప్ ఆపించి సందీప్ తో కలిసి లోపలికి వెళ్ళాడు.

గత వారం రోజుల రికార్డ్స్ తనిఖీ చేసాడు.

ఎక్కువ భాగం కార్పొరేట్ కంపెనీలు బుక్ చేసినవే..

రిజిస్టర్ లో కంపెనీ పేరు, ఎన్ని కాటేజీలు బుక్ చేసారో ఆ వివరం రాసి ఉంది.


"కంపెనీ బుక్ చేస్తే వచ్చిన వాళ్ల వివరాలు ఉండవా..?" అడిగాడు రంగనాథం.

"ఆదా.. అదీ.. "అంటూ కాసేపు నీళ్లు నమిలాడు సందీప్.

తరువాత తేరుకొని "ఉండవు సర్, ఆ లిస్ట్ కంపెనీ వాళ్లే మైంటైన్ చేసుకుంటారు" అన్నాడు.


"లాస్ట్ ఇయర్ ఓ రిసార్ట్ లో యువతిపై అత్యాచార యత్నం జరిగింది. అప్పుడు ఏ సి పిగారు అందరు రిసార్ట్ యజమానుల్ని సమావేశపరిచి, రూమ్స్ కంపెనీ బుక్ చేసినా, వచ్చిన వాళ్ళ వివరాలు నోట్ చేసుకొని వాళ్ళ సంతకాలు తీసుకొమ్మని చెప్పారు కదా.. నాకు గుర్తు లేదనుకున్నావా?" అడిగాడు రంగనాథం.


“చెప్పారు సర్.. కొద్దీ రోజులు నోట్ చేసుకున్నాం కూడా..

తరువాత ఏ రిసార్ట్ వాళ్ళు నోట్ చెయ్యడం లేదని మేమూ మానేశాం..." భయంగా చెప్పాడు సందీప్.


"ఇలాంటి పొరపాట్లే మీ మెడకు చుట్టుకుంటాయి. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు మీకు..” అంటూనే తిరిగి ఆ రిజిస్టర్ చూడ్డం కొనసాగించాడు రంగనాథం.


విడిగా రిసార్ట్ కి వచ్చిన వాళ్ళ పేర్లు కొన్నే ఉన్నాయి.

వాటిలో ఒక అడ్రస్ దగ్గర అతని కళ్ళు ఆగిపోయాయి.

వరుణ్ అండ్ రియా, 101, వినోద్ విల్లా, రోడ్ నంబర్ 14, బంజారా హిల్స్


"మా ఇంటి దగ్గరే..ఎవరబ్బా." అని కాసేపు అలోచించి, "వీళ్ళ ఐ డి కార్డు కాపీ ఏది?' అని సందీప్ ని అడిగాడు రంగనాథం.

జవాబు చెప్పలేదు సందీప్.


"ఇందాక అడిగిన ప్రశ్నకు నీళ్లు నమిలావు. ఈసారి ఫెవి స్టిక్ నమిలేవా..నోరు బిగుసుకు పోయినట్లుంది? ముందు వాళ్ళను పిలిపించు. నాకు తెలిసి మా ఇంటి దగ్గర ఆ పేర్లతో ఎవరూ లేరు" అన్నాడు రంగనాథం.

వెంటనే బాయ్ ని పిలిచి వాళ్ళను పిలుచుకొని రమ్మన్నాడు సందీప్

.

"ఇతను బ్లాంక్ పేస్ తో తిరిగి వచ్చి, వాళ్ళు వెళ్లిపోయారని చెబితే మాత్రం నా లాఠీకి పని చెబుతాను. తెలిసిన వాడివని కూడా చూడను" కోపంగా అన్నాడు రంగనాథం.


కాసేపటికే ఆ బాయ్ తిరిగివచ్చి 'ఆ కాటేజ్ ఖాళీగా ఉంది సర్. ఎవరూ లేరు" అన్నాడు.


సందీప్ వంక సూటిగా చూసాడు రంగనాథం.

"యిపుడు చూడు ఏమయ్యిందో.. వాళ్ళ ఐ డి తీసుకోలేదు నువ్వు. అతని పేరు వరుణ్ కాకుండా తరుణ్ అయి ఉండవచ్చు.. ఆ అమ్మాయి పేరు రియా కాకుండా ప్రియా అయి ఉండవచ్చు.


