top of page

గరుడాస్త్రం - ఎపిసోడ్ 5


'Garudasthram Episode 5' New Telugu Web Series




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.

అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.

ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు.

కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.

ప్రణవి, ల్యాబ్ దగ్గరకు వచ్చి శ్రీహర్షను కలుస్తుంది.

తన బర్త్ డే షాపింగ్ కి అతన్ని తోడు రమ్మని కోరుతుంది.

ముందుగా ఇద్దరూ బీచ్ లో కొంత సమయం గడుపుతారు.

బర్త్ డే సందర్భంగా ఆమె ఇంటి డెకరేషన్ లో సహాయ పడతాడు.

ఒకరోజు కరుణాకరన్ గారు శ్రీహర్షని పిలిచి కోనసీమలో జరిగే ఒక పెళ్ళికి తన కూతురికి తోడుగా వెళ్ళమంటాడు.

ప్రణవితో కలిసి అక్కడికి వెళతాడు.

పెళ్లి కూతురి పక్కనే కూర్చుని ఉన్న ప్రణవి సౌందర్యానికి ముగ్ధుడవుతాడు శ్రీహర్ష.


ఇక గరుడాస్త్రం ఐదవ భాగం చదవండి..


ఎప్పుడు లేనిది ఆ రోజు శ్రీ హర్ష పెళ్ళిని పూర్తిగా చూసాడు. ముందు ముహుర్త సమయానికి జీలకర్ర, బెల్లం పెట్టడం, ఆ తరువాత మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠేబ.. ” అన్న మంత్రోచ్ఛరణతో మంగళ సూత్ర ధారణ, ఆ తరువాత తెల్లటి మధు పర్కాలతో తెల్లటి తలంబ్రాలను వధూవరులు ఒకరి మీద ఒకరు పోసుకోవడం, ఆ తలంబ్రాలు పోస్తున్నప్పుడు ప్రణవి తన స్నేహితురాలికి సహాయం చేయడం..


తదనంతరం అప్పగింతలు, తెల్లవారుతుండగా అరుంధతీ నక్షత్ర దర్శనం.. ఇలా మొత్తం పెళ్ళి తంతులన్నీ చాలా ఇష్టంగా అనుభవిస్తూ చూసాడు శ్రీ హర్ష. మొత్తం పెళ్ళిపందిరి అంతా ఒక మంగళకరమైన పవిత్ర పరిమళం వ్యాపించి ఒక పవిత్ర వాతావరణానికి అంకురార్పణ జరిగింది..


తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురు.. అన్న అన్నమయ్య కీర్తన పందిరంతా మారుమ్రోగటం, తాళి కడుతున్నప్పుడు అలనాటి రామచంద్రుని.. అన్న పాట మధురంగా వినిపించటం.. ఆ సమయంలో అతన్ని ప్రణవి క్రీగంట చూసి నవ్వటం అన్నీ గుర్తుకొచ్చాయి శ్రీ హర్ష కి.

ఏదైనా అతని జీవితంలో ఆ పెళ్ళి రోజు రాత్రి ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందని చెప్పవచ్చు.

ఆ మర్నాడు తొమ్మిది గంటలకు పెళ్ళి పెద్దలకు చెప్పి బయలుదేరడానికి సిద్ధ పడింది ప్రణవి. అప్పటికే అన్నీ సర్దుకొని సిద్ధంగా ఉన్నాడు హర్ష..


ప్రణవి పెళ్ళికూతురుకి తను వెళ్ళిపోతానన్నా విషయం చెప్పగానే ప్రియంవద “అదేంటి ఈ రోజు ఉండి రేపు వెళ్ళొచ్చు కదా.. నిజంగా తోడి పెళ్ళికూతురిగా నువ్వు నా పక్కన కూర్చోవటం నాకు ఎంతో ఆనందం కలిగింది తెలుసా? ఇంకో విషయం చెప్పనా! మా శ్రీవారు నీ పక్కన కూర్చున్న ఆ సౌందర్యరాశి ఎవరనీ నీ గురించి అడిగారు తెలుసా.. నిజంగా నువ్వు నిన్న రాత్రి చాలా అందంగా కనిపించావు?” అంది ఆమె బుగ్గలు నొక్కుతూ

“ఎలాగూ ఇంత దూరం వచ్చాను. పాపికొండలు చూసి వెళ్ళిపోతాము. అయినా రాత్రంతా పెళ్ళితంతుతో నీకు నిద్రలేదు. హాయిగా పడుకో. రేపట్నుంచీ నీకెలాగూ నిద్ర ఉండదు” అంది పకపకా నవ్వుతూ..


ఆమె మాటలకు ప్రియంవద బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. “పోవే! చిన్నప్పటి చిలిపితనం నీ కింకా పోలేదు” అంది తను కూడా నవ్వుతూ..


ఆ తరువాత ప్రియంవద తల్లి ప్రణవికి పళ్ళెంలో చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ తెచ్చి బొట్టు పెట్టి ఆమెకిచ్చింది.. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బయలుదేరారు..

పెళ్ళికూతురు మధుపర్కంతోనే కారు దగ్గరికి వచ్చి ప్రణవికి వీడ్కోలు పలికింది. కారు కొంతదూరం వెళ్ళిన తరువాత ప్రణవి వెనక్కి తిరిగి చూస్తే ప్రియంవద చేతులు గాలిలో ఊపుతూ కనిపించడంతో ప్రణవి కంట నీరు చెమ్మ గిల్లింది.


“శ్రీ హర్ష గారు! మనం ఇప్పుడు పాపికొండలు చూసి, వెళదాము” అంది ప్రణవి..


“పాపి కొండలు వెళ్లే బోట్ ఇప్పుడు పోలవరం డేము వల్ల రాజమండ్రి నుంచి బయలుదేరటం లేదు. అవి పేరంటాల పల్లి దగ్గర్నుంచనుకుంటాను బయలుదేరుతున్నాయి. మనం వెళ్ళి సరికే పడవలుంటాయో ఉండవో” అన్నాడు శ్రీ హర్ష.


“ఏం పడవలో తప్పా కార్లో అక్కడికి వెళ్ళలేమా?” అంది ప్రణవి ఉత్సుకతతో.


“ఉంది.. ఆ మధ్యన మాఫ్రెండొకడు ఆ పాపికొండల దగ్గరలో ఉన్న పల్లెటూరు దాకా కార్లో వెళ్ళి అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని పాపికొండల దగ్గరికి వెళ్ళాడంట. వాడిని కనుక్కుంటాను ఎలా వెళ్ళాలో” అంటూ తన స్నేహితుడు అనిల్ కి ఫోను చేసి ఆ వివరాలు కనుక్కున్నాడు..


కారు పాపికొండల దగ్గర ఉన్న కచ్చలూరు చేరేసరికి పది గంటలైంది. అక్కడికి పాపికొండలకి రెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది.

డ్రైవర్ని ఆ ఊర్లోనే చెట్టు కింద ఉండమని చెప్పి వాళ్ళిద్దరూ పాపికొండల దగ్గరికి బయలుదేరారు. వర్షాకాలం వెళ్ళిపోయినా దారంతా బురదగా ఉంది. కిలోమీటరు గోర్జలో వెళ్ళిన తరువాత పాపికొండలు దూరంగా కనిపించసాగాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాలన్ని ప్రభుత్వం ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. అందుకే ఆ ఊళ్ళో ప్రజలెవ్వరూ లేరు.. నిర్మానుష్యంగా ఉంది వాతావరణం;


ఆ గోర్జ తరువాత గోదావరి గట్టు కనిపించింది.. ఆ గట్టు వెంబడి కొంచెం సేపు నడిచిన తరువాత పాపికొండలు మొదలయ్యాయి.. ప్రణవి ఆ ఎండలో అంత దూరం నడవటం వల్ల అలసిపోసాగింది. ఆమెకు అంతదూరం అందులో మట్టి దారిలో నడవటం అలవాటు లేదు. - శ్రీహర్ష మాత్రం త్వరత్వరగా నడుస్తూ మధ్యలో మధ్యలో వెనక్కి చూస్తూ ప్రణవి దూరంగా కనిపించగానే అక్కడ ఆమె వచ్చే దాకా ఆగి మళ్ళీ ఆమెతో కలిసి నడుస్తున్నాడు.


“ప్రణవి గారూ! ఎండగా ఉందా?” అని అడిగాడు.


" ఆ! బాగా ఉంది. అందుకే చెమటలు బాగా పడుతునాయి” అంది పక్కన ఉన్న చింత చెట్టు కింద కూర్చుంటూ..


అతను కూడా ఆమెకు దూరంగా ఉన్న ఒక రాయి మీద కూర్చొని ఆమెకు మంచినీళ్ళు తాగమని ఇచ్చాడు..

ఎండ వేడికి ఆమె తెల్లటి ముఖం గులాబీ రంగుగా మారి ఆమె మరింత అందంగా కనిపిస్తోంది.. కొంచెం సేపటి తరువాత మరలా బయలుదేరి ఆ పాపి కొండల ప్రాంతం చేరుకున్నారు..


అక్కడి దృశ్యాన్ని చూసి ప్రణవి కొద్దిసేపు ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయింది. ఇరువైపులా హరిత వర్ణపు పెద్ద పెద్ద కొండలు ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తున్నాయి.. ఆ కొండల మధ్య అమాయకంగా వడివడిగా పారే గోదావరి, అక్కడినుంచి ఆ దృశ్యం ఓ వర్ణచిత్రంలా కనిపిస్తోంది ..

పచ్చటి కొండల మీద నీలాకాశం, మధ్య మధ్య తెల్లటి మబ్బులు, మల్లె దండల్లా ఎగురుతున్న తెల్లటి కొంగలు , కొండల మీద నుంచి వీస్తున్న శీతల పవనాలు..


ఆ కొండల మధ్య ఏమి తెలియని నంగనాచిలా ఉ రుకులు పెడుతున్న గోదావరి, చెవులకు విందు కలిగిస్తున్న దాని తరంగాల గల గలలు.. దూరంగా తెర చాపలతో కనిపిస్తున్న పడవలు.. ఆకాశం లో పక్షుల కిల కిలా రావాలు, దూరంగా కొండ మొదలులో చేపలు పడుతున్న జాలారులు.. ఆ దృశ్యం మనోహరంగా ఉంది.


సూర్యుడి వాడి వేడి కిరణాలు గోదావరి తరగల పైపడి మిలమిల మెరుస్తున్నాయి..


ప్రణవి ఆ మనోహర దృశ్యాన్ని కనులార్పకుండా విస్ఫారిత నేత్రాలతో చూస్తోంది . ఆమెను చూసి శ్రీ హర్షకు ఆశ్చర్యం కలిగింది. ఆమె అందాలను చూస్తూ పరిసరాలను గమనించే స్థితిలో లేదు.. ఒక అలౌకికమైనఆనందంతో ఆమె ఆ గోదావరి అందాలను వీక్షిస్తోంది.

“ఏమిటండోయ్ ప్రణవి గారూ! ప్రకృతి అందాలను చూస్తూ మైమరచి పోయారు” అని గట్టిగా అన్నాడు..


ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి నవ్వుతూ "అవునండీ! ఈ గోదావరి అందాన్ని మరీ ముఖ్యంగా ఈ పాపి కొండల మధ్య చూస్తూంటే రెండు కళ్ళు చాలటం లేదు. ఇక్కడ నుంచి కదల బుద్ధి కావటం లేదు” అంది అటు వైపే చూస్తూ..


“ఇక్కడ నుంచి చూస్తేనే ఇలా ఉంటే ఇక ఆ గోదావరిలో పడవలో వెళ్తే ఇంక ఏమైనా వుంటుందా ?” అన్నాడు హర్ష..


“నిజమే.. నా కెందుకో ప్రకృతంటే చాలా ఇష్టం. “ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జోయ్ ఫరెవర్ “అన్న కీట్సు మాటలు నన్ను బాగా ప్రభావితం చేసాయి.. ఏమిటి ఈ పాపి కొండల గొప్పతనం” అంది ప్రణవి..


ఇద్దరూ నడుస్తూ గట్టుని దిగి నదిని చేరుకున్నారు. గోదావరి నీరు చల్లగా కాళ్ళకు తగిలింది.. ఒడ్డున తెల్లటి ఇసుక, రెల్లు పొదలు.. దగ్గరలోనే ఒక పడవ ఆ లోయను దాటుతోంది.. ఏటి గాలికి ఆ తెరచాప బాగా ఊగుతూ పడవను ప్రవాహానికి ఎదురుగా ముందుకు లాక్కెళుతోంది..


“ఇక్కడ ఈ దృశ్యాన్ని చూస్తూంటే మొన్న సముద్రపు ఒడ్డు దగ్గర చెప్పిన “పడిలేచే కడలి తరంగం.. ” అన్న పాట గుర్తుకు వస్తోంది.. “గోదావరి అందాలకు వేరేవి సాటి రావండి. అది మన రాష్ట్రం ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలు చేసుకునే అదృష్టం.. భద్రాది రాముడి పాదాలను తాకుతూ పారే గోదావరి కూనవరం దగ్గర ఈ పాపికొండల్లోకి ప్రవేశిస్తుంది.. పాపికొండలంటే తూర్పు కనుమల్లో భాగం. - గోదావరి ఈ కొండల మధ్య లోయలో ప్రవహిస్తూ ఎన్నో ప్రకృతి అందాలను మనకు ప్రసాదిస్తోంది.. పచ్చటి ఎత్తైన కొండలు, లోయల కన్నా అందమైన ప్రకృతి దృశ్యాలెక్కడ ఉంటాయి చెప్పండి..


రాజమండ్రి దగ్గర మూడు కిలోమీటర్ల మేర విశాలంగా పారే పావన గోదావరి ఈ పాపికొండల్లో కేవలం అర కిలోమీటరు లోయ గుండా ప్రవహించడం వల్ల దీనికి వడి, సడి, సుడి.. అన్నీ ఎక్కువే.. మొన్న పడవ ప్రమాదం ఈ కచ్చలూరు మందం దగ్గరే జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. అమాయకంగా పారుతూ బీడు పొలాలను సశ్య శ్యామలం చేసే గోదావరి అప్పుడప్పుడు ఉగ్రరూపం ధరిస్తుంటుంది.. వర్షాకాలంలో ఎర్ర పట్టుచీర కట్టుకున్న గోదారమ్మ భద్రాద్రి రాముణ్ణి దర్శించడానికి గుడిలోకి వెళ్తుంటుంది..


దాన్నే మనం వరద అంటాము.. ఈ ప్రకృతి అందాలను ఎందరో సినిమా దర్శకులు తమ చిత్రాల్లో బంధించి కనువిందు కలిగించారు. ఆదుర్తి సుబ్బారావు తన మూగ మనసులు చిత్రంలో ఈ గోదావరిని ఒక పాత్ర చేసి అందంగా చూపించారు. ” గోదారి గట్టుంది; గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది?” అన్న పాటలో గోదారి అందాలను అద్భుతంగా ఆవిష్కరించారు.


ముఖ్యంగా బాపు రమణలు, వంశీ వాళ్ళ చిత్రాల్లో గోదావరిని ఎంతో అందంగా చూపించారు.. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు గోదావరిలో పడవ ప్రయాణమే అందాల రాముడు సినిమా.. ” అంటూ వివరంగా పాపికొండల గురించి ప్రణవికి చెప్పాడు శ్రీ హర్ష.


“అద్భుతంగా చెప్పారు.. మీరు చెప్పిన చాలా విషయాలు నిజంగా నాకు తెలియవు.. ఏదైనా ఈ రోజు ఒక గొప్ప అందమైన ప్రాంతాన్ని చూపించినందుకు మీకు “థాంక్స్” అని చెప్పింది ప్రణవి.


ఆ రోజు సముద్రపు ఒడ్డున మీరు చిన్నపిల్లలా మారి సముద్ర కెరటాలతో ఆడుకోవటం చూసి మీకు ప్రకృతంటే బాగా ఇష్టమనీ నాకు తెలిసింది. ఇక్కడి ప్రకృతి, గోదావరి అందాలు మీకు బాగా నచ్చుతాయనే ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాను.. నా నమ్మకం నిజమైంది.. పదండి.. ఆ కొండ ఎక్కితే గోదావరి మరింత అందంగా కనిపిస్తుంది.. ” అన్నాడు శ్రీ హర్ష.


“అమ్మో! కొండ ఎక్కటమే.. నేను ఎక్కలేను బాబు.. ఇక్కడికి నడిచి రావటమే కష్టమైపోయింది” అని చెప్పింది ప్రణవి.

“ఏమి పరవాలేదు. ప్రకృతి మనల్ని నడిపిస్తుంది. దానికా శక్తి ఉంది. అయినా అక్కడ ఒక జలపాతం ఉంది. రండి చూపిస్తాను” అన్నాడు కొండ వైపు నడుస్తూ.. ప్రణవి అతని వెనకే నడిచింది.


రాను రాను కొండ వాలు మొదలైంది. అది నిటారుగా ఉండి ఎక్కటం కష్టం అవుతోంది. కొద్ది దూరం వెళ్ళిన తరువాత అక్కడ ఓ చెట్టు కనిపించింది. అక్కడ కాసేపు కూర్చుంది ప్రణవి.


“కొండ మీద నుంచి నదిని చూడటం నిజంగా ఒక గొప్ప అనుభూతి” అన్నాడు..


“అది నిజమే కానీ ఈ నిటారు కొండను ఎక్కటం చాలా కష్టం.. ” అంది ప్రణవి.


“మరి కష్టం లేకుండా సుఖం ఎలా వస్తుంది.. కష్టాలు అనుభవిస్తున్నప్పుడు బాధగానే ఉన్నా అవి తీరిపోయిన తరువాత హాయిగా ఉంటుంది.. అయినా సుఖం ఎక్కువ కాలం ఆనందం ఇవ్వదు. ఎదురీత కష్టమైనా సరే పొలస చేప ఏటికెదురీదుతుంది. అందుకే అబద్దాలుంటేనే నిజానికి, హింస ఉంటేనే అహింసకి, కోపం ఉంటేనే శాంతానికి, కష్టాలుంటేనే సుఖాల విలువ తెలుస్తాయి.. ఏదైనా మన భావనే.. అందుకే పచ్చటి అందమైన లోయని చూడాలంటే ఎత్తైన కొండను అధిరోహించక తప్పదు” అని చెప్పాడు శ్రీహర్ష.


“మంచి మాటలు చెప్పారు.. వాటిలో జీవిత సత్యాలున్నాయి. —” అంది ప్రణవి. ఇంతలో వాళ్ళకి జలపాతపు హోరు వినిపించింది . ఆమె చెవిని ఆనించి ఆ శబ్దాన్ని వింటూ “ఎక్కడ నుంచి ఈ శబ్దం” అని అడిగింది.


“చెప్పాను కదా పక్కనే జలపాతం ఉందనీ.. ఆ కనిపిస్తున్న ఎత్తైన కొండ మీద నుంచి కిందకు జలధార ఉరుకుతూ గోదావరిలో కలుస్తుంది. పదండి, దగ్గరే” అంటూ అటు వైపు నడిచాడు.


కొద్ది సేపటికి వాళ్ళిద్దరూ ఆ జలపాతం దగ్గరికి చేరుకున్నారు. ఎదురుగుండా ఆకాశాన్ని తాకే కొండ ఆ కొండ మీద నుంచి ఉరుకుతూ తెల్లటి జల ధార.. ఆ నిశ్శబ్దపు లోయలో ఆ జలధార సవ్వడి ప్రతిధ్వనిస్తోంది.. అక్కడికి దూరంలోనే ఉన్న సన్నటి నీటి తుంపరులు వాళ్ళ ముఖం మీద పడుతున్నాయి.. ఒక పక్క సూర్యుడి వేడి కిరణాలు, ఇంకో పక్క ఉరికే జలపాతం.. ఆ కిరణాలు ఆ జలధారపై పడి రంగుల హరివిల్లుగా ఆకృతి సంతరించుకున్న దృశ్యం అద్భుతంగా కనిపిస్తోంది. - దూరంగా ఉరికే జలపాతం గోదావరి పాదాలను ముద్దాడే సన్నివేశం చాలా అందంగా కనిపిస్తోంది..


“చాలా అందంగా ఉంది కదా ఈ జలపాతం” అంది ప్రణవి దాన్ని చూస్తూ..

జలపాతం అంటేనే ఉవ్వెత్తున ఎగసి కిందకు పడిపోవటం.. భర్తృహరి నీతి పద్యాలను అనువదించిన ఏనుగు లక్ష్మణ కవి గంగ యొక్క ఉత్థాన పతనాలను ఈ పద్యంలో బాగా చెప్పాడు.


ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి శీతాద్రి సు

శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబు నందుండి య

స్తోకాంబోధి బయోధి నుండి పవనాంధోలోకముం జేరె గం

గా కూలంకష పెక్కు భంగులు వివేకభ్రష్ట సంపాతముల్


అంటే గంగ ఆకాశం నుండి శివుని శిరస్సు మీదకు, అక్కడ నుంచి భూమ్మీదకు, అక్కడి నుంచి పాతాళానికి దిగజారిపోయినట్లు తెలివైన వారు ఒక్కోసారి తమ తప్పుల వల్ల ఎన్నో విధాలుగా అధఃపాతాళానికి దిగజారిపోతారనీ తాత్పార్యం. ”అని ప్రణవికి వివరంగా చెప్పాడు.


ఆ తరువాత ఒంటి గంట దాకా ఆ ప్రదేశంలో గడిపి మళ్ళీ కిందకి దిగి కారు దగ్గరికి చేరుకొని ఆ తర్వాత ఇంటికి బయలు దేరారు.

=================================================================

ఇంకా వుంది


=================================================================


గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


47 views0 comments

Comments


bottom of page