Oka Deepam - Vevela Divvelu Written By Gannavarapu Narasimha Murthy
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
ఆరోజు నేను ఉదయాన్నే మాబంగ్లాలో మార్నింగ్ వాక్ చేస్తున్నపుడు తహసీల్దార్ రామబ్రహ్మం వచ్చాడు.
నేను అతన్ని కూర్చోమని చెప్పి పదినిముషాల తరువాత అతని దగ్గరికి వెళ్ళాను.
ప్రస్తుతం నేనుంటున్న సబ్ కలెక్టర్ బంగ్లా బ్రిటిష్ కాలం నాటిది. సుమారు రెండు ఎకరాల
విస్తీర్ణంలో నిర్మించబడింది. చుట్టూ ప్రహారిగోడ.. లోపల ఇంటి చుట్టూ ఎన్నో చెట్లు అడవిని
తలపిస్తుంటాయి.
ఉదయాన్నే లేవడం నాకు అలవాటు... అపుడు వాతావరణం బాగుంటుంది. ఆప్రభాత సమయంలో ఎన్నో వందల పక్షులు కిలాకిలారావాలతో చెట్లమీద ఎగురుతుంటే ఆ శబ్దాలు చెవులకి కీరవాణి రాగంలా వినిపిస్తుంటాయి.
ఆ చెట్ల మధ్య ఉయ్యాల... నడక పూర్తి కాగానే ఆ ఉయ్యాల మీద కాసేపు విశ్రాంతి తీసుకుంటాను.
రామబ్రహ్మం నన్ను చూసి నిలబడి నమస్కారం పెట్టాడు. నేను రెండు సంవత్సరాల క్రితం
ముస్సోరీలో ట్రైనింగ్ చేసుకొని ఈ రెవెన్యూ సబ్ డివిజన్‌కి సబ్-కలెక్టర్‌గా వచ్చాను. నేను పనిచేస్తున్నరెవెన్యూ డివిజన్‌లో పదిహేను మండలాలున్నాయి.
రామబహ్మం రెండు మండలాలకు తహసీల్దార్. ర్యావ్టంలో వంచాయితీ ఎన్నికలు
జరుగుతున్నాయి. అభ్యర్థుల ప్రచారంతో పల్లెలన్నీ మార్మోగుతున్నాయి.
ఈ రోజు నేను కొన్ని మండలాల్లో పర్యటనకు వెళ్తునాను... అక్కడ మిగతా తహసీల్హార్లతో ఎన్నికల
నిర్వహణ, ఎర్పాట్ల మీద మీటింగ్ పెట్టాను.
దానికి డీఎస్పీ, మిగతా పంచాయితీ అఫీసర్లు డి ఈ ఓ.. అందరూ వస్తున్నారు.
వూళ్ళో ఏ విధమైన గొడవలు లేకుండా ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలంటే సరియైన వ్యూహం సక్రమమైన ఏర్బాట్లు, పోలీసుల రక్షణ.. ఇవన్నీ ముఖ్యం..
“ బ్రహ్మంగారు! మనం ఎన్ని గంటలకు బయలుదేరాలి” అని అడిగాను.
ఇంతలో బంగాళా ఎటెండెంట్ మాకు టీలు తీసుకువచ్చాడు.
సార్... 9 గంటలకు బయలుదేరితే పదికి చేరుకోవచ్చు. దార్లో రెండు ఊళ్ళలో ఎన్నికల
ఎర్బాట్లు కూడా మీరు చూడవచ్చు” అన్నాడు రామబ్రహ్మం..
“ ఒకే! మీరు పేపరు చూస్తుండండి. నేను అరగంటలో వచ్చేస్తాను” అంటూ లోపలికి వెళ్ళాను.
సరిగ్గా అరగంట తరువాత మా జీవు బంగ్లా నుంచి బయలుదేరింది.
ఓ గంట తరువాత మా జీపు ఓ పల్లె చేరింది. ప్రతి ఇంటిమీదా జెండాలు, గోడల మీద పోన్టర్లు,
ప్టెక్సీలతో ఎన్నికల హడావుడి ఎక్కువగా కనిపించింది.
ఇంతలో నాకు ప్రాధమిక పాఠశాల అన్న బోర్డు కనిపించటంతో జీపు డైవర్ని ఆపమన్నాను.
జీపుని స్కూలు పక్కన అపి నేను, రామబహ్మం స్కూల్లోకి వెళ్ళాము..
స్కూలు బిల్దింగ్ చాలా పురాతనంగా గోడలన్నీ వెలిసిపోయి భయంకరంగా ఉంది.
మొత్తం మూడు క్లాసు రూములున్నాయి. ఒక దాంట్లో ఉపాధ్యాయుడు ఎదో చెబుతున్నాడు.
మిగతా రెండు క్లాసుల్లో టీచర్లు లేరు. కేవలం విద్యార్థులే ఉండి అల్లరి చేసుకుంటూ కనిపించారు.
మమ్మల్ని చూడగానే క్లాసులోని టీచరు పరుగున బయటికి వచ్చాడు.
అతను తహసీల్దార్ రామబ్రహ్మాన్ని పోల్పినట్లున్నాడు. వస్తూనే “ నమస్కారం సార్” అన్నాడు...
నేను ఎదురుగా ఉన్న క్లాసురూమ్‌లోకి వెళ్ళాను.
మమ్మల్ని చూసి పిల్లలంతా నిల్చున్నారు.
తరగతి గది అంతా నిశ్శబ్దం..
“ మీరే క్లాసు చదువుతునారు” అని అడిగాను.
“ ఐదోక్లాసు” అని అందరూ ఒకేసారి సమాధానం చెప్పారు.
“ మీ టీచర్ ఎక్కడ?”
“ ఊళ్ళోకి వెళ్ళారు” మళ్ళీ అందరూ ఒకేసారి సమాధానం.
“ అసలు వచ్చారా?”
“ వచ్చారు”
“ మీరెవరు ?” అని మా వెనక వచ్చిన టీచర్ని అడిగాను.
“ నేను సెకండరీ గ్రేడ్ అసిస్టెంటుని. రెండు, మూడు తరగతులకు చెబుతుంటాను.
నాపేరు రవి ” అన్నాడతను.
“ మీ హెడ్మాస్టరు గారు ఎక్కడ ?”
“ సార్! వచ్చారు. ఇపుడే ఊళ్ళోకి ఏదో పనుందని వెళ్ళారు.”
ఈ స్కూల్లో ఎంత మంది టీచర్లు పనిచేస్తున్నారు?”
“మేము ముగ్గురం సార్. రెండు పోస్టులు ఖాళీ...”
“ రవి గారు... ఈస్కూలు ప్రాంగణమంతా చాలా ఘోరంగా ఉంది... పచ్చ గడ్డి, పిచ్చి
మొక్కలు... పిల్లల స్కూలు ఇలా ఉంటే ఎలా ?”
“ సార్... నెల క్రితం శుభ్రం చేయించాము. మళ్ళీ చేయిస్తాము” అన్నాడు భయంగా...
“ ముగ్గురిలో మీరొక్కరే ఉన్నారు... మిగతా వాళ్ళు వస్తున్నారా?”
“ ఇంకో మాస్టారు కూడా చిన్న పనుండి ఊళ్ళోకి వెళ్ళారు.. ఇపుడే వచ్చేస్తారు”
ఐదవ తరగతి క్లాసులోకి ప్రవేశించాను. అంతా గందరగోళంగా ఉంది.. కొందరు సెల్‌ఫోన్లు
చూసుకుంటునారు. కొందరు ఏదో రాసుకుంటూ కనిపించారు.
మేము క్లాసులోకి వెళ్ళగానే వాళ్ళంతా భయంతో నిలబడ్డారు.
“ మీ మాస్టారు ఎక్కడ?”
అంతా నిశ్శబ్ధం.. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. “ఈరోజు మాస్టారు వచ్చారా ?
లేదా ?”
మళ్ళీ సమాధానం లేదు..
ఇంతలో ఒక అబ్బాయి చేయెత్తి ”వచ్చారు కానీ ఊళ్ళో ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళారు”
అని చెప్పాడు.
“ రామబ్రహ్మంగారు... నోట్ చేసుకొండి ... మాస్టర్లు స్కూలుకి రాకుండా ఎలక్షన్
ప్రచారానికి వెళుతున్నారు. డిఈఓ కి చెప్పి సస్పెండ్ చేయించండి. ఇట్ ఈజ్ మై అర్దర్స్”
అన్నాను..
' అలాగే సార్ ‘అన్నాడు రామబ్రహ్మం...
క్లాసులో బోర్డ్ మీద ఎవో లెక్కలు వ్రాసి ఉన్నాయి... డన్టర్‌తో వాటిని చెరిపి “మీకు
సరాసరి అంటే తెలుసా?” అని అడిగాను...
ఒక కుర్రవాడు లేచి తప్పు చెప్పాడు...
“ మీకు తెలుగు వాచకంలో మొదటి పాఠం ఎమిటి?”
“ దుర్యోధనుని దురాలోచన” అని ఒక అమ్మాయి లేచి చెప్పింది.
“ దుర్యోధనుడు ఎవరో తెలుసా?”
“ భీముణ్ణి చంపుతాడు వాడు ”
ఒకబ్బాయి నిల్చుని చెప్పాడు.
“ మీకు రామాయణం, భారతాలు చెప్పారా?” అని అడిగాను.
“ రామాయణం చెప్పారు... భారతం చెప్పలేదు...
“ రాముడు ఎవరి కొడుకు?”
ఎవ్వరూ చెప్పలేదు...
“ ఇంగ్లీమ మొదటి పాఠం?”
“ మై విలేజ్” అన్నాడు ఒక అబ్బాయి లేచి...
“ విలేజ్ స్పెల్లింగ్ చెప్పు?”
“విఐఎల్‌ఏజి....” తప్పు చెప్పాడువాడు...
ఆ తరువాత స్కూలు బయటకు వచ్చాను. ఈలోపల ఎవరు చెప్పారో గానీ ఆ ఇద్దరు
టీచర్లు వచ్చారు..
ఒకతను పెద్దాయన.. వస్తూనే నమస్కారం పెట్టి “సార్.... ఒంట్లో కొద్దిగా బాగులేక వూళ్ళో
మందుకి వెళ్ళాను అని చెప్పాడు..
“మీ పేరు ?
“ నాపేరు ధర్మారావు... ఇక్కడ హెడ్నాస్టర్ని”
“ఒంట్లో బాగులేదా? ఎలక్షన్ ప్రచారం ఎలా ఉంది?”
ఎవరి తరఫున ప్రచారానికి వెళ్ళారు?”...
“ లేదు సార్... నేను...”
“ అబద్దాలు అడకండి.. మీరెక్కడికెళ్ళారో మీ విద్యార్థులే చెప్పారు. చదువు చెప్పవలసిన
గురువులే ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు ఎలా బాగుపడతారు? వాళ్ళకి చదువెలా వస్తుంది చెప్పండి?
వేలకి వేలు ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకుంటూ ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎలా? ఒక
ప్రభుత్వ ఉద్యోగి డ్యూటీలో ఉంటూ బయటకు వెళ్ళి ఇతరుల తరపున రాజకీయ ప్రచారాల్లో
పాల్గొనడం చాలా అక్రమమైన చర్య...
రామబ్రహ్మం గారూ... ఇవుడే ఈ ఇద్దర్నీ సస్పెండ్ చేసి డీఈవోని విచారణ చెయ్యమని ఉత్తరం వ్రాయండి” అంటూ బయటకు నడిచాను.
పది నిముషాల్లో రామబ్రహ్మం, వాళ్ళకి సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చి వచ్చాడు..
అతరువాత పంచాయితీ అఫీసుకు వచ్చి సాయంత్రం దాకా ఎన్నికలు నిర్వహణ గురించిన
మీటింగ్‌లో పాల్గొని ఇంటికి వచ్చేసాను.
వారం రోజుల తరువాత నేను ఒక రోజు ఆఫీసులో ఉన్నపుడు జిల్లా విద్యాశాఖాధికారి
సన్యాసిరావు వచ్చి కలిసాడు.
“సార్. మీ ఆర్డర్స్ ప్రకారం రాఘవపురం స్కూలుకి వెళ్ళి విచారణ చేసాను. ఆ ఇద్దరు
టీచర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు, చదువులు సరిగా చెప్పటం లేదని తెలిసింది.
వాళ్ళని ఓనెల సస్పెన్షన్ లో ఉంచుతూ తరువాత వాళ్ళని చాలా దూర ప్రాంతానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చాను...” అని చెప్పాడు
“ అయ్యా... మీరు తరచు స్కూళ్ళను తనిఖీలు చేస్తూ ఉండండి. నెలకి కనీసం పది
స్కూళ్లు చొప్పున చేసినా చాలా వరకు స్కూళ్ళ పరిస్థితి మెరుగు పడవచ్చు. మొన్న నేను ఆ స్కూలు పిల్లలను పరీక్షించాను. విద్యా ప్రమాణాలు సరిగ్గాలేవు. ఉపాధ్యాయులకు తరచు బోధన విషయంలో తగు సూచనలిస్తూ ఉంటే విద్యాప్రమాణాలు పెరుగుతాయి..” అని చెప్పాను.
కానీ ఆశ్చర్యంగా ఆ మర్నాడు కలెక్టర్ నాకు ఫోన్‌చేసి “మీరు అనసరంగా ఆఇద్దరు టీచర్లను
సస్పెండ్ చేశారు. వాళ్ళిద్దరూ మీ ఎమ్మెల్యే గారికి దగ్గరివాళ్ళుట.. అతని కులస్థులు కూడాను..
వాళ్ళని సస్పెండ్ చేస్తే వాళ్ళ కులం ఓట్లు పోతాయట... పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీకి
నష్టం వస్తుందట.. వెంటనే వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోండి” అని చెప్పాడు...
“ వాళ్ళు సరిగ్గా ఉద్యోగం చెయ్యటం లేదు సరికదా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే విద్యార్థులు నష్టపోతారు... ఇప్పటికే మండలాల్లో వీళ్ళ గురించి
అందరికీ తెలిసిపోయింది” అన్నాను...
“మీరు చెప్పింది నిజమే కానీ అధికార పార్టీ ఎమ్మెలేలు మన మీద పడి ఏడుస్తారు.
ముఖ్యమంత్రికి మన గురించి వ్యతిరేకంగా చెబుతారు. ఇవన్నీ మనకెందుకు.. ఈవ్యవస్టలో వీళ్ళని కాదని మనం ఏ పనీ చెయ్యలేము” అని నాకు నీతులు బోధించాడాయన
ఏం చెయ్యాలో తోచలేదు.
ప్రజలకి సేవ చెయ్యాలని ఈ సర్వీనుని ఎంచుకున్నాను. కానీ రాజకీయాల్లో అవినీతి పెరిగి
పోవడం వల్ల సామాన్యులకు న్యాయం జరగటం లేదు..
రెండు రోజుల తరువాత ఓ దినపత్రికలో ఆ టీచర్ల గురించిన ఓ వార్త వచ్చింది. అందులో
ఆ టీచర్లు స్కూలుకి ఎగనామం పెడుతూ ఎలా తప్పు పనులు చేన్తునారో విపులంగా వ్రాయడంతో
అవార్త జిల్లా అంతా సంచలనం సృష్టించింది. స్థానిక ఎమ్మెల్యే ఉపాధ్యాయులను తన స్వంత
ప్రచారానికి వాడుకుంటున్నట్లు సోదోహరణంగా అందులో వివరించడంతో ప్రతిపక్షం అధికార
పక్షం మీద ఎదురు దాడికి దిగింది.
శాసనసభలో ఈ వార్త మీద సమగ్రమైన చర్చ జరగడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.
వారం రోజుల తరువాత కలెక్టర్ దగ్గర్నుంచి నాకు 'ఆ టీచర్ల మీద చర్యలు సహేతుకమే' అని
ఉత్తరం వచ్చింది...
అందులో స్కూళ్లన్నింటినీ పరిశీలించి తగు సూచనలివ్వాల్సిందిగా పేర్కొన్నారు...
రెండు నెలల పాటు సూళ్ళన్నింటినీ పరిశీలించాను. చాలా స్కూళ్ళకు భవనాలు సరిగ్గా లేవు.
త్రాగేందుకు మంచినీరు, అమ్మాయిలకు మరుగుదొడ్లు, పిల్లలకు ఆట స్థలాలు లేవనీ గుర్తించాను. నాకీ విషయంలో రామబ్రహ్మం సహకరించాడు.చాలా స్కూళ్ళకు ప్రహరీగోడ లేకపోవడాన్ని కూడా గమనించాము.
మరీ ముఖ్యంగా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదే ఊళ్ళలో నివాసం ఉండటం
లేదు. దగ్గర్లో ఉన్న పట్నాల నుంచి తమ బైకుల మీద, లేదా బస్సుల మీద వస్తున్నారు. దానివల్ల
పది గంటలదాకా చాలా మంది రావటం లేదు. మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకే వెళ్ళిపోతునారు.
చాలా మంది పేద పిల్లలకు సరియైన భోజనం సదుపాయం ఉండటంలేదు. ఈవిషయాలన్నీ
ఒక రిపోర్ట్ ద్వారా కలెక్టర్‌కి పంపించాను.
సంవత్సరం తరువాత మా రెవెన్యూ డివిజన్‌లోని మూడు వందల స్కూళ్ళ రూపురేఖలు
మారిపోయాయి. పాఠశాల భవనాలకు మరమ్మత్తులు, ప్రహారీ గోడలు, మరుగుదొడ్లు, మంచినీటి
సదుపాయాలు... ఇలా అన్నింటినీ మెరుగు పరిచాము..
ఉపాధ్యాయులను ప్రతీ రెండు సంవత్సరాలకు బదిలీ చేసే పద్ధతి అమల్లోకి తెచ్చాము.
దానికి తోడు వాళ్ళకు గులాబీ రంగు యూనీఫామ్ పెట్టాము. దాని వల్ల వాళ్ళను ప్రజలు గుర్తించే
అవకాశం కలిగింది.
ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న ఊళ్ళలో ఉండేలా ఉత్తర్వులిచ్చాము.
మద్యాహ్నభోజనం పథకంలో మార్పులు.. చక్కటి పరిశుభ్రమైన బలమైన ఆహారం,
శుభ్రమైన మంచినీరు, ప్రతీ పాఠశాలలో గ్రంధాలయం, వార్తాపత్రికలు, తెలుగు ఇంగ్లీషు పుస్తకాలు
ఉండేటట్లు ఏర్పాట్లు చేసాము. ఇపుడు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది.
నేను ఈ రెవెన్యూ డివిజన్‌లో నాలుగు సంవత్సరాలు పనిచేసాను. ఆ తరువాత నాకు జాయింట్
కలెక్టర్‌గా పదోన్నతి లభించడంతో ఇంకో జిల్లాకు బదిలీ అయింది.
ఆ సంవత్సరం నాకు ప్రాధమిక విద్యా సదుపాయాలు పెంచినందుకు ముఖ్యమంత్రి షీల్డ్
లభించింది.
నేను రిలీవ్ అయిన సమయానికి పాఠశాలలన్నీ బాగా అబివృద్ది చెందాయనీ,
ఉపాధ్యాయులంతా భయభక్తులతో చదువులు చెబుతున్నారనీ, దానికి నేనే కారణమనీ, మరీ
ముఖ్యంగా ‘ ఒక దీపాన్ని వెలిగిస్తే వేవేల దివ్వెల్ని వెలిగించ వచ్చనీ’ మీ సబ్ కలెక్టర్‌గారు
రుజువుచేసారు అని కలెక్టర్ గారు అభినందన సభలో చెప్పడం నాకు చాలా ఆనందం కలిగించింది.
(సమాప్తం)
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి >
> సంకల్పం
> గమనం
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments