top of page

మృగాళ్లు


' Mrugallu' written by Gannavarapu Narasimha Murthy

రచన : గన్నవరపు నరసింహమూర్తి


అడ్డరోడ్డు దగ్గర బస్సు ఆగింది...

“శ్రీనాథపురం అడ్డరోడ్డు” అని కండక్టర్ గట్టిగా అరిచాడు.

తలుపు తెరచుకోగానే మాధురి బస్సు దిగింది. అప్పటికి సమయం…

ఐదుగంటలైంది.


రోజూ ఆమె ఊరి నుంచి అడ్డరోడ్డు కొచ్చి బస్సులో కాలేజీ కెళుతుంది. మళ్ళీ కాలేజీ పూర్తి అయిన తరువాత సాయంత్రం బస్సెక్కి అడ్డరోడ్డు దిగి ఇంటికి వస్తుంది. అక్కడికి ఊరు మూడు కిలోమీటర్లుంటుంది. బస్సులో నుంచి ఆమె ఒక్కర్తే దిగింది...బస్సు వెంటనే వెళ్ళిపోయింది...

సంధ్యా సమయం... గోధూళివేళ... ఆమె ఆలోచిస్తూ నడుస్తోంది. ఇంకో ఆరు నెలల్లో తన డిగ్రీ పూర్తవుతుంది. ఎలాగైనా పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం సంపాదించాలి... ఆమె తండ్రి ప్రసాదరావు ఓ సన్నకారు రైతు. అతను చాలా ఇబ్బందులు పడుతూ చదివిస్తున్నాడు.


ఇంతలో దూరం నుంచి ఓ మోటార్‌ సైకిల్‌ వస్తున్నట్లు శబ్దం వినిపించసాగింది.

వారంరోజుల నుంచి రోజూ ఇదే మోటార్‌సైకిల్‌ ఆమెని వెంబడిస్తోంది...రోజూ ఒక యువకుడు ఆ మోటార్‌ సైకిల్‌ మీద వస్తూ ఆమెని అనుసరించడం ఆమె గమనించింది.


అతను అదే ఊరి ప్రెసిడెంట్‌ స్వామినాయుడు కొడుకు రాజేష్‌... ఇంటర్‌ తప్పిన తరువాత ఇలా అమ్మాయిలను ఏడిపిస్తూ ఒక రౌడి లాగా తయారయ్యాడు.ఇప్పుడు తన వెంట పడుతున్నాడు.

ఈ విషయం తండ్రితో చెబితే ఊళ్ళో గొడవలు మొదలై తండ్రికి లేనిపోని సమస్యలొస్తాయని ఆమె భయపడుతోంది. స్వామినాయుడు చాలా చెడ్డవాడు... కొడుకు చేసే ప్రతి చెడ్డపనినీ సమర్థిస్తుంటాడు...అతన్ని ఎదిరించిన వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాడు.


ఇంతలో మోటార్‌ సైకిల్‌ దగ్గరకు వచ్చి, ఆమె పక్కన ఆగింది...

“నా బండి మీద దించెయ్యనా?” అని అడిగాడు రాజేష్‌ నవ్వుతూ.


“నేను రాను... నీ పని నువ్వు చూసుకో... రోజూ ఇలా నా వెంటబడటం మంచి పనికాదు... ఇలా అయితే ఊళ్ళో అందరితో చెప్పవలసి వస్తుంది” అంది.


రాజేష్ ఒక్కసారి “గట్టిగా నవ్వుతూ” ఊళ్ళో వాళ్ళకి చెబుతావా? చెప్పు... అప్పుడు మనిద్దరి గురించి అందరికీ తెలుస్తుంది. ఊళ్ళో వాళ్ళకి బోలెడంత సందడి... అయినా నాకు నచ్చిన వాళ్ళని నేనంత సులభంగా వదలిపెట్టను... మాకా బోలెడు ఆస్తి ఉంది. ఈ ఊరికి కాబోయే సర్పంచ్‌ని. ఏభై ఎకరాల పొలం ఉంది. ఒక్కడే కొడుకుని.


మీ నాన్నకి పైసా ఖర్చు లేకుండా నీ పెళ్లి అయిపోతుంది.కాబట్టి నా మాట విని నాతో రా” అన్నాడు...

“రాజేష్! నువ్వు చేస్తోంది మంచిపని కాదు. నీ పని నువ్వు చూసుకో... నావెంట పడటం మానేయ్‌.” అంది కళ్ళను తుడుచుకుంటూ...

వాడి తీరు ఆమెకు భయం కలిగిస్తోంది... ఏడుపు వస్తోంది...దుఃఖాన్ని ఆపుకోలేక పోతోంది.

“నిన్ను వదిలే ప్రసక్తి లేదు. నేను ఒకసారి మనసు పడ్డానంటే ఇంక వదిలే ప్రసక్తి ఉండదు. నా మాట విని నాతో రా... నీ జీవితం బాగుంటుంది. లేకపోతే నీకే నష్టం... నా నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను” అన్నాడు మోటారు సైకిల్‌ స్టార్ట్‌ చేస్తూ...

మాధురి మస్తిష్కం మొద్దుబారిపోయింది. ఏం జరుగుతోంది... ఇలా ఎన్నాళ్ళు వీడితో వేగటం...ఆమె తీవ్రంగా ఆలోచిస్తోంది...

పోనీ ఇంట్లో చెప్పేస్తే... ఊళ్ళో వారికి చెప్పి పంచాయితీ పెడితే...?!

ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు.

ఊరివాళ్ళకి చెబితే తనకే నష్టం... సర్పంచ్‌ వాడి తండ్రి కాబట్టి చాలామంది వాడి మాటే వింటారు...తన వల్ల తండ్రికి బాగా చెడ్డ పేరు వస్తుంది. ఆలోచిస్తూ యిల్లు చేరుకుంది... ఆ రాత్రి అంతా ఆమె మౌనంగా ఉండటం చూసి ఆమె తల్లి సీత “ఏం అలాగున్నావ్‌? ఒంట్లో బాగులేదా?” అని అడిగింది.

“ఏం లేదు! బాగానే ఉన్నాను” అని చెప్పింది.

రాత్రి పన్నెండైనా ఆమెకి నిద్ర పట్టలేదు... తెల్లవారే దాకా ఆమె విపరీతంగా ఆలోచించసాగింది...

తెల్లవారుతుండగా ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది.ఏమి చెయ్యాలో ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది. కానీ వికటిస్తే ప్రమాదం.కానీ తప్పదు...

విజయం సాధించాలంటే ధైర్యంతో ముందుకెళ్ళక తప్పదు...

గమ్యం చేరడం కష్టం అని ఆలోచిస్తే ఎప్పుడూ దాన్ని చేరుకోలేము...

తప్పుదు... యుద్ధం చెయ్యక తప్పదు.చీడపురుగుని నిర్మూలించాలంటే మందు వెయ్యక తప్పదు...

ఆ రోజు ఆమె ఆలస్యంగా నిద్రలేచింది...ఈ రోజు ఏదో చెయ్యాలి...

ఆమె అన్యమనస్కంగా కాలేజీకి బయలుదేరింది...కానీ ఆమె కాలేజీకే వెళ్ళలేదు.

తిన్నగా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళి ఎస్సైని కలిసి జరిగింది చెప్పింది...

అక్కడ ఇన్‌స్పెక్టర్‌ మోహనరావు... తాగుబోతు. లంచాలు తినడంలో అందెవేసిన చెయ్యి. రాజకీయ నాయకులతో చేతులు కలిపి వాళ్ళకి సహాయం చేస్తుంటాడు...

ఓ గంట తరువాత మాధురి రాజేష్‌ మీద కంప్లెంట్‌ వ్రాసి స్టేషన్లో రైటర్‌ కిచ్చింది...

రెండు రోజుల తరువాత ఆమె బస్సు దిగి ఇంటికి వస్తుంటే మళ్ళీ మోటార్‌ సైకిల్‌ మీద రాజేష్‌ ఆమెని వెంబడించడం మొదలు పెట్టాడు...

వాడిని చూసి మాధురి ఆశ్చర్యపోయింది. ఆ రోజు ఫిర్యాదు తీసుకుంటూ ఎస్సె మోహన్‌రావు

“మీరు వెళ్ళండి... వాడిని పిలిచి వార్నింగ్‌ ఇస్తాను... అవసరం అయితే అరెస్ట్‌ చేస్తాను! వాడు

మిమ్మల్నేమీ చెయ్యడు” అని ధైర్యం చెప్పడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది.

కానీ తద్విరుద్ధంగా ఈ రోజు మళ్ళీ రాజేష్‌ వెంట పడటం చూస్తే ఆమెకి ఏం జరిగిందో అర్థం కాలేదు...అంటే పోలీసులు రాజేష్‌ని పిలిచి మాట్లాడలేదా? అలా చేస్తే వీడు మళ్ళీ ఎందుకు వెంటబడుతున్నాడు..

ఆమె మౌనంగా ఉండటం చూసి రాజేష్‌

“ఏం నా మాటలు పెడచెవిన పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేస్తావా? వాళ్ళు నన్నేం చెయ్యలేరు. ఆ ఇన్‌స్పెక్టర్‌ నా స్నేహితుడు. నాకన్నీ చెప్పాడు. ఇప్పుడు నిన్ను రక్షించే వాడెవడో చూస్తాను. రేపట్నుంచీ నీకు నరకం చూపిస్తాను... నా విశ్వరూపం చూడటానికి రెడీగా ఉండు” అని వార్నింగిచ్చి వెళ్ళిపోయాడు.

వాడు వెళ్ళిపోయిన తరువాత మాధురి వణికి పోసాగింది.అంటే ఇన్‌స్పెక్టర్‌ తనని మోసం చేసాడన్న మాట...

పోలీసులకి ఫిర్యాదు చేసి తను తప్పు చేసిందా?... ఇప్పుడేం చెయ్యాలో ఆమెకి అర్థం కావట్లేదు.

ఆ రాత్రి మళ్ళీ ఆమెకి నిద్ర పట్టలేదు. ఈసారి ఏం చెయ్యాలో ఆమె ఓ నిర్ణయానికి రాలేకపోతోంది.

కానీ ఏదో చెయ్యాలి... కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి... విజయం సాధించాలంటే కొండని ఢీకొనక తప్పదు. అన్యాయాన్ని ఎదురించక తప్పుదు...

“ఎవరో ఒకరు ఎప్పుడో అపుడు వెయ్యరా ముందుకి అటో ఇటో ఎటోవైపు” ఆ పాట ఎందుకో ఆమెకు పదే పదే గుర్తుకు రాసాగింది.

ఆమెలో ఆవేశం రగులుకుంటోంది. ఈ అవినీతి వ్యవస్థను ఎదుర్కోక తప్పదు.

వారం రోజుల తరువాత పేపర్లో ఒకవార్త వచ్చింది. అది రాష్ట్రాన్ని కుదిపి వేసింది.

“నిందితుడికి వత్తాసు పలుకుతున్న జిల్లా పోలీసులు... ఆరు నెలల నుంచి యువతిని అల్లరి పెడుతున్న యువకుడిని వెనకేసుకొస్తున్న పోలీసులు... ఆ యువకుడు పాలకపార్టీకి చెందినవాడు కావడంతో కేసుని రిజిస్టర్‌ చెయ్యని తాలూకా పోలీసులు... ఎస్పీ కూడా దీనికి వంతపాట” అన్నహెడ్డింగ్ కింద మాధురికి జరిగిన అన్యాయాన్ని విపులంగా వ్రాసింది ఆ పత్రిక... దీంతో పాటు మరి రెండు పత్రికలు... ఇంగ్లీషు *ది హిందూ కూడా "ప్రధానమంత్రి కార్యాలయానికి మాధురి అనే యువతి ఫిర్యాదు.కదలిన ప్రధానమంత్రి కార్యాలయం... ఎస్పీని వివరణ కోరిన డీజీపి... ఆఘమేఘాల మీద డీజీపి జిల్లాకి పయనం...” అని వ్రాసింది...

టీవి ఛానెళ్ళలో కూడా మాధురిని వేధిస్తున్న యువకుడు రాజేష్‌ అని కథనాల ప్రసారం మొదలైంది.

పి ఎమ్ ఆఫీసు రాష్ట్ర డీజీపీ ని వివరణ కోరింది.

ఎస్పీ వంతపాడుతున్నట్లు రాయటంతో డీజీపి రంగప్రవేశం చెయ్యడంతో ముఖ్యమంత్రి కూడా కలగజేసుకొని రాజేష్‌ని తక్షణం అరెస్ట్‌ చెయ్యమని ఆదేశాలివ్వటంతో పోలీసు యంత్రాంగం మొత్తం కదిలింది.

ఆ సాయంత్రం ఎస్పీ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి రాజేష్‌ని అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించాడు.

రాజేష్‌ని విలేఖర్లకి చూపించారు కూడా...

తానెవ్వరికీ వత్తాసు పలకలేదనీ, ప్రధాన మంత్రి కార్యాలయాన్నుంచి తమకు లేఖ వచ్చిందనీ, ఆ యువతి ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసిందనీ, ఈ రోజు నుంచీ రాజేష్‌ మీద రౌడీషీట్‌ ఓపెన్‌ చేసి అతన్ని జిల్లా నుంచి బహిష్కరిస్తున్నట్లు చెప్పాడు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ యువతికి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఉద్యోగం, పదిలక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించి, తమ ప్రభుత్వం అవినీతిని, రౌడీయిజాన్ని ప్రోత్సహించదనీ చెప్పి, ఎస్సై మోహన్‌రావుని సస్పెండ్‌ చేసి, ఎస్పీని బదిలీ చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఇది జరిగి సంవత్సరమైంది. రాజేష్‌ బెయిల్‌ మీద బయటకొచ్చాడు... కానీ జిల్లాకి రాకుండా నిషేధం ఉండటంతో ఎక్కడ ఉన్నాడో తెలియదు.

ప్రజలు ఈ వార్తని మరిచి పోతున్న సమయంలో ఒకరోజు ఆఫీసు ముగింపు వేళ ఒక యువతి వచ్చి మాధురిని కలిసింది.

"మేడం! నా పేరు దివ్య... మాది హైదరాబాద్‌. నేను మొన్నటిదాకా బొంబాయిలో చదివాను. నాకు ఈ మధ్యన ఓ పెళ్ళి సంబంధం వచ్చింది... ఆ పెళ్ళి కొడుకుది మీ ఊరే... పేరు రాజేష్‌... అతని వివరాలు మాకు పెద్దగా తెలియదు... కానీ నా స్నేహితురాలు మొన్న కలిసి “వాడి గురించిన ఎన్నో విషయాలు చెప్పింది. వాడు మిమ్మల్ని ఎన్నో బాధలు పెట్టినట్లు, మీరు ప్రధానమంత్రి కార్యాలయానికి ఉత్తరం వ్రాయడంతో వాడిని అరెస్ట్‌ చేసి రౌడిషీట్‌ ఓపెన్‌ చేసినట్లు చెప్పింది... ఆ విషయాలను మిమ్మల్ని కలిసి తెలుసుకుందామని వచ్చాను” అని చెప్పింది.

మాధురి ఆమె చెప్పినవన్నీ ప్రశాంతంగా విన్నది.

"మేడం! పెళ్ళి జీవితంలో చాలా ముఖ్యమైన కార్యం... జీవన గమనాన్ని మార్పెసే ఓ పెద్ద సంఘటన. అటువంటి పెళ్ళి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సంబంధం వచ్చినా ఆ యువకుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి... ఆదరా బాదరాగా నిర్ణయం తీసుకొని పెళ్ళికి ఒప్పుకోకూడదు...దానివల్ల జీవితాంతం బాధపడాలి. ఈ విషయంలో మీ స్నేహితురాలు మీకు చాలా సహాయం చేసిందనే చెప్పాలి...” అంది మాధురి.

“అంటే మేడం.. మీరేం చెప్పదల్చారు?”

“రాజేష్‌ ఒక రౌడీ వెధవ... వాడు ఆరు నెలలపాటు జైలనే అడవిలో ఉండి మొన్ననే జనారణ్యంలోకి వచ్చిన మృగాడు. నెట్లో వెదికితే వాడి గురించి అంతా తెలుస్తుంది. వాడి మీద రౌడీ షీట్‌ తెరవబడింది.ఈ జిల్లాకు అతను రాలేడు. నిషేధం ఉంది... వాడు ఈ కేసులో జైలుకెళ్ళక తప్పుదు... మీరు ఈ పెళ్ళికి అంగీకరించవద్దు... పెళ్ళి చేసుకుంటే మీ జీవితం నరకం అవుతుంది” అని చెప్పి లేచింది మాధురి...

దివ్య ఆమెకి నమస్కారం పెడుతూ 'మీలాంటి స్త్రీలు” అరుదుగా ఉంటారు. మీ పోరాటం అనితర సాధ్యం... వాడిని పెళ్లి చేసుకునే ప్రస్తకే లేదు” అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది.

***సమాప్తం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండిరచయిత పరిచయం:

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


143 views1 comment

1 Comment


Mh Rao
Mh Rao
Feb 11, 2021

నలుగురి నోళ్ళలో నానుతానేమో అన్న భయం తో , నోరెత్తకుండా బాధలు భరించినా ,మరో విధం గా అయినా ఆ నలుగురు విమర్శిస్తారు . బాధిత మహిళలు అందరూ, పోరాడాలని సందేశం ఇచ్చిన మంచి కథ.అభినందనలు.

Like
bottom of page