top of page

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 2 - దొంగ దొరికాడు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Detective Pravallika Episode 2 - Donga Dorikadu' Telugu Web Series written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్



ఉదయం ఆరింటికే ల్యాండ్ లైన్ మ్రోగింది.

ఫోన్ తీసిన శారద "ఎవరండీ ?" అని అడిగింది.

ఆమె గొంతు గుర్తు పట్టిన ఏ సి పి ప్రతాప్ " నేను చెల్లెమ్మా! మీ అన్నయ్య ప్రతాప్ ను మాట్లాడుతున్నాను . పురంధర్ గారి సెల్ కి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తోంది. అందుకే ల్యాండ్ లైన్ కి చేశాను' అన్నాడు.

"అయన బెంగళూరుకు ఫ్లైట్ లో బయలుదేరారు.అందుకే ఫోన్ అంది ఉండదు. తన ప్రయాణం గురించి మీతో చెప్పలేదా అన్నయ్యగారూ?" అంది శారద.

"వారం క్రితమే చెప్పారమ్మా. నేనే మరిచాను. సరేలే. ఫ్లైట్ దిగాక కాల్ చేస్తాను" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ఏ సి పి ప్రతాప్.

మరో రెండు నిముషాలకే అతని వద్ద నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది.

ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసిన శారద అటువైపు ప్రతాప్ మౌనంగా ఉండటంతో విషయం అర్థం చేసుకొని "అమ్మాయి ప్రవల్లిక హెల్ప్ ఏమైనా కావాలా అన్నయ్యగారూ ?" అని అడిగింది.

“అవునమ్మా! ప్రవల్లిక గతంలోకూడా కొన్ని కేసులను సులభంగా పరిష్కరించింది. అసలు విషయం ఏమిటంటే మినిష్టర్ వీరేశం గురించి తెలుసు కదా! అయన తన కూతురి పెళ్లి కోసం యాభై లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ చేయించాడట. ఇంట్లో పూజ గదిలో పెట్టిన నెక్లెస్ మాయం అయిందట.


“పోలీస్ కేసు పెట్టడానికి వీరేశం గారు ఇష్టపడటం లేదు. పెళ్లి పనులు జరుగుతున్నాయి కదా! అయన ఇంటికి ప్రస్తుతం చాలా మంది బంధువులు, అనుచరులు వస్తూ పోతూ ఉన్నారు. పోలీస్ విచారణ వల్ల వాళ్ళందరూ హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఘనంగా జరిపించాలనుకున్న పెళ్ళికాస్తా ఐన వాళ్ళ అలకలు, నిష్టూరాలతో రసాభాస అవుతుంది.

చాకచక్యంగా ముఖ్యమైన అనుమానితులు నలుగురైదుగురిని గుర్తిస్తే, వాళ్ళ వరకు విచారించి, దొంగను కనిపెట్టవచ్చనేది వీరేశం గారి అభిప్రాయం.

ఈ కేసును అంత చాకచక్యంగా పరిష్కరించగలిగేది పురంధర్ గారే. ఆయన అక్కడి కేసును పూర్తి చేసిగానీ వెనక్కి రారు. కానీ మాకు అంత గడువు లేదు. పెద్దవాళ్ళ వ్యవహారం కదా. తొందరగా తేల్చాల్సి ఉంటుంది. ఇక మాకున్న ఒకే ఆశ జూనియర్ డిటెక్టివ్ ప్రవల్లిక మాత్రమే." విషయాన్ని పూర్తిగా వివరించాడు ప్రతాప్.

అతను చెప్పినదంతా ఓపిగ్గా వినింది శారద.

" తప్పకుండా అన్నయ్యగారూ. అమ్మాయి జాగింగ్ కి వెళ్ళింది. తిరిగి వచ్చే టైం అయింది. రాగానే విషయం చెప్పి, మీకు కాల్ చేయిస్తాను" అని చెప్పి ఫోన్ పెట్టేసింది శారద.

మరో పది నిమిషాలకి ఇంటికి వచ్చింది ప్రవల్లిక.

"ప్రతాప్ అంకుల్ కాల్ చేసారు. ఎవరో ఒక ప్రముఖ డిటెక్టివ్ కావాలట" అంది కూతురితో.

"నాన్నకోసమన్న మాట. నాన్న తిరిగి రావడానికి ఒక వారమైన పడుతుంది కదా" అంది ప్రవల్లిక.

" అందుకే నీ సహాయం కావాలట. నువ్వు రాగానే కాల్ చేయిస్తానని చెప్పాను. బహుశా నీ కాల్ కోసం అయన వెయిట్ చేస్తూ వుంటారు" అంది శారద.

" అయ్యో! నేనేం చెయ్యగలనమ్మా! ఆ వర్ధనమ్మ గారి హత్య కేసులో అనుకోకుండా మనకు కొన్ని విషయాలు తెలిసాయి. కాబట్టి హంతకుడిని గెస్ చేయగలిగాను. ప్రతిసారీ అలా కలిసి రాదు కదా. ప్రతాప్ అంకుల్ నా గురించి ఎక్కువగా అనుకుంటున్నారు" అంది ప్రవల్లిక.

" అదేం కాదు. దొరికిన ఆధారాలను బట్టి సరిగ్గా ఊహించడం కూడా గొప్పే! ఐనా నీ గురించి నీకు తెలీదులే" అంది శారద కూతురి మీద నమ్మకంతో.

"నాన్నగారు కేసు డీల్ చేస్తూ వుంటే, పక్కనుండి సహాయం చెయ్యడం వేరు, నేను స్వయంగా ఒక కేసు డీల్ చెయ్యడం వేరు" అంది ప్రవల్లిక.

"చెప్పానుగా, నీ గురించి నీకు తెలీదని! ఏ సి పి గారు వెయిట్ చేస్తుంటారు. కాల్ చేసి వివరాలు కనుక్కో ముందు" అంది శారద.

ప్రవల్లిక కాల్ చెయ్యగానే, "హాయ్ ప్రవల్లికా! నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను" అంటూ ఇందాక శారదతో చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పాడు ఏ సి పి ప్రతాప్.

అంతా శ్రద్ధగా విన్న ప్రవల్లిక "అలాగే అంకుల్! ఈ కేసు టేకప్ చేస్తాను. కానీ పెద్ద వాళ్ళ వ్యవహారమన్నారు కదా! నా వల్ల మీ పేరు దెబ్బ తింటుందేమోనని కాస్త భయంగా ఉంది" అంది.

"మాములుగా అయితే అనుమానితులను అందర్నీ లాకప్ లో వేసి ఇంటరాగేట్ చేస్తాం. ఈ కేసులో ఆలా చెయ్యలేం కాబట్టే నీ సహాయం చాలా అవసరం. నువ్వు సరే అంటే ఇంటి దగ్గరకు వచ్చి పిక్ అప్ చేసుకుంటాను" అన్నాడు ప్రతాప్.

" అయ్యో! అంత శ్రమ ఎందుకు అంకుల్! నేనే మీ దగ్గరికి వస్తాను" అంది ప్రవల్లిక.

ఆమె ఆ మాటలంటూ ఉండగానే ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది.

లోపలి వచ్చిన ప్రతాప్ " నువ్వు కాదనవనే నమ్మకంతో ఇంటికి వచ్చేసాను. మరోలా అనుకోవద్దు" అన్నాడు.

"అన్నయ్యా! మీ గురించి మా ఇంట్లో ఎవరూ పొరపాటుగా అనుకోరు. మీకెలాంటి సందేహమూ వద్దు" అంది శారద.

"చాలా సంతోషమమ్మా! నాదొక చిన్న రిక్వెస్ట్. నాకు ఎక్కువ టైం లేదుగాని ఈ పూటకి కాఫీతో సరిపెట్టు. టిఫిన్ తినమని బలవంత పెట్టొద్దు. అందుకోసం మరోసారి వస్తాను" అన్నాడు ప్రతాప్.

"చూసావా అమ్మా పోలీస్ వాళ్ళ తెలివి? నన్ను కాఫీ పెట్టే టైములో... అంటే ఐదు నిమిషాల్లో రెడీ కమ్మంటున్నారు" అంది ప్రవల్లిక, రెడీ కావడానికివెడుతూ.

అన్నట్లుగానే ఐదు నిముషాల్లో రెడీ అయి " అంకుల్! పదండి" అంది.

తన వంక మెచ్చుకోలుగా చూసాడు ప్రతాప్.

శారదకు బై చెప్పి ఇద్దరూ బయలుదేరారు.

ప్రవల్లికను తిన్నగా వీరేశం ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు ప్రతాప్.

వీరేశానికి ప్రవల్లికను పరిచయం చేస్తూ, " ఈ అమ్మాయి పురంధర్ గారి కూతురు ప్రవల్లిక. చాలా తెలివైన అమ్మాయి. మీ సమస్యను యిట్టే సాల్వ్ చేస్తుంది. తనకు ఇబ్బంది కలక్కుండా చూసుకోండి. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండడం బాగుండదు. బయలుదేరుతాను " అని చెప్పాడు ప్రతాప్.

" మీరు ప్రతేకించి చెప్పాలా! మా ఇంటి అమ్మాయి లాగా చూసుకుంటాను . మీరు వెళ్ళిరండి" అన్నాడు మినిష్టర్ వీరేశం.

ప్రవల్లికకు కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు ప్రతాప్.

అతను వెళ్ళాక ఆమెను హాల్ పక్కనే ఉన్న డ్రాయింగ్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు వీరేశం.

అక్కడే వున్న తన గన్ మాన్ నీ , అనుచరులు ముగ్గురినీ బయటకు వెళ్ళమని చెప్పాడు.

కుర్చీలో కూర్చోమని చెప్పి , తానూ ఎదురుగా కూర్చున్నాడు.

తరువాత ప్రవల్లిక వైపు తిరిగి " చూడమ్మా! నీ గురించి ప్రతాప్ గారు చాలా గొప్పగా చెప్పారు. నిన్ను చూస్తుంటే నాక్కూడా నువ్వు చాలా తెలివిగలదానివనిపిస్తోంది. ఇది మా ఫామిలీ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. మేము కంప్లైంట్ చేస్తే పోలీసులు చాలా మందిని విచారిస్తారు. ఇక్కడ ఉన్నది కుటుంబ సభ్యులు, దగ్గరికి బంధువులు, ముఖ్యమైన అనుచరులు మాత్రమే. ఇక పనివాళ్ళందరూ ఎన్నో ఏళ్ళ నుండి నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళే. ఎవర్ని అనుమానించాలో, ఎవర్ని నమ్మాలో ఏమీ అర్థం కావడం లేదు. నువ్వే ఎలాగైనా ఈ సమస్యనుండి గట్టెంకించాలి" అన్నాడు వీరేశం.

"మీరేం వర్రీ అవకండి వీరేశం గారూ! మీ సమస్యను ప్రతాప్ అంకుల్ చెప్పారు. వీలయినంతవరకు మిమ్మల్నే అడిగి అందరి వివరాలూ తెలుసుకుంటాను. మీరు చేయవలసిందల్లా ఏదీ దాచుకోకుండా చెప్పాలి. అంతే!" అంది ప్రవల్లిక.

"అలాగేనమ్మా! నువ్వు అడిగిన వివరాలన్నీ చెప్తాను" అన్నాడు వీరేశం.

" ఫస్ట్ మీ ఫామిలీ మెంబర్స్ వివరాలు చెప్పండి " అడిగింది ప్రవల్లిక.

చెప్పడం ప్రారంభించాడు వీరేశం.

" ఈ ఇంట్లో నేను, నా భార్య విజయమ్మ, అమ్మాయి హారిక, మా అబ్బాయి దినేష్ ఉంటాము.

ఇక పెళ్లి పనుల కోసం నా మరదలు... అంటే నా భార్య చెల్లెలు సుచిత్ర వచ్చింది. ఆమెతో పాటు తన కూతురు ప్రియ కూడా వచ్చింది" అంటూ కుటుంబ సభ్యుల వివరాలు చెప్పాడు వీరేశం.

తరువాత తనే మాట్లాడుతూ " మాకు చాలా ఆస్తులు ఉన్నాయి. నా భార్య పేరుతోనే దాదాపు యాభై కోట్లు ఉన్నాయి. మా అమ్మాయి హారిక ఈ మధ్యే మెడిసిన్ పూర్తి చేసింది. ఆమె పెళ్లి కోసమే ఈ డైమండ్ నెక్లెస్ చేయించాము. అబ్బాయి దినేష్ బి టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.

ఇక నా మరదలు సుచిత్ర బెంగళూరులో ఉంటుంది. ఆమె భర్త చనిపోయి పదేళ్ళయింది. ఆమె పేరెంట్స్ ఆమెకు తోడుగా ఉంటారు. కూతురు ప్రియను బి టెక్ చదివిస్తోంది. మా ఆవిడ ఆమెకు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటుంది.

నా అన్న పక్కనే ఉన్న విలేజిలో ఉంటాడు. వంద ఎకరాల భూస్వామి. అయన కొడుకు సూరజ్ ఇక్కడే ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ లో ఉంటూ బి టెక్ చదువుతున్నాడు. నీకు ఇంకా ఏవైనా వివరాలు కావలిస్తే అడుగు" అన్నాడు వీరేశం.

"మీ అమ్మాయి స్నేహితులు,స్నేహితురాళ్ళు ఎలాంటివాళ్ళు?" ప్రశ్నించింది ప్రవల్లిక.

" అమ్మాయికి డొనేషన్ కట్టి ఢిల్లీ లో మెడిసిన్ చదివించాము. ఇక్కడెవరూ స్నేహితులు, స్నేహితురాళ్ళు లేరు. ప్రియతోనే కాస్త స్నేహంగా ఉంటుంది. అబ్బాయికి మాత్రం కొందరు స్నేహితులు ఉన్నారు. అప్పుడప్పుడూ ఇంటికి వస్తూ వుంటారు. నిన్న మాత్రం ఎవరూ ఇక్కడికి రాలేదు. " అన్నాడు వీరేశం.

"ప్రియ గురించి, సూరజ్ గురించి కూడా చెప్పండి." అని అడిగింది ప్రవల్లిక.

ప్రియ చాలా అభిమానం గల పిల్ల. అనవసరంగా ఎవరిముందూ చేయి చాపదు. మా దగ్గర సరే మొహమాటం అనుకోవచ్చు. మా అమ్మాయి ఒక ఫ్రెండ్ లాగా ఏదైనా ఖర్చు పెడతానన్నా, గిఫ్ట్ గా ఏదైనా ఇస్తానన్నా కూడా ఏమాత్రం ఒప్పుకోదు. వాళ్ళ అమ్మ సుచిత్ర మీద మాత్రం నాకు అంతగా సదభిప్రాయం లేదు.

ఇక సూరజ్ అందరు కుర్రాళ్ళలాగా ఫ్రెండ్స్, పార్టీస్ అంటూ తిరుగుతుంటాడు" చెప్పాడు వీరేశం.

"మీ ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు? " అడిగింది ప్రవల్లిక.

"శేషమ్మ అని ఒక వంటావిడ వుంది. దాదాపు పాతికేళ్ల నుంచి మా ఇంట్లో పనిచేస్తోంది. కాస్త చేతివాటం వున్నా, అది ఉప్పూ పప్పుల వరకే. ఇంటి పని చెయ్యడానికి సుందరమ్మ, ఆవిడ కూతురు రాజ్యం ఉన్నారు. హాలు దాటి, లోపలికి వచ్చే పనివాళ్ళు వీళ్ళే.

ఇక తోట పని చెయ్యడానికి ఐదుగురు పనివాళ్ళు ఉన్నారు" చెప్పాడు వీరేశం.

"ఇంటి దగ్గర ఐదుగురు తోట పని చేస్తారా? " ఆశ్చర్యంగా అడిగింది ప్రవల్లిక.

"నిజానికి తోటపని చేసేది ఒక్కరే. మిగతా నలుగురూ నాకు అనధికార బాడీ గార్డులు.రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కదా. ఎవరైనా ఎటాక్ చెయ్యాలని ప్రయత్నిస్తే , పలుగు, పారలతో అడ్డుకుంటారు. ఇక గేట్ బయట సెక్యూరిటీ, హాలు ఎంట్రన్స్ దగ్గర ఒక వాచ్ మాన్ ఉంటారు. ఈ డ్రాయింగ్ రూమ్ కి బయట నుంచి దారి ఉంది . నువ్వూచూసావు కదా!

బయటి వాళ్ళను వాచ్ మాన్ నేరుగా ఇక్కడికి పంపిస్తాడు. ఇక్కడ ఇప్పుడు నువ్వు చూసిన గన్ మాన్, కొందరు అనుచరులూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఏ పనిమీద ఇక్కడికి వచ్చారో తెలుసుకొని అవసరమైతేనే నా దగ్గరికి తీసుకొని వస్తారు. లేదంటే వాళ్లే మాట్లాడి పంపించేస్తారు" చెప్పాడు వీరేశం.

"ఇంత ఖర్చు పెట్టి డైమండ్ నెక్లెస్ చేయించారు కదా! ఇంటికి పిలిచి ఎవరికీ చూపించలేదా?" ప్రశ్నించింది ప్రవల్లిక.

"సరైన ప్రశ్న అడిగావమ్మా. ఇంటికి తేకముందే చాలామందికి చూపించాను. ఇంటికి తెచ్చాక నా భార్య తన ఫ్రెండ్స్ చాలా మందికి చూపించింది. నిన్న వరలక్ష్మీ వ్రతం కదా. ఉదయాన్నే అమ్మవారికి డైమండ్ నెక్లెస్ అలంకరించి పూజ చేశాను. ఆ నెక్లెస్ తో అమ్మవారు ధగధగా మెరిసిపోతుండటంతో తియ్యడానికి మనసు ఒప్పలేదు. నిన్న సాయంత్రం పునఃపూజ చేసి, తియ్యవచ్చు అనుకున్నాను. కానీ భయం కొద్దీ నగ ఉందా లేదా అని నేను, నా భార్య అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నాం. చివరగా నిన్న సాయంత్రం ఆరు గంటలకు చూసినప్పుడు నగ కనిపించలేదు" చెప్పాడు వీరేశం.



"చివరిసారిగా ఆ డైమండ్ నెక్లెస్ ను ఎప్పడు చూసారు?" ప్రశ్నించింది ప్రవల్లిక.

నిన్న మధ్యాహ్నం భోజనం చేసాక పడుకోబోయే ముందు చూసాను. నిన్న సాయంత్రం తీద్దామనుకునేటప్పటికి అది కాస్తా మాయం అయింది" విచారంగా చెప్పాడు వీరేశం.

" మీరు చేయించిన నగను ఇన్సూర్ చేయించారా?" హఠాత్తుగా ప్రశ్నించింది ప్రవల్లిక.

" ఇంకా ఈ ప్రశ్న అడగలేదేమిటి అని అనుకుంటూ ఉన్నాను. ఇన్సూర్ చేయించాను. కానీ అందుకోసం నగ పోయినట్లు నాటకాలు ఆడను. పైగా ఇన్సూరెన్సు క్లెయిమ్ చేయాలంటే 'ఎఫ్ ఐ ఆర్' ఖచ్చితంగా ఉండాలి " అన్నాడు వీరేశం కాస్త బాధగా.

"మీరు అలా నాటకాలు ఆడరు. ఆ విషయం నాకు తెలుసు. నగ దొంగిలించింది మీకు కావలసిన వాళ్ళు కాకపోతే మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి , తరువాత ఇన్సూరెన్సు క్లెయిమ్ చేస్తారు. అది తేల్చుకోవడానికే మా హెల్ప్ అడిగారు." అంది ప్రవల్లిక.

"సరిగ్గా కనిపెట్టావమ్మా! ఎవరు తీశారో కనిపెట్టలేక పోయినా, మా వాళ్ళు తీలేదని కన్ఫర్మ్ చేసుకుంటే చాలు" అన్నాడు వీరేశం.

"సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా?" అడిగింది ప్రవల్లిక.

"నిజం చెప్పాలంటే నాకు నా మరదలు సుచిత్ర పైనే అనుమానం ఉంది. ఆమె కూతురు ప్రియ మంచిదే కానీ ఈవిడను కాస్త అనుమానించవచ్చు' చెప్పాడు వీరేశం.

" నేను ఎవరెవరిని ప్రశ్నలు అడగవచ్చు?" అడిగింది ప్రవల్లిక.

" పోలీసులు అడిగితే కాస్త ఫీల్ అవుతారు కానీ నువ్వు అడిగితే ఎవరు పెద్దగా ఫీల్ కారు. ఎవరినైనా అడుగు " అన్నాడు వీరేశం.

"మీ ఆవిడను ఏమైనా అడగవచ్చా?"

"అడగండి. ఆవిడ సూరజ్ పేరే చెబుతుంది. నాకు తెలుసు. అయినా ఆవిడను పంపిస్తాను. మీరే ప్రశ్నించండి" అంటూ తను బయటికి వెళ్ళాడు.

కాస్సేపటికి భారీ ఆకారంతో నడవడానికే ఇబ్బంది పడుతూ వచ్చింది వీరేశం భార్య విజయమ్మ.

ఆవిడకు లేచి నిలబడి నమస్కారం చేసింది ప్రవల్లిక. ఆవిడ కూర్చున్నాకే తను కూర్చుంది.

ఆవిడ ప్రవల్లిక వంక ఆప్యాయంగా చూస్తూ " ఎంత చక్కగా ఉన్నావమ్మా! చిదిమి దీపం పెట్టుకోవచ్చు"అంది.

సిగ్గుపడింది ప్రవల్లిక.

"థాంక్ యూ మేడం. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏమీ అనుకోరుగా?" అంది ఆవిడతో.

" అడక్కపోతే కేసు ఎలా తేలుస్తావు? మొహమాటం లేకుండా అడుగు. నాకు తెలిసిందంతా చెబుతాను" అంది విజయమ్మ.

"మీకు ఎవరిమీద అనుమానం ఉంది?" అడిగింది ప్రవల్లిక.

"సూరజ్ అని ఈయన అన్న కొడుకు ఒకడు ఉన్నాడు. నా అనుమానం వాడి మీదే" సందేహమే అవసరం లేదన్నట్లుగా చెప్పింది విజయమ్మ.

"అంత గ్యారెంటీగా ఎలా చెప్పగలరు?" అంది ప్రవల్లిక.

నిన్న మధ్యాహ్నం మేము పడుకున్నాక ఇంట్లోకి వచ్చింది వాడొక్కడే. వాడు కాకపోతే ఇంకెవరు తీస్తారు. మిగతా అందరూ ముందునుంచి ఉన్నవాళ్లే. వాళ్ళు తీయాలనుకుంటే ఎప్పుడో తీసి ఉండొచ్చు" అందామె.

" అతను వచ్చిన టైం లో తీస్తే అతని మీదకు అనుమానం పోతుంది అని ఎవరైనా అనుకొని ఉండొచ్చు కదా!" తన సందేహం బయట పెట్టింది ప్రవల్లిక.

"ఈయన నా చెల్లెలి గురించి చెప్పి ఉంటాడు. భర్త చనిపోయి ఒంటరిగా ఉన్నా ఎవరికీ లోబడలేదు. అందుకని ఎవరికయినా కోపం ఉండవచ్చు. ఇంతకంటే వివరం చెప్పలేను. అర్థమైందనుకుంటాను" అంది విజయమ్మ ఏవో పాత విషయాలు గుర్తు చేసుకుంటూ.

"సూరజ్ ఇంతకు ముందెప్పుడైనా మీ ఇంట్లో దొంగతనాలు చేశాడా?” అడిగినది ప్రవల్లిక.


"వాడిని మొదట మా ఇంట్లోనే ఉంచుకున్నాం. వాడి వెధవ పనులు భరించలేక బయటకు పంపాము. బాబాయి ఇంట్లో దొంగతనం చెయ్యకూడదని వాడికి లేనప్పుడు, వాడి పరువు గురించి మేమెందుకు ఆలోచించాలి? పోలీస్ లాకప్ లో పెట్టి నాలుగు తగిలిస్తే వాడే నిజం చెబుతాడు" ఆవేశంగా అంది విజయమ్మ.

"అతను దొంగతనం చేసి వుంటే ఖచ్చితంగా పట్టుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి" అంది ప్రవల్లిక.

"నాకు తెలుసమ్మా! నువ్వంతటి సమర్ధురాలివే. ఆ సూరజ్ దొంగని రుజువు చేస్తే నేను పర్సనల్ గా నీకు మంచి బహుమానం ఇస్తాను" అంది విజయమ్మ.

ఇంతలో వీరేశం ఆ గదిలోకి వచ్చాడు.

అతడు రావడం గమనించిన విజయమ్మ ప్రవల్లికతో చిన్నగా" చూసావా! ఆ సూరజ్ గురించి చెబుతానేమోనని వెంటనే వచ్చేసాడు" అంది.

" ఈవిడ దెబ్బకు నా తరఫు బంధువులందరూ దూరం అయ్యారు. సూరజ్ ని అనుమానించి , మా అన్నను కూడా దూరం చేసుకోలేను" అన్నాడు వీరేశం.

మూతి ముడుచుకొని ఇంట్లోకి వెళ్ళింది విజయమ్మ.

" చెప్పమ్మా. ఇంకా ఎవరితో మాట్లాడుతావు?" అడిగాడు వీరేశం.

"మీ ఇంట్లో సి సి కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?" అడిగింది ప్రవల్లిక.

"కాంపౌండ్ వాల్ పూర్తిగా కవర్ చేసాము. బయట గేట్ దగ్గర, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర, డ్రాయింగ్ రూంలో కూడా కెమెరాలు ఉన్నాయి. హాల్ లో కూడా కెమెరా ఉంది. ఇంట్లో మాత్రం కెమెరాలు లేవు. సి సి కెమెరా మానిటర్ ఇక్కడే ఉంది. కావాలంటే చూడు" చెప్పాడు వీరేశం.

" థాంక్ యూ! ఒకసారి మీ అమ్మాయిని పంపించండి." అడిగింది ప్రవల్లిక.

అలాగేనంటూ లోపలికి వెళ్ళాడు వీరేశం. మరి కాస్సేపటికి అక్కడికి వచ్చింది వీరేశం కూతురు హారిక.

కుర్చీని ప్రవల్లిక పక్కకు జరుపుకొని, భుజం మీద చెయ్యివేసి, " నా పేరు హారిక. నాకు చిన్నప్పట్నుంచి డిటెక్టివ్ నవలలంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక డిటెక్టివ్ ని కలవడం... అందునా లేడీ డిటెక్టివ్ ని డైరెక్ట్ గా కలవడం థ్రిల్లింగ్ గా ఉంది " అంది సంతోషంతో.

"నాక్కూడా నిన్ను కలవడం సంతోషంగా ఉంది. నీ సహకారంతో ఈ కేసును సాల్వ్ చేస్తాను. సి సి కెమెరా రికార్డింగ్స్ చూడాలి. పాస్వర్డ్ చెబుతావా?"

"నాకు తెలీదు. డిఫాల్ట్ పాస్వర్డ్ ట్రై చెయ్యండి" అంది హారిక.

మానిటర్ ఓపెన్ చేసి ముందురోజు రికార్డింగ్స్ చూసింది . మధ్యాహ్నం మూడుగంటలు ఇంట్లోకి వెళ్ళాడు సూరజ్. తిరిగి మూడున్నరకు బయటకు వెళ్ళిపోయాడు.

" సూరజ్ ఎందుకు వచ్చాడో తెలుసా?" అడిగింది ప్రవల్లిక.

"మా పిన్ని నగ ఒకటి పెరిగిపోయింది (తెగి పోయింది). రిపేర్ చేయించమని సూరజ్ తో చెప్పింది అమ్మ. తనకు తెలిసిన జ్యూవెలరీ షాప్ లో రిపేర్ చేయిస్తానని తీసుకొని వెళ్ళాడు సూరజ్. వారం అయింది. ఇంకా తేలేదు. నిన్న మా తమ్ముడు గుర్తు చేయడంతో ఫోన్ చేశాను. మధ్యాహ్నం తెచ్చిచ్చాడు సూరజ్" చెప్పింది హారిక.

ఒక వారం రోజులు వెనక్కి వెళ్లి రోజూ ఎవరెవరు ఇంట్లోకి వస్తున్నారో గమనించింది ప్రవల్లిక. తరువాత కొద్దిసేపు హారికతో మాట్లాడింది. ప్రవల్లిక చేప్పేది శ్రద్ధగా వినింది హారిక. తరువాత ఇద్దరూ కలిసి వీరేశం దగ్గరికి వెళ్లారు.

" డాడ్! ప్రవల్లిక నాకు మంచి ఫ్రెండ్ అయిపొయింది. ఇద్దరం అలా వెళ్లి ఐస్ క్రీం తిని వస్తాం" తండ్రితో చెప్పింది హారిక.ఇద్దరూ బయటకు వెళ్లారు. ఒక గంట తరువాత ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు

***

ఆఫీస్ లో కూర్చొని వీరేశం ఇంట్లో జరిగిన డైమండ్ నెక్లెస్ చోరీ గురించి ఆలోచిస్తున్నాడు ఏ సి పి ప్రతాప్. అనవసరంగా ప్రవల్లికను ఇబ్బంది పెట్టానేమో అని బాధ పడ్డాడు. పురంధర్ తో తనకున్న స్నేహాన్ని ఇలా దుర్వినియోగం చెయ్యడం తప్పనిపించింది. ‘ప్రవల్లికకు ఫోన్ చేసి, ఈ కేసును లైట్ తీసుకోమని చెప్పాలి ' అనుకుంటూ ఉండగానే ఆమె దగ్గరనుండే ఫోన్ వచ్చింది.

"అంకుల్! దొంగ దొరికాడు. మీరు వెంటనే వీరేశం గారి ఇంటి దగ్గరకు రండి" అంది .

ఫోన్ పెట్టేసి వెంటనే బయలుదేరాడు ప్రతాప్.

అతను వెళ్లేసరికి వీరేశం ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ఉన్నారు ప్రవల్లిక, హారిక. ప్రతాప్ రాగానే ఇద్దరూ పైకి లేచి నమస్కరించారు. తరువాత క్లుప్తంగా తన పరిశోధన వివరాలు చెప్పింది ప్రవల్లిక.

వీరేశాన్ని , విజయమ్మను, దినేష్ ను అక్కడికి పిలిపించాడు ప్రతాప్.

"దొంగ దొరికాడు. ప్రవల్లిక కనిపెట్టేసింది." అని చెప్పాడు.

(సశేషం.... తరువాతి భాగం త్వరలో)

***శుభం***


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).




123 views0 comments
bottom of page