top of page

అనుకుంటే అంతా మనవాళ్లే


'Anukunte Anta Manavalle' written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

ఈజీ చైర్ లో కూర్చుని టి వి చూస్తున్నాడు వెటకారం వెంకట్రావు. అతని భార్య శారదమ్మ పక్కనే కూర్చుని బియ్యంలో రాళ్లు ఏరుతోంది.

గేట్ దగ్గర శబ్దం కావడంతో ముందుకు ఒంగి చూశాడు వెంకట్రావు.

"ఎవరండీ ? " అడిగింది శారదమ్మ.

"కోడలూ, ఆవిడా భర్తా ఊరి నుంచి వస్తున్నారు" అతని మాటల్లో వెటకారం ధ్వనిస్తోంది.

శారదమ్మకు భర్త వ్యంగ్యాలు అలవాటే.

కొడుకును కోడలి భర్త అనీ, కూతుర్ని అల్లుడు గారి భార్య అనీ , తన గురించి చెప్పేటప్పుడు గుండ్రాతి వారి (తన పుట్టింటి వారి ఇంటి పేరు ) అమ్మాయి అనీ చెబుతుంటాడు. కొడుకు తన మాట కంటే కోడలి మాటే వింటాడని కోపం అతనికి. అందుకే కొడుకు గురించి చెప్పేటప్పుడు కోడలి భర్త అంటాడు. పెళ్ళికి ముందైతే శారదమ్మ కొడుకు అనేవాడు. ఇక కూతుర్ని కూడా పెళ్ళికి ముందు అమ్మ కూతురు అనేవాడు. ఇప్పుడు అల్లుడి భార్య అంటాడు .

"ఎలా వున్నావు నాన్నా?" ఇంట్లోకి రాగానే వెంకట్రావుని పలకరించాడు అతని కొడుకు విశ్వం.

"చూస్తున్నావుగా..మీ అమ్మ పెట్టే నాలుగు మెతుకులతో ఈ జీవుడిని ఇలా ఈడ్చుకొస్తున్నాను. కొడుకువి నువ్వైనా ఈ ముసలి తండ్రిని చూసుకుంటావనుకుంటే నువ్వు కాస్తా పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతుంటివి. ఇక ఆ జగన్నాధం గారి కోడలు ..అదే, నీ చెల్లెలు సరోజ ఉందనుకుంటే కనీసం ఫోన్ చెయ్యడానికి కూడా కష్టపడుతుంది. ఏదో నాలుగు మెతుకులు తిని రోజులు వెళ్లదీస్తూ ఆ పైవాడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను" ప్రేమగా పలకరించిన కొడుకు పైన విసరాల్సిన రాళ్లు విసిరి, మళ్ళీ పేపర్లోకి తలదూర్చాడు వెంకట్రావు.

ఈ వెటకారాలకి, వ్యంగ్యాలకి నొచ్చుకున్న వారు వెలగపల్లి వెంకట్రావును కాస్తా వెటకారం వెంకట్రావు అని పిలవడం మొదలుపెట్టారు.

భర్త మాటలకు కొడుకు, కోడలు నొచ్చుకొని ఉంటారని గ్రహించిన శారద మాట మారుస్తూ, "అదేమిటి ఇద్దరూ అంతలా చిక్కిపోయారు? పోయిన నెలే గా మీ నాన్న గారికి ఒంట్లో బాగాలేదంటే ఇద్దరూ పరుగెత్తుకొని వచ్చారు! ఇప్పుడు కూడా అయనకు దగ్గరుండి కంటి ఆపరేషన్ చేయించాలని వచ్చారు. ఈ నెలలోనే ఎంత సన్నగా అయిపోయారు. డైటింగులూ గట్రా చేస్తున్నారేంటి ఇద్దరూ ?" అంది కోడల్ని దగ్గరకు తీసుకొని, ప్రేమగా తల నిమురుతూ .

“కంటి ఆపరేషన్ నాక్కాదు, నీకు చేయించాలి. మొన్న పార్కులో మా ఫ్రెండ్ కనపడి, నేను ఎముకల గూడులా తయారయ్యానని అన్నాడు. నీ కంటికి అదేమీ కనిపించదు. నీ కోడలు నీ అంత లావుగా ఉన్నాచిక్కిపోయిందంటున్నావు" భార్యకూ కోడలికి కలిపి చురక వేశాడు వెంకట్రావు.

"లేదు నాన్నా! నెల రోజుల్లో దాదాపు ఆరు కిలోలు తగ్గింది సునీత " చెప్పాడు విశ్వం.

"పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగే వాడివి! అంతకన్నా ఏం చెబుతావులే. అయినా నీ పెళ్ళాం రుబ్బురోలులా వుంటే మాత్రం నాకెందుకులే. దాన్ని కూర్చోబెట్టి సేవలు చెయ్యడానికి నువ్వున్నావుగా!” విసుర్లు ఆపలేదు వెంకట్రావు.

ఇంకా అక్కడే వుంటే ఆయన ధోరణి ఆగదని గ్రహించిన శారదమ్మ, కోడలు సునీత చెయ్యి పట్టుకొని, " వంటిట్లోకి వెళ్దాం రామ్మా!" అంటూ లోపలికి తీసుకొని వెళ్ళబోయింది.

"నాన్నగారితో కాస్త మాట్లాడాలి. ఇక్కడే ఉండండమ్మా!" అన్నాడు విశ్వం.

ఆయన కంటి ఆపరేషన్ గురించేగా! మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. ఈ లోగా మేము వంట పని చూస్తాము " అంది శారదమ్మ.

"లేదమ్మా! ఆపరేషన్ విషయం కాదు. నాన్నగారి గురించే మాట్లాడాలి. మీరిద్దరూ ఇక్కడే ఉండండి" చెప్పాడు విశ్వం.

"నా మీద పంచాయితీ పెడున్నవా ఏమిటి? ఆస్తులూ పంపకాలూ అంటూ మొదలుపెట్టావో నేనూరుకోను. ఇదివరకే చెప్పానుగా! నా బొందిలో ప్రాణం ఉండగా ఆస్తులు మీకివ్వడం జరగదు. మొన్నటికి మొన్న పక్క వీధి రాజారావు కొడుకులు ఆస్తి రాయించుకునే వరకు నీ లాగే వినయాలు నటిస్తూ, పనయ్యాక ఆయన్ను బయటకు గెంటేశారు. నేనలాంటి తెలివి తక్కువ పని చెయ్యను" గొంతు పెంచి మాట్లాడుతున్నాడు వెంకట్రావు.

"అబ్బా! మెల్లిగా మాట్లాడండి. పక్కింటి వాళ్ళకి వినపడేలా ఉంది" అంది శారదమ్మ.

"ఆస్తులడగడం తప్పులేదు గానీ, నేను బాధలో కాస్త గట్టిగా మాట్లాడితే అరిచానంటావా?" గొంతు మరింత పెంచాడు వెంకట్రావు.

"అమ్మా! నువ్వూ వింటున్నవుగా! నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నాన్నగారి గురించి మాట్లాడాలన్నాను. అంతేగా! దానికే ఎన్నెన్ని మాటలంటున్నాడో చూడు" బాధగా అన్నాడు విశ్వం.

"రోలొచ్చి మద్దెలతో మొర పెట్టుకుందట. ముప్పై ఏళ్లుగా పడ్డదానిని. ఆయన సంగతి నాకు తెలీదా" నిట్టూరుస్తూ అంది శారదమ్మ.

"ముందుగా ప్లాన్ వేసుకొనే వచ్చావన్న మాట. సపోర్టుకు నీ తోడబుట్టిన దాన్ని కూడా తీసుకురాక పోయావా?"

"సరోజను కూడా రమ్మన్నాను నాన్నా! ఇప్పుడే ట్రైన్ దిగిందట. మరో పది నిమిషాల్లో వచ్చేస్తుంది" చెప్పాడు విశ్వం .

కోపంతో చేతిలో ఉన్న పేపర్ విసిరికొట్టాడు వెంకట్రావు.

"ఈ గుండ్రాతి శారదమ్మను చేసుకున్నప్పుడే నాకు దరిద్రం చుట్టుకుంది. మంచి దుర్ముహూర్తాలు చూసి ఇద్దరు పిల్లల్ని కనిపడేసింది నా ప్రాణాలు తీయడానికి" అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు.

కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శారదమ్మకు.

అది గమనించిన విశ్వం తండ్రితో " నాన్నా! ఆవేశపడకండి. మేము ఆస్తి పంపకాలకు రాలేదు. మీతో తగాదాలకు కూడా రాలేదు. కొన్ని విషయాలు సామరస్యంగా మాట్లాడుకోవాలని వచ్చాము. అనవసరంగా అమ్మను ఏమి అనకండి" అభ్యర్ధన గా అన్నాడు.

"అయినదానికీ కానిదానికీ మీ అమ్మను ఆడిపోసుకుంటున్నానంటావా? ఆస్తికోసం కాకుంటే మరెందుకట ఈ పంచాయతీ? " రెట్టించాడు వెంకట్రావు.

ఇంతలో భర్త సురేష్ తో కలిసి ఇంట్లోకి అడుగు పెట్టింది సరోజ.

"రామ్మా సరోజా! అల్లుడుగారూ..రండి! ఇలా కూర్చోండి" ఇద్దర్నీ ఇంట్లోకి ఆహ్వానించి అల్లుడికి కుర్చీ వేసింది శారదమ్మ.

"నమస్కారం మామయ్యగారూ ! అత్తయ్యగారూ! " అంటూ ఇద్దరికీ నమస్కరించి కుర్చీలో కూర్చున్నాడు సురేష్.

" నమస్కారం" ముభావంగా అని తిరిగి పేపర్లో ముఖం దూర్చాడు వెంకట్రావు.

"అల్లుడుగారూ ! ముఖం కడుక్కుని రండి. ముందు కాఫీ ఇచ్చి, తరువాత టిఫిన్ రెడీ చేస్తాను" అంటూ అల్లుడికి టవల్ అందించింది శారదమ్మ.

"అందరూ కట్ట కట్టుకొని వచ్చారంటే ఆస్తి కోసం కాక కుశల ప్రశ్నలు వేయడానికా?" బాత్రూంలోకి వెళుతున్న అల్లుడికి వినపడేటట్లు భార్యతో అన్నాడు వెంకట్రావు.

చిన్నగా మాట్లాడమన్నట్లు భర్తకు సైగ చేసింది శారదమ్మ. తరువాత కొడుకు వైపు తిరిగి "టిఫిన్ పనులు అయ్యాక తీరిగ్గా బెడ్ రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకోవచ్చు. ఇక్కడైతే నలుగురికీ వినబడుతుంది" అంది.

"తండ్రితో తగాదా పడితే తప్పులేదు కానీ నలుగురు వింటే మాత్రం నామోషీనా?" వెటకారంగా అన్నాడు వెంకట్రావు.

ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లేచాడు విశ్వం..

"ఇన్నేళ్ళుగా ఆయనతో వేగుతున్నాం. ఇప్పుడెందుకీ గొడవలు?" వంటిట్లోకి వచ్చిన కొడుకుతో అంది శారదమ్మ.

"గొడవలేమీ లేదమ్మా! అన్ని విషయాలూ నెమ్మదిగానే మాట్లాడుకుందాం. నాన్నగారు ఆవేశపడ్డా, మేము మాత్రం శాంతంగానే ఉంటాం. సరేనా? నువ్వు అనవసరంగా హైరానా పడొద్దమ్మా! అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం" తల్లితో చెప్పాడు విశ్వం.

"ఏమోరా! నాకేమో ఆయన బాగా కోపం తెచ్చుకుని కేకలు వేస్తారేమోనని భయంగా ఉంది"

"అలా భయపడుతూనే ఏళ్ళు గడిపాము. ఇంకా నోరు విప్పకపొతే ఎలాగమ్మా?" కూతురు సరోజ కల్పించుకుంటూ అంది.

"అవును అత్తయ్యగారూ ! అంతా మేము చూసుకుంటాం. మీరు ఎక్కువగా ఆందోళన పడవద్దు" అంది కోడలు సునీత.

అయినా శారదమ్మ ఆందోళన తగ్గలేదు. భర్త స్వభావం పూర్తిగా తెలిసిన మనిషి ఆమె. 'మాములుగా పలకరించినా పెడర్థాలు తీసే భర్త, ఇక ఆయన్ను తప్పు పడితే ఊరుకుంటాడా? ఈ రోజు చుట్టుపక్కల వాళ్ళకి పండగే!' అనుకుంది మనసులో.

"ఇదిగో! నేను కాసేపు పడుకుంటాను. టిఫిన్ రెడీ అయ్యాక చెప్పు. మర్చిపోయి ఆఖర్న మిగిలింది పెట్టేరు!" హాల్లోంచి గట్టిగా అరిచి చెప్తూ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు వెంకట్రావు.

'వీళ్ళ పిచ్చి గానీ ఈయన్ని మార్చగలమనుకుంటున్నారు. అది జరిగే పనేనా?' అనుకుంటూ పనిలోకి దిగింది శారదమ్మ.

"అత్తయ్యగారూ! ఈ రోజుకి మీరు రెస్ట్ తీసుకోండి. టిఫిన్, వంట నేను చూసుకుంటాను. మీరు కావాలంటే పక్కనే కూర్చుని కబుర్లు చెబుతూ ఉండండి" అంది సునీత.

"అవునమ్మా! మేము చూసుకుంటాం. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో" అంది సరోజ కూడా.

ఇద్దరూ ప్రయాణాలు చేసి అలసిపోయి ఉన్నారు. ఈ రోజుకు వదిలేయండి. కావాలంటే రేపు చేద్దురుగానీ!" అంటూ వారించింది శారదమ్మ.

ఇంతలో వంటిట్లోకి వచ్చేసాడు వెంకట్రావు, " నా నిద్ర కూడా పూర్తయింది.ఇంకా టిఫిన్ తయారు చేస్తూనే ఉన్నారా..లేక నా సంగతి మర్చిపోయి ఖాళీ చేసేశారా?” అంటూ .

"రెండు నిమిషాల్లో రెడీ అవుతుంది. మీరు ఈ లోపల చేతులు కడుక్కొని రండి. మిమ్మల్ని ఎలా మర్చిపోతామండీ" అంది శారదమ్మ నొచ్చుకుంటూ.

"ఏమో ! మామూలుగానే నా సంగతి పట్టించుకోవుకదా! ఇక ఇంటికి బంధువులు వచ్చారు కదా. నన్ను పూర్తిగా మర్చిపోయి ఉంటావనుకున్నాను" అన్నాడు వెటకారంగా.

కళ్ళలో నీళ్ళు తిరిగాయి శారదమ్మకు. భర్త దెప్పుళ్ళు ఎంత అలవాటైనా పిల్లల ముందు అంటుండేసరికి ఏడుపు ఆగలేదామెకు. కానీ క్షణంలోనే తెప్పరిల్లి, "పదండి. తెస్తున్నాను" అంది భర్తతో.

"తొందరగా అఘోరించు" అంటూ బయటకు నడిచాడు వెంకట్రావు.

"నువ్వేం బాధ పడకమ్మా! నాన్నగారి సాధింపులు ఈ రోజుతో ఆఖరు" అన్నాడు విశ్వం.

"ఏమిట్రా! ఆయనతో గొడవ పడతారా ఏమిటి? నేనందుకు ఒప్పుకోను " అంది శారదమ్మ ఆందోళనగా.

" ముందు ఆయనకు టిఫిన్ అందించు. లేకుంటే ప్రళయం వస్తుంది " అంది సరోజ.

అదీ నిజమే అనుకుంటూ టిఫిన్, ప్లేట్ లో సర్ది డైనింగ్ టేబుల్ పైన ఉంచి, ఈలోగానే ఏదో పని ఉన్నట్లు గదిలోకి వెళ్లిన భర్తతో " ఏమండీ ! టిఫిన్ రెడీ అయింది. రండి " అని పిలిచింది శారదమ్మ. అలా పిలిపించుకుంటేనే అతనికి తృప్తి కలుగుతుంది.

తాను టిఫిన్ తినడం పూర్తి కాగానే భార్య అందించిన టవల్ తో చెయ్యి తుడుచుకుంటూ "ఇక నీ కొడుకు చెప్పే ప్రవచనాలను కాస్సేపు విందాం. హాయిగా నిద్ర పడుతుంది." అన్నాడు వెంకట్రావు.

'మీరు టిఫిన్ తినగానే అన్ని పనులూ అయిపోయినట్లేనా? మిగతా వాళ్ళు కూడా తినాలని మీకెందుకు అనిపించదు?" అన్నాడు విశ్వం.

"నీ పెళ్ళాం వంట తిని మొహం వాచినట్లున్నావ్! తెగ లాగించేస్తున్నావ్. ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షమట! అందుకే నీకు మీ అమ్మ చేసిన టిఫిన్ అద్భుతంగా ఉంది కామోసు!" వెంకట్రావు వెటకారం శృతి మించింది.

"నా ప్రవచనాలు మీకు రుచించవుగా! అందుకే ఈ సారి మీ అన్నయ్య సంజీవరావు గారు ప్రవచిస్తారట! ఆయన ఆశ్రమంలో ఉన్నారుగా. అక్కడికి మనల్నందరినీ రమ్మన్నారు " అన్నాడు విశ్వం.

తన అన్నయ్య సంజీవరావు ప్రస్తావన రాగానే వెంకట్రావు చేతిలోని టవల్ జారి కింద పడింది.

"ఏమిట్రా! నిజమేనా నువ్వు చెప్పేది? అన్నయ్య మాట్లాడతాడా? ఆస్తి పంచలేదని అన్నయ్య దగ్గర మధ్యస్తం పెట్టిస్తున్నారట్రా మీరంతా కలిసి?" ఇప్పుడతని మాటల్లో వెటకారం కంటే భయం తెలుస్తోంది.

"పెదనాన్నే మమ్మల్ని, సరోజా వాళ్లని రమ్మన్నాడు. ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాడు. మేము వచ్చింది అందుకే!" అసలు విషయం బయటపెట్టాడు విశ్వం.

వెంకట్రావుకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఇప్పుడు తను అనుభవించే ఆస్తి అంతా అన్నయ్యదే! అనుభవం తనదేకానీ అన్నయ్యకు కోపం వస్తే ఏ క్షణమైనా తనను బయటకు పంపవచ్చు.

"ఒరేయ్! ఈ విషయం ముందుగా చెప్పాలి కదరా! నాకు ఆలోచించుకోడానికి కూడా సమయం ఇవ్వలేదు మీరు. అందరూ కట్టకట్టుకుని నా మీద కుట్ర చేశారన్న మాట" అంటూ భార్య వైపు తిరిగి " అందుకే నిన్ను గుండ్రాతి వారి అమ్మాయి అనేది. భర్తను కాపాడాలనే ఇంగితం ఇసుమంతైనా లేదు నీకు" అన్నాడు కోపంగా.

"నాన్నా! అమ్మకు ఏ విషయం తెలీదు , నీకు సేవలు చేయడం తప్ప. నిజానికి ఈ విషయంలో మా ప్రమేయం లేదు.పెదనాన్న గారి నిర్ణయమే అంతా. మనల్నందరినీ ఆయన ఆశ్రమానికి రమ్మన్నాడు. అక్కడే విషయం చెబుతాడట" టిఫిన్ చేయడం ముగించి పైకి లేచాడు విశ్వం.

మరో పావు గంటలో అందరూ రెడీ అయి సంజీవరావు గారి ఆశ్రమానికి బయలుదేరారు. కారు ముందుకు వెళుతుంటే వెంకట్రావు మనసు వెనక్కి, గతంలోకి పరుగులు తీసింది.

***

సంజీవరావు, వెంకట్రావు స్వంత అన్నదమ్ములు. తండ్రి నుంచి ఇద్దరికీ మంచి ఆస్తులే సంక్రమించాయి. సంజీవరావు ఆలోచనాపరుడయితే వెంకట్రావుది దుందుడుకు స్వభావం. పైగా తను అనుకున్నదే కరెక్ట్ అనే మూర్ఖత్వం. స్వార్ధం పాలు కూడా ఎక్కువే. తన గురించే తప్ప భార్యాపిల్లల గురించిన ఆలోచనలు చాలా తక్కువ. తన స్నేహితులు ఏదో కొత్త వ్యాపారం ప్రారంభిస్తూ వెంకట్రావును కూడా అందులో చేరమన్నారు. లక్షల్లో లాభాలు వస్తాయని ఊరించారు. భార్య శారదమ్మ ఎంత చెప్పినా వినలేదు. అన్న సంజీవరావును మాటమాత్రం సంప్రదించలేదు. ఆస్తులన్నీ అమ్మి స్నేహితుల చేతుల్లో పెట్టాడు. ఓ ఆరు నెలలు మాయమాటలు చెప్పి మొత్తం నష్టం వచ్చిందని చేతులెత్తేశారు వాళ్ళు.

