top of page
Original_edited.jpg

శతమానం భవతి

Updated: Jun 2, 2023

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


ree

'Sathamanam Bhavathi' Telugu Story Written By Mallavarapu Seetharam Kumar

'శతమానం భవతి' తెలుగు కథ

రచన : మల్లవరపు సీతారాం కుమార్


మరణం తధ్యమని అందరికీ తెలుసు.

అది ఈ రోజే అని తెలిస్తే ఎంతటి వారైనా, ఏ వయసు వారైనా కలత చెందుతారు.

అప్పుడు వారు పడే ఆందోళన కళ్ళకు కట్టినట్లు చూపారు రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు.

ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం


మా ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొని వుంది.

కారణం ఈ రోజుతో మా నాన్నగారికి నూరేళ్లు నిండుతాయి.

అవును. సరిగ్గానే విన్నారు.


ఈ రోజుతో ఆయనకు నూరేళ్లు నిండుతాయి.

రేపటినుండి నూట ఒకటి ప్రారంభం.


'ఊబకాయం వచ్చాకో, షుగర్, గుండె జబ్బులు వచ్చాకో వాకింగ్ మొదలు పెట్టడం కాదు' అంటూ పాతికేళ్ళనుంచే వాకింగ్, యోగాసనాలు ప్రారంభించారాయన. ఇప్పటికీ మంచి ఆరోగ్యంతో హుషారుగా ఉంటారు. తన పనులన్నీ తనే చేసుకుంటారు.


అమ్మ ఏ ఆసనాలూ వెయ్యక పోయినా, ఇంటి పనులన్నీ తనే చేసుకుంటూ ఉంటుంది.

'మితాహారం - మెరుగైన ఆరోగ్యం' అనే సూత్రాన్ని పాటిస్తూ తొంభై ఏళ్ళైనా ఆరోగ్యంగా ఉంది.


రేపు దగ్గర్లో ఉన్న ఫంక్షన్ హాల్ లో ఇద్దరినీ సత్కరించి , వాళ్ళిద్దరి దగ్గరా ఆశీస్సులు తీసుకోవాలని నిశ్చయించుకున్నాము.


దేవుడి దయవల్ల అయన ఐదుగురు సంతానం ఇంకా సజీవులమే.


మా పెద్దన్నకు డెబ్బై ఏళ్ళయితే నాలుగో వాడినైన నాకు అరవై ఏళ్ళు. మా చెల్లెలికి యాభై ఎనిమిదేళ్లు.


విదేశాల్లో ఉన్నవారితో సహా అయన మనవళ్లు మొత్తం పన్నెండు మంది ఈ రోజు పొద్దుటికే ఇంటికి చేరుకున్నారు.

దాంతో సందడి మరింత పెరిగింది.


ఈ రోజు పొద్దున టిఫిన్, క్యాటరింగ్ వాళ్లకు చెబుదామంటే మా ఆవిడ ఒప్పుకోకుండా, తోడి కోడళ్లతో కలిసి అలవోకగా తయారు చేసేసింది.


"రేపెలాగూ బయటి భోజనమేగా! ఈ రోజు భోజనం కూడా ఇంట్లో తయారు చేసేస్తాం" అంటూ ఆడాళ్ళందరూ నడుం బిగించారు.


అమెరికా నుంచి వచ్చిన పెద్దన్నయ్య కొడుకులు యిద్దరూ "కూరలు మేము కట్ చేస్తాం" అంటూ ముందుకు వచ్చారు.


దాంతో మా అన్నదమ్ములం కూడా తలా ఒక పని మొదలు పెట్టాం.

హాల్ లో చాపలు పరిచి అందరం మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నాం.


అమ్మానాన్నలను పక్కపక్కన కూర్చోబెట్టాం.

నాన్న పైకి నవ్వుతున్నట్లుగా కనిపిస్తున్నా మనసులో ఏదో బాధ పడుతున్నట్లు నాకు అనిపించింది.


భోజనాలయ్యాక మా రెండో అన్నయ్య నా దగ్గరకు వచ్చి అదే అభిప్రాయం వ్యక్త పరచడంతో నాది ఉత్తుత్తి అనుమానం కాదనిపించింది.


నాన్నను, అమ్మను కాసేపు పడుకోమన్నాం.


అమ్మ తనకు నిద్ర పట్టడం లేదంటూ కాసేపటికే బయటకు వచ్చింది.

మా చెల్లెల్ని వేరే గదిలోకి తీసుకొని వెళ్లి కాసేపు మాట్లాడింది.


ఓ పావు గంట గడిచాక బయటకు వచ్చి, తిరిగి నాన్న పడుకొని ఉన్న గదిలోకి వెళ్ళింది అమ్మ.


గదిలోంచి బయటకు రాబోతున్న చెల్లిని నలుగురు అన్నదమ్ములం కలిసి అడ్డగించి, తిరిగి గదిలోకి తీసుకొని వెళ్ళాం.


మా చెల్లెలు ఉష నవ్వుతూ, " పెద్ద విషయమేమీ లేదు" అంది.


"ఆ చిన్న విషయమే చెప్పు. నాన్న మూడీగా ఉండడం ఇంతవరకు చూడలేదు" అన్నాం మేము.


చెల్లెలు చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయాం.

అమ్మ చెల్లితో చెప్పిన విషయం సంగ్రహంగా ఇది.


నాన్నను వాళ్ళ అమ్మ ఎప్పుడూ 'శతమానం భవతి' అంటూ దీవించేది.

నిండు నూరేళ్లు బ్రతుకుతావని ఎన్నో మార్లు అనేది.


నాన్నకు పదేళ్ళప్పుడు టైఫాయిడ్ తిరగబడి కోమాలోకి వెళ్ళాడు.

అయన జాతకం ప్రకారం పదో ఏడు మరణ గండం ఉందట.


ఆ రోజు కోమాలోకి వెళ్లబోయే ముందు , తనవంకే చూస్తున్న నానమ్మతో "నువ్వేం భయపడకు. నువ్వు చెప్పినట్లు నూరేళ్లు బ్రతుకుతాను. ఈ లోపల నాకేం కాదు" అన్నాడు.


ఆశ్చర్యకరంగా రెండు రోజుల్లో కోలుకున్నాడు నాన్న.


ఇక పాతికేళ్ల వయసులో బైక్ నుండి క్రింద పడి నాన్న తలకు తీవ్రంగా గాయాలయ్యాయి.

వెంటనే హాస్పిటల్లో చేర్పించాము.


స్పృహ కోల్పోయే ముందు నాన్న చెప్పిన మాట "నూరేళ్ళ వరకు నాకేం ఢోకా లేదు. ఎవ్వరూ భయపడకండి. వారంలో లేచి తిరుగుతాను " అని.


అయన చెప్పినట్లే తొందరగానే కోలుకున్నాడు.

ఇక పోయినేడాది కరోనా బారిన పడ్డాడు నాన్న.


అప్పట్లో కరోనా చాలా తీవ్రంగా ఉంది. మంచి వయసులో ఉన్నవాళ్లు కూడా పిట్టల్లా రాలి పోతున్నారు.


"సెంచురీ జస్ట్ మిస్ అనుకుంటున్నారా? నాకింకా సంవత్సరం ఆయువు ఉంది. అమ్మ లేకున్నా ఆమె దీవెన ఉంటుంది. ఎవ్వరూ ఆందోళన పడొద్దు" అన్నారు నాన్న.


అయన ఆత్మ స్థైర్యమో, నాయనమ్మ దీవెన ఫలితమో అనూహ్యంగా కోలుకున్నారాయన.


అప్పుడు న్యూస్ పేపర్లలో కూడా 'కరోనాను జయించిన తొంభై తొమ్మిదేళ్ల వృద్ధుడు...కాదు కాదు యువకుడు" అంటూ అయన గురించి ఆర్టికల్ వచ్చింది.


చెప్పడం ముగించింది, మా చెల్లెలు ఉష. .

మాకు విషయం అర్థమైంది.


ఎన్ని గండాలు వచ్చినా తనకు నిండు నూరేళ్ళ ఆయువు ఉందనే నమ్మకం నాన్నగారిని బతికించింది.


ఇప్పుడు ఏ సమస్యా లేకపోయినా ఈ రోజుతో ఆయువు ముగుస్తుందనే ఆలోచన ఆయనను బాధిస్తోంది.


నిజానికి నాన్న జీవితమంతా ఆనందంగా గడిపాడు.

ఏ రోజూ తన గురించి భయపడలేదు.


నాన్నకు వైరాగ్య భావనాలు మెండుగానే ఉన్నాయి.

ఒకసారి తమిళనాడుకు చెందిన ఒక పీఠాధిపతి మా ఇంటికి వచ్చారు. అప్పుడు జరిగిన వేదాంత చర్చలో నాన్నగారు ఆయనను ఓడించారట.


అంత జ్ఞాని అయిన నాన్నగారికి మేము ఎలా ధైర్యం చెప్పగలం?


జీవితం ఈ రోజుతో ఆఖరు అని తెలిస్తే ఎంతటి విరాగులకైనా, ఎంత వృద్దులకైనా మనసు ఇలాగే కలత చెందుతుందేమో....


అంత సేపూ మా వెనకే వుండి, మా మాటల్ని వింటున్న మా పెద్దన్నయ్య కొడుకు సమీర్, మేము తనని గమనించడంతో బయటకు వెళ్ళిపోయాడు.


మరో పావు గంటకు సమీర్ తన లాప్టాప్ తీసుకొని నాన్న ఉన్న గదిలోకి వెళ్లడం గమనించి అతన్ని వారించాను."తాతయ్యను రెస్ట్ తీసుకోనీ రా..." అంటూ.


"మరేం పర్లేదు. గదిలో నాక్కాస్త పని వుంది" అంటూ లోపలి వెళ్లి తలుపు వేసుకున్నాడు సమీర్.

ఏమీ అనలేక ఊరుకున్నాను.


మరో పది నిముషాలకు నాన్న, సమీర్ గదిలోంచి నవ్వుకుంటూ బయటకు వచ్చారు.

ఆశ్చర్యంగా చూసాను.


ఇక అప్పట్నుంచి నాన్న అందర్నీ పలకరిస్తూ ఎప్పటికంటే మరింత హుషారుగా కనిపించారు.


మేమందరం అది గమనించి చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యాము.

ఆ రోజూ రాత్రి పడుకోబోయే ముందు అన్నదమ్ములందరం చెల్లాయితో కలిసి సమీర్ ను ఒక గదిలోకి లాక్కెళ్ళాము.


"ఒరేయ్! పెద్దవాళ్ళం మాకే నాన్నకెలా చెప్పాలో అర్థం కాలేదు. ఆయనకు చెప్పేంత జ్ఞానము, ధైర్యము మాకెవ్వరికీ లేవు.. మరి చిన్నవాడివి, నువ్వేం మాయ చేసావో చెప్పారా!" అని వాడిని బ్రతిమలాడాము.


వినయంగా కాస్త సిగ్గు పడ్డాడు సమీర్.


"మాయ ఏమీలేదు. ఇంగ్లిష్ లెక్కల ప్రకారం ఈ రోజుతో నూరు నిండుతాయి. కానీ మన తెలుగు లెక్కల ప్రకారం ఆయనకు పది రోజుల ముందే నూరేళ్లు నిండిపోయాయి. నా కంప్యూటర్ లో తిధులు లెక్క కట్టి ఆయనకు చూపించాను. డెడ్ లైన్ దాటిపోయిందని నిరూపించాను.. అయన నా మాటలకు కన్విన్స్ అయ్యారో, లేక విషయం మనం గమనించామని తెలిసి నార్మల్ గా ఉన్నట్లు నటిస్తున్నారో నా చిన్ని బుర్రకయితే అర్థం కావడం లేదు" అన్నాడు సమీర్ .


"నువ్వు చెప్పింది కరెక్ట్ రా సమీర్. ఇలాంటి విషయాల్లో మన తిధులనే నాన్నగారు నమ్ముతారు. సో అయన నిజంగానే రిలాక్స్ అయ్యారు. థాంక్స్ రా అల్లుడూ" అంది మా చెల్లాయి.


అందరి ముఖాల్లో సంతోషం వెల్లి విరిసింది, ఒక్క నా ముఖంలో తప్ప.


ఆ రోజూ రాత్రి పడుకున్నానే గానీ నాకు నిద్ర పట్టలేదు.

కారణం... నా జాతకం ప్రకారం అరవై మించి బ్రతకను.


ఇద్దరు ముగ్గురు జ్యోతిష్యులు ఇదే మాట చెప్పారు.

ఇంగ్లీష్ లెక్క ప్రకారం మరో ఆరు రోజుల్లో నాకు అరవై నిండుతాయి.


కానీ సమీర్ చెప్పిన లెక్క ప్రకారం అయితే నాన్నకు వంద ఏళ్లకు గాను పది రోజులు తేడా వచ్చింది.


ఆ లెక్కన నాకు అరవై ఏళ్లకు గాను ఆరు రోజులు తేడా వస్తుందా...

అలాగైతే నాకు ఈ రోజే ఆఖరి రోజా...


అసలు నా లెక్క కరెక్టేనా... లేదా సంవత్సరాలను బట్టి లెక్క మారుతుందా...


అసలు సమీర్ చెప్పింది నిజమా లేక నాన్నను రిలాక్స్ చెయ్యడానికి అలా చెప్పాడా…


ఇంత వరకు నాన్నను వేధించిన సమస్య నన్ను బాధించడం ప్రారంభించింది.

నిద్ర పట్టక లేచి కంప్యూటర్ ముందు కూర్చున్నాను.


నన్ను గమనించిన మా ఆవిడ "ఏమిటండీ! కొత్త కథ రాస్తున్నారా? కాస్త తొందరగా పడుకోండి. రేపు హడావిడిగా ఉంటుంది కదా. ఆ కథ మరో రోజు రాసుకోవచ్చులెండి" అంది.


'మరో రోజంటూ ఉంటేగా...ఈ రోజే ఆఖరిని నీకు ఎలా చెప్పను...' మనసులో అనుకుంటున్నాను.


"అన్నట్లు చెప్పడం మరిచాను. మీ అమ్మగారు కూడా మిమ్మల్ని నిండు నూరేళ్లు బ్రతకమని మనసులోనే ఆశీర్వదిస్తూ ఉంటుందట. కాకపోతే మీ బామ్మలా ఈవిడ బయటకు చెప్పరట. నాతో ఒకసారి చెప్పారు" అంది మా ఆవిడ నా మనసులో భావాలూ పసిగట్టినట్లుగా.


'నిజమేనా... ఏమో.. ఎందుకైనా మంచిది. నా చివరి కథను ఈ రోజే పూర్తి చేసి నా బ్లాగ్ లో పోస్ట్ చేసెయ్యాలి.


ఏమిటీ.. మీకు కూడా కాస్త కుతూహలంగా ఉందా? ఏమవుతుందోనని?


నా కథకు మీ కామెంట్స్ కి రిప్లై వచ్చిందంటే నా కథకు శుభం కార్డు పడ్డట్లే.


"ఇంతకీ మీ కథ పేరేమిటి?" ప్రశ్నించింది మా ఆవిడ.


"శతమానం భవతి" చెప్పాను నేను...


శుభం

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page