సంకల్పం

Sankalpam Written By Gannavarapu Narasimha Murthy
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
ఆరోజు ఆదివారం... ప్రత్యూషపు వేళ లేచి బయట కొచ్చాను.
బయట చాలా విశాలమైన ప్రదేశం... చుట్టూ పొడవైనచెట్లు.... మధ్యలో మా బంగ్గా... చింత,పాసి,వేప, నేరేడు, జామి.... ఇలా ఎన్నో పెద్ద పెద్ద నీడ నిచ్చే చెట్లు...
దాంట్లో ఆ చెట్ల నీడలో ఒక ఉయ్యాల... కాసేపు కూర్చోని ప్రకృతిని గమనించసాగేను. ఆ తోటలో రకరకాల పక్షులు ఆకాశంలోకి ఎగురుతూ కనిపించాయి. నీలాకాశంలో ఎగురుతున్న కొంగల బారు తెల్లటి పూలదండలా కనిపిస్తోంది.
ఇంతలో నా భార్య మాధురి టీ పట్టుకొని అక్కడకు వచ్చింది.
అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన సబ్ కలెక్టర్ బంగ్లా... వంద సంవత్సరాల పురాతనమైనది.
సువిశాలమైన ఐదెకరాల స్థలంలో కట్టబడింది...
నేను రెండేళ్ళక్రితం డిగ్రీ పూర్తైన తరువాత సివిల్ సర్వీసెస్ పరీక్షలు వ్రాసి ఐయ్యేయస్‌కి
ఎంపికయ్యాను. ముస్పోరిలో టైనింగ్ పూర్తి చేసుకున్న తరువాత నన్ను ఆంధ్రాకేడర్‌కి ఈ రెవెన్యూ డివిజన్‌కి సబ్- కలెక్టర్‌గా పోస్టింగిచ్చారు.
నేను పనిచేస్తున్న రెవెన్యూ డివిజన్ ఒరిస్సా బోర్డర్‌కి దగ్గరగా ఉంటుంది.
మాధురి, నేను ఓ అరగంటసేపు ఆ తోటలోనే కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే ఆ ప్రభాత
సమయంలో చాలా ప్రశాంతంగా అనిపించింది.
కొంచెం సేపటి తరువాత మాధురి పనుందంటూ బంగ్లాలోకి వెళ్ళిపోయింది...
నేను ఉయ్యాల ఊగుతూ ఆరోజు దినపత్రిక తిరగవేస్తుంటే జిల్లా ఎడిషన్‌లోని ఒక వార్త
నన్ను ఆకర్షించింది.
పదిళ్ళున్న గిరిజన గ్రామానికి 5 కోట్లు ఖర్చుపెట్టి వేసిన రోడ్డు అవినీతి వల్ల పూర్తికాని
వైనం.. ఉన్నతాధికారుల మౌనం...” అన్న శీర్షిక కింద వివరాలు ఇలావ్రాసి ఉన్నాయి.
“ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన' పధకం కింద జిల్లాకి మంజూరైన పది రహదారుల్లో
ఒకటైన గన్నేరు నుంచి ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనగ్రామం జన్నిగూడకి వేసిన 15 కిలోమీటర్ల రహదారికి ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు చేసింది. ఈ రహదారిని గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ విభాగం నిర్మించింది. కానీ ఆశ్చర్యంగా ఈ రహదారి 12 కిలోమీటర్ల దూరం వరకే పూర్తైంది. మిగతాది ఎందుకు నిర్మించలేదని ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నిస్తే నిధులు సరిపోక ఆపి వేయవలసి వచ్చిందని చెప్పారు.
ఈ విలేఖరి మొన్న ఆ రహదారిమీద ప్రయాణించినపుడు అది జన్నిగూడకు మూడు కిలోమీటర్ల దూరంలో అసంపూర్తిగా వదిలి వేయడంతో ఆ రహదారి నిర్మించిన ప్రయోజనం లేకుండా పోయింది. నిజానికి ఆ మూడు కిలోమీటర్లు రహదారి ఆ తండా చేరుకోవడానికి ఎంతోముఖ్యం..
“ లేకపోతే ఆ రహదారి నిర్మించిన ప్రయోజనం ఆ గ్రామానికి కలగదు. ప్రభుత్వం ఈ విషయంలో సరియైన చర్యలు తీసుకోవాలి” అని ఆ ఊరి గిరిజనులు కోరుతునారు. ఇంతకీ పదిళ్ళున్న ఆ తండాకి రహదారి కోసం 5 కోట్లు ఖర్చుపెట్టడం ఏ విధంగా సబబో అధికారులు సమాధానం చెప్పాలి” అని అందులో వ్రాసి ఉంది. పక్కనే ఆ రహదారి ఫోటో కూడా వేసారు..
ప్రస్తుతానికి ఐటీడియ్యే పీవో బదిలీ కావడంతో నాకే ఆ బాధ్యత కూడా అప్పచెప్పారు. నాకెందుకో ఆ రహదారి విషయంలో ఏదో తప్పు జరిగినట్లపించింది.
నేను ఆఫీసుకి వెళ్ళేముందు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్‌ని ఆ అఫీసులో నన్ను కలవమని
చెప్పాను.
పదకొండు గంటల ప్రాంతంలో ప్రసాద్ వచ్చి నన్ను కలిసాడు. నేను ఆ వార్త వ్రాసిన పేపరుని అతనికి చూపించి వివరాలు అడిగాను.
అతను పూర్తిగా ఆ వార్తని చదివిన తరువాత చెప్పడం మొదలుపెట్టాడు.
“ సార్! ఆ రోడ్డు కోసం 8 కోట్లు ఫండ్ కావలసి ఉండగా 5 కోట్లే మంజూరు చెయ్యడంతో 3
కిలోమీటర్ల రహదారి మిగిలిపోయింది” అన్నాడు ప్రసాద్.
“ మిన్టర్ ప్రసాద్! ఫండే చాలకపోతే ఆ రహదారిని నిర్మించకూడదు కానీ సగం వేసి వదిలి వేస్తే అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగ పడుతుంది చెప్పండి? ఇందుకే మనమీద ప్రజలకు
నమ్మకం పోతోంది. ఈ విషయంలో మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు చెప్పండి? మనం ఏది చేసినా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.... మనం తీనుకొనే జీతాల దగ్గర్నుంచీ ప్రతి పనిమీద ఖర్చుపెడుతున్న డబ్బు వరకు అంతా ప్రజలసొమ్మే.” అన్నాను చాలా కోపంగా....
నా కోపొన్ని చూసి ప్రసాద్ మౌనం దాల్చాడు. “ ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన పధకంలో
రహదారి నిర్మించేటపుడు సరియైన సమగ్రమైన సర్వేచేయాలి. ఈ పేపరు వార్త ప్రకారం ఆ రహదారిని పదిళ్ళున్న గ్రామం కోసం నిర్మించ బడింది అని వ్రాసి ఉంది. 5 కోట్లుతో దీన్ని నిర్మిస్తున్నపుడు కనీసం చుట్టుపక్కల ఓ పది గ్రామాలకు ఉపయోగపడేటట్ట్లుండాలి. అపుడే దాని సార్ధకత... సర్లెండి...రేపు నేను ఆ రహదారిని చూద్దామనుకుంటున్నాను. మీ సిబ్బందితో మీరు రండి” అని చెప్పడంతో అతను వెళ్ళిపోయాడు.
ఆ మర్నాడు ఎనిమిది గంటలకు రెండు జీపుల్లో ఆ ఉరికి బయలుదేరాము. ఈఈ ప్రసాద్‌తో
పాటు, తహసీల్దారు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్స్, అసిస్టెంట్ ఇంజనీర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు... అంతా
వచ్చారు...
కొంచెం సేపటి తరువాత మా జీపులు రెండూ ఏజెన్సీ ప్రాంతం చేరుకున్నాయి.
మేము వేసిన రోడ్డు మీద చాలా సేపు జీపు ప్రయాణించింది. కొత్తగా వేసిన రోడ్డు నిర్మాణం
సరిగ్గా లేదని ఆ అరగంట ప్రయాణంలో నాకర్థమైంది..
“ ప్రసాద్! ఈరోడ్డు నిర్మాణ సమయంలో మీరెప్పుడైనా ఇనస్పెక్షన్ చేసారా? నాణ్యత పరీక్షలు
జరిపారా? ఎందుకంటే ప్రధానమంత్రి సడక్ యోజన పధకానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో మార్గదర్శకాలను ఇచ్చింది” అని అడిగాను జీపు దిగిన వెంటనే.
“ రెండుసార్లు వచ్చాను సార్... నాణ్యత నిర్థారణ పరీక్షలు కూడా చేయించాము.”
“ ఇప్పుడు దీని నాణ్యత మనకి తెలీదు... వర్షాకాలం తరువాత తెలుస్తుంది”.
ప్రసాద్ జీపు దిగి “సార్! ఇక్కడనుంచి ఓ మూడు కిలోమీటర్లు నడవాలి” అన్నాడు.
“ అంటే ఈరోజు పేపర్లో ఆ జర్నలిస్టు వ్రాసింది నిజమేనన్నమాట. చూసారా మనకంటే వాళ్ళే
పరిశీలిస్తున్నారు. పూర్వంలా కాదు ప్రసాద్ గారూ... అవినీతి చేస్తే వెంటనే తెలిసిపోతోంది... ఇది డిజిటల్ యుగం... మనం చాలా జాగ్రత్తగా ఉండాలి... అయినా ఊరిదాకా రోడ్డు వెయ్యకపోతే 5 కోట్లు ఖర్చుపెట్టి ఉపయోగం ఏమిటి చెప్పండి? ఏ పని చేసినా ప్రజలకు ఉపయోగపడితేనే దాని సార్ధకత....మీరు చాలా తప్పుపని చేసారు” అని అతనితో గట్టిగా చెప్పాను.
అతను మౌనంగా నడవసాగేడు...
ఒక అరగంట తరువాత మేము జన్నిగూడ అనే గిరిజన తండాకి చేరుకున్నాము.
తహసీల్దారు, రెవెన్యూ ఇనస్స్పెక్టర్స్ వీళ్ళంతా ముందుగా వెళ్ళి ఊళ్ళో వాళ్ళకు చెప్పడంతో
మమ్మల్ని చూసి బయటకు రావడం మొదలుపెట్టారు.
నేను ఒక్కసారి ఆ పరిసరాలను గమనించాను.
జన్నిగూడ తండా కొండవాలులో ఉంది. అక్కడక్కడ విసిరేనట్లు ఇళ్ళు.. ఒక నాలుగైదు ఇళ్ళు
పూరిళ్ళు మిగతావి పెంకుటిళ్ళు, ఒక చింతచెట్టుకింద మంచం వేసాడు ఆ ఊరి సర్పంచ్ అని చెప్పుకున్న సహదేవ్... అతనికి ఓ యాబై ఏళ్ళుంటాయి. కళ్ళు ఎర్రగా ఉండి మనిషి తూలిపోతున్నాడు..బాగా తాగి ఉన్నాడని అర్ధమైంది...
తహసీల్దార్ పేరు శ్రీధర్...
“ శ్రీధర్! ఈ ప్రాంతం మీరెప్పుడైనా వచ్చారా?” అని అడిగాను..
అతను కాసేపు మౌనంగా ఉండి 'సార్! నేనిక్కడ మండలానికి తహసీల్హార్‌గా వచ్చి ఎనిమిది
నెలలే అయ్యింది. అందుకే రాలేకపోయాను” అన్నాడు..
“ఎనిమిది నెలలంటే తక్కువ సమయంకాదు.. ఒక తహసీల్దార్‌గా మీమండలంలో ఉన్న మొత్తం నలభై ఏబై ఊళ్ళకికూడా మీరు వెళ్ళకపోతే ఎలాచెప్పండి? మనం జీతాలెందుకు తీసుకుంటున్నాము? మనమే రాకపోతే ఎలా?” అని అడిగాను...
దూరంగా ఓపదిమంది పిల్లలు తాటి టెంకలతో ఆడుతూకనిపించారు...
“ ఇక్కడ ఎన్ని యిళ్ళున్నాయి” అని తహసీల్దారుని అడిగా.
"మనలెక్కల ప్రకారం ఇరవై యిళ్ళుండాలి...” అని అతను చెబుతుంటే దూరంనుంచి ఒక యువకుడు వస్తూ కనిపించాడు...
అతని వెనకాల పదిమంది పిల్లలు, కొందరు పెద్దవాళ్ళు, వస్తున్నారు...
ఆ యువకుడు వస్తూనే నాకు నమస్కారం పెడుతూ " నాపేరు పోలన్న దొర... ఇక్కడ
ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయుణ్లి " అని పరిచయం చేసుకున్నాడు.
“ ఇక్కడ స్కూలుకి భవనం కట్టారా?” ఎంతమంది పిల్లలు యిక్కడ చదువుతున్నారు?” అని
అతన్ని అడిగాను.
“సార్... ఇక్కడ ఉన్నవే పదిహేను ఇళ్ళు. ఒకప్పుడు పాతిక దాకా ఉండేవి. ఐదేళ్ల క్రితం డెంగ్యూ
జ్వరాలొచ్చి ఓ పదిమంది దాకా చనిపోతే ఓ పదిళ్ళవాళ్ళు ఇక్కడకు దూరంగా వెళ్ళిపోయి అక్కడ కట్టుకున్నారు... ప్రస్తుతం రెండూళ్ళ వాళ్ళు కలిసి ఓ పాతికమంది దాకా వస్తుంటారు. రిజిస్టర్లో ఏబై దాకా పేర్లున్నా చాలామంది పెద్దవాళ్ళు అయిపోవడంతో వాళ్ళెవరూ రారు.. ” అని చెప్పాడతను..
“ మీదే ఊరు?”
నేను గూడ గిరిజనుడినే... ఇక్కడికి పాతిక కిలోమీటర్ల దూరంలో మా తండా ఉంది” అని చెప్పాడు అతను..
“ ఈ రోడ్డు వేస్తే మీకుపయోగమేనా?” అని సర్పంచ్‌ని అడిగాను.. అతను మత్తులో ఉండటం
వల్ల ఏమీ చెప్పలేకపోయాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు నాకు దండం పెడుతూవచ్చారు. వాళ్ళిద్దరూ సన్నగా, బక్కగా ఉన్నారు. చెవులకు కాడలతో, చిన్న జుట్టుతో మెడలో పూసల దండలు... వాళ్ళను చూస్తే అమాయకమైన గిరిజనులని ఇట్టే పోల్చుకోవచ్చు.
“శ్రీధర్ ! వీళ్ళంతా ఎవ్వరు?”
“సార్! మన జిల్లాలో అంతా చెంచు లెక్కువ.. కొద్దిగా మిగతా గిరిజన జాతులున్నారు... వీళ్ళు
అమాయకులు.. వీళ్ళు పొడు వ్యవసాయం చేసుకొని బతుకుతుంటారు” మన ఆడంగులు ప్రకారం ఈ గ్రామంలో రెండు వందల ఎకరాల వ్యవసాయభూమి ఉంది. రాగులు, జొన్నలు, కొద్దిగా వరి పండిస్తుంటారు.. వర్షాధారం” అని రికార్డుచూసి చెప్పాడు.
ఆ ఇద్దరి రైతుల్లో ఒకర్ని పిలిచి “నీపేరు” అని అడిగాను..
“ బిడ్డిక దొర...
నీకెంతపొలం ఉంది...?
“ బాబూ! నాకు ఐదెకరాల పొలం ఉంది.”
“ నీటి సదుపాయం ఉందా?”
“దొరా! ఆ ఇసయం సెప్పడానికే వొచ్చాము. రోడ్డు పడితే మాఊరికి మంచిదే, కానీ అంతకన్నా
మా సెరువులు తవ్వితే బోలేడు నీళ్ళు నిలవుంతాయి. అపుడు మా పంటలకు డోకా ఉండదు. అలాగే మా కొండ గెడ్డకు సెక్‌డాములు కడితే సెరువులు నిండుతాయి. ముందు కడుపులు నిండితే అపుడు రోడ్లు” అన్నాడు బిడ్డిక దొర...
అతని మాటలు నాకు చెంప చెళ్ళుమనిపించేటట్ట్లు తగిలాయి...
ఇంతలో రెండోవ్యక్తి ముందుకు వచ్చి నాపేరు రామన్నదొర.. మా ఊరోళ్ళమంతా రోడ్డెయ్యక
ముందు పీవో గార్ని కలిసి సెరువు, సెక్ డామ్‌లు కట్టమని సెప్పాము. రోడ్డు సేంచనైంది. తరువాత సెరువులు పని సూద్దామని సెప్పినారు” అని వాడు చెప్పాడు.
ఆ తరువాత ఆ ఊరి స్కూలు , దూరంగా కట్టుకున్న కొత్త ఊరుని చూసి తిరుగు
ప్రయాణమయ్యాము...
వెళ్తున్నపుడు అగమ్య గోచర స్థితిలో ఉన్న నాకు వస్తున్నపుడు గమ్యం కనిపించింది.
“ ఇది నేను ఐ ఏ ఎస్ పూర్తి చేసుకొని కొత్తగా సబ్- కలెక్టర్‌గా చేరినపుడు ఎదురైన చాలా
పెద్ద సమస్య... మొదట్లో ఏ విధమైన అభివృద్దికి నోచుకోని రెవెన్యూ డివిజన్లో పోస్టింగ్ వచ్చినందుకు నాతో సహా మాకుటుంబ సభ్యులు విచారించారు. కానీ ఈ సంఘటన నా దృక్పధాన్ని మార్చి వేసింది. పేద గిరిజనులకు సహాయం చేసే అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ధృడసంకల్పం నాలో మొదలైంది. నేను ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాను.
ఆతరువాత నేనొక అద్భుతమైన బృందాన్ని తయారుచేసాను. దానికి ఆరునెలలు పట్టింది.
అంతవరకు స్తబ్ధుగా ఉండే శ్రీధర్ లాంటి తహసీల్దార్లు ప్రసాద్ లాంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుతోనే పనిచేయించి అద్భుతాలు సృష్టించాను..
మొదటగా జన్నిగూడలో పెద్ద చెరువు తవ్వించాను. కొండ గెడ్డకి రెండు చోట్ల చెక్ డామ్‌లు
కట్టి ఆ నీటిని చెరువుకి మళ్ళించాము.
సంవత్సరం తరువాత ఆ ఊర్లో రెండేసి పంటలు పండించటం మొదలుపెట్టారు. అక్కడి
గిరిజనులు.. ఆ తరువాత అదే పద్దతిలో అన్ని గిరిజన గ్రామాలకు, మామూలు గ్రామాలకు చెరువులు తవ్వించాము. విరివిగా వాటర్ షెడ్డు ...అంటే చెక్ డాములు నిర్మించాము. రహదారులు, స్కూలు భవనాలు మంచి నీటి బోరింగులు, పైవులద్వారా మంచినీటి సరఫరా, ప్రతీ ఇరవై గ్రామాలకు ఒక హస్పిటల్, ప్రతీ వారం నర్సులు గ్రామాన్ని సందర్శించే ఏర్పాటు చేసాము. దృఢసంకల్పం ఉంటే ఎంత పనైనా చెయ్యుచ్చొని ఆవిధంగా బుజువైంది.
దాంతో గ్రామాల పరిస్టితి ఒక్కసారిగా మారిపోయింది. ఇపుడా మండలం రాష్ట్రంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్‌గా మారింది.
ఈ ఫలితాలు రెండు సంవత్సరాల్లోనే సాధించాను. నాకు బదిలీ అయిందన్న వార్త తెలిసి సుమారు వెయ్యిమంది మా ఆఫీసుకొచ్చి బదిలీ రద్దు చెయ్యమని దీక్షచెయ్యడం అన్న సంఘటన నా కృషి ఫలితాల నిచ్చిందన్న దానికి సాక్ష్యంగా నిలిచింది. కాబట్టి మనం ఏ పనిచేసినా ప్రజలకుపయోగపడే విధంగా ఉండాలి.” సముద్రం ఎంత పెద్దదైనా అందులో ఈదే చేపపిల్లకన్నా చిన్నదే... ఆకాశం ఎంత గొప్పదైనా గాలిలో ఎగిరే పక్షికన్నా తక్కువే..."
ఆ రోజు రాజేష్ ఆ జిల్లా కలెక్టరుగా జాయినైన సందర్భంగా సిబ్బంది అతనికి స్వాగతం పలికినపుడు అతను వాళ్ళనుద్దేశించి మాట్లాడిన సందర్భంలో మాట్లాడిన మాటలవి...
ఆ మాటలువిన్న తరువాత ఆ హాలంతా చప్పట్టుతో మారుమోగిపోయింది..
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి >
> కాంతమ్మ హోటల్
> ఒక దీపం - వేవేల దివ్వెలు
> గమనం
> మృగాళ్లు

రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.