top of page

ఇచ్చిందే వస్తుంది

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Icchinde Vasthundi' New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


పిల్లలు, తమ తల్లిదండ్రుల్ని బాగా పరిశీలిస్తుంటారు.

వారిలో ఉన్న మంచి చెడ్డల్ని అనుకరిస్తుంటారు.

పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదగాలంటే పేరెంట్స్ ప్రవర్తన చక్కగా ఉండాలని తెలియజేసే ఈ కథను మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.

ఇక కథ ప్రారంభిద్దాం"నీ గడువు తీరిపోయింది. ఇక మాతో రావాలి. లేదా మరొకరి పేరు చెప్పాలి" చెప్పారు వాళ్లిద్దరూ.


అరగంట క్రితం నా గదిలోకి వచ్చారు వాళ్ళు. చూస్తేనే భయం కలిగించేలా ఉన్నారు ఇద్దరూ. ఒకడి చేతిలో వేట కత్తి. మరొకడి చేతిలో పదునైన శూలం లాంటి ఆయుధం.

అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. రాత్రి పడుకోవడం ఆలస్యమైంది. అందుకే మంచి నిద్ర పట్టేసింది. ఇంతలో వీళ్ళు బలంగా కుదుపుతూ లేపారు.


నిద్రమత్తులో ఉన్న నాకు, నన్ను లేపుతున్నదెవరో అర్థం కాలేదు.

నాన్నయితే నన్ను టచ్ చెయ్యకుండా దూరంనుంచే, "ఒరేయ్ విశ్వం! లెయ్యరా.." అని పిలుస్తూ లేపుతారు. అమ్మయితే నా చెంప మీద సున్నితంగా నిమురుతూ "లేరా విస్సూ!" అంటూ లేపుతుంది. అన్నయ్య నన్నెప్పుడూ నిద్ర లేపిన గుర్తు లేదు.


ఇప్పుడు వీళ్ళు ఇలా మోటుగా కుదపడంతో ‘ఎవరబ్బా…’ అనుకుంటూ లేచాను.

ఎదురుగా వున్న ఇద్దరు వికృతాకారుల్ని చూసిన వెంటనే నిద్ర మత్తు ఎగిరిపోయింది.

పైగా ఇద్దరి చేతుల్లో ఆయుధాలు…


అది ఎయిర్ కండిషన్డ్ గది అయినా నాకు చెమటలు పోశాయి.

"ఎవరు మీరు...?" అని గట్టిగా అరిచాను.

నిజానికి అరిచాననుకున్నానుగానీ, శబ్దం గొంతు దాటి వస్తేగా!

ఒకసారి వాళ్ళిద్దరి వంకా చూశాను.

విచిత్రమైన దుస్తుల్లో యమ భటుల్లాగా ఉన్నారు.

ఒక వేళ నిజంగా యమ భటులేనా..

ఇద్దరూ ఒకరికొకరు కాస్త దూరంగా నిలుచుని ఉన్నారు.

గది తలుపులు తెరిచే ఉన్నాయి.


ఇద్దరి మధ్య దూరి బయటికి పరిగెడితే...అన్న ఆలోచన కలిగింది.

కానీ ఆ వేట కత్తి దెబ్బ తగిలితే తలా మొండెం వేరవ్వడం తప్పదు.

ఒక వేళ తప్పించుకుని బయటకు పరుగెత్తినా రెండో వ్యక్తి శూలం విసిరితే నా వెన్నులోకి దిగడం ఖాయం.


నా ఆలోచనలు పసిగట్టాడేమో... వాళ్లలో ఒక వ్యక్తి నా వంక కోపంగా చూస్తూ " మా దగ్గర్నుంచి తప్పించుకోలేవు. మేము యమభటులం" అన్నాడు.

కాస్సేపు అతను ఏం చెప్పాడో నాకు అర్థం కాలేదు.

వాళ్ళ వంక మరింత పరిశీలనగా చూశాను.

దాదాపు ఏడడుగుల పొడవుతో, దృఢంగా ఉన్నారు.

నిజమే.. వాళ్ళు మనుషులైతే కాదు.

నా భయం రెట్టింపైంది.

అంటే... నా ఆయువు అప్పుడే ముగిసిందా?


ఈ సారి రెండో వ్యక్తి నాతో "నీకు తప్పించుకోవడానికి ఒక అవకాశం ఉంది" అన్నాడు.

ఆశగా అతని వైపు చూసాను.


"నీకు బదులుగా మీ ఇంట్లో మరొకరి పేరు ఏదైనా చెప్పు. నిన్ను వదిలేసి వాళ్ళను తీసుకొని పోతాము. మీ ఇంట్లో వాళ్ళ పేరే చెప్పాలి సుమా!" అన్నాడతను.


"అసలు నన్నెందుకు తీసుకొని వెళ్ళాలి? ఇంకా చిన్న వాడినే కదా!" గొంతు పెగుల్చుకొని అన్నాన్నేను.


"నీకు కారణాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఒక్క అవకాశం మాత్రం ఇస్తున్నాం. నీ బదులు ఎవర్ని తీసుకెళ్ళమంటావ్? ఒక అరగంట ఆలోచించుకో. అంతవరకు ఇక్కడే వుంటాం" చెప్పారు వాళ్ళు. చేసేదేం లేక ఆలోచనలో పడ్డాను.

మా ఇంట్లో ఉన్నది నలుగురం.

అమ్మ, నాన్న, అన్నయ్య, నేను.

నా ప్రాణాల కోసం ఎవర్ని బలి పెట్టాను?

ఇంట్లో ఒకర్ని బలి ఇచ్చి, నేను బ్రతకాలా?

కిరాయి హంతకుడు కూడా తను బ్రతకడం కోసమే హత్యలు చేశానంటాడు.

మరొకరి పేరు చెబితే, అలాంటివారికీ, నాకూ.. తేడా ఏమిటి?

ఆలా బ్రతికి నేను సాధించేదేమిటి?

జీవితాంతం ఆ బాధ నన్ను వెంటాడదా..

ఒక నిశ్చయానికి వచ్చి, వాళ్ళ వంక సూటిగా చూసాను.


"మరొకరిని బలి చేసి, నేను బ్రతకాలనుకోవడం లేదు. నన్ను తీసుకొని వెళ్ళండి" ధృడ నిశ్చయంతో చెప్పాను.

ఆశ్చర్యంగా నా వంక చూసారు వాళ్ళు.

"బాగా ఆలోచించుకో. చావంటే మాటలు కాదు. జీవితంలో ఇంకా ఏవీ అనుభవించలేదు నువ్వు" నన్ను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసాడు ఒక వ్యక్తి.


"ఆలోచించే చెబుతున్నాను.." ఏ మాత్రం మార్పు లేదు నా కంఠంలో.

"అయితే ఇప్పుడు నువ్వు నమ్మలేని నిజం చెబుతాము. నిన్ను అడిగినట్లే, మిగతా ముగ్గుర్ని కూడా అడిగాము. అందరూ వాళ్లకు బదులుగా నిన్ను తీసుకొని వెళ్ళమని చెప్పారు" అన్నారు వాళ్ళు, నా వంక సానుభూతిగా చూస్తూ .


ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు.

కాళ్ళ క్రింద భూమి గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది.


"ఇప్పుడైనా ఆలోచించుకో. నీ గురించి ఆలోచించని వాళ్ళ కోసం నీ ప్రాణాలు బలి ఇవ్వొద్దు. బ్రతకడం మనిషి ధర్మం. మనిషే కాదు. ప్రతి జీవి బతకాలని చూస్తుంది" అంటూ వాళ్ళు చెప్పిన మాటలు నా మీద ప్రభావం చూపలేక పోయాయి.

తల అడ్డంగా ఊపాను.


"మరి నిన్ను తీసుకుని వెళ్ళమని మీ వాళ్ళు చెప్పారు. అందుకు నీకు కోపంగా లేదా?" ఆశ్చర్యంగా అడిగారు వాళ్ళు.


అందరూ నా పేరు చెప్పారంటే అది సరైన నిర్ణయం అయి ఉంటుంది. ఇంకా అందరం నాన్న మీద ఆధారపడి ఉన్నాం. అమ్మ లేకపోతే ఇంట్లో ఈ అభిమానాలు, ఆప్యాయతలు ఉండేవి కాదు. అన్నయ్య చదువు పూర్తి కావచ్చింది. ఇంటి బాధ్యతలు తీసుకోబోతున్నాడు. కాబట్టి, అందరూ నా పేరు చెప్పడం ‘కరెక్టే’ అనిపించింది.

అప్పుడు ఇంటర్ పిల్లవాడిని కాబట్టి, నా ఆలోచన మాటల్లో సరిగ్గా వ్యక్తీకరించలేక పోయాను.


కానీ నా నిర్ణయం మాత్రం నిర్భయంగా చెప్పాను. 'ఇంకొకరిని.. అందునా ఇంట్లో వాళ్ళని వదులుకొని బ్రతికే బ్రతుకు నాకు అక్కర్లే'దని.. అప్పుడు వాళ్ళ కళ్ళల్లో క్రూరత్వం మాయమై, ప్రశాంతత కనిపించింది.


"ఆయువు తీరిన వాళ్ళని మామూలుగా తీసుకొని వెడుతుంటాం. అది కాకుండా స్వార్థ పరులైన వాళ్ళను, ఆయువు తీరకపోయినా అప్పుడప్పుడూ తీసుకొని వెడతాం. అయితే అలా తీసుకొని వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళు అందరూ అంగీకరించాలి. అది మా నియమం. ఇంటిల్లిపాదీ వద్దనుకునే వ్యక్తి బ్రతికీ ఏం లాభం?


నిజానికి మీ ఇంట్లో ఎవరూ మరొకరి పేరు చెప్పలేదు. అందరూ తమనే తీసుకొని వెళ్ళమన్నారు. మీ ఇంట్లో స్వార్థపరులెవ్వరూ లేరు. కాబట్టి మేము ఎవరినీ తీసుకొని వెళ్లడం లేదు" అని చెప్పి ఇద్దరూ అదృశ్యమయ్యారు.


ఇదంతా కలో నిజమో అర్థం కాలేదు నాకు.

వేగంగా గదిలోంచి బయటకు వచ్చాను.

వంటిట్లో ఉన్న అమ్మ దగ్గరకు వెళ్లాను.

"అమ్మా! నీకేమైనా కల వచ్చిందా?" ఆతృతగా అడిగాను.


ఏమోరా! నేను పొద్దున్న ఐదింటికే లేస్తాను కదా. మరిచిపోతుంటాను" అంది అమ్మ.

డైనింగ్ టేబుల్ వద్ద టిఫిన్ తింటున్న నాన్నను కూడా అదే ప్రశ్న అడిగాను.

"ఏదో కల వచ్చినట్లైతే గుర్తుంది. దాని గురించి మీ అమ్మను అడగాలని కూడా అనుకున్నాను. కానీ అదేమిటో మర్చిపోయాను. లేచి చాలా సేపు అయింది కదా.." అన్నాడు నాన్న.


బ్రష్ చేసుకుంటున్న అన్నయ్యను కూడా అడిగాను, 'నీకేమైనా కల వచ్చిందా?' అని.

"వచ్చిందిరా. సరిగ్గా గుర్తు లేదు. ఎవరో ఇద్దరు మనుషులు.. వికృతంగా ఉన్నవాళ్లు కనిపించారు. కానీ ఏం మాట్లాడారో గుర్తు రావడం లేదు" అన్నాడు అన్నయ్య.

ఈ సంఘటన జరిగి యాభై ఏళ్లయింది.

***

ఆ కల, కల తాలూకు గుర్తులు ఎప్పుడో చెరిగి పోయాయి.

కాల గమనంలో అమ్మానాన్నలు జ్ఞాపకాలుగా మిగిలారు.

అన్నయ్య, భార్యాపిల్లలతో కెనడాలో ఉంటున్నాడు.

నేను, శ్రీమతి నెల్లూరులో ఉంటున్నాం.

పెద్దబ్బాయి, కోడలు, ఆరేళ్ళ మనవడు కాలిఫోర్నియాలో ఉంటున్నారు.

రెండోవాడు హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు.


ఈ రోజు ఉదయం నన్ను ఎవరో బలంగా కుదుపుతూ లేపుతున్నారు.

ఇంట్లో ఉండేది నేనూ, నా శ్రీమతి మాత్రమే.

శ్రీమతి, మా అమ్మలాగే నా చెంప నిమురుతూ సున్నితంగా నిద్ర లేపుతుంది.

‘ఇలా మోటుగా లేపుతున్నదెవరా’ అని కళ్ళు తెరిచి చూశాను.

ఎదురుగా ఇద్దరు వికృతాకారులు.


ఒకడి చేతిలో పెద్ద కత్తి. మరొకడి చేతిలో శూలం.

వాళ్ళను ఎప్పుడో చూసినట్లు అనిపిస్తోంది.

కానీ గుర్తుకు రావడం లేదు.


"ఎవరు మీరు?" అని గట్టిగా అరిచాను.

