top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

నాకేమవుతోంది…? ఎపిసోడ్ 7


'Nakemavuthondi Episode-7' New Telugu Web Series





గత ఎపిసోడ్ లో...

హన్సిక మూడు రోజులనుండి కనపడ్డం లేదని ప్రవల్లిక చెప్పడంతో ప్రమీలతో పాటు ప్రభాకర రావు లో కూడా ఆందోళన మొదలవుతుంది.

ప్రియ కూడా కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదని చెబుతాడు ప్రభాకర రావు.

స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్.

హన్సికని తను హత్య చేసినట్లు ప్రియ తనతో చెప్పిందని అంటాడు తరుణ్.

ఇంతలో ఏసిపి నుండి కాల్ రావడంతో రిసార్ట్ దగ్గరకు వెళ్తాడు ఉదయ్.

ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక ఏడవ భాగం చదవండి…


తన కార్లో రిసార్ట్ దగ్గరకు వెళతాడు ఉదయ్. అప్పటికే సీఐ మురళి, డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక అక్కడ ఉంటారు. వాళ్లకు కాస్త దూరంగా ఎస్సై రంగనాథం, అతని పక్కనే రిసార్ట్ మేనేజర్ సందీప్ చేతులు కట్టుకొని అతివినయం చూపిస్తూ ఉంటారు. ఉదయ్ రాగానే మురళి, ప్రవల్లిక అతన్ని విష్ చేస్తారు. గతంలో డ్రగ్స్ రాకెట్ పట్టుకున్న కేసులో ముగ్గురూ కలిసి పనిచేసే ఉంటారు.


ఉదయ్ కూర్చోగానే మురళి అతనితో "ఇప్పుడే మీ బాబాయి ఏసిపి ప్రతాప్ గారు ఫోన్ చేశారు. మీరు ఇక్కడికి వస్తున్నట్లు చెప్పారు. మీ సహాయంతో ఈ కేసు తొందరగా ఓ కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నాను" అన్నాడు.


"మీలాంటి అనుభవజ్ఞులు కేసు డీల్ చేస్తున్నారు. పైగా పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక పక్కనే ఉన్నారు. ఇక ఈ కేసులో నా అవసరమే ఉండదు అనుకుంటున్నాను" నవ్వుతూ అన్నాడు ఉదయ్.


తరువాత మురళి రంగనాథం వంక చూస్తూ "రిసార్ట్ రికార్డులు సీజ్ చేయమని ఏసిపి గారు మీకు స్వయంగా చెప్పారు కదా" అని అడిగాడు.


"చెప్పారు సార్! నేను బయలుదేరబోతూ ఉండగా సందీప్ స్టేషన్ కి వచ్చాడు. తన రిసార్ట్ లో దొంగతనం జరిగిందని, రిసార్ట్ రిజిస్టర్లు, సీసీ కెమెరా తాలూకు హార్డ్ డిస్క్ ఎవరో ఎత్తుకొని పోయారని కంప్లైంట్ చేశాడు. తరువాత నేను రిసార్ట్ కు వెళ్లి అతను చెప్పిన విషయాలు నిజమని ధ్రువీకరించుకున్నాను. ఆ తర్వాత, జరిగిన విషయాన్ని ఏసిపి గారికి ఫోన్ చేసి చెప్పాను" అన్నాడు.


"మిస్టర్ రంగనాథం! మీరు గతంలో కూడా ఈ సందీప్ కు సహాయం చేసి ఉన్నారు. తిరిగి అదే పొరపాటు చేస్తున్నారు. ఏసిపి గారు మీ పైన చాలా కోపంగా ఉన్నారు. మిమ్మల్ని వెంటనే సస్పెండ్ చేస్తామన్నారు. కొంత సమయం ఇవ్వమని, నేను మాట్లాడతానని ఆయనకు రిక్వెస్ట్ చేశాను. మీరు అబద్ధాలు చెప్పకుండా ఏం జరిగిందో ఉన్నదున్నట్లు చెప్పండి. నిర్లక్ష్యంగా ఉంటే ఉద్యోగం పోగొట్టుకోవడంతో పాటు క్రిమినల్ కేసు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది" కాస్త కటువుగా చెప్పాడు సిఐ మురళి.


"నేను నిజమే చెప్పాను సార్! గతంలో జరిగింది ఒక చిన్న కేసు. అలాంటి వాటిల్లో చూసీ చూడనట్లు పోవడం కొన్ని సందర్భాల్లో మన డిపార్ట్మెంట్లో పరిపాటే. దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు నేనేదో తప్పు చేసినట్లు చెప్పడం పద్ధతి కాదు. ఏదో ఒక సాకుతో సస్పెండ్ చేస్తే తిరిగి డ్యూటీ కి ఎలా రావాలో నాకు తెలుసు. నన్ను అంత తేలిగ్గా అంచనా వేయవద్దు" అన్నాడు రంగనాథం.


"ఈ సంభాషణ అంతా తన మొబైల్ లో రికార్డ్ చేసిన ఎస్ఐ మురళి దాన్ని ఏసిపికి పంపించాడు. కొద్ది నిమిషాలకే అతనికి ఏసిపి నుండి కాల్ వచ్చింది.


"అలాగే సార్!" అంటూ ఫోన్ పెట్టేసిన మురళి, "మిస్టర్ రంగనాథం! మిమ్మల్ని సస్పెండ్ చేశారు. ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేసి మీకు ఇస్తాను" అన్నాడు.

"నేను ఆ సస్పెన్షన్ ఆర్డర్ తీసుకోను. ఏం చేస్తారో చేసుకోండి" అంటూ రంగనాథం బయటకు వెళ్ళబోయాడు.


"ఆగండి మిస్టర్ రంగనాథం! మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం. మిమ్మల్ని విచారించాల్సి ఉంది" అని తన కానిస్టేబుల్స్ తో రంగనాథాన్ని జీప్ ఎక్కించమన్నాడు. తరువాత సందీప్ వైపు తిరిగి "నీలాంటి వాళ్ళతో మర్యాదగా మాట్లాడితే ప్రయోజనం ఉండదు . స్టేషన్ లో సరైన ట్రీట్మెంట్ ఇస్తే గాని దారికి రావు" అంటూ అతన్ని కూడా జీప్ ఎక్కించాడు. తర్వాత రిసార్ట్ లో ఉన్న నలుగురైదుగురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నాడు.


తరువాత సిఐ మురళి, ఉదయ్ వంక తిరిగి "వీళ్ళ వాలకం చూస్తూ ఉంటే పెద్ద పలుకుబడి ఉపయోగించి బయటపడేలా ఉన్నారు. ఈ లోగానే వీళ్ళ చేత నిజం కక్కిస్తాను. మీరు, ప్రవల్లికగారు ఇక్కడే ఉండి, ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో గమనించండి. మరి కాసేపట్లో ఏసిపి గారు కూడా ఇక్కడికి వస్తారట" అని చెప్పాడు. తరువాత రంగనాధాన్ని, సందీప్ ను తీసుకొని స్టేషన్ కి బయలుదేరాడు.


ప్రవల్లిక, ఉదయ్ తో మాట్లాడుతూ "నా స్నేహితురాలు హన్సిక మూడు రోజుల నుండి ఫోన్ తీయడం లేదని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. ఇక ప్రియ అనే నా స్నేహితురాలు కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదని వాళ్ల పేరెంట్స్ చెప్పారు. ప్రియ, తన భర్త తరుణ్ తో కలిసి ఈ రిసార్ట్ కే వచ్చిందట. తనకు ఏదైనా ప్రమాదం కలగవచ్చునని ఆమె తన తండ్రికి మెయిల్ చేసిందట" అంటూ తనకు తెలిసిన విషయాలు చెప్పింది.


వెంటనే ఉదయ్ తను తరుణ్ ని కలిసిన విషయం ఆమెకు చెప్పాడు.

