భార్య - పార్ట్ 2
- Sudarsana Rao Pochampalli

- 2 hours ago
- 6 min read
#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #Bharya, #భార్య, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Bharya - Part 2/4 - New Telugu Story Written By Sudarsana Rao Pochampally Published in manatelugukathalu.com on 16/02/2026
భార్య - పార్ట్ 2/4 - పెద్దకథ
రచన : సుదర్శన రావు పోచంపల్లి
జరిగిన కథ: శ్రీకంఠ, భవభూతి ఇద్దరూ విశ్రాంత ఉద్యోగులే. ఇద్దరికీ మిత సంతానమే అయినా, శ్రీకంఠకు ఇద్దరు ఆడపిల్లలైతే (శ్రావణి-చతుర), భవభూతికి ఒక కొడుకు (జయంత్), ఒక బిడ్డ (అక్షర).
శ్రీకంఠ భార్య సత్యవతితోనూ, అక్కడ భవభూతి సతీమణి భవానితోనూ ఇద్దరిద్దరే నివసిస్తున్నారు.
తమ కూతురు అక్షరను విదేశంలో ఉంటున్న ఆమె భర్త కార్తీక్ తీవ్రంగా హింసిస్తున్నాడని, శారీరక, మానసిక చిత్రహింసలకు గురిచేస్తున్నాడని కన్నీళ్లతో చెబుతారు భవభూతి దంపతులు.
ఇక భార్య - పార్ట్ 2 చదవండి.
శ్రీకంఠ కలుగజేసుకుంటూ, "జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు బాధ పడ్డా చేసేదేమీ లేదు. ముందు మీ అమ్మాయి అక్షరను ఇండియాకు తీసుకొచ్చే ఆలోచనలో ఉండండి. మీకు ఇద్దరూ మగపిల్లలే అను భావనలో ఉండండి. మీ అక్షర చదువుకోనిదేమీ కాదు కదా? ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకుంటూ మీకు తోడుగా ఉంటుంది. ఆ పాత కాలపు ఆలోచనలు మరిచిపోండి. ఇకనైనా ఆ బూజు దులుపవలసిందే. మీరు చింతించడం మానండి. కాలానికి ఎదురీదే మనస్తత్వం పెంచుకోండి" అని ఏదేదో ఉపమానాలు చెప్పుతూ వాళ్ళను స్థిమితపడేటట్లు చేస్తాడు శ్రీకంఠ.
మిత్రుని ఆవేదన చల్లార్చి, అతడొక అభిప్రాయానికొచ్చే విధంగా, "వివాహము, భార్య అంటే ఏమిటి, భర్త అంటే ఏమిటి, సమాజపు నియమ నిబంధనల లోటుపాట్లు ఏమిటి, వాటి పర్యవసానం ఏమిటి," ఇవన్నీ సుదీర్ఘంగా ఒక ఉపన్యాస రీతిలో చెబుతుంటాడు శ్రీకంఠ. దానికి ఊ కొడుతూ వింటుంటాడు భవభూతి. భవాని, సత్యవతి వింటూ కూర్చుంటారు నిశ్శబ్దంగా.
హిందూ సంప్రదాయం ప్రకారము, కన్యాదాత, గ్రహీతల అంగీకారము మేరకు వారి కుమార్తె, కుమారులను భవిష్యత్తులో అనగా జీవితాంతం కలిసి బ్రతికి, పుత్ర పౌత్రాభివృద్ధితో తులతూగ ఏర్పాటు చేసి, పదుగురి సమక్షంలో అగ్నిసాక్షిగా మాంగల్య ధారణ చేయిస్తూ, ప్రమాణపూర్వకంగా ఏకము చేసిన బంధమే వివాహము. అట్లు ఒక్కరైన ఇద్దరే భార్యాభర్తలు.
ఐతే పూర్వకాలములో (అది ఇప్పటికీ కొంత శాతం కొనసాగుచున్న నిర్బంధ సంప్రదాయం) భార్యగా నిర్వచింపబడిన స్త్రీకి కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు ఏర్పాటు చేసి వాటిని పాటిస్తూ భర్తకు, అత్తమామలకు సేవలు చేస్తూ గృహిణి పాత్ర పోషించవలసినదిగా నిర్ణయించి ఆచరింపజేస్తున్నారు.
ఇంకొకవంక స్త్రీని గౌరవించాలి, ఆదరించాలి, సమాజంలో ఉన్నత గౌరవం ఇవ్వాలి అని విజ్ఞుల మాట.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా
యత్ర నార్యస్తు న పూజ్యంతే సర్వ స్తత్రాశురాః క్రియాః
ఎక్కడ స్త్రీలను పూజిస్తారో, గౌరవిస్తారో, అక్కడ దేవతలు ఉంటారు.
ఎక్కడ స్త్రీలను గౌరవించరో, అక్కడ రాక్షసత్వం ఉంటుంది.
కానీ అధిక జనాభాలో విజ్ఞత కోల్పోయి, రెండవ దాన్నే పాటిస్తూ భార్యలను ఇడుముల పాలు చేస్తూ, భర్తలూ సుఖంగా ఉండలేక ఎన్నో ఇక్కట్లు కొనితెచ్చుకుంటున్నారు.
భార్యను ఒక దాసిగా, ఒక ఆట బొమ్మగా, ఒక పిల్లలను కనే యంత్రంగా పరిగణిస్తూ, దుష్ట చేష్టలతో చిత్రహింసలకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.
భార్యాభర్తలంటే సంసార శకటానికి రెండు ఎద్దుల లాంటి వారని వివాహం జరుగుతున్న సందర్భంలో ఎడ్లపై పెట్టే కాడిని చూపించే తతంగమొకటి ఉన్నది. అది వివాహ వేదిక వరకే పరిమితమైంది నేడు.
భర్తకు కూడా నిఘంటువులో ఎన్నో పర్యాయ పదాలున్నాయి. వాటిలో ఎంతో అర్థము ఇమిడి ఉన్నా, ఆ భావనే తలువక భార్యను పీడిస్తేనే మగతనం అను భావనకు లోనై, నేటి లేదా ఆనాటి నుండి పురుషాహంకారం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అహంకారం కన్నా నీచ ప్రవృత్తి అనడమే సమంజసమేమో.
భర్త, ఆర్యుడు, ఇంటిమగడు, ఇంటి యాతడు, ఈశుడు, ఉద్వోఢ, ఉపయంత, ఒడయడు, కాంతుడు, క్షేత్రి, గండ, గేస్తు, చిత్తేశుడు, చెల్వుడు, ధవుడు, నర్మకీలుడు, నాథుడు, నేత్రుడు, పతి, పరిణాయకుడు, పరిణేత, పాతి, పురుషుడు, పెనిమిటి, ప్రజుడు, ప్రణయుడు, ప్రతిగ్రహీత, ప్రభువు, ప్రాణదయితుడు, ప్రాణనాథుడు, ప్రాణేశుడు, ప్రియుడు, ప్రేయాంసు, భర్తృ, మగడు, మనువు, యజమానుడు, రతగురువు, రమణుడు, రుచ్యుడు, రేడు, వల్లభుడు, వోఢ, సధ్యంచు, సమాప్తుడు, సహచరుడు, సహధర్మచారి, సామి, స్వామి, సేక్త.
కృత యుగే, రేణుకా శక్తి, త్రేతాయుగే, సీతా శక్తి, ద్వాపరే, ద్రౌపదీ శక్తి, కలియుగే, గృహే గృహే శక్తి అని స్త్రీని వ్యంగ్య భాషలో వర్ణించినా, ఆ స్త్రీ ఒక మహత్తర శక్తిస్వరూపిణి, దైవానికి ప్రతిరూపం.
అదే ఈ ప్రపంచంలో ప్రధాన పాత్ర పోషించేది, ప్రపంచ మనుగడకు మూలం - తల్లి, ఆ తరువాత ఇల్లాలు. అందుకొరకే పెద్దలన్నారు:
వినా స్త్రియా జననం నాస్తి
వినా స్త్రియా గమనం నాస్తి
వినా స్త్రియా చలనం నాస్తి
వినా స్త్రియా సర్వం నాస్తి
అటువంటి స్త్రీకి భార్య పాత్రలో ఆమెకు నిఘంటుకారులు రచించిన పర్యాయ పదాలు:
అర్థాంగి, ఆలు, ఇంతి, ఇల్లాలు, ఇల్లాపె, ఇల్లుటాలు, ఉవిద, ఊఢ, ఒడయురాలు, కళత్రము, కళ్ళాలు, క్రొత్తడి, క్షేత్రము, గాదిలి, గృహమేథిని, గృహిణి, గేస్తురాలు, గేహిని, చామ, జాని, జాయ, దార, దేవేరి, ద్వితీయ, ధర్మభాగిని, నిక్కపుటాలు, నిశాంతనారి, పత్ని, పరిగ్రహ, పాణిగృహీతి, పాలోషి, పెండ్లాము, ప్రాణసమ, ప్రాణేశి, ప్రేయసి, ప్రోయాలు, బసాలు, మగనాలు, రమణ, రాణి, రాణివాసము, వధువు, వల్లభ, వశ, శాలిని, సతి, సధర్మచారిణి, సహధర్మచారిణి, సభర్తుక, సహధర్మిణి, స్వామిని.
చేతనత్వం పొందని కాలములో ఆడ పిల్లలకు ఎనిమిదవ ఏటనే పెళ్ళి చేసే సంప్రదాయాన్ని సృష్టించి. అదీ "గర్భాష్టకాల"కే అంటే తల్లి కడుపులో ఉన్న నాటినుండే లెక్కించేవారు మహానుభావులు. అంటే ఆ వయసు పాలు మరిచే కాలము. ఎదురుగా పిల్లి నిలిచితే, తల్లిదగ్గర తన తమ్ముడో చెల్లెనో పాలు త్రాగుతుంటే, తను కూడా ఇంకా గ్రోలితే బాగుండుననే లేబ్రాయపు వయసు.
అటువంటి పసికూన పెళ్లి అనే సంప్రదాయబద్ధురాలై, తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధువులను, తాను పెరిగిన పరిసరాల జ్ఞాపకాలను వదిలి, అత్తవారింట్లోనే యుక్తవయసు వచ్చేదాక అత్త సంరక్షణలోనే పెరిగి పెద్దదై, భార్య రూపం దాల్చి - కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపే చ లక్ష్మీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ,
ఇంటి పనులు చేయడంలో దాసి పాత్ర,
మంచి ఆలోచనలివ్వడంలో మంత్రి పాత్ర,
అలంకరణలో లక్ష్మీదేవి పాత్ర,
సహనం వహించడంలో భూదేవి పాత్ర,
భోజనం వడ్డించేటప్పుడు తల్లి పాత్ర,
నిద్రకు ఉపక్రమించేముందు రంభ పాత్ర.
ఈ ఆరు పాత్రలు పోషిస్తూ స్త్రీ ఇల్లాలుగా జీవన యానం చేయాలి.
పెళ్ళైన నాటినుండే మొదలయింది: "పితా రక్షతిన్ కౌమారే, భర్తా రక్షతిన్ యౌవనే, రక్షంతి వార్థకే పుత్రా, న స్త్రీ స్వాతంత్రమర్హతి" అనబడు నినాదము, నిర్బంధము.
(ఐతే ఇక్కడ మనువును కీర్తించడం పోయి నిందిస్తూ, పెడార్థముతో స్త్రీకి స్వాతంత్ర్యం లేదు అను భావనతో వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి, మనువు రక్షణ అనే పదాన్ని వాడాడు. అంతే, స్త్రీకి రక్షించే అవసరము లేదనే భావనే కాని, ఏ హక్కూ లేదని కాదు).
ఇంకో విషయం ఏమిటంటే, పూర్వము వచక్నువు మహార్షి కూతురు గార్గి మహా విద్యా సంపన్నురాలు. పండితులందరినీ ఓడించిన దిట్ట. ఆ కాలములోనే స్త్రీగా ఉండి ఉపనయనం చేసుకున్న ధీమంతురాలు.
దానికి తోడు కొన్ని నిబంధనలు:
అలకలు దువ్వరాదు
సరసాన్నమున్ భుజింపగరాదు
సాధ్వియౌ నళిన దళాక్షి
నాథుడు చెంగట లేక యుండినన్.
ఇంకా ఒక పనికిరాని భావన ఏమిటంటే:
పితా చ రుణవాన్ శత్రు
మాతా చ వ్యభిచారిణి
పుత్ర శత్రు న పండితః
భార్యా రూపవతి శత్రు.
