top of page

డిటెక్టివ్ ప్రవల్లిక - Episode 1 (అతడే హంతకుడు)


Podcast LinkDetective Pravallika - Episode 1 Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


రాత్రి రెండు గంటలకు ఫోన్ మ్రోగడంతో ఒకింత ఆశ్చర్యం తో ఫోన్ తీశాడు డిటెక్టివ్ పురంధర్. అటు వైపు నుండి ఏ సి పి ప్రతాప్. ‘మళ్ళీ ఏదో కిడ్నాప్ లేదా మర్డర్ కేసు అయి వుంటుంది’ అనుకుంటూ "చెప్పండి ప్రతాప్ గారూ! " అన్నాడు.

"ఈ టైములో ఫోన్ చేసినందుకు ముందుగా సారీ. నాతోపాటు మర్డర్ స్పాట్ కు వస్తున్నందుకు అడ్వాన్స్ గా థాంక్స్" చెప్పాడు ప్రతాప్.

"మీరు స్వయంగా పిలిస్తే తప్పేదేముంది? స్పాట్ చెప్పండి."

"బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14 ,న్యూ లిఖిత అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 305 "

"అంటే మా ఇంటి దగ్గరే. మై గాడ్ ! ఎవరు?"

"మీ ఇంటి డోర్ తీస్తే చెబుతాను. మీ ఇంటికి వస్తూ ఫోన్ చేశాను." అన్నాడు ప్రతాప్. వెంటనే బెడ్ రూమ్ నుండి హాల్ లోకి వచ్చాడు పురంధర్.బయట పోలీస్ జీప్ ఆగిన శబ్దం వినిపించింది.

డోర్ తీసి ప్రతాప్ ను ఇంట్లోకి ఆహ్వానించాడు .

"పురంధర్ గారూ ! న్యూ లిఖిత అపార్ట్మెంట్ లో రిటైర్డ్ లెక్చరర్ సంజీవ రావు గారు తెలుసు కదా . అయన భార్య కొద్దిసేపటి క్రితం హత్యకు గురైంది." హాల్ లో వున్న సోఫాలో కూర్చుంటూ చెప్పాడు ఏ సి పి ప్రతాప్.

"ఆవిడ పేరు వర్ధనమ్మ . వాళ్ళు మా ఫామిలీ ఫ్రెండ్స్. మా ఆవిడ శారదకు,అమ్మాయి ప్రవల్లికకు కూడా బాగా తెలుసు." అంటూ బాధపడ్డాడు పురంధర్.

"మనం వెంటనే అక్కడికి వెడదాం. చెల్లెమ్మకు, ప్రవల్లికకు ఉదయం చెబుదాం. ఈ టైములో వాళ్ళను డిస్టర్బ్ చెయ్యడం ఎందుకు? " అన్నాడు ప్రతాప్ .

"ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరికి చెప్పి వెళ్లడం నా అలవాటు " అంటూ ప్రవల్లిక గది వైపు వెళ్ళాడు పురంధర్ .అంతలో తలుపు తెరుచుకుని బయటకు వచ్చిన ప్రవల్లిక,తన తండ్రిని, ఏ సి పి ప్రతాప్ ను చూసి విష్ చేసింది.

"బయట వెహికల్ ఆగిన శబ్దంతో మెలకువ వచ్చింది. హాల్ లో మాటలు వినిపించడంతో బయటకు వచ్చాను ." అంది.

"ఓకే బేబీ. మేము ఒక ముఖ్యమైన విషయంగా బయటకు వెడుతున్నాం. వివరాలు తిరిగి వచ్చాక చెబుతాను. మేము వెళ్ళాక డోర్ లాక్ చేసుకో. "అని చెప్పి తన గదిలోకి వెళ్లి డ్రెస్ మార్చుకొని వచ్చాడు పురంధర్.

"అలాగే డాడ్. ఇప్పుడేం డిస్టర్బ్ చెయ్యనులే. మీరు బయలుదేరండి.” అంది ప్రవల్లిక.

"గత నెల కిడ్నాప్ కేసులో నువ్వు చేసిన సహాయం మరచిపోలేదు.ఉదయం వచ్చి నీ హెల్ప్ అడుగుతాను ప్రవల్లికా." అంటూ తను కూడా పురంధర్ వెంట బయటకు నడిచాడు ప్రతాప్.వాళ్ళు వెళ్ళగానే డోర్ లాక్ చేసింది ప్రవల్లిక.

రిటైర్డ్ లెక్చరర్ సంజీవ రావు గారు వున్నన్యూ లిఖిత అపార్ట్మెంట్ అక్కడికి దగ్గరే. సరిగ్గా రెండు నిమిషాల్లో ఆ అపార్ట్మెంట్ దగ్గర జీప్ ఆగింది. అపార్ట్మెంట్ గేట్ దగ్గర కాపలా ఉన్న పోలీసులు ప్రతాప్ కు సెల్యూట్ చేశారు .థర్డ్ ఫ్లోర్ లో వున్న 305 ఫ్లాట్ దగ్గరకు చేరుకున్నారు ఇద్దరూ. బయట ఇద్దరు పోలీసులు కాపలా ఉన్నారు.లోపల సోఫాలో సంజీవ రావు కూర్చుని ఉన్నాడు. బాగా ఏడ్చినట్లు అతని ముఖం మీది కన్నీటి చారికలు చూస్తే తెలుస్తుంది.

వీళ్ళను చూడగానే లేచి నిలబడ్డాడతను.ప్రతాప్ కు నమస్కరించి , పురంధర్ భుజం మీద తల వాల్చి భోరుమని ఏడ్చాడు.

"ఊరుకోండి సంజీవరావు గారూ .మీ బాధను మేము అర్ధం చేసుకోగలం. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో మాకు తెలీడం లేదు.మేము చెయ్యగలిగింది ఒక్కటే. మీరు కాస్త ఓపిక తెచ్చుకుని సహకరిస్తే వీలయినంత త్వరగా ఆ హంతకుడిని పట్టుకోగలం" అన్నాడు పురంధర్.

"ఖచ్చితంగా సహకరిస్తాను పురంధర్ గారూ .ఎవ్వరికీ అపకారం చెయ్యని వాళ్ళం. ఎవరితోనూ మాకు గొడవలు లేవు. ఇక నా భార్య వర్ధనమ్మ గురించి మీకు చెప్పనవసరం లేదు. పనివాళ్ళనైనా ఏకవచనంలో సంబోధించదు. ఎంతో గౌరవంగా మాట్లాడుతుంది. అలాంటి మనిషిని దారుణంగా...." చెబుతూ ఉండగానే దుఃఖంతో సంజీవరావు గొంతు పూడుకొని పోయింది. అంతలోనే తమాయించుకొని " ముందు శవాన్ని చూద్దురు గానీ రండి." అంటూ బెడ్ రూమ్ వైపు నడిచాడు. అతనితో పాటే లొపలికి ప్రవేశించారు పురంధర్, ప్రతాప్ లు. లోపల బెడ్ మీద వెల్లకిలా పడివుంది వర్ధనమ్మ శవం. తలమీద ఎవరో సుత్తితో బలంగా చాలాసార్లు మోదినట్లు ధారగా కారిన రక్తాన్ని బట్టి తెలుస్తోంది. కళ్ళు తిరిగి పడబోతున్న సంజీవరావును గట్టిగ పట్టుకుని హాల్ లోకి తీసుకుని వచ్చారు ప్రతాప్, పురంధర్ లు. ఆయన్ని నెమ్మదిగా సోఫాలో కూర్చోబెట్టారు. కాస్సేపటికి తనను తాను తమాయించుకొని జరిగిన విషయాన్నిచెప్పడం ప్రారంభించాడు సంజీవరావు." నిన్న రాత్రి పదకొండు గంటలకు, ఇదే అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న నా స్నేహితుడు నారాయణరావు భార్య ఫోన్ చేసింది.

'అన్నయ్యగారు !ఈయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. చాల ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాలి ' అంటూ అభ్యర్ధించింది. నా భార్య వర్ధనమ్మ మంచి నిద్రలో ఉంది. రాత్రి పడుకునేటప్పుడే ఒంట్లో బాగాలేదని చెప్పింది. అందుకని తనని నిద్ర లేపకుండా బయటనుంచి తాళం వేసుకొని వెళ్ళాను. ఒకవేళ తను నిద్రలేచి నేను ఇంట్లో లేనని తెలుసుకుంటే నా సెల్ కు ఫోన్ చేస్తుంది. అప్పుడు విషయం చెప్పవచ్చు అనుకున్నాను. సెకండ్ ఫ్లోర్ లో వున్న నారాయణరావు ఇంటికి వెళ్ళాను. సోఫాలో నిస్త్రాణంగా పడివున్నాడతను. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దై వుంది. నన్ను చూడగానే బిగ్గరగా ఏడ్చేసింది అతని భార్య.

'భయపడకమ్మా ! వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ చెయ్యాలి. నా కారులో తీసుకుని వెడదాం'అని చెప్పాను. వాచ్ మాన్ సహాయంతో ఆయన్ని క్రిందికి దించి నా కారులో దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తీసుకోని వెళ్ళాం. డాక్టర్ ఆయన్ను పరిశీలించి ప్రాణాపాయం లేదనీ, రెండు రోజులు అబ్సర్వేషన్ లో ఉండాలనీ చెప్పారు.ఈలోగా నారాయణరావు సోదరులు హాస్పిటల్ కు చేరుకోవడంతో, నారాయణరావు భార్య నా వద్దకు వచ్చి 'అన్నయ్యగారూ ! ఇక మీరు ఇంటికి వెళ్ళండి .ఇప్పటికే చాలా శ్రమ తీసుకున్నారు. ఇంటిదగ్గర వర్ధనమ్మగారు ఒక్కరే ఉన్నారు.' అనడంతో నేను ఇంటికి వచ్చాను.

నేరుగా బెడ్ రూమ్ లోకి వెళ్ళాను.

అంతే !

మంచం మీద రక్తపు మడుగులో పడి ఉన్న నా భార్యను చూడగానే నా గుండె ఆగినంత పనయ్యింది. వొళ్ళు తూలుతున్నట్లనిపించింది.క్రింద పడకుండా బలవంతంగా నిలదొక్కుకున్నాను.వాచ్ మాన్ కు ఫోన్ చేసి వెంటనే పైకి రమ్మన్నాను.

'ఏమైంది సర్ ?' ఆందోళనగా అడిగాడతను." అర్జెంట్ గా పైకి రా' అని ఫోన్ పెట్టేసాను.పైకి వచ్చిన వాచ్ మాన్, నా భార్య శవాన్ని చూడగానే కేకలు పెట్టుకుంటూ బయటకు పరుగెత్తాడు. కాస్సేపటికి చుట్టుపక్కల వాళ్ళు గుమికూడారు. నాకు మీరు మాత్రమే సహాయం చెయ్యగలరనిపించింది. మీకు ఫోన్ చేద్దామనుకునే లోపే ఈ ఏరియా ఎస్ ఐ వచ్చారు. కొన్ని వివరాలు అడిగారు. వారితో మీరు నాకు తెలుసని చెప్పాను. తరువాత ఆయనే మీకు ఫోన్ చేసారు " చెప్పడం ముగించాడు సంజీవరావు.

తరువాత ఏ సి పి ప్రతాప్, పురంధర్ తో మాట్లాడుతూ " ఎస్ ఐ ఫోన్ చేసి మర్డర్ విషయం చెప్పాడు. సంజీవరావు మీకు ఫామిలీ ఫ్రెండ్ అని కూడా చెప్పాడు. పైగా ఇది మీ ఏరియా . అందుకే నేరుగా మీ ఇంటికి వచ్చాను" అన్నాడు. ప్రతాప్ గారూ ! మనం మరొక్కసారి గదిలోకి వెళదాం. సంజీవరావు గారూ ! మీరు ఇక్కడే ఉండండి." అంటూ బెడ్ రూమ్ లోకి నడిచాడు. హత్యకు వాడిన సుత్తి బెడ్ ప్రక్కనే నేలమీద పడివుంది. దానికి రక్తపు మరకలు అంటి వున్నాయి. కర్చీఫ్ తో దాన్ని పైకెత్తి పరిశీలనగా చూసాడు పురంధర్. దానికి అక్కడక్కడా చిన్నపేపర్ ముక్కలు అంటుకొని ఉన్నాయి. సుత్తి మీద పడ్డ వేలి ముద్రలు టిష్యూ పేపర్ తో తుడిచినట్టు వెంటనే పసిగట్టాడు .ఒక్క క్షణం అటూ ఇటూ పరిశీలించి మూలనున్న డస్ట్ బిన్ వద్దకు వెళ్ళాడు. అది ఖాళీగా ఉంది. వాష్ బేసిన్ వద్దకు వెళ్లి చూసాడు. టిష్యూ పేపర్ తాలూకు తునకలు ఒకటి రెండు కనిపించాయి.

"ఇది చాలా ప్లాన్డ్ గా జరిగిన హత్య. మాములుగా అయితే సంజీవరావునే అనుమానించాలి. ఇంట్లో వాళ్లిద్దరే ఉన్నారు. సరిగ్గా హత్య జరిగే సమయానికి అతను ఇంటికి తాళం వేసుకొని బయటకి వెళ్లడం, తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం అలాగే వేసి ఉండడం చూస్తే అతని మీదే అనుమానం కలుగుతుంది. కానీ అతను నాకు స్వయంగా తెలుసు. అతనిది నేర ప్రవృత్తి కాదు .పైగా వారిద్దరి మధ్య ఏవిధమైన పొరపొచ్చాలూ లేవు " ప్రతాప్ తో చెప్పాడు పురంధర్.

" నిజమే పురంధర్ గారూ ! అతడు మీకు తెలిసిన వాడు కాక పోయి వుంటే మేము అతన్నే ముందుగా అనుమానించే వాళ్ళం. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించే వాళ్ళం . పరిస్థితులన్నీ అతనికి వ్యతిరేకంగా వున్నాయి. కానీ మనమిద్దరం కలిసి ఎన్నో కేసులు పరిశోధించాం. నేరస్తుణ్ణి పసిగట్టడంలో మీ అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. ఆ ఒక్క కారణంతోనే నేను అతడిని అనుమానించడం లేదు." అన్నాడు ప్రతాప్.

" నామీద ఉన్న నమ్మకానికి థాంక్స్ ప్రతాప్ గారూ . ఈ విషయంలో కూడా మీ నమ్మకం తప్పుకాదు. అసలు నేరస్తుడిని పట్టుకొని మీ ముందు నిలబెడతాను. .ఒకసారి ఈ బిల్డింగ్ వాచ్ మాన్ ను పిలిపించండి. కొన్ని వివరాలు అడగాలి. ఏవైనా క్లూస్ దొరకవచ్చు."ప్రతాప్ తో చెప్పాడు పురంధర్.

వెంటనే ప్రతాప్ అపార్ట్మెంట్ క్రింద జనాలను కంట్రోల్ చేస్తున్న ఎస్ ఐ కి ఫోన్ చేసి వాచ్ మాన్ ను పైకి తీసుకుని రమ్మన్నాడు. వాచ్ మాన్ ను వెంటబెట్టుకొని పైకి వచ్చాడు ఎస్ ఐ. వాచ్ మాన్ చేతులు కట్టుకొని ఇద్దరికీ నమస్కరించాడు. అతని వంక తీక్షణంగా చూసాడు పురంధర్. కొద్దిగా తడబడ్డాడతను.

"నీ పేరేమిటి?"

"కేశవులు సార్".

"ఇక్కడ ఎన్నేళ్ళనుంచి పని చేస్తున్నావ్?

""రెండేళ్లనుంచి సర్"

"అంతకుముందు?"

"విష్ణు అపార్ట్మెంట్ లో సర్"

"అక్కడ ఎందుకు మానేశావ్?"

".............."

"నిన్నే అడుగుతున్నది."

"జీతం తక్కువనీ...."

ప్రతాప్ వంక చూసాడు పురంధర్." ఏ సి పి గారూ. విష్ణు అపార్ట్మెంట్ సెక్రటరీని పిలిపించండి. ఇతను అక్కడ పని మానేశాడా లేక వాళ్లే తీసేసారా కనుక్కోవాలి".

పురంధర్ కాళ్ళ మీద పడ్డాడు వాచ్ మాన్ కేశవులు."అబద్దం చెప్పాను సర్ . స్నేహితుడి బలవంతం మీద ఒకసారి మందు పార్టీ చేసుకుంటే వాళ్లకు కోపం వచ్చి తీసేసారు . మళ్ళీ ఎప్పుడూ ఆ జోలికి పోలేదయ్యా! కావాలంటే ఈ అపార్ట్మెంట్ లో ఎవర్నైనా అడగండి." అంటూ పురంధర్ ను బ్రతిమాలాడుకున్నాడు.

"సరే. పైకి లే. నీ సంగతి తర్వాత విచారిస్తాను . ప్రతాప్ గారూ ! ఎదురు ఫ్లాట్ వాళ్ళు మేలుకొని వుంటే ఒకసారి మాట్లాడుదాం ".

ఎస్ ఐ బయటకు వెళ్లి చూసి వచ్చి ,"సార్.వాళ్ళు మేలుకొని ఉన్నారు." అని చెప్పాడు. ప్రతాప్ తో కలిసి ఎదురు ఫ్లాట్ లోకి వెళ్ళాడు పురంధర్. ఆ ఫ్లాట్ లో ఒక క్లాత్ స్టోర్ యజమాని ఉంటున్నాడు. వీళ్ళను సాదరంగా లోపలి ఆహ్వానించాడు అయన . " సార్.సంజీవరావు గారు గానీ, వాళ్లావిడగానీ చాల మంచి వాళ్ళు. ఎవరితోనూ వివాదాలు లేవు. బాగా సర్దుకుపోయే మనస్తత్వం." వాళ్ళ గురించి తన అభిప్రాయం చెప్పాడతను. నిస్సహాయంగా తల పట్టుకొని కూర్చున్నాడు ఏ సి పి ప్రతాప్. ఎవరి నోట విన్నా సంజీవరావు గురించి మంచిగానే వినబడుతోంది. ఇక వర్ధనమ్మ గారి గురించి చెప్పనక్కరలేదు. ఎవరితోనూ వివాదాలు లేని మనిషి. ఆమెను ఎవరు ఎందుకు హత్య చేశారు పెద్ద మిస్టరీగా మారుతోంది. ఈ కేసును ఎలా పరిష్కరించాలో అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అతను. అంతలో అతని ఫోన్ మ్రోగింది కాల్ చేసింది ప్రవల్లిక కావడంతో ఆశ్చర్యపోతూ తన ఫోన్ ను పురంధర్ కు చూపించాడు. మనసులోనే నవ్వుకున్నాడు డిటెక్టివ్ పురంధర్. "పనిమీద ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నేను కోప్పడతానని, మీకు చేసి ఉంటుంది. ఇలా ఇవ్వండి ప్రతాప్ గారూ. మన అదృష్టం బాగుండి, ఏదైనా క్లూ దొరికివుంటుందేమో. " అంటూ ఫోన్ అందుకున్నాడు పురంధర్. “"బేబీ ! నేను డాడీని మాట్లాడుతున్నాను. చెప్పు " అన్నాడు కూతురితో . "నాన్నా! వాచ్ మాన్ ను ఎక్కడికీ వెళ్లనివ్వద్దు. వీలైతే అదుపులోకి తీసుకొమ్మని ప్రతాప్ అంకుల్ కి చెప్పండి. అలాగే వర్ధనమ్మ గారి బంధువుల అబ్బాయి ఎవరో ఉన్నాడట. అతని గురించి ఎంక్వయిరీ చెయ్యండి. ప్లీజ్ " అంది ప్రవల్లిక. "అలాగేనమ్మా ! తప్పుకుండా. మేము ఇప్పుడే ఇంటికి వస్తున్నాం." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు పురంధర్. తరువాత ప్రతాప్ వైపు తిరిగి "వాచ్ మాన్ ను వెంటనే అదుపులోకి తీసుకోండి"అన్నాడు. ప్రతాప్ వెంటనే ఎస్ ఐ ని పిలిచి వాచ్ మాన్ ను స్టేషన్ కు తీసుకొని వెళ్ళమని, ఎవరికీ ఫోన్ చెయ్యనీయవద్దని చెప్పాడు. తరువాత ఇద్దరూ పురంధర్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ శారద, ప్రవల్లిక వీరి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంట్లోకి వెళ్ళగానే ప్రతాప్ "అమ్మా ప్రవల్లికా! ఈ కేసు ఇల్లు కదలకుండానే నువ్వు పరిష్కరించినట్లున్నావు. వివరాలు చెప్పమ్మా." అన్నాడు. "ఇందులో నా గొప్పేమీ లేదు అంకుల్. అనుకోకుండా కొన్ని వివరాలు తెలిసాయి. అంతే." అంది ప్రవల్లిక. "గొప్ప స్థాయికి వెళ్లబోయే వాళ్ళ లక్షణం అదే. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటారు, మీ నాన్నగారిలాగా ' అన్నాడు ప్రతాప్ . సిగ్గుపడింది ప్రవల్లిక. "మీలాంటి గొప్ప పోలీస్ ఆఫీసర్ , నాన్న లాంటి ఫేమస్ డిటెక్టివ్ ముందు నాలాంటి చిన్న అమ్మాయిని పొగుడుతుంటే కాస్త ఇబ్బందిగా ఉంది అంకుల్. నిజానికి ఎక్కడికి వెళుతున్నారో మీరు చెప్పలేదు. కానీ హత్య జరిగింది మన వీధి లోనే. ఇంటికి దగ్గర్లోనే. కాబట్టి మీరు వెళ్లిన కాస్సేపటికే వర్ధనమ్మ గారు హత్యకు గురైన విషయం, మీరు ఆ అపార్ట్మెంట్ కి వెళ్లిన విషయం నాకు తెలిసి పోయింది. ఇక అసలు విషయానికి వస్తాను. సంజీవరావు దంపతులకు పిల్లలు లేరు. బోలెడు ఆస్తులు ఉన్నాయి. వర్ధనమ్మ గారి అక్క కొడుకు జయేష్ అనే వ్యక్తి హైదరాబాద్ లోనే హాస్టల్ లో వుంటూ చదువుకుంటున్నాడు. అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వస్తుంటాడు. ఆస్తి అతనికి రాసివ్వాలని ఆవిడకు మనసులో వుంది. ఒక ట్రస్ట్ ఏర్పరచి, దాని ద్వారా అనాధాశ్రమం స్థాపించాలనేది సంజీవరావు గారి మనసులో ఉన్న అభిమతం. ఇక సంజీవరావు దంపతులు దాదాపు ప్రతినెలా పుణ్యక్షేత్రాలకు టూర్ వెళుతుంటారు. ఆలా వెళ్ళినప్పుడు దాదాపు ఒక వారం రోజులు ఇంటికి రారు. అన్ని రోజులు ఇల్లు తాళం వేసి ఉంచడం ఎందుకని మొదట్లో తన అక్క కొడుకు జయేష్ ను ఇంటికి వచ్చి ఉండమనేది. ఒకసారి టూర్ నుండి తిరిగి వచ్చాక ఒక బెడ్ రూమ్ లో ఖాళీ మద్యం బాటిల్, వాడిన పూలు కనిపించాయి. జయేష్ ను నిలదీస్తే వాచ్ మాన్ తో కలిసి పార్టీ చేసుకున్నానని , మరోసారి అలంటి పొరపాటు చెయ్యనని ,సంజీవరావుతో ఈ విషయం చెప్పవద్దని, కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాడాడు. వాచ్ మాన్ ను పిలిచి గట్టిగా మందలించింది. అతను కూడా మరెప్పుడూ ఇలా చెయ్యనని, ఎవరికీ చెప్పవద్దనీ ప్రాధేయపడ్డాడు. అప్పట్నుంచి ఊళ్లకు వెళ్ళేటప్పుడు జయేష్ కు ఇంటి కీస్ ఇవ్వడం మానివేసింది. కానీ ఆ తరువాత కూడా యాత్రలకు వెళ్లి వచ్చాక, ఇంట్లో ఎవరో మెదిలినట్లు అనిపించేది. కొన్ని వస్తువులు కనిపించకుండా పోవడం, ఆవిడ దాచుకున్న డబ్బులు తగ్గినట్లు అనిపించడం జరిగేది. ఈ విషయాలన్నీ ఆవిడ ఒకసారి అమ్మ తో చెప్పింది. అప్పుడు నేను అక్కడే వున్నాను. ఆవిడ నాతో "అమ్మా ప్రవల్లికా ! ఈ మధ్య నువ్వు కూడా డిటెక్షన్ చేస్తున్నావటగా. ఈ విషయం కూడా చూడమ్మా. నీ ఫీజు ఇచ్చుకుంటాలే.' అంది. "ఇందులో డిటెక్షన్ అవసరం ఏముంది? జయేష్ ఇంటి కీస్ కు డూప్లికేట్ చేయించుకొని ఉంటాడు." అన్నాను నేను. "ఈయన ఈ మధ్య అనాధాశ్రమం ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు. జయేష్ సరిగ్గా ఉండి ఉంటే మా ఆస్థి మొత్తం అతనికే ఇచ్చేవాళ్ళం. కానీ ఆ అబ్బాయి చెడు దారిలో నడుస్తున్నాడు." అని చెప్పి బాధ పడిందావిడ. ఇక సంజీవరావు గారి ఎదురు పోర్షన్ వాళ్ళను మీరు కలిశారు కదా. మీరు బయటకు వచ్చాక ఆవిడ అమ్మకు ఫోన్ చేసింది. ఎదురింటికి వాళ్ళు లేనప్పుడు జయేష్, వాచ్ మాన్ వస్తుంటారనీ, పోలీసులతో చెప్పడం ఎందుకని ఈ విషయం మీరు వచ్చినప్పుడు చెప్పలేదనీ అందావిడ. ఈ విషయాలను బట్టి జయేష్, వాచ్ మాన్ కలిసి ఈ హత్య చేసి ఉంటారని నాకనిపించింది. అందుకే వాచ్ మాన్ ను అదుపులోకి తీసుకొమ్మని చెప్పాను." చెప్పడం ముగించింది ప్రవల్లిక. తన విశ్లేషణను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు పురంధర్, ప్రతాప్ లు. "బేబీ ! కేసు తొంభై శాతం పరిష్కరించావ్. మిగిలిన పది శాతమైనా ప్రతాప్ అంకుల్ కు మిగిలించు." అని ప్రవల్లికతో అన్నాడు పురంధర్. తరువాత ప్రతాప్ వంక తిరిగి " మీరు వెంటనే వాచ్ మాన్ ను కలిసి పూర్తి వివరాలు రాబట్టండి. జయేష్ ఎక్కడ వుంటాడో కనుక్కుని అరెస్ట్ చెయ్యండి." అన్నాడు. పురంధర్ కు, ప్రవల్లికకు థాంక్స్ చెప్పి వెంటనే బయలు దేరాడు ప్రతాప్. మరో రెండు గంటల తర్వాత పురంధర్ కు ఫోన్ చేసాడు. "డిటెక్టివ్ గారూ. వాచ్ మాన్ ను గట్టిగా అడిగే సరికి జయేష్ ఆచూకీ చెప్పాడు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసాం. నాలుగు తగిలించేసరికి అన్ని విషయాలూ బయటికి వచ్చాయి. ప్రవల్లిక ఊహించినట్లే వాళ్ళు ఇంటి కీస్ కి డూప్లికేట్ సెట్ చేయించుకున్నారు. సంజీవరావు ఫామిలీ ఊరికి వెళ్ళినప్పుడు వాచ్ మాన్ జయేష్ కు ఆ విషయం చెబుతాడు. వాళ్ళు తిరిగి వచ్చేవరకు ఆ అపార్ట్మెంట్ ను అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటారు. ఇక సంజీవరావు అనాధాశ్రమం ఏర్పాటు పనులు ముమ్మరం చేయడంతో జయేష్ , వాచ్ మాన్ లు కలిసి అతన్ని వీలు దొరికినప్పుడు చంపేయాలని అనుకున్నారు. రాత్రి సంజీవ రావు బయటకు వెళ్లడంతో వాచ్ మాన్ ఆ విషయాన్నిజయేష్ కు చెప్పాడు. వెంటనే వాళ్ళ ప్లాన్ మారింది. డూప్లికేట్ తాళాలతో ఇంట్లోకి వెళ్లి,వర్ధనమ్మను చంపేశారు. హత్యకు ఇంట్లోనే ఉన్న సుత్తిని వాడుకున్నారు. దాని మీద పడ్డ వేలిముద్రలను టిష్యూ పేపర్ తో తుడిచేశారు. ఆ పేపర్ ను ముక్కలు చేసి వాష్ బేసిన్ లో వేసి నీళ్లు తిప్పారు. ఇల్లు లాక్ చేసుకుని వెళ్లిపోయారు. లాక్ చేసిన ఇంట్లో హత్య జరగడంతో అందరూ సంజీవరావును అనుమానిస్తారనీ, ఒకవేళ అతను కేసు నుంచి తప్పించుకున్నా అతన్ని కూడా హత్య చేసి , ఆత్మహత్యగా చిత్రీకరించవచ్చనీ ప్లాన్ చేసారు. సంజీవరావు ఆస్తిలో వాచ్ మాన్ కు కూడా మంచి వాటా ఇస్తానని జయేష్ చెప్పడంతో అతను జయేష్ కు అన్ని విధాలా సహకరించాడు."చెప్పడం ముగించాడు ప్రతాప్. "ప్రతాప్ గారూ. వర్ధనమ్మ గారు, జయేష్ గురించి శారద తో చెప్పడం, ఆ సమయానికి అక్కడ ప్రవల్లిక ఉండడం మనకు బాగా ఉపయోగ పడింది. ఇక సంజీవరావు ఫామిలీ వూళ్ళో లేనప్పుడు అపార్ట్మెంట్ దుర్వినియోగం కావడం అక్కడి వాళ్లకు తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళు పోలీసులకు చెబితే లేనిపోని సమస్యలు వస్తాయని మిన్నకుండి పోయారు. ప్రజల్లో ఉండే ఈ ఫీలింగ్ మీరు ఏ సి పి గా వచ్చాక చాలావరకు తగ్గింది. కానీ జనాల్లో ఇంకా మార్పు రావాలి. పోలీసులకు సహకరించడం తమ బాధ్యత అని అందరూ గ్రహించాలి " అన్నాడు పురంధర్. భర్త ఫోన్ పెట్టేసాక శారద మాట్లాడుతూ "అమ్మాయి కూడా మీలాగా డిటెక్టివ్ అవుతానంటుంటే తనవల్ల ఏమవుతుందనుకున్నాను. కానీ తను కూడా మీ లాగా షార్ప్ గా ఆలోచించగలదని నిరూపించుకుంటోంది." అంది ఆప్యాయంగా కూతురి తల నిమురుతూ. అందంగా సిగ్గు పడింది ప్రవల్లిక.

(ఎపిసోడ్ 2 త్వరలో )

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).

425 views0 comments

Comments


bottom of page