top of page

గరుడాస్త్రం - ఎపిసోడ్ 1



'Garudasthram Episode 1' New Telugu Web Series




గన్నవరపు నరసింహ మూర్తి గారి ధారావాహిక గరుడాస్త్రం ప్రారంభం

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గ్రీష్మం!

ఎండ మండిపోతోంది. ఆ సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు ఆగింది. శ్రీ హర్ష బస్సు దిగి బయట కొచ్చి ఆటో కోసం చూసాడు. ఆటో స్టాండ్ దూరంగా ఉంది... రోడ్డంతా ట్రాఫిక్ మయం కావడంతో మెల్లగా అటు ఇటు చూస్తూ అవతలికి వెళ్ళాడు. ఆటో స్టాండంతా చాలా రద్దీగా ఉంది... ఒక ఖాళీ ఆటో వెళుతుంటే దాన్ని పిలిచి ఎడ్రస్ చెప్పాడు. ఆటో వాడు మూడు వందలిమ్మన్నాడు.


మూడు వందలనగానే హర్షకి చెమటలు పట్టాయి. తను 90 కిలోమీటర్లు బస్సులో వస్తే 80 రూపాయలు బస్సు ఛార్జీ. కానీ ఇక్కడ 6 కిలోమీటర్లకు మూడువందలా? అని అతనికి ఆశ్చర్యం కలిగింది. కొద్దిసేపు అక్కడే నిలబడి రెండు మూడు ఆటోలను మాట్లాడేడు. అందరూ 250, 300 చెప్పడంతో ఇంక ఆటో ఆలోచనకి స్వస్తి చెప్పి నడకకి పని చెప్పాడు.

అప్పుడు సమయం 11 గంటలైంది. సూర్యుడు నెత్తిన మండిపోతుంటే ఒకటే ఉక్కబోత. జేబులో రూమాలు తీసి ముఖం కడుక్కొని బేగులో మంచినీళ్ళ సీసా తీసి నీళ్ళు తాగి మళ్ళీ నడవడం మొదలు పెట్టాడు. రెండు కిలోమీటర్లు వెళ్ళిన తరువాత ఒక చెట్టు కనిపిస్తే అక్కడ కాసేపు నిలబడ్డాడు.


ఒక్కసారిగా ఎండ లోంచి చల్లటి నీడలోకి వెళ్ళగానే అతనికి హాయిగా అనిపించింది. మళ్ళీ ముఖం తుడుచుకొని జేబులోని ఎడ్రస్ కాగితం తీసి చూసాడు. లాయర్ కరుణాకరం, పన్నీరు వీధి... ఆర్టీసీ కాంప్లెక్స్ కి 6 కిలోమీటర్లు అని వ్రాసి ఉంది. ఆ కాగితాన్ని జేబులో పెట్టుకొని మళ్ళీ నడవటం మొదలు పెట్టాడు.. రోడ్లన్నీ వాహనాల రొదతో నిండి పోయి కనిపించాయి. కనుచూపు మేరలో మనిషి కనిపించటం లేదు. అన్నీ వేగంగా వస్తున్న వాహనాలే...


వాటిని చూస్తూంటే అతనికి తన కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి. తను ఇంజనీరింగ్ లో చేరినపుడు ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడు సాఫ్టవేర్ రంగం అభివృద్ధి చెందటంతో యువత, ఉద్యోగాలు, కార్లు పట్నాల్లో పెరిగాయి. ఆలోచిస్తూ నడుస్తుండగానే అతను 6 కిలోమీటర్ల దూరం వచ్చేసాడు..


పక్కనే సూపర్ బజార్ కనిపిస్తోంది. ఎడ్రస్ ప్రకారం కరుణాకరం గారిల్లు సూపర్ బజార్ ఎదురుగా... సూపర్ బజార్ దగ్గరకు వెళ్ళి ఎదురుగా చూసాడు.. - ఎదురుగా మూడంతస్తుల బిల్డింగ్ అత్యంత సుందరంగా ఉంది. ఎదురుగుండా పెద్ద గేటు... గేటు రెండు తలుపుల మీద రెండు నెమళ్ళు అందంగా కనిపిస్తున్నాయి. గేటు పక్కనే కరుణాకరం, అడ్వకేట్ అన్న బోర్డు కనిపించింది.. - వెంటనే రోడ్డు దాటి ఇంటి దగ్గరకు వెళ్ళాడు. ఇంటి మొదటి అంతస్తు దగ్గర ప్రణవి నిలయం అని వ్రాసి ఉంది...


