వెంటాడే నీడ ఎపిసోడ్ 2


'Ventade Nida Episode 2' written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

(ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక వింత ఆకారం సుమంత్ మీద దాడి చేస్తుంది. చేతికి దొరికిన రాయితో దాన్ని గాయపరుస్తాడతను. ఆ ఆకారం అతన్ని గట్టిగా నెట్టేస్తుంది. ఆ విసురుకు దూరంగా పడిపోతాడు సుమంత్....ఇక చదవండి)

ఫస్ట్ ఎపిసోడ్ చదవని వాళ్ళు ఈ లింక్ పై క్లిక్ చేయండి

వెంటాడే నీడ ఎపిసోడ్ 1

ఎముకలన్నీ విరిగినట్లైంది సుమంత్ కి.

ఐనా శక్తిని కూడదీసుకుని పైకి లేచాడు.

ఆ ఆకారం తిరిగి అతని మీదకు దూకాలని ప్రయత్నించింది.

కానీ సుమంత్ ఇందాక రాయితో కొట్టిన దెబ్బకు దాని తలనుండి రక్తం ధారగా కారుతుండడంతో నేలమీద కూలబడి పోయింది.

ఇదే సరైన అదను.

చుట్టూ చూసాడు సుమంత్.

తోట పని కోసం వాడే గునపం కనిపించింది.వేగంగా దాన్ని అందుకొని ఆ ఆకారం గుండెల్లో బలంగా పొడిచాడు.

ఆ ఆకారం కాస్సేపు గిలగిలా తన్నుకొని తల వాల్చేసింది.

ఒళ్ళంతా చెమటలు పట్టాయి సుమంత్ కి.

అసలు ఆ ఆకారం ఏమిటి?

విచిత్రమైన జంతువా? లేక మనిషా?

ఇదేమి ఆఫ్రికన్ ఫారెస్ట్ కాదు విచిత్రమైన జంతువులు ఉండటానికి.

హై వే పక్కనున్న మామిడి తోట.

బహుశా ఎవరైనా మతిస్థిమితం లేని మనిషి అయి ఉంటాడు.

ఒకవేళ ఆ ఆకారం ఒక దయ్యమా?...

దయ్యమైతే తను కొట్టిన రాతి దెబ్బకి చనిపోతుందా?

దయ్యం అంత తేలిగ్గా చనిపోయేట్లయితే ఎవరూ దయ్యాలకు భయపడరు కదా!

అసలు చనిపోయాకే కదా దయ్యమయేది!

మళ్ళీ ఎలా చనిపోతుంది?

ఇంతకీ ఆ ఆకారం చనిపోయిందా లేక స్పృహ తప్పిందా?

అతని మదిలో ఎన్నో ఆలోచనలు!

కాస్త దగ్గరికి వెళ్లి పరిశీలిద్దామనుకున్నాడు. కానీ ధైర్యం చాల్లేదు.

ఒక వేళ ఆ ఆకారం మనిషిదయితే తను హత్య చేసినట్లేనా?

ఇప్పుడేం చెయ్యాలి.

ఒకసారి చేతిలో ఉన్న గునపం వంక చూశాడు.

ఈ గునపంతో గుంట తవ్వి ఈ ఆకారాన్ని పూడ్చి పెడితే?

తన వల్ల అవుతుందా...?

వేరే దారి లేదు!

గుంట తవ్వడం ప్రారంభించాడు సుమంత్.

పది నిముషాలకే అతని చేతులు నొప్పి పుట్టడం మొదలైంది.

అయినా పట్టుదలగా తవ్వడం కొనసాగించాడు.

మరో పది నిముషాలు ఆపకుండా తవ్వాడు.

ఒకసారి తను తవ్విన గుంట వంక చూశాడు.

ఒక అడుగు కూడా పూర్తి కాలేదు.

తలనుండి చెమటలు ధారగా కారి కళ్ళల్లోకి వెళ్లాయి. కళ్ళు భగ్గున మండుతున్నాయి.

అసలు ఈ పని తన వల్ల అవుతుందా?

ఒక గుంటను నలుగురు మనుషులు తవ్వితే రెండు గంటలు పడుతుందనుకుంటే తను ఒక్కడే తవ్వితే ఎనిమిది గంటలు పడుతుందా??

అన్నిచోట్లా మ్యాథమెటిక్స్ పనికిరాదు.

ఒక గంట తవ్వేసరికి తన పని అయిపోతుంది.

రెండు గంటలు తవ్వితే స్పృహ తప్పి తనే ఆ గుంటలో పడిపోతాడేమో.

ఎవరు తీసిన గోతిలో వారే పడటమంటే ఇదేనేమో...

అంత భయంతోనూ నవ్వు వచ్చిందతనికి


ఒకసారి గూగుల్ సెర్చ్ లో చూడాలి గుంట తవ్వడానికి ఎంత టైం పడుతుందో.

ఆ ఆలోచన రాగానే అతను తన మొబైల్ కోసం ప్యాంటు పోకెట్ తడుముకున్నాడు.

అదృష్టం! మొబైల్ జేబులోనే ఉంది.

మొబైల్ చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది.

తన స్నేహితులకి ఫోన్ చేస్తే...?

ఆమ్మో!

ఇలాంటి విషయాలు నలుగురికి తెలియకూడదు. తను చేసిన పని ఒకరి నుంచి మరొకరికి పాకుతూ వెళ్లి, చివరకు పోలీసులకు చేరుతుంది.

విశాల్ కు ఫోన్ చేస్తే...?

అవును.

అతనొక్కడే తనను ఈ ప్రాబ్లెమ్ నుంచి తప్పించగలడు.

వెంటనే జేబులోంచి ఫోన్ తీసాడు సుమంత్ .

తన ఫ్రెండ్ విశాల్ కు కాల్ చేసాడు.

అటు వైపు రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయలేదు.

కానీ దగ్గర్లో ఏదో ఫోన్ రింగ్ అయినట్లు అతనికి లీలగా అనిపించింది.

ఇదేమిటి?

విశాల్ ఇక్కడే ఉన్నాడా?

లేక అదే సమయానికి వేరే ఫోన్ ఏదైనా రింగ్ అయిందా?

అయోమయం లోంచి తేరుకొని మరోసారి విశాల్ కు కాల్ చేసి, చుట్టూ జాగ్రత్తగా గమనించాడు.

దగ్గరలోనే రింగ్ అవుతోంది.

చుట్టూ హోరు గాలి. శబ్దం అస్పష్టంగా వినిపిస్తోంది.

చెవులు రిక్కించి విన్నాడు.

అంతే!!

అతని గుండె క్షణకాలం ఆగింది.

ఆ రింగ్ కింద పడివున్న ఆ ఆకారం దగ్గరనుంచి వస్తోంది.

సుమంత్ ఒళ్ళంతా భయంతో వణికిపోయింది.

చేతిలోని సెల్ జారి కింద పడిపోయింది.

( సశేషం... మూడవ భాగం అతి త్వరలోనే....)

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

నన్ను కాపాడండి... ప్లీజ్!!

పీత కష్టాలు పీతవి

సి ఈ ఓ చందన

ఆత్మ విశ్వాసం

అనుకుంటే అంతా మనవాళ్లే

అనురాగ బంధం

అమ్మ మనసులో ఏముంది

నేనే కింగ్ మేకర్

సరే శివయ్య

మూడు తరాల ప్రేమ

డిటెక్టివ్ ప్రవల్లిక - Episode 1 (అతడే హంతకుడు)


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 15 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


89 views0 comments