top of page

సరే శివయ్య

'Sare Sivaiah' New Telugu story

written by Mallavarapu Seetharam Kumar


రచన : మల్లవరపు సీతారాం కుమార్




భూమిని అమ్మడానికి 'సరే శివయ్య' ఒప్పుకోలేదు.

సదాశివపురం గ్రామమంతా ఆ రోజు అదే చర్చ.

శివయ్య వాస్తవానికి ఆ గ్రామానికి చెందినవాడు కాదు.సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం ఆ వూరి శివాలయం ముందు ఎవరో వదిలి వెళ్లారు.పిల్లలు లేని ఆ వూరి పూజారి అతనికి 'శివయ్య' అని పేరు పెట్టి చేరదీసాడు. శాస్త్ర ప్రకారం దత్తత తీసుకోలేదు కానీ, కన్న కొడుకు లాగా చూసుకున్నాడు.ఆలా పూజారి దగ్గర పెరిగిన శివయ్య వూరి వారందరికీ తలలో నాలుకలాగా మారాడు.


ఎవరు ఏ పని చెప్పిన 'సరే'నంటూ చేసేవాడు.

అందుకే అతన్ని అందరూ 'సరే శివయ్య' అని పిలిచేవారు.

అతను తల అడ్డంగా ఊపడం ఇంతవరకు ఆ ఊరిలో ఎవరూ చూడలేదు.రోజూ ఉదయాన్నే శివాలయాన్ని శుభ్రం చేసేవాడు.పూజారికి గుడిలో సహాయం చేసేవాడు.పూజారికి సంబంధించిన వ్యవసాయ పనులు అన్నీ స్వయంగా చూసుకునేవాడు.


పూజారి దంపతులు స్వర్గస్తులయ్యాక పూర్తిగా 'వూరి మనిషి' అయిపోయాడు శివయ్య. ఏ ఇంట్లో పెళ్లి జరిగినా, ఎవరు కాలం చేసినా అన్నిపనులు తనే చూసుకునేవాడు.అలాంటి శివయ్య రచ్చబండ దగ్గర సర్పంచ్ మాటకు ఎదురు చెప్పడం ఆ వూరి వారందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఉదయం జరిగిన సంఘటన అందరూ గుర్తు చేసుకుంటున్నారు.ఆ రోజు ఉదయాన్నే సదాశివపురం గ్రామ రైతులంతా రచ్చబండ దగ్గరకు చేరారు.ఆ రోజు గ్రామ సర్పంచ్ రంగారావు అందరినీ అక్కడకు రమ్మన్నాడు.కారణం ఎవరికీ పూర్తిగా తెలీదు.అతని బంధువులెవరో భూమి కొనుగోలు చెయ్యాలని వచ్చారనీ, ఆ విషయంగానే ఈ సమావేశమనీ అందరూ అనుకుంటున్నారు.


పదిగంటలకల్లా రచ్చబండ దగ్గరకు రావాలని నిన్న తలారి దండోరా వేసి చెప్పాడు.అలవాటు ప్రకారం రైతులంతా తొమ్మిదిన్నరకే వచ్చారు.తన అలవాటు ప్రకారం రంగారావు పదిన్నరకు వస్తాడని అందరూ అనుకున్నారు.తన కోసం అందరూ ఎదురుచూస్తుంటే అతనికి ఎంతో ఆనందమని ఆ వూరి వారందరికీ తెలుసు.కానీ ఆశ్చర్యకరంగా ఆరోజు సరిగ్గా పదిగంటలకు రచ్చబండ దగ్గర రంగారావు కార్ ఆగింది.అతనితో పాటు సూటు వేసుకున్న మరో వ్యక్తి కూడా దిగాడు.రైతులు లేచి నిలబడి రంగారావుకు నమస్కారం చేసారు.రచ్చబండ పైన వేసివున్న కుర్చీల్లో రంగారావు, అతని ప్రక్కన వున్న వ్యక్తి కూర్చున్నారు.


తన ప్రక్కన వున్న వ్యక్తిని అందరికీ పరిచయం చేస్తూ "ఇతను మా బావమరిదికి స్నేహితుడు.అనుకోకుండా కోర్టులోవున్న తాతలనాటి కోట్ల విలువైన ఆస్తి తనకు రావడంతో ఆ డబ్బుతో వ్యవసాయ భూమి కొనాలని అనుకుంటున్నాడు.ఇప్పుడు వున్న ధరకంటే కాస్త ఎక్కువ ఇవ్వడానికి కూడా సిద్ధంగా వున్నాడు.


ఇక మన గ్రామంలో నాలుగు సంవత్సరాలనుంచి వర్షాలు లేక, పంటలు పండలేదు. రైతులందరూ అప్పుల పాలు అయివున్నారు. ఇలాంటి పరిస్థితులలో మంచి ధర వస్తే ఈ భూములను అమ్ముకోవడమే మంచిదనిపించి,మా బావమరిది ద్వారా వీరిని కలిసాను. మన వూరు ప్రధాన రహదారికి దూరంగా ఉందనీ,అందువల్ల ధర పెరగదనీ, మొదట ఒప్పుకోలేదు.కానీ మా బావమరిది మాటను కాదనలేక చివరికి ఒప్పుకున్నాడు.'తనకు దాదాపు వంద ఎకరాలు ఒకే చోట కావాలనీ,పదిశాతం ఎక్కువ యిస్తాననీ' చెప్పాడు.


ఊరికి పడమటి వైపు నాకు పది ఎకరాలు వున్న విషయం తెలిసిందే. మన ఊర్లో చాలామందికి అక్కడే భూములు వున్నాయి. అక్కడ మరో తొంభై ఎకరాలు సేకరిస్తే మొత్తం ఈయనకు అమ్మవచ్చు.మనం అందరం మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తే, ఆ తరువాత ఈయనకు తెలియపరుస్తాను"అంటూ చెప్పడం ముగించాడు రంగారావు.


"అయ్యా! మీరు చెప్పింది నిజమే. భూములు అమ్మడానికి మేము సిద్దమే. కానీ ఇరవైశాతం పెంచకుంటే మాకు గిట్టుబాటు కాదు. మీ మాటకు ఎదురు చెప్పినందుకు క్షమించండి."అన్నాడు కామయ్య అనే రైతు.


అందరూ కామయ్య వైపు ఆశ్యర్యంగా చూసారు. రంగారావుకు ముఖ్య అనుచరుడైన కామయ్య ఇలా ఎదురు మాట్లాడుతున్నాడేంటి? అని తమలో తామే గుసగుస లాడుకుంటున్నారు.


"కామయ్యా! మన వూరి రైతులకు సహాయం చేయాలని ఈయన్ను పిలుచుకొని వస్తే, అయన ముందే నన్ను ఎదిరిస్తావా? నాకు అందరు నాయకులతో, అధికారులతో పరిచయం ఉన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. నీ పొలంలోకి వెళ్లాలంటే నా భూముల్లోంచే వెళ్ళాలి. జాగ్రత్త."హెచ్చరించాడు రంగారావు.


ఇద్దరు రైతులు కామయ్య మీదకు కోపంగా దూసుకువెళ్తుంటే వారించాడు రంగారావు.తరువాత ఎవ్వరూ మాట్లాడటానికి సాహసం చేయలేదు."

అయితే ఇక అగ్రిమెంట్ చేసుకోడానికి ఏర్పాట్లు చేద్దాము....." అంటూ ఇంకా ఎదో చెప్పబోతుండగా శివయ్య పైకి లేచాడు.


"మన్నించండి సర్పంచి గారూ! నేను భూమి అమ్మను. మిగతావాళ్ళు సరేనంటే వారి భూములు కొనుక్కోమనండి."ఖచ్చితంగా చెప్పి, అక్కడినుండి వెళ్లిపోయాడతను.

ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో పడ్డాడు రంగారావు.శివయ్య ఊరందరి మనిషి. అతని విషయంలో తొందర పడితే ఊరంతా తననే తప్పు పడతారు. ప్రస్తుతానికి నిష్క్రమించడమే మంచిదని నిర్ణయించుకొని "తొందరేమీ లేదు. బాగా ఆలోచించుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం" అని చెప్పి తనతో వచ్చిన వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయాడు రంగారావు.

వాళ్ళు వెళ్ళాక రైతులందరూ అక్కడే కూర్చుని జరిగిన సంఘటనలపై చాలాసేపు చర్చించుకున్నారు. బక్కయ్య అనే రైతు "నేను వెళ్లి శివయ్యను పిలుచుకొని వస్తాను. అతన్ని అడిగితే కానీ నిజాలు తెలియవు" అంటూ శివయ్య కోసం వెళ్ళాడు. శివయ్య ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆశ్చర్య పోయి పక్కింటి వాళ్ళను శివయ్య గురించి విచారించాడు.


'రచ్చబండ దగ్గరనుండి రాగానే పొట్ట నొప్పిగా ఉందనీ, పట్నం వెళ్లి పెద్దాసుపత్రిలో చూపించుకుని వస్తాననీ చెప్పి హడావిడిగా బయలుదేరాడు.' అని చెప్పారు వాళ్ళు.

బక్కయ్య రచ్చబండ వద్దకు తిరిగి వచ్చి అదే విషయాన్నిఅందరికీ చెప్పాడు. అందరూ శివయ్య అనారోగ్యం గురించి చాలాసేపు బాధ పడ్డారు.మర్నాడు ఉదయాన్నే రంగారావు స్వయంగా శివయ్య ఇంటి వద్దకు వచ్చాడు."ఇప్పుడెలా వుంది శివయ్యా!అయినా మాకు చెప్పి ఉంటే మా కారులో తీసుకుని వెళ్లే వాళ్ళం కదా" అంటూ పరామర్శించాడు.

"ఎప్పుడూలేనిది నిన్న కడుపులో నొప్పిగా ఉండడంతో కాస్త ఆదుర్దా పడ్డాను.పెద్దాసుపత్రి వాళ్ళు ఏమీ లేదని చెప్పారు " అన్నాడు శివయ్య .


""హమ్మయ్య! ఇప్పటికి నా మనసు కుదుటపడింది.అన్నట్లు నిన్న భూమి అమ్మకం గురించి నీకు కోపం వచ్చినట్లుంది...." అసలు విషయాన్ని నెమ్మదిగా కదిపాడు రంగారావు.


"ఎప్పుడూ మా బాగోగుల గురించి ఆలోచించేవారు తమరు. మీపైన కోపమెందుకు వస్తుంది మాకు?మీతో వచ్చిన పెద్ద మనిషి తక్కువ ధరకు అడుగుతున్నట్లు నాకు అనిపించింది. అందుకే అక్కడనుంచి వచ్చేసాను.నిన్న ఆసుపత్రికోసం పట్నం వెళ్ళినప్పుడు పనిలోపనిగా భూముల ధరలు ఎలా ఉన్నాయో విచారించాను. మాకు ఇస్తామన్నది మంచి ధరేనని తెలిసింది. ఈ విషయాన్ని రైతులందరికీ ఇప్పుడే చెబుతాను. ఇక మీకు ఏ ఆటంకం లేదు. అగ్రిమెంటుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు." వినయంగా చెప్పాడు శివయ్య.


పట్టలేని ఆనందం కలిగింది రంగారావుకు.శివయ్య రెండు చేతులు పట్టుకుని ఊపేస్తూ "మంచి మాట చెప్పావు శివయ్యా! నువ్వు కాక ఇంకెవరు అడ్డు చెప్పినా నేను లెక్క చేసేవాడిని కాదు.వాళ్ళ అంతు చూసేవాడిని. ఇప్పుడే ఈ శుభవార్త మా బావమరిదికి చెబుతాను." అంటూ బయటకు నడిచాడు రంగారావు. ఒక వారం లోపే అగ్రిమెంట్ కు ఏర్పాట్లు చేసాడు. మరుసటి రోజు అగ్రిమెంట్లు జరుగుతాయనగా శివయ్యకు ఒక వకీలు నోటీసు వచ్చింది. దాన్ని కనీసం తెరిచి చూడకుండా రంగారావు దగ్గరకు తీసుకొని వచ్చాడు శివయ్య "అయ్యా! ఇదేదో వకీలు నోటీసని పోస్టుమాన్ చెప్పాడు. కాస్త చదివి చెప్పండయ్యా " అంటూ ఆ నోటీసును రంగారావుకు అందించాడు.


శివయ్యను పెంచుకున్న పూజారికి అన్న కొడుకు, అమెరికాలో ఉంటున్నాడు. పట్నంలో వకీలుగా వున్న తన తండ్రి సుందరాచారి ద్వారా ఈ నోటీసు ఇప్పించాడు. ప్రస్తుతం శివయ్య అధీనంలో ఉన్న ఐదెకరాల భూమి పూజారి మరణానంతరం అతని భార్యకు సంక్రమించింది. ఆమె ఆ భూమిని తమకు అమ్మినట్లు, ఆ తరువాతే శివయ్యకు వీలునామా వ్రాసినట్లు ఆధారాలు ఉన్నాయనీ, ఆ భూమిపై శివయ్యకు ఎలాంటి హక్కు లేదనీ, అమ్మడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ ఆ నోటీసు సారాంశం.


"అయ్యా ! ఈ విషయాన్ని తేలిగ్గా వదిలి పెట్టాను.ఎన్ని కోర్టులైన తిరిగి ఆ భూమిని సాధించుకుంటాను." అన్నాడు శివయ్య.

నోటీసును చదవగానే కళ్ళు బైర్లు కమ్మాయి రంగారావుకు.శివయ్య చెబుతున్న మాటలేవీ వినిపించుకోవడం లేదతను. శివయ్య భూములు తను సేకరించాల్సిన భూములకు సరిగ్గా మధ్యలో ఉన్నాయి. ఆ భూములు కొనకుండా మిగతా భూములు కొన్నా తను అనుకున్న అసలు పధకం పారదు. ఈ వ్యవహారం కోర్టులో తేలడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.


బెదిరిద్దామంటే అవతలి వ్యక్తి అమెరికాలో ఉంటున్నాడు. అతని తండ్రి వకీలు. చేసేది లేక భూమి కొనుగోలు వ్యవహారం మానుకున్నాడు రంగారావు. ఇది జరిగిన కొన్నాళ్ళకు శివయ్యను ఒంటరిగా కలిసాడు బక్కయ్య. "ఈ భూముల కొనుగోలు వ్యవహారమంతా తికమకగా ఉంది. భూమి అమ్మనని చెప్పిన నువ్వు పట్నం వెళ్లి రాగానే అమ్ముతానని చెప్పడం నాకు అర్ధం కాలేదు. నా మీద నమ్మకం ఉంటే నిజం దాచకుండా చెప్పు" అన్నాడు బక్కయ్య.


నిజం చెప్పడం ప్రారంభించాడు శివయ్య."గుళ్లో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లగురించి మాట్లాడదామని సర్పంచి రంగారావు ఇంటికి వెళ్ళాను నేను. అయన ఇంటి బయట వాళ్ళ పాలేరు భద్రయ్య కనిపించాడు. సర్పంచి, కామయ్యతో ఏదో రహస్యాలు మాట్లాడుతున్నాడనీ, తను ఏదో అడుగుదామని లోపలికి వెడితే కసురుకున్నాడనీ చెప్పాడు భద్రయ్య. చాలాసేపు ఎదురు చేసిన నేను, ఏమైతే అది అయిందని ఇంట్లోకి వెళ్ళాను. అక్కడ సర్పంచి, వాళ్ళ బావమరిది, అతని స్నేహితుడు కూర్చుని మందు పార్టీ చేసుకుంటున్నారు. కామయ్య, వినయంగా వారికి కావలసినవి అందిస్తున్నాడు.


వాళ్ళ మాటలను బట్టి నాకు అసలు విషయం అర్ధం అయింది.మన ఏరియాలో ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి భూముల కోసం కొంతమంది వెతుకుతున్నారు. వారికి ఒకే చోట వంద ఎకరాల దాకా స్థలం కావాలి. ఫ్యాక్టరీ పడుతున్నదంటే ఆ ఏరియాలో భూముల రేట్లు మూడు నాలుగు రెట్లు పెరగడానికి అవకాశం వుంది. కేవలం పది శాతం పెంచి మొత్తం భూములు తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనుకున్నాడు సర్పంచి రంగారావు. ఒకే మనిషి చేతిలో అంత భూమి ఉంటే ఎంతయినా ఇచ్చి కొనుక్కుంటారు ఫ్యాక్టరీ వాళ్ళు.

కామయ్య ఎక్కువ ధర అడగడం, సర్పంచి అతన్ని బెదిరించడం, అంతా ఒక నాటకం. ఇంకెవరూ ఎదురు చెప్పకుండా భయపెట్టారు. ఇక వకీలు నోటీసు గురించి చెబుతాను.

పూజారి గారు మరణించాక అమ్మగారు నన్ను పిలిపించి 'ఆస్తి కోసం పట్నంలో ఉన్న అయ్యగారి అన్నఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకే బాండు పేపర్లు తెప్పించి సంతకాలు పెట్టాను.వెంటనే నీ పేరుమీద రాయించుకో.' అంటూ కొన్ని బాండు పేపర్లు ఇచ్చింది.


'అమ్మా! తాడూ బొంగరం లేనివాడిని.పెళ్ళీ పెటాకులు వద్దన్న వాడిని. ఈ ఆస్తి నేను తీసుకోవడం కంటే అయ్యగారి సొంత అన్నగారు తీసుకుంటే నాకు సంతోషమే. ఈ పత్రాలు ఆయనగారికి ఇస్తాను' అన్నాను.


'నీ ఇష్టం శివయ్యా. బాగా అలోచించి నిర్ణయం తీసుకో.' అన్నారు అమ్మగారు.

ఆ పత్రాలు తీసుకుని పట్నంలో ఉన్న అయ్యగారి అన్న వకీలు సుందరాచారి గారి దగ్గరకు వెళ్ళాను. అయన తనకు కావలిసినంత ఆస్తి ఉందనీ,పైగా తన కొడుకు అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడనీ చెప్పి, ఆ పత్రాలు నాకు తిరిగి ఇచ్చేసాడు. ఇక అమ్మగారు కాలం చేసేముందు ఆస్తి నా పేరుతో వీలునామా రాసారు. భూముల అమ్మకం ఆపడానికి ఆ ఖాళీ పత్రాలు ఉపయోగ పడతాయనిపించింది. వాటిని తీసుకుని వకీలు సుందరాచారి గారి దగ్గరకు వెళ్ళాను.


రంగారావు తలపెట్టిన మోసం గురించి ఆయనకు చెప్పి "అయ్యా! మా సర్పంచ్ వూళ్ళో రైతులందరినీ మోసం చెయ్యబోతున్నాడు. మీరే ఎదో చేసి,కొన్నాళ్లు భూముల అమ్మకం ఆపు చేయించండి. ఈలోగా ఫ్యాక్టరీ రాబోతున్న విషయం బయటకు వస్తుంది. అప్పుడు మా వూరి రైతులకు మంచి ధర వస్తుంది." అని అడిగాను. ఆయన ఆ ఖాళీ పత్రాలు ఉపయోగించి భూముల అమ్మకం నిలుపు చేయిస్తానని చెప్పారు" వివరంగా చెప్పాడు శివయ్య.


"ఒకవేళ ఆ వకీలు ఆస్తి తనదే అంటే?విషయం సర్పంచికి తెలిస్తే?" తన సందేహాలు బయట పెట్టాడు బక్కయ్య.


"వకీలు అడిగితే సంతోషంగా ఆస్తి అప్పగిస్తాను. ఇక సర్పంచి సంగతి. మన వూరి రైతులను మోసం చెయ్యాలని చూస్తున్నాడతను. అతని మోసం బయటపడే వరకు భూముల అమ్మకం ఆపాలన్నదే నా లక్ష్యం .


అనాథనైన నన్ను ఈ వూరు పెంచి పోషించింది. ఈ వూరి కోసం ఎవరినైనా ఎదిరిస్తాను. నాకేమి జరిగినా భయపడను. " దృఢ సంకల్పంతో చెప్పాడు శివయ్య.


శివయ్య కోరుకున్నట్లే జరిగింది.కొద్ది రోజులకు ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్న వాళ్ళు స్థానిక ఎం ఎల్ ఏ తో వచ్చి, రైతులతో భూమి కొనుగోలు గురించి మాట్లాడారు.

అందరి కోరిక మీద ఆ భాద్యతను శివయ్యకు అప్పగించారు.


పట్నం నుంచి సుందరాచారి వచ్చి,"శివయ్యా! రాత్రి పరమశివుడు కల్లో కనిపించి 'శివయ్య నా మనిషి. అతనికి అన్యాయం చేస్తావా?' అని నన్ను కోప్పడ్డాడు. ఇదిగో ఆ పత్రాలు " అంటూ ఆ బాండు పేపర్లు శివయ్యకు అప్పగించాడు.

మనసులో సదాశివుడికి నమస్కరించాడు 'సరే శివయ్య' .


--------------శుభం ---------------


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి


238 views0 comments

Comments


bottom of page