రోడ్డున పడ్డాడు వెంకట్రావు. ఆ సమయంలో దేవుడిలా ఆదుకున్నాడు సంజీవరావు. తన వాటాకు వచ్చిన ఆస్తిలో సగ భాగాన్ని తమ్ముడికి ఇచ్చాడు.

" నీ పేరుతొ రాస్తే మళ్ళీ ఏదో పొరపాటు చేసి పోగొట్టుకుంటావు. అందుకే రాయడం లేదు. కానీ నేను మళ్ళీ ఈ ఆస్తి అడగను. నీకు పిల్లలు పుట్టి పెద్దవాళ్ళయ్యాక వాళ్లకు రాసిస్తాను. అంతేకాదు. భవిష్యత్తులో ఆర్థికంగా ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు" అని చెప్పాడు సంజీవరావు.

అన్నయ్యకు మనస్ఫూర్తిగా నమస్కరించాడు వెంకట్రావు.

కొంతకాలానికి సంజీవరావు భార్య ప్రసవ సమయంలో బిడ్డతో పాటు చనిపోయింది. దాంతో సంజీవరావుకు వైరాగ్యం కలిగింది. మళ్ళీ పెళ్లి చేసుకొమ్మని బంధువులు బలవంతం చేసినా వినలేదు. వెంకట్రావుకు ఇద్దరు పిల్లలు పుట్టారు. తమ పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకుని, తమతో పాటు ఉండమని వెంకట్రావు దంపతులు ప్రాధేయపడ్డా అంగీకరించలేదు సంజీవరావు. ఊరికి కాస్త దూరంగా ఒక అనాధాశ్రమాన్ని ఏర్పాటు చేసి, తనూ అక్కడే చేరి, నిర్వహణ చూసుకుంటున్నాడు. తన ఇంటిని కూడా తమ్ముడికి అప్పగించాడు.

స్నేహితులు చేసిన మోసం వెంకట్రావు మానసిక స్థితిని దెబ్బ తీసింది. ప్రపంచంలో అందరూ తన ఆస్తి కోసం వెంటపడుతున్నట్లు భావించేవాడు. భార్యాపిల్లలు కూడా తన ఆస్తి కోసమే తనతో సఖ్యంగా ఉంటున్నారని భావించేవాడు. తాను దారుణంగా మోసపోయిన విషయాన్ని మర్చిపోవడానికి, తానొక్కడే తెలివైన వాడిననీ, భార్యాపిల్లలు బొత్తిగా అమాయకులనీ భావించడం మొదలు పెట్టాడు. రానురానూ అది అలవాటుగా మారి, భార్యాపిల్లలని ప్రతి విషయంలో విమర్శించడం, తన ఆస్తి కాజేయడానికే వాళ్ళు ఎదురుచూస్తున్నారనుకోవడం అతని దినచర్యలో భాగం అయింది. ఇప్పుడు అన్నయ్య రమ్మన్నాడని తెలియడంతో అతని బి పి అమాంతం పెరిగిపోయింది. కొడుకుతో రాజీ చేసుకుంటే మేలేమో అనిపించింది.

" ఒరేయ్ విశ్వం! మీ పెదనాన్నతో నా గురించి చాలా చాడీలు చెప్పినట్లున్నావ్! ఆయనకు కోపం వచ్చి ఆస్తి తిరిగి తీసేసుకొని అనాధ శరణాలయానికి ఇచ్చేయగలడు. మీకే నష్టం. ఆలోచించుకోండి" అన్నాడు కార్ డ్రైవ్ చేస్తున్న కొడుకుతో.

"తినబోతూ రుచులడగటం ఎందుకు? అయినా పెదనాన్న ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటాడు" అన్నాడు విశ్వం మనసులో నవ్వుకుంటూ.

ఇక చేసేది లేక మౌనం దాల్చాడు వెంకట్రావు. ఆశ్రమానికి చేరుకొని ఒక చెట్టు నీడన కారు పార్క్ చేసాడు విశ్వం.

కారు దిగిన వెంకట్రావు కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించారు అక్కడ ఉన్న వాళ్ళు. కాస్త దూరంలో సంజీవరావు ఉన్న ఆఫీస్ రూమ్ దగ్గరకు వీళ్ళను తీసుకుని వెళ్లారు. వెళ్లే దారంతా సంజీవరావు తమను ఎంత ఆదరంతో చూసుకునేదీ వివరించారు. వాళ్లంతా సంజీవరావును ఒక దేవుడిలా చూస్తున్నారని వీళ్లకు అర్ధం అయింది. తన ఆఫీస్ రూమ్ కి వచ్చిన వెంకట్రావును, అతని కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించాడు సంజీవరావు. అందరికి మంచి నీళ్లు, కొబ్బరి బొండాలు అందించాక మిగతా వారిని కాస్సేపు బయటకు వెళ్ళమన్నాడు.

వాళ్ళు వెళ్ళాక వెంకట్రావు వంక చూస్తూ సూటిగా విషయాన్ని మొదలు పెట్టాడు.

"చూడు తమ్ముడూ! దాదాపు యాభై లక్షల ఆస్తిని ఎవరి మాటలో విని ధార పోశావు. ఆ పని చేసేముందు నాతో ఒక్కమాట కూడా అనలేదు. నువ్వొక్కడివే కోటీశ్వరుడివి కావాలనే కోరికతో కాదు గానీ నేనెక్కడ వొద్దంటానో అని చెప్పలేదు. అయినా నేను నిన్నొక మాట కూడా అనకుండా నా ఆస్తిలో సగం నీకు ఇచ్చాను. నువ్వు మళ్ళీ ఏ పొరపాటు చేస్తావోనని రాతకోతలు చేయలేదు కానీ తిరిగి నేను తీసుకోవాలని కాదు. ఎప్పటికీ తీసుకోను కూడా! ఆశ్రమాన్ని నిర్వహించడానికి సరిపడా డబ్బు నా దగ్గర ఉంది. ఇక మనం ఇద్దరమూ పెద్దవాళ్ళం అయ్యాము. కాబట్టి నీ ఆధీనంలో ఉన్న ఆస్తిని విశ్వానికీ, సరోజకూ ఇద్దామనుకుంటున్నాను" అన్నాడు సంజీవరావు.

గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది వెంకట్రావుకి. ఆస్తి రాస్తానంటున్నది తన పిల్లల పేర్లతోనే, ఎలా కాదనగలడు? కానీ అదే జరిగితే తన పరిస్థితి ఏమిటి? తనను ఇంట్లోంచి గెంటేయరూ? ఎటు చెప్పలేని పరిస్థితి.

అయినా గొంతు పెగుల్చుకొని అన్నాడు "అంతకంటే ఆనందం ఏముంటుంది అన్నయ్యా ! కానీ అప్పుడే తొందర ఏమొచ్చిందని? భవిష్యత్తులో నీకేదైనా అవసరం రావచ్చు " అని.

"చెప్పానుగా! ఇద్దరమూ పెద్దవాళ్ళం అయ్యాము. మనది వెళ్లే వయసూ, వాళ్ళది ఎదిగే వయసూ. ఇంకా ఆస్తులు పట్టుకొని ఉగులాడటం ఎందుకు? ఇప్పుడు ఇస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుంది. వాళ్ళేమీ పరాయి వాళ్ళు కాదు. పిల్లలిద్దరూ ఆణి ముత్యాలు. కోడలు, అల్లుడు కూడా వీళ్లకు తగ్గ వాళ్ళు వచ్చారు. ఈ ఆశ్రమానికి సంబంధించిన ట్రస్ట్ లో కూడా పిల్లలను, నిన్ను మెంబర్లుగా చేరుస్తున్నాను" ఆని చెప్పి, తాను సిద్ధం చేసిన వీలునామా పత్రాలను పిల్లలకు అందజేశాడు.

కళ్ళు గిర్రున తిరిగాయి వెంకట్రావుకు. ఇక పిల్లలు తనపై పగ తీర్చుకుంటారు. వారితో ఉండటం కష్టం. 'తన పేరుతొ కొంత బ్యాంకు బాలన్స్ ఉంది.ఆ విషయం వీళ్లకు తెలీదు. దాంతో ఎలాగైనా బతికెయ్యొచ్చు' అనుకుంటూ బయటకు నడవబోయాడు వెంకట్రావు.

"ఆగు నాన్నా!" ఖంగుమంది విశ్వం గొంతు.

'వీడు నా బ్యాంకు పాస్ బుక్ చూసినట్లున్నాడు. అది కూడా లాక్కుంటారేమో..' మనసులో అనుకుంటూ " నా దగ్గర ఇంకేమి లేదు. మీకు ఇవ్వడానికి !" దీనంగా అన్నాడు కొడుకుతో.

"ఉంది నాన్నా! మీరు దాచింది ఇంకా ఉంది. నెలల పిల్లలుగా ఉన్నప్పుడు మీ వొళ్ళో కూర్చుని మీ పంచెను తడిపితే అసహ్యించుకోకుండా ముద్దాడిన మీ ప్రేమ కావాలి. తప్పటడుగులు వేస్తున్నప్పుడు సరైన దారిలో నడిపించిన నీ చేతి ఆసరా కావాలి. మేము పొరపాట్లు చేస్తే సరైన దారిలో పెట్టావు కానీ మమ్మల్ని వదిలెయ్యలేదు. మేమూ అంతే. స్నేహితుల మోసం వల్ల నీలో ఆస్తుల పట్ల శ్రద్ధ పెరిగి అందరిమీదా అనుమానం కలిగింది. నీకంటే మాకు ఆస్తులు ఎక్కువ కాదని నిరూపించడానికి ఇదంతా చేసాము. ఈ ఆస్తి మాకు అఖ్ఖర్లేదు. తన లోపాన్ని సరి చేసుకున్న మా నాన్న కావాలి" అంటూ సంజీవరావు తనకిచ్చిన ఆస్తి పత్రాలు తండ్రి కాళ్ళ వద్ద ఉంచాడు విశ్వం. సరోజ కూడా తన చేతిలో ఉన్న పత్రాలు తండ్రికి అందించింది.

వెంకట్రావు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.సంజీవరావు ఓదార్పుగా అతని భుజం మీద తట్టాడు.

"చూడు తమ్ముడూ ! ప్రేమిస్తే అందరూ మనవాళ్లే అవుతారు. ద్వేషిస్తే మనకు ఎవ్వరూ మిగలరు. నన్ను చూడు! నేను ఏ రోజూ ఒంటరినని అనుకోలేదు. నువ్వూ, నీ పిల్లలూ, ఇక్కడ పనిచేసే సిబ్బందీ, ఇక్కడ చేరిన ఆనాధలూ..ఇలా అందరూ నా వాళ్లనే అనుకుంటాను. వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. ఇక నీ విషయానికి వస్తే నీ భార్య పిల్లలను కూడా పరాయి వాళ్ళు గా భావిస్తావు. అందువల్ల నీకెవ్వరూ లేరనీ, అందరూ నీ ఆస్తి కోసం చూస్తున్నారనీ అనుకుంటున్నావు. కాస్త కళ్ళు తెరిచి చూస్తే నీ భార్యాపిల్లలు ఎంత ఉత్తములో, నిన్నెంతగా అభిమానిస్తున్నారో తెలుస్తుంది." అన్నాడు సంజీవరావు.

అందరూ సంజీవరావుకు నమస్కరించారు.

వెంకట్రావు.

"ప్రాణం లేని ఈ కాగితాలు నాకు వద్దు" అంటూ పిల్లలు తనకిచ్చిన పత్రాలు తిరిగి వాళ్ళకే ఇచ్చి, భార్యాపిల్లలను దగ్గరకు తీసుకున్నాడు వెలగపల్లి వెంకట్రావు. ఇప్పుడతని మాటల్లో వెటకారం లేదు.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 15 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
220 views1 comment

1件のコメント


Gandavalli Sireesha
Gandavalli Sireesha
2021年5月09日

Super story uncle

いいね!
bottom of page