చిగురించిన మాతృత్వం
- Munipalle Vasundhara Rani

- Feb 15
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #ChigurinchinaMathrutvam, #చిగురించినమాతృత్వం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Chigurinchina Mathrutvam - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 15/02/2026
చిగురించిన మాతృత్వం - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
సుధ కాలు కాలిన పిల్లిలా వంటగదిలోంచి హాల్లోకి, హాల్లోంచి వంటగదిలోకి తిరుగుతోంది. మాటల్లో చెప్పలేని ఆందోళన ఆమె ముఖంలో కనిపిస్తోంది. మాటిమాటికీ గడియారం వంక చూస్తోంది.
ఇది గమనించిన మూర్తి గారు, ఏమైంది సుధా? అలా కంగారు పడుతున్నావు? అని అడిగారు.
ఏమీ లేదు లెండి.. ఎందుకని ఇవాళ ఇంత ఆలస్యమైంది? కొంపదీసి ఒంట్లో బాగులేదా ఏంటి? అని తనలో తను గొణుక్కుంటోంది.
ఇక చూడలేక మూర్తి గారు గబగబా వెళ్లి సుధ చేయి పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టారు. ముందు ఈ మంచినీళ్లు తాగు అని గ్లాసు అందించారు.
నీళ్లు తాగాక సుధ కాస్త కుదుటపడింది. ఇప్పుడు చెప్పు.. ఏమైంది? ఎందుకిలా గాభరా పడుతున్నావు? అని అడిగారు మూర్తి గారు నెమ్మదిగా.
సుధ కళ్లలో నీళ్లు ఊరుతుంటే తుడుచుకుంటూ, మీకు కోపం వస్తుంది నేను విషయం చెబితే అని భయం.
దానికి ఆయన ఆమె భుజం తడుముతూ, 'పర్వాలేదు సుధా.. నేనేమీ కోప్పడను, విషయం ఏంటో చెప్పు' అన్నారు.
నేను రోజూ వంట చేస్తున్నప్పుడు పక్కంటి ఆవిడ బాల్కనీలో వాళ్ల పాపకి స్నానం చేయిస్తూ ఉంటుంది. ఆ పాప ఏడుపు, ఆవిడ లాలిస్తూ చెప్పే కబుర్లు వింటూ నేను పని చేసుకుంటాను. కానీ రెండు రోజుల నుంచి ఆ పాప గొంతు కానీ, ఆవిడ గొంతు కానీ వినబడటం లేదు. చాలా కంగారుగా ఉందండి అంది సుధ బేలగా.
సుధను చూస్తుంటే మూర్తి గారికి మనసు తరుక్కుపోయింది. వాళ్లకు పెళ్లై పదేళ్లయినా పిల్లలు పుట్టలేదు. చేయించని వైద్యం లేదు, మొక్కని దేవుడు లేడు. ఇద్దరికీ ఎటువంటి అనారోగ్యాలు లేవని టెస్టులన్నీ చెబుతున్నాయి కానీ ఆ భాగ్యం కలగలేదు. సుధ తన సొంత పిల్లల మీద ఆశ వదిలేసుకుని, ఆ పక్కంటి పాప మీద ఇలా తెలియని అనుబంధాన్ని పెంచుకుందని అర్థం చేసుకున్న ఆయనకు చాలా బాధ అనిపించింది.
సరే.. ఈ టెన్షన్, ఈ సస్పెన్స్ ఎందుకు? నడు.. ఇద్దరం ఒకసారి పక్కంటికి వెళ్లి చూసి వద్దాం. పక్కంటి ఆయన అప్పుడప్పుడూ బయట కనిపిస్తూ పలకరిస్తూనే ఉంటారు కదా అని మూర్తి గారు సుధని వెంటబెట్టుకుని వెళ్లారు.
పక్కంటి తలుపు కొట్టగానే ఆ ఇల్లాలు నీరసంగా తలుపు తీసింది. సుధ మొదటిసారి ఆవిడను చూస్తోంది. మేము మీ పక్క ఇంట్లోనే ఉంటాము, నా పేరు సుధ, మీ వారు ఈయనకు బాగానే తెలుసు అని మూర్తి గారి వైపు చూసింది. ఆవిడకి విపరీతమైన జ్వరం అని, ఇంట్లో సాయం లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. లోపల పాప ఏడుపు వినిపిస్తోంది. సుధ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చొరవగా లోపలికి వెళ్ళింది. ఏడుస్తున్న పాపను ఎత్తుకుని బయటకు వచ్చింది.
మూర్తి గారు అక్కడే ఉండి ధైర్యం చెబుతుంటే, పాపను మూర్తి గారికి ఇచ్చి సుధ గబగబా తన ఇంటికి వెళ్లి వేడివేడిగా ఇడ్లీలు, పాలు తీసుకువచ్చింది.
పాపకి పాలు పట్టమని మూర్తి గారికి ఇచ్చి, సుధ వేడి వేడి ఇడ్లీలు పాప తల్లికి పెట్టింది. ఆవిడకు మందులు, మంచినీళ్లు ఇచ్చి, మీరేమీ టెన్షన్ పడకండి పాప సంగతి నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పింది.
ఆ తర్వాత పాపను జాగ్రత్తగా బాల్కనీలోకి తీసుకెళ్లి స్నానం చేయించడం మొదలుపెట్టింది. పాప స్పర్శతో సుధ మాతృ హృదయం ఆనందంతో పరవశించింది.
అప్పటివరకు ఆగిపోయిన ఆ చిన్ని కేరింతలు మళ్లీ ఆ వీధిలో ప్రతిధ్వనించాయి. స్నానం చేయించాక సుధ ఆ పాపను లోపలికి తీసుకువచ్చి, చక్కగా ముస్తాబు చేసి మురిసిపోతూ చూసుకుంది.
సుధ మొహంలో అప్పటివరకు ఉన్న కంగారు మాయమై, ఒక తృప్తి కలిగిన తల్లిలా కనిపించింది. ఆ పాప నవ్వులు సుధ పదేళ్ల నిశ్శబ్దాన్ని పటాపంచలు చేశాయి.
మీ వారు వచ్చేవరకు మీరు రెస్ట్ తీసుకోండి, ఇంట్లో ఏ పనీ చేయకండి. నేను వంట చేసి పంపిస్తాను. పాపను నాతోబాటు మా ఇంటికి తీసుకువెళ్లి నేను ఆడిస్తాను లెండి. ఏమైనా అవసరం అయితే బాల్కనీ నుంచి పిలవండి, వచ్చేస్తాము నేను, పాపా అని చెప్పి పాపను మురిపంగా చూస్తూ, సంతృప్తిగా తన ఇంటివైపు అడుగులు వేసింది
సుధ.
రక్త సంబంధం లేకపోయినా,సుధలో మాతృత్వం ఆ రోజు పక్కంటి పాప కేరింతల రూపంలో చిగురించింది.
***
సమాప్తం.
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments