'Garudasthram Episode 4' New Telugu Web Series
Written By Gannavarapu Narasimha Murthy
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ..
శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.
అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.
ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు.
కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.
ప్రణవి, ల్యాబ్ దగ్గరకు వచ్చి శ్రీహర్షను కలుస్తుంది.
తన బర్త్ డే షాపింగ్ కి అతన్ని తోడు రమ్మని కోరుతుంది.
ముందుగా ఇద్దరూ బీచ్ లో కొంత సమయం గడుపుతారు.
బర్త్ డే సందర్భంగా ఆమె ఇంటి డెకరేషన్ లో సహాయ పడతాడు.
ఇక గరుడాస్త్రం నాలుగవ భాగం చదవండి..
రెండు నెలల తరువాత ఒకరోజు శ్రీహర్ష కాలేజీ నుంచి ఇంటికి రాగానే కరుణాకరం గారు పిలుస్తున్నారని వాచ్ మేన్ చెప్పాడు. వెంటనే పుస్తకాలు గదిలో పడేసి అలాగే అతనికి దగ్గరికి వెళ్ళాడు.
కరుణాకరం గారు తన ఆఫీసు రూమ్ లో కూర్చొని ఏవో ఫైల్స్ చూస్తున్నాడు. శ్రీ హర్షని చూడగానే కూర్చోమని కుర్చీ చూపించి, ఫైలు చదవడంలో నిమగ్నమయ్యాడు. కొద్ది సేపటికి అది పూర్తి కావడంతో ఫైలుని పక్కన పెట్టి “ఏవయ్యా! కాలేజీ కి వెళ్ళావా?” అని అడిగాడు.
“వెళ్ళాను సార్.. ఇప్పుడే వచ్చేను”.
“ఇది ఫైనలియర్ కదా? ప్రాజెక్ట్ వర్క్ ఉంటుందా?” అని అడిగాడు కరుణాకరం.
"ఫైనలియర్లో రెండు సెమిస్టర్స్ ఉంటాయి. ఆఖరి సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్ చెయ్యాలి. కానీ మేము టైము సరిపోలేదని ఇప్పుడే మొదలెట్టాము “. - అని చెప్పాడు హర్ష.
“దసరా సెలవులు ఎప్పట్నుంచి?”
“సార్! ఎల్లుండి నుంచే”
“శలవులకి ఏమిటి నీ ప్రోగ్రాం?”
“ మా ఊరు వెళ్లాలనుకుంటున్నాను. అమ్మ రమ్మనమని చెబుతోంది..... ”
“అది సరే... నిన్నెందుకు రమ్మన్నానో తెలుసా? మా ఫ్రెండ్ కూతురి పెళ్ళి మళ్ళీ వారం కోనసీమలో జరగబోతోంది. నన్ను రమ్మనమని మరీ మరీ చెప్పాడు. కానీ ఆ సమయంలో నాకు ఢిల్లీలో అర్జెంట్ కేసు విషయమై సుప్రీం కోర్టుకి వెళ్ళవలసిన అవసరం పడింది. అందుకు నేను వెళ్ళడం కుదరదు. ప్రణవిని ఆ పెళ్ళికి పంపుతున్నాను; నేను మీ నాన్నకి అమ్మకి చెబుతానే తరువాత వెళుదువుగాని , నువ్వు ప్రణవికి తోడుగా వెళ్ళు, వంటరిగా దాన్ని పంపడం నా కిష్టం లేదు” అని చెప్పాడు.
అతని మాటలకు ఏం చెప్పాలో తెలియక కాసేపు మౌనం దాల్చి "అలాగే సార్” అన్నాడు..
“సరే... వస్తున్న బుధవారం అంటే మూడురోజులుంది... ఈ లోగా నీ పనులు చూసుకొని పెళ్ళికి వెళ్ళి వచ్చేయండి” అని చెప్పాడాయిన.
“అలాగే సార్” అని చెప్పి శ్రీ హర్ష అవుట్ హౌస్ కి వచ్చేసాడు.
అతను వెళతానని చెప్పాడేగానీ శ్రీ హర్షకి ప్రణవితో వెళ్ళటం అంటే భయంగా ఉంది.. అలా పెళ్ళి కాని ఆడపిల్లతో పెళ్ళికి వెళితే అందరూ ఏమనుకుంటారోనని అతని భయం. కానీ ఆ విషయాన్ని కరుణాకరం గారితో చెప్పడానికి మొహహాటం వేసింది. పైగా అలా చెబితే అతను కోపగించుకోవచ్చు.
అతను ఎంతో అవసరం పడి ఢిల్లీకి వెళ్ళుతున్నాడు కాబట్టి తనను ఆమెతో పంపిస్తున్నాడు. సుశీలమ్మ గారు కూడా వస్తారనుకుంటే ఆమెకు కాళ్ళు నొప్పులు వల్ల ఆమె బయటకు ఎక్కడికీ వెళ్ళలేదు.
ఆ రాత్రంతా అతను అన్యమనస్కంగా గడిపాడు... చాలా రాత్రి వరకు నిద్ర పట్టలేదు... తెల్లవారిన తరువాత అతను మనసు రాయిని చేసుకొని వెళ్ళడానికి మానసికంగా సిద్ధపడ్డాడు.
శ్రీహర్ష, ప్రణవి, మూడు రోజుల తరువాత బయలుదేరారు. కారులో రావుల పాలెం వెళ్ళి అక్కడి నుంచి కోనసీమ వెళ్ళారు. వాళ్ళు వెళ్లవలసిన 'లంక', 'గోదావరి' రెండు పాయల మధ్య ఉంటుంది..
1830 ప్రాంతంలో అప్పటి ప్రఖ్యాత బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్దన్ కాటన్ గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఒక ఆనకట్ట కట్టాడు. ఆ ఆనకట్ట కట్టడానికి ఒక పెద్ద కారణం ఉంది. అప్పట్లో గోదావరి ప్రాంతానికి వర్షాలు పడక కరువు ఏర్పడింది. చాలా మంది ప్రజలు ఆకలితో చనిపోయారు. అది చూసి అప్పటి నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఆర్ధర్ కాటన్ చాలా బాధపడ్డాడు. దేశంలో రెండవ పెద్దనది అయిన గోదావరి మూడు కిలోమీటర్లు వెడల్పుగా పారుతున్న ప్రాంతంలో కరువు అనగానే అతడు ఆశ్చర్యపోయి అక్కడ ఒక ఆనకట్ట కట్టవలసిన అవసరాన్ని తెలియపరుస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాసాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో తర్జన భర్జనల తరువాత అక్కడ ఆనకట్టను కాటన్ సూచించిన విధంగా కట్టడానికి అనుమతిచ్చింది.
అప్పుట్లో రవాణా సాధనాలు లేకపోవడం వల్ల కాటన్ దొర ఒక గుర్రం మీద గోదావరి పరివాహక ప్రాంతమంతా పర్యటించి గోదావరి మీద ఆనకట్ట కట్టడం చాలా ఖర్చుతో కూడిన పనే కాక అంత పెద్ద ప్రవాహానికి అడ్డుకట్ట నిర్మించడం కష్టం అని భావించి ఒక బేరేజ్ నిర్మాణానికి పూనుకున్నాడు. అలా అక్కడ ఒక బేరేజ్ నిర్మించి కాలవలను తవ్వి ఆ ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేసి అక్కడ ప్రజల చేత అపర భగీరధుడు అని పిలిపించుకున్నాడు.
ధవళేశ్వరం తరువాత బేరేజీ దిగువ ప్రాంతాన గోదావరి గౌతమి, వైనతేయి, వశిష్ట అనే మూడు పాయలుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో సముద్రంలో కలుస్తుంది. అందులో ప్రధానమైన గౌతమి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ముందు రెండు పాయలుగా, ఆ తరువాత వైనతేయి మరి రెండు పాయలుగా విడిపోతుంది.. మొదట రెండు పాయల మధ్య ప్రాంతాన్నే కోనసీమ అంటారు. అంటే బంగారు పండే పచ్చని పైరు సీమ అని అర్థం... ఆ రెండు పాయల మధ్య ఎన్నో లంకలున్నాయి. ప్రస్తుతం శ్రీహర్ష ప్రణవి వెళ్తున్న ప్రదేశం ఆ మధ్యలో ఉన్న కొబ్బర్లంకకి.. అది రావుల పాలేనికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రావుల పాలెం నుంచి ద్రాక్షారామం వెళ్ళి అక్కడ నుంచి పడవ మీద గోదావరిని దాటి వెళితే ఆ కొబ్బర్లంక వస్తుంది.
వాళ్ళు ద్రాక్షారామం చేరే సరికి ఉదయం ఏడు గంటలైంది.
కారు అక్కడే పార్క్ చేసి హోటల్లో టిఫిన్ చేసి గోదావరి రేవు చేరేసరికి పడవ అక్కడ రెడీగా ఉంది. అప్పుడే దాన్లో జనాలెక్కుతునారు. వాళ్ళని చూసి పడవవాళ్ళు బయటకొచ్చి వాళ్ళ బేగులు తీసికొని వాలు బల్ల ద్వారా పడవ ఎక్కించారు. ప్రణవికి ఆ పడవ ఎక్కటం అదే మొదటిసారి, అందుకే ఆమెకు కొత్తగా ఉంది.. రాను రాను పడవలో జనాలెక్కుతునారు.. కూరగాయల బుట్టలు, మోటారు సైకిళ్ళు కూడా దాంట్లో ఎక్కిస్తున్నారు.. ప్రభాత సమయం కావడంతో వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది.
ప్రణవికి పడవలో ఆ జనాల్ని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. “ఇక్కడ బ్రిడ్జి లేదా?” అని అడిగింది శ్రీహర్షని..
“ప్రణవిగారూ! గోదావరి పాయల మధ్య ఎన్నో లంకలున్నాయి. ప్రతీ లంకకి బ్రిడ్జి కట్టడం చాలా ఖర్చుతో కూడిన పని; అందుకే వీళ్ళకు పడవలే ఆధారం. వీళ్ళ జీవితం అంతా గోదావరి మీదే గడిచిపోతుంది. లంకల్లో ఈ గోదావరి వల్ల బంగారం పండుతుంది. అందుకే వీటిని వదలి రారు.. కోనసీమలో లక్షలమంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయమే కాక కొబ్బరి పంట... దాని వల్ల బోలెడు సంపాదన. కొబ్బరి కాయల అమ్మకాలతో పాటు కొబ్బరి పీచుతో తాళ్ళు... ఇలా ఎన్నో తయారు చేస్తారు”. అని వివరంగా చెప్పాడు.
ప్రణవి ఒక్కసారి గోదావరి నది వైపు చూసింది. గోదావరి రేవు దగ్గర ఒక పెద్ద మర్రిచెట్టు, దాని చుట్టూ చవటా. అక్కడ నుంచి కిందకు దిగటానికి మెట్లు... ఎదురుగుండా అఖండ గోదావరి... కనుచూపు మీరంతా నీరే... దూరంగా ఆకాశం, గోదావరి కలిసే చోట ఎర్రటి సింధూరంలా సూర్యుడు... సూర్యుడి కిరణాలు గోదావరి పై పడి మిలమిల మెరుస్తున్నాయి. దూరంగా పడవలు, వాటిలో తెరచాపలు కనిపిస్తున్నాయి....
నీలాకాశంలో తెల్లటి కొంగలు బారులు బారులుగా ఎగురుతూ మల్లె దండలా కనిపిస్తున్నాయి.. దూరంగా ఆవలి రేవు.... అక్కడ కొన్ని పడవలు.. మొత్తానికి ఆ ప్రదేశం చాలా అందంగా కనిపిస్తోంది.
కొద్దిసేపటికి పడవ బయలుదేరింది. మధ్యలో తెల్లటి పెద్ద తెరచాప. పడవ నడిపేవాళ్ళు పెద్ద పెద్ద గడకర్రల సాయంతో పడవని నదికి అడ్డంగా నడుపుతునారు.. నదిమీద చల్లటి గాలి వీస్తుంటే ప్రణవి ముంగురులు ఎగిరి పడుతునాయి..
“ఎంతసేపు పడుతుందేమిటి అవతలి ఒడ్డుకి వెళ్ళడానికి” అని అడిగింది ప్రణవి.
"ఒక అరగంటకి పైగా పడుతుంది. అయినా వాళ్ళు లైవ్ జాకెట్లు వాడటం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే బతకడం కష్టం. ఇక్కడ కనీసం ముప్పై అడుగుల లోతు ఉంటుంది. చూసారా ఆ పెద్ద గడకర్ర మునిగిపోతోంది” అన్నాడు హర్ష.
“నిజమే.. మొన్ననే గోదావర్లో పాపికొండల దగ్గర పెద్ద ప్రమాదం జరిగింది. అయినా వీళ్ళు జాగ్రత్త లేవీ తీసుకోవటం లేదు... చూసారా... ఇక్కడ గోదావరి చాలా వేగంగా ప్రవహిస్తోంది” అంది ఆ ప్రవాహ వేగాన్ని చూపిస్తూ....
“అన్నింటికీ ఆ దేవుడిదే భారం” అన్నాడు హర్ష నవ్వుతూ..
“జనాలు మాత్రం ఎవరి గోల వారిదన్నట్లున్నారు. కొందరు సెల్‌ఫోన్లులో మాట్లాడుకుంటున్నారు. కొందరేమో ఏవో రాజకీయం గురించి మాట్లాడుకుంటునారు... రాను రాను పడవ అవతలి ఒడ్డుకి దగ్గరగా చేరింది.. మరికొద్ది నిముషాలకే పడవ రేవుని చేరడం, పడవ వాళ్ళు పడవకి లంగరు వేసి వాలు బల్ల వెయ్యడం జరిగింది. జనాలు ఒక్కొక్కరు దిగసాగారు. ప్రణవి శ్రీ హర్ష మెల్లగా ఒడ్డుకి చేరారు. ప్రణవి దిగుతున్నప్పుడు భయపడితే శ్రీ హర్ష ఆమెకి చేయందించి దిగడానికి సాయం చేసాడు. రేవు దగ్గరకు పెళ్ళివారి తాలుకు రైతు వచ్చి వాళ్ళిద్దర్నీ పెళ్ళింటికి తీసికెళ్ళాడు.
పెళ్ళిల్లు చాలా సందడిగా ఉంది. ముందు కొబ్బరి ఆకులతో పెద్ద పందిరి.. చుట్టూ ఆకు పచ్చటి మామిడి తోరణాలు... పెళ్ళిపందిరిలోకి అడుగు పెట్టగానే ఒక విధమైన పరిమళం ముక్కుపుటాలకు సోకూతూ ఒక పవిత్రతను ఆపాదిస్తోంది.. శ్రీహర్షకు ఆ పరిమళం చిన్నప్పుడు తమ ఊళ్ళోన్ని పెళ్లిళ్లు గుర్తుకు తెచ్చాయి. అప్పుడు కూడా ఆ పందిళ్ళలో ఇలాంటి పరిమళమే ఉండేది.. మళ్ళీ చాలా రోజులకు ఇటువంటి పరిమళం...
పెళ్ళికూతురు తండ్రి ప్రణవిని, శ్రీహర్షను సాదరంగా ఆహ్వానించాడు. రాత్రి 9 గంటలకు భోజనాలు మొదలయ్యాయి. శ్రీహర్ష ప్రణవి కోసం చూసాడు కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు... ఎవరో వచ్చి అతన్ని భోజనానికి పిలవడంతో వెళ్ళి తినేసి వచ్చి మళ్ళీ అక్కడే కూర్చున్నాడు.
రాత్రి 12 గంటలకు పెళ్ళి ముహుర్తం; పదిగంటలకు పెళ్ళి కార్యక్రమాలు మొదలయ్యాయి. కొద్దిసేపటికి పెళ్ళికూతుర్ని బాగా అలంకరించి తీసుకొచ్చారు.. ఆమె పేరు ప్రియంవద అని ప్రణవి చెప్పింది హర్ష కి - అప్పటికే అక్కడ పెళ్ళి కొడుకు పెళ్ళిపీటల మీద కూర్చొని ఉన్నాడు. వంగపండు రంగు పట్టుచీర, మల్లెపూలదండ, మెడలో పలక సర్ల గొలుసు, కాసుల పేరు, తెల్లటి పొళ్ళ నక్లెస్.... నుదుటన కళ్యాణ తిలకం, జలపాతంలా ఆ బొట్టు మీదకు జారుతున్న పాపిడి చేరు, బుగ్గన దిష్ట చుక్కతో ప్రియంవద పెళ్లి కూతురు ముస్తాబు లో అందంగా వుంది. పెళ్ళికూతురు పక్కనే కూర్చొని ఉన్న ప్రణవి ఆకుపచ్చటి పట్టుచీరలో ఆ పందిరిలో మెరిసిపోసాగింది.. ప్రణవి ముఖం తిప్పుకోలేని సౌందర్యంతో ఆ పందిట్లో కూర్చున్న వారి దృష్టిని ఆకర్షిస్తోంది..
తెల్లటి ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, నుదుట సిందూర తిలకం, మెడలో సన్నటి గొలుసు, చేతికి దండ గడియంతో అప్సరసను గుర్తుకు తెస్తోంది.. ముఖ్యంగా ఆమె అందానికి ఆకర్షణ ఎర్రటి ముక్కుపుడక. పెదవులపై చిరు దరహాసం... పక్కనున్న ఇద్దరు స్త్రీలు పెళ్ళికూతురు పక్కన కూర్చున్న ఆ పిల్లెవరో చాలా అందంగా మెరిసిపోతోందనీ ప్రణవి గురించి మాట్లాడు కోవటం శ్రీ హర్ష చెవిన పడింది... అప్పుడు అతను కూడా మరోసారి ప్రణవిని చూసాడు.
నిజమే? ఆ పందిరిలో ఆమె అద్భుత సౌందర్యంతో మెరిసిపపోతోంది. మధ్య మధ్యలో పెళ్ళికూతురుతో నవ్వుతూ ఏవో మాట్లాడుతుండటం, అప్పుడు ఆమె బుగ్గల మీద వెలుగు కిరణాలు పడి ఆవదనానికి మరింత తేజోమయం చేస్తుండటం అతని గుండెల్లో అలజడి రేపింది.. ఎంత ప్రయత్నిస్తున్నా ఆమె మీద నుంచి దృష్టిని మరల్చడం శ్రీహర్షకు సాధ్యం కావటం లేదు..
=================================================================
ఇంకా వుంది
=================================================================
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments