top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

వెంటాడే నీడ - ఎపిసోడ్ 4


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Ventade Nida Episode 4' Telugu Horror Web Series Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

గత ఎపిసోడ్ లో ....

తన మీదకు దూకిన వింత ఆకారాన్ని గునపంతో పొడుస్తాడు సుమంత్. సహాయం కోసం తన స్నేహితుడు విశాల్ కు కాల్ చేస్తాడు. ఆ ఫోన్ ఆశ్చర్యంగా కింద పడివున్న ఆ ఆకారం దగ్గర నుండి రింగ్ అవుతుంది.. దగ్గరకు వెళ్లిన అతని మీదకు ఆ ఆకారం దూకుతుంది.


అతను కళ్ళు తెరిచేటప్పటికి పక్కన విశాల్ ఉంటాడు. జరిగినదంతా కల అని చెబుతాడు.ఇద్దరూ బైక్ లో బయలుదేరుతారు.ముందుకు పడుతున్న నీడలో తన వెనక వున్నది ఆ వికృతాకారమని గమనిస్తాడు సుమంత్. అదుపు తప్పి క్రింద పడిపోతాడు.


ఇక చదవండి...


మధ్యాహ్నం భోజనం చేస్తూ "అమ్మాయి శ్రేయ డెలివరీ డేట్ చెప్పారన్నావు. వచ్చేవారమే కదూ!" భార్య సావిత్రితో అన్నాడు డాక్టర్ శ్యామలరావు.


"అవునండీ! మొదటి డెలివరీ ఇక్కడే విజయవాడలోనే, మన హాస్పిటల్ లోనే చేసాము. హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఈసారి తమ దగ్గరే హైదరాబాద్ లో చేస్తామన్నారు వియ్యంకులు. అన్నారని మరీ దూరపు చుట్టాల్లా డెలివరీ రోజుకు వెళితే బాగుండదు. అలాగని ముందుగా వెళదామంటే మనకు హాస్పిటల్లో తీరిక దొరకదు. " అంది సావిత్రి. ఆమె కూడా ఒక డాక్టర్.


"ఒక పని చేద్దాం. నువ్వు ఈ రోజే బయలుదేరి వెళ్ళు. మన హాస్పిటల్ సంగతి నేను చూసుకుంటాను. డెలివరీ డేట్ కు అక్కడికి వస్తాను. " అన్నాడు శ్యామలరావు.

సరేనంది సావిత్రి.


"సిటీ లో మంచి పేరున్న గైనకాలజిస్ట్ వి నువ్వు. మన హాస్పిటల్ కి వచ్చే పేషేంట్ లలో తొంభై శాతం నీకోసమే వస్తారు. కాబట్టి నేను వెళ్లడమే కరెక్ట్. కానీ నువ్వు వెళితే అక్కడ కాస్త సాయంగా ఉంటుంది. నేను వెళ్లీ పెద్ద ఉపయోగం ఉండదు, పని పెంచడం తప్ప " మళ్ళీ తనే అన్నాడు శ్యామలరావు.


"ఈ రెండు వారాల్లో డెలివరీ కేసులు లేవు లెండి. నేనే వెళతాను. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. " అంది సావిత్రి.

భోజనాలు ముగించాక కాసేపు నడుం వాల్చి, తిరిగి నాలుగు గంటలకు హాస్పిటల్ కు వెళ్లడం అలవాటు ఇద్దరికీ.


ఎమర్జెన్సీ కేసులుంటే మాత్రం భోజనం కూడా మానేసి హాస్పిటల్ లోనే ఉండిపోతారు.

ఆ రోజు పడుకున్న గంటకే ఫోన్ మ్రోగడంతో తీసి చూసాడు శ్యామలరావు.

హైదరాబాద్ నుండి అల్లుడు వికాస్ కాల్ చేస్తున్నాడు.


'బహుశా తమ ప్రయాణం గురించి అయి ఉండవచ్చు' అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసాడు శ్యామలరావు.


"మామయ్యగారూ! శ్రేయకు పొట్టలో విపరీతంగా నొప్పివస్తే హాస్పిటల్ లో చేర్చాము. బిడ్డ అడ్డం తిరిగిందనీ, వెంటనే సిజేరియన్ చెయ్యాలనీ చెప్పారు. రేపు పొద్దునే డెలివరీ. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. వీలు చూసుకొని బయలు దేరండి. అత్తగారికి విషయం నెమ్మదిగా చెప్పండి. " అన్నాడు వికాస్.


ఆందోళన స్టార్ట్ అయింది శ్యామలరావుకి.

వెంటనే భార్య సావిత్రిని నిద్ర లేపాడు.


"ఏమైందండీ? హాస్పిటల్ నించి కాల్ వచ్చిందా?"అని భర్తను అడిగింది.

" అదేం లేదు. అమ్మాయి కలలోకి వచ్చింది. ‘అమ్మనూ, నిన్నూ చూడాలనుంది. వెంటనే రండి నాన్నా’ అంది. అందుకని మనం ఈ రోజే బయలుదేరుదాం" అన్నాడు శ్యామలరావు.


"ఎప్పుడూ లేనిది మీకు కల రావడం ఏమిటి? ఎప్పుడో ఒకసారి ఏదైనా కల వచ్చినా, అది మన హాస్పిటల్ కి సంబంధించింది అయి ఉంటుంది" అంది సావిత్రి.


"మరేం లేదు. అమ్మాయి డెలివరీ అనుకున్న దానికంటే ముందుగా అవుతుందట. మనం ఈ రోజే వెడదామా?"


" మీరు ఒక గైనకాలజిస్ట్ తో మాట్లాడుతున్నారు. అసలు విషయం చెప్పడం లేదు. " అంటూ భర్త ఫోన్ తీసుకోని చూసింది. వికాస్ నుండి వచ్చిన కాల్ అది.

వెంటనే అతడికి కాల్ చేసి విషయం తెలుసుకుంది.


తరువాత భర్త వైపు తిరిగి " విషయం చెప్పడానికి ఎందుకంత సంకోచిస్తున్నారు? ఇప్పటికి వెయ్యి డెలివరీలు చేసినదాన్ని. ఆమాత్రం అర్థం చేసుకోలేనా?" అంది.


"డాక్టర్ సావిత్రి వేరు, శ్రేయ తల్లి సావిత్రి వేరు. ఒక తల్లిగా నీకూ టెన్షన్ వుంటుందిగా! సరే. తొందరగా బయలుదేరాలి. రెడీ అవుదాం " అంటూ డ్రైవర్ వెంకటేష్ కి కాల్ చేసాడు శ్యామలరావు.


అతడు లిఫ్ట్ చెయ్యగానే " మనం అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. అమ్మాయికి డెలివరీ టైం అట. త్వరగా బయలుదేరాలి " అని చెప్పాడు.


" అలాగే సర్. ఒక అరగంటలో అక్కడుంటాను. " అన్నాడు వెంకటేష్.


వెంకటేష్ వచ్చేలోగా బట్టలు సర్దేసింది సావిత్రి. భర్త ముందుగా విజయవాడకు తిరిగి రావడానికి వీలుగా ఆయన బట్టలు విడిగా సర్దింది. ఈ లోగా శ్యామలరావు, అల్లుడు వికాస్ కి మరో రెండు మార్లు ఫోన్ చేసాడు.


అదిచూసి సావిత్రి " మనం డాక్టర్లం. అల్లుడికి ధైర్యం చెప్పాల్సినవాళ్ళం. మనమే టెన్షన్ పడితే ఇక అల్లుడు ఎంత ఆందోళనలో ఉంటాడో!" అంది.


" నిజమే! కానీ ఎంత సర్ది చెప్పకున్నా టెన్షన్ తగ్గడం లేదు. మరి నీ పరిస్థితి ఎలా వుందో?"

