top of page

తమలపాకుతో తానిట్టంటే…


'Thamalapakutho Thanittante' New Telugu story

Written By Mallavarapu Seetharam Kumar

తమలపాకుతో తానిట్టంటే… తెలుగు కథ

రచన : మల్లవరపు సీతారాం కుమార్


అన్యోన్యంగా ఉన్న భార్యా భర్తల మధ్య అత్తగారి మాటల వల్ల మనస్పర్థలు వచ్చాయి.

కానీ అల్లుడి చాకచక్యం వల్ల అత్తగారి కళ్ళు తెరుచుకున్నాయి.

సరదాగా సాగే ఈ కుటుంబ కథను మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించారు.


తమలపాకుతో తానిట్టంటే తాటి మట్టతో నేనట్టన్నా

తడిక పుల్లతో తానొకటిస్తే బడితకర్రతో నే రెండిచ్చా...

టి వి లో వస్తున్న పాటను వింటూ నవ్వుకున్నారు సుందరి, సుబ్బారావులు.


"అయినా మా ఆడవాళ్లను మరీ గయ్యాళి వాళ్ళ లాగా చూపిస్తారండి టి వి ల్లోనూ, సినిమాల్లోనూ" అంది సుందరి చర్చను ప్రారంభిస్తూ.

'ఏదో సరదాకు అలా చూపిస్తారు. కానీ ఆడవాళ్లను ఎంతో గొప్పగా చూపిస్తారు చాలా సినిమాల్లో" అన్నాడు సుబ్బారావు.


"అదేమీ లేదు. అయినా అలాంటి సినిమాలూ, సీరియల్సు వచ్చినా మగాళ్లెవరికీ నచ్చవు. ఏడుపుగొట్టు సినిమాలంటూ ఛానల్ మార్చేస్తారు. అదే ఆడాళ్ళను ఎగతాళి చేసే సీన్లు వస్తే పొట్ట ఊగిపోయేలా పడీపడీ నవ్వుతారు మీలాంటి మగాళ్లు”

భర్తను టార్గెట్ చేస్తూ అంది సుందరి.


' మధ్యలో నేనేం చేసానే... నేనెప్పుడైనా ఆడాళ్ళను చులకన చేస్తూ మాట్లాడానా?" వాపోయాడు సుబ్బారావు.

"అంతోటి ధైర్యం కూడానా మీకు. కాకపోతే ఇలా టీవీల్లో, సినిమాల్లో ఆడాళ్ళను ఎగతాళి చేసే సీన్లు చూస్తే తెగ ఆనంద పడిపోతారు" అంది సుందరి.


"ఛ..ఛా.. నేనెప్పుడూ అలా అనుకోను" అన్నాడు సుబ్బారావు.

"అదుగోండి... ఆడాళ్ళ ఊసు వస్తేనే ఛీఛీ లు...ఛ..ఛా.. లు. అక్కడే తెలిసిపోతోంది మీ బుద్ధి ఏవిటో..." నెమ్మదిగా ఇరికిస్తోంది సుందరి.


'పొద్దున లేచి ఎవరి ముఖం చూసాను చెప్మా...' అని ఆలోచనలో పడ్డాడు సుబ్బారావు.

" మాట్లాడరేమిటండీ! అంటే మౌనం సంపూర్ణ అంగీకారమనేగా.. మీ మగ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు" అంటూ ముక్కు చీదింది సుందరి.


'బంగాళాఖాతం లో ఏర్పడ్డ అల్ప పీడనం తీవ్ర రూపం దాల్చి వాయుగుండంగా మారబోతోంది. రేపటికల్లా హైదరాబాద్ వద్ద తీరాన్ని దాటుతోంది' అంటూ వినబడింది సుబ్బారావుకు.

'ఇదేమిటి? హైదరాబాద్ కూ, బంగాళాఖాతానికీ సంబంధం ఏమిటి?' అనుకుంటూ ఎందుకైనా మంచిదని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి వెరిఫై చేసాడు.