"తరుణ్ నా క్లాస్మేట్. అతను ఫోన్ చేసి తను ఏదో మర్డర్ కేసులో ఇరుక్కుపోతున్నట్లు చెప్పాడు. నా సహాయం అర్థించాడు. నేను విషయాన్ని వెంటనే ఏసిపి గారికి చెప్పాను. ఆయన తరుణ్ణి కలిసి వివరాలు సేకరించమన్నాడు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకోకుండా అతని మీద నిఘా ఉంచమన్నాడు" అని చెప్పాడు ఉదయ్.


"ప్రియ గురించి అతను ఏమని చెప్పాడు?" అడిగింది ప్రవల్లిక.


"తన భార్య చాలా డిస్టర్బ్ అయినట్లు తనకు అనిపించిందని చెప్పాడు. అందుకే రిలాక్సేషన్ కోసం రిసార్ట్ కు తీసుకుని వెళ్లాడట. అక్కడ ఎవరో అమ్మాయిని చూసి హన్సిక అని భ్రమపడిందట. హన్సికతో కలిసి తనను ఏదో చేయబోతున్నట్లు ఊహించుకొని గొడవ పెట్టుకుందట. అర్ధరాత్రి పూట కాటేజ్ నుండి బయటకు వెళ్లి వచ్చిందట. ఆమె చేతికి రక్తపు మరకలు ఉన్నాయట. తను హన్సిక ను హత్య చేసినట్లు ప్రియా చెప్పిందట" అంటూ తనకు తరుణ్ చెప్పిన విషయాలన్నీ ఆమెతో చెప్పాడు.


"ప్రియా హత్య చేసిన మాట నిజమైతే తను ఏదో హత్య కేసులో ఇరుక్కుపోతున్నట్లు తరుణ్ ఎందుకు చెప్పాడు?" అడిగింది ప్రవల్లిక.


"ఇంకా అతనితో మాట్లాడడం పూర్తి కాలేదు. అర్జెంట్ గా ఇక్కడికి రమ్మని ఫోన్ రావడంతో వచ్చేసాను" చెప్పాడు ఉదయ్.


"అయితే ఇక్కడ ఎంక్వయిరీ పూర్తయ్యాక నేను కూడా నీతో వస్తాను. ఇంతకీ మనం వెళ్లే వరకు అతను అక్కడే ఉంటాడంటావా?" అడిగింది ప్రవల్లిక.


"అతడు ప్రస్తుతం తన స్నేహితుడి గదిలో ఉన్నాడు. బయట మఫ్టీ లో ఉన్న పోలీసులు కాపలా ఉన్నారు. ఒకరకంగా హౌస్ అరెస్ట్ అయినట్లు అన్నమాట. బయట పోలీసులు ఉన్న విషయం కూడా అతనికి చెప్పాను. కాబట్టి పారిపోయే ప్రయత్నం చేయడు. ఒకవేళ అలా ప్రయత్నిస్తే అతన్ని నేరుగా స్టేషన్ కి తీసుకొని వస్తారు" చెప్పాడు ఉదయ్.


"అతను తప్పు చేసి ఉంటే నీ సహాయం కోరేవాడు కాదు. పరారీలో ఉండేవాడు. కాబట్టి అతను చెప్పేది నిజమేననే కోణంలో ఆలోచిస్తే మనం ఈ కేసును పరిష్కరించవచ్చు" చెప్పింది ప్రవల్లిక.


తరువాత ఉదయ్ , సిఐ మురళి తమకు తోడుగా ఉంచిన కానిస్టేబుల్ ని దగ్గరకు పిలిచి "ఒకసారి ఈ రిసార్ట్ మొత్తం తిరిగి వద్దాం. మనకు సహాయంగా ఉండడానికి ఇక్కడ పనిచేసే వాళ్ళని ఎవరినైనా పిలవండి" అని చెప్పాడు.


అతను కాస్త దూరంగా తమ వంకే చూస్తున్న వ్యక్తిని పిలిచి "ఎవరు నువ్వు? ఈ రిసార్ట్ వాచ్మెన్ ఎక్కడ?" అని అడిగాడు.


"నేను వాచ్మెన్ తమ్ముడిని సార్. అన్న లీవ్ పెట్టినప్పుడు నేను డ్యూటీ చేస్తూ ఉంటాను. ఇందాక స్టేషన్ కు పోయిన వాళ్లలో మా అన్న కూడా ఉన్నాడు" చెప్పాడతను.

"సరే పద.. ఒకసారి రిసార్ట్ మొత్తం తిరిగి వద్దాం" అని అతనితో చెప్పాడు కానిస్టేబుల్.


తరువాత అతను ఉదయ్, ప్రవల్లికల వంక తిరిగి "బెంగుళూరు డ్రగ్ మాఫియాను పట్టించిన కేసులో మీ ఇద్దరినీ టీవీలో చూశాను. చాలా సాహసం చేశారు" అంటూ వాళ్లని అభినందించాడు.


తరువాత వాళ్ళను తీసుకోని తీసుకొని రిసార్ట్ చూపించడానికి వెళ్ళాడు. ఆ రిసార్ట్ పచ్చటి పచ్చికతో, ట్రిమ్ చేయబడ్డ క్రోటన్ మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. చెట్ల మధ్యలో ఒక దానికి ఒకటి దూరంగా చాలా కాటేజెస్ ఉన్నాయి. ఒకచోట స్విమ్మింగ్ పూల్, మరొకచోట ఆర్టిఫిషియల్ గా ఏర్పాటు చేసిన చెరువు ఉన్నాయి. ఆఫీస్ రూమ్ దాటిన తర్వాత కొద్ది దూరంలోనే ఒక రెస్టారెంట్ ఉంది.

అందరూ ఆ రెస్టారెంట్ వైపు వెళ్లారు.


అక్కడ క్లూస్ టీం కి సంబంధించిన ఫోటోగ్రాఫర్- ఉదయ్, ప్రవల్లికలను చూసి విష్ చేసాడు.

"ఇక్కడకు వచ్చి వెళ్లే వాళ్లందరినీ వీడియో తియ్యమని ఎసిపి గారి ఆర్డర్ సర్.

అలాగే మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర కూడా నిఘా ఉంచారు. బయటకు వెళ్ళేవాళ్ళను వీడియో తియ్యడంతో బాటు వాళ్ళ ఐడిలు చెక్ చేస్తున్నారు" అని చెప్పాడతను.


ఉదయ్, రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి, తన మొబైల్ లో ఉన్న తరుణ్ ఫోటో చూపించి "ఇతన్ని నిన్న చూసారా?" అని అడిగాడు.


"చూసాను సర్! ముందు ఒక అమ్మాయితో వచ్చాడు. తరువాత మరో అమ్మాయితో వచ్చాడు. అందువల్ల నాకు బాగా గుర్తు ఉన్నాడు" నమ్మకంగా చెప్పాడతను.


ఉదయ్ వెంటనే తరుణ్ కి కాల్ చేసి, ప్రియా ఫోటో పంపామన్నాడు.

ప్రవల్లిక, హన్సిక పేరెంట్స్ కి కాల్ చేసి తన ఫోటో పంపమంది.


"మా అమ్మాయి విషయం ఏమైనా తెలిసిందా..?" ఆతృతగా అడిగారు వాళ్ళు.

"ఇంకా లేదు.. మీరేం భయపడకండి. ముందు ఫోటో పంపండి." అంది ప్రవల్లిక.

"వాళ్ళిద్దరి ఫోటోలూ చూసిన రిసెప్షనిస్ట్ "అవును సర్! వీళ్ళిద్దరితోనే ఇక్కడికి వచ్చాడు.

" అన్నాడతను.


తరువాత హన్సిక ఫోటో చూపిస్తూ "ముందు ఈ అమ్మాయితోనే వచ్చాడు సర్. అదిగో.. ఆ కార్నర్ సీట్ లో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. తరువాత దగ్గరలో ఎవరో కూర్చోవడంతో ఇద్దరూ ఫామిలీ రూమ్ లోకి వెళ్లారు. దాదాపు ఒక గంట అక్కడ వున్నారు. ఇద్దరూ బయటకు వెళ్లిన గంట తరువాత, ఇదిగో.. ఈ అమ్మాయితో వచ్చాడు.." అంటూ ప్రియ ఫోటో చూపించాడు.


చెమటలు పట్టాయి ఉదయ్ కి.

'తన అంచనా తప్పు కాబోతోందా.. తరుణ్ నేరం చేశాడా..' తీవ్రంగా ఆలోచిస్తున్నాడతను.


అతని చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నొక్కింది ప్రవల్లిక.

"రిలాక్స్ ఉదయ్. ముందు ఇక్కడ కాఫీ తాగుదాం" అంటూ లోపలికి నడిచింది.

కాస్త దూరంగా నిలుచున్న కానిస్టేబుల్ ని, వాచ్ మెన్ తమ్ముడిని కూడా తమతో రమ్మన్నాడు ఉదయ్.


రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి తానే స్వయంగా వాళ్లకు వాటర్ బాటిల్స్ అందించాడు.

కాఫీకూడా తనే సర్వ్ చేసాడు.

వాళ్ళు కాఫీ తాగేలోగా రెండుమూడు సార్లు వాళ్ళ దగ్గరకు వచ్చి, వినయంగా నిల్చున్నాడు.


"ఇతని ప్రవర్తన కాస్త అనుమానాస్పదంగా ఉంది. అడిగిన దానికన్నా ఎక్కువ జవాబులు ఇస్తున్నాడు.

సాధారణంగా పొలిసు కేసుల విషయంలో ముక్తసరిగా జవాబులు ఇస్తారు. ఇతన్ని విచారించమని మురళిగారికి చెప్పండి" అంది ప్రవల్లిక.


కాఫీ ముగించి రిసెప్షన్ వద్దకు వెళ్లారు.

అతను వద్దంటున్నా బిల్ చెల్లించాడు ఉదయ్.

"ఇక్కడ సిసి కెమెరాలు లేవా?" హఠాత్తుగా అడిగింది ప్రవల్లిక.

"ఉన్నాయి మేడం.. నిన్న తెఫ్ట్ జరిగినప్పుడు ఇక్కడి హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకొని వెళ్లారు" చెప్పాడతను.


"అదేమిటి? మీరు చెప్పేది చూస్తుంటే ఓ పాతిక మంది మీ రిసార్ట్ మీద దాడి చేసినట్లుందే" అంది ప్రవల్లిక.

"అదేంకాదు మేడం.. మా రిసార్ట్ మొత్తానికి ఒకే వ్యక్తి సిసి కెమెరాలు సర్వీస్ చేస్తుంటాడు. అలాంటప్పుడు హార్డ్ డిస్క్ లు ఎత్తుకు పోవడానికి ఒక్కరు సరిపోరా.." హేళనగా అన్నాడతను.


ఉదయ్ దవడ కండరం బిగుసుకుంది.

ప్రవల్లిక అతని చేతిని చిన్నగా నొక్కి వదలడంతో అతను శాంతించాడు.

అందరూ రెస్టారెంట్ నుండి బయటకు నడిచారు.


"ఇతన్ని కూడా అదుపులోకి తీసుకొమ్మని మురళిగారికి మెసేజ్ పెట్టాను.." అంటూ ఆమె చెబుతూ ఉండగానే పోలీస్ జీప్ అక్కడకు వచ్చి ఆగింది.

అందులోంచి నలుగురు పోలీసులు దిగి ఆ రిసెప్షనిస్ట్ ని అదుపులోకి తీసుకున్నారు.

================================================

ఇంకా ఉంది...


================================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


















66 views0 comments

Comments


bottom of page