top of page

నాకేమవుతోంది…? ఎపిసోడ్ 10


'Nakemavuthondi Episode-10' New Telugu Web Series



జరిగిన కథ...

కొత్తగా పెళ్ళైన ప్రియ అనే యువతిని ఆమె భర్త నిద్ర లేపి, ఆమె- తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు.

అతన్ని అనుమానిస్తుంది ప్రియ.

అతని వల్ల తనకు హాని కలగవచ్చునని తండ్రికి మెయిల్ పెడుతుంది.

తాను తొందరపడి ఆ మెయిల్ పంపినట్లు, తను భర్తతో కలిసి రిసార్ట్ కి వెళ్తున్నట్లు కూతురి దగ్గర్నుండి మరో మెయిల్ వస్తుందతనికి.

ఎస్సై రంగనాథం, రిసార్ట్ సమీపంలో పడిఉన్న శవాన్ని పరిశీలించడానికి వెళ్తాడు.

కూతురు ఫోన్ తియ్యక పోవడం గురించి ఆందోళన పడుతుంది ప్రియా తల్లి ప్రమీల.

కూతురి కోసం హైదరాబాద్ బయలుదేరుతుంది.

దార్లో డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక ఫోన్ చేసి ప్రియ ఫోన్ నంబర్ గనుక మారిఉంటే తనకు ఇవ్వమని ప్రమీలను అడుగుతుంది.

హన్సిక మూడు రోజులనుండి కనపడ్డం లేదని ప్రవల్లిక చెప్పడంతో ప్రమీలతో పాటు ప్రభాకర రావు లో కూడా ఆందోళన మొదలవుతుంది.

ప్రియ కూడా కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదని చెబుతాడు ప్రభాకర రావు.

స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్.

హన్సికని తను హత్య చేసినట్లు ప్రియ తనతో చెప్పిందని అంటాడు తరుణ్.

పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్.

రిసార్ట్ మేనేజర్ సందీప్ ని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు.

రెస్టారెంట్ లో ఉన్న రిసెప్షనిస్ట్: తరుణ్ ఇద్దరు అమ్మాయిలతో - ఒకరి తరువాత ఒకరితో రెస్టారెంట్ కి వచ్చినట్లు చెబుతాడు.

వాళ్లిద్దరూ ప్రియ, హన్సికలని ఫోటోలు చూసి గుర్తు పడతాడు.

తరుణ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.

రిసార్ట్ మేనేజర్ సందీప్ ప్రియను తరుణ్ హత్య చేసినట్లు, అతను డబ్బు ఆశ చూపడంతో తామే శవాన్ని కాల్చి, రిసార్ట్ బయట పడవేసినట్లు సిఐ మురళి తో చెబుతాడు.

తనమీద ఏదో కుట్ర జరుగుతోందని చెబుతాడు తరుణ్.

సస్పెండయిన ఎస్సై రంగనాథాన్ని, రిసార్ట్ మేనేజర్ సందీప్ ని విడుదల చేయమంటాడు ఎసిపి ప్రతాప్.

స్టేషన్ దాటి బయటకు వెళ్ళగానే వాళ్ళను ఎవరో కిడ్నాప్ చేస్తారు.


ఇక నాకేమవుతోంది.. ధారావాహిక పదవ భాగం చదవండి.


స్టేషన్ నుండి బయటకు వచ్చి, తమ సెల్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు రంగనాథం, సందీప్ లు. అంతలో ఒక ఇన్నోవా కారు వాళ్ళ ముందు ఆగింది. అందులోంచి నలుగురు బలిష్ఠులైన వ్యక్తులు దిగి వాళ్ళిద్దరినీ బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు, ఇద్దరి ముఖాలనీ కర్చీఫ్ లతో అదిమి ఉంచారు. తియ్యటి వాసన వస్తూ ఉండగా ఆ ఇద్దరూ స్పృహ తప్పారు. రంగనాథానికి స్పృహ వచ్చేసరికి తనని ఒక గోడౌన్ లో బంధించినట్లు అర్థమయింది. అతన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్లు కట్టి పడేశారు. సందీప్ కోసం తల అటు ఇటు తిప్పి చూశాడు. అతను ఎక్కడా కనపడలేదు.


"ఎవరైనా ఉన్నారా?" అని గట్టిగా అరిచాడు.

సమాధానం లేదు..


“నేను మాజీ మినిస్టర్ కి బాగా కావలసిన వాడిని. నన్ను తక్కువ అంచనా వేయవద్దు. ఈపాటికి నా కోసం మా వాళ్లు వెతుకుతూ ఉంటారు” అంటూ కేకలు పెట్టాడు రంగనాథం.


మరో అరగంటకు ముఖానికి ముసుగు వేసుకున్న ఒక యువకుడు ఆ గోడౌన్ లోకి వచ్చాడు. అతని వెనుకే నలుగురు అనుచరులు వచ్చి, తిరిగి గోడౌన్ తలుపులు మూసివేశారు. అందరూ రంగనాథాన్ని సమీపించారు.

"ఎవరు మీరు? నన్ను ఎందుకు బంధించారు.." అంటూ కేకలు పెట్టాడు రంగనాథం.


"మన ట్రీట్మెంట్ ప్రారంభం కాకముందే గావు కేకలు పెడుతున్నాడు. వీడి నోట్లో గుడ్డలు కుక్కి అసలైన టార్చర్ అంటే ఏమిటో చూపించండి" అన్నాడు ఆ యువకుడు.


వెంటనే ఒక వ్యక్తి రంగనాథం నోట్లో గుడ్డలు కుక్కి నోటికి పెద్ద టేప్ అంటించాడు. మరో వ్యక్తి రంగనాథాన్ని కట్టి ఉన్న కుర్చీని బాగా వెనక్కి వాల్చాడు. మరో ఇద్దరు వ్యక్తులు అతని అరికాళ్ళ మీద లాఠీలతో బలంగా కొట్టడం ప్రారంభించారు. దెబ్బలను ఓర్చుకుంటూనే వేగంగా ఆలోచించాడు రంగనాథం.


వీళ్లు కచ్చితంగా మఫ్టీలో ఉన్న పోలీసులే..

కానీ రికార్డుల్లో తనను వదిలి పెట్టేసినట్లు రాసుకొని ఉంటారు. వీళ్లు ఏం చేసినా తనకు దిక్కు లేదు. సందీప్ పక్కన లేడు అంటే అతన్ని వేరేచోట ఇలాగే టార్చర్ పెడుతూ ఉంటారు. ఇక రిసార్ట్ వాచ్మెన్ ఇతర సిబ్బందిని స్టేషన్లోనే చిత్రహింసలు పెడుతూ ఉంటారు. తను దెబ్బలకు ఓర్చుకున్నా వీళ్ళలో ఎవరో ఒకరు విషయం బయట పెట్టేస్తారు. అదేదో తనే చెబితే ఈ దెబ్బలన్నా తప్పుతాయి అనుకున్నాడు.


కానీ ఎలా చెప్పడం..? చేతులు కాళ్లు కట్టేసి ఉన్నారు. నోటికి ప్లాస్టర్ వేసి ఉన్నారు. తలను అటు ఇటు ఊపుతూ రెప్పల్ని ఆర్పుతూ కొట్టడం ఆపమని సైగ చేయడానికి ప్రయత్నించాడు. అంతలోనే అతనికి స్పృహ తప్పింది.


తరువాత ఆ యువకుడు, ఆ గోడౌన్ లోనే మరో మూల కట్టిపడేసి ఉన్న రిసార్ట్ మేనేజర్ సందీప్ దగ్గరకు వెళ్ళాడు. అతని అనుచరులు అతని వెంటే వెళ్లారు. తన దగ్గరకు వస్తున్న వాళ్లను చూసి సందీప్ భయపడ్డాడు.


ఆ యువకుడు సందీప్ తో "మా దెబ్బలు తట్టుకోలేక ఆ రంగనాథం స్పృహ తప్పి పడిపోయాడు. అతను లేచాక మరో విడత దెబ్బలు తినే ఓపిక అతనికి ఉండదు. నిజాన్ని బయటపెడతాడు. రంగనాథాన్ని కొట్టిన దెబ్బలే నిన్ను కొడితే నువ్వు చచ్చిపోతావు. ఏదో ఒక స్టేజీలో నిజం చెప్పేస్తావు. అదేదో ముందుగా చెబితే మా దెబ్బలైనా తప్పించుకుంటావు. కాబట్టి నిజం చెప్పు" అన్నాడు.


"ఎవరు మీరు? పోలీసులా?" భయపడుతూనే అడిగాడు సందీప్.


"స్టేషన్ నుంచి నిన్ను బయటకు పంపేశారు కదా.. అక్కడితో వాళ్ళ బాధ్యత ముగిసింది. ఇక మేము ఎవరిమై ఉంటామో నువ్వే ఊహించుకో. నిన్ను దోచుకోవడానికి వచ్చిన బందిపోటు దొంగలమైతే కాదు" చెప్పాడు ఆ యువకుడు.

వీళ్లు మఫ్టీ లో ఉన్న పోలీసులేనని అర్థమైంది సందీప్ కి.


"మాకు మాజీ మినిస్టర్ కనకారావు సపోర్ట్ ఉంది. మీరు మీ చట్టప్రకారం విచారించుకోండి. ఆధారాలు దొరికితే కోర్టులో కేసు పెట్టండి. అంతేగాని ఇలాంటి పనులు చేస్తే మేము ఊరుకోము" అన్నాడు సందీప్.


అంతే! ఇద్దరు వ్యక్తులు అతని మీదకు దూకి పిడికిళ్ళు బిగించి కొట్టనారంభించారు. ఆ దెబ్బలకు అతని నోట్లోంచి శబ్దం కూడా బయటకు రాలేదు. ఒక ఐదు నిమిషాలు అలానే కొట్టి విరామం తీసుకున్నారు వాళ్లు.


సందీప్ గొంతు పెగిలించుకొని "నన్ను కొట్టకండి. నాకు తెలిసిన విషయాలన్నీ చెబుతాను" అన్నాడు.

***

విషయాన్ని ఎలా మొదలు పెట్టాలా అని కాసేపు మనసులోనే ఆలోచించుకుంది ప్రమీల. తరువాత గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించింది.


" ఇది దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన. అప్పటికి ప్రియా చదువు పూర్తి కాలేదు. తను హైదరాబాద్ లో చదువుతోంది. మేము విజయవాడలో ఉంటున్నాము. తన క్లాస్మేట్స్ తో వైజాగ్ టూర్ వెళ్తానని మాకు చెప్పింది ప్రియ. మేము ఒప్పుకున్నాము.


వైజాగ్ లో నా సొంత తమ్ముడు.. అంటే ప్రియకు మేనమామ ఉన్నాడు. అందుచేత ప్రియను బయట హోటల్ రూమ్స్ లో ఉండవద్దని, ఎక్కడెక్కడ తిరిగినా రాత్రి అయ్యేసరికి మా తమ్ముడి ఇంటికి చేరుకోమని చెప్పాను. ప్రియ మొదట ఒప్పుకోకపోయినా వాళ్ళ నాన్నగారు కూడా అదే మాట చెప్పడంతో సరేనంది.


మా తమ్ముడు స్టేషన్ కి వచ్చి ప్రియను, ఆమె స్నేహితురాళ్లను రిసీవ్ చేసుకున్నాడు, ముందుగా అందరినీ తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు, వాళ్లు రిఫ్రెష్ అయ్యాక ఇంట్లోనే అందరికీ టిఫిన్ ఏర్పాటు చేశాడు. తరువాత తనే స్వయంగా తన కారులో వాళ్లను, వాళ్లు బుక్ చేసుకున్న హోటల్ దగ్గర వదిలాడు. కొంత సమయమైనా తమతో గడిపినట్లు ఉంటుందని ప్రియను రాత్రికి కచ్చితంగా తమ ఇంటికి రమ్మన్నాడు.

ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకల్లా మా తమ్ముడి ఇంటికి చేరుకుంది ప్రియ. ఇంట్లో మా తమ్ముడు, అతని భార్య ఉన్నారు.. అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. వాళ్ల అబ్బాయి బెంగుళూరులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. భోజనాలయ్యాక ఆ అబ్బాయి వీడియో కాల్ చేయడంతో మా తమ్ముడు అతనికి ప్రియాను పరిచయం చేశాడు. ప్రియ అతనితో బాగా మాట్లాడింది.


తను పక్క రోజు వైజాగ్ కు వస్తున్నట్లు అతను చెప్పాడు. ఆరోజు రాత్రి ప్రియాను తమ రెండవ బెడ్రూంలో పడుకోమన్నారు. తన భార్యను తోడుగా ఉంచుతానని మా తమ్ముడు చెప్పాడు. కానీ ప్రియ కొత్త వ్యక్తులు పక్కన ఉంటే తనకు నిద్ర పట్టదని, ఒంటరిగానే పడుకుంటానని చెప్పింది. ఆరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచింది. ఆ మరుసటి రోజు కూడా అలాగే విడిగా పడుకుంది ప్రియ.


ఆరోజు రాత్రి ఒంటిగంటప్పుడు మా తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. తనకు ఆ సమయంలో ఎందుకో మెలకువ వచ్చిందని, లేచి చూస్తే ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయని చెప్పాడు. అనుమానం వచ్చి ప్రియా గది దగ్గరికి వెళ్ళాడట. ఆ గది తలుపులు కూడా తెరిచి ఉన్నాయట. అతను లోపలికి వెళ్లి చూస్తే ప్రియా అక్కడ లేదట. వాడు చెప్పిన మాటలు వినగానే నాకు గుండె ఆగినంత పని అయింది. వెంటనే నా భర్తను నిద్ర లేపాను.


విషయం ఆయనకు క్లుప్తంగా చెప్పాను. వెంటనే ఆయన మా తమ్ముడికి కాల్ చేసి ఏం జరిగిందని అడిగాడు. నాకు చెప్పిన విషయాలే అతను ఆయనకు కూడా చెప్పాడు. ప్రియాకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని చెప్పాడు. తను వెంటనే ప్రియా స్నేహితురాళ్లు దిగిన హోటల్ దగ్గరకు వెళ్లి ప్రియా అక్కడికి వచ్చిందేమో కనుక్కుంటానని చెప్పాడు మా తమ్ముడు.


సరేనని ఫోన్ పెట్టేశాను. తర్వాత మావారు ప్రియ కోసం చాలా సార్లు కాల్ చేశారు. స్విచ్ ఆఫ్ చేసినట్లుగా వస్తుంది. ఏం చేయాలో పాలు పోలేదు మా ఇద్దరికీ. హఠాత్తుగా నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. వీళ్లు టూర్ కి బయలుదేరడానికి ముందు రోజు ప్రియా స్నేహితురాలు తనకోసం చాలాసార్లు కాల్ చేసిందట. కానీ ప్రియ లిఫ్ట్ చేయకపోవడంతో నా సెల్ కి కాల్ చేసింది. తన దగ్గర నా నెంబర్ ఉందట. టూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడడానికి కాల్ చేసిందట. నేను ప్రియా గదిలోకి వెళ్లి చూస్తే తను నిద్రపోతోంది. తనను లేపి ఫోన్ ఇచ్చి మాట్లాడమన్నాను. ఈ విషయం గుర్తుకు రావడంతో వెంటనే మా వారికి చెప్పాను. ఆయన వెంటనే నా ఫోన్ కాల్ లాగ్ చూశారు. ఆరోజు నాకు ఒకే కాల్ వచ్చి ఉంది.

దాంతో ఆయన ఆ నెంబర్ కి కాల్ చేసారు. ఆ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసింది.


"ప్రియా అక్కడికి వచ్చిందా?" అని అడిగారు అయన.

ఆ అమ్మాయి "ఒక్క నిమిషం అంకుల్.." అని పక్కన ఎవరితోనో మాట్లాడింది.

తరువాత ఈయనతో "అంకుల్! ప్రియా ఇక్కడికి వచ్చింది. తను ఎందుకో చాలా డిస్టర్బ్ అయినట్లుగా ఉంది. తనకోసం మేనమామ వస్తే ఇక్కడ లేనని చెప్పమంది. 'అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా' అని అడిగితే ఏమీ లేదని, తన మానసిక స్థితి సరిగ్గా లేదని, తెల్లవారాక మాట్లాడతానని చెప్పి పడుకుంది.


ప్రియ క్షేమంగానే ఉంది కాబట్టి మీరు ప్రశాంతంగా పడుకోండి. ఉదయానికి కాస్త నార్మల్ అవుతుంది కాబట్టి అప్పుడు మీకు కాల్ చెయ్యమంటాను. అలాగే ప్రియా వాళ్ళ మేనమామకు కాల్ చేసి ప్రియా క్షేమంగా ఉందని చెప్పండి. ప్రియా కోసం ఆయన్ను ఈ సమయంలో ఇక్కడికి రావద్దని చెప్పండి. రేపు ఉదయం ప్రియా చేత మీకు, ఆయనకు కాల్ చేయిస్తాను" అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి.


కానీ మాకు నిద్ర పట్టలేదు. నేను మా తమ్ముడికి కాల్ చేసి "ప్రియా హోటల్లో స్నేహితురాళ్ళతో ఉంది. ఏదైనా పిడకల వచ్చిందేమో.. ఇంట్లో ఉండలేక హోటల్ కి వెళ్ళిపోయింది. అన్నట్లు బెంగుళూరు నుంచి మీ అబ్బాయి వచ్చాడా?" అని ఆరా తీశాను.


వాడికి కోపం వచ్చింది. "నా కొడుకు తప్పుగా ప్రవర్తించాడని నీ అనుమానామా? వాడు రేపు ఉదయానికి గాని ఇక్కడికి రాలేడు. అయినా అర్ధరాత్రి పూట ఇంటి తలుపులు బార్లా తెరిచి వెళ్లిపోయింది నీ కూతురు" అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేసాడు.


తొందరపడి మాట తూలానేమోనని అనిపించిందో క్షణం.

కానీ ‘అలాంటిదేమీ లేకపోతే ప్రియ అంత రాత్రప్పుడు అక్కడినించి ఎందుకు వెళ్ళిపోతుంది..’ అనుకున్నాను.


ఆ రాత్రంతా మేమిద్దరం మెలకువగానే ఉన్నాము. ఉదయం ఏడు గంటలకు ప్రియా సెల్ నుండి కాల్ వచ్చింది. ఏం జరిగిందని ఆదుర్దాగా అడిగాను. అటువైపు నుంచి సమాధానం రాలేదు.


"ప్రియా.. ఏమైంది చెప్పమ్మా?" దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగాను.


కొంతసేపటికి ప్రియ గొంతు పెగుల్చుకొని ఇలా చెప్పింది.

" అమ్మా! ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. రాత్రి 12 గంటల సమయంలో ఎవరో నా మీదకు వచ్చినట్లు అనిపించింది. నేను పడుకునేటప్పుడు లైట్ ఉంచుకునే పడుకుంటాను. ఆ వ్యక్తి లైట్ ఆర్పేసినట్లు అర్థమైంది. ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకుని అతన్ని విసురుగా నెట్టాను. అతను బెడ్ మీదనుండి కింద పడ్డాడు. దిండు కింద ఉంచిన నా మొబైల్ ని తీసుకున్నాను. మొబైల్ స్క్రీన్ తాలూకు వెలుతురు రావడంతో అతన్ని చూడడానికి ప్రయత్నించాను. అప్పటికే అతను నా గది దాటి వెళ్ళిపోయాడు. నేను రూమ్ లో లైట్ వెలిగించి బయటకు వస్తూ ఉండగానే ముందుగా మెయిన్ డోర్ తెరిచిన శబ్దం, కొద్దిసేపటికి మామయ్య ఉన్న గది తలుపు మూసిన శబ్దం వినిపించాయి. హాల్లో లైట్ వెలిగించాను.


