top of page

గరుడాస్త్రం - ఎపిసోడ్ 8



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.

అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.

ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు.


కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.

ఒకరోజు కరుణాకరన్ గారు శ్రీహర్షని పిలిచి కోనసీమలో జరిగే ఒక పెళ్ళికి తన కూతురికి తోడుగా వెళ్ళమంటాడు. ప్రణవితో కలిసి అక్కడికి వెళతాడు శ్రీహర్ష. పెళ్లి కూతురి పక్కనే కూర్చుని ఉన్న ప్రణవి సౌందర్యానికి ముగ్ధుడవుతాడు.


శ్రీ హర్షతో కలిసి పాపికొండలు వెళ్లివస్తుంది ప్రణవి.

పరీక్షలు పూర్తయ్యాక తన ఊరికి బయలుదేరుతాడు శ్రీహర్ష.

ప్రణవిని విడిచి వెళ్లడం అతనికి బాధ కలిగిస్తుంది.

శ్రీహర్షను కలవడానికి అతని దగ్గరకు వెళుతుంది ప్రణవి.

ఆమెకు దూరం కావడం తనకు బాధ కలిగించిందని చెబుతాడు అతను.


ఇక గరుడాస్త్రం - ఎపిసోడ్ 8 చదవండి..


కొద్దిసేపు అక్కడ నిశ్శబ్దం; ఏటి తీరంలో గాలి సవ్వడి తప్పా అంతా నిశ్శబ్దం.. శ్రీ హర్ష మాటలు ప్రణవిలో అలజడి కలిగించాయి..


“హర్ష గారూ! నా పెళ్ళంటే మీకిష్టం లేదా ?మరి ఆ రోజు కార్డు ముందుగా పంపిస్తే వస్తానన్నారు”.


“తప్పక అన్నాను కానీ మీ పెళ్ళిని ప్రత్యక్షంగా చూసే శక్తి నాకు లేదు.. చూస్తే తట్టుకోలేను. ”


“అయితే నా పెళ్ళైన తరువాత నాతో మాట్లాడరా? మా ఇంటికి మరి రారా?.. అడిగింది ప్రణవి.


“మాట్లాడలేను”..

“ఒకవేళ నా పెళ్ళి తప్పిపోతే మీ కిష్టమేనా”

“అలా ఎందుకనుకోవడం.. అది స్వార్ధం అవుతుంది.. ఇంక ఇవన్నీ వదిలేయండి అనవసరంగా నా చేత చెప్పకూడనివన్ని చెప్పించారు.. మీ పెళ్ళి గురించి పిలవడానికేనా వచ్చారు.. కార్డు వాట్సాప్లో పంపితే సరిపోయేది కదా!”


"పెళ్ళికి ముందే మా అత్తవారిల్లు ఎలా ఉంటుందో చూడటానికి వచ్చాను” అంది ప్రణవి క్రీగంట చూస్తూ.


ఆమె మాటలు హర్షకి ఆశ్చర్యం కలిగించాయి..

“ఏమిటి మీరంటునారు? అత్తగారు ఊరు వెళ్ళాలంటే అమెరికా వెళ్ళాలి. ఇక్కడికి కాదు”.


“నా మాటలు మీ మట్టి బుర్ర అర్థం చేసుకున్నట్టు లేదు.. నేను నిజమే మాట్లాడుతునాను”.


“మీ మాటలు నా కర్థం కావటం లేదు. ”


“మీరు నన్నొదిలి వెళ్ళిపోయారు కానీ నా మనసులోంచి కాదు.. మీరు వెళ్ళిన రోజు మర్నాడు నాన్నగారితో నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదని, మిమ్మల్నే పెళ్ళి చేసుకుంటానని చెప్పేసాను. నాన్నగారు ముందర కోప్పడినా తరువాత చాలా సంతోషించారు. మా అమ్మా ఆనందానికైతే హద్దులేలేవు. మీరంటే నా కన్నా మా అమ్మకి అంత ఇష్టం.. ఈ విషయం మీకు ఫోన్లో కాకుండా స్వయంగా చెప్పాలనే మీకు చెప్పకుండా ఇక్కడికి వచ్చాను. మీ కిష్టమైతే చెప్పండి మీతో జీవితాంతం అడుగులు వేస్తాను. మీకు తోడుగా, నీడగా ఉంటాను.. ఇలా అడుగుతున్నందుకు మీరు ఏమి అనుకోవద్దు” అంది ప్రణవి..


ఆమె మాట్లాడుతుంటే కళ్ళు చెమర్చాయి.

“ప్రణవీ! మీరేం అంటునారో తెలుసా? నేనెక్కడ? మీరెక్కడ? దేనికైనా అర్హత ఉండొద్దా?”


“మీకేం అర్హత లేదు చెప్పండి.. ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు. మా నాన్నగారు ఎంత కష్టపడ్డా మీ లాంటి అల్లుణ్ణి తేలేరు.. ఆ దేవుడే నా కోసం మిమ్మల్ని మా ఇంటికి పంపేడనిపిస్తుంది.. ;

“ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయ” అన్నారు.. మన పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది.. దేవుడు మన నుదుట మీద ఎప్పుడో ఆ విషయాన్ని రాసేసాడు. ఇంకేమి మాట్లాడొద్దు” అంది ప్రణవి..


శ్రీహర్ష ఏమీ మాట్లాడలేదు.. ఒక్కసారిగా ఆమె దగ్గరకొచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు.. పైన ఆకాశం, కింద భూమి ఎదురుగా ఏటి రూపంలో నీరు.. శరీరంలో జ్వలిస్తున్న అగ్ని; ప్రకృతి.. వీటి సాక్షిగా అంటే ప్రకృతి సాక్షిగా పాణి గ్రహణం జరిగింది. ఆ సమయంలోనే వారిద్దరూ పంచభూతాల సాక్షిగా భార్యభర్తలయ్యారు.. ప్రణవి కూడా అతని చేతిని తీసి కళ్ళకు అడ్డుకుంది..


ఆ తరువాత నిశ్శబ్దం.. చాలా సేపు అక్కడ గడిపి ఇంటి కొచ్చారు. ఆ తరువాత సంఘటలన్నీ త్వరత్వరగా చోటుచేసుకున్నాయి. కరుణాకరం గారు, అతని భార్య రమణమూర్తి ఇంటికి వచ్చి తన కూతురు ప్రణవిని కోడలిగా చేసుకొమ్మని కోరడం, వాళ్ళు ఆనందంతో ఒప్పకోవడం, తరువాత భూమ్యాకాశాలు దద్దరిల్లినట్లు వాళ్ళ వివాహం పచ్చతోరణాలు అలంకరించిన పందిట్లో జరిగింది.


మనస్పూర్తిగా దీవించిన పెద్దల సమక్షంలో పచ్చటి అక్షతలు జల్లిన పవిత్రమైన పందిట్లో వాళ్ళు ఏకమయ్యారు..

తాళి కట్టే ముందర శ్రీహర్ష ప్రణవిని క్రీగంట చూసాడు. పెళ్ళి ముస్తాబులో ప్రణవి మెరిసిపోతోంది. పొడవైన జడ, దాని మీద తెల్లటి పరిమళాలు వెదజల్లుతున్న తెల్లటి మల్లె దండ, అందమైన తెల్లటి ముఖం, నుదుట ఎర్రటి కళ్యాణ తిలకం, బుగ్గమీద పెళ్ళిబొట్టు, ఆకు పచ్చటి పట్టుచీరలో అందం రాశి పోసినట్లు కూర్చొని ఉంది. ఆమెను అలా చూస్తూ ఉంటే

“సిగ్గు తెరలలో కనులు దించుకొని

తలనూ వంచుకొని

బుగ్గ మీద పెళ్ళిబొట్టు ముద్దులాడ

రంగులీను నీ మెడలో బంగారపు తాళి కట్టి పొంగి పోవు శుభదినం రానున్నదిలే”


అన్న పాట గుర్తు కొచ్చింది. ఆ తరువాత తెల్లటి మధుపర్కాలు కట్టుకొని ముత్యాలు తలంబ్రాలు చల్లుకున్నారు. వెన్నెట్లో అరుంధతీ నక్షత్రాని దర్శించుకున్నారు.


ఆ మర్నాడే వాళ్ళ మొదటి రాత్రి.. అంతా తెలుపు మయం..

తెల్లటి మేను, తెల్లటి చీర, తెల్లటి మల్లెదండ, తెల్లటి వదనంపై ఎర్రటి తిలకం.. తెలుపు దుప్పట్ల మంచం.. మత్తు కలిగించే పరిమళం.. ఎప్పుడు ఎక్కువగా మాట్లాడే ప్రణవి ఆరోజు మౌనం దాల్చింది. తెల్లటి పాల గ్లాసుతో దేవకన్యలా లోపలి కొచ్చి మంచం మీద కూర్చొంది.. అప్పట్నుంచీ నోటితో కాకుండా కళ్ళతోటే మాట్లాడుతోంది. ఇద్దరూ కొద్ది సేపటి తరువాత డాబా మీదకు వెళ్ళారు. ఊరంతా నిశ్శబ్దం గా ఉంది. డాబా అంతా పండు వెన్నెల పరుచుకొని ఉంది. కొబ్బరాకుల సందుల్లోంచి వెన్నెల కిరణాలు ఆమె మీద పడి మెరిసిపోతునాయి.


అలా పౌర్ణమి రాత్రి నిండు ఆకాశం కింద వెన్నెల పడుతుంటే ఆ నిశ్శబ్ద నీరవంలో ఒకరి పక్కన ఇంకొకరు; మత్తుగా ఉంది ఇద్దరికీ.. ఆమె అతనికి దగ్గరికి జరగగానే ఒళ్ళంతా పులకరింత; ఆమె ఒంపు సొంపులు అతన్ని తాకుతూ, ఆమె పరిమళం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ అతన్ని ఆనంద పరవశుణ్ణి చేస్తున్నాయి ..


అతని కెందుకో ఇది కలా నిజమా అని అనిపిస్తోంది. అతను ప్రణవితో వివాహం అంటే నమ్మలేకపోతునాడు. పోతపోసిన అందాల రాశి తన స్వంతమైందంటే ఆశ్చర్యపోతునాడు. ఇవే మీ తెలియని ప్రణవి మాత్రం అతని గుండెల మీద తల పెట్టి నిద్రపోసాగింది.


ఆమెను అలా చూస్తుంటే శ్రీహర్షకు “తెల్లవారనీకూ ఈ రేయినీ” అనీ చంద్రుణ్ణి వేడుకోవా లనిపించింది..

ప్రణవి ఉచ్ఛాస నిశ్వాసాలు చందన పరిమళం వెదజల్లుతూ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆమెను అలా చూస్తుంటే అతనికి జయదేవుడి అష్టపదులు, కావ్య నాయికలు గుర్తుకు రాసాగాయి.


ఆమె పరిమళం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అతనిలో కవిత్వం ఉప్పొంగి మోహన రాగం ఆలపించే సాగింది.


“గగనాంగనాలింగనోత్సాహియై

జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై

గంగా తరంగాల సంగీతమై

కమనీయ రమణీయ యువగీతమై

మలయాద్రి పవనాల అలాపనై

మధుమాస యామిని ఉద్దీపనై”


శారద యామిని భారంగా గడుస్తోంది, ఆ రాత్రి ఆ జంట జాగారం చేసింది. తెల్లవారు ఝామున వారి తనువులు అలసి సొలసి విశ్రమించాయి.


మూడు రాత్రులు ముగిసాయి. పెళ్ళి వారంతా వెళ్ళిపోయారు. పెళ్ళి పందిరి బోసి పోయింది.. పది రోజులు జనాలతో కిక్కిరిసిన ఆ ఇంట్లో నిశ్శబ్దం అలుముకోసాగింది.. ప్రణవి, శ్రీహర్ష పది రోజుల పాటు హానీమూన్ కి వెళ్ళి వచ్చారు.. ఆ తరువాత ప్రణవిని పుట్టింటికి దిగబెట్టి వచ్చాడు శ్రీహర్ష.

నెలరోజుల తరువాత శ్రీహర్షకి ఓ శుభవార్త తెలిసింది. అతను డీఆర్డీఎల్ లో సైంటిస్టుగా ఎంపికైనట్లు ఆఫర్ లెటర్ వచ్చింది..


******* ********* ********


డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డివో) రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అన్నది రక్షణ శాఖకి చెందిన పరిశోధనా సంస్థ.. ఇందులో మిలటరీకి సంబంధించిన పరిశోధనలు జరుగుతాయి. ఇది 1958లో ప్రారంభించబడింది. ఇందులో 5000 మంది శాస్త్రవేత్తలు పని చేస్తుంటారు. దీని కింద 52 పరిశోధనా శాలలు ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ (వాయుసేన), ఎలక్ట్రానిక్స్, మిసైల్స్, మరియు నేవీ రంగంలో పరిశోధనలు నిర్వహిస్తుంటాయి.


శ్రీహర్ష ఢిల్లీ వెళ్ళి తన జాయినింగ్ రిపోర్ట్ నివ్వగా అతన్ని డీఆర్డియల్ డిఫెన్స్ రీసెర్చి డెవలప్ మెంట్ లేబొరేటరీస్ కి ఎంపిక చేసి ట్రైనింగ్ కోసం హైదరాబాద్ పంపారు.

ఈ పరిశోధనాశాలలో ఎన్నో గొప్ప మిసైల్స్ రూపొందించబడ్డాయి. అగ్ని, ఆకాశ్, నాగ్, త్రిశూల్ లాంటి మిసైల్స్ ఇక్కడ తయారై భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో పొందుపరచబడ్డాయి.


శ్రీహర్ష హైదరాబాద్ వచ్చి అందులో రిపోర్ట్ చేసాడు. అతన్ని మిసైల్స్ విభాగానికి కేటాయించారు.. ఆసమయంలో ' బ్రహ్మాస్త్ర ' మిసైల్ ప్రాజెక్టు యొక్క పరిశోధన అప్పుడే ప్రారంభమైంది.


మొదటి రోజు డైరెక్టర్ సతీష్ చంద్ర వచ్చి కొత్త శాస్త్రవేత్తలకు ఆ ప్రాజెక్టు గురించి, ఆ సంస్థ గురించి అనేక విషయాలు ముచ్చటించాడు.

“ఫ్రెండ్స్! డీ ఆర్ డియల్లో ఎంపికైనందుకు మీ అందరికి శుభాకాంక్షాలు.. సంస్థలోకి మీకు స్వాగతం పలుకుతున్నాను. అసలు డిఆర్డియల్ గురించి తెలుసుకునే ముందు మన రక్షణ శాఖ గురించి కొంచెం తెలుసుకుంటే మంచిది..

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన రక్షణ శాఖ మీద కేంద్ర ప్రభుత్వాలు బాగా దృష్టి పెట్టడం వల్ల అది బాగా అభివృద్ధి చెంది ఈ రోజు ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాల తరువాత నాలుగవ పెద్ద మిలటరీ శక్తిగా మనం రూపొందాము..


1962లో వచ్చిన చైనా యుద్ధం మనకు చేదు అనుభవాలు మిగిల్చినా ఆ తరువాత మనం గుణపాఠాలు నేర్చుకొని మన బలాన్ని బాగా పెంచుకున్నాము. దాని ఫలితమే 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో మన విజయం.. ముక్తి వాహిని పేరుతో మనం కాశ్మీర్ కొండల్లోని పాకిస్థాన్ సరిహద్దుల్లో మనం జరిపిన యుద్ధం పాకిస్థాన్ని కోలుకోలేని దెబ్బతీసింది”

“అప్పట్లో పాకిస్తాన్ ఘాజీ అనే సబ్ మెరీన్ ద్వారా విశాఖపట్నాన్ని పేల్చెద్దామని చూసినా మన నావికాదళం అప్రమత్తతో వ్యవహరించి దాన్ని నాశనం చేసి ఒక పెద్ద ప్రమాదాన్ని నివారించింది.. ఆ తరువాత మన రక్షణ శాఖ కొత్తరకం ఆయుధాల మీద దృష్టి పెట్టింది. అవే సబ్ మెరైన్స్, మిసైల్స్”..


“కాకపోతే మనం జెట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీలో స్వయం సమృద్ధి సాధించకపోవడం విచారకరం. ఇంకా వాటి కోసం అమెరికా, ఫ్రాన్స్, రష్యాల మీద మనం ఆధారపడటం దురదృష్టకరం.. వాటిని ఇండిజీనియస్ గా మనదేశంలో మనమే తయారు చేయగలిగితే కొన్ని లక్షల కోట్లు మనకు ఆదా అవుతుంది. ”


“ఆ విషయం వదిలి పెడితే ఈ మిసైల్ కాంప్లెక్స్ ని డీ ఆర్ డియల్ అభివృద్ధి చేసింది. 1971లో దీని కోసం 2000 ఎకరాలు సేకరించి ఈ కాంప్లెక్స్ ని అభివృద్ధి చేసింది. మన పూర్వ డైరెక్టర్, మాజీ రాష్ట్రపతి, ప్రముఖ సైంటిస్టు శ్రీ అబ్దుల్ కలామ్ గారు ఈ మిసైల్స్ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించారని చెప్పడానికి నేను గర్వపడుతునాను. ఈ సెంటర్ని (ఆర్‌ సీఐ) రీసెర్చి సెంటర్ ఇమారత్ అంటారు.


ఇక్కడే అగ్ని, త్రిశూల్, ఆకాశ్ వంటి మిసైళ్ళ కు రూపకల్పన జరిగింది. వాటిని మన డి ఆర్ డి. యల్లే పరిశోధన, డిజైను చేసింది. అగ్ని 2500 కి. మీ లక్ష్యాన్ని, అలాగే ఆకాశ్, త్రిశూల్ కూడా పెద్ద లక్ష్యాలను ఛేదిస్తాయి.. అగ్ని రక్షణ శాఖ అమ్ముల పొదిలోకి వచ్చిన తరువాత పాకిస్థాన్ ఆత్మ రక్షణలో పడింది..


మన మిసైల్స్ లో అగ్ని సిరీస్ మీడియం మరియు లాంగ్ రేంజ్ బెలాస్టిక్ మిసైల్స్. పృథ్వి సిరీస్ షర్ట్ రేంజ్ బేలాస్టిక్ మిసైల్స్ అయితే త్రిశూల్ తక్కువ ఎత్తు షర్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్ మిసైల్స్, ఆకాశ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, చివరగా నాగ్ థర్డ్ జెనరేషన్ యాంటీ టాంక్ గైడెడె మిసైల్స్.. ఈ మిసైల్స్ కి మనం పురాణాల్లోని రాముడు, అర్జునుడు లాంటి గొప్ప యోధులు వాడిన అస్త్రాల పేర్లు పెట్టడం విశేషం.


ఇంతలో శ్రీహర్ష చెయెత్తి నిలబడ్డాడు. డైరెక్టర్ అతని వైపు చూసి “వాట్ ఈజ్ యువర్ డౌట్” అన్నాడు.


“సార్ !ప్రపంచంలో మిసైల్ టెక్నాలజీలో ఎవరు గొప్ప.. ప్రపంచంలో ఫాస్టెస్ట్ మిసైల్ ఏది” అని అడిగాడు.


"మంచి ప్రశ్న.. కూర్చోండి.. మిసైల్ వ్యవస్థ విషయంలో రష్యా అన్ని దేశాల కన్నా ప్రథమ శ్రేణిలో ఉందని చెప్పవచ్చు. ఈ మధ్యనే వాళ్ళు న్యూక్లియర్ మిసైల్ ని కూడా పరీక్షించారు. ఇక ఫాస్టెస్ట్ మిసైల్ విషయంలో బ్రహ్మాస్ గొప్పది. దీన్ని పి జె - 10 అంటారు. ఇది మీడియం రేంజ్ స్టెల్త్ రామ్ జెట్ సూపర్ సోనిక్ క్రూయిస్ మిసైల్. దీన్ని సబ్ మెరైన్ నుంచి గానీ, షిఫ్స్ నుంచి గానీ, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి గానీ ప్రయోగించవచ్చు. ఇది మన డిఆర్‌డిఎల్, రష్యా రెండు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్రహ్మోస్ పేరు మన బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నదుల పేర్లు కలిపి పెట్టారు..


మన ఆర్ సిఐ ని అవానిక్స్ హచ్ గా పిలుస్తారు. ఇంక మిసైల్ అంటే.. మిసైల్ ఈజ్ ఎ గైడెడ్ ఎయిర్ బోర్న్ రేంజ్డ్ వెపన్.. ఇది జెట్ ఇంజన్ లేదా రాకెట్ మోటార్ ద్వారా గాల్లో ఎగురుతుంది. అందుకే వీటిని గైడెడ్ మిసైల్స్ అంటారు.

ఇక మిగతా దంతా రేపట్నుంచి మీరు క్లాసురూముల్లోనూ, ప్రయోగశాలల్లోనూ నేర్చుకుంటారు.. మీరు మీ కిచ్చిన అసైన్మెంట్ లను క్షుణ్ణంగా పరిశీలించి, కష్టపడి శ్రమించి సకాలంలో మంచి నాణ్యతతో పూర్తి చెయ్యాలి.

మీరు డిజైన్ చేసి తయారు చేసిన మిసైల్స్ శతృదేశాన్ని నాశనం చేస్తే అంత కన్నా గర్వమైన పని ఇంకొకటుండదు. ఇంక చివరగా “సారే జహాసే అచ్చా! హిందూ సితా హమరా! జైహింద్” అనీ తన ప్రసంగాన్ని ముగించాడు.

=================================================================

ఇంకా వుంది


=================================================================


గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


38 views1 comment

1 Comment


VinipincheKathalu • 3 weeks ago

DRDL .. DRDO ల గురించిన విశేషాలు తెలుసుకోగలిగాము. బాగుంది.. అయితే కథ ఆద్యంతం monotone లో వినడం కంటే voice లో ఎమోషనల్ variation, natural dialogue డెలివరీ, different narration style ఇలా different shades ఉంటే బాగుంటుందని కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం

Like
bottom of page