top of page

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 5 డెత్ ట్రాప్

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Detective Pravallika Episode 5 - Death Trap' written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో...

డ్రగ్ మాఫియా కేస్ లో డిటెక్టివ్ పురంధర్ గారికి సహాయం చేయడానికి ఉదయ్, ప్రవల్లిక, కిషోర్ బెంగళూరు బయలుదేరుతారు. ప్రవల్లిక అడిగే సరదా ప్రశ్నలకు అందరూ జవాబులు చెబుతుంటారు. ఇంతలో హఠాత్తుగా ఉదయ్ ఫోన్ మోగుతుంది. ఇక చదవండి.

ఫోన్ మాట్లాడుతున్న ఉదయ్ ముఖంలోని కదలికలను చదవడానికి ప్రయత్నిస్తోంది ప్రవల్లిక. కానీ అతని ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకోవడం ఆమెకు సాధ్యం కాలేదు. ఐపీఎస్ సెలెక్ట్ కావడానికి ఇదొక క్వాలిఫికేషన్ కాబోలు అనుకుంది ప్రవల్లిక. ‘చెప్పదగ్గ విషయమైతే ఫోన్ ముగిశాక అతనే చెప్తాడులే’ అని సరిపెట్టుకుంది. కానీ పావుగంట గడిచినా అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రవల్లిక, ముందు సీట్లో ఉన్న కిషోర్ తో మాట్లాడుతూ "ఉదయ్ గారికి జవాబు తట్టినట్లు లేదు. ఇక బెంగుళూరు చేరేవరకు ఆ ఫోన్ డిస్కనెక్ట్ చేయడమో" అంది కాస్త గట్టిగానే.. అతను వినాలని. అదేమీ పట్టించుకోలేదు ఉదయ్. అవతలి వ్యక్తి చెప్పే విషయాలకు అనుగుణంగా అతని ఫీలింగ్స్ స్వల్పంగా మారుతున్నాయి.

కారు ఒక ప్రదేశానికి వచ్చేటప్పటికి సిగ్నల్స్ రాకపోవడంతో "ఈసారి సిగ్నల్సు రాగానే చెబుతాను. నువ్వు కాసేపు కారు ఆపు. అర్జెంట్ కాల్ మాట్లాడుతున్నాను" అని డ్రైవర్ శివతో చెప్పాడు ఉదయ్. మరికొద్ది నిమిషాలకే సిగ్నల్స్ రావడంతో కారును ఒక పక్కగా ఆపాడు శివ. కారులోంచి కిందకి దిగి, కాస్త దూరం వెళ్లి మాట్లాడుతున్నాడు ఉదయ్.

"ఏదో సీరియస్ మేటర్ లాగే ఉంది" అన్నాడు కిశోర్.

"అవును. నాకు కూడా అలాగే అనిపిస్తోంది" అంది ప్రవల్లిక.

మరో పది నిమిషాలకు అతను ఫోన్ మాట్లాడటం పూర్తయింది. వెంటనే కార్ దగ్గరకు వచ్చి. ప్రవల్లిక, కిశోర్ లను కిందకు దిగమన్నాడు.

"మనం ఓ పది నిమిషాలు అలా మాట్లాడుకుంటూ నడుద్దాం. మన మాటలు పూర్తయ్యాక శివ కు కాల్ చేసి మన దగ్గరకు రమ్మందాం" అన్నాడు ఉదయ్.

అతను చెప్పేది ముఖ్యమైన విషయం అని గ్రహించిన ప్రవల్లిక, కిషోర్ లు మారు మాట్లాడకుండా కారు దిగారు. అక్కడే ఉండమని శివకు చెప్పి, ముగ్గురూ నడుచుకుంటూ ముందుకు వెళ్లారు.

"సారీ ఉదయ్ గారూ! సీరియస్నెస్ అర్థం చేసుకోకుండా మీరు కావాలనే ఫోన్ మాట్లాడుతున్నారని జోక్ చేశాను" అంది ప్రవల్లిక.

"ఇట్స్ ఓకే. సమయం వచ్చినప్పుడు అందుకు రిటార్ట్ ఇస్తాను. ఇద్దరూ నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. నేను ఇంతసేపూ మాట్లాడింది దినేష్ తో" అని చెప్పాడు ఉదయ్.

" దినేష్ మీకు ఫోన్ చేశాడా?" ఆశ్చర్యంగా అడిగింది ప్రవల్లిక.

" అవును ప్రవల్లికా! తను ఎలా ఆ మాఫియా చేతుల్లో ఇరుక్కున్నదీ వివరంగా చెప్పాడు. జరిగిన విషయాలు నీతో చెప్పలేక, ప్రతాప్ గారిని అడిగి నా నంబర్ తీసుకొని కాల్ చేశాడు. అతను చెప్పిందంతా మీకు చెబుతాను. తర్వాత ఏం చేయాలో అందరం కలిసి డిసైడ్ చేద్దాం" అన్నాడు ఉదయ్.

అతను చెప్పేది వినడానికి సిద్ధమయ్యారు కిషోర్, ప్రవల్లిక లు.

చెప్పడం ప్రారంభించాడు ఉదయ్.

డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలు సాధారణంగా చేసే పని ఏమిటంటే కొందరు ప్రముఖులను లేదా వారి పిల్లలను తమ గ్రిప్ లోకి ఏదో విధంగా తెచ్చుకుంటారు. తరువాత వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తూ తమ కార్యకలాపాలు సాగిస్తారు. ఇందులో భాగంగానే వాళ్లు దినేష్ పైన కన్ను వేశారు. దినేష్ ఫ్రెండ్స్ తో సరదాగా తిరిగే కుర్రవాడు. ఒక ఫ్రెండ్ పెళ్లి బెంగుళూరులో ఉండడంతో, కొంతమంది స్నేహితులతో కలిసి కారులో బయలుదేరాడు. వాళ్ల కారును డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ను ముందుగానే ఆ మాఫియా ముఠా వాళ్ళు లోబరుచుకున్నారు. కర్నూలు మరో పది కిలోమీటర్లు ఉందనగా ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. ఆ పెట్రోల్ బంక్ దాటి ఒక కిలోమీటర్ వెళ్ళగానే ఎడమవైపున ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. ముందుగా చేసుకున్న ఏర్పాటు ప్రకారం ఆ ఫామ్ హౌస్ దగ్గరకు రాగానే కారు చెడిపోయినట్లుగా నటించి రోడ్డు పక్కగా ఆపేశాడు డ్రైవర్. కారు దిగి అటు ఇటు పచార్లు చేస్తూ, మధ్య మధ్యలో సిగరెట్లు కాలుస్తూ కాలక్షేపం చేస్తున్నారు దినేష్ ఫ్రెండ్స్. ఇంతలో ఆ ఫామ్ హౌస్ లో నుండి ఒక నలభై ఏళ్ల వ్యక్తి వీళ్ళను చూసి 'ఏమైంది?' అన్నట్లుగా సైగ చేశాడు.

కారు ఆగిపోయిందని డ్రైవర్ సైగ చేసి చూపించాడు. ఆ వ్యక్తి వీళ్ళ దగ్గరకు వచ్చి "కర్నూల్ లో నాకు తెలిసిన మంచి మెకానిక్ షాప్ ఉంది. వాళ్లకు ఫోన్ చేసి ఇప్పుడే పిలిపిస్తాను. అతను వచ్చేలోగా మా ఫామ్ హౌస్ లోకి వచ్చి రెస్ట్ తీసుకోండి" అన్నాడు.

"మాకేం పర్వాలేదు గానీ, అదిగో... మినిస్టర్ గారి అబ్బాయి అక్కడ నిలుచొని ఉన్నాడు. ఆయనను మాత్రం తీసుకొని వెళ్ళు. మేమంతా ఇక్కడే ఉంటాం” అన్నాడుడ్రైవర్ అతనికి దినేష్ ను చూపిస్తూ.

తన దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తితో "అదేం అవసరం లేదండీ! నేను కూడా ఇక్కడే ఉంటాను" అన్నాడు దినేష్.

"అదేంటి బాబూ... మీ ముఖం అంతా అలా చెమటలు పట్టి ఉంది? కాసేపు రెస్ట్ తీసుకోండి. కారు రెడీ అయ్యాక వీళ్లు వచ్చి పిలుస్తారు లెండి" అంటూ తన జేబులోంచి కర్చీఫ్ తీసి దినేష్ ముఖం మీది చెమటను తుడిచాడు. దినేష్ కి ఏదో మత్తు ఆవహించినట్లయింది. కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్లుగా కూడా అనిపించింది.

" నాకు కాస్త తల తిరుగుతోంది. నేను వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకుంటాను" అని తన స్నేహితులతో అన్నాడు దినేష్.

" నేను దినేష్ కు తోడుగా ఉంటాను" అన్నాడు అతని స్నేహితుల్లో వెంకట్ అనే వ్యక్తి.

డ్రైవర్ అతని దగ్గరికి వెళ్లి , చెవిలో చిన్నగా "పక్కనున్న తోటలో హుక్కా దొరుకుతుంది. మీరందరూ అక్కడికి వెళ్ళండి. దినేష్ బాబు గారిని రెస్ట్ తీసుకోనివ్వండి. నేను కారుకు కాపలా ఉంటాను. మధ్య మధ్యలో బాబుగారికి ఏంకావాలో కనుక్కుంటాను" అన్నాడు. ఫామ్హౌస్ తాలూకు వ్యక్తి దినేష్ ఫ్రెండ్స్ తో “నేనిప్పుడే బాబు గారిని ఇంట్లో పడుకోబెట్టి వస్తాను. దగ్గర్లోనే మంచి హుక్కా సెంటర్ ఉంది. కారు రిపేర్ అయ్యేదాకా మీరు సరదాగా గడపడానికి ఏర్పాటు చేస్తాను" అని చెప్పి, దినేష్ తీసుకొని ఫామ్ హౌస్ లోకి వెళ్లాడు.

"అతనితో పాటు ఫామ్ హౌస్ లోకి అడుగుపెట్టిన దినేష్ లోపల ఎవరో అమ్మాయి ఉండడంతో బయటే ఆగిపోయాడు.

ఆ వ్యక్తి దినేష్ వంక చూస్తూ "లోపలికి రండి బాబూ! ఈ అమ్మాయి నా కూతురు. పేరు రజియా. బి టెక్ చదువుతోంది. నా పేరు దిలావర్" అంటూ దినేష్ ను లోపలికి ఆహ్వానించాడు. లోపలికి అడుగు పెట్టిన దినేష్ అప్రయత్నంగా ఆ అమ్మాయి వంక పరిశీలనగా చూశాడు. ఆ అమ్మాయికి 18 లేదా 19 ఏళ్లు ఉండొచ్చు. జీన్స్ ప్యాంట్ వేసుకొని పైన టీ షర్ట్ తో ఉంది. చూడగానే కాలేజ్ స్టూడెంట్ అని తెలిసిపోతుంది. దినేష్ ను ఆ అమ్మాయికి పరిచయం చేస్తూ "బాబు గారి పేరు దినేష్. మినిస్టర్ వీరేశం గారు తెలుసు కదా! వాళ్ళ అబ్బాయి. కారు ఆగిపోవడంతో కాసేపు రెస్ట్ తీసుకోవడానికి మన ఇంటికి వచ్చారు" అని చెప్పాడు.

ఆ అమ్మాయి దినేష్ దగ్గరకు వచ్చి చేయి జాపి " హాయ్... ఐయామ్ రజియా " అంది.

ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆమెతో చేయి కలిపిన కలిపిన దినేష్ కు ఒళ్లంతా కరెంట్ పాస్ అయినట్టు అనిపించింది. అసలే ఇందాక దిలావర్ అతని ముఖాన్ని కర్చీఫ్ తో తుడిచినప్పటినుండి ఏదో తెలియని మత్తు లో ఉన్నాడు. ఇప్పుడు రజియా ఒంటి నుండి వచ్చే పర్ఫ్యూమ్ వాసనతో మరింత మత్తు కలిగింది అతనికి.

అయినా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, "నేను బయట ఫ్రెండ్స్ తో ఉంటాను" అని దిలావర్ తో చెప్పడానికి వెనక్కి తిరిగాడు. అప్పటికే అతను తలుపు బయటనుండి గడియ పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోతూ రజియా వంక చూశాడు దినేష్.

"అదేమిటి అలా సిగ్గు పడుతున్నారు? బెడ్ రూమ్ చూపిస్తాను రండి. కాసేపు రెస్ట్ తీసుకోండి" అంటూ అతని చేతిని పట్టుకొని బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళింది రజియా. దినేష్ కి అంతా అయోమయంగా, ఏదో కలలో వున్నట్లు, గాలిలో తేలిపోతున్నట్టు అనిపిస్తోంది. అతని భుజం మీద చేయి వేసి, బెడ్ మీద కూర్చోబెట్టింది రజియా. తన భుజం మీద ఏదో సూది గుచ్చుతున్నట్లుగా చురుక్కుమంది అతనికి. తరువాత ఏం జరిగిందో అతనికి ఏమీ అర్ధం కాలేదు. స్పృహ వచ్చేసరికి ఆమెతో కలిసి బెడ్ మీద అర్థ నగ్నంగా ఉన్నాడు. అతనికి ఇంకా మత్తు వదల లేదు. అయినా అతి కష్టం మీద అ బెడ్ మీద నుంచి కిందికి దిగాడు. రజియా కూడా పైకి లేచి అతన్ని ఒకసారి గట్టిగా హగ్ చేసుకొని, "థాంక్యూ" అంది. ఇంతలో అతని స్నేహితుడు వెంకట్ ఫోన్ చేసి కారు రిపేర్ అయిందని, ఇక రావచ్చు అని చెప్పాడు. దినేష్, రజియా ఫోన్ నెంబర్ తీసుకొని బయటకు వచ్చాడు. అతని వెంటే తనూ బయటకు వచ్చింది రజియా. అప్పుడే ఫామ్ హౌస్ లోకి వస్తూ ఉన్న దిలావర్ వాళ్ళిద్దర్నీ మార్చి మార్చి చూశాడు.

తర్వాత దినేష్ వంక తిరిగి "బాబు గారూ! మీ కారు రెడీ అయ్యింది. ఇక మీరు బయలుదేర వచ్చు" అన్నాడు. అతనికి, రజియాకి థాంక్స్ చెప్పి రోడ్ లోకి వచ్చాడు దినేష్.

అతను తమ దగ్గరికి రాగానే అతని ఫ్రెండ్స్ "ఆ దిలావర్ ఎవరోగానీ మాకు మంచి హుక్కా పార్టీ ఏర్పాటు చేశాడు. డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదు. నీ బ్యాడ్ లక్! నువ్వు మిస్ అయ్యావు" అన్నారు. తరువాత అందరూ కారెక్కి బెంగళూరుకు బయలుదేరారు.

చెప్పడం ఆపాడు ఉదయ్.

"మై గాడ్! ఆ డ్రగ్ మాఫియా వాళ్ళు దినేష్ ను ఈ రకంగా లొంగదీసుకున్నారన్నమాట" అన్నాడు కిశోర్.

"మనం జర్నీ లో ఉండగానే ఈ ఫోన్ రావడం ఒకరకంగా మన అదృష్టం అని అనుకుంటున్నాను. నాకు ఇప్పటికిప్పుడే ఒక ఐడియా వచ్చింది. మీరు... ముఖ్యంగా ఉదయ్ సీరియస్ గా నేను చెప్పేది వినాలి" అంది ప్రవల్లిక.

"ఈరోజు శనివారం. మీ ఐడియా ఏంటో చెప్పండి మేడం" అన్నాడు ఉదయ్.

ఈ రోజు శనివారం కావడానికి, తను చెప్పేది అతను వినడానికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు ప్రవల్లిక కు.

"బీ సీరియస్ మిస్టర్ ఉదయ్. మనం కర్నూలుకు ఎంత సేపట్లో చేరుతాం" అని అడిగింది ప్రవల్లిక.

“మహబూబ్నగర్ దాటాం కాబట్టి మరో రెండు గంటల్లో కర్నూలు చేరుకోవచ్చు" అన్నాడు ఉదయ్.

"అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కర్నూలుకు ముందుగా ఆ ఫామ్ హౌస్ రాగానే కారు ఆపమని శివకు చెబుదాం. ఫామ్ హౌస్ లో ఉన్న వ్యక్తి కారు దగ్గరికి వచ్చినప్పుడు ఉదయ్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడని అతను వినేలా మాట్లాడుకుందాం. వాళ్లు ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం" అని చెప్పింది ప్రవల్లిక.

"సరిగ్గా నాకు కూడా ఇదే ఐడియా వచ్చింది ప్రవల్లిక గారూ! ఎందుకంటే ఏ ఆధారమూ లేకుండా ఆ డ్రగ్ మాఫియా మనుషుల కోసం ప్రయత్నించడం కంటే మనల్ని ట్రాప్ చేయడానికి వాళ్లకు ఒక అవకాశం ఇస్తే, మనమే వాళ్లను పట్టుకోవచ్చు. వాళ్ల ద్వారా మిగతా వాళ్ల వివరాలు తెలుసుకోవచ్చు. కాకపోతే ఆ ఫార్మ్ హౌస్ లో ఉన్న వాళ్ళు మెయిన్ వ్యక్తులు కారు. కాబట్టి వాళ్ళు స్వంతగా ఏ నిర్ణయమూ తీసుకోక పోవచ్చు. అన్నట్లు మీ ఐడియా కి ఒక చిన్న సవరణ చేస్తున్నాను. మనం అందరం ముందుగా నేరుగా కర్నూలు వెడదాం. అక్కడ మీ నాన్నగారికి గాని, ప్రతాప్ అంకుల్ కి గాని తెలిసిన వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని సురక్షితంగా దింపుతాం. తరువాత నేను, కిషోర్ గారు కలిసి ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తాం" అని చెప్పాడు ఉదయ్.

"అలాగేనండీ! నేను కర్నూల్ వెళ్లి, మీకోసం వంట రెడీగా చేసి ఉంటాను. మీ పని పూర్తయ్యాక జరిగిన విషయాలు చెబుతూ ఉంటే కుతూహలంగా వింటూ ఉంటాను. సరేనా?" అంది ప్రవల్లిక ఉక్రోషంగా.

" అలా కాదు మేడం! ఉదయ్ గారు చెప్పింది కరెక్టే . ముందు మిమ్మల్ని సురక్షితమైన ప్లేస్ లో ఉంచాలి" అన్నాడు కిశోర్ కూడా.

"అదేం కుదరదు. అలా భయపడేదాన్ని అయితే ఇలా డిటెక్షన్ లోకి రాను. పైగా ఇందులో పెద్దగా రిస్క్ కూడా ఏమీ లేదు. కారు దగ్గర నాకు ప్రొటెక్షన్ గా కిషోర్ గారు ఉంటారు. ఇక ఫామ్ హౌస్ లోకి వెళ్ళిన ఉదయ్ గారు రజియా ని చూసి మైమరచిపోకుండా ఉంటారనే అనుకుంటున్నాను" అంది ప్రవల్లిక.

ఈ రోజు శనివారం. మేడంగారు చెప్పినట్లే విందాం అన్నాడు ఉదయ్.

అయితే మాఫియాను వాళ్ళు ముగ్గురూ చాలా తక్కువగా అంచనా వేశారు.

జరగబోయేది వాళ్ళ ఊహకు ఎంతమాత్రం అందలేదు.

ఎపిసోడ్ 6 అతి త్వరలో.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).

.


105 views0 comments

Comments


bottom of page