top of page

‘సి ఈ ఓ’ చందన'CEO Chandana' written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

దినకర్ ఇన్ఫో టెక్ హైదరాబాద్ బ్రాంచ్ లో పనిచేస్తున్నారు సతీష్, వినోద్, నీహారిక, సుజిత.

పొద్దున ఆఫీసుకు రాగానే పిడుగులాంటి వార్త విన్నారు. తమ కంపెనీని చందు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ టేక్ ఓవర్ చేసుకుంటుందట! ఆఫీస్ లో అందరూ ఈ వార్త వినగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చందు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అధినేత, సి ఈ ఓ మన తెలుగమ్మాయి హరి చందన. సగటు సాఫ్ట్వేర్ అమ్మాయిలాగా ఉద్యోగంలో చేరిన చందన అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీ ‘సి ఈ ఓ’ స్థాయికి చేరింది. పట్టుదలకు, తెలివితేటలకు ఆమెనే ఉదాహరణగా చెబుతారు చాలా మంది.కేవలం పదేళ్లలో ఆమె ఈ స్థాయికి చేరుకోవడం వెనుక జీవితంలో పైకి ఎదగాలనే ఆమె దృఢ నిశ్చయం ఉంది.

లంచ్ అవర్ లో ఈ నలుగురూ ఓ మూలన కూర్చొని ఉండటం చూసిన వాళ్ళ టీం లీడ్ శశాంక్ వాళ్ళ దగ్గరకు వచ్చి "హేయ్! వాట్ హ్యపెండ్? అందరూ ఈవెనింగ్ ఎలా సెలెబ్రేట్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. రేపు వీకెండ్ కదా! ఏదైనా రిసార్ట్ బుక్ చేద్దామనుకుంటున్నాం. మీరేమిటిలా? న్యూస్ మీవరకు రాలేదా? అందరికీ మెయిల్ పెట్టానే? మన గ్రూప్ వాట్స్ అప్ లో అన్ని పోస్ట్లు కూడా దీని గురించే! బై ది వే చందన మేడం గారు మీలో ఎవరికో క్లాస్మేట్ కదూ?" అన్నాడు

ఏం చెప్పాలో తెలీలేదు నలుగురికీ. ముందుగా తేరుకున్న నీహారిక "తను మా నలుగురికీ క్లాస్మేట్. క్లోజ్ ఫ్రెండ్ కూడా!" తడబాటును తెలియనీయకుండా అంది.

"అవును. కలిసి చాలా మూవీస్ చూశాం" గొంతు పెగుల్చుకుని చెప్పాడు వినోద్. మిగిలిన ఇద్దరు కూడా అవునన్నట్లు తలలాడించారు.

వాళ్ళ వంక విచిత్రంగా చూసాడు శశాంక్.

'కాబోయే సి ఈ ఓ కి క్లాస్మేట్స్ అయినా వీళ్ళ మొహాల్లో ఏమాత్రం ఆనందం లేదేమిటి?' అని అనుకొని, "ఎనీ హౌ, రేపు రిసార్ట్ ప్రోగ్రామ్స్ లో మీరే హైలైట్ అవుతారు" అంటూ వెళ్లిపోయాడు.

ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు నలుగురూ .

" అప్పట్లో సుమీత్ అనే మన సీనియర్ ఈ కంపెనీలో ఉండేవాడు. అతని సహాయంతో ఎలాగో ఇక్కడ చేరాం. ఇప్పుడతను యు ఎస్ లో వేరే కంపెనీలో ఉన్నాడు. చందన సి ఈ ఓ అయితే మనల్ని బయటకు పంపడం ఖాయం!" దిగులుగా అన్నాడు సతీష్.

"మనకుండే అంతంత మాత్రం టాలెంట్ కు ఇప్పుడు వేరే కంపెనీలో జాబ్ తెచ్చుకోలేం" సుజిత గొంతులో చెప్పలేని భయం.

"ఇంతకీ చందనకు మనమీద ఇంకా కోపం ఉంటుందంటావా?" క్షమించేసి ఉంటుందని చిన్న ఆశ వినోద్ గొంతులో.

"ఒట్టి కోపం కాదు. కక్ష, పగ.. ఇలాంటివన్నీ తప్పకుండా ఉండే ఉంటాయి" అంది నీహారిక .

'టేక్ ఓవర్ జరిగేలోగా మనం వేరే కంపెనీకి మారడం మేలేమో.." అంది సుజిత.

"నువ్వే అన్నావుగా! అంతంత మాత్రపు టాలెంట్ అని. మనకు ఉద్యోగాలిచ్చే బకరాలు ఎవరున్నారు? " దిగులుగా అన్నాడు సతీష్.

“మనకు చదువు విషయంలో గానీ,కెరీర్ విషయంలో గానీ ఏరోజూ శ్రద్ధ లేదు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఇన్ని రోజులు ఉండడమే గొప్ప. లెట్ అజ్ కౌంట్ అవర్ డేస్ ఇన్ దిస్ ఫీల్డ్. ఉద్యోగాలు పోయాక ఎలాగూ బజ్జీల బండి నడుపుకోవాలి. అదేదో ఇప్పుడే మొదలుపెడితే చందన చేతిలో అవమానమైనా తప్పుతుంది" అన్నాడు వినోద్.

మనలాంటి లేజీఫెలోస్ కి అది సెట్టవ్వదు. కాస్తో కూస్తో చేయగలిగేది ఈ జాబే! లెట్ అజ్ వెయిట్ ఫర్ హర్ అరైవల్. వీలయినన్ని రోజులు ఇక్కడే నెట్టుకొద్దాం" అంది నీహారిక.

*** *** ***

ఇంటర్ 90 % తో పాస్ ఐన చందన హైదరాబాద్ లో ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బి టెక్ లో చేరింది. చేరిన కొద్ది రోజుల్లోనే ప్రొఫెసర్ల దృష్టిలో ఇంటెలిజెంట్ గా గుర్తింపు తెచ్చుకుంది. చూడ చక్కటి అందంతో బాటు, చలాకీదనం, నాయకత్వ లక్షణాలు ఉండడంతో ఆమెకు చాలామంది స్నేహితులు, అభిమానులు ఏర్పడ్డారు. వారిలో సుజిత, నీహారిక బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ద్వారా సతీష్, వినోద్ కూడా పరిచయం అయ్యారు. చందన కేవలం చదువులోనే కాదు, స్పోర్ట్స్ లోనూ, కల్చరల్ యాక్టివిటీస్ లోనూ కూడా టాపర్. స్టేజి పైన తాను పాడుతుంటే ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ అందరూ మంత్రముగ్ధులై వినేవారు. చందన తమ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడం ఈ నలుగురికి చాలా గొప్పగా ఉండేది. సుజిత, నిహారికలకు ఎక్కడ తమ బాయ్ ఫ్రెండ్స్ చందనను ఇష్టపడతారేమో అనే భయం, ఈర్ష్య లోలోపల ఉండేది. చందనతో మూవీస్ కి వెళ్ళినప్పుడు సతీష్, వినోద్ లను వీలైనంత వరకు అవాయిడ్ చేసేవారు.

వాళ్లతో మూవీస్ కి వెళ్ళినప్పుడు చందనను దూరం పెట్టేవారు. స్ఫురద్రూపి అయిన చందన ఈ విషయం ఎప్పుడో పసిగట్టినా, పెద్దగా పట్టించుకోలేదు. అందరితో ఫ్రెండ్లీగా, సరదాగా ఉండేది. అలా బి టెక్ ఫస్ట్ ఇయర్ గడిచింది. సెకండ్ ఇయర్ మొదలైన కొద్ది రోజులకే చందన హెల్త్ కండిషన్ లో మార్పులు మొదలయ్యాయి. ఒక నెల్లోనే బాడీ వెయిట్ దాదాపు పది కిలోలు పెరిగింది. డాక్టర్ ను కలిస్తే థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్పారు. ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా వెయిట్ పెరగడం ఆగలేదు. ఫస్ట్ ఇయర్ యాభై కేజీలు ఉన్న చందన సెకండ్ ఇయర్ సగం గడిచే సరికి వంద కిలోలకు చేరింది. సుజిత, నీహారికలు, చందన లేనప్పుడు తన మీద జోక్స్ వెయ్యడం ప్రారంభించారు. రాను రానూ, తను ఎదురుగా ఉన్నా, తన ఆకారం మీద కామెంట్స్ చెయ్యడం మొదలు పెట్టారు, ‘జస్ట్ ఫర్ జోక్, ఏమీ అనుకోకేం’ అనే మాట చేరుస్తూ. మొదట్లో చందన ఎదురుగా ఉన్నప్పుడు ఆ కామెంట్స్ కి నవ్వాలంటే సంకోచించిన వినోద్, సతీష్ లు పోనుపోనూ తామే కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక మూవీస్ కి వెళ్ళేటప్పుడు కూడా చందనను అవాయిడ్ చేసేవాళ్ళు. అయినా చందన వాళ్ళతోనే వెళ్ళడానికి ఇష్టపడేది. చందనను వదిలించుకునే బాధ్యతను సుజిత పైన పెట్టారు.

సుజిత, చందనతో మాట్లాడుతూ "నువ్వు మాతో రావడానికి మాకేమీ ఇబ్బంది లేదు. కానీ అందరూ నీ వంక విచిత్రంగా చూస్తూ కామెంట్స్ చేస్తూ వుంటే మాకు చాల బాధగా ఉంటోంది. ఇక సతీష్, వినోద్ ల సంగతి తెలిసిందే కదా! స్నేహమంటే ప్రాణం ఇస్తారు వాళ్ళు. నిన్ను కామెంట్ చేసే వాళ్లతో ఏదో ఒక రోజు పెద్ద గొడవ పెట్టుకుంటారేమోనని భయంగా ఉంది. పైగా పానకంలో పుడకలా రెండు జంటల మధ్యలో ఉండాలంటే నీకూ, మాకూ కూడా కష్టమే. సో .. బెటర్ టు అవాయిడ్ అజ్" అంటూ నిష్కర్షగా చెప్పేసింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చందనకు. బాధపడుతూ అక్కణ్ణుంచి వచ్చేసింది.

ఇంతగా కాకా పోయినా మిగతావాళ్ళు కూడా కాస్తో కూస్తో కామెంట్స్ చేసేవాళ్ళు. మొదట్లో బాధ పడ్డా, రాను రాను అలవాటు పడింది చందన. ఎవరేమన్నా పట్టించుకునేది కాదు. ఎప్పటిలాగే చలాకీగా ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తను ఎంతగానో అభిమానించే ప్రొఫెసర్ శ్రీరామ్ గారు "చందనా! నీతో మాట్లాడాలి. ఈవెనింగ్ ఆఫీస్ రూమ్ కి రా" అనడంతో ఆశ్చర్యపోయింది చందన. సర్ చెప్పినట్లే సాయంత్రం ఆయన్ని కలిసింది.

"ఎలా ఉన్నావు చందనా? చాలా రోజులయింది నీతో మాట్లాడి " అన్నారు ప్రొఫెసర్ శ్రీరామ్ గారు.

" ఫైన్ సర్. నేనే మిమ్మల్ని కలుద్దామనుకుంటున్నాను. నాకు చాలా విషయాల్లో సరైన గైడెన్స్ ఇచ్చారు మీరు" అంది చందన.

'థాంక్ యూ!" అన్నారాయన. తరువాత చాలా సేపు మౌనంగా ఉన్నారు.

అది గమనించిన చందన తనే ప్రారంభించింది " సర్! ఇలా అంటున్నందుకు అన్యధా భావించొద్దు. మీరు చెప్పబోయే విషయం నాకు అర్ధం అయింది" అంది అయన వంక నిశితంగా చూస్తూ .

"రియల్లీ? నా సైకాలజీ స్టడీ చేసేశావన్న మాట" అన్నారాయన నవ్వుతూ.

" నిజం సర్! నా శ్రేయోభిలాషులు మీరు. పేరెంట్స్ తర్వాత నా పైన ఎక్కువ శ్రద్ధ చూపేది మీరే. మీరేం చెబుతారో గెస్ చెయ్యగలను. ఇటీవల నేను వెయిట్ పెరగడం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు నా పక్కన కలిసి నడవడం, నాతో మాట్లాడటం గొప్పగా ఫీల్ అయినవాళ్లు ఇప్పుడు నన్ను అవాయిడ్ చేస్తున్నారు. నా ఓవర్ వెయిట్, నలుగురూ చేసే కామెంట్స్ వల్ల నేను డిప్రెస్ అయివుంటానని మీరు అనుకుంటున్నారు. నాకు కౌన్సిలింగ్ ఇచ్చి, నన్ను నార్మల్ చేయాలనుకుంటున్నారు. థాంక్యూ వెరీ మచ్ సర్! నేను మొదట్లో కాస్త బాధపడ్డ మాట వాస్తవమే. కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. ఎప్పటిలానే ఉంటున్నాను" ఆత్మ విశ్వాసం తొణికిసలాడింది చందన మాటల్లో.

" నీ లావు గురించి వచ్చే కామెంట్స్ పట్టించుకోక పోవడం తప్పంటున్నాను నేను" అన్నారాయన.

ఆశ్చర్యపోయింది చందన." వాట్ సర్? సర్ప్రైసింగ్! మీరేం చెప్తారో వినాలనుంది" అంది ఎక్సయిటింగ్ గా .

"చూడు చందనా! నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒక వ్యక్తి పేదరికం వల్ల చాలా బాధలు పడ్డాడు. అవమానాలకు గురయ్యాడు. ఆ అవహేళనలు పట్టించుకోవడం మానేస్తే ఏమవుతుంది?"

ఆలోచించింది చందన " అలాగే పేదవాడుగానే ఉంటాడు. అవమానాలకు అలవాటు పడిపోతాడు"అంది.

"సరిగ్గా చెప్పావు. నలుగురిలో అవమానింప బడటం అతని దినచర్యలో భాగం అవుతుంది. అలాకాక తిరగబడితే ఏమవుతుంది? " ప్రశ్నించారు శ్రీరామ్ గారు.

" కానీ సర్, ఆలా చేస్తే మరింత ఇబ్బందుల్లో పడవచ్చుకదా? ఎంతమందితో ఆలా గొడవ పడగలడు?" సందేహంగా అంది చందన.

"నిజమే. డిప్రెస్ అయితే మరింత దిగజారుతాడు. గొడవలు పడ్డా మరింత ఇబ్బంది పడతాడు. పట్టించుకోవడం మానేస్తే అలాగే ఉంటాడు. కానీ తన పేదరికాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటే?" ప్రశించారాయన.

కాస్త అర్థం అయి, మిగతా సగం అర్థం కానట్లు చూసింది చందన. ప్రొఫెసర్ శ్రీరామ్ గారు చెప్పబోయేది శ్రద్ధగా వినడానికి ప్రిపేర్ అయింది.

“ప్రపంచంలో ప్రముఖులైన వారిలో చాలామంది ఒకప్పుడు ఏదో ఆత్మన్యూనతతో బాధ పడ్డవారే. కానీ వారు ఆ న్యూనతకు గల కారణాన్ని తమ అభ్యున్నతికి వాడుకున్నారు. తాము పైకెదగడం వల్ల తాము పడ్డ అవమానానికి ప్రతీకారం తీరుతుందని భావించేవారు. చదువులో వెనకబడి ఇంట్లో, స్నేహితుల దగ్గర అవమానింపబడ్డవారు ఎందరో ప్రముఖ వ్యాపారవేత్తలుగా ఎదిగారు. వ్యాపారం చేయలేక దివాలా తీసినవాళ్లు రాజకీయాల్లో రాణించారు.

కాలేజీ రోజుల్లో పప్పుసుద్దలుగా అమ్మాయిల చేత కామెంట్ చేయబడ్డవాళ్లు, చదువులో రాణించి విదేశాల్లో ప్రముఖులుగా స్థిరపడి, కాలేజ్ బ్యూటీలను భార్యలుగా చేసుకున్నారు. వీళ్లందరిలో ఒక బలమైన పట్టుదల ఉంది. ఆ పట్టుదలను కలిగించే ఒక అసంతృప్తి ఉంది. అది తమ రంగు విషయంలో కావచ్చు, పొడవు గురించి కావచ్చు, ఆర్ధిక పరిస్థితి గురించో, అందం గురించో కావచ్చు. వారు చేసిందల్లా తమ లోపానికి క్రుంగి పోకుండా, అలాగని తమని ఎత్తిచూపినవారి పైన ద్వేషం పెంచుకోకుండా, ఏదో ఒక రంగంలో రాణించడానికి వారికున్న లోపాన్ని ఒక ఉత్ప్రేరకంగా వాడుకున్నారు. విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ వయసులో అందరు అమ్మాయిలకు, అబ్బాయిలకు ఉండే డైవర్షన్ నీకు లేకుండా చేయడానికి భగవంతుడే నిన్ను లావుగా చేసాడేమో! కాబట్టి దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని నీ కెరీర్ పైన దృష్టి పెట్టు.

ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర్లోనే ఉన్నాయి. నీ కసిని చదువు పైన చూపించు. తరువాత కెరీర్ పైన చూపించు. అల్ ది బెస్ట్ " చెప్పడం ముగించారు ప్రొఫెసర్ శ్రీరామ్ గారు.

"సర్, నాకు సరైన దారి చూపించారు. మీ సూచనలను తప్పకుండా పాటిస్తాను" అంటూ అయన పాదాలకు నమస్కరించి సెలవు తీసుకుంది చందన.

*** *** ***

తాను లావయిన మొదట్లో ఎవరైనా కామెంట్ చేస్తే బాధపడేది. నలుగురిలో తిరగడం తగ్గించింది. తరువాత లెక్క చేయకుండా మొండిగా ఉండేది. ఇప్పుడలా కాదు. తన గురించి ఎవరు ఏమనుకుంటున్నారో గమనించేది. కాలేజీ నుండి ఇంటికెళ్ళాక ఒకసారి ఆ కామెంట్స్ అన్నీ గుర్తుకు తెచ్చుకొని, తరువాత చదువు ప్రారంభించేది. ఆశ్చర్యంగా ఎక్కువ కామెంట్స్, హేళనలు పొందిన రోజు ఎక్కువ చదవగలిగేది. దాంతో బి టెక్ లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది.

తరువాత కూడా ప్రొఫెసర్ గారి సలహాను పాటించింది. ఉద్యోగంలో అసాధారణ ప్రతిభతో 'సి ఈ ఓ' స్థాయికి ఎదిగింది. తన ఉన్నతికి కారణమైన ప్రొఫెసర్ గారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేసింది.

చందన సాధించిన విజయాలు తెలుసుకొని చాలా ఆనంద పడ్డారాయన.

"చూడమ్మా! ఇప్పుడు ఒక కంపెనీని నడిపించే స్థాయిలో ఉన్నావు. అయినా నీకు మరో సలహా ఇవ్వాలనుంది. తప్పుగా అనుకోవనే నమ్మకం నాకుంది" అన్నారాయన.

"సర్! పేరెంట్స్ తరువాత నేను ఎక్కువగా గౌరవించేదీ, అభిమానించేది మిమ్మల్నే. నిస్సందేహంగా చెప్పండి సర్ " అంది చందన.

" అమ్మాయిలు తమ లావు గురించి పేరెంట్స్ మాట్లాడినా కోపగించుకుంటారు. అందుకనే సందేహిస్తున్నాను" అన్నారాయన చిన్నగా నవ్వుతూ.

