సత్యం సుందరం
- Bhattu Venkata Rao

- 41 minutes ago
- 3 min read

Satyam Sundaram - Telugu Comedy Story | Bhattu Venkata Rao
సత్యం సుందరం - తెలుగు హాస్య కథ | భట్టు వెంకటరావు
Published in manatelugukathalu.com on 21/08/2026
గ్రామీణ జీవితంలోని సహజమైన సరదా, మనుషుల మధ్య ఉండే ఆప్యాయత, కుటుంబ బంధాల అందమైన అనుబంధాన్ని ప్రతిబింబించే కథ “సత్యం సుందరం”. భట్టు వెంకటరావు రచించిన ఈ కథలో సత్తిబాబు తన ప్రత్యేకమైన నవ్వుతో చుట్టుపక్కల వారిని నవ్విస్తూ ఉంటాడు. సుందరమ్మతో అతని సరదా సంభాషణలు కథకు హాస్యాన్ని అందిస్తాయి. అయితే అనుకోకుండా వచ్చిన ఒక ప్రమాద వార్తతో కథనం భావోద్వేగ మలుపు తీసుకుంటుంది. ఆ సమయంలో సుందరమ్మ చూపించే ఆందోళన, మామయ్యపై ఉన్న ప్రేమ కుటుంబ బంధాల విలువను చాటిచెబుతుంది. పల్లె వాతావరణం, సహజమైన మాండలిక భాష, హాస్యం, ఆప్యాయత కలగలిసిన ఈ కథ పాఠకుడిని చివరి వరకు ఆకట్టుకుంటుంది.
"సుందరమ్మ కళ్లలో దేవుడూ.... బాణాలు పెట్టాడత్తా... బాణాలూ. ఒక్కసారి గట్టిగా సూసిందనుకో... ఆడెంతటోడైనా సరే... ఇరుసుకుని ఎనక్కి పడిపోవాల్సిందే... హెహెహె" అని గట్టిగా నవ్వుతూ అన్నాడు సత్తిబాబు.
"ఆ సంగతేమో గాని సత్తిబాబూ... సుందరమ్మ గాని ఆ మాట ఇందనుకో... నీ మూతి పగిలి ముప్పై రొండు పళ్లూ రాలి కిందడిపోయేట్టు ఒకటేసిద్ది... దానికసలే ముక్కుమీదుంటది కోపం... చేతిలో ఏమున్నది కూడా సూసుకోదు!" అన్నది ఆ అత్త. ఆమె పేరు మాణిక్యం.
"పోత్తా... ఈ మాత్రనికే నువ్వు బలే బయపెడతావులే! అదాడేడో ఉంది సెట్టు కింది. నేను సూసుకోలేదనుకున్నావేటి? హెహెహె!" అని మళ్లీ నవ్వాడు సత్తిబాబు.
"అయినా ఏమాటకామాట అనుకోవాలిగానొరే... నీ మొహం మొత్తంలో పళ్లొకటేరా బలే తెల్లగ కనబడతయ్... హెహెహె!" అని అల్లుడికి మల్లే అత్త గూడా బిగ్గరగా ఒక నవ్వేసింది.
"అంతేనత్తా... సుందరమ్మకి కళ్లల్లో పెట్టినట్టు... నాకు పళ్లల్లో పెట్టాడు బగమంతుడు బాణాలు... ఏంచేద్దాం... అది మంచేతిలో లేదుగా... హెహెహె!" అని మళ్లీ నవ్వాడు సత్తిబాబు.
నవ్వడం సత్తిబాబు నైజం. చూసుకోకుండా కాడ కాడ పట్టుకుంటే గుచ్చుకోవడం గులాబీ పువ్వు నైజం. అంత ప్రకృతి సిద్ధమైనదే సత్తిబాబు నవ్వు కూడా!
చేలో గిలకలలోతు నీళ్లల్లో నిలబడి వరినాట్లు నాటుతున్నారు వాళ్లంతా. కూలిజనం.
"సత్తిబాబుతో తగాదా ఏం ఆడతావు గాని మాణిక్కెమ్మా... ఆ సుందరమ్మ చేత పదంటే పది నిమిషాలు నాట్లు నాటించవే సూత్తాను... రోజు కూలి నీకే ఇచ్చేత్తాను!" అని సుందరమ్మ పనిదొంగతనం గురించి పందెం కాసింది మాణిక్యమ్మతో, ఆ బృందంలో మరొక నడివయసామె. ఆమె పేరు సుభద్రమ్మ.
"ఓ… యమ్మాయ్ సుందరమ్మా.... పనొదిలిపెట్టెళ్లి ఏంజేత్తన్నావే ఆడ?" అని కేకేసింది మాణిక్యమ్మ, దూరంగా పొలం గట్ల కూడలిలోని జాగాలో ఉన్న పెద్ద వేప చెట్టు కింద ఉన్న సుందరమ్మని.
"ఏంజేసేదేంది... మునసబుగారబ్బాయితో మాట్టాడ్డం కనపడతల్లా?" అంది సుభద్రమ్మ.
"మా మాణిక్కెమ్మత్తకి అయ్యన్నీ కనపడవులే సుబద్రమ్మా... హెహెహె!" అని మరో నవ్వేశాడు సత్తిబాబు.
"ఒత్తన్నాను చిన్నమ్మా..." అని కేకేసుకుంటూ వచ్చింది ఇంతలో పని జరుగుతున్న చోటికి సుందరమ్మ.
"ఏంజేత్తున్నావే ఆడా?" అడిగింది మాణిక్యమ్మ.
"యాపకాయలు ఏరతున్నా చిన్నమ్మా... పండుయ్యి!" అని చెంగుకి ముడేసి ఉన్న చిన్న మూటని చూపిచ్చింది సుందరమ్మ.
"ఏంజేసుకుంటావే ఆటిని?" అంది మాణిక్యమ్మ.
"ఏంజేసుకుంటది? నోట్టో ఏసుకుంటది... హెహెహె!" అని ఎగతాళి నవ్వు నవ్వాడు సత్తిబాబు.
"ఓయ్ సత్తిబాబూ... నాతో ఎకసెక్కాలాడొద్దు... దవడబగిలిపోద్ది!" అని సత్తిబాబుకు సమాధానమిచ్చి, "అవ్వకోసం చిన్నమ్మా... ఏదో వైద్దేనికి కావాలంట. తెమ్మంది!" అన్నది మాణిక్యమ్మతో సుందరమ్మ.
"సరదా తీరిందా సత్తిబాబూ!"
కేకేసింది నవ్వుతూ నాట్లు నాటడం ఆపి, ఆ కూలి జనంలోని మరో ఆడమనిషి.
"తీరిందిలే రత్తమ్మా... సుందరమ్మతో తిట్టిచ్చుకోవడం సత్తిబాబుకి కొత్తేం గాదుగా!" అన్నది నాటడం కొనసాగిస్తూనే మరొక ఆడమనిషి.
నీళ్లలో పడేసి ఉన్న వరినారు కట్టలలోంచి ఒక కట్టను విసురుగా చేతిలోకి తీసుకుని, కట్టవిప్పి చకచకా నాటడం మొదలెట్టింది సుందరమ్మ.
"ఆహా... మా మాణిక్కెమ్మత్త ఒత్తా ఒత్తా నక్కని దొక్కొచ్చినట్టుందియ్యాల... డబల్ కూలీ గిడుతుంది... హెహెహె!" అంటూ నవ్వేశాడు సత్తిబాబు, పందెం సంగతి గుర్తు చేస్తున్నట్టుగా.
"సాల్లే ఆపు సత్తిబాబూ... ఒకసారి నడువొంచగానే అంతా అయిపోయినట్టేనా ఏంది? ఆ ఒంచిన్నడుము ఒంచినట్టు ఎంతసేపుంటదో సూద్దాం కానియ్!" అంది సుభద్రమ్మ.
"హెహెహె... అంతే గదో..." వంత నవ్వేశాడు సత్తిబాబు.
"అబ్బబ్బ... ఆ నవ్వు ఇనలేక సచ్చిపోతున్నాను చిన్నమా! తొందరగా ఏదొకటి సేసెయ్యాల!" అంది సుందరమ్మ విసుక్కుంటూ అందరికీ వినిపించేట్టుగానే... వొంగుని ఉండి స్పీడుగా నాట్లు నాటుతూనే.
"చాల్లే ఊరుకోవే... సత్తిబాబు నవ్వు సంగతి తెలవదా ఏంది?" అంది మాణిక్యమ్మ.
"అట్టా అని ఊరుకుంటుంటేనే రోజు రోజుకీ ఎక్కువ శాత్తున్నాడు!" అని సుందరమ్మ అంటూండంగా... దూరంగా పొలం గట్టు మీద నుంచి...
"ఒరేయ్ సత్తిబాబూ... బేగిరారా బేగిరా... మీ అయ్య పందిరి మీద నుంచి పడిపోయాడంట్రా... బేగిరా..." అని పెద్దగా కేక వినిపించింది.
ఆ కేకతో అంతా ఉలిక్కిపడ్డారు. సుందరమ్మ చేతిలో ఉన్న వరినారు కట్టని నీళ్లలో పడేసి నిలబడి...
"ఆ... మావ పడిపోయాడంట!" అని గాబరా చూపుల్తో కొన్ని క్షణాలు అయోమయంలో పడిపోయినట్లుగా అయిపోయి నిలబడింది.
"పందిరి మీద నుంచి పడిపోడమేంటి? పందిరెందుకెక్కాడాయన?" అంటున్నాడు సత్తిబాబు గట్టు మీద నుండి కేక వేసి పిలిచిన మనిషితో.
చేలో పనిలో ఉన్న అందరూ పని ఆపి, లేచి నిలబడి గట్టు మీద నుంచి కేకేసి చెప్పిన మనిషి వైపు అయోమయంగా చూశారు. చూస్తూ చూస్తుండగానే ఆకాశం నల్లని మబ్బులతో మేఘావృతమై చీకటి కమ్మినట్లుగా, ఆ వార్త వినడంతోటే చేలోని అందరి ముఖాలపై బాధ ఛాయలు కమ్మాయి. తానున్న చోటినుంచి ఎప్పుడు, ఆ నీళ్లలోనే గబగబా అంగలు వేస్తూ వెళ్లిందో సుందరమ్మ ఎవరికీ తెలీదు... అందరూ మళ్లీ గట్టు వైపు నుంచి సత్తిబాబు వైపు తలలు తిప్పి చూసేప్పటికి…
"ఎందుకొహందుకు ఎక్కాడ్లే... ఇప్పుడదా అడగాల? పదా.." అని చెయ్యి పట్టుకుని సుందరమ్మ సత్తిబాబుని గట్టిగా లాక్కెళ్లడం కనిపించింది.
వాళ్ల మావన్నా, సత్తిబాబన్నా సుందరమ్మకు ఎంత ప్రేమో... అని మనసులో మరొకసారి అనుకుని సంబరపడ్డారు అది చూసిన అక్కడున్న వారంతా!
భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.
కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని.
సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను.
నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.
ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!
నమస్కారములతో,
భట్టు వెంకటరావు,
హైదరాబాదు.




Comments