బయటకు వెళ్ళడానికి ధైర్యం చాల్లేదు. మెయిన్ డోర్ మూసి గడియ పెట్టాను. ఏం చేయాలో అర్థం కాలేదు. పడుకునేటప్పుడు ఎవరైనా మెయిన్ డోర్ గడియ పెట్టే పడుకుంటారు కదా.. మరి బయటి వాళ్లు లోపలికి ఎలా వస్తారు? ఒకవేళ ముందే వచ్చి ఇంట్లో దాక్కొని ఉన్నారా.. ఎంత ఆలోచించినా సమాధానం నా ఊహకు అందలేదు. మెయిన్ డోర్ శబ్దం వినిపించిన కొద్దిసేపటికి మామయ్య గది తలుపు శబ్దం కూడా వినిపించింది.

అంటే..

ఒకవేళ మామయ్యే నా గదిలోకి వచ్చాడా.. అనుమానం బయటి వాళ్ల మీదికి వెళ్లడానికి మెయిన్ డోర్ తెరిచి, తిరిగి తన గదిలోకి వెళ్లాడా..

ఆలోచించే కొద్దీ మామయ్య మీదే నాకు అనుమానం కలుగుతోంది.


మంచి చెడ్డల విషయం పక్కన పెడితే అతను అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తాడా..

తను దొరికిపోతానని అతనికి తెలీదా..

ఏమో! కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లకి విచక్షణా జ్ఞానం ఉండదు. తాము తప్పు చేస్తున్నామని గాని, దొరికిపోతే తమకు శిక్ష తప్పదని గాని.. ఏ విషయం ఆ సమయంలో వాళ్లకు గుర్తుకు రాదు. వస్తే ఇన్ని నేరాలు ఘోరాలు జరగవు కదా!


మామయ్య వాళ్ళు ఉన్న గదిలోకి వెళ్లి చూస్తే ఆయన ముఖంలో ఆందోళన నేను పసిగట్టగలను కదా.. ఆయన నిద్ర నటిస్తున్నా నాకు తెలిసిపోతుంది కదా.. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా వాళ్ళ గది దగ్గరకు వెళ్లాను. నెమ్మదిగా తలుపు తెరిచాను. ఆశ్చర్యంగా గదిలో లైట్ వేసే ఉంది. అత్తయ్య మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఏదో బుక్ చదువుకుంటోంది. తలుపు తెరిచిన శబ్దం విని తలెత్తి నా వైపు చూసింది.


"ఇంకా నిద్ర పోలేదా ప్రియా?" అని అడిగింది.


"నిద్రపోయాను ఆంటీ! ఏదో శబ్దమైనట్లు వినిపిస్తే మెలకువ వచ్చింది. ఏమిటో కనుక్కుందామని ఇక్కడికి.. మీ గదిలోకి వచ్చాను. ఇంతకీ మీరు నిద్ర పోలేదా?" అని అడిగాను.


"లేదమ్మా! నిద్ర పట్టలేదు. అందుకని ఇదిగో.. ఈ నవల చదువుకుంటూ మేలుకొని ఉన్నాను" చెప్పింది అత్తయ్య.


అంటే నా ఊహ తప్పన్నమాట.. మరి నాకు ఎందుకు అలా అనిపించింది? ఒకవేళ నా గదిలోకి వచ్చింది మరెవరో వ్యక్తి అయి ఉండవచ్చు.. లేదా అంతా నా భ్రమేనా.. నేను ఆలోచిస్తూ ఉండగానే మామయ్య నిద్ర లేచాడు. గదిలో నన్ను చూచి ఆశ్చర్యపోయాడు.