అరిచాననుకున్నాను గానీ నోరు పెగిలితేగా..

"మాట్లాడు. నువ్వు ధైర్యవంతుడినే..." అన్నారు వాళ్ళు.

"నేను ధైర్యవంతుడైనా? ఎప్పుడూ అలా అనుకోలేదు..." అన్నాను నేను.


"చిన్నప్పుడే ప్రాణాల్ని లెక్క చెయ్యని వాడివి. నీకన్నా ధైర్యవంతులు ఎవరుంటారు? నీకు మేము గుర్తులేక పోయినా నువ్వు మాకు బాగా గుర్తే" అన్నారు వాళ్ళు.


ధైర్యవంతుడినని వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చాక భయపడడం బాగుండదని, గొంతు పెగుల్చుకొని, "ఎవరు మీరు?" అన్నాను.


"యమ భటులం. నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చాము. కానీ తప్పించుకోవడానికి ఒక అవకాశం వుంది నీకు" అన్నారు వాళ్ళు.


"అదేమిటో చెప్పండి" అని అడిగాను.

"నీ బదులు మీ కుటుంబ సభ్యుల్లో ఒకర్ని తీసుకొని వెళ్ళవచ్చు. ఆ పేరు నువ్వే చెప్పాలి" అన్నాడు వాళ్లలో ఒక వ్యక్తి.


"అదేమిటి? పెద్దవాడిగా అన్నిట్లో నేనే ముందుండాలి కదా! ఈ రోజు మృత్యువు వస్తుందని వెనకడుగు వేస్తానా?" అన్నాను నేను.


"నిన్నడిగినట్లే మీ ఇంట్లో అందరినీ అడిగాను. అందరూ నీ పేరే చెప్పారు మరి" అన్నాడు రెండో వ్యక్తి.

క్షణం ఆలోచించాను.


"నేను లేకపోయినా ఇంట్లో పెద్ద నష్టం ఉండదు. అందుకే నా పేరు చెప్పి ఉండవచ్చు. నన్నే తీసుకొని వెళ్ళండి" అన్నాను.


"నువ్వు మారవా? చిన్నప్పుడు కూడా ఇలాగే అన్నావు" అన్నారు వాళ్ళు.

చిన్నప్పటి కల అప్పుడు గుర్తొచ్చింది నాకు.


వాళ్ళను గుర్తు పట్టాను. అప్పటికీ ఇప్పటికీ వాళ్లలో ఏమాత్రం మార్పు లేదు.

'వీళ్లకు ప్రమోషన్లు, రిటైర్మెంట్లు ఉండవా? జుట్టు నెరవదా.. ' అని మనసులో అనుకున్నాను.


"మరి నువ్వు వద్దని మీ వాళ్ళందరూ అనుకున్నారు. నీకు కోపం లేదా?" అడిగాడు మొదటి వ్యక్తి.


"మా ఇంట్లో అందరూ అలా అనుకున్నారంటే అది నిజమే అయి ఉంటుంది. నేను నిష్క్రమించడమే కరెక్ట్ అయితే అలాగే కానివ్వండి. కానీ మా ఇంట్లో ఆలా ఎవ్వరూ అనరని నా నమ్మకం" అన్నాను.


“అంత ఖచ్చితంగా చెబుతున్నావు..ఏమిటి నీ ధైర్యం?" అడిగారు వాళ్ళు.

"ధైర్యం కాదు, నమ్మకం. విత్తిందే మొలుస్తుంది. ఇచ్చిందే వస్తుంది" అన్నాన్నేను.

"నీ ప్రాసలు మాకు అర్థం కావు. అర్థం చేసుకునే జ్ఞానమే వుంటే ఇంకా ఈ ఉద్యోగంలోనే ఎందుకు పడుంటాం? కాస్త విడమరిచి చెప్పు" అన్నారు వాళ్ళు.


"మర్రి విత్తనం నాటితే మర్రి చెట్టే మొలుస్తుంది. మామిడి టెంక నాటితే మామిడి చెట్టే మొలుస్తుంది. మా అమ్మానాన్నలు మాకు ప్రేమాభిమానాలు ఇచ్చారు. వాళ్లలో స్వార్థం మచ్చుకైనా లేదు. మాకు కూడా అవే గుణాలు వచ్చాయి. నా పిల్లల్ని కూడా అలాగే పెంచాను. పిల్లలు, పెద్దల ప్రవర్తనను నిశితంగా గమనిస్తుంటారు. మన ప్రవర్తనను తెలియకుండానే అనుసరిస్తుంటారు. మనలో లోపాలు పెట్టుకొని వారు ప్రేమను కురిపించాలనుకోవడం పొరపాటు.


అలాగే మనం సక్రమంగా పెంచినప్పుడు వాళ్ళు మన అంచనాలకు తగ్గట్లుగానే ఉంటారనేది నిజం" అన్నాన్నేను.


"కానీ కాలంతో పాటు మనుషులు మారుతారు. స్వార్థం పెరుగుతుంది" అన్నారు ఆ వికృతాకారులు.


"చెప్పానుగా. మనం నాటే విత్తనాన్ని బట్టే ఉంటుందని. అమెరికాలో ఉన్న మా మనవణ్ణి అడిగినా, నేను చెప్పిన సమాధానమే చెబుతాడు. " అన్నాను నేను నమ్మకంగా.


"నువ్వు చెప్పింది నిజమే. పిల్లలకు పెద్దల ఆస్తులతో పాటు గుణాలు కూడా వస్తాయి, అవి మంచివైనా.. చెడ్డవైనా. ఇక మేము సెలవు తీసుకుంటాం. నీ ఆయుష్షు తీరినప్పుడు మాత్రం, ఇలాంటి మినహాయింపులు ఉండవు" అంటూ మాయమయ్యారు ఇద్దరూ.


ఆ కల గురించే ఆలోచిస్తూ తిరిగి నిద్రలోకి జారుకున్నాను.

***

ఉదయం నిద్ర లేచాక ఆ కల గురించి దాదాపు మర్చిపోయాను.

ఆ రోజు సాయంత్రం ఐదు గంటలప్పుడు మనవడి దగ్గరనుంచి వాట్స్ అప్ మెసేజ్ వచ్చింది.


"తాతయ్యా! ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ 'ఫోర్ థర్టీ కావస్తోంది. ఇప్పుడే నాకు ఒక కల వచ్చింది. మళ్ళీ మర్చిపోతానని, ఇప్పుడే నీకు మెసేజ్ పెడుతున్నాను. అమ్మానాన్నలకు చెబితే, 'నైట్ హారర్ మూవీ చూసినందువల్ల కల వచ్చింది' అంటారు. అందుకని నీకు చెబుతున్నాను. కల్లో ఇద్దరు ‘బాడ్ బాయ్స్’ వచ్చారు. నన్ను కొడతామన్నారు. నా దగ్గర ఆల్బమ్ లో మన ఫ్యామిలీ ఫోటోస్ ఉన్నాయి కదా. ఏదైనా ఒక ఫోటో ఇస్తే నన్ను కొట్టకుండా వదిలేస్తామన్నారు. ఏ ఫోటో ఇవ్వడానికీ నేను ఒప్పుకోలేదు. ఈ లోపల మెలకువ వచ్చింది. ఉంటాను. బై"

ఇదీ ఆ మెసేజ్ సారాంశం.


నా కొడుకు అమెరికాలో ఉన్నా, ప్రేమను పంచే మా కుటుంబ వారసత్వాన్ని వదులుకోనందుకు సంతోషించాను. మనిషిని వదులుకొనేదాకా ఎందుకు? ఫోటోను కూడా వదులుకోనని చెప్పిన మనవడిని తలుచుకొని మురిసిపోయాను.

శుభం

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
132 views5 comments

5 Comments


Lavanya Kumari • 5 hours ago

👍👌💐చాలా బాగుందండి కథ. మీరు చెప్పింది అక్షరాలా నిజం. సామాన్యంగా మనం ఎలా ప్రవర్తిస్తుంటామో అవి చూసి పిల్లలు వాటినే నేర్చుకుంటుంటారు. అందుకే పిల్లలు మనం చెప్పేది వినాలంటే ముందు ఆ విధంగా మనం మారాలి, అప్పుడే వాళ్ళు కచ్చితంగా వింటారు.

Like

Nagaraja Ramadugu

Very nice good conclussion

Like

Like

Chandu Tangella

శీతారాం కుమార్! కథ చదివాను . బాగుంది మీ కథ.

Like

subhadra


చాలా సంవత్సరాల తదుపరి, మనసుకు, బుధ్ధి కి అపరిమితమైన ఆనందం ఇచ్చిన కథ ప్రసాదించారు. ధన్య వాదాలండీ

Like
bottom of page