top of page

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 6 డెత్ ట్రాప్ 2

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link


'Detective Pravallika Episode 6 - Death Trap 2' written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో

ఉదయ్ కి ఫోన్ చేస్తాడు దినేష్.

తనను డ్రగ్ మాఫియా వాళ్ళు ఎలా ట్రాప్ చేసారో వివరించి చెబుతాడు.

దినేష్ చెప్పిన ఫార్మ్ హౌస్ దగ్గరకు వెళ్లి , డ్రగ్ మాఫియా కంట్లో పడాలని ఉదయ్, ప్రవల్లిక, కిషోర్ లు నిర్ణయించు కుంటారు.

తరువాత చదవండి.....

"అలా అయితే డ్రైవర్ శివాను కారు స్టార్ట్ చేసి ఇక్కడికి రమ్మని చెబుదాం. వెళ్లేదారిలో అతనికి విషయం చెప్పి, అతని సహాయం కూడా తీసుకుందాం. విషయం తెలిస్తే అతను కూడా కాస్త అలర్ట్ గా ఉంటాడు" అంది ప్రవల్లిక.

"అలాగే" అంటూ కిషోర్ శివ కి ఫోన్ చేసి బయలుదేరి రమ్మన్నాడు. కార్ వచ్చాక ముగ్గురూ బయలుదేరారు. వెళ్లేదారిలో కిషోర్, శివ కు క్లుప్తంగా విషయాన్ని చెప్పి ఫామ్ హౌస్ దగ్గర కారు ఆపాలని చెప్పాడు.

శివ చాలా ఎగ్జయిట్ అవుతూ "ఏదో డిటెక్టివ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నంత ఉత్సాహంగా ఉంది. మీరు చెప్పినట్లే ఫామ్ హౌస్ దగ్గర కారు ఆపుతాను. అవసరమైతే చిన్నపాటి ఫైట్స్ కూడా చెయ్యగలను" అన్నాడు శివ.

"అంత అవసరం రాదులే. అసలు మేడం గారు మాకే ఫైట్స్ చేసే ఛాన్స్ ఇచ్చేలా లేరు" అన్నాడు ఉదయ్.

"ఏదో కాస్త మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను గానీ, మరీ మునగ చెట్టు ఎక్కించెయ్యకండి ఉదయ్ గారూ" అంది ప్రవల్లిక.

కర్నూల్ కి పదికిలోమీటర్ల దూరంలో దినేష్ చెప్పినట్లే ఒక పెట్రోల్ బంక్ ఉంది. అందరూ అలర్ట్ అయ్యారు.

మరో కిలోమీటర్ వెళ్ళగానే రోడ్ కు కాస్త దూరంగా ఒక ఫార్మ్ హౌస్ కనిపించింది.

కారు ఆపి, కిందకు దిగాడు శివ. కార్ ను చెక్ చేస్తున్నట్లు నటిస్తున్నాడు.

ఉదయ్, కిషోర్ లు కూడా కిందకు దిగి అసహనంగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నట్లు నటిస్తున్నారు.

ఫార్మ్ హౌస్ నుండి ఒక నడివయసు వ్యక్తి బయటకు వచ్చాడు.

వీళ్ళ వంక చూసి ఎవరికో ఫోన్ చేసాడు. తరువాత గబగబా నడుచుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చాడు.

డ్రైవర్ శివ దగ్గరకు వచ్చి ఏమైందని అడిగాడు.

"కారు చెడిపోయింది" అన్నాడు శివ.

" అలాగా! కర్నూల్ లో నాకు తెలిసిన మెకానిక్ ఉన్నాడు. పిలిపించమంటారా? ఫోన్ చేస్తే అరగంటలో వస్తాడు" అన్నాడు ఆ వ్యక్తి.

"అయ్యో! అరగంట పడుతుందా? నాకైతే పరవాలేదు. మా అయ్యగార్లే ఇబ్బంది పడుతున్నారు. అందులో ఆ లినెన్ షర్ట్ వేసుకున్నాడే ... ఆ అబ్బాయి పెద్ద కోటీశ్వరుడి కొడుకు" అంటూ ఉదయ్ ను చూపించాడు శివ.

ఆ వ్యక్తి ఉదయ్ దగ్గరకు వచ్చి " బాబుగారూ! కర్నూల్ నుండి మెకానిక్ ను పిలిపిస్తున్నాను. ఈ లోగా ... అదిగో... ఆ పక్కనే మా ఫార్మ్ హౌస్ ఉంది. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి" అంటూనే కారులోకి తొంగి చూసాడు. లోపల ఉన్న ప్రవల్లికను గమనించాడు.

మళ్ళీ ఉదయ్, కిషోర్ ల వంక తిరిగి "మేడం ఎవరు?" అని అడిగాడు.

"మేడం మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయిలే! నువ్వు ఉదయ్ బాబుగారిని తీసుకొని వెళ్ళు. నేను మేడం గారికి తోడుగా ఉంటాను" అన్నాడు కిషోర్.

కొంత సేపు ఆలోచించాడు ఆ వ్యక్తి.

తరువాత వాళ్ళతో, "లేడీస్ ని ఇలా రోడ్ మీద వదలడం మంచిది కాదు. మేడం గారిని మా ఇంట్లో ఉండమని చెప్పండి. నా కూతురు తోడుగా ఉంటుంది" అని , తరువాత గొంతు తగ్గించి, " మీకు పక్కనే తోటలో 'మంచి కాలక్షేపం' అరేంజ్ చేస్తాను. మీ డ్రైవర్ ఇక్కడే ఉంటాడు లెండి" అని చెప్పాడు.

ఆలోచనలో పడ్డారు ఉదయ్, కిషోర్ లు.

వాళ్ళ ప్లాన్ ప్రకారం అతను ఉదయ్ ను ఫార్మ్ హౌస్ లోకి తీసుకొని వెళ్ళాలి. తరువాత బయటకు వచ్చి కిషోర్ ను తోటలోకి తీసుకొని వెళ్ళాలి. కార్ లో ఉన్న ప్రవల్లికను అతను గమనించి ఉండకూడదు.

కానీ ఇప్పుడు అంతా తారుమారు అయింది. ప్రవల్లికను ఫార్మ్ హౌస్ లోకి పంపడం ప్రమాదం.

ఆ ఆలోచన వచ్చిన వెంటనే " అదేం ఆవసరం లేదులే. మేము అందరం ఇక్కడే ఉంటాం" అన్నాడు ఉదయ్.

ఇంతలో ప్రవల్లిక కార్ లోంచి దిగి, "ఉదయ్! నాకు బాగా అలసటగా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుంటాను" అంది.

"రండి మేడం. మనం వెడదాం" అని ప్రవల్లిక తో చెప్పాడు ఆ వ్యక్తి.

“వెయిట్ మిస్ ప్రవల్లికా! మేము కూడా వస్తాము" అన్నాడు ఉదయ్.

"బాబూ! ఇంట్లో కాలేజ్ చదువుతున్న నా కూతురు ఉంది. ఇలా ఊరికి దూరంగా ఉన్న ఫార్మ్ హౌస్ లోకి అబ్బాయిలు వచ్చి పోతుంటే బాగుండదు. మేడం గారికి ఏ ఇబ్బందీ కలగదు. నన్ను నమ్మండి. నేను వచ్చి మిమ్మల్ని తోటలోకి తీసుకొని వెడతాను" అన్నాడు ఆ వ్యక్తి.

అవును ఉదయ్ గారూ. తోటలో ఎంజాయ్ చెయ్యండి. నేనేమీ అనుకోను" అంది ప్రవల్లిక.

ఆమె ప్రాబ్లమ్ పేస్ చెయ్యడానికే డిసైడ్ అయిందని వాళ్లకు అర్థం అయింది.

"అల్ ది బెస్ట్ మిస్ ప్రవల్లికా!" అన్నారు ఉదయ్, కిషోర్ లు.

ఉదయ్ ముందుకు వంగి ప్రవల్లిక చెవిలో చిన్నగా "టేక్ కేర్ ప్రవల్లిక గారూ. అన్నట్లు ఈ రోజు శనివారం" అన్నాడు.

అతనెందుకలా అన్నాడో అర్థం కాలేదు ప్రవల్లికకు. ఈ రోజు శనివారం అయితే ఏమిటట?

అదే ఆలోచిస్తూ వాళ్ళిద్దరికీ బై చెప్పి ఫార్మ్ హౌస్ వ్యక్తి వెంట నడిచింది ప్రవల్లిక.

ఇంట్లోకి ప్రవేశిస్తూ "నా పేరు దిలావర్. అదిగో... నా కూతురు రజియా వస్తోంది" అంటూ ఎదురుగా వస్తున్న ఓ ఇరవై ఏళ్ల అందమైన అమ్మాయిని చూపించాడు అతను.

"లోపలి రండి" అంటూ ప్రవల్లికను ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది ఆ అమ్మాయి.

ప్రవల్లిక చాలా షార్ప్ గా ఆలోచిస్తోంది.

మాఫియా వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తారు. తరచుగా పేర్లు మారుస్తుంటారు. మరి చాలా రోజుల క్రితం దినేష్ తో చెప్పిన పేర్లే ఇప్పుడు కూడా వాడటం ఆశ్చర్యంగా ఉంది.

ఆమెకు మెల్ల మెల్లగా అర్థం అవుతోంది.

తాను డెత్ ట్రాప్ లో ఇరుక్కుంది.

దినేష్ చేత ఫోన్ చేయించడం మాఫియా వాళ్ళ ప్లాన్.

వాళ్ళను పట్టుకోవచ్చనే ఆశను కలిగించి , తనను ఇరికించుకున్నారు.

అంటే ప్రతాప్ గారు ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసినా, తాము బెంగళూరుకు బయలుదేరడం ఆ డ్రగ్ మాఫియా వాళ్లకు తెలిసిపోయింది.

తనను బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశం వాళ్లకు లేదు. తనను చంపేస్తే నాన్నగారి పరిశోధనకు బ్రేక్ పడుతుంది. ఈ లోగా వాళ్ళు తప్పించుకోవడానికి ప్లాన్ చేసి ఉంటారు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే తలుపు మూసిన శబ్దం వినిపించింది.

అంటే దిలావర్ బయటకు వెళ్లాడన్న మాట.

ఇప్పుడు తాను వెనక్కి తిరిగితే తనకు మత్తు లేదా పాయిజన్ ఇంజక్ట్ చెయ్యవచ్చు.

అందుకని రజియా వెంటే ఇంట్లోకి నడుస్తోంది.

కానీ నిజానికి దిలావర్ బయటకు వెళ్ళలేదు.

ఇంట్లోకి వచ్చి తలుపు మూసి గడియ పెట్టాడు.

ఆ విషయం ఆమెకు తెలీదు.

***

ప్రవల్లిక వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయారు ఉదయ్, కిషోర్ లు.

ఇంతలో ఉదయ్ ఫోన్ మ్రోగింది.

చూస్తే దినేష్.

"చెప్పు దినేష్" అన్నాడు ఉదయ్.

"ఇందాక మీకు ఫోన్ చేశాను కదా! అప్పుడు వాళ్ళు.... అదే... ఆ డ్రగ్ మాఫియా వాళ్ళు నా పక్కనే ఉన్నారు . మీరు ఫార్మ్ హౌస్ దగ్గర ఆగొద్దు. వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చెయ్యడానికే నా చేత ఫోన్ చేయించారు. ఇప్పటివరకూ వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. నేను మీకు మళ్ళీ ఫోన్ చెయ్యనని నమ్మకం కుదిరాక వెళ్లిపోయారు. వెంటనే మీకు ఫోన్ చేస్తున్నాను" అన్నాడు దినేష్.

అదిరిపోయాడు ఉదయ్!

తాము ఇక్కడ దిలావర్ కోసం వెయిట్ చెయ్యడం వేస్ట్.

ప్రవల్లికను ఫినిష్ చేసిగానీ అతడు ఇక్కడికి రాడు.

“మిస్టర్ కిషోర్! ప్రవల్లిక ఇన్ డెత్ ట్రాప్. కమాన్" అంటూ ఫార్మ్ హౌస్ వైపు పరుగులు తీసాడు ఉదయ్. అతన్ని వెంబడించాడు కిషోర్. వెళ్లే దారిలోనే శివకు ఫోన్ చేసి ఒంటరిగా ఉండొద్దని, ఫార్మ్ హౌస్ దగ్గరకు వచ్చెయ్యమని చెప్పాడు కిషోర్.

***

తన వెనుక అడుగుల శబ్దం రావడం గమనించింది ప్రవల్లిక. విషయం అర్థం చేసుకుంది. వెనకనుంచి తన పైన ఎటాక్ జరగబోతోంది. వెనక్కి తిరిగితే రజియా తన పైకి దూకి పాయిజన్ ఇంజెక్ట్ చేస్తుంది.

వాళ్ళను ఒక్క క్షణం అయోమయంలో పెడితే చాలు.

అప్రయత్నంగా "ఈ రోజు శనివారం" అని గట్టిగా అరిచింది ప్రవల్లిక.

ఆశ్చర్యంగా ప్రవల్లిక వంక చూసింది రజియా.

అదే అదనుగా వెనక్కి తిరిగింది ప్రవల్లిక.

ఐరన్ రాడ్ తో తన తల పైన మోదబోతున్నాడు దిలావర్.

అతను కూడా 'ఈ రోజు శనివారం' అని తను అన్న మాటలకు ఆలోచనలో పడ్డాడు.

"ఇది మన నెక్స్ట్ కేడర్ వాళ్ళ పాస్ వార్డ్. తొందర పడొద్దు" అరిచి చెప్పింది రజియా.

అంతలోనే ప్రవల్లిక ఒక్కసారిగా తన కుడికాలిని పైకిలేపి ఐరన్ రాడ్ పట్టుకొని వున్న దిలావర్ చేతి మీద కొట్టింది. అతని చేతిలోని ఐరన్ రాడ్ దూరంగా పడింది.

తేరుకున్న దిలావర్ ఒక్క ఉదుటున బయటకు గెంతి తలుపు బయటనుండి గడియపెట్టాడు.

"నేను బాస్ కు ఫోన్ చేసి విషయం కనుక్కుంటాను. నువ్వు ఆ అమ్మాయిని వదలొద్దు" అంటూ రజియాను హెచ్చరించాడు.

ప్రవల్లిక , రజియా వైపు తిరిగి ఎటాక్ చెయ్యడానికి రెడీ అవుతోంది.

"ప్రవల్లిక అక్కా! ఆ గూండా గాడికే నీ దెబ్బకు కళ్ళు తిరిగాయి. నేనయితే అసలు తట్టుకోలేను" అంది రజియా.

ఆశ్చర్యంగా చూసింది ప్రవల్లిక.

"నా అసలు పేరు దీప్తి. అతను నాకేమి కాడు. డ్రగ్ మాఫియా వాళ్ళు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళ పనులకు వాడుకుంటున్నారు అంది" ఆ అమ్మాయి.

ఇంతలో బయట ఎవరో పెనుగులాడుకుంటున్నట్లు శబ్దాలు వచ్చాయి.

ప్రవల్లిక, కింద పడి ఉన్న ఐరన్ రాడ్ ను అందుకొని , డోర్ తెరిచి బయటకు వెళ్ళింది.

అప్పటికే దిలావర్ ను బలంగా కొట్టి, కింద పడేసాడు ఉదయ్.

కిషోర్ తో కలిసి అతన్ని లోపలి లాక్కొచ్చాడు.

"తోట దగ్గర ఉన్న మీ వాళ్ళను ఇక్కడికి రమ్మను" దిలావర్ తో అన్నాడు ఉదయ్ .

అతను జవాబు చెప్పలేదు.

తన జేబులోంచి రివాల్వర్ బయటకు తీసాడు కిషోర్.

అప్పుడు భయపడ్డాడు దిలావర్. కిషోర్ చెప్పినట్లే తన మనుషులను ఫార్మ్ హౌస్ దగ్గరకు రమ్మన్నాడు.

"అక్కడ ఎంతమంది ఉన్నారు?" అని అడిగింది ప్రవల్లిక.

ఆమె కాలి దెబ్బ రుచి చూసి ఉండటంతో వెంటనే జవాబిచ్చాడు దిలావర్, "ఇద్దరు మగవాళ్ళు, ఒక అమ్మాయి ఉన్నారు మేడం" అంటూ.

అతని కాళ్ళు, చేతులు కట్టేసి బయటకు వచ్చారు ఉదయ్, కిషోర్ లు.

ఇంతలో శివ కూడా అక్కడకు వచ్చాడు.

ముగ్గురూ చెట్ల మాటున చీకట్లో దాక్కున్నారు.

దిలావర్ చెప్పినట్లుగానే ఇద్దరు యువకులు, ఒక స్త్రీ ఫార్మ్ హౌస్ వద్దకు వచ్చారు.

ఉదయ్, కిషోర్ లు ఆ ఇద్దరు యువకులపై అటాక్ చేసారు. శివ ఆ స్త్రీని పట్టుకొని ఫార్మ్ హౌస్ లోకి నెట్టేశాడు.

ప్రవల్లిక, దీప్తి ఆమెను కట్టి పడేసారు.

అందరూ కలిసి, మిగిలిన ఇద్దర్ని కూడా కట్టేసారు.

ఉదయ్ ప్రవల్లికలు ఆ ఫార్మ్ హౌస్ అంతా గాలించారు. కొన్ని హార్డ్ డిస్క్ లు దొరికాయి.

వెంటనే ప్రతాప్ కు కాల్ చేసి , జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పింది.

"గుడ్! ఆ హార్డ్ డిస్క్ లో చాలా వివరాలు ఉండొచ్చు. బెంగళూర్ లో నిఘా ఎక్కువ అవడంతో ఆ హార్డ్ డిస్క్ లు ఇక్కడికి తరలించి ఉంటారు. మీరు అక్కడే వుండండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఈ లోపల మీకు ఎస్కార్ట్ గా కర్నూల్ నుండి పోలీసుల్ని పిలిపిస్తాను. విషయం ఇంతవరకు వచ్చాక పురంధర్ గారికి చెప్పి తీరాలి. పైగా ఆ హార్డ్ డిస్క్ లో మేటర్ ఏదైనా సీక్రెట్ కోడ్ లో ఉండవచ్చు. మీ నాన్నగారి లాంటి మేధావులే దాన్ని డి- కోడ్ చెయ్యగలరు" అన్నాడు ప్రతాప్.

"అవును అంకుల్. ఈ రోజుల్లో ఐ పి ఎస్ అయినవాళ్లు కూడా చిన్న చిన్న పజిల్స్ సాల్వ్ చేయలేకపోతున్నారు. ఓకే అంకుల్. వెయిటింగ్ ఫర్ యు. బై " అని ఫోన్ పెట్టేసింది ప్రవల్లిక.

"ఏమిటి విషయం?" అని అడిగాడు ఉదయ్.

"ప్రతాప్ అంకుల్ వస్తున్నారట. నాన్నగారు కూడా బెంగళూర్ నుండి బయలుదేరవచ్చు" అంది ప్రవల్లిక.

"అదికాదు. ఐ పి ఎస్.. పజిల్స్ అంటూ ఎదో చెప్పావు?" అడిగాడు ఉదయ్.

"అది ఉన్నమాటేగా. నా పజిల్ కి జవాబు చెప్పలేక చేతులెత్తేశారు కదా!" అంది ప్రవల్లిక.

"ఏది? MTWTF…. తరువాత ఏమిటి అనే పజిల్ కదూ" అన్నాడు ఉదయ్.

"ఫర్వాలేదు. జవాబు తెలీక పోయినా ప్రశ్న మాత్రం గుర్తు పెట్టుకున్నారు" అంది ప్రవల్లిక.

"జవాబు చెప్పెయ్యండి మరి" అన్నాడు ఉదయ్.

"సింపుల్. అవి ఇంగ్లిష్ లో వారాల పేర్లలో మొదటి అక్షరాలు. తరువాత వచ్చేది సాటర్ డే కాబట్టి ఆన్సర్ S " అంది ప్రవల్లిక.

"మరి ఆ సాటర్ డే ని తెలుగులో ఏమంటారో..." తెలీనట్లుగా అడిగాడు ఉదయ్.

"శనివారం' అని చెబుతూ ఉండగానే ఆమెకు గుర్తొచ్చింది ..."ఈ రోజు శనివారం అంటూ అతను రెండు మూడు సార్లు తనతో చెప్పడం.

అంటే తనే అతను చెప్పింది గ్రహించ లేక పోయింది.

"ఈ అమ్మాయెవరు? రజియా కదా. మరి కట్టేయ లేదేం?" అన్నాడు ఉదయ్.

"తనను కూడా దినేష్ లాగే బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నారు. తన అసలు పేరు దీప్తి" అంది ప్రవల్లిక.

దీప్తి మాట్లాడుతూ " మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బర్త్ డే పార్టీ ఇస్తానంటే వెళ్లాను. తీరా వెళ్ళాక అది రేవ్ పార్టీ అని తెలిసింది. అక్కడ నేనేమీ డ్రింక్స్ గానీ, డ్రగ్స్ గానీ తీసుకోలేదు. కానీ అందరితో పాటూ డాన్స్ చేశాను. కానీ ఆ వీడియో చూస్తే నేను కూడా వాళ్ళతో కలిసి పార్టీ చేసుకున్నట్లు అనిపిస్తుంది.

ఈ మాఫియా వాళ్ళు ఆ వీడియో చూపి నన్ను బెదిరించారు.

వాళ్ళు అడిగిన పని చేస్తే ఆ వీడియో ను ఎరేస్ చేస్తామన్నారు. ఒక అప్ కమింగ్ హీరోను ఇంటర్వ్యూ చేయాలట. నాకు ఒక యూ ట్యూబ్ ఛానల్ id కార్డు వాళ్లే రెడీ చేసి ఇచ్చారు.

ఇంటర్వ్యూ అయ్యాక అతనికి ఒక గిఫ్ట్ బాక్స్ ఇవ్వమన్నారు. ఏమిటని అడిగితే ఫారిన్ బ్రాండ్ సిగిరెట్లని చెప్పమన్నారు. అతనడిగితే ఇవ్వమని ఒక ఫోన్ నంబర్ ఇచ్చారు.

వాళ్ళు చెప్పినట్లే చేశాను. అవి డ్రగ్స్ నింపిన సిగిరెట్లని తరువాత తెలిసింది. వాళ్ళ ఇంటి పనిమనిషిని ఎంక్వయిరీ చేసి, అతను వాటిని వాడుతున్నట్లు తెలుసుకున్నారు. నేను ఇచ్చిన నంబరుకు అతడు కాల్ చేసాడు. తరువాత వీళ్ళ ఉచ్చులో తగులుకున్నాడు. డ్రగ్స్ సరఫరా చేసిన కేస్ లో నన్ను ఇరికిస్తామని బెదిరించి, దినేష్ ను ట్రాప్ చెయ్యమన్నారు. అలా నా జీవితం నాశనం అయిపొయింది" అని చెప్తూనే కన్నీళ్లు పెట్టుకుంది.

“భయపడకు. అప్రూవర్ గా మారు. నువ్వు కూడా బాధితురాలివే. నీకు శిక్ష పడక పోవచ్చు" అంది ప్రవల్లిక.

"ఇంతకీ మా పాస్వర్డ్ మీకెలా తెలిసింది?" అడిగింది దీప్తి.

"అది కేవలం యాదృచ్చికం. నేనడిగిన పజిల్ కి జవాబుగా అలా చెప్పారు ఉదయ్ గారు. అది నాకు అర్థమయి ఉంటే ఆ మాట వాడి వుండనేమో. అర్థం కాక పోవడంతో మిమ్మల్ని కాసేపు కన్ఫ్యూస్ చెయ్యడానికి వాడాను. అదే మమ్మల్ని సేవ్ చేసింది " అంది ప్రవల్లిక.

మరి కొంత సేపటికి పోలీసులు వచ్చి దిలావర్, దీప్తిలతో సహా అందర్నీ అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులతో వెళ్లే ముందు దీప్తి ప్రవల్లికకు నమస్కరిస్తూ "నాలాంటి వాళ్ళు ఇంకా బలి కాకుండా ప్రాణాలకు తెగించి మీరు సాహసం చేసారు. ' అంటూ నమస్కరించింది.

ప్రతాప్ గారు అక్కడికి చేరుకొని ఉదయ్, ప్రవల్లిక, కిషోర్, శివలను అభినందించాడు.

పురంధర్, మాఫియా వాళ్ళ హార్డ్ డిస్క్ లో కోడ్ లో ఉన్న వివరాలను ఉదయ్, ప్రవల్లిక ల సహాయంతో డి-కోడ్ చేసాడు. అందులో దేశ వ్యాప్తంగా ఉన్న డ్రగ్ మాఫియా వాళ్ళ వివరాలు దొరికాయి. అందర్నీ పోలీసులు అరెస్ట్ చేసారు.

దేశ వ్యాప్తంగా అందరూ ప్రవల్లికను ప్రశంసించారు.

***సమాప్తం***

ఈ కథలో వాడిన పేర్లు, ప్రదేశాలు, అన్నీ కేవలం కల్పితం. ఎవరినీ ఉద్దేశించి రాసినవి కాదు.

ఈ డిటెక్టివ్ ప్రవల్లిక సీరీస్ ఇంతటితో ముగిస్తున్నాము.

ప్రవల్లిక కు సంబంధించి కొత్త సీరీస్ త్వరలో ప్రారంభిస్తాము.

ఇన్నాళ్లుగా ఈ సిరీస్ ను ఆదరించిన పాఠకులకు కృతజ్ఞతలు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).55 views0 comments

Comments


bottom of page