చుట్టుపక్కల ఎక్కడా బంగాళాఖాతం లేదు అని నిర్ధారించుకున్నాక 'హమ్మయ్య! హైదరాబాద్ కు తుఫాన్ రావడం నా భ్రమ అన్నమాట' అనుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.

కానీ ఆ మాటలు పైకే అన్నాడని సుందరి తిట్ల దండకం మొదలు పెట్టేదాకా తెలీలేదు.


ఓ అరగంట పాటు సుబ్బారావునూ, అతని వంశంలో యేడు తరాలను ఏక ధాటిగా తిట్టింది సుందరి.

బాగా అలిసిపోయాక " మీతో ఇలా కాదు. మా అమ్మను పిలుస్తాను ఇప్పుడు" అంటూ తన తల్లికి ఫోన్ చేసింది.


గుండెల్లో రాయి పడ్డట్లయింది సుబ్బారావుకు.

అత్తగారు వచ్చారంటే ఇక తాను చేసేదేమీ లేదు.


'అల్లుడు గారు బంగారంలాంటి మనిషమ్మా..' అంటూ మొదలు పెడుతుంది. కానీ చివరికి కూతురి మాటే నెగ్గిస్తుంది. ఎంతైనా సుందరి తల్లికదా. అతడలా ఆలోచిస్తూ ఉండగానే, పక్క వీధి లోనే ఉంటున్న సుందరి తల్లి నాంచారమ్మ, పది నిముషాల్లోనే అక్కడ వాలిపోయింది.


రావడంతోటే కూతురి వైపు సీరియస్ గా చూస్తూ "మీ అత్తామామలు ఈ వూళ్ళో లేరని, అల్లుడిగారిని ఒంటరి మనిషి అనుకునేవు. నేను సపోర్ట్ ఉంటాను. తెలుసా..." అంటూ సుబ్బారావుకు అభయమిస్తున్నట్లుగా పోజ్ ఇచ్చింది.


అది నాటకమని తెలిసినా ఆమె మాటలు నమ్మినట్లు, తనకు కొండంత ధైర్యం వచ్చినట్లు తాను కూడా పోజ్ ఇచ్చాడు సుబ్బారావు.

తన మాటలు కొనసాగించింది నాంచారమ్మ.


"నోట్లో నాలుక లేని మనిషే అల్లుడుగారు. ఆయనతో గొడవ పడతావా?" అంటూ కూతురిపై కోపం నటించింది ఆమె.

"నువ్వలా వెనకేసుకొని రాబట్టి అయన అంతలా రెచ్చి పోతున్నారు. నా ఖర్మ! పుట్టింటి సహాయం ఉండదని తెలిసీ, నీకు ఫోన్ చేశాను చూడూ... నాదీ బుద్ధి తక్కువ అంటే..." అంది సుందరి ఏడుస్తూ.

"మా బంగారనివే నువ్వు. అలా ఏడవకు. అల్లుగారేదో కోపంలో ఒకమాట అని ఉంటాడు, లేదా ఒక దెబ్బ వేసి ఉంటాడు. అంత మాత్రానికే అలా ఏడవాలా?" అంటూ ఓదారుస్తోంది నాంచారమ్మ.


“ఏం మాటలు అత్తగారూ అవి.. తిట్టడం, కొట్టడం మాట అటుంచి నేనసలు నోరు తెరిచి ఉంటే మీ మీద ఒట్టు" అన్నాడు సుబ్బారావు.

"మీది నాలుకా తాటి పట్టా ? హైదరాబాద్ కు తుఫాన్ వస్తోందని అనలేదూ?" గద్దించి అడిగింది సుందరి.


"అన్నాను కానీ విషయం అదికాదు. నేను నిన్నేమైనా అన్నానా? చెప్పు" అంటూ వివరించబోయాడు సుబ్బారావు.

అతని మాటలు వినిపించుకోకుండా " చూసావటమ్మా మీ అల్లుడి గడుసుతనం.

అసలు నోరు తెరవలేదని నీ మీద ఒట్టేశాడు. ఇప్పుడేమో 'అన్నాను... అయితే ఏమిటిటా..' అనేలా మాట్లాడుతున్నాడు" అంటూ రెచ్చిపోయింది సుందరి.


"కాస్త సర్దుకోవే సుందరీ! 'పెట్టేవాడు తిట్టక మానడు. తిట్టిన వాడు పెట్టక మానడు' అని సామెత. తిట్టడం అయిపోయింది కాబట్టి, ఇక నీ మనసులో ఉన్న కోరిక బయటపెడితే తప్పకుండా తీరుస్తాడు. అంతే కదూ అల్లుడుగారూ" అంది నాంచారమ్మ.


అప్పుడర్థమైంది సుబ్బారావుకి, సుందరి దేనికో టెండర్ పెట్టబోతోందని.

అత్తగారు తన వంతు పాత్రను బాగా రక్తి కట్టిస్తున్నారు.ఇంతకీ ఈ ప్లానంతా దేనికో...అనుకున్నాడు.


అప్పుడందుకుంది సుందరి " ధన త్రయోదశికి రాళ్ల నెక్లెస్ అడిగాను. ఇప్పటి వరకు అదే తీర్చలేదు. సంక్రాంతి కూడా వచ్చేస్తోంది. ఇప్పటికైనా ఆ కోరిక తీర్చమని అడుగమ్మా!" అంది కన్సెషన్ ఇస్తున్నట్లుగా.


"మీ నాన్నగారే వుంటే, ఇంత చిన్న విషయానికి అల్లుడిగారిని ఇబ్బంది పెట్టే అవసరమే ఉండేది కాదు. పోయినేడాది అయన నన్నన్యాయం చేసి వెళ్ళిపోయాడు. నా చేతిలోనా ... చిల్లిగవ్వ లేకపోయే! ఇక తప్పదల్లుడు గారూ. అయినా బంగారం కొనడం ఖర్చేమీ కాదు. అదొక పెట్టుబడిలా అనుకోండి. ఎలాగూ మీరు వ్యాపారస్తులే కదా.." అంది.


"నేను సుందరిని ఏమీ అనలేదు. ఒక వేళ అన్నా దానికి ఇంత పెద్ద పెనాల్టీనా? " అన్నాడు సుబ్బారావు.

" నా కూతురి మనస్తత్వమే అంత అల్లుడుగారూ. దాన్ని తమలపాకుతో అలా సుతారంగా ఒక దెబ్బ వేస్తే తాటి మట్టతో తిరిగి రెండంటించే రకం అది. విషయాన్ని పొడిగించక ఇంతటితో వగదిగించేయండి అల్లుడుగారూ" అంది నాంచారమ్మ.


"తప్పేదేముంది. ఇప్పుడే షాప్ కి వెళ్లి డబ్బు గుమస్తా దగ్గర పంపిస్తాను" అంటూ బయలుదేరాడు సుబ్బారావు. నాంచారమ్మ , సుందరి వంక బొటన వేలు పైకెత్తి చూపించింది, విక్టరీ అన్నట్లుగా.

సుబ్బారావు అది గమనించడం చూసింది సుందరి.


" మా అమ్మకు గోరు చుట్టు వచ్చింది. అలా చూపిస్తే తగ్గుతుందట. మీరు బయలుదేరండి" అంది భర్తతో.

చిన్నగా నవ్వుకుంటూ బయలుదేరాడు సుబ్బారావు.


అతడు వెళ్లిన గంటకు వాళ్ళ ఇంటి ముందు ఒక కార్ ఆగింది.

అందులోంచి ముందుగా డ్రైవర్ దిగి నేరుగా ఇంట్లోకి వచ్చి, "నాంచారమ్మ గారు ఎవరు?" అని అడిగాడు.


"నేనే నాంచారమ్మను. కార్లో ఉన్నదెవరు?" అడిగిందామె.