ఇప్పుడు దొరికిన శవం ఆ అమ్మాయిదే అయి ఉండవచ్చు. అనవసరంగా నువ్వు ఈ కేస్ లో ఇరుక్కుంటున్నావ్..' అంటూ ఆ రిజిస్టర్ లో ఉన్న ఫోన్ నంబర్ కి కాల్ చేసాడు. స్విచ్ ఆఫ్ అని వస్తోంది.


ట్రూ కాలర్ లో పేరు ‘ప్రియా’ అని వస్తోంది.

సందీప్ వంక ఉరిమి చూస్తూ.."నేను అన్నట్లే అయింది.

"నీ రిజిస్టర్ లో రియా అని వుంది. ఇక్కడేమో ప్రియా అని చూపిస్తోంది. ఇదిగో.. మా ఏ సి పి గారు కాల్ చేస్తున్నారు.ఏమని చెప్పాలి" ఆందోళనగా అన్నాడు రంగనాథం.

ఒళ్ళంతా చెమటలు పట్టాయి సందీప్ కి.

"సర్.. మీరే ఎలాగైనా కాపాడాలి" అన్నాడు రంగనాథం చేతులు పట్టుకుంటూ.


***

ఐ పిఎస్ కి సెలెక్ట్ అయి, ట్రైనింగ్ పూర్తి చేశాడు ఉదయ్.

ఆ రోజే పోస్టింగ్ ఆర్డర్ చేతికి వచ్చింది.

బెంగళూర్ లో డిఎస్పీ గా పోస్ట్ చేశారు.


తన బాబాయ్ ఏ సి పి ప్రతాప్ ను, డిటెక్టివ్ పురంధర్ గారిని ఒకసారి మర్యాద పూర్వకంగా కలవాలని బయలు దేరాడు.

ఉదయాన్నే పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పింది.


ఆమెను చూసి చాలా రోజులయింది.

కారు స్టార్ట్ చెయ్యబోతుండగా అతని సెల్ మోగింది.

అన్నోన్ నంబర్..

లిఫ్ట్ చేసి ఎవరని అడిగాడు.


"నేను.. ఇంటర్ లో నీ రూమ్మేట్ తరుణ్ ని" చెప్పాడతను.


"ఓ.. నువ్వా తరుణ్.. ఎలా ఉన్నావు? అప్పట్లో బల్లులన్నా బొద్దింకలన్నా తెగ భయపడి పోయేవాడివి. ఏమైనా మారావా? ఈ మధ్య టచ్ లో లేవు కదా.. నా నంబర్ నీకు ఎలా తెలిసింది? ఎలా వున్నావు.. ఇప్పుడెక్కడ ఉన్నావ్?" అడిగాడు ఉదయ్.

"నలుగురైదుగురు ఫ్రెండ్స్ ని అడిగి నీ నంబర్ తెలుసుకున్నాను. నాకు నీ హెల్ప్ కావాలి"- తరుణ్ గొంతులో ఆందోళన.


"చెప్పు తరుణ్.. నీ గొంతులో టెన్షన్ తెలుస్తోంది. ముందు రిలాక్స్ అవ్వు. తరువాత నిదానంగా చెప్పు." అన్నాడు ఉదయ్.


"రిలాక్స్ అయ్యేంత టైం లేదు. ఆలస్యమైతే పోలీసులు పట్టుకొని పోతారు. నేను ఒక మర్డర్ కేసులో ఇరుక్కోబోతున్నాను.. నువ్వే హెల్ప్ చెయ్యాలి" అభ్యర్థించాడు తరుణ్.


"రిలాక్స్ తరుణ్.. నీ తప్పు లేకుంటే నీకేమీ కాదు. నేను నిన్ను సేవ్ చేస్తాను. ముందు నువ్వెక్కడ ఉన్నవో చెప్పు. నేను వచ్చి కలుస్తాను. లేదా నేనిప్పుడు మా బాబాయ్..అదే.. ఏ సి పి ప్రతాప్ గారి దగ్గరకు వెళ్తున్నాను. నువ్వు అక్కడికి వచ్చేయ్..నీకేం భయం ఉండదు. నీ సమస్య చెబితే ఆయన చూసుకుంటారు" చెప్పాడు ఉదయ్.


"నేను కనిపిస్తే అరెస్ట్ చేస్తారు. థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు. నేను తట్టుకోలేను." అన్నాడు తరుణ్.


"సరే.. నువ్వెక్కడ ఉన్నవో చెప్పు. నేనే వచ్చి కలుస్తాను" అన్నాడు ఉదయ్.

=====================================

ఇంకా ఉంది...

=====================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).




















95 views0 comments
bottom of page