19వ శతాబ్దంలో పక్కి వేంకట నరసయ్య అనే కవి వ్రాసిన కుమారీ శతకములో అప్పటి ఆచారాలు తెలిపినదేమంటే:
పరపురుషులన్నదమ్ములు,
వరుడే దైవమ్ము, తోడ పడుచులు వదినల్,
మరదండ్రు, అత్తమామలు,
ధర తల్లియు తండ్రి యనుచు తలుపు కుమారీ.
పెనిమిటి వలదని చెప్పిన,
పని యెన్నడూ చేయరాదు, బావలకెదుటన్,
కనబడగరాదు, కోపము
మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ.
ఇక పెళ్ళయింది మొదలు భర్త శ్రేయస్సుకై మంగళగౌరీ వ్రతాలు, నోములు, పూజలు, జపాలు ఇత్యాది భగవత్ సేవలన్నీ క్రమం తప్పకుండా నిష్ఠతో ఉపవాస దీక్ష ఆచరిస్తూ భార్య పాటించవలసిన విధులు.
ఈ మాటలన్నీ ఓపికతో వింటున్న భవభూతి, "అవన్నీ పాత కాలపు మాటలు శ్రీకంఠా! ఈ కాలంలో ఎవరు పాటిస్తున్నారు? ఈ ఆచారాలు, సంప్రదాయాలు కాకపోతే నా బోటి దురదృష్ట జాతకులకే ఈ బాధలు. ఏ జన్మలో ఏమి పాపం చేశామో, మాకీ గతి పట్టింది.
నువ్వన్నట్టు నా బిడ్డను ఇండియాకు తీసుకువద్దామా అనుకుంటే దగ్గర లేదాయే. ఆ దుర్మార్గుడు పంపుతాడంటావా? వాడు తాగుడుకు మరిగినట్టుంది. ఏం మాట్లాడుతాడో, ఏం చేస్తాడో వానికి సోయి లేదు. దీనికి పరిష్కారం ఐతే నాకు తోచడం లేదు శ్రీకంఠా," అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటాడు భవభూతి. "అవునన్నయ్యా, మీరే ఏదైనా మార్గం ఆలోచించి చెబుతారని అంత దూరం నుండి ఇక్కడికి రావడం జరిగింది," అంటుంది భవాని విచారవదనంతో.
"మీరు బాధ పడకండి. నాకు ఒక ఆలోచన తట్టింది. మీరు సరేనంటే మీ అక్షరను ఇండియాకు తీసుకొచ్చే మార్గం ఉన్నది" అని అంటూ ఉంటేనే, ఆతురతగా "ఏమిటది శ్రీకంఠా?" అని అడుగుతాడు భవభూతి.
"ఇక్కడ నాకు ఒక స్నేహితుడున్నాడు. అతని పేరు భద్రాచలం. భార్య స్నేహశీల. అతని కొడుకు విష్వక్సేన్ అనువాడు కూడా మీ అక్షర ఉన్న రాష్ట్రంలోనే ఉంటున్నాడు. పైగా మన అదృష్టం ఏమిటంటే, అతని పెళ్లి తొందరలోనే జరుగబోతున్నది. ఇంకా విశేషం ఏమిటంటే, కాబోయే పెండ్లి కూతురు కూడా అదే రాష్ట్రంలో ఉంటున్నదట. పెండ్లికి ఇద్దరూ కలిసి ఇండియాకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.
ఐతే, నేను చెప్పబోయేది ఏమిటంటే, భద్రాచలానికి మన పరిస్థితి వివరించి, విష్వక్సేన్కు, వాళ్ళు వచ్చేటప్పుడు అక్షరను కూడా వెంట తీసుకురమ్మని చెబుదాం." ఈ మాట అంటుంటేనే, "ఆ దుర్మార్గుడు మా అక్షరను వీళ్ళవెంట పంపుతాడంటావా శ్రీకంఠా?" అంటూ సంశయంగా శ్రీకంఠ వైపు చూస్తాడు భవభూతి.
శ్రీకంఠ భవభూతి వైపు చూస్తూ, "భవభూతీ, నీకా సందేహం అవసరం లేదు. విష్వక్సేన్ చతురుడు, కార్య సాధకుడు. అతని చిన్ననాటి నుండి నేను చూస్తూనే వున్నాను. అతని సామర్థ్యం మీద నాకైతే నమ్మకం ఉన్నది. ఏమంటావమ్మా భవానీ?" అంటూ ప్రశ్నార్థకంగా భవాని వైపు చూస్తాడు శ్రీకంఠ. "అంతకన్నా అన్నయగారు! ఆ ప్రయత్నం చేసి ఎలాగైనా మా అక్షరను ఇక్కడికి రప్పించే ఏర్పాటు చేయండి. మాకు అంతకంటే ఏం కావాలి," అంటూ గద్గదస్వరంతో అంటుంది భవాని. "ఇక నువ్వే ఆపద్బాంధవుడివి శ్రీకంఠా," అని కొంత ఊరడిల్లిన ధోరణితో అంటాడు భవభూతి.
"సరె, రేపు ఉదయం భద్రాచలానికి చెప్పి కార్య రూపం దాల్చేటట్టు చూద్దాము. మీరు మాత్రం బెంగ వదలండి" అని అనునయ మాటలు చెబుతాడు శ్రీకంఠ.
భవభూతి, భవాని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, "నాకైతే మీ ఆలోచన బాగుందనిపిస్తున్నది అన్నయ్యగారు," అంటూ
"ఏమంటారండి? అన్నయ్యగారు చెప్పింది బాగున్నది కదా?" అంటుంటే, "మరి ఆ మహానుభావుడు అక్షరను పంపుతాడంటావా?" అని ఎదురు ప్రశ్న వేస్తాడు భవభూతి.
"ఆ విషయంలో మీరేమీ దిగులుపడవలసింది లేదు. విష్వక్సేన్ సమర్థుడు. మీ అల్లుణ్ణి ఎలా ఒప్పించాలో ఆలోచించి, అతన్ని ఒప్పించి అక్షరను వెంట తీసుకురాగలడు. నాకు వంద శాతం నమ్మకం ఉంది," అంటాడు శ్రీకంఠ.
"అయినా మేము ఇంత దూరం మీ దగ్గరికి వచ్చింది కూడా మీరేదో విధంగా మమ్ములను ఈ ఆపత్తు నుండి గట్టెక్కిస్తారనే ఆశతోనే కదా శ్రీకంఠా!" అంటాడు భవభూతి.
ఆ సాయంకాలం శ్రీకంఠ, భవభూతి ఇద్దరూ బజారుకు పోతూ త్రోవలో ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటారు. అనుకోకుండా భద్రాచలం ఎదురౌతాడు ఇద్దరికీ. శ్రీకంఠ భవభూతికి పరిచయం చేస్తూ, "ఇతడే నా చిరకాల మిత్రుడు. పేరు భవభూతి. చాలా కాలం తరువాత మా ఇంటికి వచ్చిండు. ఇక నీకు నూటా ఏబది ఏండ్ల ఆయుస్సు!" అంటుంటే, "అదేమిటి ఒక్కసారిగా నా జీవితకాలం పెంచేస్తున్నారు!" అని నవ్వుకుంటాడు భద్రాచలం. "ఎందుకంటే, మనసులో నిన్నే తలుచుకుంటూ, మన స్నేహం గురించి ఈ భవభూతికి చెబుతున్నాను. ఆ ఇంకొక మాట: రేపు ఉదయం మీ ఇంటికి రావాలనుకుంటున్న. నీతో ఒక ముఖ్యమైన పని ఉన్నది. నీకు తీరికే కదా?" అంటాడు శ్రీకంఠ అతని వైపు చూస్తూ. "ఎంత మాట! నీవు మా ఇంటికి వస్తాననడము, నేను తీరిక లేదనడమా? చాలా సంతోషం!" భవభూతి వైపు చూస్తూ, "మీరు కూడా రండి," అంటాడు భద్రాచలం భవభూతి వైపు చూస్తూ చేతిలో చేయి కలిపి. "సరే," అంటాడు భవభూతి.
"ఏదో పనిమీద పోతున్నట్లున్నది. మేము ముందుకు పోయి కొన్ని కూరగాయలు తీసుకొని ఇంటికి పోతాము. నీవు మాత్రం ఏ పనీ పెట్టుకోకు. రేపు ఉదయం ఎనిమిది గంటలకే మీ ఇంటి కొస్తాము," అని చేతిలో చేయి కలిపి ముందుకు కదులుతారు శ్రీకంఠ, భవభూతి. భద్రాచలం కూడా అతని పనేదో వీళ్ళను వదిలి వేరే త్రోవలో పోతాడు.
ఇంకా ఉంది..
భార్య - పార్ట్ 3 త్వరలో
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.




Comments