"అయ్యగారు మన ఏరియా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్. మీ కోసం మీ ఇంటికి వెళితే ఇక్కడున్నట్లు పక్కింటి వాళ్ళు చెప్పారు" అన్నాడతను.


"అలాగా? లోపలి రమ్మను. అయినా ఆయనకు నాతో పనేమిటి" గొంతు తగ్గించి అడిగింది నాంచారమ్మ.

"ఈ మధ్య మీ భూములు అమ్మితే రెండు కోట్లు వచ్చాయటగా.. ఆ విషయం మీద ఎంక్వయిరీ కి వచ్చారట” తాను కూడా గొంతు తగ్గించి చెప్పాడు డ్రైవర్.


"పొలాలు అమ్మితే వచ్చే డబ్బుకు టాక్స్ లేదటగా. నాకేమీ తెలీదనుకోకు" అంది నాంచారమ్మ.

"అదంతా ఆఫీసర్ గారితో మాట్లాడుకోండమ్మా" అని చెప్పి బయటకు వెళ్ళాడు డ్రైవర్.


మరి కాస్సేపట్లో సూట్ వేసుకున్న ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు.

రాగానే నాంచారమ్మ వైపు సూటిగా చూస్తూ " మాకే రూల్స్ నేర్పిస్తావా నువ్వు?" అన్నాడు.


నాంచారమ్మ తడబడుతూ..." అలా అనలేదు సార్. మా వాళ్ళు చాలా మంది భూములు అమ్మారు. ఎవరూ టాక్స్ కట్టలేదని చెబితేను...." అంది

"అగ్రిమెంట్ లో ఎంతకు కొన్నట్లు ఉంది?" ప్రశ్నించాడు అతను.


"తెలీదు సారూ. అంతా మా తమ్ముడు చూసుకున్నాడు" చెప్పింది నాంచారమ్మ.

"తెలీకుండానే సంతకాలు పెట్టారా? యాభై లక్షలకు అమ్మినట్లుగా రాసుకొని రెండు కోట్లు తీసుకున్నారు. అంటే ఒకటిన్నర కోటి బ్లాక్ మనీ అన్నమాట" కోపంగా అన్నాడు ఆ ఆఫీసర్.

"అదేంటమ్మా? ఇంకా ఆ డబ్బులు రాలేదన్నావు...?" తల్లిని ప్రశ్నించింది సుందరి.

"అదీ...అదంతా తరువాత చెబుతాలే..." అంటూ నీళ్లు నమిలింది నాంచారమ్మ.

"ఏంటమ్మా ఇది.. నా దగ్గర కూడా విషయాలు దాస్తున్నావా?" కోపంగా అంది సుందరి.


"మీ తగాదాలు తరువాత చూసుకోండి. ముందు నేను చెప్పేది వినండి. బ్లాక్ మనీ కోటీ యాభై లక్షలకు మీరు లెక్క చెప్పాలి. లేదా అందులో పది శాతం ..అంటే పదిహేను లక్షలు ముందస్తు టాక్స్ గా కట్టాలి. ముందు రేపు ఆఫీసుకు వచ్చి మాట్లాడండి" కోపంగా అన్నాడు ఆ ఆఫీసర్.


"అంత కట్టాలా? అసలే అయన కాలం చేసారు. ఒంటరి ఆడదాన్ని. కాస్త దయతలిచి రెండు మూడు లక్షలు కట్టించుకోండి. మీ కష్టం ఉంచుకోను. మీరు సరే అంటే రేపు మా తమ్ముడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు" బేరం మొదలు పెట్టింది నాంచారమ్మ.


" అంటే నాకే లంచం ఇస్తానంటావా. అయితే విను. నువ్వు ఇరవై లక్షలు టాక్స్ కట్టాలి. లేకుంటే నీ మీద క్రిమినల్ కేసు కూడా పెడతాను" అంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు అతను.


"ఇప్పుడు చెప్పమ్మా.. రెండు కోట్లు వస్తే నాకెందుకు చెప్పలేదు?" అడిగింది సుందరి.

“కొద్ది రోజులు ఆగి చెప్పమన్నాడే మా తమ్ముడు. అయినా ఇప్పుడు ఆ విషయమెందుకు? ముందీ గండం నుంచి బయట పడాలి" అంటూ తన తమ్ముడికి ఫోన్ చేసింది.


విషయం విన్న నాంచారమ్మ తమ్ముడు " అంత అఖ్ఖర్లేదు అక్కయ్యా. ఓ పది లక్షలు నాకు ఇవ్వు. అంతా నేను చూసుకుంటాను" అన్నాడు.

"సరే. తరువాత మాట్లాడతాను" అని దిగులుగా ఫోన్ పెట్టేసింది నాంచారమ్మ.


ఇంతలో బయటకు వెళ్లిన సుబ్బారావు తిరిగి వచ్చాడు.

"నెక్లెస్ కోసం లక్ష రూపాయలు తెచ్చాను. అంత డబ్బు గుమాస్తాతో ఎందుకని నేనే వచ్చాను. ఇక షాప్ కి బయలుదేరుతాను" అన్నాడు డబ్బు సుందరి చేతికి అందిస్తూ.


తరువాత పైట కొంగుతో కళ్ళు అద్దుకుంటున్న అత్తగారిని చూసి"అదేమిటి? మీ అమ్మగారు ఎందుకలా బాధపడుతున్నారు? " అని భార్యను అడిగాడు.

జరిగిన విషయం చెప్పింది సుందరి. అయితే రెండు కోట్లు వచ్చిన విషయం మాత్రం దాచి, త్వరలో రాబోతాయని చెప్పింది. ఇందాక తన తల్లి, చేతిలో చిల్లి గవ్వ లేదని చెప్పిన మాట గుర్తుకొచ్చి ఆమెను కవర్ చెయ్యాలని అలా చెప్పింది. నమ్మినట్లుగా తల ఊపాడు సుబ్బారావు.


"మా ఫ్రెండ్ వెంకట్రావు అదే ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. అతనితో మాట్లాడుతాను. ఇంతకీ మీ దగ్గర డబ్బులెంత ఉన్నాయి? " అని అడిగాడు అత్తగారిని.

ఇంట్లో ఓ రెండు లక్షలు ఉన్నాయి. ఏదో ముసలిదాన్ని కదా. ఆసుపత్రి ఖర్చులకు దాచుకున్నాను. భూమి అమ్మిన డబ్బులు బ్యాంకు లోనే ఉన్నాయి. వేరే చోట పొలాలు కొనాలని అలాగే ఉంచాను" అంది నాంచారమ్మ.


"నేనిప్పుడే వెంకట్రావుతో మాట్లాడతాను" అంటూ గదిలోకి వెళ్లి కాసేపు మాట్లాడాడు. తరువాత బయటకు వచ్చి, "ఇందాక మీ తమ్ముడు ఎంత ఇమ్మన్నాడు?" అని అడిగాడు.

"పది లక్షలు ఇమ్మన్నాడు. వాడెప్పుడూ కాస్త ఎక్కువే చెబుతాడు. తరువాత 'ఇదిగో అక్కయ్యా… నాల్గు లక్షలు. అక్కడ ఆరు కట్టి మేనేజ్ చేశాను అంటూ మిగిలింది టంచనుగా తిరిగి ఇస్తాడు" అంది నాంచారమ్మ, తన తమ్ముడి మీద నమ్మకంతో.


"అంత అవసరం లేదు. మూడు లక్షలు ఇస్తే చాలన్నాడు మా వెంకట్రావు. మీ దగ్గర రెండు ఉన్నాయన్నారు కదా. తెచ్చి ఇవ్వండి. మా దగ్గర ఉన్న లక్ష కూడా మీ కోసం ఖర్చు పెడతాం. సుందరికి నెక్లెస్ మీరు తిరిగి ఇచ్చాక కొంటానులే!" అని చెప్పాడు సుబ్బారావు. తరువాత భార్య వైపు తిరిగి 'ఏమంటావు' అన్నట్లు చూసాడు.


చేసేదేమీ లేక తల ఊపింది సుందరి.

ఇంతలో సుందరి తమ్ముడు చలపతి ఫోన్ చేసి ఏదో చెప్పాడు.


నాంచారమ్మ, సుబ్బారావుతో "మా చలపతి ఇప్పుడే ఇన్కమ్ టాక్స్ ఆఫీసుకు వెళ్లి వచ్చాడట. స్పీకర్ ఆన్ చెయ్యమన్నాడు. ఏదో చెబుతాడట" అంటూ స్పీకర్ ఆన్ చేసింది.

తన నాటకం బయట పడుతుందేమోనని గతుక్కుమన్నాడు సుబ్బారావు.


చలపతి మాట్లాడుతూ " ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ లో అదరగొట్టేసాను. దెబ్బతో దిగొచ్చారు. తొమ్మిది కడితే చాలన్నారు. నాకు తెలిసిన మినిష్టర్ ల పేర్లు చెప్పాను. దిమ్మ తిరిగి ఎనిమిది చాలన్నారు. నువ్వెళ్ళి డబ్బు డ్రా చేసుకురా. నేను తీసుకుని వెళ్లి కట్టేస్తాను" అన్నాడు.


" అవసరం లేదులే. నేనే సెటిల్ చేసుకుంటాను" అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేసింది నాంచారమ్మ.

'చూడండి అల్లుడుగారూ.. తోడుండాల్సిన తమ్ముడే ఇలా మోసం చెయ్యాలని చూస్తున్నాడు" అని కొంతసేపు బాధ పడింది.


తరువాత తన ఇంటికి వెళ్లి రెండు లక్షలు పట్టుకొని వచ్చింది.

కానీ ఆమె మనసులో ఏదో అనుమానం. తడిక పుల్లతో ఒకటిచ్చిందెవరు?... బడితకర్రతో రెండిచ్చిందెవరు?.. అని.


కానీ చేసేదేమీ లేక ఆ డబ్బు అల్లుడి చేతిలోపెట్టింది.

అత్తగారు ఇచ్చిన రెండు లక్షలు, ఇందాక భార్యకు ఇచ్చిన లక్ష తీసుకొని "నేనిప్పుడే వెంకట్రావుకు ఈ డబ్బు ఇచ్చి, విషయం సెటిల్ చేసుకొని వస్తాను " అని బయలుదేరాడు సుబ్బారావు..


ఓ గంటాగి తిరిగి వచ్చాడు సుబ్బారావు.

"పని పూర్తయిపోయింది. ఇక మీరు నిశ్చింతగా ఉండండి" అన్నాడు అత్తగారితో.


కానీ ఆమె మొహం వాడిపోయి ఉండడంతో అమ్మాకూతుళ్ల మధ్య డబ్బు విషయంగా పెద్ద గొడవే జరిగి ఉంటుందని గ్రహించాడు.

అల్లుడిని చూడగానే " ఇక నేను బయలుదేరుతాను అల్లుడుగారూ" అంటూ పైకి లేచింది.


"అదేంటి సుందరీ? మీ అమ్మగారిని భోంచేసి బయలుదేరమని చెప్పు" అన్నాడు సుబ్బారావు.

" ఆవిడ పొద్దున్నే వంట చేసి వచ్చిందట." చెప్పింది సుందరి మూతి ముడుచుకొని.


"సరే. మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వస్తాను. రండి" అంటూ బయటకు వచ్చి బండి స్టార్ట్ చేసాడు సుబ్బారావు. కూతురు మీద కోపంగా ఉండటంతో మారు మాట్లాడకుండా అతని వెనుక కూర్చుంది నాంచారమ్మ.


పక్క వీధిలో ఉన్న ఆమె ఇంటి దగ్గర దింపాడు.

"కాస్త ఇంట్లోకివచ్చి మంచి నీళ్లు తాగి వెళ్ళండి అల్లుడు గారూ" అంది నాంచారమ్మ.


మౌనంగా ఆమె వెంట నడిచాడు సుబ్బారావు.

అల్లుడికి మంచి నీళ్లతో పాటు కాఫీ ఇచ్చింది నాంచారమ్మ.


"డబ్బులు వచ్చిన విషయం చెప్పలేదని అమ్మాయి నానా మాటలూ అంది" అని కళ్ళు ఒత్తుకుంటూ అల్లుడికి చెప్పింది.


"చూడండి అత్తగారూ! మామ గారు మీకు డబ్బులు అంత తేలిగ్గా ఇచ్చేవారు కాదు. ఒక వంద రూపాయలు అయన దగ్గర నుండి తీసుకోవాలంటే మీరు నానా పాట్లు పడాల్సి వచ్చేది. ఏదో విషయంగా గొడవ పడ్డం, అలగడం, తరువాత డబ్బులో, చీరలో, నగలో.. అడిగి సాధించుకోవడం మీకు అలవాటు. కానీ సుందరికి ఆ అవసరం లేదు. తనకు కావలసిన వాటికన్నా ఎక్కువ కొనిచ్చాను. మీరు లేనిపోనివి మీ అమ్మాయికి నూరిపోసి, మా మధ్య తగాదాలు కల్పించకండి.


మరో విషయం. ఇలా డబ్బుల కోసమో నగల కోసమో భర్తతో గొడవ పడటం అలవాటయితే రేపు మీతో కూడా అలానే చేస్తుది. అప్పుడు బాధపడి లాభం లేదు" అత్తగారికి వివరించి చెప్పాడు సుబ్బారావు.


"రేపటిదాకా ఎందుకు అల్లుడుగారూ! ఈ రోజే, మీరలా బయటకు వెళ్ళగానే ఎంత రాద్ధాంతం చేసిందని.. మీరు చెప్పింది నిజమే. మీ దగ్గర గొడవపెట్టుకొని సాధించుకోమంటే, నాతోనూ అదే చేసింది. నేను చేసింది పొరపాటే" అంది నాంచారమ్మ బాధపడుతూ.


తన జేబులోంచి నోట్ల కట్ట బయటకు తీసాడు సుబ్బారావు.

"ఇదిగోండి మీరు ఇచ్చిన రెండు లక్షలు. మీ డబ్బు నాకెందుకు? ఉపాయాలు వెయ్యడం, నాటకాలు ఆడటం నాకు కూడా తెలుసని చెప్పడానికే ఇలా చేసాను. మా ఫ్రెండ్ నే అలా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా రమ్మన్నాను. ఇలా చేసినందుకు ఏమి అనుకోకండి " అంటూ ఆ డబ్బును నాంచారమ్మకు అందించాడు.


"మరి మా తమ్ముడు ఇన్కమ్ టాక్స్ ఆఫీసుకు వెళ్లి వచ్చానని చెప్పడం అబద్ధమన్న మాట" వాపోయింది నాంచారమ్మ.


"మీలా డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉన్నామనుకునే వాళ్ళు, ఇలా మోసం చేసే వాళ్ళ మాటల్నే నమ్ముతారు" అన్నాడు సుబ్బారావు.


"మీరు రెండులక్షల తీసుకున్నప్పుడు, బడిత కర్రతో రెండిచ్చారను కున్నాను.

కానీ డబ్బు తిరిగి ఇచ్చి, నా కళ్ళు తెరిచేలా ఓ వంద దెబ్బలు కొట్టారు" అంది నాంచారమ్మ, అల్లుడి వంక మెచ్చుకోలుగా చూస్తూ.


తమలపాకుతో తానిట్టంటే తాటి మట్టతో నేనట్టన్నా

తడిక పుల్లతో తానొకటిస్తే బడితకర్రతో నే రెండిచ్చా...


ఇప్పుడు టీవీ లో అదే పాట మేల్ వాయిస్ తో వస్తోంది.


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 20 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


117 views0 comments
bottom of page