top of page

గరుడాస్త్రం - ఎపిసోడ్ 2


'Garudasthram Episode 2' New Telugu Web Series




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ....


శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.

అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.

ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు.

అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు.

కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.


ఇక గరుడాస్త్రం రెండవ భాగం చదవండి...


ఆ తరువాత శ్రీ హర్ష అవుట్ హౌస్ లోపలి కెళ్ళాడు. అతని సామానంతా అందులో నీటుగా సర్దబడి ఉంది. యజమానురాలి ఆర్డర్స్ ని ఆ వాచ్ మేన్ వెంకన్న తూచ తప్పకుండా పాటించి అద్భుతంగా సర్దినట్లున్నాడు..


శ్రీహర్ష లోపలికెళ్ళి సోఫాలో కూర్చొని ఆలోచించసాగేడు.. ముఖ్యంగా ఆ ఇంటిలోని కరుణాకరం గారు, అతని కూతురు ప్రణవి. వాళ్ళ మర్యాదని, మంచితనాన్ని చూస్తుంటే అతని కంట నీరు చెమ్మగిల్లుతోంది..


ఒంటి గంట ప్రాంతంలో అతను భోజనం కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ప్రణవి హల్లో అతని కోసం ఎదురు చూస్తోంది. శ్రీహర్షని చూడగానే “రండి “అంటూ డైనింగ్ హాలు వైపు నడిచింది.


వాళ్ళిదర్నీ చూడగానే వంటావిడ ఇద్దరికీ డైనింగ్ టేబుల్ మీద వడ్డించటం మొదలు పెట్టింది. గోంగూర పచ్చడి, వంకాయ, బంగాళా దుంపల వేపుడు, టమోటా పప్పు, సాంబారు ఘుమ ఘుమ వాసనలతో వంటకాలన్నీ ఊరిస్తున్నాయి.. - ముఖ్యంగా సాంబారు వాసన అతనికి తన అమ్మ చేసే పులుసుని గుర్తుకు తెచ్చింది.

“ఏంటలా ఆలోచిస్తున్నారు. తినండి” అంది ప్రణవి.


“నేను బయటతినేద్దామనుకున్నాను కదండి.. - మీరు నన్ను బాగా మొహమాట పెట్టేస్తున్నారు”, అన్నాడు హర్ష.


“మీకింకా మొహం మాటం పోయినట్లు లేదు. అలా ఆలోచిస్తే మీరు అన్నం మనస్పూర్తిగా తినలేరు. అయినా మిమ్మల్ని భోజనం ఇక్కడే చెయ్యిమనీ నాన్నగారు చెప్పి మరీ వెళ్ళారు. ఇంకేం ఆలోచించకుండా తినండి” అంది తను కలుపుకుంటూ.. -

అతను కూడా కూరని కలుపుకొని తింటుంటే “అదేంటి కూరతో మొదలెట్టారు పప్పు తో ఆరంభించాలి కదా? అయినా నాన్నగారెప్పుడూ వంకాయలకీ, బంగళా దుంపలకీ నప్పదంటుంటారు. వంకాయెప్పుడూ బంగాళాదుంపతో ‘ఓసీ నీ దుంపా తెగా నీతో వేగలేముస్మీ’ అంటూ ఉంటాయట.... ” అని చెప్పగానే శ్రీహర్షకి నవ్వు ముంచుకొచ్చింది.


పెరుగన్నం తింటున్నప్పుడు ప్రణవి” ఎలా ఉంది భోజనం? వంటకాలు బాగున్నాయా?” అని అడిగింది..


“ఆకలి నాకు బాగా తెలుసు కానీ ఇంత రుచిగా ఉంటుందనీ ఇవాళ భోజనం చేస్తుంటే తెలిసింది” అన్నాడు శ్రీహర్ష.

అతని మాటలు ప్రణవిని కదిలించి మౌనం దాల్చింది...


ఆ మర్నాడు నుంచి శ్రీహర్ష కాలేజీకి వెళ్ళడం మొదలు పెట్టాడు. మొదటి రోజున కరుణాకరం గారు పిలిచి ప్రణవి వెళ్తున్న కారులో కాలేజీకి వెళ్ళమని చెప్పడంతో ఆరోజు మొహమాట పడతూ ఆ కారులో కాలేజీకి వెళ్ళాడు. ఆ మర్నాడు ప్రణవి తన కోసం కారులో ఎదురుచూస్తున్నప్పుడు ఆమె దగ్గరికి వచ్చి “మేడం ! నేను సిటీ బస్సులో వెళ్ళిపోతాను. దయచేసి మీరు వెళ్ళిపోండి. ఇలా అంటున్నందుకు ఏమి అనుకోవద్దు, ఉండటానికి నాకు యిల్లిచ్చి ఎంతో సహాయం చేసారు మీ నాన్నగారు. ఇంక వెళ్ళడానికి కారు కూడా ఇస్తే నాకు పొగరు తలకెక్కుతుంది. దయచేసి మీరు వెళ్ళిపోండి” అన్నాడు..


“మరి ఈ విషయం నిన్న నాన్నగారి కెందుకు చెప్పలేదు మీరు.. ఇప్పుడు మిమ్మల్ని తీసికెళ్ళకపోతే నాన్నగారు నన్ను కోప్పడతారు. ఈ రోజుకి రండి... రాత్రికి నేను నాన్నగారికి మీ అభిప్రాయాన్ని చెబుతాను” అంది ప్రణవి.


ఆమె మాటలకు మౌనం దాల్చి శ్రీహర్ష కారులో వెళ్ళి కూర్చున్నాడు. కారు కదిలిన తరువాత “నాన్నగారికీ విషయం చెబితే ఆయన కోప్పడతారేమో. కొంచెం ఆలోచించండి” అన్నాడు శ్రీహర్ష.


"చెప్పకపోతే మరింత కోప్పడతారు. అయినా మీ కోసం మేము ప్రత్యేకంగా కారు పంపటం లేదు కదా... ఎలాగూ నేను వెళ్తునాను. మీరు అందులో వస్తున్నారు. ఇందులో తప్పేంటి” అంది ప్రణవి..


“అవుననుకోండి! రోజూ మీ కార్లోంచి కాలేజీలో దిగుతుంటే చూసినవాళ్ళు వేరే విధంగా అనుకునే అవకాశం ఉంటుంది. అందుకే రానంటునాను” అన్నాడు హర్ష. “అనుకున్న వాళ్ళు ఏదో విధంగా అనుకుంటునే ఉంటారు. అలా భయపడితే మనం ముందుకు వెళ్ళలేము.. - అదే కారణమైతే మీరు భయపడొద్దు. అయినా ఈ ప్రపంచంలో ఎవరి బతుకు వారిది. ఒకరి కోసం మనం బతక కూడదు . అలా అనేవాళ్ళు ఒక్కరైనా మీకు ఇంటి విషయంలో సహాయం చేసారా చెప్పండి. అలాంటి వాళ్ళకు మిమ్మల్ని అనే హక్కెక్కడింది చెప్పండి” అంది ప్రణవి.


అలా అంటున్నప్పుడు ప్రణవి ముఖం ఎర్రగా మారడాన్ని గమనించాడు హర్ష... తన మాటలు ఆమెకి కోపం తెప్పించాయనిపించింది హర్షకు.. - “మీరు చెప్పింది అక్షరసత్యం.. కానీ నావల్ల మిమ్మల్నెవడైనా అంటే నాకు చాలా బాధ కలుగుతుంది, లోకులు కాకులు ఏవో పుకార్లు వ్యాపిస్తారు” అన్నాడు హర్ష....


“కారు కన్నా పుకారుకి జోరెక్కువ, దంతి కన్నా వదంతి పెద్దదనీ అంటారు. వాటి గురించి భయపడితే ఎలా చెప్పండి? మనం వాళ్ళకి భయపడితే మరింత విజృంభిస్తారు. మనం పట్టించుకోకపోతే వాళ్ళే తోక ముడుస్తారు” అంది ప్రణవి.


ఆమె మాటలు అతనికి ఓ ప్రణవ నాదంలా కర్తవ్య బోధన చేసాయి. అతను తరువాత ఆవిషయాన్నింకేం పొడిగించక మౌనం దాల్చేడు.


కాలేజీకి కారు చేరగానే అందులోంచి దిగి "ప్రణవి గారూ! మీ మాటలు నాకు నచ్చాయి. నాకు కర్తవ్య బోధన చేసాయి. ఇంక ఈ విషయం నాన్నగారితో చెప్పకండి రేపట్నుంచీ నేను మీ కారులోనే వస్తాను” అన్నాడు హర్ష.


అతని మాటలకు ప్రణవి నవ్వుతూ “హమ్మయ్య! నా మాటలు మీకు నమ్మకం కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది” అంది ఆమె కూడా నవ్వుతూ. ఆ తరువాత కారు వెళ్ళిపోయింది...


ఆరోజు శ్రీ హర్ష “హీట్ ఇంజన్స్” లేబొరేటరీలో ప్రేక్టికల్స్ చేస్తుండగా ఎటెండర్ వచ్చి అతని కోసం ఎవరో అమ్మాయి వచ్చినట్లు చెప్పాడు. శ్రీహర్ష ఆశ్చర్యపోతూ ఇనస్ట్రక్టర్ అనుమతి తీసుకొని బయటకొచ్చాడు.


లేబొరేటరీ బయట చెట్టు కింద ఉన్న రాతి బెంచీ పై లేత గులాబీ రంగు డ్రెస్ లో అందంగా మెరిసిపోతూ కనిపించింది ప్రణవి. నిజంగానే అప్పుడామె అందమైన గులాబీలాగే ఉంది. మెరిసిపోతున్న ముఖంపై అందమైన చిరునువ్వు, ఎర్రటి బొట్టు ఆమె అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తున్నాయి... ఆ సమయంలో ఆమె ముఖంలోని చిరునవ్వుని చూస్తూంటే ఎప్పుడో చదివిన వాక్యం గుర్తు కొచ్చింది. మనిషి ముస్తాబుకి చిరునవ్వు లేకపోతే అది పూర్తి కానట్లే అన్నది ఆ వాక్యం.

Unless there is a smile on your face, it is not the end of makeup.


అతన్ని చూడగానే ప్రణవి లేచి నిలబడి "హర్షగారూ! ఈ కళాశాలలో మిమల్ని పట్టుకునేందుకు గంట సేపు పట్టింది. చివరికి ఇక్కడ దొరికారు” అంది..


“ఎందుకండీ! మెకానికల్ డిపార్టుమెంటు కొచ్చి నా పేరు చెబితే వాళ్ళే నన్ను మీ దగ్గరకు తీసుకు వచ్చేవారు కదా?” అన్నాడు..


“సర్లెండి! ఇలాగే చెట్టు కింద నిలబెట్టేస్తా రా లేక టీ, కాఫీ లేమైనా ఇప్పిస్తారా?” అంది నవ్వుతూ...


“పదండి! కేంటీన్ కెళదాం” అన్నాడు కేంటీన్ వైపు నడుస్తూ..

అక్కడికి కొద్ది దూరంలోనే చెట్ల మధ్య ఉంది కేంటీన్. క్లాసులు జరుగుతున్న సమయం కాబట్టి అక్కడ అట్టే స్టూడెంట్స్ లేక బెంచీలన్నీ ఖాళీగా ఉన్నాయి.


శ్రీహర్ష, ప్రణవి ఒక మూల టేబులు దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు.. - ఒక కుర్రవాడు వస్తే రెండు సమోసాలు, కాఫీ అనీ చెప్పాడు హర్ష...


“చెప్పండి? ఏంటిలా వచ్చారు. ఏదైనా విశేషమా?” అని అడిగాడు.

“ఏం విశేషమేమీ లేకపోతే రాకూడదా?” అంది ప్రణవి.

“అదేం లేదు చెప్పండి... ”


" ఎల్లుండి ఆదివారం నాడు నా పుట్టిన రోజు.. సాయంత్రం కొంచెం షాపింగుంది. మీరొస్తారేమోనని కనుక్కొందామని వచ్చాను” అంది.

“ఏంటి షాపింగ్”?


"కేక్సు, కూలడ్రింక్స్, స్వీట్స్, డ్రెస్ ఇవన్నీ కొనుక్కోవాలి. డాడీని రమ్మంటే తనకు పనుందని చెప్పారు. అందుకే మీ దగ్గరి కొచ్చాను” అంది.

“అలాగే మధ్యాహ్నం ఈ రోజు ప్రాజెక్టు క్లాసు... ఓ గంట వేళ్తే చాలు. 4 గంటలకి నేను మా గేటు దగ్గర ఉంటాను” అన్నాడు..


“హమ్మయ్య! ఒప్పుకున్నారు. రానంటే ఏం చెయ్యాలోననీ తెగ ఆలోచించాను. అది సరే.. నేను మీకోసం మీ క్లాసు దగ్గరికి వచ్చేను కదా... మీ ఫ్రెండ్స్ ఏమనుకోంటారోననీ మీకు భయం వెయ్యలేదా?”అంది అతన్ని క్రీ గంట చూస్తూ...


శ్రీహర్ష కాసేపు మౌనం దాల్చి “ఇది వరకైతే మీరన్నట్లు భయం వేసేదే కానీ మొన్న మీరేగా 'అనుకునే వారు అనుకుంటునే ఉంటారు. వాళ్ళని మనం పట్టించుకోకూడదు' అని చెప్పారు.. - అప్పట్నుంచీ నాకు ధైర్యం వచ్చింది" అన్నాడు ఆతను కూడా నవ్వుతూ.


“మీరు ప్రతిరోజు కేంటీన్ కి వస్తుంటారా?”

“నేను పెద్దగా రాను.. కానీ కాలేజీ సగం ఇక్కడే ఉంటుంది. ఇక్కడి కొస్తే కాలం తెలియదు. అందుకు నేను పెద్దగా రాను. ఎప్పుడు లీజర్ పిరీయడ్ ఉంటే తప్ప” అనీ చెప్పాడు.


“ఇంజనీరింగ్ కాలేజీ లాంటి ప్రొఫెషనల్ కాలేజీల్లో విద్యార్థులు చాలా కేరేపిన్ ఉంటారని అంటారు.. అది నిజమేనా” అంది.


“అదేం లేదు... అన్ని కళాశాలల్లాగే ఇక్కడా కొంతమంది వామపక్ష భావాలు వాళ్ళుంటారు... వాళ్ళెప్పుడు దేశం గురించి విపరీతంగా ఆలోచిస్తూ తెగ బాధపడిపోతూ ఉంటారు.. చదువు పూర్తైన తరువాత నిరుద్యోగపర్వం లోకి ప్రవేశించిన తరువాత వాళ్ళకి అసలు సంగతి బోధ పడుతుంది. చదువుకుంటున్నప్పుడు ప్రతీ వారిలో ఒక కమ్యూనిస్ట్ ఉంటాడు. ఆ తరువాత వాళ్ళే స్వార్ధపరులుగా మారిపోతారు... ఇది జీవన పరిణామ క్రమం. స్వార్ధం లేని దెవరికి చెప్పండి. అందుకే జూన్ డోన్నె తన మెడిటేషన్ పుస్తకంలో” నోమేన్ ఈజ్ ఏన్ ఐలాండ్” అనీ వ్రాసాడు.. దీవి ఎవ్వరితో కలవకుండా ఒంటరిగా ఉంటుంది. కానీ మనుషులు అలా కాదు” అన్నాడు..


అతని చెప్పిన విషయాలకు ఆమె ఆశ్చర్యపోతూ “మీరు పుస్తకాలు బాగా చదువుతారా?” అని అడిగింది కళ్ళను చక్రాల్లా అటు ఇటూ గుండ్రంగా తిప్పుతూ...


“నేను ఇంటర్ తరువాత అనుకోకుండా ఇంజనీరింగ్ లో చేరాను.. - నాకు సీటొస్తుందనీ మానాన్నతో సహా ఎవ్వరూ అనుకోలేదు. నాకే నమ్మకం లేదు. అటువంటిది ఐదువందల లోపు ర్యాంకు వచ్చి సీటొచ్చింది.. ఒక్కసారిగా పల్లెనుంచి ఈ పెద్ద నగరంలో అడుగు పెట్టడంతో మొదట్లో ఉక్కిరి బిక్కిరయ్యాను. నాకు పెద్దగా స్నేహితులు లేకపోవడంతో నా వంటరితనాన్ని పుస్తకాలతో పోగొట్టుకున్నాను. అప్పుడు ఎన్నో గొప్ప పుస్తకాలను చదివాను. థేంక్స్ టు మై లైబ్రరీ... అదొక విజ్ఞాన భాండాగారం.. మనకు ఇష్టముంటే జ్ఞానసముపార్జనకు అంతకన్నా గొప్ప ప్రదేశం ఉండదు.. అప్పుడే ఇంగ్లీషులోని షేక్ స్పియర్ సాహిత్యం, వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్ , టెన్నీ సన్, జాన్ మిల్టన్ లాంటి గొప్ప గొప్ప కవుల సాహిత్యం చదివేను. రాబర్ట్ లూయిస్ స్టీవెన్ సన్, ఎర్నెస్ట్ హెమింగ్వే, రాబర్ట్ కామూ, అలివర్ గోల్డ్ స్మిత్, ఓ హెన్రీ, డికెన్స్ లాంటి గొప్ప గొప్ప రచయితల నవల్స్ చదివే అదృష్టం కలిగింది. తెలుగులో అయితే భారత, భాగవత రామాయణాలతో పాటు మనుచరిత్ర, ఆముక్త మాల్యద, వేయి పడగలు, మహా ప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి... ఇలా ఎన్నో గొప్ప సాహిత్యాన్ని చదివాను. ” అన్నాడు శ్రీహర్ష.


అతను చెప్పిన మాటలు విన్న తరువాత ప్రణవి ఆశ్చర్యపోయింది. ఒక్కసారిగా అతని మీద ఆమెకు గౌరవం పెరిగిపోయింది. మామూలుగా కనిపించే ఆతనిలో చాలా లోతైన భావాలు కనిపించాయి.


ఆ తరువాత ఆమె అతని దగ్గర వీడ్కోలు తీసుకొని తన కాలేజీ వైపు వెళ్ళిపోయింది.


=================================================================

ఇంకా వుంది


గరుడాస్త్రం ధారావాహిక మూడవ భాగం త్వరలో

=================================================================


గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link

https://twitter.com/ManaTeluguKatha/status/1623546795984044034?s=20&t=jSCItCe2RyWT3h9VEKG2sw

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.



41 views0 comments
bottom of page