top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 6

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link


'Srivari Kattu Kathalu Episode - 6' Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో...

గౌతమ్ కు అజ్ఞాత వ్యక్తి మరో ఫోటో పంపిస్తాడు.

సమీరకు ప్రమోద్ బొకే ఇస్తున్న ఫోటో అది.

గౌతమ్ ప్రమోద్ కు కాల్ చేసి వెంటనే రమ్మంటాడు.

సమీర కనకరావుకు బొకే ఇవ్వాల్సి వస్తుంది.

ఇక చదవండి...



మరో అరగంటలో వినీత్ ఇంటికి చేరుకున్నాడు గౌతమ్.

వినీత్ పక్కనే అతని కజిన్ స్నేహ కూడా వుంది.

గౌతమ్ రాగానే ఇద్దరూ విష్ చేశారు.


స్నేహ వంక చూసాడు గౌతమ్. ఆమె ముఖంలో ఇంకా విషాద ఛాయలు పోలేదు.

"హాయ్ స్నేహా! రోజంతా ఏడుస్తూ కూర్చుంటున్నావా ఏమిటి? నీ ప్రాబ్లమ్ నేను చూస్తానన్నానుగా. ఇంకా ఏమిటి? కమాన్.. చీర్ అప్..." అన్నాడు గౌతమ్.

ఒక పేలవమైన నవ్వు నవ్వింది స్నేహ.


'నా లైఫ్ మొత్తం నాశనమైంది గౌతమ్...సందీప్ నన్ను వదిలేస్తానంటున్నాడు" ఏడుస్తూ తన ముఖాన్ని చేతుల్లో కప్పుకుంటూ లోపలి వెళ్ళిపోయింది స్నేహ.


ఆమె టెన్త్ లో గౌతమ్ క్లాస్ మేట్. వినీత్ ఆమెకు పెదనాన్న కొడుకు.

"ఏమిటిది వినీత్! తను మరీ ఎక్కువగా బాధ పడుతోంది. ఇది పెద్ద సమస్య కాదనీ, సందీప్ తో నేను మాట్లాడతాననీ నిన్న రెస్టారెంట్ కి తీసుకొని వెళ్ళినప్పుడు తనకి చెప్పాను. కన్విన్స్ అయినట్లే అనిపించింది. ఇప్పుడు చూస్తే నిన్నటికంటే డిప్ప్రెస్డ్ గా కనిపిస్తోంది" బాధగా చెప్పాడు గౌతమ్.


' ఏం చెయ్యం గౌతమ్? నిన్న రాత్రంతా ఏడుస్తూనే ఉంది.ఎక్కడ సూయిసైడ్ చేసుకుంటుందోనని రాత్రంతా నేను నిద్ర పోలేదు. సందీప్ కు కాల్ చేస్తానన్నాను.

అతను తనను బాగా అనుమానిస్తున్నాడని చెప్పింది. ఈ పరిస్థితుల్లో అతనితో మాట్లాడినా ఫలితం ఉండదని అంది. అతనికి ఆ ఫోటోలు పంపినవారిని పట్టుకుని, నిజం చెప్పిస్తే కానీ అతని అనుమానం తీరదు.


వాళ్ళు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసి వుంటే ఆ డబ్బులేవో వాళ్ళ ముఖాన కొట్టి వదిలించుకునే వాళ్ళం. వాళ్ళ ఉద్దేశం సందీప్, స్నేహాలను విడదీయడం లాగే ఉంది. ఇంతకీ ఈ పనులు చేయిస్తున్నది జయా ఆంటీ మనుషులే అన్న నీ అనుమానం నిజమేనా? " అన్నాడు వినీత్.


"ఖచ్చితంగా వాళ్లే అనిపిస్తోంది. రుజువులు దొరికితే పోలీసులకు అప్పజెప్ప వచ్చు.

మరో రెండు మూడు రోజుల్లో ఆధారాలు దొరుకుతాయి. ప్రమోద్ కాస్సేపట్లో ఇక్కడికి వస్తాడు. ఇంకొన్ని వివరాలు అతని దగ్గర్నుండి తెలుసుకోవచ్చు" అని చెప్పాడు గౌతమ్.


ఇంతలో అతని ఫోన్ మోగింది. ప్రమోద్ సెల్ నుండి కాల్ వస్తోంది.

"నేను జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉండే ట్రాఫిక్ కానిస్టేబుల్ ని మాట్లాడుతున్నాను. ఈ మొబైల్ ఉన్న వ్యక్తికి ఇప్పుడే ఆక్సిడెంట్ అయింది. పక్కనే ఉన్న నర్మదా హాస్పిటల్ కి తీసుకొని వెళ్తున్నాం. లాస్ట్ కాల్ మీ నంబర్ నుండి వచ్చింది కాబట్టి మీకు ఫోన్ చేస్తున్నాం. అతని గురించి వివరాలు మీకేమైనా తెలుసా?" అడిగాడు అవతలి వ్యక్తి.

కొంతసేపు మాట రాలేదు గౌతమ్ కు.


"మై గాడ్! నేను సరిగ్గా పది నిముషాల్లో అక్కడ ఉంటాను. అతని పేరు ప్రమోద్. అతని భార్య పేరు షాలిని. అతని మొబైల్ లో ఆమె పేరుతో చెక్ చేయండి. ఆమె నంబర్ ఉంటుంది. లేదా నేను అక్కడికి వచ్చాక కనుక్కొని మీకు చెబుతాను. నేను ఇప్పుడే బయలుదేరు తున్నాను" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.


'విషయాన్ని అప్పటికే అర్థం చేసుకున్న వినీత్ తో " నేను అర్జెంట్ గా హాస్పిటల్ కు బయలుదేరుతున్నాను. అక్కడికి వెళ్ళాక పొజిషన్ చెబుతాను. స్నేహతో నేను వెళ్లిన విషయం చెప్పు" అని చెప్పి, వెంటనే బయలుదేరాడు.


సరిగ్గా పది నిముషాల్లోనే హాస్పిటల్ దగ్గరకు చేరుకున్నాడు.

ప్రమోద్ ను అప్పుడే ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్చారు.

తనకు కాల్ చేసిన కానిస్టేబుల్ కి ప్రమోద్ కి సంబంధించిన వివరాలు చెప్పాడు గౌతమ్.

ప్రమోద్ ను ఒక కారు వెనకనుండి గుద్దేసి, ఆపకుండా వేగంగా వెళ్లిపోయిందని చెప్పాడతను.సి సి కెమెరా రికార్డింగ్స్ తెప్పించమని ఎస్ ఐ గారు చెప్పారని కూడా చెప్పాడతను. ప్రమోద్ భార్యకు కాల్ చేశాననీ, ఆమె వస్తూ ఉందని కూడా చెప్పాడు ఆ కానిస్టేబుల్.


మరో పది నిముషాల్లో షాలిని వచ్చింది.

ఆక్సిడెంట్ జరిగింది ఆ హాస్పిటల్ కు చాలా దగ్గర కావడంతో ఇక్కడ అడ్మిట్ చేశామనీ, కావాలంటే వేరే చోటికి షిఫ్ట్ కావచ్చనీ షాలినితో చెప్పాడు ఆ కానిస్టేబుల్.

హాస్పిటల్ అధికారుల్ని కలిశారు షాలిని, గౌతమ్ లు.


పరిస్థితి క్రిటికల్ గా ఉందనీ, ఈ టైం లో షిఫ్ట్ చెయ్యొద్దనీ చెప్పారు వాళ్ళు.

కొన్ని పేపర్ ల మీద షాలినితో సంతకాలు పెట్టించుకున్నారు వాళ్ళు.

"భయపడకు షాలినీ! ప్రమోద్ కి ఏమీకాదు" ధైర్యం చెప్పాడు గౌతమ్.

"గౌతమ్! నీతో ఒక విషయం చెప్పాలి" అంది షాలిని.


పక్కనే ఆ కానిస్టేబుల్ ఉండటంతో, 'అలా నడుస్తూ మాట్లాడుకుందాం" అంటూ కదిలాడు గౌతమ్.

అతన్ని అనుసరించినది షాలిని.

"కూల్ షాలినీ! ఆ ఫోటోల విషయమేగా... వాటిని నమ్మొద్దు. స్నేహ, ప్రమోద్ లు జస్ట్ ఫ్రెండ్స్" చెప్పాడు గౌతమ్.


"వాటి గురించి ప్రమోద్ తో ఇదివరకే మాట్లాడేసాను. ఆ విషయంలో ఐ యామ్ వెరీ క్లియర్.

నాకు ఇందాక ఒక ఫోటో మెసేజ్ గా వచ్చింది" అంటూ ప్రమోద్, సమీరకు బొకే ఇస్తున్న ఫోటో చూపించింది.


గౌతమ్ ఏదో చెప్పబోయేంతలో "ఆ ఫోటోను నువ్వు నమ్మలేదని నాకు తెలుసు. నేను కూడా అనుమానించలేదు. ఈ ఫోటోను నాకు పంపిన వాళ్ళు వెంటనే కాల్ చేశారు.

'ఇది ఆక్సిడెంట్ కాదు. గౌతమ్ చేయించిన మర్డర్ అటెంప్ట్. పోలీసులతో నీకు కూడా అతనిమీద అనుమానం ఉన్నట్లు చెప్పు. లేదంటే, నువ్వు గౌతంతో కలిసి ప్లాన్ చేసావని నమ్మిస్తాము. పోలీసులకు కూడా ఈ ఫోటోను పంపిస్తాము' అని చెప్పారు" చెప్పింది షాలిని.


అదిరి పడ్డాడు గౌతమ్.

"ఎంత కుట్ర జరుగుతోంది? జయా ఆంటీని తక్కువగా అంచనా వేసాను" అన్నాడు .

" భార్య మీద అనుమానంతో మీరు ఇలా చేయించినట్లు ప్లాన్ చేశారు. ఈ రోజో, రేపో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చెయ్యవచ్చు. ప్రమోద్ స్పృహలోకి వస్తే సమస్య లేదు. అంత వరకు మీరు తప్పించుకొని తిరగడం మంచిది" అంది షాలిని.


"థాంక్ యు షాలిని. ఒక రెండు రోజులు తప్పించుకొని తిరుగుతాను. నా ఫోన్ కూడా ట్రాప్ చేస్తారేమో. నువ్వు సమీరను కలిసి విషయం చెప్పు" అంటూ బయటకు వెళ్లి పోయాడు గౌతమ్.

"అతను ఎక్కడమ్మా?" ఒంటరిగా వస్తున్న షాలినిని అడిగాడు కానిస్టేబుల్.

"ఆకలిగా ఉందట. భోంచేసి వస్తానని వెళ్ళాడు" చెప్పింది షాలిని.

***

ఇక్కడ జయా ఆంటీ వాళ్ళ ఇంట్లో కనకారావుకు బాగా సన్మానం జరిగింది.

దాంతో సంతోషపడ్డ కనకారావు, జయా ఆంటీని సాయంత్రం ఇంటికి వచ్చి డొనేషన్ చెక్కు తీసుకొని వెళ్ళమన్నాడు.

"ఒక్కదాన్నే ఎలా రాను? పోనీ సమీరా... సాయంత్రం నువ్వు తోడు వస్తావా?" అర్ధించినట్లుగా అడిగింది జయా ఆంటీ.


"సారీ ఆంటీ! నాకు గౌతంతో వేరే ప్రోగ్రాం ఉంది. ఇక నేను వస్తాను" అంటూ తన అపార్ట్మెంట్ లోకి వచ్చింది సమీర.

ఇంట్లోకి వెళ్లి బెడ్ మీద వాలిపోయింది.

జరిగిన సంఘటనలన్నీ ఒకసారి మననం చేసుకొంది.

తను ఎందుకిలా ప్రవర్తిస్తోంది?


గౌతమ్ లేట్ గా ఇంటికి వచ్చాడనే కోపంతో ఆంటీకి దగ్గర కావడం ఏమిటి?

తెలిసి తెలిసి ఆ విషవలయంలో ఇరుక్కోవడమేమిటి?

ఆ కనకరావును ఆంటీ మాటిమాటికి బావగారు అనడమేమిటి?

అతని ఎదురుగా అక్కడికి వచ్చినవాళ్లు మాట్లాడే మాటలు జుగుప్సాకరంగా అనిపించాయి.


అయినా తను అక్కడే ఉండిపోయింది. ఇంకెప్పుడూ ఇలా చెయ్యకూడదు.

ఇంతకీ గౌతమ్ ఎక్కడికి వెళ్ళాడు?

ఒకసారి కాల్ చేస్తే...

అనుకున్నదే తడవుగా అతనికి కాల్ చేసింది.

ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది.


ఇదేమిటి? గౌతమ్ ఎప్పుడు ఫోన్ ఆఫ్ చెయ్యడే?

ఆలోచిస్తూ ఉండగానే ఆమెకు ఒక ఫోటో మెసేజ్ గా వచ్చింది.

అది గౌతమ్ ఒక రెస్టారెంట్ నుండి ఒక అమ్మాయితో బయటకు వస్తున్నప్పటి ఫోటో.

క్షణకాలం ఆవేశానికి లోనయ్యింది సమీర.

కానీ ఆమె విజ్ఞత ఆ ఆవేశాన్ని ఆపింది.


ఇప్పుడు తను ఆ ఫొటోలో ఉన్నది ఎవరు, గౌతమ్ కీ ఆ అమ్మాయికీ ఉన్న సంబంధం ఏమిటి అనికాదు ఆలోచించాల్సింది.

ఈ ఫోటో తనకు ఎవరు పంపారు అని యోచించాలి.

వాళ్ళ ఉద్దేశమేమిటో తెలుసుకోవాలి.


ఆమె ఇలా ఆలోచిస్తూ ఉండగానే డోర్ బెల్ మోగింది.

తీసి చూస్తే ఎవరో ఒక పాతికేళ్ల యువతి నిలుచుని ఉంది.

"మీరెవరు?" డోర్ దగ్గరే నిలబడి అడిగింది సమీర.


"ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎదురింటి షాలిని ఫ్రెండ్ ని.

మీతో ఒక విషయం చెప్పాలి" అంటూ లోపలి వచ్చి డోర్ వేసింది ఆమె.

ఆశ్చర్యంగా చూస్తున్న సమీరతో "పక్కింటి ఆంటీకి తెలియకూడదు. అందుకే డోర్ వేసాను. ఇలా వచ్చి కూర్చోండి" అందామె.

(సశేషం...)


శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 7 త్వరలో



మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 20 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).





257 views0 comments

Commenti


bottom of page