"ఇదేమిటి.. ప్రియా ఇక్కడికి వచ్చింది?" అన్నాడు.


"ఏదో తలుపు తీసిన శబ్దం వచ్చినట్లు వినిపించి మెలకువ వచ్చిందట" చెప్పింది అత్తయ్య.


మామయ్య నా వంక తిరిగి "అవునా.. ఏం శబ్దం వినిపించింది?" అని అడిగాడు.

"ఎవరో నా గదిలోకి వచ్చినట్లు అనిపించింది. బయటకు వచ్చి చూస్తే మెయిన్ డోర్ తెరిచి ఉంది. ఆ డోర్ మూసి గడియ పెట్టి మీకు చెబుదామని వచ్చాను" అన్నాను.


"నా మాట విని తోడుగా మీ అత్తయ్యను పడుకోబెట్టుకో.. దయ్యాలు కూడా మీ జోలికి రావు" అన్నాడాయన.


"వద్దులెండి. అమ్మాయికి కొత్తవాళ్లతో ఇబ్బందని చెప్పిందిగా..ఒక పని చేయండి. హాల్లో ఈజీ చైర్ లో కూర్చొని నిద్రపోవడం మీకు అలవాటుగా.. ఈ రోజుకు అలా పడుకోండి.


అమ్మాయి వున్న బెడ్ రూమ్ హాల్ ని అనుకొనే ఉందిగా.. అవసరమైతే మీరు అందుబాటులో ఉంటారు" అంది అత్తయ్య.


ఆవిడ అలా అన్నదే తడవుగా మామయ్య హాల్లోకి వెళ్లి ఈజీ చైర్ లో కూర్చున్నారు.


నేను నా గదిలోకి వెళ్తూ ఉండగా "ప్రియా! నీకేవో పీడ కలలు వచ్చినట్లున్నాయి. ఎందుకైనా మంచిది..తలుపు గడియ పెట్టుకోకు. అవసరమైతే నేను వచ్చి చూస్తాను. అన్నట్లు మా ఇంటి బయట, హాల్లో సిసి కెమెరాలు ఉన్నాయి.ఎవరైనా వచ్చి వుంటే తెలిసిపోతుంది.


అయితే దాన్ని ఎలా చూడాలో నాకు తెలీదు. రేపు ఉదయం అబ్బాయి వచ్చాక చూడమంటాను" అన్నాడాయన.


చేసేదేమి లేక గదిలోకి వెళ్లి తలుపు దగ్గరకు వేసి పడుకున్నాను.

కానీ నిద్ర పడితేగా..


మరో అరగంటకు హాల్లో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి.


ధైర్యం చేసి డోర్ కొద్దిగా తెరిచి చూసాను.. అయన అటువైపు తిరిగి సిసి కెమెరా హార్డ్ డిస్క్ ని బయటకు తీయడానికి ప్రయతిస్తున్నాడు..' చెప్పడం ఆపింది ప్రియ.


"ప్రియా.. ఆపేసావేం? తరువాత ఏమైంది.. మాట్లాడు.." ఆదుర్దాగా అన్నాను నేను.


కొద్దీ క్షణాల తరువాత తన స్నేహితురాలు ఫోన్ తీసుకోని "ప్రియ ఎందుకో వణికి పోతోంది. తను టిఫిన్ తిని, కాఫీ తాగాక కాల్ చేయిస్తాను" అని ఫోన్ పెట్టేసింది.


చెప్పడం ఆపింది ప్రమీల.

ఆమెకు కూడా ఒళ్ళంతా చెమటలు పట్టాయి..

ప్రవల్లిక ఆమె దగ్గరకు వెళ్లి, “కూల్ ఆంటీ.. కాసేపు రిలాక్స్ కాండి" అంటూ ఆమె చేత మంచినీళ్లు తాగించింది.

ఒక కానిస్టేబుల్ ఫ్లాస్కు లో ఉన్న టీని ఆమెకు ఇచ్చాడు.

=================================================

ఇంకా ఉంది...

=================================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).






90 views0 comments
bottom of page