top of page

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 3 - దొంగ దొరికాడు(పార్ట్ 2)

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Detective Pravallika Episode 3 - Donga Dorikadu part 2' Telugu Web Series written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

" ఇంకెవరు? ఆ సూరజ్ చేసివుంటాడు ఈ దొంగతనం! నేనెప్పుడో కనిపెట్టేసాను. అలాగని నిన్ను తక్కువ చేస్తున్నానని అనుకోకు ప్రవల్లికా! నా ఊహకు నువ్వు ఆధారాలు సంపాదించావు. నీకు చెప్పిన బహుమానం తప్పకుండా ఇస్తాను" అంది విజయమ్మ.

"సూరజ్ కాదు ఆంటీ " అంది ప్రవల్లిక.

నిర్ఘాంతపోయింది విజయమ్మ.

అంతవరకు మౌనంగా ఉన్న వీరేశం " నాకు తెలుసమ్మా! అసలు దొంగ నా మరదలు సుచిత్ర. నేను చెబితే బాగుండదని నిన్ను పరిశోధించమని చెప్పాను" అన్నాడు.

"సారీ వీరేశంగారూ! మీ ఊహ కూడా తప్పు."అంది ప్రవల్లిక.

ఉలిక్కి పడ్డాడు వీరేశం. ఒకసారి చుట్టూ చూసాడు. హాల్ లో ఉన్న గన్ మాన్, అనుచరులను దూరంగా వెళ్ళమన్నాడు.

చెప్పడం ప్రారంభించింది ప్రవల్లిక.

ఎవరూ మధ్యలో మాట్లాడకండి. ఏమైనా సందేహాలుంటే నేను చెప్పడం ముగించాక మాట్లాడండి.

నిన్న మధ్యాహ్నం వరకూ అమ్మవారి మెడలో ఉన్న నగ సాయంత్రానికి మాయమయింది. ఆ సమయంలో బయటనుంచి వచ్చింది సూరజ్ మాత్రమే. అందుకే మొదట నేను కూడా అతడినే అనుమానించాను.

అతను ఆ రోజు ఎందుకు వచ్చాడని హారికని అడిగాను. తన పిన్ని నగ రిపేరు విషయంగా దినేష్ చెబితే ఫోన్ చేశానని చెప్పింది.

సుచిత్రగారి నగ ఒకటి రిపేర్ చెయ్యాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంటికి వచ్చిన సూరజ్ కు ఆ విషయం చెప్పారు విజయమ్మ గారు. తన ఫ్రెండ్ మహావీర్ కి జ్యూవెలరీ షాప్ ఉందని , అతని దగ్గర చేయిస్తానని చెప్పాడు సూరజ్. రెండు రోజులైనా నగ తిరిగి ఇవ్వక పోవడంతో విజయమ్మ గారికి కోపం వచ్చింది. హారికతో ఆ విషయం చెప్పారావిడ . సూరజ్ కి ఫోన్ చేసింది హారిక. మహావీర్ జ్యూవెలరీ షాప్ ఎక్కడ ఉందో కనుక్కొని, అక్కడికి వెళ్ళింది. రెండు రోజుల్లో రిపేర్ చేసి, ఇంటికి తెచ్చి ఇస్తానని చెప్పాడతను.

ఇక మీ ఇంట్లో పాత సి సి కెమెరా రికార్డింగ్స్ చూస్తుంటే నాలుగు రోజుల ముందు ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఉన్న బాగ్ పైన ‘మహావీర్ జువెలర్స్’ అని ఉంది. అతను ఎవరికోసమో డ్రాయింగ్ రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో ఇంట్లోనుండి వీరేశంగారు, దినేష్ అక్కడకు వచ్చారు" చెప్పడం ఆపి దినేష్ వైపు చూసింది ప్రవల్లిక .

ఉలిక్కి పడ్డాడు దినేష్.

"అతను వీరేశం గారితో మాట్లాడే లోగా దినేష్ అతన్ని మేడపైనున్న తన గదికి తీసుకొని వెళ్ళాడు.ఇందాక హారికకు సి సి కెమెరా ఫుటేజ్ లో ఆ వ్యక్తిని చూపించాను. సుచిత్ర గారి నగను సూరజ్ రిపేర్ కి ఇచ్చింది అతని దగ్గరేనని చెప్పింది హారిక. తాను అతన్ని కలిసినప్పుడు రెండు రోజుల్లో స్వయంగా ఇంటికి తెచ్చి ఇస్తానని చెప్పాడని కూడా అంది " చెప్పింది ప్రవల్లిక.


" అతను నా ఫ్రెండ్. నా కోసం వచ్చాడు. పిన్ని నగ ఇంకా రిపేర్ చెయ్యలేదని తెలిస్తే నాన్న అతన్ని కోప్పడతాడని , వెంటనే పైకి తీసుకొని వెళ్లాను" సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లుగా చెప్పాడు దినేష్.

"చూడు దినేష్! నగ తీసింది నువ్వేనని మాకు తెలిసిపోయింది. నేను ఇప్పుడు చెబుతున్నది ఎలా తెలిసిందనే విషయం మాత్రమే" అంది ప్రవల్లిక. నగ తీసింది తమ కొడుకేనని తెలియడంతో కొంతసేపు మౌనంగా ఉండిపోయారు వీరేశం దంపతులు.

ముందుగా తేరుకున్న వీరేశం కొడుకు వంక చూసి మాట్లాడవద్దన్నట్లు సైగ చేసాడు. తరువాత గొంతు పెగుల్చుకొని " నువ్వు చెప్పమ్మా" అన్నాడు.

ప్రవల్లిక మాట్లాడుతూ " సి సి కెమెరా రికార్డింగ్స్ చూస్తే దినేష్ ఏ రోజూ కుదురుగా ఇంటిపట్టున లేడు. రోజులో కనీసం నాలుగైదు సార్లు బయటకు వెళ్లి వస్తుంటాడు. అలాగే అతని కోసం స్నేహితులు ఇంటికి వస్తూ ఉంటారు. అతను మేడ పైన గదిలో వుంటే అక్కడికి, క్రింద వుంటే ఇంట్లోకి వస్తుంటారు. అలాంటిది నిన్న మాత్రం దినేష్ బయటకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అతని స్నేహితులు ఎవరూ ఇంటికి రాలేదు . దాంతో నాకు అతని మీద సందేహం కలిగింది.


ఇక హారిక అడిగినప్పుడు రెండు రోజుల్లో నగ రిపేర్ చేసి, ఇంటికి తెచ్చి ఇస్తానని చెప్పిన మహావీర్ రెండురోజుల తర్వాత నగ తీసుకొని మీ ఇంటికి వచ్చాడు. కానీ అతన్ని దినేష్ హడావుడిగా మేడమీది గదిలోకి తీసుకొని వెళ్ళాడు. నగను పరిశీలించి, అతుకు వేసినట్లు తెలుస్తోందని, పాలిష్ కూడా సరిగా చేయలేదని చెప్పాడు. జాయింట్ దగ్గర సరి చేసి , మెరుగు పెట్టి వుంచమని, సూరజ్ ను పంపించి తెప్పించుకుంటానని చెప్పాడు. నేను హారికతో కలిసి బయటకు వెళ్లి, మహావీర్ ను కలిసి ఈ విషయం కన్ఫర్మ్ చేసుకున్నాను. నిన్న నగ తీసుకొని రమ్మని హారిక చేత సూరజ్ కి ఫోన్ చేయించాడు దినేష్..

నిన్న నగను అమ్మవారికి అలంకరిస్తారని , కుటుంబ సభ్యుడిగా అతనికి ముందే తెలుసు. అందుకే సూరజ్ ను ఇంటికి వచ్చే విధంగా ప్లాన్ చేసాడు. అతని మీదకు అనుమానం వెళ్తుందని అనుకున్నాడు" అని చెప్పింది

ప్రవల్లిక.

" అడ్డు చెప్తున్నానని అనుకోకు ప్రవల్లికా! ఒక వేళ నేను నగను పూజ కాగానే తీసి దాచి వుంటే?" తన సందేహం వెలిబుచ్చాడు వీరేశం.

"డూప్లికేట్ నగను దాచి ఏం లాభం?" అంది ప్రవల్లిక.

అర్థం కానట్లు చూసారు వీరేశం,విజయమ్మలు.

" కొద్ది రోజుల క్రితం మహావీర్ ను కలిశాడు దినేష్. అసలు డైమండ్ నెక్లెస్ ను లాకర్ లో దాచి పెళ్లి సమయంలో బయటకు తెస్తామని, ఈ లోగా డూప్లికేట్ నగ చేయించి, అందరికీ చూపించడానికి దాన్ని వాడుకుంటామని చెప్పాడు.

మొదట కాస్త తటపటాయించిన మహావీర్, డూప్లికేట్ డైమండ్ నెక్లెస్ చెయ్యడానికి రెండు లక్షలు ఇస్తామని, ఒరిజినల్ లాగే అనిపించాలని దినేష్ చెప్పడంతో ఒప్పుకున్నాడు. ఒరిజినల్ నగను అన్ని యాంగిల్స్ లో ఫోటో తీసి మహావీర్ కు ఇచ్చాడు దినేష్. అలాగే నెక్లెస్ తాలూకు బిల్ ను, డైమండ్ తాలూకు సర్టిఫికెట్ ను ఫోటో తీసి మహావీర్ కు అందజేశాడు. సమయం చూసుకొని ఒరిజినల్ నగను తీసి డూప్లికేటును బీరువాలో ఉంచాడు. మీరు దాన్నే అమ్మవారికి అలంకరించారు. సూరజ్ ను నిన్న ఇంటికి వచ్చేలా చేసి ఆ డూప్లికేట్ డైమండ్ నెక్లెస్ ను మాయం చేసాడు దినేష్" చెప్పింది ప్రవల్లిక.

"అయ్యో దినేష్! ఎందుకిలా చేసావు! మేము నీకు ఏలోటు చేసాం?" అంటూ ఏడవనారంభించింది విజయమ్మ.

వీరేశం కోపంతో దినేష్ ను కొట్టడానికి ప్రయత్నించాడు.

ప్రతాప్, ప్రవల్లిక అతన్ని వారించారు.

"నా కోట్ల ఆస్తికి వారసుడు వీడు. అలాంటిది వీడు దొంగతనం చేయడం ఏమిటి? వాడు ఎప్పుడు ఎంత అడిగినా కాదనలేదు. మొన్నటికి మొన్న ఆరు లక్షలు పెట్టి స్పోర్ట్స్ బైక్ కొనిచ్చాను. మరెందుకిలా చేసాడు వీడు. ఆ నెక్లెస్ ను ఏం చేసాడు? ఎవరికి ఇచ్చాడు? కనుక్కున్నారా?" అడిగాడు వీరేశం.

" చూడండి వీరేశం గారూ! మీ అబ్బాయి ఏదడిగినా మీరు కాదనలేదు. నిజమే! కానీ మీకు చెప్పలేని ఖర్చు ఏదైనా అతనికి ఏర్పడి ఉండవచ్చు. ఏదైనా హానీ ట్రాప్ లో ఇరుక్కుని ఉండవచ్చు. ఇప్పుడు సిటీలో డ్రగ్ మాఫియా నడుస్తోంది. ఎంతోమంది సెలెబ్రిటీలు, సిటీలో ప్రముఖులు, వారి పిల్లలు ఇందులో ఇరుక్కున్నారు. బహుశా ఎవరైనా మీ అబ్బాయిని అలాంటి వాటిలో ఇరికించి బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు అడిగి ఉండవచ్చు" అన్నాడు ప్రతాప్.

తరువాత ప్రవల్లిక మాట్లాడుతూ " మీరు అడిగింది నగ ఎవరు తీశారో కనుక్కోమని మాత్రమే . ఇప్పటి వరకు జరిగింది మీ ఇంటి వ్యవహారమే. మీవస్తువును మీ అబ్బాయి తీసాడు. అంతే. కానీ మేము మరింత ముందుకు వెళ్లి, మీ అబ్బాయి ఏదైనా నేరం చేసాడని తెలిస్తే ఖచ్చితంగా పోలీస్ కేసు అవుతుంది. మీకు తెలుసుగా. ప్రతాప్ గారు ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కాబట్టి, మేము వెళ్ళాక మీరే మీ అబ్బాయిని నిదానంగా అడిగి వివరాలు తెలుసుకోండి. మీకున్న పవర్ తో విషయాన్ని సాల్వ్ చేసుకోగలరు. ఒకవేళ విషయం మీ చేయి దాటిపోయిందని మీకు అనిపిస్తే ప్రతాప్ గారు సహాయం చేస్తారు" అంటూ ప్రతాప్ వంక చూసింది ప్రవల్లిక.

"అవును వీరేశం గారూ! మీరు ఆవేశం తగ్గించుకొని నిదానంగా అడిగితే మీ అబ్బాయి అన్ని వివరాలూ చెబుతాడు. అయినా మీకు మా సహాయం ఎప్పుడూ ఉంటుంది. అవసరం అయితే కాల్ చేయండి." అన్నాడు ప్రతాప్.

సిగ్గుతో తల దించుకొని ఉన్న ప్రతాప్ వంక చూసిన ప్రవల్లిక, " చూడు దినేష్! మాఫియా మనుషులు నీలాంటి ప్రముఖుల పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. నువ్వు చేసిన మొదటి తప్పు వాళ్ళ ట్రాప్ లో పడటమే. ఇంకైనా జాగ్రత్తగా ఉండు. జరిగిన విషయాలన్నీ నాన్నతో చెప్పు. ఆయనతో చెప్పడం ఇబ్బందైతే మీ అక్కయ్య హారికతో చెప్పు.

ఇక నువ్వు చేసిన రెండవ తప్పు నేరాన్ని సూరజ్ మీదకు నెట్టాలని చూడడం. తప్పు చేసిన నువ్వే తప్పించుకోవాలని చూస్తే ఏ తప్పూ చేయని మనిషి నిందనెలా భరించగలడు?" అంది. నిజమేనన్నట్లు తల ఊపాడు దినేష్, తల ఎత్తకుండానే.

***శుభం***


(డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 4 - ఉదయ రాగం త్వరలో)

***శుభం***


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).

81 views0 comments
bottom of page