" నిజమే. నాకూ ఆందోళనగానే ఉంది. బయటకు చెప్పడం లేదంతే. అది సరేగానీ మన వెంకటేష్ కాస్త రాష్ గా డ్రైవ్ చేస్తాడు. మీరు డ్రైవర్ పక్క సీట్లో కూర్చోండి కాస్త కంట్రోల్ అవుతాడు " అంది సావిత్రి. అలాగేనన్నాడు శ్యామలరావు.


మరి కాస్సేపట్లో ఇద్దరూ హైదరాబాద్ కు బయలుదేరారు. యజమాని పక్కనే కూర్చోవడం తొ కుదురుగానే డ్రైవ్ చేస్తున్నాడు వెంకటేష్.


బయలుదేరిన పావు గంటకు శ్యామలరావుకు కాల్ చేసాడు వికాస్.

" చెప్పండి అల్లుడుగారూ! మేము బయలుదేరి పావు గంటయింది. " అన్నాడు శ్యామలరావు.


" మామగారూ! ఒక చిన్న సహాయం కావాలి. ఏమీ అనుకోరుగా?" అన్నాడు వికాస్.

ఎంతమాట అల్లుడుగారూ ! చెప్పండి" అన్నాడు శ్యామలరావు.

అటువైపు నుండి నిశ్శబ్దం.


వికాస్ ఏదో చెప్పడానికి తటపటాయిస్తున్నట్లు గ్రహించాడు శ్యామలరావు.

"అల్లుడుగారూ ! మేము పరాయి వాళ్ళం కాదు. మా వలన ఏ విషయంలో సాయం కావాలో సంకోచించకుండా చెప్పండి " అన్నాడు.


"కంచికచర్లకు పదికిలోమీటర్ల ముందు ఒక మామిడి తోట ఉంది. ఒకసారి మనమందరం కార్తీక మాసంలో అక్కడ వనభోజనాలు చేసుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది" అన్నాడు వికాస్.


" అవును. ఆ రోజు అందరం చాలా ఎంజాయ్ చేసాము" అన్నాడు శ్యామలరావు.


ఆ తోటలో మా తమ్ముడు విశాల్, తన స్నేహితులతో కలిసి.." చెప్పడం ఆపాడు వికాస్.


"ఇందులో దాపరికం ఎందుకు? ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకొని ఉంటాడు. అంతేనా?" అన్నాడు శ్యామలరావు.


"అవును మామయ్యా ! వాడికి ఫోన్ చేసి, శ్రేయను హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన విషయం చెప్పాను. వెంటనే బయలుదేరుతానని చెప్పాడు. అంతే! ఆ తరువాత మేము కాల్ చెయ్యడానికి ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. విశాల్ బయలుదేరాడో , లేదో అర్థం కావడం లేదు. ఒకసారి ఆ తోట దగ్గర కార్ ఆపమనండి. అక్కడ విశాల్ గానీ , అతడి స్నేహితులు గానీ ఉన్నారేమో కనుక్కోమని డ్రైవర్ వెంకటేష్ కి చెప్పండి. ఒకసారి ఫోన్ వెంకటేష్ కి ఇవ్వండి. " అన్నాడు వికాస్.


డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడితే శ్యామలరావు ఒప్పుకోడని తెలుసు వెంకటేష్ కి. కారును రోడ్ పక్కగా ఆపాడు. తరువాత ఫోన్ అందుకున్నాడు. వికాస్ చెప్పింది శ్రద్ధగా విన్నాడు.


తరువాత ఫోన్ శ్యామలరావుకి అప్పగించి, కార్ స్టార్ట్ చేసాడు.

మరో అరగంటకి ఆ మామిడి తోటకి చేరుకున్నారు.


"మీరు కూర్చోండి అయ్యగారూ! నేను వెళ్లి కనుక్కుంటాను" అన్నాడు వెంకటేష్ కారు దిగుతూ.


"మేము కూడా వస్తాం. కాస్సేపు చెట్ల గాలి పీల్చుకుంటాం" అంటూ భార్యతో పాటు కిందికి దిగాడు శ్యామలరావు.


అందరూ మామిడి తోట దగ్గరకు వెళ్లారు.


గేట్ కి లోపలి వైపు నుండి తాళం వేసివుంది. వీళ్ళను చూసి, ఒక పొడవాటి వ్యక్తి వచ్చి, గేట్ తాళం తీసాడు.


ఆ వ్యక్తి దాదాపు ఆరున్నర అడుగుల పొడవు వున్నాడు. వికృతమైన ముఖంతో చూడగానే భయం కలిగించేట్లు ఉన్నాడు.


"ఎవరు కావాలి మీకు?" అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి..

"మా వాళ్ళు ఈ తోట యజమానికి స్నేహితులు. ఒకసారి తోటమాలిని అదే...వాచ్ మన్ ని పిలుస్తారా.." అన్నాడు శ్యామలరావు.


వాళ్ళ వంక పరిశీలనగా చూసాడు ఆ వ్యక్తి..

అతని చూపులు ఎంతో భయాన్ని కలిగిస్తున్నాయి.


"ముందు లోపలి రండి. మాట్లాడుకుందాం " అన్నాడా వ్యక్తి గేట్ తెరుస్తూ.


శ్యామలరావు, సావిత్రి, వాళ్ళ డ్రైవర్ వెంకటేష్... ముగ్గురూ లోపలికి నడిచారు. గేట్ దాటగానే ఎడమ వైపు ఒక గుడిసె ఉంది. ఆ గుడిసె దగ్గరికి వెళ్ళాక, ఆ వ్యక్తి వెంకటేష్ ను లోపలికి తీసుకొని వెళ్ళాడు. లోపలినుంచి ఒక నులక మంచం, రెండు గోద్రెజ్ ఇనప కుర్చీలు బయటకు తీసుకొని వచ్చారు.


వెంకటేష్ ఆ కుర్చీలను తుడిచి, శ్యామలరావు దంపతులను కూర్చోమన్నాడు.

ఆ వ్యక్తి నులక మంచం పై కూర్చుని , వెంకటేష్ ను తన పక్కన కూర్చోమన్నాడు. తరువాత శ్యామలరావు వైపు తిరిగి "ఇప్పుడు చెప్పండి. మీకు మా ఓనర్ ఎలా తెలుసు? వాచ్ మన్ తో ఏం పని మీకు? వాచ్ మన్ చనిపోయి ఆరు నెలలయింది. మీకు ఆ విషయం తెలీదా?" అన్నాడు.


ఆశ్చర్యపోయారు ముగ్గురూ.


ముందుగా తేరుకున్న శ్యామలరావు " ఏంటీ! వాచ్ మన్ చనిపోయాడా! పోయిన సంవత్సరం వన భోజనాలకి ఇక్కడికి వచ్చినప్పుడు చూసాం. చాలా మంచి వ్యక్తి. ఎలా చనిపోయాడు?" అన్నాడు.


అతను వీళ్ళ వంక విచిత్రంగా చూస్తూ " ఈ తోట ఓనరు మీకు తెలుసన్నారు.. మరి వాచ్ మన్ కుటుంబం మొత్త సూయిసైడ్ చేసుకున్న విషయం తెలీదా!" అన్నాడు.


"తెలీదు. హేమంత్ వాళ్లదే కదా ఈ తోట? అతను మా అల్లుడి తమ్ముడు విశాల్ కు మంచి ఫ్రెండ్. " చెప్పాడు శ్యామలరావు.


"ఓహ్ ! విశాల్ బంధువులా మీరు? విశాల్ నాకూ బాగా తెలుసు. నేను హేమంత్ కి పెదనాన్న కొడుకుని. నా పేరు గోవర్ధన్. ఆ వాచ్ మన్ పేరు షణ్ముగం. భార్యతో కలిసి ఇక్కడే ఉండేవాడు. అతడికి ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళు కవల పిల్లలు. ఇద్దరూ గొల్లపూడిలో హాస్టల్ లో వుండి ఇంటర్ చదువుతున్నారు. అప్పుడప్పుడూ ఇక్కడికి వస్తుంటారు. ఏమైందో గాని ఒక రోజు నలుగురూ చెట్టుకు వురి వేసుకొని చనిపోయారు" చెప్పడం ఆపాడు అతను.


"అయ్యో! ఏమైంది? ఏదైనా అఘాయిత్యం జరిగిందా?" ఆందోళనతో ప్రశ్నించాడు శ్యామలరావు.


"కాలేజీకి సెలవలు ఇవ్వడంతో ఇద్దరు అమ్మాయిలూ ఇక్కడికి వచ్చారు. మామూలుగా అయితే సెలవుల్లో వాళ్ళు గొల్లపూడి లోనే వున్న వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళతారు. వాళ్ళ కోసం షణ్ముగం భార్య చంద్రిక అక్కడకు వెళుతుంది. అంతేగానీ వాళ్ళు ఈ తోట దగ్గరికి రారు. వూరి చివర ఉంది కదా! కానీ ప్రస్తుతం అక్కడ కోవిడ్ ఎక్కువగా ఉండడంతో పిల్లలు ఇక్కడికి వచ్చారు.


వాళ్ళు వచ్చిన రెండు రోజులకే ఇదిగో...ఈ మామిడి చెట్టు కొమ్మలకే వురి వేసుకొని నలుగురూ చనిపోయారు. కారణమేమిటో ఈ తోటలో వున్న గంగమ్మ రాయికే తెలియాలి. పోలీసులు వచ్చారు. పోస్టుమార్టం చేయించారు. చివరకు పేదరికంతో నలుగురూ ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. అప్పట్లో టీవీ లోనూ, పేపర్లలోనూ ఈ వార్తే ఎక్కువగా వచ్చేది. అందుకే ఈ విషయం మీకు తెలీదంటే ఆశ్చర్యం వేసింది.


ఇక నా గురించి చెబుతాను. నేను డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాను. తోటలో నాలుగు ఆత్మహత్యలు జరగడంతో వాచ్ మన్ పనికి ఎవరూ రాలేదు. కొత్త వాచ్ మన్ వచ్చేవరకూ తోటను చూసుకొమ్మని మా నాన్న చెప్పడంతో నేను రోజూ ఉదయం ఇక్కడికి వస్తూ వుంటాను. తిరిగి ఈ సమయానికి ఇంటికి వెళ్ళిపోతాను. పొరపాటున కూడా రాత్రిపూట ఇక్కడ ఉండను. ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటి?" చెప్పడం ముగించి ప్రశ్నించాడు గోవర్ధన్.


"మా అల్లుడి తమ్ముడు విశాల్, ఈ రోజు ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడ పార్టీ చేసుకున్నాడట! మా అమ్మాయిని డెలివరీ కి హాస్పిటల్ లో చేర్చినట్టు మా అల్లుడు వికాస్ ఫోన్ చేస్తే, వెంటనే బయలుదేరుతున్నట్లు చెప్పాడట. కానీ ఆ తరువాత ఫోన్ చేస్తే 'స్విచ్ ఆఫ్' అని వస్తోందట. విశాల్ ఫ్రెండ్ సుమంత్ కి ఫోన్ చేస్తే కూడా అలానే వస్తోందట. వాచ్ మన్ ను కలిస్తే వివరాలు తెలుస్తాయని ఇక్కడ ఆగాము. తీరా అతడు ఎప్పుడో చనిపోయాడంటున్నావు. పోనీ నీకైనా విషయం తెలుసునా? ఆ పార్టీ లో నువ్వుకూడా ఉన్నావా? " ఆతృతగా అడిగాడు శ్యామలరావు.


నన్ను కూడా పార్టీకి రమ్మని పిలిచారు. కానీ మా చెల్లెలికి జ్వరంగా ఉండటంతో హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాను. తనను ఇంటి దగ్గర దించి ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేసరికి అంతా వెళ్లిపోయారు. " చెప్పాడు గోవర్ధన్.


"అయ్యో! మరి విశాల్ కి ఏమయ్యిందో..." అని నిట్టూర్చి, " ఇక మేము బయలుదేరుతాం గోవర్ధన్ " అంటూ పైకిలేచాడు శ్యామలరావు.


"అలాగేనండీ. వీలుంటే తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగండి. ఒక బుట్టెడు మామిడి పండ్లు ఇస్తాను" అన్నాడు గోవర్ధన్.


"అలాగేలే!" అని బయటకు నడిచాడు శ్యామలరావు.

అతని వెంటే బయటకు నడిచారు సావిత్రి, వెంకటేష్.

వాళ్ళను గేటు వరకు సాగనంపి, కారు స్టార్ట్ అయ్యాక తిరిగి గేటుకు తాళం వేసాడు గోవర్ధన్.


కారు ఓ పది అడుగులు వెళ్లిందో లేదో.. "వెంకటేష్! కారు ఆపు" అన్నాడు శ్యామలరావు.

సడన్ బ్రేక్ తో కారును ఆపాడు వెంకటేష్.


"ఒకసారి వెనక్కి వెళ్లి మిగతా స్నేహితుల నెంబర్లు అడిగి తీసుకొందాం. ఎవరో ఒకరికి విశాల్ ఎక్కడ ఉన్నాడో తెలిసి ఉంటుంది" అన్నాడు శ్యామలరావు.


" మీరు కార్ లోనే ఉండండి. నేను వెళ్లి అడిగి వస్తాను. " అంటూ కారు దిగి, తోట వైపు నడిచాడు వెంకటేష్.


" ఇంతకీ విశాల్ ఎక్కడ ఉన్నాడో. చాలా మంచి కుర్రాడు. అందరితో బాగా కలుపుగోలుగా ఉంటాడు. " భర్తతో అంది సావిత్రి.


" బహుశా బైక్ లోనే హైదరాబాద్ బయలుదేరి ఉంటాడు. ఆ శబ్దంలో రింగ్ వినిపించి ఉండదు. ఎక్కడైనా ఆగినప్పుడు తనే కాల్ చెయ్యొచ్చు. " అన్నాడు శ్యామలరావు.


"ఏమోనండీ! పార్టీ చేసుకున్నాడంటున్నారు. అంత దూరం బైక్ లో ఎలా వెడతాడు?" ఆందోళనగా అంది సావిత్రి.


"నిజమే. నా దృష్టిలో అసలు డ్రైవ్ చేసేటపుడు ఫోన్ మాట్లాడటం కూడా తప్పే. అలాంటిది , డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే...ఉహించుకోవడానికే భయంగా ఉంది. బైక్ కంచికచర్లలో ఉంచి , అక్కడినుంచి బస్సులోగానీ, టాక్సీలోగానీ వెళ్లి ఉండొచ్చు. లేదా రాత్రికి తన రూమ్ లో పడుకొని , రేపు ఉదయాన్నే బయలుదేరుతాడేమో! అంతా అయోమయంగా వుంది" అన్నాడు శ్యామలరావు.


ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. వికాస్ చేసాడు.


" అల్లుడు గారూ! మేము ఇక్కడ తోట దగ్గరకి వెళ్ళాము. ఎవరో గోవర్ధన్ అనీ, వీళ్ళ స్నేహితుడేనట...ఒక్కడే ఉన్నాడు. అతను వచ్చేటప్పటికే అందరూ వెళ్లిపోయారట" విచారంగా చెప్పాడు శ్యామలరావు.


" ఇక్కడ శ్రేయ కండిషన్ బాగానే ఉంది. రేపే డెలివరీ. మీరు విశాల్ గురించి టెన్షన్ పడకండి. వచ్చే దారిలో సిగ్నల్స్ సరిగా లేవేమో. కాస్సేపాగి ఫోన్ చేస్తాడులే. మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాను. మీరు ఈ విషయం వదిలేసి బయలుదేరండి. " అన్నాడు వికాస్.


" ఇందులో ఇబ్బందేముంది అల్లుడు గారూ! విశాల్ మాకు పరాయివాడు కాదు. అవసరమైతే మరో గంటయినా ఇక్కడ వెయిట్ చేస్తాము. " అన్నాడు శ్యామలరావు.

"ఒద్దు మామయ్యగారూ! ఆ విషయం నేను చూసుకుంటాను. మీరు అక్కడినుంచి బయల్దేరండి" అని ఫోన్ పెట్టేసాడు వికాస్.


"మన వెంకటేష్ ఇంకా రాలేదేమిటి? వస్తే విశాల్ స్నేహితుల ఫోన్ నంబర్లు తెలుస్తాయి" భార్యతో అన్నాడు శ్యామలరావు.


అక్కడ తోట దగ్గరికి వెళ్లిన వెంకటేష్ గేట్ వేసి ఉండడం గమనించాడు.

"గోవర్ధన్ గారూ ! " అంటూ గేట్ దగ్గరనుంచి గట్టిగా పిలిచాడు.


గుడిసెలోంచి ఓ నలభై ఏళ్ళ స్త్రీ బయటకు వచ్చిది.

" ఎవరు నువ్వు? ఎవరు కావాలి? " అక్కడినుంచే ప్రశ్నించింది.


'ఈమె గోవర్ధన్ కి ఏమవుతుందో' అని మనసులో అనుకొని " కాస్త గోవర్ధన్ గారిని పిలుస్తారా!" అని అడిగాడు.


" గోవర్ధన్ గారా? ఆ ఎదవను ‘గారూ’ అన్నావంటే నువ్వూ వాడి లాటోడివే గామోసు " అంటూ గుడిసె లోకి తొంగి చూసి " ఏమయ్యోయ్! ఆ గోవర్ధన్ గాడికోసం ఎవడో వచ్చాడు. చూరులో ఉన్న మచ్చు కత్తి తీసుకురా" అని ఆవేశంగా అంది ఆమె.


లోపలినుంచి ఒక యాభై యేళ్ళ వ్యక్తి చేతిలో కత్తితో ఆవేశంగా బయటకు వచ్చాడు.

అది చూసి వేగంగా కారు దగ్గరకు పరుగెత్తాడు వెంకటేష్.


ఆ వ్యక్తి గేటు తాళం తీసుకొని, వెంకటేష్ ను తరుముకుంటూ వస్తున్నాడు.

ఇక్కడ ఎంతకీ వెంకటేష్ రాకపోవడంతో కారు దిగి వెనక్కి చూస్తున్నారు శ్యామలరావు దంపతులు.


వెంకటేష్ ను ఎవరో తరుముకుంటూ రావడం చూసి ఏంచెయ్యాలో అర్ధం కాలేదు.

ఆవేశంతో వస్తున్న ఆ వ్యక్తి శ్యామలరావును చూసి ఆగిపోయాడు.


" అయ్యగారూ! తమరు విశాల్ బాబు బంధువులు కదూ! ' అన్నాడు.


అతన్ని గుర్తు పట్టిన శ్యామలరావు, భార్య సావిత్రి వైపు తిరిగి " ఇతడు షణ్ముగం అని ఈ తోటకు వాచ్ మన్. చాలా మంచివాడు" అన్నాడు.


భర్తకు సైగ చేసి ఎదో చెప్పాలని ప్రయత్నిస్తోంది సావిత్రి.


అదేమీ గమనించని శ్యామలరావు " మనం పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పెద్ద బాక్స్ లో మామిడిపళ్ళు తెచ్చి మన కారు డిక్కీలో పెట్టాడు. ఎంత బలవంతం చేసినా డబ్బులు తీసుకోలేదు.. .. " అంటూ ఇంకా ఎదో చేప్పబోతున్నాడు.


సావిత్రి అతని చెవి దగ్గరకు వచ్చి, " అతను చనిపోయి ఆరు నెలలు దాటింది కదా! ఇందాక గోవర్ధనం చెప్పిన విషయం మరిచిపోయారా?" అని చిన్నగా అంది.


అంతే!

భయంతో వణికిపోతూ అతని వంకే చూస్తూ ఉండిపోయాడు శ్యామలరావు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).

135 views1 comment

1 Comment


Super uncle waiting for episode 5

Like
bottom of page