"అర్థమైంది సర్! ఇన్నాళ్లు నా లావు పైన వచ్చే కామెంట్స్ ను కెరీర్ లో ఎదగడానికి ఉపయోగించుకున్నాను. ఇప్పుడు ఆ కామెంట్స్ ను ఛాలెంజ్ గా తీసుకోని లావు తగ్గాలి. అంతే కదా సర్? తప్పకుండా ఆర్నెలల్లో నా బాడీ వెయిట్ తగ్గించుకుంటాను. ఐ ప్రామిస్ యూ సర్" అని చెప్పింది చందన.

ఈసారి తన పట్టుదలను వెయిట్ పైన కేంద్రీకరించింది. అందరూ ఆశ్చర్యపోయేలా ఆరు నెలల్లో యాభై కేజీలు వెయిట్ తగ్గి, వెనుకటి అందాలు సంతరించుకుంది. అమెరికాలో స్థిరపడ్డ ఓ ప్రముఖ ఎన్నారై యువకుడు చందన పనిచేసే కంపెనీని కొనుక్కోవడంతో పాటు, ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. కంపెనీ పేరును చందు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ గా మార్చాడు.

*** *** ***

మళ్ళీ దినకర్ ఇన్ఫో టెక్ ఆఫీసంతా హడావిడిగా ఉంది. చందనా మేడం ఒక వారం రోజుల్లో భర్తతో కలిసి హైదరాబాద్ వస్తున్నారట. తాజ్ హోటల్ లో బస చేస్తారట. మేనేజర్ ను అక్కడే కలుస్తారట. అప్పుడే టేక్ ఓవర్ విషయం ఫైనలైజ్ చేస్తారట. ఆఫీసంతా ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు.

ఈ నలుగురిలో మళ్ళీ టెన్షన్ మొదలైంది. అంతలో అటెండర్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు, మేనేజర్ గారు మీ నలుగుర్నీ రమ్మన్నారంటూ! నలుగురూ నిస్తేజంగా మేనేజర్ ఛాంబర్ లోకి అడుగుపెట్టారు. లోపల మేనేజర్ తో బాటు టీం లీడ్ శశాంక్ కూడా ఉన్నాడు.

నలుగురినీ కూర్చోమని చెప్పి, సూటిగా విషయాన్నీ ప్రారంభించాడు మేనేజర్.

"మరో వారంలో మన కంపెనీని చందనా మేడం గారు స్వాధీనం చేసుకోబోతున్నారు. ఆ వెంటనే ప్రమోషన్స్ టేకప్ చేస్తారట.పెర్ఫార్మెన్స్ లేని వాళ్ళను ఈ లోగానే తొలగించమని, తాము టేక్ ఓవర్ చేసిన వెంటనే తీసేస్తే బాగుండదని చెప్పారు. ఐ యామ్ సారీ టు సే దట్ యూ ఫోర్ అర్ ఇన్ ది లిస్ట్"

కళ్ళు గిర్రున తిరిగాయి నలుగురికీ. ఏ సి గదిలోకూడా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఒకసారి నలుగురినీ తేరిపార చూసి కొనసాగించాడు మేనేజర్. " మేడం గారికి మీ నలుగురి పేర్లూ మెయిల్ చెయ్యక తప్పలేదు. ఎందుకో వారికి మీపైన సాఫ్ట్ కార్నర్ కలిగినట్లుంది. హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ శ్రీరామ్ గారిని కలుస్తారట. మిమ్మల్ని ఆ టైములో కలవమన్నారు" చెప్పడం ముగించాడు మేనేజర్.

ఆయనకు నమస్కరించి బయటకు నడిచారు నలుగురూ .

"సాఫ్ట్ కార్నర్ కాదు. కసితీరా తిట్టి, బయటకు గెంటుతారు!" అన్నాడు వినోద్.

"చేసేదేమీ లేదు. చివరి ప్రయత్నంగా వెళ్లి కలవడమే" అంది నీహారిక.

*** *** ***

వీళ్ళు ప్రొఫెసర్ శ్రీరామ్ గారి ఇంటికి వెళ్ళేటప్పటికి , అక్కడంతా హడావిడిగా ఉంది. చాలా మంది ఇతర ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ చందనను అభినందించడానికి వచ్చారు. చందన, శ్రీరామ్ గారిని శాలువా కప్పి సన్మానించింది. అంతమందిలో చందనను కలవడానికి ఈ నలుగురికీ ఇబ్బందిగా అనిపించి దూరంగా ఉండిపోయారు. ప్రోగ్రాం ముగిసి బయటకు వెళ్ళబోతున్న చందన వీళ్ళను చూసి దగ్గరకు వచ్చింది.

"హే సుజీ అండ్ నీహారికా! ఎలా ఉన్నారు? వినోద్.. ఎలా ఉన్నావ్? సతీష్! నువ్వు ఏ మాత్రం మారలేదు" అంటూ నలుగురినీ ఆప్యాయంగా పలకరించింది చందన.

కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నలుగురికీ! "చందనా.. సారీ మేడంగారు .. మేము బాగానే ఉన్నాం. నువ్వు..మీరు.." మాటలు తడబడుతున్నాయి నలుగురికీ.

చిన్నగా నవ్వింది చందన.

"ఇది మన ప్రొఫెసర్ గారి ఇల్లు. మనమంతా క్లాస్మేట్స్. ఆఫీసులో అయితే నేను బాస్ లాగా కనపడతాను కదా! అందుకే మిమ్మల్ని ఇక్కడ కలవమన్నాను. అన్నట్లు మన సీనియర్ సుమీత్ తో చెప్పి మీకు ఉద్యోగం ఇప్పించింది నేనే. అప్పట్లో అతను యూ ఎస్ లో జాబ్ కోసం నన్ను అప్రోచ్ అయ్యాడు. అతనికి మీ విషయం చెప్పి హెల్ప్ చెయ్యమన్నాను. మీరు ఫీల్ అవుతారని మీతో నేను హెల్ప్ చేసిన విషయం చెప్పొద్దన్నాను." అంది వాళ్లతో.

నిర్ఘాంతపోయారు నలుగురూ.తమకు దొరక్క దొరికిన ఈ ఉద్యోగమూ చందన ఇప్పించిందేనా!

“క్లాస్మేట్ లాగా పలకరించే స్వతంత్రం మేమే పోగొట్టుకున్నాం. నిన్ను చాలా అవమానించాం" అంది సుజిత బాధతో.

" అవమానాలను ఛాలెంజ్ గా తీసుకోవడం, కెరీర్లో ముందుకు వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ గా మలచుకోవడం మన ప్రొఫెసర్ శ్రీరామ్ గారు నేర్పారు. నేనీరోజు ఇలా ఉండడానికి వారి సలహాలే కారణం" అంది చందన ప్రొఫెసర్ గారి వంక గౌరవంగా చూస్తూ.

" అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకొనేవాళ్ళు ఉన్నారు. డిప్రెషన్ తో కృంగిపోయేవాళ్లు ఉన్నారు. ఏ కొద్దిమందో బాధలను ఛాలెంజ్ గా తీసుకోని జీవితాన్ని గొప్పగా మలుచుకుంటారు. ప్రతి ఒక్కరికీ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ సలహాలను పాటించి జీవితాన్ని గొప్పగా మలచుకోవడం చందన లాంటి ఏ కొద్దిమందికో సాధ్యపడుతుంది." అన్నారు శ్రీరామ్ గారు.

"ఇంతకీ మన ఉద్యోగాలు ఉన్నట్లేనా?" వినోద్ చెవిలో చిన్నగా గొణిగాడు సతీష్.

" సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో రెకమెండేషన్లకు చోటు లేదు. మీ 'ఫ్రెండ్ చందన' ఒక అవకాశం ఇచ్చిందంతే! కానీ పెర్ఫార్మెన్స్ లేకపోతే ఈ 'సి ఈ ఓ చందన' ఊరుకోదు" అంది చందన నవ్వుతూ.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 15 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
169 views0 comments

Comentarios


bottom of page