గేటు దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళాలా వద్దా అని తటపటాయిస్తున్న సమయంలో వాచ్ మేన్ వచ్చి “ఎవరు కావాలి” అనీ అడిగాడు.


“నా పేరు హర్ష. నేను లాయర్ కరుణాకరం గారిని కలవాలి” అని హర్ష అతనితో చెప్పాడు.


అతను హర్ష వైపు ఎగాదిగా చూసి 'ఇక్కడే ఉండు. సార్ తో చెబుతాను” అని లోపలికి వెళ్ళాడు. కొద్ది సేపటి తరువాత అతను వచ్చి గేటు తీసి "ఆ గది లోకి వెళ్ళండి” అంటూ ఒక గదిని చూపించాడు.


హర్ష మెల్లగా అడుగులు వేస్తూ ఆ గది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నిశ్శబ్దంగా ఉంది. ఫోను చప్పుడు మాత్రం వినిపిస్తోంది. మనుషుల అలికిడి కనిపించలేదు.. - కొద్దిసేపటి తరువాత భయ భయంగా లోపలికి ప్రవేశించాడు..


లోపల పెద్ద టేబుల్... వెనక పెద్ద రివ్వాలింగ్ ఛెయిర్.. అందులో ఏభై ఏళ్ళ వ్యక్తి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతునాడు. అతను నల్లని కోటు, సిమెంట్ రంగు పేంట్, ఎర్రని టైతో చాలా హుందాగా కనిపిస్తున్నాడు.


కొద్ది సేపటికి ఆయన ఫోను పెట్టేసి హర్షని చూశాడు.

వెంటనే శ్రీ హర్ష అతనికి నమస్కారం పెడుతూ “నా పేరు శ్రీ హర్ష. మాది దశరధపురం;” అని చెప్పాడు.


“దశరధపురం అంటే మా ఊరే నన్న మాట సంతోషం.. ఎవరి కొడుకువు నువ్వు” అని అడిగాడు కరుణాకరం.

“సార్! నేను రమణమూర్తి మాస్టారి గారబ్బాయిని” అని చెప్పాడు.


“రమణమూర్తి మాస్టారి గారి అబ్బాయివా? చాలా సంతోషం... నిన్ను చూస్తుంటే మీ నాన్నని చూస్తున్నట్లే ఉంది. మీ నాన్న నేను ఇంటర్ వరకు కలిసే చదువుకున్నాము. ” అంటూ కూర్చోమని ఎదురుగుండా ఉన్న కుర్చీని చూపించాడు.

శ్రీహర్ష వెళ్ళి కుర్చీలో కూర్చున్న తరువాత అతను ఎటెండర్ని పిలిచి టీలు తెమ్మని చెప్పాడు..


“నువ్వు ఏమి చదువుతునావు?” అని అడిగాడు.

“సార్! నేను మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఈయర్ ఇక్కడి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాను” అని చెప్పాడు శ్రీహర్ష.


“ఒహెూ ఎక్సలెంట్... మేము చదువుకుంటున్నప్పడు మీ నాన్న ఇంజనీరింగ్ చదువుతాననీ అనేవాడు. దురదృష్టవశాత్తూ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల వాడు చదవలేకపోయాడు.. - పోనీ నువ్వు వాడి కోరిక తీర్చినందుకు సంతోషం. ఇప్పుడు మీనాన్న ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు” అని అడిగాడు కరుణాకరం.


“మా ఊళ్ళేనే సైన్స్ మాస్టారిగా పనిచేస్తున్నారు” అని చెప్పాడు శ్రీహర్ష,

“ఓకే! ఏంటిలా వచ్చావు.. ఏవైనా సహాయం కావాలా?” అని అడిగాడు కరుణాకరం.


వెంటనే శ్రీహర్ష” అవును సార్. నేను మూడేళ్ళూ కాలేజీ హాస్టల్లో ఉన్నాను. కానీ ఈ సంవత్సరం సీటు దొరకలేదు. అందుకని బయట ఉందామనుకుంటునాను.. - కానీ నాలాంటి విద్యార్థులకు రూమ్ ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. పోనీ ఇల్లు పూర్తిగా తీసుకుందామంటే పదివేలుకి తక్కువ ఏ ఇల్లూ లేదు. - నాన్నగారు మిమ్మల్నో సారి కలవమని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చారు” అంటూ జేబులోంచి ఒక ఉత్తరాన్ని తీసిచ్చాడు శ్రీహర్ష.


ఆ ఉత్తరాన్ని తీసుకొని చదివి టేబులు మీద పెట్టాడు కరుణాకరం. “నువ్వు చెప్పినట్లు విద్యార్థులకు ఈ రోజుల్లో ఎవ్వరూ గదులు అద్దెకివ్వటం లేదు. అయినా సరే నేను నీకు తెలిసిన వాళ్ళకి చెప్పి నాలుగైదు రోజుల్లో చెబుతాను. ” అన్నాడు కరుణాకరం.


శ్రీహర్ష లేచి నిలబడి “థాంక్యూ సార్. మళ్ళీ నాలుగు రోజుల తరువాత మిమల్ని కలుస్తాను” అంటూ బయటకు వెళ్ళిపోయాడు.


శ్రీహర్ష గేటు దాటి వెళ్ళిపోతున్న సమయంలో వాచ్ మాన్ పరుగున వచ్చి “సార్! అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు” అన్నాడు.


శ్రీహర్ష వెంటనే వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళాడు. కరుణాకర్ గారు అప్పటికే బయటకు నిలబడి అతని కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. శ్రీ హర్షని చూస్తూనే "అన్నట్లు మరిచిపోయానయ్యా.. - మా అవుట్ హౌస్ ఖాళీగా పడుంది. అదొక్కసారి చూడు. బాగుంటే అందులో ఉండిపో” అన్నాడు దూరంగా ఉన్న అవుట్ హౌస్ ని చూపిస్తూ..


శ్రీహర్ష వెంటనే అవుట్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు.

వాచ్ మేన్ వచ్చి తాళం తీసాడు. లోపలికెళ్ళి దాన్ని పరిశీలించాడు శ్రీహర్ష. ఒక పెద్ద గది, చిన్న వంట గది, ఇంకో మూల బాత్ రూమ్, లేవెట్రీ ఉ న్నాయి.. - పడుకునేందుకు డబుల్ కాట్, టేబుల్, ఇంకో పక్క టీవీ, ఏసీ, సోఫా సెట్టు. ఇలా అందులో కావలసిన ఫర్నిచరంతా ఉంది. అది చూసిన తరువాత బయట కొచ్చీ కరుణాకరం దగ్గరికొచ్చాడు.

“ఎలా ఉంది. అవుట్ హౌస్” అని అడిగాడు కరుణాకరం.


“చాలా బాగుంది సార్... ”


అయితే రేపే వచ్చి దిగిపో... నేను వాచ్ మేన్ కి చెప్పి ఈ రోజు శుభ్రంగా దాన్ని కడిగిస్తాను సరేనా” అని అడిగాడు.


“అలాగే థాంక్యూ యు వెరీ మచ్ సార్.. ” అంటూ హర్ష కాలేజీకి బయలుదేరాడు.


ఆ మర్నాడు ఉదయం పదిగంటలకు ఒక మినీ వేన్లో తన సామాన్లు, పుస్తకాలు తీసుకొని కరుణాకరం గారింటికి వచ్చాడు.. - ఆ సమయంలో కరుణాకరం గారు లేరు..

శ్రీహర్షని చూడగానే వాచ్ మేన్ గేటు తలుపులు తీసి “అయ్యగారు కోర్టు కెళ్ళారు. మీరు సామాన్లు పెట్టుకోండి. అయ్యగారు తమరొస్తారని చెప్పారు. నిన్ననే దాన్ని శుభ్రంగా పనిమనిషి చేత కడిగించాను” అని చెప్పాడతను.

“ఇంకెవరూ ఇంట్లో లేరా... ఎవరూ లేకుండా వెళితే బాగుండదు” అన్నాడు శ్రీహర్ష.


“అమ్మాయి గారున్నారు.. ఆవిడని పిలుస్తానుండండి” అంటూ లోపలికెళ్ళాడు వాచ్ మేన్.


కొద్ది సేపటి తరువాత వాచ్ మేన్, అతని వెనకాల ఒకమ్మాయి వచ్చారు. ఆమెకు 20 ఏళ్ళుంటాయి . - సౌందర్యమంతా రాశి పోసినట్లున్నాది; అందమైన గుండ్రటి ముఖం, తెల్లటి శంఖం లాంటి మెడ, నుదుటన చిన్న బొట్టు, సన్నటి నడుము, ఆకు పచ్చటి కుర్తా , తెల్లటి పైజామాతో ముఖం తిప్పకోలేనంత అందంగా ఉందామె. సభ్యత కాకపోయినా దేవకన్యలా ఉన్న ఆ సౌందర్య రాశిని కొద్దిసేపు తేరిపార చూసి ఆ తరువాత తలదించుకొని “నా పేరు శ్రీహర్ష. ఇక్కడే ఇంజనీరింగ్ ఫైనల్ చదువుతునాను. నాన్నగారు నన్ను అవుట్ హౌస్ లో ఉండమన్నారు... అందుకే సామానుతో సహా వచ్చాను” అని చెప్పాడామెకు..


ఆమె అతన్ని ఒకసారి నఖశిఖ పర్యంతం చూసి “మీరేనా హర్ష! నాన్నగారు మీరొస్తారని చెప్పారు. – పదండి” అంటూ అవుట్ హౌస్ వైపు నడిచిందామె,

‘సిరి వెంట లచ్చి, లచ్చి వెంట అవరోధ వ్రాతమున్’ అన్నట్లు ఆమె వెనక అతను వెళ్ళాడు.


ఆమె ఆ ఇంటి తలుపులు తీస్తూ “చాలా రోజులైంది దీని తలుపులు తీసి, ఇది వరకు నాన్నగారి క్లయింట్స్ ఎవరో వస్తూ ఇందులో ఉండేవారు. ఈ మధ్యన ఎవ్వరూ రావటం లేదు. అందుకే అవుట్ హౌసంతా నిన్న శుభ్రం చేయించాము లెండి” అంది లోపలికి నడుస్తూ..


లోపలికెళ్ళగానే ఒక విధమైన మల్లెల పరిమిళం అతన్ని ఉక్కిరి బిక్కిరి చెయ్యి సాగింది. అప్పుడు ఆమెని చూసాడు. పిరుదులు దాటే పొడవైన జడ, నల్లటి కురుల మీద తెల్లటి మల్లెల సౌరభాల దండ... ఒకమ్మాయిని అతనెప్పుడూ అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. , మొదటి సారిగా ఈ రోజే చూస్తున్నాడు.


ఆమె వాచ్ మేన్ని పిలిచి " వెంకన్నా ! ఈ సామాన్లన్ని ఇందులో శు భ్రంగా సర్దేయ్యి , పదండి మనం కాఫీ తాగుదాం” అంటూ బయటకు వచ్చి ఇంటి వైపు నడిచింది.


అతను ఆమె వెనకే ఒక విధమైన ట్రాన్స్ లో నడుస్తున్నాడు. ఇందాకట్నుంచి ఆమెను గమనిస్తున్నాడు. ఆమె ప్రతి కదలికలో ఒక చురుకుదనం, మాటల్లో అధికారం, నడకలో చలాకీతనం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి.. - చెప్పే దాంట్లో స్పష్టత గోచరిస్తోంది..


డ్రాయింగ్ రూమ్ లోకెళ్ళి అతనికి సోఫా చూపించి తను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది...

అతను ఆమె కెదురుగా మొహమాట పడుతూ కూర్చున్నాడు..


“మీరు బాగా మొహమాట పడుతున్నట్లున్నారు.. ఫ్రీ గా ఉండండి. - మా ఇంట్లో నేను, అమ్మ, నాన్నగారు.. అమ్మగారు మా తాతగారింటికి వెళ్ళింది.. - ఇంతకీ ఏ బ్రాంచ్ మీది” అని అడిగింది..


ఇంతలో ఒకమ్మాయి ట్రేలో ఇద్దరికీ కాఫీలు తెచ్చింది. - ఆమె ఒక కప్పు అతని కందించి, తను ఇంకొంటి తీసుకొని “తాగండి” అంది.. - అతను బెదురుగా ఆ కప్పు నందుకొని తాగడం మొదలు పెట్టాడు.


అతను తాగుతుంటే ఆమె “నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు” అని అంది.


“నేను యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతునాను... ” అని చెప్పాడు.


“అంటే మళ్ళీ సంవత్సరం నుంచి మీరు ఏ పేద్ద ఫ్యాక్టరీలోనో పేద్ద మెకానికల్ ఇంజనీరింగ్ అవుతారన మాట” అంది కిలకిలా నవ్వుతూ... ఆమె నవ్వుతుంటే గుప్పెడు మల్లెలు రాలినట్లు అనిపించింది.


“చదువైపోతే సరా.. ఉద్యోగం రావాలి కదండీ” అన్నాడు అమాయకంగా...

“ఇక నుంచీ అండీ అనకండి. నా పేరు ప్రణవి. పేరుతో పిలవండి” అన్నట్టు నాగురించి చెప్పడం మరిచిపోయాను... నేను మీ యూనివర్శిటీ కాలేజీలో లా ఫైనలియర్ చదువుతున్నాను” అంది మళ్ళీ నవ్వుతూ.


“నాన్నగారు పెద్ద లాయర్... మీరు అతనికి వృత్తిలో వారసురాలవుతారన్న మాట” అన్నాడు శ్రీహర్ష చిరునవ్వుతో.


ఇప్పటికీ మీ ముఖంలో నవ్వు చూసాను. మీకు నవ్వడం రాదేమోనని భయపడ్డాను. ఇప్పుడా భయం పోయింది లెండి” అంది ప్రణవి.


“మీ మాటలతో నా బిడియాన్ని పోగొట్టారు.. -” అన్నాడు శ్రీ హర్ష.


కొద్దిసేపటి తరువాత అతను లేచి నిలబడుతూ “మేడం! నేను వెళ్ళి రూమ్ సర్దుకుంటాను” అన్నాడు.


"మళ్ళీ మేడం అంటున్నారు. నేను అంత పెద్ద దానిలా కనిపిస్తున్నానా? పేరు పెట్టి పిలవండి... మీరేమి ఇంటిని సర్దక్కర్లేదు. వాచ్ మేన్ సర్దేసి ఉంటాడు. మరి మీ భోజనం” అందామె లేస్తూ.


"ఈ రోజుకి బయట హోటల్లో తింటాను”. రాత్రి నుంచి వండుకుంటాను” అన్నాడు హర్ష.

“అవేం వద్దులెండి. ఈ రోజుకి మా ఇంట్లోనే మీ భోజనం.. నాన్నగారు ఈ విషయం చెప్పి వెళ్ళేరు... నాన్నగారు, మీ నాన్నగారు స్నేహితులట కదా... ఆ విషయం చెప్పి మీరు బయట తింటే తన స్నేహితుడు కోప్పడతాడని చెప్పి మరీ వెళ్ళారు” అంది ప్రణవి.


“మీ కెందుకండి ఆ శ్రమ. ఉండటానికి ఇల్లు ఇవ్వటమే గొప్ప వరం నాకు. ఇంక భోజనం కూడానా? దేనికైనా ఒక హద్దుండాలి” అన్నాడు.


“భోజనానికి మేమేమీ కష్టపడక్కర్లేదు లెండి, మాతో పాటే మీరునూ, వంటమనిషి చేస్తుంది. అవేమి ఆలోచించకుండా ఒంటి గంటకు రండి... ” అంటూ లేచిందామె.

=================================================================

ఇంకా వుంది


=================================================================


గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


82 views0 comments
bottom of page