జీవితాన్ని మలచుకో
- Addanki Lakshmi

- 4 hours ago
- 5 min read

Jeevithanni Malchuko - Telugu Family Story| Addanki Lakshmi
జీవితాన్ని మలచుకో - తెలుగు కుటుంబ కథ | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 21/08/2026
పిల్లలు పెద్దవాళ్లై చదువుల కోసం దూరమయ్యాక చాలామంది తల్లిదండ్రుల జీవితాల్లో ఒక రకమైన ఖాళీ ఏర్పడుతుంది. రోజంతా పిల్లల కోసం కేటాయించిన సమయం ఒక్కసారిగా తమకే మిగిలిపోవడంతో ఒంటరితనం, విసుగు వెంటాడవచ్చు. అయితే ఆ ఖాళీని ఎలా నింపుకోవాలన్నదే జీవితానికి కొత్త అర్థాన్ని ఇవ్వగలదు. అద్దంకి లక్ష్మి రచించిన ‘జీవితాన్ని మలచుకో’ కథ ఇదే విషయాన్ని హృదయానికి హత్తుకునేలా చెబుతుంది.
రాణి కూడా పిల్లలు చదువుల కోసం దూరమవడంతో తన జీవితం డల్‌గా మారిపోయిందని భావిస్తుంది. కానీ స్నేహితురాలు రాధ చూపించిన మార్గంలో అనాథాశ్రమంలోని పిల్లలను కలిసిన తర్వాత ఆమె ఆలోచనల్లో గొప్ప మార్పు వస్తుంది. తనకు ఉన్న చదువు, సమయం, అనుభవాన్ని ఇతరుల కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుని పిల్లలకు విద్యాబోధన ప్రారంభిస్తుంది. అలా పరుల సేవలో తన జీవితానికి కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని కనుగొంటుంది.
"ఏమిటి డల్ గా ఉన్నావు రాణీ?" అంటూ శేఖర్ ఆఫీసుకు వెళ్తూ, భార్యలో మార్పుని గమనించాడు.
"లేదండి బానే ఉన్నాను," అంది అతని ఆఫీసు బ్యాగ్ సర్దుతూ.
"లేదు రాణీ, బుజ్జి వెళ్లి ఐఐటీలో హాస్టల్లో చేరింది అదేనా నీ బాధ, అవునా?" అన్నాడు.
"అవునండి! అబ్బాయి ఎంటెక్ అమెరికా వెళ్ళిపోయాడు, ఈ పిల్ల ఐఐటీలో చేరిపోయింది, నాకు ఇంట్లో ఒంటరిగా చాలా బోర్ కొడుతోంది. పిల్లలు వస్తారు వాళ్ళకి అది చేయాలి, ఈ వంటలు ఇష్టం, ఆ వంట చెయ్యాలి, ఈ స్వీట్ చేయాలి, ఈ కేక్ చేసి పెట్టాలి అని ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఇద్దరూ లేకపోయేసరికి నాకు చాలా డల్ గా ఉంటుంది" అంది ఆవేదనగా.
"ఇప్పటివరకు ఎంతో కష్టపడ్డావు, కాస్త విశ్రాంతి తీసుకో, హాయిగా నీ హాబీస్ ఏమైనా చూసుకో. టీవీ ఉంది పెట్టుకో, సీరియల్స్ అన్నీ చూసుకో, ఫ్రెండ్స్ తో గడుపు," అన్నాడు శేఖర్ ఆఫీస్ కి వెళ్తూ.
"టీవీ కూడా బోర్ కొడుతుంది అండి, ఎంతసేపని చూడను? నాకు అసలే ఆ సీరియల్స్ అవి అంటే విసుగు. మీరు ఇదిగో పొద్దున్న వెళతారు, రాత్రి ఎనిమిది గంటలకు వస్తారు."
"హాయిగా ఫ్రెండ్స్ తో షికార్లు కొట్టు, షాపింగ్ లు చేసుకో, నీకు డబ్బుకు లోటు లేదు కదా! హాయిగా అన్ని కొనుక్కో, లైఫ్ ఎంజాయ్ చెయ్, బి హ్యాపీ, వెళ్ళొస్తా," అంటూ శేఖర్ గబగబా వెళ్ళిపోయాడు.
రాణి వంటింట్లోకి వెళ్ళి పని చేసుకోవడం మొదలుపెట్టింది.
ఇంతలో తన కాలేజీ ఫ్రెండ్ రాధ...
"హలో రాణి! బాగున్నావా?" అంటూ వచ్చింది.
రాధని చూడగానే ఎంతో సంతోషం అయింది రాణికి.
"ఏంటి ఇలా వచ్చావు? నువ్వు చాలా బిజీ కదా! స్కూలు పిల్లలు, పరీక్షలు ఎప్పుడూ బిజీగా..."
"లేదు ఈరోజు సెలవు, ఈ వైపు షాపింగ్ లో నాకు కొంచెం పని ఉందని వచ్చాను. ఎలాగో ఇక్కడకు వచ్చాను కదా అని నిన్ను చూసి వెళదామని..."
"సరే అయితే కాఫీ కలిపి వస్తాను" అంటూ కిచెన్ లోకి వెళ్లి రెండు కప్పులు కలిపి తీసుకొచ్చింది.
"ఏంటి పిల్లలు ఇద్దరు వెళ్లిపోయారు చదువులకి అని చెప్పావు, నీ పనే బాగుంది, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు..."
"వాళ్ళు వెళ్లారు ఒక నెల అయింది, నాకు విసుగైపోతుంది. ఏం పని చేద్దామన్న మనసు లేదు. సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన వంటలు చేయడం, ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడడం... ఇప్పుడు ఏమిటో లైఫ్ డల్ గా అయిపోయింది."
"అదేనే! ఆడవాళ్ళకి పెళ్లయిన వెంటనే బరువు బాధ్యతలు, పిల్లలు పుడతారు, లైఫ్ అంతా అలా కలలో లాగా జరిగిపోతుంది. ఎక్కడ ఒక నిమిషం ఖాళీ ఉండదు; పిల్లలు, చదువులు, సంసారం..."
"45 సం|| వచ్చేసరికి పిల్లలు పెద్దవాళ్ళయి చదువులకు వెళ్లి పోతారు. ఇంక తల్లికి ఏమీ తోచదు, అప్పటికి ఆమె బలంగానే ఉంటుంది. అయితే ఒక పనిచేయరాదు? నీకేమైనా డ్రాయింగ్, సంగీతం హాబీలు ఉంటే ఆ క్లాసుల్లో చేరు."
"లేదే నాకేమీ ఆర్ట్ రావు."
"పోనీ ఒక పని చెయ్ ఏదైనా చిన్న జాబ్ లో చేరవచ్చు కదా!"
"లేదు ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన చాలా పెద్ద పోస్టులో ఉన్నారు కదా! నేనెక్కడైనా ఆఫీసులో చిన్న క్లర్క్ లాగా చేరితే తను ఫీల్ అవుతారు."
"అయితే ఒక పని చెయ్ రేపు నేను ఒక చోటికి తీసుకెళ్తాను నువ్వు నాతో రా."
"సరే రేపు పదింటికల్లా నేను వస్తాను, రేపు మనిద్దరం కలిసి వెళదాము, సరేనా ఉండనా మరి" అంటూ రాధ వెళ్లిపోయింది.
'ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అబ్బా' అంటూ ఆలోచనలో పడింది రాణి.
మర్నాడు ఉదయం 10 గంటలకు తయారై కూర్చుంది, రాధ వచ్చింది. ఇద్దరూ కారులో బయలుదేరారు, తిన్నగా ఒక అనాధ ఆశ్రమానికి తీసుకువెళ్ళింది.
అక్కడ అన్ని వయసుల వారు 200 మంది పిల్లలు ఉన్నారు, అటు ఇటు ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారు.
ఆఫీసులో సెక్రటరీ దగ్గరకు తీసుకెళ్లి, "మేడం ఈమె నా స్నేహితురాలు, ఈ ఆశ్రమం చూడడానికి వచ్చింది" అంది రాధ.
"రండి మేడం చూడండి" అంటూ మొత్తం ఆశ్రమం అంతా తిప్పింది ఆమె.
"ఏదో మేడం! మీలాంటి వాళ్ళందరూ ఇచ్చే డొనేషన్ మూలంగా ఈ ఆశ్రమం జరుగుతోంది. ఈ పిల్లలందరికీ తల్లిదండ్రులు లేరు కదా, మేమే అన్ని చూడాలి, వీరికి చదువు సంధ్యలు చెప్పించడానికి మాకెంతో డబ్బు ఖర్చవుతుంది. భోజనాలు, సదుపాయాలు, ఏమైనా రోగాలు వస్తే డాక్టర్లు... వీటన్నిటికీ ఏదో దాతలు ఇచ్చిన డబ్బులతో ఆశ్రమాన్ని కష్టం మీద గడుపుతున్నాము."
"అయితే చదువులో వెనుకబడ్డ వాళ్లకు కోచింగ్ క్లాసెస్ పంపాలంటే ఎక్కువ ఖర్చవుతుంది, రోజు ఇద్దరు టీచర్లు వాలంటరీగా వచ్చి వీళ్ళకు బోధించేవారు. ఇంటి పరిస్థితులు బాగోలేదని మానేశారు."
"ఈ పిల్లలకు కోచింగ్ చాలా కష్టంగా ఉంది మేడం" అంటూ ఆమె కష్టసుఖాలను వివరించింది రాధకు.
"మేడం మీరు పని చేసే స్కూల్లో ఎవరైనా ఉంటే వాలంటీర్ గా పని చేస్తానంటే పంపండి" అంటూ ఆమెను బతిమాలింది.
"సరే మేడం చూస్తాను, ఇంక వెళ్ళొస్తామంటూ" వచ్చేశారు.
"చూసావా! రాణీ, ఎంతోమంది మన సర్వీస్ కావాలని చూస్తూ ఉంటారు. కొంతమంది టీచర్లు ఇక్కడకు వచ్చి వాలంటీరుగా క్లాసులు తీసుకుంటారు పిల్లలకు. ఎందుకంటే వీళ్ళకి తల్లిదండ్రులు లేరు, వీరి చదువుకి ఎవరు శ్రద్ధ తీసుకుంటారు?"
"ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పనిలేదు, చదువుకున్నావు, ఆ చదువు అంతా వేస్ట్ అయిపోతుంది. ఇటువంటి అనాధ పిల్లలకు సేవ చేస్తే, నీకు ఎంతో పుణ్యం కూడా దొరుకుతుంది. అలాగే మధ్యాహ్న సమయం అంతా నీకు ఎంతో వినియోగం అవుతుంది."
"ఆలోచించుకో, పిల్లలతో గడపడం చాలా బాగుంటుంది. నీవా వెళ్లి ఉద్యోగం చేయక్కర్లేదు, మీ ఆయన డబ్బే మీకు సరిపోతుంది."
"ఇటువంటి అనాధ పిల్లలకు సేవ చేస్తే, మనకు కూడా ఒక విధమైన తృప్తి ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షల ముందు వచ్చి ఆ పిల్లలకు టీచ్ చేసి వెళтуతుంటున్నాను."
"అప్పుడు నీకు తోచదు, ఇంట్లో బోర్ గా ఉంటుంది అనే సమస్య తీరిపోతుంది. ఏమంటావో ఆలోచించుకో రాణీ!"
రాణికి ఆ పిల్లలు చూడగానే జాలి, కరుణ వచ్చాయి. 'ఎలాగైనా అనాధ పిల్లలకి సహాయం చేద్దాము, తన చదివిన చదువుకు సార్థకత ఏర్పడుతుంది' అనుకుని మనసులో...
"అవును రాధా! నువ్వు చెప్పింది మంచి విషయమే, ఆవిడకి ఫోన్ చేసి చెప్పు నేను సోమవారం నుంచి వచ్చి పిల్లలకు మధ్యాహ్నం పూట క్లాసులు తీసుకుంటానని" అంది రాణి ఉషారుగా.
ఈ మాట విని రాధ ఎంతో సంతోషించింది.
"సంఘానికి మనము ఏదైనా ఉపకారం చేస్తే మనకి మనసులో ఆనందంగా ఉంటుంది. నీకు ఇంకా ఒక 15 ఏళ్ల వరకు శక్తి ఉంటుంది, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుని హాయిగా గడుపుకో. అప్పుడు నీకు లైఫ్ అంటే విసుగు రాదు, నీ టైం సద్వినియోగం అవుతుంది" అంటూ ఉత్సాహపరిచింది రాధ.
అంతే! ఆమె జీవితంలో ఎంతో మార్పు పొందింది, ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.
రాణి మధ్యాహ్నం అయ్యేసరికి స్కూల్ కి తయారై వెళ్లడం, ఆ పిల్లలకి తెలియని విషయాలన్నీ టీచ్ చేయడం... ఎంతో హుషారుగా ఇంటికి తిరిగివచ్చి భర్తతో విషయాలన్నీ చెప్తూ ఉండేది.
భార్య ఉషారుగా ఉండడం చూసి శేఖరుకు మనసులో ఆనందమేసింది.
"రాణీ, అనాధ పిల్లలకు సహాయ సహకారాలు, పుస్తకాలు, డ్రెస్సులు, టిఫిన్ బాక్సులు... ఇవన్నీ కొని ఇస్తూ ఉండు, మనకు డబ్బుకు లోటు లేదు కదా" అన్నాడు శేఖర్ ఆమెను ఉత్సాహపరుస్తూ.
జీవితమంతా ఎంతో హుషారుగా ఆనందంగా గడిచిపోతుంది. ఎంతసేపూ ఆ విద్యార్థుల గురించే ఆమె ఆలోచన... వారికి ఏ విధంగా మేలు చేయాలంటూ.
రాణికి ఇప్పుడు అసలు టైమే తెలియటం లేదు. మధ్యాహ్నమంతా అనాధాశ్రమంలో పిల్లలకు పాఠాలు బోధిస్తూ హాయిగా, ఆనందంగా గడుపుతోంది పిల్లలతో.
మనిషి జీవితం సంతోషంగా, శాంతిగా గడపాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, పరుల సేవలో జీవితాన్ని మలుచుకుంటే, అదే చక్కటి జీవన మార్గం.
***
అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,










Comments