top of page

గరుడాస్త్రం - ఎపిసోడ్ 3


'Garudasthram Episode 3' New Telugu Web Series




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..


శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.

అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.


ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు.


కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.

ప్రణవి, ల్యాబ్ దగ్గరకు వచ్చి శ్రీహర్షను కలుస్తుంది.

తన బర్త్ డే షాపింగ్ కి అతన్ని తోడు రమ్మని కోరుతుంది.


ఇక గరుడాస్త్రం మూడవ భాగం చదవండి..


సాయంత్రం 4 గంటలకి ప్రాజెక్ట్ పని పూర్తి చేసి కాలేజీ మెయిన్ గేటు దగ్గరికి వచ్చాడు శ్రీహర్ష.. అప్పటికే చాలా మంది విద్యార్థునీ విద్యార్థులు ఇళ్ళకు వెళ్ళిపోతూ కనిపించారు. కొందరైతే హాస్టల్ వైపు వెళుతున్నారు.

ఇంతలో అతని కెదురుగా కారు ఆగి తలుపు తెరుచుకుంది. డ్రైవింగ్ సీట్లో ప్రణవి..


ఆమె శ్రీహర్షని చూస్తూ “ఎక్కండి” అంది. శ్రీహర్ష వెనక తలుపు తెరుచుకొని ఎక్కుతుంటే “ఏమండోయ్.. నేనేమైనా డ్రైవర్ని అనుకుంటున్నారా? ముందు కూర్చోండి” అంది నవ్వుతూ.


శ్రీ హర్షకు తాను చేసిన తప్పేమిటో తెలిసి ముందుకొచ్చి కూర్చోగానే కారు కదిలింది. కాలేజీ రోడ్డంతా రద్దీగా ఉంది.. కారు గేటు దాటి రోడ్డు మార్గం పట్టింది.


“ ఈ రోజు డ్రైవర్ రాలేదా?! అని అడిగాడు హర్ష.


“వచ్చేడు. ఈ రోజు మార్కెటింగ్ కదా ఆలస్యమౌతుందనీ నేనే పంపించేసా” అంది ప్రణవి.. ఆమె దృష్టి రోడ్డు మీదే ఉండటం గమనించాడు హర్ష. కొద్ది సేపటికి రోడ్డు మార్కెట్ వైపు కాకుండా ఇంకో రోడ్డులో వెళ్ళటాన్ని గమనించాడు హర్ష.


“మనం వెళుతోంది షాపింగ్ కి కదా.. ఇటెక్కడికి తీసికెళుతునారు?” అని అడిగాడామెను..

“చాలా రోజులైంది బీచ్ కెళ్ళి..కాసేపు బీచ్ కెళ్ళి కూర్చొని వెళదాం”.


“అప్పుడాలస్యం అవుతుంది కదా.. నాన్నగారు గాభరా పడతారేమో? అందులో డ్రైవర్ కూడా లేడు” అన్నాడు హర్ష.

"డ్రైవర్ లేకపోతే ఏం? మీరు లేరా? ” అంది హర్షని క్రీగంట చూస్తూ.


“మీరెప్పుడూ సూటిగా మాట్లాడరు.. మీ మాటల్లో వ్యంగ్యం, హాస్యం తొణికిసలాడుతుంటుంది” అన్నాడు హర్ష నవ్వుతూ.


తాను కూడా నవ్వుతూ “ఏం మీకు హాస్యం ఇష్ట ఉండదా?” అంది.


“హాస్యమంటే ఇష్టం లేని వారెవరుంటారు చెప్పండి.. అయినా హాస్యంగా ఆహ్లాదకరంగా స్పాంటేనియస్ గా మాట్లాడటం అందరికీ సాధ్యపడదు. అదొక కళ.. అలా మాట్లాడే వారు ఎప్పుడూ వత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉంటారని మా లెక్చరర్ గారు చెప్పేవారు..” అన్నాడు హర్ష.


“అబ్బో! నన్ను మీ పొగడ్తలతో మునగ చెట్టెక్కిస్తున్నారే.. ఈ వయసులో కొంచెం వ్యంగ్యంగా మాట్లాడటం సహజం.. మా క్లాస్ మేట్స్ చాలా మంది నాలాగే మాట్లాడతారు. వాళ్ళ వల్లే నాకిలా మాట్లాడటం అలవాటైంది.. అయినా ఏదైనా మితిమీరకుండా ఉంటే మంచిది.. ఏమంటారు?”


“ఏమంటాను.. మీరు చెప్పింది నిజం అంటాను.. అయిన గలగల స్వచ్చంగా సెలయేరులా మాట్లాడటం ఒక వరం.. అది అందరికీ సాధ్యం కాదు.. అందుకే మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అసూయ కలుగుతుంటుంది”.


“దేని కండోయ్ అసూయ.. మీరు నన్ను బాగా గమనిస్తున్నట్లున్నారు.”


“అదేం లేదండీ.. మీ మాటల వల్ల అర్థం అయింది.. అయినా మీరు ఐశ్వర్యవంతులు. మీకు సమస్యలేముంటాయి. సమస్యలు లేని వాళ్ళకు వత్తిడి ఉండదు. అప్పుడే మీలా మాట్లాడటం సాధ్యపడుతుంది “ అన్నాడు శ్రీ హర్ష.


“అబ్బ! మీరు చూడటానికి సామాన్యుల్లా కనిపిస్తారు కానీ మీలో చాలా గొప్ప తత్వవేత్త దాగి ఉన్నాడు.. మీ మాటలు చాలా లోతుగా ఉంటాయి.. సైకాలజీని బాగా అధ్యయనం చేసినట్లున్నారు.. అయినా మీరు చదువుతున్నది ఇంజనీరింగా? లేక సైకాలజీనా?” అంది మళ్ళీ నవ్వుతూ..


“సంఘర్షణ లోంచే తత్వం బోధపడుతుంది.. చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తే సమస్యలు తెలుస్తాయి. మనుషుల ప్రవర్తన బోధపడుతుంది. ఈ పాటి దానికి సైకాలజీ చదవాలా చెప్పండి?” అన్నాడు హర్ష.


“అయినా మీకు మాత్రం సమస్యలేమున్నాయి చెప్పండి? మంచి చదువు చదువుకుంటునారు. ఈతి బాధలేవీ పెద్దగా లేవు.”


“మనకి సమస్యలు లేకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళ సమస్యలు మనల్ని బాధపడుతుంటాయి, ఆలోచింప చేస్తుంటాయి.. అవి నిరంతరం మన మెదళ్ళని జ్వలింప చేస్తుంటాయి. అందుకే 'సర్వేజనా సుఖినోభవంతు” అన్నారు. అందరూ బాగుంటేనే మనం కూడా బాగుండగలం.. అయినా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉండటం అన్నది వ్యక్తిగతం.. అందరికీ సాధ్యం కాదు. వాళ్ళ వాళ్ళ మనోబలం మీద ఆధారపడుతుంది” అన్నాడు.


ఇంతలో కారు బీచ్ రోడ్డు కి చేరుకుంది.. దూరంగా సముద్రం కనిపిస్తోంది. అలలు ఎగిసిపడుతూ ముందుకీ వెనక్కి వెళ్ళే దృశ్యం ఆహ్లాదకరంగా ఉంది.


కారు కొద్ది దూరం వెళ్ళి అక్కడ ఆగింది.. అక్కడ సముద్రతీరం నిర్మానుష్యంగా ఉంది. “కారుని ఇంత దూరం తీసుకు వచ్చేరేంటి హాయిగా బీచ్ దగ్గరైతే జనాలతో బాగుంటుంది కదా” అన్నాడు శ్రీహర్ష.


“అవుననుకోండి.. కానీ ఆ జనాలను చూస్తే నాకు గాబరా కలుగుతుంది. సముద్రాన్ని వంటరిగా నిర్మానుష్య ప్రదేశంలో చూడాలన్నది నా కోరిక.. వంటరిగా చూస్తే సముద్రం మనతో ఎన్నో కబుర్లు చెబుతుంది” అంది ప్రణవి.


కారుని దూరంగా ఉన్న తాటి చెట్ల పక్కన ఆపి ఇద్దరూ నడుచుకుంటూ తీరం దగ్గరికి వచ్చారు..


అప్పటికి సంధ్యా సమయం కాబోతోంది. సూర్యుడు పడమర కొండల్లోకి వెళ్ళటానికి ఆయత్తమవుతున్న దృశ్యం అద్భుతంగా కనిపిస్తోంది. ఎర్రటి సంజె కిరణాలు సముద్ర తరంగాల పై పడి పరావర్తనం చెందుతునాయి. దూరంగా సముద్రంపై ఎర్రటి రవిబింబం సముద్రపు నుదుటున సిందూరంలా కనిపిస్తోంది..


తీరమంతా హోరు గాలి.. ఇద్దరూ కెరటాలు వచ్చే ప్రాంతానికి కొద్ది దూరంలో కూర్చున్నారు.. హోరు గాలికి ప్రణవి ముంగురులు ఎగిసి పడుతుంటే ఆమె వాటిని వెనక్కి సర్దుకుంటోంది..


“మీరు సముద్రాన్ని చూడటానికి వస్తుంటారా” అని అడిగింది ప్రణవి.


“చాలా తక్కువ సార్లు అదీ స్నేహితులతో వచ్చాను.. ఇలా నిర్మానుష్యమైన ప్రాంతానికి రాలేదు. కానీ ఈ రోజెందుకో సముద్రం చాలా అందంగా కనిపిస్తోంది.. ఆ జన సమూహాల మధ్య సముద్రాన్ని మనం ఆస్వాదించలేమని ఇప్పుడే తెలిసింది. నిజమే.. మౌనంగా సముద్రాన్ని చూడటం ఒక గొప్ప అనుభూతి” అన్నాడు హర్ష..


ప్రణవి అతని మాటలు వింటూ సముద్రాన్ని చూస్తోంది. దూరంగా అలల సవ్వడి.. తరంగాల హోరు .. కనుచూపు మేరలో చిన్న చిన్న పడవలు కనిపిస్తున్నాయి. “సముద్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది”అని అడిగింది ప్రణవి చేతుల్లో ఇసుకను ఒంపుకుంటూ..


ఆ సంధ్యా సమయంలో సముద్ర తీరంలో ప్రణవి చాలా అందంగా కనిపిస్తోంది. ఆకు పచ్చటి డ్రెస్ ఆమెకు ఒక కొత్త అందాన్ని తెచ్చి పెట్టింది.. – సంజె కిరణాల వెలుగు ఆమె ముఖం మీద పడి ఆమె ముఖ సౌందర్యాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది.. నుదుటి తిలకం ఒక చిన్న రవిబింబంలా కనిపిస్తోంది.. తెల్లటి మేను సంజె వెలుగుకి గులాబీ వర్ణంగా రూపుదిద్దుకుంటోంది. మొత్తం మీద ఆమె అందాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు..


ఆమె ముఖాన్ని తదేకంగా చూడలేక ఇబ్బంది పడుతున్నాడు శ్రీ హర్ష.. ఆసమయంలో ప్రణవి ఒక సంధ్యా సుందరిలా కనిపించసాగింది.. హోరు గాలికి ఆమె తలలోని మల్లెదండ సౌరభం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది..


అతను ఆమెని అలా ముఖం తిప్పుకోకుండా చూస్తూ ఉంటే ఆమె ఆశ్చర్యపోతూ “ఏమండోయ్! మిమ్మల్నే.. నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు” అంది..


“సముద్రం ఒక ప్రవల్లిక లాంటిది.. అంటే పజిల్..దాన్ని అర్థం చేసుకోవడం ఎవ్వరి తరం కాదు. అయినా సముద్రం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు.. నిరంతరం ఎగిసిపడుతూ తీరాన్ని తాకి వెనక్కి వెళ్ళిపోయే అలుపు లేని దాని తరంగాల వెనక నిరాశ చెందకుండా గమ్యం వైపు సాగాలన్న సందేశం ఉంటుంది.. విశాలమైన అనంత సముద్రం మనిషి గంభీరంగా లోతుగా ఉండాలన్న స్పూర్తిని కలిగిస్తుంది . తీరాన్ని ముద్దాడి మళ్ళీ వెనక్కిపోయే కెరటాలు ఎప్పుడూ హద్దు దాటరాదన్న జీవన సత్యాన్ని మనకి చెప్పకనే చెబుతుంటాయి.. ఇలా మనిషి సముద్రం నుంచి ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవచ్చు” అన్నాడు శ్రీ హర్ష.

“బాగా చెప్పారు.. సముద్రాన్ని బాగా స్టడీ చేసారనిపిస్తోంది.. మీరు కూడా పైకి కనిపించరు కానీ సముద్రంలా చాలా గంభీరమైన వారు..” అంది..


“ఏమో! నా గురించి నాకు పెద్దగా తెలియదండి.. కానీ సముద్రం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చనీ నా భావన.. సీతారామశాస్త్రి వ్రాసినట్లు

"అలుపన్నది ఉందా?

ఎగిసే అలకు

ఎదలోని లయకు”..


“ఎంత గొప్ప సాహిత్యం.. ఎంత గొప్ప భావన. ముఖ్యంగా సాయం సంజె వేళ.. అంటే గోధూళి వేళ ఈ అనంత సాగరాన్ని చూస్తుంటే నాకు బ్రతుకు తెరువు సినిమాలోని సముద్రాల సాహిత్యం గుర్తుకు వస్తుంది.


“అందమే ఆనందం !ఆనందమే జీవిత మకరందం

“పడమటి సంధ్య రాగం !కుడి ఎడమల కుసుమ పరాగం

ఒడిలో చెలి జీవన రాగం !జీవితమే ఒక నాటక రంగం “

ఎంత గొప్ప పాట ఇది.. దీనిలో జీవిత సత్యం పూర్తిగా దాగి ఉంది.” అని అన్నాడు శ్రీ హర్ష.


“మీరు చెప్పిన ఈ పాటను నాన్నగారు వింటుంటే నేను చాలా సార్లు విన్నాను. కానీ దీనిలో ఇంత గొప్ప అర్థం ఉందనీ మీరిప్పుడు పాడుతుంటే తెలిసింది. నిజంగా ఇది గొప్ప సాహిత్యమే.. అయినా మీతో మాట్లాడుతుంటే ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తుంటాయి.. మీరు సాహిత్యాన్ని ఎంతో గొప్పగా చదివి అర్థం చేసుకున్నారనిపిస్తుంది” అంది విస్ఫారిత నేత్రాలను తిప్పుతూ ప్రణవి.


“ఎథింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జోయ్ ఫరెదర్” అన్నాడు జాన్ కీట్స్. దాన్ని స్పూర్తిగా తీసుకొని ఈ పాట వ్రాయబడిందని నాకనిపిస్తుంది.. అయినా “ఉవ్వెత్తున ఎగిసిపడే తరంగాలు ఉధృతంగా తీరాన్ని తాకినా వాటి అంతర్ముఖ ప్రయాణం సముద్ర గర్భం వైపే” అనీ నేనెక్కడో చదివాను. అలాగే మనిషి కూడా.. తను ఎన్ని గొప్ప పనులు చేసినా చివరికి అతని జీవితం తన స్వంత మనుషుల తోటే ముడిపడి ఉంటుందని ఈ వాక్యం మనకి చెబుతుంది”.


“ఏంటండోయ్! “ఒడిలో చెలి మోహనరాగం !జీవితమే మధురాను రాగం” అనీ పాడారు.. మీకెవరైనా చెలి ఉన్నారా? “అంది ప్రణవి నవ్వుతూ..


ఆమె గలగల మని నవ్వుతుంటే గుప్పెడు మల్లెలు గుండెల్లో జారిన భావన కలిగింది హర్షకు..


“అదేం లేదండోయ్! నా మొహానికి చెలి ఒక్కటే తక్కువ. ఈ చదువెలా పూర్తవుతుందనీ నేను ఆలోచిస్తుంటే మీరేంటి చెలి అంటారు.. నాకెవ్వరూ లేరు..” -నేను ఇప్పటి దాకా మీతో తప్ప ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు.. పాటలో అలా ఉంది.. అందుకే పాడాను, అయినా నాలాంటి వాళ్ళకి ప్రేమేంటి చెప్పండి “అన్నాడు హర్ష ఆమె వైపు చూస్తూ.


“ఏం ఉండకూడదా? మీ లాంటి కుర్ర వాళ్ళందరూ అమ్మాయిల వెంట పడుతుంటారు కదా.. మీకెవ్వరూ స్నేహితురాళ్ళు లేరా? మీ స్నేహితులందరూ మీ లాగేనా?” అంది ప్రణవి.


“నాకెవ్వరూ లేరు.. వాళ్ళుకుంటే ఉండొచ్చు.. నాకా విషయాలు పెద్దగా తెలియవు..” అన్నాడు హర్ష.


ఇంతలో దూరంగా సముద్రం మీద ఎర్రటి చంద్ర బింబం కనిపించింది.. ఆ రోజు పౌర్ణిమ.. అందుకే కడలి కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ మీదకు వస్తున్నాయి.. అవి ఎదురుగా ఉన్న పెద్ద బండరాయిని తాకుతూ గాల్లోకి ఎగిసిపడుతున్న దృశ్యం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది..

సూర్యుడు పడమర కొండల్లోకి జాలి పోతున్నాడు.. పడమర సిందూర వర్ణంలోకి మారిపోతోంది.. సముద్రం కూడా రాను రాను కెంజాయి వర్ణంలోకి పరావర్తనం చెందుతునాది..

ప్రణవి ఆ అద్భుత దృశ్యాన్ని తిలకిస్తూ సముద్ర కెరటాల దగ్గరికి వెళ్ళింది. అవి చాలా ఉధృతంగా ఎగురుతూ ఆమె పాదాల పారాణిని ముద్దాడి వెనక్కి వెళ్ళిపోతుంటే ఆమె ఆనందంతో చూస్తోంది.


వెంటనే శ్రీ హర్ష కూడా లేచి నిలబడి "ప్రణవి గారూ! లోపలికి వెళ్ళకండి, అసలే ఈ రోజు పౌర్ణిమ.. తరంగాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది” అంటూ గట్టిగా చెప్పాడు.


అతని మాటలు ఆ తరంగాల ఘోషలో కలిసిపోయి ఆమెకు వినిపించలేదు. ఆమె శ్రీ హర్షని అక్కడికి రమ్మనమని పిలిచింది. శ్రీ హర్ష ఆమె దగ్గరికి వెళ్ళాడు.


ఈ సారి కెరటాలు మరింత ఉధృతంగా ఎగిసి వాళ్ళ కాళ్ళను చుట్టు ముట్టాయి. దాంతో ఇద్దరి బట్టలు పూర్తిగా తడిసి పోయాయి. అదేమి పట్టని ప్రణవి చిన్న పిల్లలా ఆ కెరటాలతో ఆడుకోసాగింది. ఆ లేత వెన్నెల వెలుగులో ఆమె ముఖాన్ని చూస్తూ అందాన్ని ఆస్వాదించసాగేడు శ్రీ హర్ష.


కెరటాల జోరుకు ఆమె తన పైజమా ని కొద్దిగా ఎత్తి పట్టుకుంది. ఆ వెన్నెల వెలుగులో ఆమె అందమైన పాదాలు, వాటి మీద వెన్నెలకి మెరుస్తున్న పట్టీలు.. ఆ దృశ్యం చాలా శోభాయమానంగా కనిపించసాగింది శ్రీ హర్షకు..


తెల్లటి నురుగుతో ఎగిసిపడి వస్తున్న కెరటాలు ఆమె తెల్లటి పాదాలను ముద్దాడి వెనక్కి వెళ్ళిపోతున్న అపురూప దృశ్యాన్ని అతను కన్నులార్పకుండా చూస్తున్నాడు..


"పదండి ప్రణవీ! చీకటి పడి పోతోంది.. ఈ రోజు పౌర్ణమి.. చూడండి చంద్రుడు ఎంత అందంగా మీ లాగే మెరిసి పోతున్నాడు. వెన్నెల్లో సముద్రాన్ని అందులో అందమైన అమ్మాయితో కలసి చూడడం ఒక గొప్పనుభూతని నేనేక్కడో చదివాను..” అన్నాడు శ్రీ హర్ష.


తన అందాన్ని అతను వెన్నెలతో పోల్చడం ఆమెకు ఆనందం కలిగించింది.. పదహారేళ్ళ పరువంలో ఉన్న అమ్మాయికి తన అందాన్ని ఒక సమవయస్కుడైన అబ్బాయి పొగడటం అన్నది ఒక గొప్ప మరువలేని తీయని అనుభూతి.. ఆ సమయంలో ఆమెకు ఆ అనుభూతే కలిగింది.


"ప్రణవీ! మీరెప్పుడైనా దేవర కొండ బాల గంగాధర తిలక్ "అమృతం కురిసిన రాత్రి” చదివారా? చాలా గొప్ప భావుకత కలిగిన గేయ సంపుటి. అందులో తిలక్ అందమైన అమ్మాయిలను వెన్నెల్లో ఆడపిల్లలనీ వర్ణిస్తాడు.. ఇప్పుడు మీరు కూడా ఈ సముద్రతీరంలో వెన్నెల ముంగిట నిలబడ్డ వెన్నెల్లో ఆడపిల్లే” అన్నాడు శ్రీ హర్ష. ఆ మాటలకు ఆమె పులకించి పోయింది.


ఆ తరువాత ఇద్దరూ కారు దగ్గరికి కొచ్చారు. అక్కడ నుంచి సముద్రం వెన్నెల కిరణాలకు మెరిసిపోతూ కనిపించసాగింది. అక్కడ కొద్దిసేపు నిలబడి ప్రణవి ఆ దృశ్యాన్ని మనస్పూర్తిగా ఆస్వాదించింది.. కొద్ది సేపటికి వాళ్ళు కార్లో బయలుదేరారు.


"హర్ష గారూ! ఈ రోజు సముద్రాన్ని ఆస్వాదించినట్లుగా నేనెప్పుడూ ఆస్వాదించలేదు. దానికి కారణం మీరే.. మీకు అందుకు థాంక్స్ చెప్పాలి. మీరు చెప్పిన గొప్ప విశ్లేషణలు సముద్రం అందాన్నే కాక దాని లోతుని కూడా చూపించాయి. ఇవాళ నాకు ఒక గొప్ప సముద్రం ఆవిష్కారమైంది . ఇది నా జీవితంలో ఒక మధురానుభూతిని కలిగించే అందమైన సాయంత్రం” అంది ప్రణవి.

శ్రీహర్ష ఆమె మాటలకు మౌనం దాల్చాడు. ఆ తరువాత వాళ్ళిదరూ షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు.


ఆ రోజు ప్రణవి పుట్టిన రోజు. కరుణాకరం గారు శ్రీ హర్షకి ఫోన్ చేసి ఉదయాన్నే టిఫిన్ కి రమ్మన్నారు. ఆ రోజు ఆదివారం కావడంతో అతను ఆలస్యంగా లేచాడు. మార్నింగ్ వాక్ కి వెళ్ళి అప్పుడే వచ్చాడు. ఆ ఫోన్ రాగానే త్వర త్వరగా తెమిలి కరుణాకరం గారింటికి వెళ్ళాడు. అప్పటికే అతను డైనింగ్ టేబుల్ దగ్గర అతని కోసం నిరీక్షిస్తున్నారు.. హర్షని చూడగానే "రావయ్యా! ఈ రోజు మా ప్రణవి పుట్టినరోజు. నీ టిఫిన్, భోజనం ఇక్కడే” అన్నాడు.


ఇంతలో ప్రణవి కూడా వచ్చి వాళ్ళ నాన్నగారి పక్కనే కూర్చొంది.


కొద్దిసేపటికి సుశీలమ్మ గారొచ్చి వాళ్ళకి ఇడ్లీలు, దోశలు, స్వీట్లు వడ్డించారు. కరుణాకరం ఎదురుగా కూర్చోవడంతో శ్రీ హర్ష మొహమాట పడుతూ తిన్నాడు.. సుశీలమ్మ గారు అతనికి కొసరికొసరి వడ్డించింది.


ఆ తరువాత కరుణాకరం గారు శ్రీ హర్షతో మధ్యాహ్నం వచ్చి డెకరేషను పనులు చూడమనీ చెప్పారు.


అనుకున్నట్లుగానే మధ్యాహ్నం భోజనం తరువాత శ్రీహర్ష హాల్లో డెకరేషన్ పనులు మొదలు పెట్టాడు. అతనితో పాటు ప్రణవి కూడా వాటిలో పాలు పంచుకుంది. రకరకాల రంగు కాగితాలతో హాలంతా డెకరేషన్, మధ్యలో రంగు రంగుల బెలూనులు, కుర్చీలు, బెంచీలు, కేకు కోసం టేబుల్ అలా అన్ని వాచ్ మేన్ సహాయంతో సర్దాడు.


ఇంతలో అక్కడికి కరుణాకరం గారొచ్చి "ఎక్సలెంట్ . డెకరేషన్ బాగుందయ్యా? ఏదైనా ఇంజనీర్ ననిపించావు” అనీ పొగిడాడు.


వెంటనే ప్రణవి “డాడీ! దీని ప్లానింగ్ అంతా నాది. అతనికే మొత్తం క్రెడిట్ ఇచ్చేస్తారేమిటి ?” అంది నవ్వుతూ..


“అవునుసార్! ప్రణవి గారు ఎలా చెబితే అలా చేసాను. నాదేమీ లేదు.” అన్నాడు శ్రీ హర్ష..


“సరే.. నువ్వు 6 గంటలకి వచ్చెయ్ అన్నాడు కరుణాకరం.


“సార్! మీ అమ్మాయి పుట్టినరోజంటె ఆమె స్నేహితురాళ్ళంతా వస్తారు. మధ్యలో నేనెందుకు లెండి.. వాళ్ళని సరదగా గడపనీయండి” అని చెప్పి వచ్చాసాడు.


సాయంత్రం అతను బయటకి వెళ్ళి ఎనిమిది గంటలప్పుడు అవుట్ హౌస్ కి వచ్చేసరికి అక్కడ ప్రణవి అతని కోసం ఎదురు చూస్తోంది.


“మేడం! ఎంటిలా వచ్చారు. కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా” అన్నాడు గాబరాపడుతూ; ఆమె ఆ సమయంలో అక్కడికి వంటరిగా రావడం కరుణాకర్ గారు చూస్తే బాగుండదనిపించిందతనికి.

"పుట్టినరోజునాది.. మీరేమో ఫంక్షన్ కి రాలేదు. అందుకే మీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చాను” అంటూ అతనికి, డ్రెస్, స్వీట్స్ ఇచ్చింది. వాటిని చూసి శ్రీ హర్ష ఆశ్చర్యపోయాడు.


“ఇప్పుడివన్ని ఎందుకు మేడం! “అన్నాడు మొహమాటంగా..


“మా ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చాను. ప్రతీ సంవత్సరం పుట్టినరోజుకి ఇలా ఇవ్వడం నా అలవాటు. వాళ్ళతో పాటే మీరూనూ.. మీకేమి ప్రత్యేకంగా ఇవ్వటం లేదు తీసుకోండి” అంది అధికార స్వరంతో..


అతను తప్పక వాటిని తీసుకుంటూ “విషింగ్ యూ హేపీ బర్త్ డే.. ఉదయం నాన్నగారున్నరనీ చెప్పలేదు.. ఏమనుకోకండి.. ఇప్పుడు చెబుతునాను”.పుట్టిన రోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే అనీ ఓ పాట ఉంది. కానీ మీరు పుట్టింది ఎందుకో మీకు బాగా తెలుసు, చాలా కొద్దిమందికే ఆ విషయం తెలుస్తుంది.. మీ జీవితం ఉజ్వలంగా సాగాలని కోరుకుంటున్నాను” అన్నాడు శ్రీ హర్ష.


ఆమె కాసేపు మౌనం దాల్చి కళ్ళతోటే అతనికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వెళ్ళి పోయింది..!

=================================================================

ఇంకా వుంది


=================================================================


గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.



44 views0 comments
bottom of page