సంక్రాంతి సరిగమలు
- Sathyanarayana Murthy M R V

- 1 hour ago
- 6 min read
#సంక్రాంతిసరిగమలు, #SankranthiSarigamalu, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Sankranthi Sarigamalu - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy Published In manatelugukathalu.com on 24/01/2026
సంక్రాంతి సరిగమలు - తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
శివపురం లో బస్సు దిగగానే శేఖర్ పలకరించాడు ‘బాగున్నావా బావా?’ అంటూ.
“బాగానే ఉన్నాను. నువ్వు ఎందుకు వచ్చావు? నీకు చాలా పనులు ఉంటాయిగా. ఆటో మీద నేను ఇంటికి వస్తానుగా” అన్నాను.
“ఆ.. పనులు ఎప్పుడూ ఉండేవే. ఇంటి అల్లుడివి. నిన్ను రిసీవ్ చేసుకోకపోతే ఎలా?’”అన్నాడు నవ్వుతూ.
నేనూ చిన్నగా నవ్వాను. ఇద్దరం మోటార్ సైకిల్ మీద మావయ్య ఇంటికి వచ్చాము. ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు ఆదరంగా స్వాగతం పలికాయి.
లోపలకు రాగానే మావయ్య, అత్తయ్య కుశలప్రశ్నలు అడిగారు. నేను సమాధానం చెప్పాను. ఈలోగా శ్రీమతి వచ్చి పలకరింపుగా నవ్వి, బాగ్ తీసుకుని గదిలోకి వెళ్ళింది. ఆమె వెనకే నేనూ వెళ్లాను.
స్నానాదికాలు అయ్యాక, నా ఫేవరెట్ టిఫిన్, పెసరట్టు, ఉప్మా పట్టుకొచ్చింది మరదలు స్వప్న. తను వైజాగ్ లో బి. టెక్. చదువుతోంది.
“ఎలా చదువుతున్నావు?” అడిగాను టిఫిన్ తింటూ. కళ్ళు చక్రాల్ల తిప్పుతూ తలూపింది. ‘అంటే నేను బాగానే చదువుతున్నాను’ అని అర్ధమన్న మాట. తను ఈ మధ్యన ‘నేత్రావధానం’ ప్రాక్టిస్ చేస్తోంది. ఆ విషయం మా ఆవిడ, ముందే చెప్పబట్టి, నేను ‘గాభరా’ పడకుండా అర్ధం చేసుకున్నాను.
ఈరోజుల్లో పిల్లలు తమ చదువుతో పాటు, ఏదో ఒక ‘కళ’ నేర్చుకుంటున్నారు. అది నాకు చాలా నచ్చింది.
టిఫిన్ అయ్యాక, నేనూ శేఖర్ అలా బయటకు వెళ్ళాము. పెద్ద వీధిలో ‘స్లో సైక్లింగ్’ పోటీలు జరుగుతున్నాయి. కాసేపు అక్కడున్నాము. అక్కడ పక్కనే ఉన్న ఫ్లెక్సీ బోర్డు నన్ను ఆకర్షించింది.
‘మహిళలకు ముగ్గుల పోటీలు. ప్రధమ బహుమతి.. దివాన్ కాట్, రెండవ బహుమతి గ్రైండర్, మూడవ బహుమతి కుక్కర్, నాల్గవ బహుమతి మిక్సీ, ఆరు బహుమతులు నాన్ స్టిక్ పాన్లు, పాల్గొన్న ప్రతివారికి కుంకుమ భరిణి, జాకెట్ పీస్’.
శేఖర్ ని అడిగాను’ రేపే కదా పోటీ చూద్దామా?’ అని. దానికి చిన్నగా నవ్వి ‘కష్టం బావా. రేపు చుట్టుపక్కల గ్రామాల నుండి రెండు వందల మంది వరకూ మహిళలు వస్తారు పోటీకి. దానికి తోడు ఊళ్ళో వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఖాళీ ఉండదు. అక్కడ అంతా ‘ప్రమీలా రాజ్యమే’ రేపు. ”అన్నాడు శేఖర్. నేనూ నవ్వాను. ఇద్దరం కలిసి నడుస్తూ శివాలయం వీధికి వచ్చాము.
రయ్యిమంటూ ఒక మోటార్ సైకిల్ వచ్చి ఆగింది. హరిదాసు గెట్ అప్ లో ఉన్న వ్యక్తి దిగి ‘స్పీకర్’ ఆన్ చేసాడు. ‘హరి లో రంగ హరీ’ అంటూ పాట వస్తోంది. గబ గబా మహిళలు పళ్ళాలతో బియ్యం, కూరగాయలు తీసుకు వచ్చి అతని భుజాన ఉన్న సంచీలో వేసారు. అయిదు నిముషాలు తర్వాత మోటార్ సైకిల్ ఎక్కి పక్క వీధిలోకి వెళ్ళిపోయాడు హరిదాసు. నేను ఆశ్చర్య పోయాను.
“ఇదేమిటి, హరిదాసు ఇంటికి రాడా?” అడిగాను శేఖర్ ని.
“చుట్టుపక్కల పది గ్రామాలకు ఇతను ఒక్కడే హరిదాసు. అందుకే మోటార్ సైకిల్ మీద వస్తాడు. మా ఊరికి అరగంట టైం కేటాయించాడు. ఆ సమయంలోనే మనం ఇవ్వవలసినది ఆయనకు ఇచ్చుకోవడమే.
వాళ్ళలో చాలా మంది ఉద్యోగాలలో కుదురుకున్నారు. మిగిలిన వాళ్ళలో కొందరు ఇలా..” అన్నాడు శేఖర్.
పల్లెల్లో కూడా ‘పట్టణం’ వాసనలు వ్యాపించాయి అని నాకు అర్ధం అయ్యింది.
ఇద్దరం అలా ఊరి బయటకు వచ్చి నడుస్తున్నాం. రోడ్ పక్కనే ఒక చెట్టు కింద రెండు, మరో చెట్టు కింద మూడు అలా నాలుగైదు చోట్ల మోటార్ సైకిళ్ళు పార్కింగ్ చేసి ఉన్నాయి. “పండగలలో కూడా పొలం పనులు చూస్తున్నారే” అన్నాను నేను ఆశ్చర్యంగా. నా మాటలకు శేఖర్ చిన్నగా నవ్వాడు.
“పొలం పనులు కాదు బావా, ‘కోడి పందాలు’ వేస్తున్నారు కొండయ్య దిబ్బ మీద. పోలీసులకు అనుమానం రాకుండా విడి విడిగా మోటార్ సైకిళ్ళు అలా పెట్టారు. అదిగో ఒక కుర్రాడు ఫోన్ చూస్తూ కూర్చున్నాడు, గమనించావా?” అడిగాడు శేఖర్. అప్పుడు చూసాను, ఒక కుర్రాడు బైకు మీద కూర్చుని ఫోన్ చూస్తున్నాడు. ‘అవును’ అన్నాను నేను,
“వాడే వీళ్ళ సి. ఐ. డి. అన్నమాట. పోలీసులు కనిపించగానే గట్టిగా విజిల్ ఊదుతాడు. కోళ్ళు తీసుకుని అక్కడున్న వారు పారిపోతారు. దిబ్బ మీద కబుర్లు చెప్పుకుంటూ కొందరుంటారు. పోలీసులు ఏమీ అనలేక, వెనక్కి తిరిగి వస్తారు. అదీ వాళ్ళ ప్లాన్” అన్నాడు శేఖర్. నేను వాళ్ళ తెలివితేటలకు ఆశ్చర్య పోయాను. ఒక గంటసేపు అలా తిరిగి ఇద్దరం ఇంటికి వచ్చాం.
మధ్యాహ్నం భోజనం చేసి, కాసేపు నిద్రపోయాను. సాయంత్రం పిల్లలు అందరితో కాసేపు కబుర్లు చెప్పి వరండాలో వచ్చి కూర్చున్నాను. ‘నేత్రావధాని’, ఒక ప్లేటులో మినపసున్ని ఉండ, రెండు జంతికలు తెచ్చింది. మౌనంగా తీసుకుని తినడం మొదలు పెట్టాను. శేఖర్ ‘బయటకు వెళ్తానని’ మోటార్ బైకు మీద వెళ్ళిపోయాడు. రోడ్ మీద వెళ్ళేవారిని చూస్తున్నాను. పశువులని ఇళ్ళకు తోలుకుని వెళ్తున్నారు కొందరు.
ఒకతను బులెట్ బండి మీద పెద్ద పచ్చగడ్డి మోపు పెట్టుకుని వెళ్ళాడు. కొద్దిసేపటికే మరొకతను కూడా బజాజ్ పల్సర్ మీద పచ్చగడ్డి మోపు పెట్టుకుని వెళ్ళాడు. నేను ఆశ్చర్యపోయాను, పల్లె చాలా ఎదిగిందని తెలుసుకున్నాను. పూర్వం రైతులు పచ్చగడ్డి మోపు నెత్తిమీద పెటుకుని నడిచి వెళ్ళేవారు. తర్వాత సైకిల్ కి పచ్చగడ్డి మోపు కట్టుకుని వెళ్ళేవారు. ఇప్పుడు ఇదీ పరిస్థితి.
నా టిఫిన్ అయ్యేసరికి, మా శ్రీమతి టీ తీసుకు వచ్చింది. నెమ్మదిగా టీ తాగుతున్నాను. స్కూటర్ మీద ఒక అమ్మాయి వచ్చి గుమ్మం ముందు దిగింది. సుమారు ఇరవై ఏళ్ళ వయసు ఉండవచ్చు. నెమ్మదిగా నా ముందు నిలబడింది. ‘ఎవరు కావాలమ్మా?’ అని అడిగాను. చిన్నగా నవ్వింది.
“అంటీ” అని పిలిచింది. లోపల నుండి శేఖర్ భార్య వనజ ‘ఆ వస్తున్నా’ అంది.
నేను మళ్ళీ ‘లోపలకు వెళ్ళమ్మా’ అని అన్నాను. మళ్ళీ చిరునవ్వే సమాధానం. రెండు నిముషాలు గడిచాక, వనజ బయటకు వచ్చింది. ఆమె చేతిలో అరిసెలు, జంతికలతో ఉన్న క్యారీ బ్యాగ్ ఉంది.
“బాగున్నావా రజనీ. ఈ ఏడాదితో చదువు అయిపోతుందా?” ఆప్యాయంగా అడిగింది వనజ.
“అవును అంటీ” అని వనజ ఇచ్చిన క్యారీ బ్యాగ్ తీసుకుని, స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయింది రజని.
“ఎవరు ఆ అమ్మాయి?’ ఆసక్తిగా అడిగాను నేను, వనజని.
“మన చాకలి లక్ష్మి కూతురు. టౌన్ లో బి, టెక్. చదువుతోంది. రోజూ స్కూటర్ మీద కాలేజీకి వెళ్లి వస్తుంది అన్నయ్యా” అని లోపలకు వెళ్లి పోయింది వనజ. నాకు పూర్తిగా మతిపోయింది ఈ పరిస్థితి చూసి.
నా పెళ్లి జరిగిన కొత్తలో చాకలి లక్ష్మి వచ్చి “అమ్మగారూ” అని పిలిచేది. మా అత్తయ్య పండగ తినుబండారాలు తెస్తే, తువ్వాలు నేలమీద పరిచి ఉంచేది దాంట్లో వెయ్యమని. తర్వాత అన్నీ మూట కట్టుకుని ‘వత్తానమ్మా’
అని చెప్పి, నన్ను చూసి ‘బాగున్నారా బాబుగారూ’ అని వినయంగా అడిగి వెళ్ళిపోయేది.
ఇప్పుడు పరిస్థితి ఇదీ. కాలం మారలేదు. అదే సంక్రాంతి. అదే చలి. అదే వాతావరణం. కానీ మనుషులలో మార్పు వచ్చింది. నాగరికత పెరిగింది. దూరాలు తగ్గాయి. మనిషి సగటు ఆదాయం పెరిగింది.
నా పెళ్లి అయిన కొత్తలో శివపురంలో షావుకారు గారికి ఒక్కరికే కారు ఉండేది. నన్ను, మా ఆవిడని ఆ కారులోనే ఊరంతా ఊరేగించారు. ఇప్పుడు ఊరిలో ఇరవై మందికి కార్లు ఉన్నాయి. జనం ఖర్చుకి బాగా అలవాటుపడ్డారు. సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ మార్పు ఎలా దారితీస్తుందో? అని నిట్టూర్చాను. పండగలు బాగానే గడిచాయి. ముగ్గులపోటీ ఫలితాలు నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి.
మొదటి బహుమతి, సర్పంచ్ గారి కోడలికి వచ్చింది. రెండవ బహుమతి హై స్కూల్ హెడ్ మాస్టర్ అమ్మాయికి వచ్చింది. మూడవ బహుమతి చాకలి లక్ష్మి కూతురు రజనికి వచ్చిందని తెలియగానే నేను ఆనందించాను. ఇక్కడ న్యాయం జరిగిందని అనిపించింది ఎందుకో. మా శేఖర్ ఇంట్లోంచి ఎవ్వరూ పోటీకి వెళ్ళలేదు.
శ్రీమతి ఇంకో నాలుగు రోజులు ఇక్కడే ఉంటానని అనడంతో నేను మా ట్రైన్ టికెట్లు కేన్సుల్ చేసుకుని, నాకు ఒక్కడికే తత్కాల్ లో ధర్మవరంకి టికెట్ తీసుకున్నాను. వద్దని చెప్పినా వినకుండా శేఖర్ పాలకొల్లు, బైకు మీద తీసుకువచ్చి ట్రైన్ ఎక్కించాడు.
****************
ట్రైన్ ఎక్కాక నా బాగ్ బెర్త్ మీద పెట్టి కూర్చున్నాను. నాది లోయర్ బెర్త్. ఎదురుగా ఉన్న లోయర్ బెర్తు మీద భార్యా, భర్త కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇద్దరికీ ఏభై యేళ్ళు పైనే ఉంటాయి. అయిదేళ్ళ కుర్రాడిని తీసుకుని, ఒక యువ జంట ఎక్కారు. గబ గబా సామాన్లు బెర్తు కింద సర్దేసి రిలాక్స్ గా ఉన్నారు. సంక్రాంతి పిండి వంటల ప్యాకెట్లతో కోచ్ ఘుమ ఘుమ లాడుతోంది.
ఎదురుగా ఉన్న భార్యా భర్తా, స్టీల్ డబ్బా ఓపెన్ చేసి, చెరో మినపసున్ని ఉండా తిన్నారు. తర్వాత చెరో అరిసె తిన్నారు. నేను ఫోన్ చూస్తూ వారినే గమనిస్తున్నాను. ఆ తర్వాత రెండు కాజాలు, రెండు జంతికలు తిని మంచినీళ్ళు తాగారు. అప్పటికి భీమవరం స్టేషన్ వచ్చింది. సమోసాలు అమ్మే కుర్రాడు వచ్చాడు. ఆరు సమోసాలు కొనుక్కుని, చెరో మూడు తిన్నారు. నాకు మతిపోయింది వాళ్ళ తిండి చూసి.
‘బకాసురుడి బంధువులు అయ్యుంటారు ఇద్దరూ’ అని అనుకున్నాను.
నా పక్కన కూర్చుని ఉన్న యువజంట లోని కుర్రాడు లేచి, పక్క కోచ్ లోకి వెళ్ళాడు.. నా పక్కన ఉన్న యువతి, ఎదురు బెర్తు ఆవిడని అడిగింది’ఎక్కడ వరకూ వెళ్తారని?’.
“నెల్లూరు” అని, ‘మీరు ఎంతవరకూ?’ అని అడిగింది ఆవిడ.
“తిరుపతి అండి. రేపు స్వామి వారి దర్శనం టికెట్ తీసుకున్నాము” అంది ఆ అమ్మాయి. ఈలోగా పెద్ద ఆవిడకి ఫోన్ వచ్చింది.
“ఆ చెప్పు అక్కా. ట్రైన్ భీమవరం దాకా వచ్చింది. నువ్వు ఇచ్చిన స్వీట్లు తిన్నాము ఇప్పుడే. బాగున్నాయి అక్కా. మీ అమ్మాయి సురేఖకి స్వీట్లు అన్నీ పది.. పది చొప్పున ఇచ్చావు. నాకు ఆరు చొప్పున ఇచ్చావు. నీ పేగుబంధం కదా అది.
అయినా మమ్మల్ని బాగానే చూసావు. కోడిపందాలు అవీ చూపించాడు మీ అబ్బాయి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ చేస్తాను అక్కా. ఉంటాను” అని ఫోన్ కట్ చేసింది ఆవిడ.
మళ్ళీ ఎదురుగా ఉన్న అమ్మాయితో మాటలు కొనసాగించింది ఆవిడ.
“పాలకొల్లు దగ్గర ఉన్న ఎలమంచిలిలో ఉంటుంది మా అక్క. సంక్రాంతికి రమ్మంటే వచ్చాము మేము ఇద్దరం. మా పిల్లలు ఇద్దరూ చెన్నైలో ఉంటున్నారు. పండగకి రావడం కుదరదు అన్నారు. అందుకని ఇలా వచ్చాము. నువ్వు ఎక్కడనుంచి వస్తున్నావు?” అడిగింది ఆ అమ్మాయిని.
“రాజోలు నుండి. మా నాన్నకి రైస్ మిల్ ఉంది. చాలా పొలాలు ఉన్నాయి. మా వారికీ హైదరాబాద్ లో ఉద్యోగం. తిరుపతి లో స్వామిని చూసుకుని, అక్కడనుండి అటే హైదరాబాద్ వెళ్లిపోతాము. మా నాన్న మా అబ్బాయి పేరు మీద అయిదు లక్షలు డిపాజిట్ చేసారు. మా అక్క కొడుక్కి, మూడేళ్ళ క్రితమే మూడు లక్షలు డిపాజిట్ చేసారు. మా అక్కకి కోపం వచ్చింది, మాకు అయిదు లక్షలు వేసారని. మూడేళ్ళకి ఇప్పటికి రేట్లు పెరిగాయి కదండీ. ఏమిటో? మా అక్క అర్ధం చేసుకోదు. పైగా మేము వస్తుంటే మా అబ్బాయి చేతిలో వంద రూపాయలు పెట్టింది. నేను దాని కొడుక్కి అయిదువందలు ఇచ్చాను. మరి నా కొడుక్కి అయిదువందలు ఇవ్వాలి కదండీ” అడిగింది ఆ అమ్మాయి. ‘అవును’ అన్నట్టు తలూపింది పెద్ద ఆవిడ.
వారి మాటలు నన్ను అయోమయంలో పడేశాయి. ఆడవాళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారా? ప్రతి విషయాన్నీ ఇంత లోతుగా చూస్తారా? అని ఆశ్చర్యపోయాను. కొద్దిసేపటికి నా పక్కనున్న యువతి స్టీల్ బాక్స్ తీసింది. నాన్ వెజ్ వాసన ఘుప్పుమంది.
‘అమ్మా, బిర్యానీ పెట్టు’ అన్నాడు కొడుకు.
“అలాగే నాన్నా”, అని వాడికి పెట్టడం, వాడు ఫోనులో గేమ్స్ ఆడుతూ తినడం నాకు చాలా ఇబ్బంది కలిగించింది. ఆ కుర్రాడు సరిగా తినడు, తల్లి ఫోన్ మాట్లాడుతూ తినిపిస్తోంది. మెతుకులు సీట్ మీద పడుతున్నాయి. ఒక పావు గంటకు పిల్లరాక్షసుడు, ‘తినడం’ అనే కార్యక్రమం ముగించి, బాసింపట్టం వేసుకు కూర్చుని, వీడియో గేమ్స్ ఆడుతూ, అప్పుడప్పుడు నామీద పడుతున్నాడు. మన పిల్లలు అయితే, ‘సరిగా కూర్చో. ఏమిటా వెధవ్వేషాలు?’ అని కేకలేస్తాము.
కానీ పరాయి వాళ్ళ పిల్లాడు. ఏమైనా అంటే, చిన్న పిల్లాడు తెలియదు కదండీ, అని అంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుతూనే తింది. మెతుకులు నేలమీద పడుతున్నాయి. అవేం పట్టించుకోవడంలేదు, పూర్తిగా ఫోనులో నిమగ్నమై పోయింది.
ఎదురు బెర్తు భార్యా భర్తా, బాక్స్ లోంచి చపాతీలు తీసుకుని తినడం మొదలు పెట్టారు. వాళ్ళ కూర వాసన, ఈ అమ్మాయి బిర్యానీ వాసన నన్ను ఉక్కిరి బిక్కిరి చేసాయి. లేచి బయటకు వెళ్లి డోర్ దగ్గర నిలబడ్డాను. ఒక పావుగంట గడిచాక లోపలకు వచ్చాను.
కొద్దిసేపటికే ఆ అమ్మాయి భర్త వచ్చాడు. ‘పక్క కోచ్ లో నా బెర్త్ దగ్గరే నీకు కూడా బెర్తు దొరికింది. టిటిఇ కి చెప్పాను. ’ అని అన్నాడు. ఆ అమ్మాయి గబ గబా అన్నీ సర్దేసింది. సీట్ కింద నుండి బాగ్ లు తీసుకుని వెళ్ళిపోయారు ముగ్గురూ.
ఒక అర గంటకు అంతా సద్దుమణిగాక, నా బాక్స్ ఓపెన్ చేసి రెండు చపాతీలు తిన్నాను. తర్వాత మజ్జిగ తాగి పడుకున్నాను. నిద్రట్లో కల వచ్చింది. అందులో ఎదురు బెర్తు భార్యా భర్తలు కోడిపందాలు చూస్తున్నట్టు, నా పక్కన కూర్చున్న అమ్మాయి, వాళ్ళ అక్క, తండ్రితో దెబ్బలాడుతున్నట్టు. మెలకువ వచ్చి నాలో నేనే, నవ్వుకున్నాను, మొత్తానికి సంక్రాంతి నాకు మంచి అనుభవాన్నే ఇచ్చిందని.
సమాప్తం.
*******
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments